ఎం కోటేశ్వరరావు
చరిత్రకు జాలి, దయ ఉండవు, అదే సమయంలో అది వింతైనది కూడా. అందుకే చాలా మందికి చరిత్ర అంటే భయం. చెప్పింది విను తప్ప చరిత్ర అడక్కు అంటారు. లేకపోతే ఏమిటి చెప్పండి ! తాము పెంచి పోషించిన తాలిబాన్ల చేతుల్లోనే అమెరికా పరాభవాన్ని ఎవరైనా ఊహించారా ? ఉగ్రవాదం మీద పోరు అని చెప్పి ఇంతకాలం అమెరికాతో చేతులు కలిపిన మోడీ సర్కార్ కూడా ఆ తాలిబాన్లతోనే తెరవెనుక సంబంధాలను కొనసాగించిందని తెలుసా ? తాలిబాన్లు రష్యా,చైనాలతో సర్దుబాటుకు సిద్దం అవుతారని ఎప్పుడైనా భావించారా ? అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో జోక్యం, యుద్దానికి ఎందుకు దిగారు, ఇప్పుడెందుకు వెళ్లిపోతున్నారంటే అమెరికా దగ్గర సమాధానం ఉందా ? అక్కడ ఏకరూప ప్రభుత్వం ఉండే అవకాశం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం పతనమైతే అమెరికా చేయగలిగిందీ, చేయాల్సిందీ ఏమీ లేదు. అక్కడి జనం, దాని ఇరుగు పొరుగు దేశాలు ఏం చేసుకుంటాయో వాటి ఇష్టం అని బైడెన్ చెప్పాడు.
ఒక అగ్రరాజ్య అధిపతి నుంచి ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్య వెలువడిందంటే అమెరికాను నమ్ముకున్న దేశాలు తమ పరిస్ధితి ఏమిటని ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచంలో మరెక్కడైనా ఇలాంటిదే జరిగితే దాన్ని నమ్ముకున్న వారు ముఖ్యంగా మన నరేంద్రమోడీ వంటి వారు పునరాలోచన చేయాల్సిన అవసరం లేదా ! అమెరికా ఇప్పుడు తప్పుకున్నంత మాత్రాన మిలిటరీ రీత్యా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆ ప్రాంతంలో శాశ్వతంగా జోక్యం చేసుకోదా ? మరో రూపంలో, కొత్త ఎత్తుగడతో రంగంలోకి దిగుతుందా ? కొంత మంది చెబుతున్నట్లుగా రాబోయే రోజుల్లో అక్కడ చైనా పలుకుబడి పెరుగుతుందా ? ఇవన్నీ ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నలే.
ఆఫ్ఘన్ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆయుధాలు చేతపట్టినవారు ముజాహిదిన్లు, వారి వారసులైన తాలిబాన్లు ఇప్పుడు మాస్కోలో రష్యా నేతలతో చర్చలు జరిపారు. తమ గడ్డమీద నుంచి ఇతర దేశాల మీద దాడులు చేయాలనుకొనే శక్తులకు అవకాశం ఇచ్చేది లేదని మాస్కోలో ప్రకటించారు. మరోవైపున చైనా తమకు మిత్ర దేశమని, దానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాదులకు తమ గడ్డమీద ఇంకేమాత్రం ఆశ్రయం కల్పించేది లేదని కూడా వారు ప్రకటించారు. ఇది రాస్తున్న సమయానికి మన దేశంతో సంబంధాల గురించి వారెలాంటి ప్రకటనా చేయలేదు. మొదటి రెండు సానుకూల ప్రకటనలు అయితే మన దేశం గురించి చెప్పకపోవటం ప్రతికూలమని భావించాలా ? ఇంకా అవగాహన కుదరలేదా ? వేచి చూద్దాం !
అసలు ఆఫ్ఘనిస్ధాన్‌లో ఏం జరుగుతోంది ? ఎవరికీ తెలియదు. ఏం జరగబోతోంది ? అది అనూహ్యం ! తాలిబాన్ల పేరుతో అనేక గ్రూపులు ఉన్నాయి. వాటిలో వాటికి పడనివీ కొన్ని. తాము దేశంలోని 85శాతం ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చుకున్నామని తాలిబాన్లు చెబుతున్నారు. ఇరాన్, తజకిస్తాన్, చైనా సరిహద్దు ద్వారాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించుకున్నారు. దాని గురించి ప్రభుత్వ స్పందన గురించి తెలియదు. అదెలా సాధ్యం అని జోబైడెన్ అనటం తప్ప అమెరికన్లు కూడా అక్కడి పరిస్ధితి గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. అక్కడి అస్ధిర, అస్తవ్యస్ధ పరిస్ధితి కారణంగా చైనా, మన దేశం కూడా దౌత్య సిబ్బందిని వెనక్కు రప్పించాయి. తమ దౌత్య సిబ్బంది రక్షణ కోసం వెయ్యి మంది వరకు తమ సిపాయిలు అక్కడే ఉంటారని అమెరికా ప్రకటించింది. పొరుగుదేశాలైన తుర్కుమెనిస్ధాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్ధాన్ ఆహ్వానం మేరకు పరిస్ధితిని సమీక్షించేందుకు జూలై 12-16 తేదీలలో చైనా విదేశాంగ మంత్రి ఆ దేశాల పర్యటన జరపనున్నారు.
కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేసి తమ తొత్తు పాలన ఏర్పాటు చేయాలనుకున్న అమెరికన్లు ముజాహిదిన్లు, తాలిబాన్లను సృష్టించి చివరకు వారి దెబ్బకు తట్టుకోలేక రాజీ చేసుకొని తట్టాబుట్ట సర్దుకొని వెళ్లిపోతున్నారు. కుక్కలు చింపిన విస్తరిలా వివిధ తాలిబాన్ ముఠాల చేతుల్లో చిక్కిన ఆ దేశం ఏమౌతుందో ఎవరూ చెప్పలేని స్ధితి.1978లో తిరుగుబాటు ద్వారా అధికారానికి వచ్చిన కమ్యూనిస్టు-ఇతరులతో కూడిన ప్రభుత్వానికి ప్రారంభం నుంచే అమెరికన్లు ఎసరు పెట్టారు. దాంతో 1979లో ప్రభుత్వానికి మద్దతుగా సోవియట్ యూనియన్ జోక్యం చేసుకుంది. నాటి నుంచి ముజాహిదిన్ల పేరుతో అనేక తిరుగుబాట్లు వాటి వెనుక పాకిస్దాన్, అమెరికా, సౌదీ అరేబియా హస్తాలున్నాయి. పదేండ్ల తరువాత సోవియట్ ఉపసంహరించుకుంది. తరువాత ముజాహిదీన్లే తాలిబాన్లుగా రూపాంతరం చెందారు. అమెరికన్ల పట్టు పెరిగిన తరువాత ఇరాన్ రంగంలోకి దిగి తనకు అనుకూలమైన తాలిబాన్లను పెంచి పోషించింది.
దేశంలో 85శాతం తమ వశమైందని ప్రకటించుకున్న తాలిబాన్ నేతలు మాస్కో వెళ్లి రష్యా, మధ్య ఆసియాలోని పూర్వపు సోవియట్ రిపబ్లిక్‌లైన తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కిస్ధాన్‌లు, రష్యా మీద దాడి చేసేందుకు తమ దేశాన్ని స్ధావరంగా వినియోగించుకోనిచ్చేది లేదని రష్యా ప్రభుత్వానికి హామీ ఇచ్చి వచ్చారు. ఆ దేశాల మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం ఉంది. దానిలో భాగంగా తజకిస్తాన్‌లో రష్యా మిలిటరీ స్ధావరం ఉంది. ఒక వేళ ఏదైనా దాడి జరిగితే ప్రతిఘటించేందుకు తజకిస్తాన్ కూడా 20వేల మంది మిలిటరీని సిద్దం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకొనేందుకు తాలిబాన్లతో రాజీ చేసుకున్న అమెరికా నిర్ణయంతో రష్యా కూడా వెంటనే రంగంలోకి దిగింది. గత ఏడాది ట్రంప్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మే ఆఖరు నాటికి అమెరికన్ సేనలు వెనక్కు వెళ్లి పోవాల్సి ఉంది. అయితే బైడెన్ ఆ గడువును సెప్టెంబరు వరకు పొడిగించినందున కొత్త అనుమానాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో రష్యా మార్చి నెల నుంచే తాలిబాన్లతో చర్చలు ప్రారంభించింది. దాని పర్యవసానమే మాస్కో పర్యటన, ప్రకటన. గత ఆరు సంవత్సరాలుగా రష్యన్లు తాలిబాన్లతో సంబంధాలను కలిగి ఉన్నారు. ఖొరసాన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌కె) పేరుతో సమీకృతం అవుతున్న సాయుధ ముఠాలను ఎదుర్కొనేందుకు తాలిబాన్లకు సాయం అందించినట్లు కూడా చెబుతారు.
మరోవైపు చైనాను తమ స్నేహదేశంగా పరిగణిస్తామని కూడా తాలిబాన్లు ప్రకటించారు. తమకు సరిహద్దుగా ఉన్న గ్జిన్‌జియాన్ రాష్ట్రంలో ఉఘిర్ ఇస్లామిక్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేది లేదని కూడా చెప్పారు. చైనా-ఆప్ఘనిస్ధాన్ మధ్య 80 కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. అమెరికా అండతో తూర్పు తుర్కిస్తాన్ ఇస్లామిక్ ఉద్యమం పేరుతో ఆల్‌ఖైదా గ్జిన్‌గియాంగ్ రాష్ట్రంలో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నది. ఇప్పటి వరకు వారికి ఆఫ్ఘనిస్తాన్ ఒక ఆశ్రయంగా ఉంది. తామింకేమాత్రం వారికి మద్దతు ఇచ్చేది లేదని, తమ దేశ పునర్‌నిర్మాణం కోసం చైనా పెట్టుబడుల గురించి త్వరలో చర్చలు జరుపుతామని, రక్షణ కూడా కల్పిస్తామని తాలిబాన్ల ప్రతినిధి హాంకాంగ్ నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ పత్రిక విలేకరితో చెప్పాడు. గతంలో తమ ప్రతినిధి వర్గాలతో చైనా చర్చలు జరిపిందని గుర్తు చేశాడు.
తాలిబాన్లలో వివిధ ముఠాలు ఉన్నాయి. అవి అధికారం కోసం అంతర్గత కుమ్ములాటలకు దిగితే పరిస్ధితి ఏమిటన్నది ప్రశ్నార్దకం. కొంతమందిని పాకిస్ధాన్ చేరదీయగా మరికొంత మంది ఇరాన్ మద్దతు పొందుతున్నారు. అమెరికన్లు కూడా తమకు అనుకూలమైన ముఠాలను తయారు చేసుకున్నారని కూడా చెబుతున్నారు. వీటికి తోడు తెగలవారీ విబేధాలు కూడా ఉన్నాయి. అవి ఎవరి మద్దతు పొందినప్పటికీ మతం తప్ప మరొక ఏకీభావం లేదు. పెత్తనం గురించి కుమ్ములాటలు ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాలపై పట్టు తప్ప మొత్తం దేశ అధికారం లేనందున ఎలా వ్యవహరించినప్పటికీ ఉన్న ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం ఎవరి హస్తగతం అవుతుందో తెలియదు. దాన్ని మిగతావారు అంగీకరిస్తారా ? అందువల్లనే కొత్త ప్రభుత్వాన్ని గుర్తించాలంటే ఇరుగు పొరుగుదేశాల సహకారం అవసరం కనుక ఇప్పుడేం మాట్లాడినా రష్యా, చైనా, ఇరాన్ తదితర దేశాలు పరిణామాలను ఆచితూచి గమనిస్తున్నాయి. అమెరికన్లు దేశం విడిచి వెళ్లినప్పటికీ తాలిబాన్లలో తమకు అనుకూలమైన శక్తులతో సంబంధాలు, సహాయాన్ని కొనసాగిస్తారన్నది స్పష్టం. కొంత మంది సైనికులు తాలిబాన్ల దాడికి తట్టుకోలేక పొరుగుదేశాలకు పారిపోయినట్లు చెప్పటమే తప్ప వారి సంఖ్య ఎంతన్నది తెలియదు. దేశమిలిటరీ కంటే వారేమీ శక్తివంతులు కాదని అందువలన ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ దేశం వారి హస్తగతం కావటం అంత తేలిక కాదనే వాదనలూ ఉన్నాయి.
తాలిబాన్లను పెంచి పోషించిన అమెరికాకు చివరకు వారే ఏకు మేకయ్యారు. ఆల్‌ఖైదా నేత బిన్‌లాడెన్ రూపొందించిన పధకం ప్రకారం న్యూయార్క్ అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం మీద దాడి చేసిన తరువాత అమెరికా కొత్త పల్లవి అందుకుంది.ఉగ్రవాదం మీద పోరు పేరుతో ప్రత్యక్ష దాడులకు దిగింది. గత రెండు దశాబ్దాలలో పాకిస్ధాన్‌లో ఉన్న బిన్‌లాడెన్‌ను పాక్ సాయంతో మట్టుబెట్టటం తప్ప అది సాధించిందేమీ లేకపోగా ఉగ్రవాదులను మరింతగా పెంచింది. అనేక దేశాలకు విస్తరించింది. జనానికి చెప్పరాని బాధలను తెచ్చి పెట్టింది. అన్ని చోట్లా అమెరికా, దాని ఐరోపా మిత్రపక్షాలకు ఎదురుదెబ్బలే. ఆప్ఘనిస్తాన్‌లో ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు ఆర్ధిక నష్టాలతో పాటు తన, నాటో కూటమి దేశాల సైనికుల ప్రాణాలు పోగొట్టటం తప్ప సాధించేదేమీ లేదని డోనాల్డ్‌ట్రంప్‌కు జ్ఞానోదయం అయింది. అందుకే తప్పుకుంటామని ఒప్పందం చేసుకున్నాడు, జోబైడెన్ దాన్ని అమలు జరుపుతున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా ఎందుకు ఆసక్తి చూపింది, ఇప్పుడు ఎందుకు తప్పుకుంటున్నది ? అక్కడ కమ్యూనిస్టులు, ఇతరులు తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అక్కడేమైనా అమెరికా పెట్టుబడులుంటే వాటిని కాపాడుకొనేందుకు జోక్యం అనుకోవచ్చు.అదేమీ లేదు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ను తన స్ధావరంగా ఏర్పాటు చేసుకుంటే ఇరాన్, మధ్య ఆసియా, రష్యా, చైనాల మీద అది దాడులు చేయలేదు. అందుకు అనువైన ప్రాంతం ఆప్ఘనిస్తాన్. అక్కడ కమ్యూనిస్టులు అధికారానికి వచ్చారు గనుక వారు స్ధిరపడితే అది సోవియట్‌కు అనుకూల దేశంగా మారుతుందన్నదే అసలు దుగ్ద. దానితో పాటు ఆప్రాంతలో వెలికి తీయని విలువైన ఖనిజ సంపదమీద కూడా అమెరికా కంపెనీల కన్ను పడింది. అందుకే 1978 నుంచి 2021వరకు అది కొన్ని అంచనాల ప్రకారం రెండులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. వేలాది మంది తన సైనికులను బలిపెట్టింది, లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలను తీసింది. అయినా దానికి పట్టుదొరక లేదు. డబ్బూ పోయి శని పట్టె అన్నట్లు పరువూ పోయింది. గతంలో ప్రత్యర్ధిగా ఉన్న సోవియట్ యూనియన్ ఇప్పుడు లేదు. దేశంలో ఆర్ధిక పరిస్ధితి సజావుగా లేదు. చైనాతో వాణిజ్య లడాయి పెట్టుకొని దాన్నుంచి ఎలా బయట పడాలో తెలియని స్ధితిలో పడిపోయింది. దానికి తోడు కరోనా సంక్షోభం.
ఇప్పుడు ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లు అమెరికా వాడు పోతూ మన దేశానికి ప్రమాదం తెచ్చిపెట్టాడు. మనం స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి వైదొలిగి అమెరికా మిత్రులం అయ్యాం గనుక తాలిబాన్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా రక్షణలో మనం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు వారు ఉండరు కనుక అవేమౌతాయో తెలియదు. ఇరాన్ లేదా పాక్ ప్రభావంలోని తాలిబాన్లు అధికారానికి వచ్చినా, అస్ధిర పరిస్ధితి ఏర్పడినా మనకు ఇబ్బందులే. అమెరికన్లు వెళ్లాలని నిర్ణయించుకున్న తరువాత పాకిస్ధాన్ మీద మన పాలకుల దాడి నెమ్మదించింది. అంతే కాదు పైకి సంఘపరివార్, బిజెపి వారు జనంలో పాక్ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నా తెరవెనుక మంతనాలు జరపబట్టే ఈ ఏడాది ఫిబ్రవరిలో నాటకీయ పరిణామాల మధ్య 2003 ఒప్పందం ప్రకారం కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఇది ముందుచూపుతో తీసుకున్న నిర్ణయమా !
మరోవైపు మా దేశంలో జోక్యం చేసుకోవద్దని కోరుతూ మన అధికారులు తాలిబాన్లతో చర్చలు జరిపారంటూ వచ్చిన వార్తలను మన విదేశాంగ శాఖ తోసి పుచ్చినప్పటికీ వివిధ వర్గాలతో సంబంధాలలో ఉన్నట్లు అంగీకరించింది. క్వెట్టా, క్వటారీ కేంద్రాలుగా ఉన్న తాలిబాన్ల ప్రతినిధులు కూడా ఈ వార్తలను నిర్ధారించారు. ఇరాన్, పాకిస్ధాన్లతో సంబంధాలు లేని తాలిబాన్ గ్రూపులతో మన అధికారులు సంబంధాలను కొనసాగిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం మన ఇంజనీర్లను కిడ్నాప్ చేసినపుడు కొన్ని తాలిబాన్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొని వారిని విడిపించినప్పటి నుంచీ తెరవెనుక సంబంధాలు కొనసాగుతున్నాయి. అమెరికా తప్పుకోవాలని నిర్ణయించిన తరువాత మన దేశం తాలిబాన్లతో చర్చలకు సుముఖత తెలిపింది. గతేడాది దోహాలో జరిగిన చర్చలలొ మన ప్రతినిధి బృందం వీడియో ద్వారా పాల్గొన్నది. మన ప్రతినిధులు ఇరాన్, రష్యాతో కూడా తెరవెనుక చర్చలు జరిపారని దాని వలన ఎలాంటి ఫలితం కనపడలేదని కూడా వార్తలు వచ్చాయి.లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి మన దేశ వ్యతిరేక బృందాలకు తావు ఇవ్వవద్దని మన దేశం తాలిబాన్లను కోరుతోంది. వారిని సంతుష్టీకరించేందుకు, మద్దతు సంపాదించేందుకే కాశ్మీరుకు తిరిగి రాష్ట్ర హౌదా ఇస్తామని కేంద్రం లీకు వార్తలను వదలిందని కూడా కొందరి అభిప్రాయం. చైనా ప్రారంభించి సిల్క్ రోడ్ ప్రాజెక్టులో పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కీలకమైన దేశాలు. ఆ పధకాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం గనుక అక్కడ ఏర్పడే లేదా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగినా చైనాకు అనుకూల పరిస్ధితి ఉంటుంది.
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ గురించి ఏమి విశ్లేషణలను చేసినప్పటికీ అక్కడ ఏర్పడే ప్రభుత్వ తీరు తెన్నులను బట్టి పరిణామాలు ఉంటాయి. అందువల్లనే రష్యా, చైనా, ఇరాన్, పాకిస్దాన్, మన దేశం కూడా ఎవరి ప్రయత్నాలను వారు చేస్తున్నాయి. తాలిబాన్లు ఉగ్రవాదులు అనటంలో ఎలాంటి సందేహం లేదు. వారే అధికారాన్ని చేపడితే దౌత్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవటంలో లేదా తిరస్కరించటంలో ఆయా దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిష్తాయి.