Tags
#Failed Narendra Modi, India inflation, India Price Rise, Narendra Modi Failures, narendra modi jumbo ministry
ఎం కోటేశ్వరరావు
అనేక అంశాల్లో మడమ తిప్పి మాట తప్పినట్లుగానే కనిష్ట ప్రభుత్వం- గరిష్ట పాలన అనే స్వయం ప్రకటిత ప్రవచనానికి నరేంద్రమోడీ తిలోదకాలిచ్చారు. గరిష్ట పాలన కూడా లేదనేది తేలిపోయింది. అధికారానికి రాక ముందు 2014 మార్చి 14న నరేంద్రమోడీ డాట్ ఇన్‌లో పోస్టు చేసినదాని ప్రకారం ” ఇది ద్రవ్యోల్బణాన్ని ఓడించాల్సిన తరుణం – ఇది కాంగ్రెస్‌ను ఓడించాల్సిన తరుణం ” అనే శీర్షికతో అనేక విషయాలు రాశారు. ” వందరోజుల్లో ద్రవ్యోల్బణాన్ని అరికడతామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది. కానీ వారు వాగ్దానానికి కట్టుబడి ఉండలేకపోయారు.ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన వారిని నమ్మవద్దు. వాజ్‌పారు గారు, మొరార్జీ దేశారు గారు ధరలను అదుపు చేయగా లేనిది మనమెందుకు చేయలేము ? 2014లో బిజెపి ఆ పని చేస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను ” అని చెప్పారు.
ఇప్పుడు నరేంద్రమోడీ గారు నిజంగా ఆ పని చేస్తున్నారా ? ద్రవ్యోల్బణం పెరిగితే ధరలు పెరుగుతాయన్నది ప్రాధమిక సూత్రం. గత ఏడు సంవత్సరాల్లో ఏమి జరిగిందో చూడండి. 2014-15లో 5.8, 2015-16లో 4.9, 2016-17లో 4.5, 2017-18లో 3.6, 2018-19లో 3.4, 2019-20లో 4.8, 2020-21లో 6.69 శాతం ఉండగా 2021-22లో 4.97శాతం ఉండవచ్చని అంచనా వేశారు,తరువాత 5.1శాతానికి పెంచారు. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభ ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం 4.23శాతం కాగా మే నెలలో అది 6.3శాతానికి పెరిగింది. తాత్కాలిక అంచనా ప్రకారం జూన్‌లో 6.26శాతం అని ప్రకటించారు. మోడీ 1.0లో తగ్గిన ద్రవ్యోల్బణం ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నట్లు ? మోడీ గారి న్యాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించాల్సిన తరుణం వస్తున్నట్లేనా ?
ఆర్ధికశాస్త్రంలో చెప్పే ప్రాధమిక పాఠాల్లో గిరాకీ (డిమాండ్ ) తగ్గితే ధరలు తగ్గుతాయి. కానీ దానికి భిన్నంగా గిరాకీ తగ్గింది – ధరలు పెరుగుతున్నాయి. ఆర్ధిక రంగంలో కృషి చేసినందుకు గుర్తింపుగా దక్షిణ కొరియా నుంచి మన ప్రధానులెవరూ పొందని అవార్డును అందుకున్న నరేంద్రమోడీ పాలనలో ఇలా జరుగుతోందేమిటి ? అన్నీ రివర్సు గేరులో ఉన్నాయి. అధికారానికి రాగానే చమురు ధరలు గణనీయంగా తగ్గి ఆర్ధికంగా మోడీ సర్కార్‌కు వెసులు బాటు కలిగింది. అదంతా తన ఘనతే అని ప్రచారం చేసుకున్నారు. చమురు మీద పన్నుల, సెస్‌లు పెంచి గణనీయ మొత్తాలను ఖజానాకు చేర్చిన సర్కార్ వాటిని జనానికి కాకుండా రాయితీల రూపంలో కార్పొరేట్లకు కట్టపెట్టింది. గత మూడు సంవత్సరాలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తోడు 58గా ఉన్న రూపాయి విలువును 74కు దిగజార్చారు. ఇలాంటి చర్యలన్నీ ఇప్పుడు ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. సామాన్య జనానికి తొలగించిన రాయితీలను పునరుద్దరిస్తే భారం తగ్గుతుంది. అయితే సామాన్య జనం దేశభక్తులు గనుక నరేంద్రమోడీ కూడా తోటి దేశభక్తుడే అని నమ్ముతున్నారు గనుక తమ రాయితీల కోత పెట్టినా, పన్ను భారం మోపినా కిమ్మనటం లేదు. కానీ కార్పొరేట్లకు అలవాటు చేసిన రాయితీలకు కోత పెడితే మరుక్షణమే నరేంద్రమోడీ ఉద్యోగానికి ఎసరు వస్తుంది. మోడీ సర్కార్ వైఫల్యం రానున్న రోజుల్లో మరింతగా వెల్లడి కానుంది. అందుకే అసాధారణ రీతిలో జనానికి మతిమరపు ఎక్కువ అనే గట్టి నమ్మకంతో గరిష్ట స్ధాయిలో మంత్రివర్గాన్ని పెంచారు. చెప్పింది చెయ్యకుండా చేసేది చెప్పకుండా గత ఏడేండ్లలో ఎప్పటి కెయ్యది అప్పటికా మాటలాడి నెట్టుకు వచ్చినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా నెట్టుకు రాగలరా ? జనం నిద్ర నుంచి మేలుకోకుండా ఉంటారా ?
నరేంద్రమోడీ కొలువులో కొందరికి ఉద్వాసన, కొత్త మంత్రులు, పాత మంత్రులకు ప్రమోషన్ల పందారం ముగిసింది. పాత మంత్రులు పన్నెండు మందిని ఎందుకు తొలగించారో తెలియదు. వారిలో కొందరిని రాజకీయాలకు కూడా పనికి రారని కామోసు గవర్నర్లుగా నియమించారు. మొత్తానికి ఏడు సంవత్సరాల తరువాత నరేంద్రమోడీ గారు తన మాటను తానే ఖండించుకున్నారు లేదా దిగమింగారు. చేసేది చెప్పరు-చెప్పింది చెయ్యరు అని మరోసారి రుజువు చేసుకున్నారు. అంతకు ముందున్న జంబో మంత్రివర్గాన్ని చూసి ఏడు సంవత్సరాల క్రితం మోడీ గారు కనిష్ట ప్రభుత్వం – గరిష్ట పాలన అంటే జనం నిజమే కామోసు అనుకున్నారు. దానికి అనుగుణంగానే 43 మందితో కొలువు దీరితే హర్షించారు. ఇప్పుడు చేసిందేమిటి ? పన్నెండు మందిని తొలగించి నలభై మూడు మందిని కొత్తగా చేర్చుకొని ప్రస్తుతం ఉన్న 43 నుంచి 78కి పెంచారు. మొత్తం 81 మంది వరకు నియమించుకొనే అవకాశం ఉన్నా వినియోగించుకోలేదు చూశారా ఎంత ఆదర్శమో అన్నట్లుగా కొందరు చిత్రిస్తున్నారు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ హయాంలో 79 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం లేనందున అక్కడి నుంచి కూడా ఒకరికి ఇస్తే ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా సమానం అవుతుంది. ఇద్దరికి ఇస్తే కొత్త రికార్డు అవుతుంది.
కరోనా కష్ట కాలంలో ఖజానా నిండుకుందన్నది వాస్తవం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లుగా పాలకులు ఏదో తమకు పొడి చేస్తారని చూడకుండా పైసా పైసా పొదుపు చేసి తప్పని అవసరాలకు జనం డబ్బు వాడుకుంటున్నారు. మరోవైపు నరేంద్రమోడీ గారు జంబో సర్కస్‌ను గుర్తుకు తెచ్చే విధంగా పెద్ద సంఖ్యలో మంత్రుల ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే స్ధాయిలో యువతీ, యువకులకు ఉపాధి కల్పించి ఉంటే పరిస్ధితి భిన్నంగా ఉండేది. ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంపదలను సృష్టించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఖర్చులో 42శాతానికి కోత పెట్టాయి. ఇది కనిష్ట పాలనకు నిదర్శనం అయితే మంత్రివర్గ విస్తరణ గరిష్ట ప్రభుత్వానికి తార్కాణం. తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినపుడు ప్రధాని మోడీ విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారనే జోకులు పేలాయి. ఇప్పుడు కొత్త, పాత మంత్రులు, వారి సిబ్బంది చేసేందుకు పనేమీ లేకుండా ఇలా ఖర్చుకు కోత పెడితే బుగ్గ కార్లేసుకొని పొలోమంటూ రాష్ట్రాలన్నీ తిరగటం ,మోడీ భజన చేయటం తప్ప వారేం చేస్తారు ?
మంత్రివర్గ విస్తరణ వెనుక అసలు కారణం రాజకీయం, ఓట్ల గాలమే. ఇప్పటి నుంచి 2024 లోక్‌సభ ఎన్నికలు జరగబోయే లోపల 16 రాష్ట్రాలలో ఎన్నికలు జరగాల్సి ఉంది, వచ్చే ఏడాది యుపి, పంజాబ్, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్ , మణిపూర్ , 2023లో రాజస్ధాన్, తెలంగాణా, మధ్య ప్రదేశ్, చత్తీస్‌ఘర్, కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో లబ్ది పొందేందటంతో పాటు తదుపరి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పట్టు కోసం అన్నది స్పష్టం.గరిష్టంగా ఉత్తర ప్రదేశ్ నుంచి ఏడుగురు, కర్ణాటక నుంచి నలుగురిని తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తగిలినప్పటికీ ఉన్న బలాన్ని నిలుపుకొనేందుకు నలుగురికి చోటు కల్పించారు.
పాలన మెరుగుదల కోసం విస్తరణ జరిగిందని కొందరు చిత్రిస్తున్నారు. ఇది సానుకూల కోణం, మరో విధంగా చూస్తే వైఫల్యాన్ని అంగీకరించటంగా ఎందుకు చెప్పకూడదు. ఇక్కడ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కరోనా మహమ్మారి గురించి పట్టించుకోలేదనో, రవిశంకర ప్రసాద్ ట్విటర్ విషయంలో సరిగా వ్యవహరించలేదనో ఏదో ఒక కారణం చెప్పటానికి చాలా రంజుగా ఉంటుంది. ఇదే ప్రాతిపాదిక అయితే కరోనాకు ముందే గుండెకాయవంటి ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోవటానికి మంత్రి నిర్మలాసీతారామన్ పని తీరు సంగతేమిటి ? లేదూ ఒక మంత్రి సరిగా పనిచేయకపోతే ప్రధాని, ఆయన కార్యాలయం ఏమి చేస్తున్నట్లు ? విజయాలకైనా, పరాజయాలు, వైఫల్యాలకైనా మంత్రివర్గ సమిష్టి బాధ్యత, దాని నేత ప్రధాని అయినపుడు నరేంద్రమోడీ గారి సంగతేమిటి ? కరోనా రెండవ తరంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఆక్సిజన్, వాక్సిన్ ఇలా చెప్పుకుంటూ పోతే తగిలిన ఎదురు దెబ్బలు, చీవాట్లు మంత్రులకు తప్ప ప్రధానికి తగలవా ?
మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని చూస్తున్న వారు కొందరు. బ్రాహ్మణ-బనియా పార్టీగా పేరున్న బిజెపి ఇంకేమాత్రం అలాంటి పార్టీ కాదని చెబుతున్నారు. దీనికి తార్కాణంగా ఇదిగో చూడండి పన్నెండు మంది దళితులు, ఎనిమిది మంది గిరిజనులు, 27 మంది ఓబిసి సామాజిక తరగతుల వారు ఉన్నారు అని లెక్కలు చెబుతున్నారు. మరి ఏడు సంవత్సరాల పాటు సామాజిక న్యాయం బిజెపికి గుర్తుకు రాలేదా ? గతంలో కాంగ్రెస్ పాలనలో కూడా ఈ సామాజిక తరగతుల వారికి పదవులు వచ్చాయి, అంత మాత్రాన ఆ తరగతుల సామాన్య జన జీవితాల్లో వచ్చిన మార్పేమిటి ? ఇప్పుడు బిజెపి వారు తెచ్చే దేమిటో ఎవరైనా చెప్పగలరా ?
సామాజిక న్యాయం పేరుతో ఇప్పటికే కాంగ్రెస్, వివిధ ప్రాంతీయ పార్టీలు కావలసినంత రాజకీయం చేశాయి. ఉత్తర ప్రదేశ్‌కు మూడు సార్లు ఎనిమిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన మాయావతి దళితులను ఉద్దరించింది ఏమిటి ? ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్, రబ్రీదేవి, నితీష్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితా అవుతుంది. వారంతా వెనుకబడిన తరగతులకు చేసిన మేలేమిటి ? అయితే ఇప్పటికే ఇలాంటి పెద్దలు పాతుకు పోయి ఉన్నందున దళితులు, వెనుకబడిన తరగతుల్లో దిగువన ఉన్న వారికి పెద్ద పీటవేయటం ద్వారా తనదైన ఓటుబ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి తాజా మంత్రివిస్తరణ చేసింది. ఉత్తరప్రదేశ్ విషయానికే వస్తే అది బిజెపికి కీలక రాష్ట్రం. దళితుల్లో జాతావు (మాయావతి అదే సామాజిక తరగతికి చెందిన వారు) ఓబిసిల్లో యాదవులది పైచేయి. అందుకే అక్కడ జాతావులు గాని దళితులు, యాదవులు గాని ఎంబిసిలను బిజెపి ఎంచుకుంది. అది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో, లేదా మిగతా రాష్ట్రాలలో కూడా కనిపిస్తుంది. మొత్తం మీద మిగతా పార్టీలు గతంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు బిజెపి అందిపుచ్చుకుంది. ఆ పార్టీలన్నీ ఎందుకు విఫలం అయ్యాయో సరైన గుణపాఠాలు తీసుకోలేదన్నది స్పష్టం. అన్నింటికీ మించి తన హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోవాలంటే బ్రాహ్మణ-బనియా సామాజిక తరగతుల నుంచి వచ్చిన నాయకత్వాన్ని ముందు పెడితే ప్రస్తుతం నెలకొన్న అస్ధిత్వభావనల తరుణంలో పని చేయవని సంఘపరివార్ గ్రహించింది. అందుకే ఇతర కులాలను ముందుకు తెస్తున్నది.
రాజకీయాల్లో నేర చరితుల ప్రమేయం పెరుగుతోందనటానికి మోడీ సర్కార్ మంత్రులే నిదర్శనం. అలాంటి ” సమరశీలురు ” ఉంటేనే దేనికైనా పాల్పడవచ్చు. డెబ్బయి ఎనిమిది మంది మంత్రులకు గాను 33 మంది ఎన్నికల కమిషన్‌కు స్వయంగా సమర్పించిన పత్రాల ప్రకారం వారి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రజాస్వామ్య సంస్కరణల అసోసియేషన్(ఎడిఆర్) వెల్లడించింది. వారిలో 24 మంది మీద తీవ్రమైన కేసులు అంటే హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటివి ఉన్నాయి. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి నిసిత్ ప్రమాణిక్ మీద హత్య, హత్యా యత్నం కేసులు ఉన్నాయి. మరో ముగ్గురి మీద హత్యాయత్నం కేసులున్నాయి. మతసామరస్యానికి భంగం కలిగించారనే కేసులున్న వారిలో అమిత్ షా, గిరిరాజ్ సింగ్, శోభా కరాండ్లజే, నిత్యానందరాయి, ప్రహ్లాద జోషి, ఇక ఎన్నికల ప్రచారంలో నిబంధనలు, లంచాలు, అక్రమ చెల్లింపుల వంటి కేసులున్నవారిలో నితిన్ గడ్కరీ, గిరిరాజ్ సింగ్, అశ్వనీ కుమార్ చౌబే, సత్యపాల్ సింగ్ బాగెల్, పంకజ్ చౌదరీ, భగవంత ఖుబా, కౌశల్ కిషోర్ ఉన్నారు.
మంత్రుల్లో 47 మంది బలహీన వర్గాల సామాజిక తరగతులకు చెందినప్పటికీ వారంతా సామాన్యులు కాదు. మొత్తం 78 మందిలో 70 మందికోటీశ్వరులు, ఒక్కో మంత్రి ఆస్తుల సగటు విలువ (అధికారికంగా ప్రకటించిన మేరకు ) రు.16.24 కోట్లు ఉన్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, పియూష్ గోయల్, నారాయణ రాణే, రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు 50 కోట్లకు పైనే ఉన్నాయి, సింధియా ఆస్తులు 379 కోట్లు. ఎనిమిది మంది తమ ఆస్దులు కోటి రూపాయలకు లోపే అని ప్రకటించగా ప్రతిమా భౌమిక్ ఆరు లక్షలని పేర్కొన్నారు. పదహారు మంది మంత్రులు కోటి రూపాయలకు పైగా అప్పులున్నాయని తెలుపగా వారిలో ముగ్గురికి పదికోట్లకు పైన ఉన్నాయట. ఇద్దరు మంత్రులు తాము ఎనిమిదవ తరగతి పూర్తి చేశామని తెలుపగా ముగ్గురు పదవ తరగతి అని పేర్కొన్నారు. అరవై నాలుగు మంది డిగ్రీ,డిప్లొమా ఆపైన చదివారు. పదకొండు మంది మహిళా మంత్రులున్నారు. యాభై ఎనిమిది మంది యాభై సంవత్సరాలు పైబడిన వారున్నారు. మంత్రులనే ఈ బోయీలూ పల్లకి ఎక్కిన నరేంద్రమోడీని గమ్యస్దానానికి సరిగా చేరుస్తారా ? చూద్దాం !