Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఓటు బ్యాంకు రాజకీయాలకు సిపిఎం ఆమడ దూరం అని మరోసారి నిరూపితమైంది. యుడిఎఫ్‌ ప్రభుత్వం 2016 అసెంబ్లీ ఎన్నికలను గమనంలో ఉంచుకొని 2015లో మైనారిటీ తరగతులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌లలో 80శాతం ముస్లింలు, ఇరవైశాతం క్రైస్తవులకు నిర్ణయిస్తూ ఉత్తరువులు జారీ చేసింది. దాన్ని హైకోర్టులో సవాలు చేశారు. సూత్రబద్ద వైఖరితో ఆ సమస్యను పరిష్కరించాలని సూచిస్తూ ఆ ఉత్తరువును కోర్టు కొట్టివేసింది. ఈ నేపధ్యంలో సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం అనేక మంది నిపుణులను సంప్రదించి 2011 జనాభా ప్రాతిపదికన ఆ దామాషాలో స్కాలర్‌షిప్పులు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 26.56, క్రైస్తవులు 18.38, బౌద్దులు, సిక్కులు, జైనులు 0.01శాతం చొప్పున ఉన్నారు. స్కాలర్‌ షిప్పులు ఇప్పుడు అందరికీ అదే ప్రాతిపదికన లభిస్తాయి. ప్రస్తుతం స్కాలర్‌ షిప్‌లు పొందుతున్న వారికి లేదా మొత్తాలకు ఎలాంటి భంగం కలగదని, ఇతర మైనారిటీలకూ కొత్తగా లభిస్తాయని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ చెప్పారు. అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈ విధానం, నిర్ణయాన్ని ప్రతిపక్షంగా ఉన్న యుడిఎఫ్‌లోని కాంగ్రెస్‌, కేరళ కాంగ్రెస్‌ సమర్దించాయి. అయితే తమ సామాజిక తరగతికి అన్యాయం జరిగిందంటూ ముస్లిం లీగు వ్యతిరేకించింది. ఆ పార్టీ వత్తిడికి లొంగిపోయిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తాము సమర్ధించిన మాట నిజమే గానీ తాము సూచించిన దానిని ప్రభుత్వం పూర్తిగా అమలు జరపలేదని తరువాత అర్ధం అయిందని అందువలన వ్యతిరేకిస్తున్నట్లు మాట మార్చారు. అంతేకాదు భాగస్వామ్య పక్షాలేవీ బహిరంగంగా ఈ సమస్యపై ప్రకటనలు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ కె మురళీధరన్‌ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చూసుకుంటుందన్నారు. దీని గురించి మాట్లాడేందుకు ఎల్‌డిఎఫ్‌ పక్షాలకు స్వేచ్చ లేదని ఆరోపించారు. తమ యుడిఎఫ్‌లో ఎవరైనా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని ఎల్‌డిఎఫ్‌లో భూస్వామి-కౌలుదారు మాదిరి ఉంటుందన్నారు.


సచార్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ముస్లింల అభివృద్ది కోసం గత ప్రభుత్వం 80:20 దామాషా నిర్ణయించిందని ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగిందనే వాదనను ముస్లింలీగు ముందుకు తెచ్చింది.పభుత్వ నిర్ణయాన్ని తాము కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించింది. ఎవరికీ అన్యాయం జరగదని సూత్రబద్దమైన వైఖరి అని ఎల్‌డిఎఫ్‌ పేర్కొన్నది. లీగు వైఖరి సమాజాన్ని విభజించేదిగా ఉందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. స్కాలర్‌ షిప్‌ల పధకం కేవలం ముస్లింల కోసమే ఏర్పాటు చేశారని ప్రభుత్వం దామాషా ప్రాతిపదికన ఇవ్వటం సరికాదని పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొన్నది. గతంలో చేసిన నిర్ణయంలో 20శాతం వెనుకబడిన క్రైస్తవులకు కల్పించటమే తప్పిదమని, ముస్లింలకు తగ్గించకుండా ఇతరులకు కావాలంటే ఇచ్చుకోవచ్చని పేర్కొన్నది. సంఘపరివార్‌, కొన్ని క్రైస్తవ సంస్దలు సమాజంలో విభజన తెచ్చే విధంగా ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం అది మైనారిటీల కోసం ఉద్దేశించింది తప్ప కేవలం ముస్లింలకు మాత్రమే అని ఎక్కడా లేదు. ఈ కారణంగానే 80:20శాతం దామాషాను హైకోర్టు కొట్టివేసింది. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం కొత్త విధానంలో ముందే చెప్పినట్లు జనాభాను బట్టి దామాషాను నిర్ణయించింది.

సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. అసలు ఎన్నికలకు దానికి సంబంధం లేదు. అయినప్పటికీ మీడియాలో ఓటుబ్యాంకు రాజకీయాల ప్రాతిపదికన కొందరు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ విధానంపై యుడిఎఫ్‌ పక్షాలలో విబేధాలు ఎల్‌డిఎఫ్‌కు లాభమన్నది వాటిలో ఒకటి. కాంగ్రెస్‌లో మిగిలి ఉన్న క్రైస్తవులు మరింత ఎక్కువగా ఎల్‌డిఎఫ్‌కు మద్దతు ఇస్తారన్నది రెండవది. అన్యాయం జరిగిందని నిరూపించే స్దితిలో యుడిఎఫ్‌ లేదన్నది మరొకటి. ఇక్కడ గమనించాల్సిందేమంటే యుడిఎఫ్‌ కూటమి గతంలో ఎన్నికల కోసమే స్కాలర్‌షిప్పుల విధానాన్ని రూపొందించి అది లబ్దిపొందింది లేదు. ఒక సూత్రబద్ద వైఖరి తీసుకున్న కారణంగా ఎల్‌డిఎఫ్‌ లబ్దిపొందితే పొందుతుందా లేదా అన్నది వేరే అంశం. మీడియా విశ్లేషకులకు కడుపు మంట ఎందుకో తెలియదు.

బక్రీద్‌ సందర్భంగా కరోనా ఆంక్షల సడలింపు వివాదం !


డెబ్బయి ఒక్క రోజుల తీవ్ర ఆంక్షల తరువాత బక్రీద్‌ సందర్భంగా కేరళ ప్రభుత్వం మూడు రోజుల పాటు దుకాణాలను తెరిచేందుకు షరతులతో ఆంక్షలను సడలించింది. కేరళలో ఉన్న జనాభా పొందికను చూసినపుడు హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలను అనుసరించే వారి ప్రధాన పండగల రోజుల్లో వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. బక్రీద్‌ సందర్భంగా దుకాణాల్లో పాటించాల్సిన నిబంధనల అమలుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. యజమానులకు గట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రార్ధనా స్ధలాల్లో అనుమతించిన దానికి మించి గుమి కూడదనే షరతు విధించారు. మసీదులతో పాటు దేవాలయాలు, చర్చ్‌లకు అలాంటి ఆంక్షలతోనే అనుమతులు ఇచ్చారు. కన్వర్‌ యాత్ర నిర్వహణ తప్పన్నపుడు బక్రీద్‌కు ఇవ్వటం కూడా తప్పే అని కాంగ్రెస్‌ జాతీయ ప్రతినిధి అభిషేక్‌ మను సింఘ్వి అభ్యంతరం చెప్పారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా వ్యతిరేకత తెలిపింది. ప్రస్తుతం దేశంలో కేసులు ఎక్కువ ఉన్న కేరళలో ఇలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నది దాని వాదన. ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళకు చెందిన బిజెపి మంత్రి వి మురళీధరన్‌ రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకున్నదిగా ఆరోపించారు. శాస్త్రీయ పద్దతిలో కరోనా నిరోధ చర్యలను తీసుకోవాలన్నారు.

బక్రీద్‌ సందర్భంగా మసీదుల్లో పరిమిత సంఖ్యలో ప్రార్ధనలకు తప్ప బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేదు. రాష్ట్రాన్ని ఏబిసిడి తరగతులుగా విభజించారు. డి తరగతి ప్రాంతాల్లో ఒక్క రోజు మాత్రమే వస్తువుల కొనుగోలుకు అవకాశం ఇచ్చారు.
మసీదులో వంద మందికి మాత్రమే అనుమతి, ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరి దుప్పటి లేదా చాప వారే తెచ్చుకోవాలి. ఒక వేళ అంత మంది పట్టే అవకాశం లేకపోతే సంఖ్యను తగ్గించుకోవాలి.అరవై అయిదు సంవత్సరాలు దాటిన పది సంవత్సరాల లోపు వారిని ప్రార్ధనలకు అనుమతించరు. మాస్కుతప్పని సరి, చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి, మసీదులో ప్రవేశించే ముందు శరీర ఉష్ణ్రోగ్రతను చూస్తారు. ప్రార్ధనలకు వచ్చిన వారి చిరునామా, ఫోను నంబర్లు లేదా వారిని కనుగొనేందుకు అవసరమైన సమాచారాన్ని మసీదు నిర్వాహకులు నమోదు చేయాలి. జంతుబలి సమయంలో ఐదుగురికి మించి ఉండకూడదు. కరోనా నిబంధనలకు విరుద్దంగా ఎవరూ గుమికూడవద్దని ముస్లిం మత పెద్దలు బహిరంగ ప్రకటన చేశారు. ఆయా జిల్లాల యంత్రాంగాలు నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది. మలప్పురం జిల్లాలో ప్రార్ధన స్దలాల్లో 40 మందికి మించి అనుమతించేది లేదని, రెండు విడతల వాక్సిన్‌ తీసుకున్నట్లు, కరోనా లేదనే ధృవీకరణ పత్రాలు ఉన్నవారినే అనుమతించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీదు సందర్భంగా ఆది, సోమ, మంగళ వారాల్లో దుకాణాలను తెరిచేందుకు అనుమతించి రాష్ట్ర ప్రభుత్వం మనుషు ప్రాణాలతో ఆడుకుంటున్నదంటూ అనుమతి రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఢిల్లీ నివాసి పికెడి నంబియార్‌ ఒక పిటీషన్‌ దాఖలు చేశారు. దాని మీద ఈ రోజే సమాధానం ఇవ్వాలని కేరళ ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీం కోర్టు కోరింది. మంగళవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసును చేపట్టనున్నట్లు డివిజన్‌ బెంచ్‌ పేర్కొన్నది.


బక్రీద్‌ సందర్భంగా మూడు రోజుల పాటు నిబంధనల సడలింపు మీద మిశ్రమ స్పందన వెలువడింది. ప్రభుత్వ చర్యను సమర్ధించే వారు చెబుతున్న అంశాల సారాంశం ఇలా ఉంది. కేరళలో ఓనం-బక్రీదు తరుణంలో వాణిజ్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ఏడాది ఐదులక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తే 3,62,620 కోట్లు మాత్రమే జరిగాయి. ప్రభుత్వానికి 75వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. ఓనం సమయంలో 25వేల కోట్లని అంచనా వేస్తే వచ్చింది రు.18,131 కోట్లు. గత మూడు సంవత్సరాలుగా ఓనం పండగ సందర్భంగా వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా 2018,19 సంవత్సరాల్లో దెబ్బతింటే గతేడాది కరోనా వచ్చింది. కేరళ వ్యాపార వ్యవసాయి ఏకోపన సమితి అంచనా ప్రకారం ఇరవై వేల మంది వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. పదిమంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇరవై వేల కోట్ల రూపాయల సరకు పనికిరాకుండా పోయింది. ప్రస్తుత పరిస్ధితుల్లో కొత్త సరకు తెచ్చేందుకు భయపడుతున్నారు.