Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


క్యూబాలో ఏం జరుగుతోంది ? మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనా ? జూలై రెండవ వారంలో అక్కడ జరిగిన ప్రదర్శనల పర్యవసానాలు ఏమిటి ? చిన్న దేశం పెద్ద సందేశం ఇచ్చిన క్యూబా గురించి వామపక్ష శక్తులకే కాదు, యావత్‌ ప్రపంచానికి ఆసక్తి కలిగించేదే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణ ప్రాంతం నుంచి క్యూబా దీవి మధ్య దూరం కేవలం 140 కిలోమీటర్లు మాత్రమే. అంత దగ్గరలో ఉండి 1959 నుంచి అమెరికా బెదిరింపులను ఖాతరు చేయకుండా ఉండటానికి క్యూబన్లకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేదే ఆసక్తికరం.


తాజా పరిణామాలను చూసి క్యూబా సోషలిస్టు వ్యవస్ధను కూలదోస్తామని చెబుతున్నవారు కొందరు, కమ్యూనిస్టు పార్టీ అంతానికి ఆరంభం అని వెలువడుతున్న విశ్లేషణలు కొన్ని. తమ వ్యవస్ధ జోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతాం అని హెచ్చరిస్తున్న క్యూబన్లు.ఆరుదశాబ్దాలుగా అమెరికా అష్టదిగ్బంధనంలో ఉన్న తమను ఇంతకంటే చేసేదేమీ లేదన్న తెగింపు. ప్రపంచంలో మానవత్వాన్ని అమెరికన్లు ఇంకా పూర్తిగా అంతం చేయలేదు, వారెన్ని ఆంక్షలు పెట్టినా మరేం చేసినా మా శక్తికొద్దీ ఆదుకుంటామని క్యూబన్లకు బాసటగా నిలుస్తున్న దేశాలు మరోవైపు.


జూలై రెండవ వారంలో అక్కడి సోషలిస్టు వ్యవస్ధను ఎలాగైనా సరే కూలదోయాలని చూస్తున్న శక్తుల ప్రేరేపితంతో నిరసన ప్రదర్శన ఒకటి, ఆ కుట్రను వమ్ముచేసి దాన్ని కాపాడాకోవాలనే పట్టుదలతో మరొక ప్రదర్శన జరిగింది.ప్రపంచంలో అత్యంత మానవీయ ముఖం తమదని చెప్పుకొనే అమెరికా ఆరు దశాబ్దాలుగా తీవ్రమైన ఆంక్షలను అమలు జరుపుతున్న కారణంగా క్యూబన్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుదశాబ్దాలు కాదు మరో అరవై సంవత్సరాలు అదే పనిచేసినా బాంచను దొరా నీకాల్మొక్తా అనేది లేదంటున్న అదే జనం.


ప్రభుత్వం మీద అసంతృప్తి చెందిన కొందరి ప్రదర్శనలకు వచ్చిన ప్రచారంతో పోలిస్తే ప్రభుత్వ అనుకూల ప్రదర్శల గురించి దాదాపు రాలేదనే చెప్పాలి. విపరీత చర్య ఏమంటే రాజధాని హవానాలో జరిగిన ప్రభుత్వ అనుకూల ప్రదర్శన చిత్రాన్ని వ్యతిరేకుల ఆందోళనగా పశ్చిమ దేశాల కార్పొరేట్‌ మీడియా, వార్తా సంస్దలు చిత్రించగా దాన్ని గుడ్డిగా ప్రపంచ వ్యాపితంగా మీడియా చిలవలు పలవలుగా వార్తలను ఇచ్చింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిరసనకారులకు మద్దతు ప్రకటించాడు. అమెరికాలో వర్షం పడితే తమ దేశాలలో గొడుగులు పట్టే మరో ఇరవై దేశాలు యుగళగీతాలాపన చేశాయి. వారంతా రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు అన్నది స్పష్టం.మరోవైపున నిరసనకారులకు ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రదర్శనలు జరిగాయి.


ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల తరువాత క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. వాటిలో హవానా ప్రదర్శన చిత్రాన్ని ప్రభుత్వ వ్యతిరేకమైనదిగా పశ్చిమ దేశాలలో అగ్రశ్రేణి మీడియా సంస్దలు పేర్కొన్నాయి. ఏపి వార్తా సంస్ధ ఈ తప్పుడు చర్యకు పాల్పడింది. అయితే ప్రదర్శనలో ఉన్న బ్యానర్లపై ఫెడల్‌ కాస్ట్రో నాయకత్వాన సాగిన జూలై 26 ఉద్యమం, తదితర నినాదాలు ప్రభుత్వ అనుకూలమైనవిగా ఉన్నట్లు గుర్తించిన ఇద్దరు జర్నలిస్టులు ఆ చిత్ర బండారాన్ని బయట పెట్టారు. అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, న్యూయార్క్‌ టైమ్స్‌, గార్డియన్‌, వాషింగ్టన్‌ టైమ్స్‌, ఫాక్స్‌ న్యూస్‌, ఫైనాన్సియల్‌ టైమ్స్‌ వంటి అగ్రశ్రేణి సంస్దలన్నీ చిత్రాన్ని అదే విధంగా వర్ణించాయి. ప్రపంచ వ్యాపితంగా ఈ చిత్రం వైరల్‌ అయింది. దాని ప్రాతిపదికన అనేక మంది విశ్లేషణలు కూడా రాశారు. వాటిలో వెంటనే ఒక్క గార్డియన్‌ మాత్రమే తప్పు జరిగినట్లు అంగీకరిస్తూ సవరణ వేసింది. తమకు వ్యతిరేకంగా ఒక పధకం ప్రకారమే తప్పుడు వార్తల ప్రచారం జరిగినట్లు క్యూబా కమ్యూనిస్టు పార్టీ నేత రోగెలియో పోలాంకో చెప్పారు. గతంలో అనేక చోట్ల రంగు విప్లవాల మాదిరి సామాజిక మాధ్యమాల్లో తిరుగుబాటు యత్నంగా చిత్రించారన్నారు.


క్యూబాలో ఎవరిని గద్దెమీద కూర్చోబెట్టాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది అక్కడి జనం. అక్కడి జనానికి ఆహారం లేదు,ఔషధాలు లేవు, అన్నింటికీ మించి స్వేచ్చ లేదు, అందువలన వారికి మద్దతు ఇస్తున్నామని అధ్యక్షుడు జోబైడెన్‌ నమ్మబలుకుతున్నాడు. ఇలాంటి ప్రచారం కొత్తది కాదు బైడెన్‌ ఆద్యుడు కాదు. ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వాన అక్కడి జనం నియంత బాటిస్టా ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి కుట్ర చేయని రోజు లేదు. స్పెయిన్‌ సామ్రాజ్యవాదుల ఏలుబడిలో ఉన్న క్యూబా, ఇతర వలసల మీద ఆధిపత్యం ఎవరిది అనే అంశంపై స్పానిష్‌-అమెరికన్ల యుద్దాలు జరిగాయి. క్యూబన్లు కోరుకున్న స్వాతంత్య్రానికి అమెరికా మద్దతు పలికింది. అదెందుకు అంటే క్యూబాను ఒక బానిస రాష్ట్రంగా మార్చుకోవాలన్నది వారి కడుపులోని దురాశ. స్పెయిన్‌ నుంచి పాక్షిక స్వాతంత్య్రం పొందిన తరువాత అమెరికన్లు ప్రతి రోజు, ప్రతి విషయంలోనూ క్యూబాలో వేలు పెట్టారు. రెండవ ప్రపంచ యుద్దానికి ముందు తొలిసారి అధికారానికి వచ్చినపుడు బాటిస్టా తీసుకున్న కొన్ని చర్యలను అక్కడి కమ్యూనిస్టు పార్టీతో సహా పురోగమనవాదులందరూ బలపరిచారు.అతగాడు హిట్లర్‌కు వ్యతిరేకంగా నిలిచాడు. అయితే యుద్దం తరువాత 1952లో అధికారానికి వచ్చిన తరువాత పచ్చి నియంతగా మారి ప్రజాఉద్యమాలను అణచివేశాడు. పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకిగా, తనను వ్యతిరేకించిన వారందరినీ అణచివేశాడు. దానికి ప్రతిఘటన ఉద్యమంలోనే ఫిడెల్‌ కాస్ట్రో అధికారానికి వచ్చాడు.


బాటిస్టాకు అమెరికా మిలిటరీ, ఆర్ధికంగా పూర్తి మద్దతు ఇచ్చింది.అదే అమెరికా ఫిడెల్‌ కాస్ట్రోను హతమార్చటానికి చేసినన్ని ప్రయత్నాలు మరేదేశనేతమీదా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు వాటిని కొనసాగిస్తూనే ఆర్ధిక దిగ్బంధనానికి పూనుకుంది. అమెరికా గనుక బాటిస్టా అవినీతి, అక్రమాలు, అణచివేతలను వ్యతిరేకించి ఉంటే అసలు కాస్ట్రోకు అవకాశమే ఉండేది కాదని, అనవసరంగా తలనొప్పిని కొని తెచ్చుకున్నారని నిట్టూర్పులు విడిచేవారు కూడా ఉన్నారు. అనేక చిన్నదేశాల మీద అమెరికన్లు పెద్ద ఆయుధాలు ఉపయోగించి చివరికి పరువు పోగొట్టుకొని వెనుదిరగాల్సి వచ్చింది.దానికి క్యూబాయే నాంది పలికింది. కూతవేటు దూరంలో ఉన్న క్యూబా మీద బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కిరాయి మూకలను దింపి అమెరికా చేతులు కాల్పుకుంది. మరింత పరువు పోతుందనే భయం కారణంగానే యుద్దానికి దిగలేదు గానీ అంత కంటే భయంకరమైన ఆర్ధిక దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నారు. బరాక్‌ ఒబామా అయినా డోనాల్డ్‌ ట్రంప్‌ అయినా కుడి ఎడమల తేడా తప్ప ఎవరూ తక్కువ తినలేదు. ఒబామా హయాంలో ఆంక్షలను పరిమితంగా సడలించారు. అప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌ చర్యలు చూస్తే చరిత్ర పునరావృతం అవుతోందన్నది స్పష్టం. అయినా క్యూబన్లు లొంగలేదు.


ఇప్పుడు క్యూబాలో పరిస్ధితి ఎందుకు దిగజారింది? కరోనా మహమ్మారి చైనా, వియత్నాం వంటి కొన్ని దేశాలను తప్ప యావత్‌ ప్రపంచాన్ని ఆర్ధికంగా కుంగతీసింది. క్యూబా ఆర్ధిక వ్యవస్ధలో పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా ఉండేది. కరోనా కారణంగా 2020లో 75శాతం తగ్గిపోయారు. అది ఆర్ధిక పరిస్దితిని మరింత దిగజార్చింది. చౌకగా చమురు అందిస్తున్న వెనెజులాపై ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సరఫరాలు తగ్గిపోయాయి. ఇలా అనేక కారణాలు పరిస్ధితిని దిగజార్చాయి.


క్యూబా గురించి తప్పుడు వార్తలతో ఆన్‌లైన్‌ మీడియా సంస్దలు సొమ్ము చేసుకున్నాయని ఆల్‌ జజీరా పత్రిక ఒక విశ్లేషణ రాసింది. మాజీ అధ్యక్షుడు, ఫిడెల్‌ కాస్ట్రో సోదరుడు రావుల్‌ కాస్ట్రో దేశం విడిచి వెనెజులాకు పారిపోయాడని, నిరసనకారులు కమ్యూనిస్టు పార్టీ నేతలను బందీలుగా పట్టుకున్నారని, క్యూబాకు వెనెజులా సైన్యాన్ని పంపుతున్నదనే తప్పుడు వార్తలు వైరల్‌ అయ్యాయి. 2018లో కూబ్యా మే దినోత్సవం, 2011లో ఈజిప్టులో జరిగిన నిరసన ప్రదర్శనల చిత్రాలను కూడా క్యూబా నిరసనలుగా చిత్రించి వైరల్‌ చేశారు. వీటిని చూసి ఏమి కాలమిస్టులు, ఏమి అబద్దాలు, ఇది మీడియా ఉగ్రవాద వ్యక్తీకరణ అని క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ వ్యాఖ్యానించాడు. తప్పుడు వార్తల గురించి విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పుకొనే సామాజిక మాధ్యమ సంస్దలు ఎలా రాజకీయాలు చేస్తున్నాయో ఈ పరిణామం వెల్లడించిందని క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్‌ వ్యాఖ్యానించారు. తప్పుడు వార్తల గురించి వివరణ కోరగా ఫేస్‌బుక్‌ వెంటనే స్పందించలేదని ఆల్‌ జజీరా రాసింది.
క్యూబాలో గత కొద్ది సంవత్సరాలుగా ఇంటర్నెట్‌ ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది.దాంతో సామాజిక మాధ్యమ ప్రచారం పెద్దఎత్తున కూడా జరుగుతోంది. కొన్ని స్వతంత్ర మీడియా సంస్దలను కూడా అనుమతించారు దీన్ని అవకాశంగా తీసుకొని అమెరికా సంస్దలు పధకం ప్రకారం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, స్వతంత్ర మీడియా సంస్దల ద్వారా సాగించిన ప్రచారానికి అసంతృప్తితో ఉన్న క్యూబన్లు తప్పుదారి పట్టి ప్రదర్శలకు దిగారని కొందరు విశ్లేషించారు.


క్యూబాకు జూలై 26 ఒక స్ఫూర్తి దినం. ప్రతి ఏటా సామ్రాజ్యవాదం గురించి గుర్తు చేస్తూ మాతృభూమి లేదా మరణమే శరణ్యం అంటూ ప్రతిజ్ఞలు చేయిస్తారు. 1953లో బాటిస్టాకు వ్యతిరేకంగా కాస్ట్రో నాయకత్వాన తిరుగుబాటును ప్రారంభించిన రోజు. ఆరు సంవత్సరాల తరువాత 1959లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.ఈ సంవత్సరం కరోనా కారణంగా గతంలో మాదిరి పెద్ద సభలు, ప్రదర్శనల వంటివి జరపలేదు.అధ్యక్షుడు మిగుల్‌ డియాజ్‌ కానెల్‌తో సహా అందరూ పిల్లలతో కలసి దేశవ్యాపితంగా లెట్యూస్‌ అని పిలిచే ఒక ఆకు కూర మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. క్యూబా ఎదుర్కొంటున్న సమస్యల తీరుతెన్నులను తెలుసుకొనేందుకు ఒక్క ఉదాహరణ చాలు. క్యూబా కంటే అనేక పెద్ద దేశాలు, ఆర్ధికంగా బలమైనవి ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ల తయారీకి పూనుకోలేదు. అలాంటిది నిధులకు కటకటగా ఉన్నప్పటికీ పెద్ద మొత్తాన్ని వెచ్చించి కరోనా వైరస్‌ నివారణకు వారు ఐదు వాక్సిన్లను రూపొందిస్తున్నారు. అయితే తయారు చేసిన వాటిని తరలించేందుకు అవసరమైన వాహనాలు నడిపేందుకు అవసరమైన డీజిలు, పెట్రోలు, వాక్సిన్లు నింపేందుకు అవసరమైన ప్రత్యేక సీసాలు, ఇంజెక్షన్ల తయారీ ఇబ్బందిగా మారింది.అయినా మూడో వంతు మందికి ఒక డోసు వాక్సిన్‌ వేశారు, నాలుగో వంతుకు రెండు డోసులూ ఇచ్చారు.


క్యూబన్లపై విధిస్తున్న ఆంక్షలను మానవహక్కుల ఉల్లంఘనగా వాటి గురించి నిత్యం కబుర్లు చెప్పే అమెరికా పరిగణించటం లేదు.తాజాగా జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు మద్దతు ఇవ్వటం ఐక్యరాజ్యసమితి నిబంధనల ఉల్లంఘన తప్పమరొకటి కాదు. తాజాగా మరికొన్ని ఆంక్షలను ప్రకటిస్తూ బైడెన్‌ సర్కార్‌ ఇవి ఆరంభం మాత్రమే త్వరలో మరిన్ని ప్రకటిస్తామని బెదిరింపులకు దిగింది. అనేక దేశాలు అమెరికా బెదరింపులను ఖాతరు చేయకుండా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. క్యూబా తమకు శాశ్వత మిత్రదేశమని చైనా గతంలోనే ప్రకటించింది. పది బిలియన్‌ డాలర్ల అప్పును వివిధ దేశాలకు చైనా రద్దు చేయగా దానిలో సగం క్యూబాదే ఉన్నట్లు ్ల 2019 మే 29వ తేదీన ఫోర్బ్స్‌ డాట్‌కామ్‌ ఒక వార్తను ప్రచురించింది. అదే విధంగా కరోనా వాక్సిన్ల రూపకల్పన, స్మార్ట్‌ ఫోన్ల తయారీ, ఔషధాల వంటి అంశాలలో కూడా తోడ్పాటు ఇస్తున్నట్లు వార్తలు ఉన్నాయి. వివిధ కారణాలతో పలు దేశాలు చేస్తున్న సాయం గురించి వార్తలు రావటం లేదు.


అమెరికా బెదిరింపులు, ఆంక్షలను తోసి పుచ్చి మెక్సికో ఒక టాంకరులో రెండు కోట్ల లీటర్ల డీజిల్‌ను క్యూబాకు తరలించింది. సోమవారం నాడు హవానా రేవుకు చేరనుందని వార్తలు వచ్చాయి.అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయల్‌ లోపెజ్‌ ఒబ్రడార్‌ దీని గురించి మాట్లాడుతూ అంతర్జాతీయ సౌహార్ద్రత, మానవతా సాయంగా రెండు ఓడల్లో డీజిల్‌, ఆహారం పంపనున్నట్లు చెప్పారు.ఆంక్షలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకోవాలని బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు. తమ అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ ఆదేశాల మేరకు రెండు విమానాల్లో వంద టన్నుల సామగ్రిని తరలించినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. వాటిలో ఆహారంతో పాటు పిపిఇ కిట్లు, మెడికల్‌ మాస్కులు ఉన్నాయి. కొద్ది వారాల క్రితమే ఐరాస సాధారణ అసెంబ్లీలో క్యూబాపై ఆర్ధిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలనే తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా 184దేశాలు అనుకూలంగా అమెరికా, ఇజ్రాయెల్‌ వ్యతిరేకంగా ఓటు వేశాయి.బ్రెజిల్‌, ఉక్రెయిన్‌, కొలంబియా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.


అమెరికాకు పారిపోయి వచ్చిన నియంత బాటిస్టా మద్దతుదారులకు 1961లో సిఐఏ ఆయుధాలు ఇచ్చి బే ఆఫ్‌ పిగ్స్‌ పేరుతో కాస్ట్రో ప్రభుత్వంపై తిరుగుబాటుకు కిరాయి మూకలను పంపింది. మూడు రోజుల్లోనే వారందరినీ అదుపులోకి తీసుకొని అణచివేశారు.ఇది కమ్యూనిస్టు క్యూబా చేతిలో అమెరికన్లు తిన్న తొలి ఎదురుదెబ్బ. ఆ మరుసటి ఏడాదే సోవియట్‌ యూనియన్‌ అమెరికాను హెచ్చరిస్తూ క్యూబా గడ్డపై క్షిపణులను మోహరించింది. 1962లో అధ్యక్షుడు కెన్నడీ మాట్లాడుతూ ఒక నాటికి అమెరికాకు వచ్చిన క్యూబన్‌ కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ స్వేచ్చ ఉండే క్యూబాలో అడుగు పెడతారని వారిని ఉద్దేశించి ప్రసంగించాడు. కెనడీ మరణించేంతవరకు అదే భ్రమలో ఉన్నాడు, చేయించదలచిన దుర్మార్గాలన్నింటికీ ఆమోదం తెలిపాడు. అప్పటి నుంచి బాటిస్టా మద్దతుదారులు క్యూబాకు పొరుగున ఉండే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో నివాసాలు ఏర్పరుచుకొని విద్రోహాలకు పాల్పడుతూ తరాలు మారినా ఇప్పటికీ అదే కలలు కంటున్నారు. క్యూబన్లు లొంగుతారా ? నియంత బాటిస్టాకే సలాం గొట్టని వారు అమెరికాకు సలాం కొడతారా ?