ఎం కోటేశ ్వరరావు
మన్మోహన్ సింగ్ నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడచింది. 1991 జూలై 24న పివి నరసింహారావు ప్రధాన మంత్రిగా ఉండగా మన్మోహన్‌సింగ్ సంస్కరణలతో కూడిన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాటికి ఆద్యులం మేమే అని గతంలో ఛాతీలు విరుచుకున్న కాంగ్రెస్, వాటిని పొగిడి అమలు జరిపేందుకు పోటీ పడిన తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు, అదే సంస్కరణలను మరింత గట్టిగా అమలు చేస్తున్న బిజెపిలోగానీ ఎక్కడా సంతోషం కాదు గదా కనీస చిరు హాసం కూడా కనిపించటం లేదు. ఎందుకు ?
సంస్కరణలను గతంలో సమర్ధించిన వారు గానీ ఇప్పుడు భజన చేస్తున్న పెద్దలు గానీ చెప్పేది ఏమిటి ? అంతకు ముందు టెలిఫోను కావాలంటే పార్లమెంట్ సభ్యుడి సిఫార్సు కావాలి, ఎక్కువ సేపు మాట్లాడితే జేబులు ఖాళీ, స్కూటర్ కొనుక్కోవాలంటే సంవత్సరాలు ఆగాలి, గ్యాస్ కావాలన్నా ఏండ్లు పూండ్లు గడిచేవి. ఇప్పుడు వద్దన్నా సరే తీసుకోండి బాబూ అంటూ జనాన్ని వదల – కదలకుండా సతాయిస్తున్నాయి. పరిస్ధితి మరింత మెరుగుపడాలి, ఇంకా అందుబాటులోకి రావాలంటే మరిన్ని సంస్కరణలు అవసరం అన్నది కొందరి వాదన. ప్రపంచ వ్యాపితంగా 2019లో వంద మంది జనాభాకు సగటున 104 ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. మన దగ్గర 2020లో 110.18, చైనాలో 113.38, క్యూబాలో 11.6(2011) ఉన్నాయి. అంటే మనం చైనాకు దగ్గరగా ఉన్నాం, ఎంత అభివృద్ది ? క్యూబా అందనంత దూరంలో వెనుకబడి ఉంది చూడండి అని అంకెలను చూసి ఎవరైనా చెబుతారు. మరి దీనిలో వాస్తవం లేదా ? కంటికి కనిపిస్తుంటే లేదని ఎలా చెప్పగలం !
గతి తార్కిక సూత్రాల ప్రకారం ప్రతిదీ నిరంతరం మారుతూ ఉంటుంది. అందువలన సంస్కరణలు, మరొకదానిని వద్దని చెప్పటం అంటే రివర్స్ గేర్‌లో నడపాలని చూడటమే. పురోగమనం ఏ దారిలో నడవాలన్న దగ్గరే అసలు సమస్య. దాన్ని తమవైపు మళ్లించుకోవాలని కార్పొరేట్ సంస్దలు చూస్తాయి. తమ వైపు రావాలని సామాన్య జనం కోరుకుంటారు. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్దలు(ఐఎంఎఫ్) ఏం చెబుతాయి ? వాటిని రూపొందించింది ధనిక దేశాలు గనుక వాటి ప్రయోజనాలకు అనుగుణ్యమైన సిఫార్సులే చేస్తాయి. దాని అర్ధం సమాజంలో ఒక తరగతి ఆ సంస్కరణలతో లబ్దిపొందుతుంది. భిన్నమైన ఆచరణ అయితే మరో తరగతికి ప్రయోజనం.
ఐక్యరాజ్యసమితి 2020 మానవాభివృద్ది సూచికలో 189 దేశాలకు గాను క్యూబా 70వ స్ధానంలో, చైనా 85, మన దేశం 131, బంగ్లాదేశ్ 133లో ఉంది. సంస్కరణల లక్ష్యం సెల్‌ఫోన్ల కనెక్షన్ల పెరుగుదలా లేక మానవాభివృద్దిగా ఉండాలా ? మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత కరోనా సమయంలో ఆక్సిజన్ కోసం విదేశీ దానం, దిగుమతుల మీద ఆధారపడాల్సిన దుస్ధితిని ఎలా వర్ణించాలి ? అందుకే సంస్కరణల లక్ష్యం ఏమిటి అన్నది గీటురాయిగా ఉండాలి. మన దేశం స్వంతంగా ఒక వాక్సిన్ తయారు చేసినందుకే మన జబ్బలను మనం చరుచుకుంటున్నాం. నరేంద్రమోడీ ఉండబట్టే అది సాధ్యమైందన్న భజన తెలిసిందే. సున్నా కంటే ఒకటి విలువ అపారం. సెల్‌ఫోన్ల కనెక్షన్లలో త్వరలో మనం చైనాను అధిగమించినా ఆశ్చర్యం లేదు. ఒక వాక్సిన్‌కే మనం తబ్బిబ్బు అవుతుంటే చైనా 20వాక్సిన్ల ప్రయోగాలు జరుపుతోంది. అమెరికా ఆర్ధిక దిగ్బంధనం ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నంతలోనే పెద్ద మొత్తం వెచ్చించి క్యూబా ఐదు కరోనా వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. కావాలంటే ఇతర దేశాలు ఉత్పత్తి చేస్తామంటే ఫార్ములా ఇస్తామని ప్రకటించింది. ఇలా ఉదహరించుకుంటూ పోతుంటే విదేశాలను పొగిడే దేశద్రోహులుగా ముద్రవేస్తారు. టూల్‌కిట్ల కేసులు బనాయిస్తారు. పెగాసస్‌ను ప్రయోగిస్తారు.
మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా సంస్కరణల బడ్జెట్‌ను ప్రతిపాదిస్తూ పదిహేను రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్యం ఉందని చెప్పారు. ఇప్పుడు మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే అప్పుడూ పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు సంస్కరణలు కావాలని కోరారు. మూడు దశాబ్దాల తరువాత ఇప్పుడూ మరిన్ని సంస్కరణలు కావాలని కోరుతున్నది వారే. సామాన్య జనంలో నాడున్నంత మోజు, క్రేజు ఇప్పుడు లేదు. ఎందుకని ? స్వాతంత్య్రం వచ్చిన పద్నాలుగు సంవత్సరాలకు వెలుగు నీడలు(1961) అనే సినిమా వచ్చింది. మహాకవి శ్రీశ్రీ పాడవోయి భారతీయుడా అంటూ రాసిన పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. స్వాతంత్య్రం వచ్చెనని సంబరపడబోకోయి, స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయీ, సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి.. ఆకామందుకొనే ధరలకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపు, అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలుముకున్న నీ దేశమెటు దిగజారూ, కాంచవోయి నేటి దుస్ధితీ ఎదిరించవోయి ఈ పరిస్ధితీ, పదవీ వ్యామోహాలు కులమత బేధాలూ భాషా ద్వేషాలూ చెలరేగేనేడు ప్రతి మనిషి మరియొకనీ దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకొనే వాడే అంటూ ఆరుదశాబ్దాల క్రితమే పరిస్ధితిని ఎదిరించమని సందేశమిచ్చాడు శ్రీశ్రీ . మూడు దశాబ్దాల సంస్కరణల తరువాత అవన్నీ మరింత పెరిగాయి.
1991నాటి సంస్కరణలకు విదేశీ చెల్లింపుల సమస్య తలెత్తటం ఒక ప్రధాన కారణం. నరేంద్రమోడీ హయాంలో విదేశీమారక ద్య్రవ్యం పెరుగుదలను ఒక ఘన విజయంగా ఊరూ వాడా ఊదరగొడుతున్నారు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మొత్తం మీద మన దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు అవసరమైన విదేశీమారక ద్రవ్యం లోటులోనే ఉంది. ఎవరి ఘనత అయినా మిగులు సాధించినపుడే. ఇప్పుడు 612 బిలియన్ డాలర్లు (జూలై 16నాటి ఆర్‌బిఐ సమాచారం) దాటినప్పటికీ ప్రముఖ ఆర్ధికవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. మరోసారి చెల్లింపుల సంక్షోభం తలెత్తవచ్చని, జాగ్రత్తపడాలని చెప్పేవారు కొందరు, ఐఎంఎఫ్‌ను ఆశ్రయించవచ్చని కొందరు హెచ్చరిస్తున్నారు.” ఊహించని విదేశీ అఘాతాల(షాక్‌లు)లను తట్టుకొనే శక్తిని విదేశీమారక ద్రవ్య స్ధాయిలు కల్పిస్తాయని చెప్పటం మోసకారితనం ” అని రిజర్వుబ్యాంకు డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్ర రిజర్వుబ్యాంకు బులిటెన్‌లో రాశారు. జూన్ నాలుగవ తేదీ నాటికి 605 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధమ స్ధానంలో ఉన్న చైనా, జపాన్, స్విడ్జర్లాండ్, రష్యా తరువాత అధిక విదేశీమారక డాలర్ల ద్రవ్యం ఉన్న దేశంగా ఐదవ స్ధానానికి చేరింది. ఈ మొత్తం పదిహేను నెలల పాటు మనం దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని చెబుతున్నారు. వారం వారం ఇవి పెరగటానికి ప్రత్యక్ష పెట్టుబడులు రావటం, దేశ ఆర్ధిక వ్యవస్ధ సరిగా లేనప్పటికీ కంపెనీల వాటాల కొనుగోలుకు విదేశీ మదుపుదార్లు ఎగబడటం కారణాలు అన్నది స్పష్టం. స్విడ్జర్లాండ్ దగ్గర ఉన్న నిధులు 39 నెలలు, జపాన్ 22, రష్యా 20, చైనా 16నెలల పాటు దిగుమతులు చేసుకొనేందుకు సరిపోతాయని మన దేశం దగ్గర పదిహేను నెలలకు సరిపడా ఉన్నందున మన పరిస్ధితి మెరుగ్గా ఉందని కొందరు నమ్మబలుకుతున్నారు.చైనా వాణిజ్య మిగులులో ఉంది తప్ప తరుగులో లేదు. అందువలన మన పరిస్ధితిని ఇతరులతో పోల్చుకుంటే ప్రయోజనం ఏముంది ? మన దేశ అంతర్జాతీయ నిఖర పెట్టుబడులను విశ్లేషిస్తే సంపదలకంటే అప్పులు 12.9శాతం ఎక్కువగా ఉన్నాయి. అందువలన ఆచరణాత్మక విశ్లేషణలు చేయటం అవసరం. మనకంటే వేరే దేశాల్లో లాభం అనుకుంటే పొలో మంటూ ఆ పెట్టుబడులన్నీ తెల్లవారే సరికి మాయాబజార్‌లా మాయం అవుతాయి. అప్పుడు పరిస్ధితి ఏమిటన్నది సమస్య.
విదేశీ మదుపుదారులు తమ దేశాల్లో కంటే తక్కువ ప్రతిఫలం వస్తున్న కారణంగానే మన మార్కెట్లోకి వస్తున్నారు. అందువలన వారికి ఎక్కడ వాటంగా ఉంటే అక్కడికి ఎప్పుడైనా తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవచ్చు. మన్మోహన్ సింగు చెప్పినట్లు పదిహేను రోజులకు సరిపడా విదేశీమారక ద్రవ్య నిల్వలున్నపుడు ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ధ ఆదేశాల మేరకు సంస్కరణలు తీసుకువచ్చారు. అందువలన సహజంగానే అవి కొన్ని తరగతులను సంతృప్తి పరచాయి, సంపదలను పెంచాయి. వాటిని చూసి అనేక మంది తాము కూడా ఆ జాబితాలో చేరేందుకు మహదావకాశం వచ్చిందనే ఆశతో వెనుకా ముందూ చూడకుండా వాటిని సమర్ధించారు. యుపిఏ పాలనలో దేశంలో ఆర్ధిక పరిస్దితి దిగజారటం, కొత్త పద్దతుల్లో దేశ సంపదలను దోచుకొనే క్రమంలో జరిగిన అక్రమాల కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. దాన్ని ఉపయోగించుకొని నరేంద్రమోడీ రంగంలోకి వచ్చారు.
ఏడు సంవత్సరాల తరువాత అనేక వైఫల్యాలు కళ్లెదుట కనిపిస్తున్నా ప్రధాని మోడీ పలుకుబడి తగ్గలేదని కొందరు చెబుతున్నారు. అంగీకరిద్దాం. ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి లక్ష్యం గురించి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు. నాడు పివి నరసింహారావు, మన్మోహన్ సింగులు చేసిన మాదిరి కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు నరేంద్రమోడీ అద్భుతాలు చేయగలరా లేదా అని కొందరు పోల్చి చూస్తున్నారు. కొందరు పండితులు, విధాన నిర్ణేతలు ఆశపడుతున్నారు గానీ అంత సీన్ లేదు, ఆశాభంగం చెందుతారు అని కొందరు హెచ్చరిస్తున్నారు. వారు చెబుతున్న కారణాల సారాంశం ఇలా ఉంది. 1991 నాటి ఏకీభావం ఇప్పుడు లేదు. అవి ఆకస్మికంగా ఆకాశం నుంచి ఊడిపడలేదు. సంస్కరణలతో చైనా పురోగమనం, ఆసియాలో మరికొన్ని దేశాల పురోగమన ప్రభావం, అన్నింటికీ మించి సోవియట్ యూనియన్ పతనం వంటి అంశాలన్నీ ప్రభావితం చేశాయి.
ఇందిరా గాంధీ హయాంలోనే ప్రపంచబ్యాకు,ఐఎంఎఫ్ చెప్పిన వాటిని అమలు చేయటం ప్రారంభించారు, దాని వలన ప్రయోజనం లేదని అరకొర అవీ పైపైన గాక కచ్చితంగా వాటిని అమలు జరపటం, రక్షణాత్మక విధానాల బదులు స్వేచ్చా మార్కెట్, ఉదారవాదవిధానాలు తప్ప మరొక మార్గం లేదనే అభిప్రాయాలు బలపడటం వంటి అంశాలున్నాయి. ప్రభుత్వ రంగ విస్తరణ, పెట్టుబడుల విధానాన్ని పక్కన పెట్టి సర్వం ప్రయివేటుకే అప్పగించారు. అయినా సేవారంగంలో వచ్చిన మార్పులు తప్ప పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో సాధారణ పెరుగుదల తప్ప సంస్కరణల ప్రభావం ప్రత్యేకంగా కనిపించటం లేదు. మన దిగుమతులు తప్ప ఎగుమతులు పెరటం లేదు. సంస్కరణలను మరింతగా అమలు జరపాలని అందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలనే వాదనలు మన్మోహన్ సింగ్ హయాంలోనే ఇంటా బయటి నుంచి వత్తిళ్లు ప్రారంభమయ్యాయి. యుపిఏ ఒకటి హయాంలో వామపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడవటం వలన కార్పొరేట్ల కోరికలు తీర్చటం సాధ్యం కాలేదు. యుపిఏ 2 హయాంలో వామపక్షాలతో నిమిత్తం లేకుండానే పాలన సాగినా ధరల పెరుగుదల, అవినీతి అక్రమాల కుంభకోణాలతో పరువు పోయిన సమయంలో వెనకడుగు వేయక తప్పలేదు.
గుజరాత్-గోద్రా-మారణకాండ నేపధ్యంలో అవసరమైతే జనాన్ని అణచి తమ అజెండాను అమలు జరిపే సాహసవంతుడు కార్పొరేట్లకు నరేంద్రమోడీలో కనిపించారు. అంతకంటే కావాల్సింది ఏముంది.అవసరమైన ప్రచారం, హంగు, అర్భాటాలతో కొత్త దేవుడు వచ్చాడన్నట్లుగా పరిస్ధితిని తయారు చేశారు. ఒక అజెండాను కూడా రూపొందించారు. పారిశ్రామికవేత్తలు కోరిన విధంగా భూమి పొందేట్లు నిర్ణయాలు తీసుకోవాలి, కార్మిక చట్టాలను నీరు గార్చాలి, పన్ను సంస్కరణలను అమలు జరపాలి, బ్యాంకులు, బీమా రంగం నుంచి తప్పు కోవాలి.మిగిలిన ప్రభుత్వ రంగ సంస్దలను ప్రయివేటీకరించాలి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించాలి. ఇందుకు అవసరమైన ఇతర అనుబంధ చర్యలు తీసుకోవాలి. దానిలో భాగంగానే అంతకు ముందు తాము వ్యతిరేకించిన జిఎస్‌టిని మోడీ అమలు చేశారు. మిగతావాటికీ రంగం సిద్దం చేశారు. అయితే పెద్ద నోట్ల రద్దు వంటి పిచ్చిపనితో తలెత్తిన ఇబ్బందులు, జిఎస్‌టితో వచ్చిన సమస్యలు, ఆర్ధిక రంగంలో వృద్ధి రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి పడిపోవటం, దాదాపు అన్ని రంగాలలో వైఫల్యం కారణంగా మిగతా అంశాల అమలును వేగం చేస్తే జనం నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయమే ఇప్పుడు నరేంద్రమోడీని పీడిస్తోంది. మొరటుగా ముందుకు పోతే అధికారానికే మోసం వస్తుందనే బెరుకు మొదలైంది.
అన్ని వ్యవస్ధలను దిగజార్చుతున్న మాదిరే మోడీ హయాంలో ఏకాభిప్రాయ సాధన, భిన్నాభిప్రాయాల వెల్లడి లేదా చర్చకు అవకాశాలు ఇవ్వని నిరంకుశ ధోరణి పెరుగుతోంది. గతంలో పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 60-70శాతం కమిటీల చర్చకు పంపేవారు ఇప్పుడు అవి పదిశాతానికి పడిపోయాయి. ప్రవేశపెట్టే బిల్లుల గురించి ముందుగా చర్చించటం కూడా తగ్గిపోయింది. తొలి ఐదు సంవత్సరాలలో 186 బిల్లులను ప్రవేశపెడితే వాటిలో 44 మీదే ముందుగా సంప్రదింపులు జరిపారు. కరోనా సమయంలో వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా సరైన సంప్రదింపులు, చర్చలు లేకుండా మూడు బిల్లులను ఆమోదించుకున్న తీరు, వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఎనిమిది నెలలుగా జరుపుతున్న ఉద్యమం గురించి తెలిసిందే. ఆ చట్టాల అమలును సుప్రీం కోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. వ్యవసాయ చట్టాల తరువాత కార్మిక చట్టాలకు రంగం సిద్దం చేశారు. అయితే అనూహ్యంగా కరోనా వచ్చింది. సహాయక చర్యలు, దాన్ని గుర్తించటంలో నిర్లక్ష్యం, వైఫల్యం ఒకటైతే ఆర్ధికంగా దేశం కుదేలు కావటం వలన సంస్కరణల కిక్కు జనానికి ఎక్కించటం సాధ్యం కాదు. ఏ చమురు ధరలైతే మోడీ అధికారానికి రాగానే గణనీయంగా పడిపోయి ప్రభుత్వం మీద భారం తగ్గించటంతో పాటు ఆమేరకు జనం మీద భారం మోపి అదనపు వనరులను సమకూర్చుకొనేందుకు దోహదం చేశాయో ఇప్పుడు అవే రాబోయే రోజుల్లో మెడకు చుట్టుకోనున్నాయి. ఇప్పుడు మోడీ తలపెట్టిన సంస్కరణల అజెండా యుపిఏ హయాంలోనే ఉంది.వాటి అమలు, తటపటాయింపు మన్మోహనసింగు ఇష్ట అయిష్టాల కారణంగా వాయిదా పడలేదు. ధరల పెరుగుదల వంటి అంశాలతో పాటు అవినీతి అక్రమాలు ఆ ప్రభుత్వాన్ని కుదిపివేసిన కారణంగా తగ్గారు. అందుకే కార్పొరేట్లు సింగును పక్కన పెట్టి మోడీకి జై కొట్టారు.
ఏడు సంవత్సరాల తరువాత ఆర్ధిక వ్యవస్ధ కుదేలు కావటం, పన్నుల కారణంగా చమురు ధరలు రికార్డు స్ధాయికి చేరటం, వాక్సిన్‌పై పిల్లిమొగ్గలు, ఆక్సిజను కూడా అందించలేని కరోనా వైఫ్యల్య నేపధ్యం అన్నింటికీ మించి రైతుల ప్రతిఘటన వంటి అంశాల నేపధ్యంలో మోడీ మీద ఇంకా మోజు ఉన్నప్పటికీ మరిన్ని సంస్కరణల గురించి కబుర్లు చెబితే నమ్మే స్ధితిలో జనం లేరు. అదే అసలు సమస్య. చెప్పిన మాట, చేసిన వాగ్దానాలను మరోసారి చెప్పటం, మాట్లాడే అలవాటులేని మోడీ గారికి పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా ఉంది. మొరటుగా ముందుకు పోతే జనంలో ప్రతిఘటన, కోరిక తీర్చకపోతే కార్పొరేట్లు చేయాల్సింది చేస్తారు.