Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


1991 సంస్కరణలకు ముందు తరువాత అంటూ కొంత మంది మనకు మహారంజుగా కథలు వినిపిస్తారు. నా చిన్నతనంలో పల్లెటూరిలో ఉన్న నాకు పక్కనే ఉన్న పట్టణంలో సినిమా చూసి వచ్చిన వారు వాటి కధ, నటీ నటుల గురించి చెబుతుంటే, కొన్న పాటల పుస్తకాలను గర్వంగా చూపుతుంటే మనదీ ఒక బతుకేనా ! ఛా మనకు ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందో అన్నట్లు ఉండేది. ఆ రోజులు మారాయి, ఇప్పుడు సినిమాల స్ధానాన్ని సీరియళ్లు ఆక్రమించాయి. ఎంతకాలం సాగుతాయో తెలియదు. చూసినవారందరూ తరువాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో చర్చలు జరుపుకుంటున్నారు. అందువలన కొత్త కథలు వినదగు నెవ్వరు చెప్పిన అన్నట్లుగా విందాం. వినినంతనే వేగపడక బుర్రలతో ఆలోచిద్దాం. ఆశల పల్లకి నుంచి దిగుదాం, నేల మీద నడుద్దాం !


మూడు దశాబ్దాల క్రితం ఉన్న జిడిపితో పోల్చితే ఇప్పుడు పది రెట్లు పెరిగింది అని లొట్టలు వేసుకుంటారు. కాదని ఎవరన్నారు. కొందరు చెప్పే అభివృద్ది ఆర్ధిక శాస్త్రం ప్రకారం మూడు దశలు ఉంటాయి. సేవారంగం మూడవ దశలో అగ్రస్ధానంలో ఉంటుంది. ఈ ప్రాతిపదికన అభివృద్ది చెందిన దేశాలలో దాని వాటా 70శాతంపైన (అమెరికాలో 80శాతం వరకు ఉంది), వర్ధమాన దేశాలలో 50శాతంపైగా ఉంటుంది. మనదేశంలో 1980దశకంలో సేవారంగం వాటా 38.6శాతం ఉంది. ఆరోజుల్లో ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి ట్రంకాల్‌ కలవటానికి పట్టే వ్యవధిలో వెళ్లి తిరిగి రావచ్చు అనే జోకులు పేలేవి. నిజమే మరి. 1991సంస్కరణల తరువాత ఆ దశకంలో సేవారంగం వాటా 44.3శాతానికి పెరిగింది. ఇప్పటి పరిస్ధితిని చూస్తే 2017లో చైనా సేవారంగం వాటా 52.2శాతం ఉండగా మనది 61.5శాతం ఉంది.దాని ప్రకారం మనం కేవలం మూడు సంవత్సరాలకే నరేంద్రమోడీ నాయకత్వాన చైనాను అధిగమించాం అని చెప్పినా మారు మాట్లాడకుండా అంగీకరించాల్సిందే. లేకపోతే దేశద్రోహి అని కేసులు పెడతారు లేదా మన ఫోన్లలో పెగాసెస్‌ వచ్చి కూర్చుంటుంది. 2020 సంవత్సరంలో సేవారంగం వాటా మన దగ్గర 53.89శాతానికి తగ్గింది. ఇదే చైనా వాటా 54.5 శాతం ఉంది. దీన్ని బట్టి మన దేశం తగ్గి చైనా పెరిగి ఇప్పుడు రెండు దేశాలూ అభివృద్దిలో సమంగా ఉన్నట్లా ? మన జిడిపిలో వ్యవసాయవాటా 20.19, పారిశ్రామికరంగం 25.92 కాగా ఇదే సమయంలో చైనా వాటాలు 7.7, 37.8శాతాల చొప్పున ఉన్నాయి.


మూడు దశాబ్దాల సంస్కరణలు దేశాన్ని ఎంతో ముందుకు తీసుకుపోయాయని, అందువలన ఇప్పుడు మరిన్ని సంస్కరణలు అమలు చేస్తే మరింత ముందుకు పోతామని, చైనాను అధిగమిస్తామని చెబుతున్నవారు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తారు. అభివృద్దిలో ఎవరు ఎవరితో అయినా పోటీ పడాలి. స్వార్ధం బాగా పెరిగి పోయిన వర్తమానంలో అందరూ బాగుండాలి అందులో మనముండాలి అన్న మాట ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం అవుతోంది.ఎదుటి వారి గురించి ఏడవటం మన భారతీయ సంస్కృతి కాదు, అయినా చైనా, పాకిస్దాన్‌ నాశనం కావాలి, వాటి స్దానంలో మనమే బాగు పడాలి అని సామాజిక మాధ్యమంలో ప్రచారం చేసే, కోరుకొనే వారు కూడా ఉన్నారు. చైనా గురించి కమ్యూనిస్టులో లేదా ఆ దేశ అభిమానులో చెబితే అబ్బే అంతా ఉత్తిదే అనేవారి సంగతి తెలిసిందే. అందుకే ప్రపంచబ్యాంకు విడుదల చేసిన సమాచారాన్ని ఇక్కడ పరిశీలనకు తీసుకుందాం. ప్రతి పది సంవత్సరాలకు జిడిపి విలువ బిలియన్‌ డాలర్లలో, తలసరి జిడిపి డాలర్లలో ఏదేశంలో ఎలా పెరిగిందో దిగువ చూడవచ్చు.1990వ సంవత్సరం నుంచి వివరాలను తీసుకుందాం.
సంవత్సరం××× చైనా ××× భారత్‌ ××× చైనా ××× భారత్‌
1990 ×× 361 ×× 321 ××× 318 ××× 368
2000 ×× 1,211 ×× 468 ××× 959 ××× 449
2010 ×× 6,087 ×× 1,675 ××× 4,550 ×× 1,358
2019 ××14,280 ×× 2,869 ××× 10,217 ×× 2,100


సంస్కరణలు ఏ దేశంలో ఎంత మేరకు పురోగతి సాధించాయో, మన దేశ అభివృద్ది ఎక్కడ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకు ఇంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ కాలంలో చైనా జిడిపి 39.66 రెట్లు పెరగ్గా మనదేశంలో 8.9 రెట్లు, తలసరి జిడిపి చైనాలో 32 రెట్లు మన దేశంలో 5.8 రెట్లు మాత్రమే పెరిగాయి.చైనా జిడిపి 361 నుంచి 960 బి.డాలర్లకు చేరేందుకు ఏడు సంవత్సరాలు పట్టింది. అదే భారత్‌ జిడిపి 321 నుంచి 940 బి.డాలర్లకు చేరేందుకు పదహారు సంవత్సరాలు పట్టింది. సంస్కరణల ద్వారా స్ధానిక సంస్ధలు దశలవారీగా అంతర్జాతీయ పోటీ తత్వాన్ని సంతరించుకుంటాయని, సామర్ద్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని 1991లో ఆర్ధిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ చెప్పారు. ఎగుమతి-దిగుమతి విధానంలో మార్పులు చేశామని, దిగుమతుల అనుమతులను తగ్గిస్తామని, ఎగుమతులను పెంచుతామని కూడా చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయానికి వస్తే 1990లో దిగుమతి పన్నులు 82శాతంగా ఉండగా 1992నాటికి 56శాతానికి తగ్గాయి. ఇదే సమయంలో డాలరు విలువతో సంబంధం ఉండే పన్ను మొత్తాలు 1995-96 నాటికి 50 నుంచి 25 శాతానికి తగ్గించాలని రాజా చెల్లయ్య కమిటీ సూచించింది. ఇవి ప్రపంచబ్యాంకు లక్ష్యానికి(ఆదేశాలకు) దగ్గరగా ఉన్నాయి. సగటు పన్నుల శాతం 38.7శాతానికి, డాలరు విలువతో సంబంధం ఉన్న పన్ను మొత్తం 23.6శాతానికి తగ్గింది. ప్రపంచబ్యాంకు చెప్పినదాని కంటే ఇంకా ఎక్కువగానే పన్నులను తగ్గించారు. రెండంకెల పన్నులను ఒక అంకెకు తగ్గిస్తామని యుపిఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ పూర్తిగా జరగలేదు.


సంస్కరణల గురించి రంజుగా చెబుతారని ముందే అనుకున్నాం. వారు చెప్పే అంశాలను ఒక్కసారి చూద్దాం.1991లో 84 కోట్ల మంది జనాభాకు కేవలం ఐదు కోట్ల మందికి మాత్రమే ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని రకాల ఫోన్లు 117 కోట్ల మందికి అందుబాటులోకి వచ్చాయి. డబ్బు కోసం మీరు ఈ రోజు బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు, సమీపంలోని ఎటిఎంకు వెళ్లి ఏ సమయంలో అయినా డబ్బు తీసుకోవచ్చు. ఫోన్‌ ద్వారా మీరు ఉన్న చోట నుంచి ఎవరికైనా, ఎక్కడికైనా పంపవచ్చు. ఇప్పుడు 82 కోట్ల డెబిట్‌ కార్డులు, 5.7 కోట్ల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. జేబులు ఎత్తుగా డబ్బు కట్టలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీవీ తొలిసారిగా 1959లో వచ్చినపుడు దూరదర్శన్‌ విద్యా సంబంధమైన ఒక గంట కార్యక్రమం వారానికి రెండుసార్లు ప్రసారం చేసేవారు. ఆరు సంవత్సరాల తరువాత రోజుకు నాలుగు గంటలు అవి కూడా ప్రధానంగా వార్తా కార్యక్రమాలు మాత్రమే. వచ్చేవి, అదే ఇప్పుడు పదిహేను భాషల్లో నాలుగు వందలకు పైగా వార్తా ఛానళ్లతో సహా 926 ఛానళ్లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి.


నిజమే ఈ అభివృద్దిని ఎందుకు కాదనాలి, కళ్ల ముందు కనిపిస్తుంటే ఎలా అంటాం ? సంస్కరణలు ఎందుకు అంటే మనకు చెప్పింది వీటిని గురించా ? కానే కాదు. ఉపాధి, దారిద్య్ర నిర్మూలన, అభివృద్ది మంత్రాన్ని జపించారు. జరిగిందేమిటి ? అభివృద్ధి చెందిన దేశాల లక్షణం ఏమిటి ? వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నవారు తగ్గిపోయి, వస్తూత్పత్తి, సేవారంగాల ఉపాధి పెరగటం. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా వేతనాలు తక్కువ, కాంట్రాక్టు లేదా తాత్కాలిక ఉపాధి, భారీ పెట్టుబడులు-తక్కువ మందికి ఉపాధి, ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. బిఏ అంటే బొత్తిగా అన్యాయం, ఎంఏ అంటే మరీ అన్యాయం అనే రోజులు పోయి అంతకంటే ఎక్కువగా ఇంజనీరింగ్‌ పట్టాలు పెరిగాయి. వారి పరిస్ధితి ఏమిటి ? మరీ ఘోరంగా ఉంది. మంచి వేతనాలు పొందిన వారిలో గతంలో బిఏలు, ఎంఎలు ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్‌ ఉన్నా రోజు వారి సాధారణ కార్మికుడికి పని దొరికిన రోజుల్లో వస్తున్న వేతనాలు కూడా చాలా మందికి రావటం లేదు.


సెల్‌ఫోన్లు, టీవీ ఛానళ్లు, ఏటిఎంలు ఉపాధి చూపవు, తిండి పెట్టవు అని తేలిపోయింది. పరిశ్రమల్లో ఇచ్చే వేతనాలు గౌరవ ప్రదమైన జీవితాలను గడిపేందుకు అనువుగా లేవు. ఇదే సమయంలో ఐటి వచ్చింది. ఆ రంగంలో వేతనాలు, విదేశీ అవకాశాలు ఉండటంతో తలిదండ్రులు, యువత పొలోమంటూ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ వైపు వెళ్లారు. ఇప్పుడు ఆ రంగంలో కూడా పరిస్ధితి తారుమారైంది.కొద్ది మందికి ఇప్పటికీ మెరుగైన పరిస్ధితే ఉన్నా అత్యధికులు అరకొర జీతాలకే శ్రమను అమ్ముకోవాల్సి వస్తోంది. వారంతా చిరు, నిరుద్యోగ చౌరస్తాలో ఉన్నారు. 2011లో యుపిఏ ప్రభుత్వం ఒక జాతీయ వస్తు తయారీ విధానాన్ని ప్రకటించింది. దాని ప్రకారం 2022 నాటికి జిడిపిలో 15శాతంగా ఉన్న వస్తూత్పత్తి వాటాను 25శాతానికి పెంచాలని, తద్వారా కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. 2014లో మోడీ గారు అధికారానికి వచ్చి దాని పేరు మార్చి కొత్తగా మేకిన్‌ ఇండియా అని నినాదంగా ప్రచారం చేశారు.గడువు కంటే ముందుగానే ఆమేరకు పెరిగింది. దానిలో ఎవరి వాటా ఇంత అని వారు తేల్చుకోవచ్చు. కానీ ఉద్యోగాలు రాలేదే, జిడిపి వృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగు శాతానికి పడిపోయిందే. ఇదీ అసలు సమస్య. కరోనాకు ముందే నిరుద్యోగం 45 ఏండ్ల రికార్డును దాటిపోయింది. ప్రభుత్వాలు ఇప్పుడు కరోనా మాటున తమ వైఫల్యాలను దాస్తున్నాయి. ఎంతకాలం మూసిపెడతాయో చూద్దాం !


చైనా గురించి ఎవరైనా ఏదైనా చెబితే దానికి ఒక ముద్రవేయటం లేదా చెప్పేదంతా వాస్తవం కాదు అనేవారు మనకు ఎక్కడబడినా తారసపడతారు. చైనాలో కార్మికుల వేతనాలు పెరిగాయి గనుక అనేక విదేశీ కంపెనీలు అక్కడి నుంచి బయటకు వస్తున్నాయి, అవి మన దేశానికి వస్తాయి అని ఏడాది క్రితం స్వయంగా ప్రధాని మోడీయే చెప్పారు. అందుకోవటానికి సిద్దంగా ఉండాలని రాష్ట్రాలను కోరారు. దీని అర్ధం ఏమిటి ? అంకెలతో పని లేదు. అక్కడితో పోల్చితే మన దగ్గర వేతనాలు తక్కువ అనే కదా ! లేకపోతే ఎందుకు వస్తారు ? లేబర్‌ కోడ్‌ పేరుతో కార్మిక చట్టాలను నీర్చుగార్చబోతున్నాం వాటిలో కొన్ని ఉన్నా అమలు గురించి పట్టించుకోం అనే సూచనలు ఇస్తున్నా వస్తున్నవారు లేరు. చైనా నుంచి ఒకరూ అరా బయటికి వచ్చినా వేరే దేశాలకు పోతున్నారు తప్ప మన దేశానికి రావటం లేదు.


2000 సంవత్సరం నుంచి మన దేశంలో నిజ వేతనాలలో పెరుగుదల లేదని లెక్కలు చెబుతున్నాయి. పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికుల పెరుగుదల ఒక కారణమని 2017లో అంతర్జాతీయ కార్మిక సంస్ధ చెప్పింది. సంఘటిత రంగంలో 1997-98లో కాంట్రాక్టు కార్మికులు 16శాతం ఉంటే 2014-15 నాటికి 35శాతానికి పెరిగినట్లు పరిశ్రమల వార్షిక సర్వేలు వెల్లడించాయి. వారికి ఎలాంటి సంక్షేమ పధకాలు, చట్టాలు వర్తించవు. దీన్ని మరోవిధంగా చెప్పాలంటే సంఘటిత రంగంలో 2000-01లో7.75 మిలియన్ల మంది ఉపాధి పొందితే 2015-16 నాటికి 13.26 మిలియన్లకు పెరిగారు. దీన్ని బట్టి కాంట్రాక్టు కార్మికుల సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. దీని వలన వేతనాలు, హక్కుల కోసం పోరాడేశక్తి కూడా కార్మిక సంఘాలకు తగ్గిపోతోంది.ఒక యజమాని ఒక కార్మికుడిని తొలగిస్తే ఆ స్ధానంలో పని చేసేందుకు పదిమంది సిద్దంగా ఉన్నారు, ఒకరు నిచ్చెన ఎక్కితే ఇరవై మంది కింద ఉండిపోతున్న పరిస్ధితి ఉన్నపుడు వేతనాల కోసం బేరమాడే శక్తిగానీ, సంఘాలలో చేరి సంఘటితం అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి.

నూతన సాంకేతిక పరిజ్ఞానం నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నది నిజం. దానికి సంస్కరణలే అవసరం లేదు.టెలికాం రంగంలో ప్రయివేటు సంస్ధలను అనుమతించిన కారణంగా పది నుంచి 30లక్షల వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కొన్ని సంస్దలు అంచనాలు వేశాయి. జిరాక్సు మెషిన్లు రావటంతో ప్రతి పెద్ద గ్రామం మొదలు పట్టణాల్లో వాటిని వినియోగిస్తున్నారు. కొందరికి ఉపాధి కలిగిన మాట నిజం. ఎక్కడో తప్ప కేవలం జిరాక్స్‌ మిషన్‌ మీద వచ్చే ఆదాయంతోనే బతుకు వెళ్లదీయటం సాధ్యం కాని వారు, నెట్‌, లామినేషన్‌ వంటి వాటిని కూడా జతచేశారు. టెలికాం రంగంలో ప్రయివేటు కంపెనీలు ఉపాధి కల్పించాయి, పోగొట్టాయి. రిలయన్స్‌ కంపెనీ 52వేల మందికి ఉద్యోగాలు కల్పించి అది పోటీకి తట్టుకోలేక మూతపడటంతో మొత్తం సిబ్బందిని తొలగించింది. రిలయన్స్‌ టెలికమ్యూనికేషన్స్‌ మూత పడిన లేదా వేరేదానిలో విలీనం తరువాత రిలయన్స్‌ జియో వచ్చింది. అది కొన్ని కొత్త ఉద్యోగాలను కల్పిస్తే దాని పోటీకి తట్టుకోలేని మిగతా సంస్దలు ఆ మేరకు సిబ్బందిని ఇంటికి పంపి ఖర్చులను తగ్గించుకున్నాయి. కొన్ని విలీనమయ్యాయి, దాంతో సిబ్బంది మరింత తగ్గారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను ఎలా ఇంటికి పంపిందో తెలిసిందే. ఇక టెలికాం సేవారంగం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించినట్లే ఉన్న ఉపాధిని కూడా పోగొట్టింది. సెల్‌ఫోన్లు రాక ముందు మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఎస్‌టిడి బూత్‌ ఏర్పాటు పధకాన్ని ప్రకటించింది, అమలు జరిపింది. ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా కనిపిస్తున్నాయా ? ఎంత మంది ఎస్‌టిడి బూత్‌లను నెట్‌ సెంటర్లుగా మార్చారు ? ఒక వేళ మార్చారే అనుకుందాం. ఒక రంగంలో పోయిన ఉపాధి మరోరంగంలో వచ్చింది.అదనం ఏమిటి ? టెలికాం, వస్తూత్పత్తి, వ్యవసాయం ఏ రంగంలో చూసినా ఆధునిక పరిజ్ఞానం,ఆటోమేషన్‌, రోబోల ప్రవేశం గత మూడు దశాబ్దాలలో పెద్ద ఎత్తున పెరిగింది.పెట్టుబడులు కూడా పెరిగాయి, కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. దాని వలన సంస్ధల యాజమాన్యాలకు ఖర్చులు తగ్గాయి, ఉత్పత్తి పెరిగింది. ఈ పోటీలో భారీ పెట్టుబడులు పెట్టలేనివారు తమ సంస్దలను మూసివేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న పరిశ్రమల మూత పెరిగింది. అందుకే మూడుదశాబ్దాల తరువాత మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటే ఇప్పుడు తలెత్తిన నిరుద్యోగం, కొనుగోలు శక్తి తగ్గిపోవటం, అది మాంద్యానికి దారిదీయటానికి కారణాలు ఏమిటి ? మనం చైనాతో పోటీ పడాలని చెప్పుకుంటున్నాం గనుక ఇదే సమయంలో చైనాలో అభివృద్ది రేటు ఒక ఏడాది ఒకశాతం తగ్గవచ్చు మరోఏడాది పెరగవచ్చు తప్ప మనం ఎదుర్కొంటున్న మాదిరి సమస్యలు అక్కడ లేవు. ఎందుకో అధ్యయనవేత్తలు చెప్పాలి, జనం ఆలోచించాలి.


మన దేశంలో టాటా మోటార్స్‌ కంపెనీ కోసం గతంలో రాష్ట్రాలు రాయితీలు ఇస్తామంటూ రాష్ట్రాలు ఎలా పోటీ పడ్డాయో చూశాము. తాజాగా కేరళకు చెందిన కిటెక్స్‌ కంపెనీకోసం కూడా అదే పద్దతిలో రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తెలంగాణా సర్కార్‌ సదరు కంపెనీ ప్రతినిధుల కోసం ప్రత్యేక విమానాన్ని కేరళకు పంపటాన్ని చూశాము. ఇన్నేండ్ల సంస్కరణల తరువాత మాంసం ముక్క కోసం కుక్కలు కొట్లాడుకున్న మాదిరి రాష్ట్రాలు పరిశ్రమల కోసం ప్రయత్నించటం సిగ్గు చేటు. ఈ పోటీ ఎంతవరకు పోతుంది? కేంద్ర ప్రభుత్వానికి, బాధ్యత, ఒక అభివృద్ది అజండా పద్దతి ఉంటే ఇలాంటి పోటీని సహిస్తుందా ? అభివృద్దిలో అసమానతలు పెరగవా ? చైనాలో పరిస్ధితి దీనికి భిన్నం. వారు ఎక్కడ పరిశ్రమలు పెట్టమంటే అక్కడ పెట్టటమా లేదా అన్నది కంపెనీలు తేల్చుకోవాలి. రాష్ట్రాలు కొట్లాడుకోవు. తొలి సంవత్సరాలలో కొన్ని అనువైన ప్రాంతాలలో పరిశ్రమలను ప్రోత్సహించిన తరువాత దేశంలో తలెత్తిన సమస్యను గమనంలో ఉంచుకొని వెనుక బడిన ప్రాంతాలలో మాత్రమే కొత్తవాటిని ప్రోత్సహిస్తున్నారు. అందుకు అంగీకారమైతేనే సంస్దలు పెడుతున్నారు. గ్రామీణ, టౌన్‌షిప్‌ సంస్దలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిచ్చిన ఫలితంగా వ్యవసాయంలో మిగులు ఉన్న శ్రామికులు వాటిలో చేరిపోయారు. ఈ సంస్ధలు అక్కడ అధ్బుతాలు సృష్టించాయి.


మన సంస్కరణలు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను తేలేకపోయాయి. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం 2004-05 నుంచి 2011-12 మధ్య గ్రామీణ ప్రాంతంలో కేవలం 12లక్షల ఉద్యోగాలు మాత్రమే పారిశ్రామిక రంగంలో పెరిగాయి. అదే చైనాలో 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య పది కోట్ల మందికి పని దొరికింది. మన వంటి దేశాలకు మరిన్ని పారిశ్రామిక ఉద్యోగాలు అవసరమని అందరూ అంగీకరిస్తారు. మూడు దశాబ్దాల సంస్కరణలు ఆ లక్ష్యాన్ని ఎంతమేరకు సాధించాయి.1980-2018 మధ్య ఈ రంగంలో ఉన్న కార్మికులు మొత్తం శ్రామిక శక్తిలో 30 నుంచి 10శాతానికి తగ్గిపోయారు.2019లో వ్యవసాయంలో 14 కోట్ల మంది, నిర్మాణ రంగంలో ఆరుకోట్ల మంది, ఉండగా పారిశ్రామికరంగంలో నాలుగు కోట్ల మంది ఉన్నట్లు సిఎంఐఇ విశ్లేషణ తెలిపింది. పెద్ద సంఖ్యలో నైపుణ్యం లేని కార్మికులు ఉన్నందున వారిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రత్యామ్నాయ విధానాలను వెతకాలని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు రైతుల బాగుకోసం కాదు. అధ్యయనాలు వెల్లడించిన అంశాల ప్రకారం రెండువేల సంవత్సరం తరువాత వాణిజ్యం వ్యవసాయం, అనుబంధ రంగాల వైపు మళ్లింది, పెరిగింది. దారిద్య్రం తగ్గింపులో ఇది గణనీయమైన పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఈ కారణంగానే వ్యవసాయంలో ప్రవేశించేందుకు విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు అవకాశాలు కల్పించేందుకే వ్యవసాయ చట్టాలు. ఇదే సమయంలో గత ఏడు సంవత్సరాలుగా వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.వృద్ది రేటు గిడసబారింది. వేతనాలు కూడా పెద్దగా పెరగలేదు. ఈ నేపధ్యంలో వ్యవసాయాన్ని కార్పొరేట్‌ జలగలకు అప్పగిస్తే అనే భయమే రైతాంగ ఉద్యమానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం నరేంద్రమోడీ సర్కార్‌ తలపెట్టిన మరిన్ని సంస్కరణలు మరింత మందిని ఉద్యమాల్లోకి తీసుకు వస్తుందా ? ఆర్ధిక వృద్దిని తిరోగమనం నుంచి పురోగమానికి తీసుకుపోతాయా ? ఏం జరగనుంది ? ఊహలు ఎందుకు, చూద్దాం !