Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చరిత్ర అడక్కు చెప్పింది విను ! ఇది ఒక సినిమాలో మాట.పాకిస్తాన్‌ జాతిపితగా పరిగణించే మహమ్మదాలీ జిన్నాను పొగిడినందుకు 2005లో ఎల్‌కె అద్వానీ పార్టీ అధ్యక్ష పదవిని పోగొట్టుకున్నారు. ఆ వ్యాఖ్యలకు ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వార్తలు వచ్చాయప్పుడు. కేంద్ర మంత్రిగా పని చేసిన జస్వంత సింగ్‌ రాసిన పుస్తకంలో జిన్నా గురించి చేసిన సానుకూల వ్యాఖ్యలకు గాను ఏకంగా పార్టీ నుంచే పంపేశారు. బిజెపి, అంతకు ముందు దాని పూర్వ రూపం జన సంఫ్‌ు చరిత్ర చూసినపుడు వారి పార్టీల గొప్పతనం కంటే తాము తప్ప ఇతర పార్టీలన్నీ ముస్లింలను సంతుష్టీకరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయన్న నిరంతర ప్రచారమే ఎక్కువగా ఉండేది. హిందువులు-ముస్లింల డిఎన్‌ఏ ఒకటే అని ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన భగవత్‌ జూలై నాలుగున వ్యాఖ్యానించారు. ఘజియాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురులోని ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ సమావేశంలో ఉపన్యసించారు. దీని గురించి అనేక విమర్శలు, సమర్దనలూ వెలువడ్డాయి.భారత్‌లో ఇస్లాం ప్రమాదంలో పడిందని ఎవరూ భయవలయంలో చిక్కుకోవద్దని, మతం ఏదైనా భారతీయుల డిఎన్‌ఏ ఒకటే అని, అసలు హిందూ-ముస్లిం ఐక్యత అనేదే తప్పుదారి పట్టించే మాట అని భగవత్‌ చెప్పారు. తరువాత జూలై 21న గౌహతిలో ఒక పుస్తక ఆవిష్కరణ సభలో కూడా దాన్ని పునరుద్ఘాటించారు. భిన్నమైన మతాలలో ఉన్నప్పటికీ శతాబ్దాల తరబడి కలసి మెలసి ఉన్నారని, ఆహార అలవాట్లు, సంస్కృతి ఒకటే అని చెప్పారు. ఇంతవరకు అద్వానీ, జస్వంత్‌ ఉదంతాలు పునరావృతం కాలేదు. అయ్యే సూచనలు కూడా లేవు.


భగవత్‌ ప్రసంగం మీద వెల్లడైన, ఇంకా వెల్లడవుతున్న కొన్ని స్పందనల తీరు తెన్నులు చూద్దాం. ముస్లింలకు సన్నిహితం అయ్యేందుకు చేసిన సంతుష్టీకరణ వ్యవహారమిది అన్నది కొందరి అభిప్రాయం. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా విరమించుకొనేందుకు మోహన్‌ భగవత్‌ తేదీని స్వయంగా ముందుకు జరిపారు అని మరుసటి రోజే మితవాద ప్రతీకగా ఉండే జర్నలిస్టు మధు కిష్వర్‌ ట్వీట్‌ చేశారు. ” హిందూ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్నదేమీ లేదు, వారు గాంధీ కంటే ఎక్కువ గాంధేయులుగా ఉన్నారు. స్వంత జనాలను, భావజాలాన్ని వారు రక్షించటం లేదు, వారు మంచి పిల్లలుగా కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి మద్దతు ఇవ్వటానికి మేమేమీ ఆర్‌ఎస్‌ఎస్‌ నేపధ్యం నుంచి వచ్చిన వాళ్లం కాదు, కానీ హిందువులను రక్షించే చిత్తశుద్ది వారిలో లేదని తరువాత కనుగొన్నాం. వారి కంటే కాంగ్రెస్‌ ఎంతో నిజాయితీగా ఉంది.” అన్నారు. సిబిఐ తాత్కాలిక ఉన్నతాధికారిగా పనిచేసిన సంఘపరివార్‌కు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం నాగేశ్వరరావు గౌహతిలో భగవతి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. ” కేవలం జిన్నాను పొగిడినందుకే అద్వానీని అవమానకరంగా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎంఆర్‌ఎం, సర్వధర్మ సంభవ్‌ లేదా సమాదరణ, ఒకే డిఎన్‌ఏ, రోటీ-బేటీ సంపర్క తదితరాల ప్రచారంతో హిందూ సమాజానికి అంత (అద్వానీ) కంటే పదిలక్షల రెట్ల హాని చేశారు.” అని ట్వీట్‌చేశారు.


వక్రీకరణలకు, తప్పుడు వార్తలకు పేరు మోసిన ఒపిఇండియా వెబ్‌ సైట్‌ రాసిన వ్యాసంలో డిఎన్‌ఏ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ గాంధియన్‌ బలహీనత (దోషం) అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతో గౌరవం పొందిన సంస్ధ. లౌకికవాదం అనే అబద్దం గురించి మేలుకున్న సామాన్య హిందువులను దూరం చేసుకొనే ప్రమాదాన్ని కొని తెచ్చుకొంటోంది అని హెచ్చరించారు. ”ఆర్‌ఎస్‌ఎస్‌ను స్ధాపించిన గురు గోల్వాల్కర్‌ దాన్ని ఒక హిందూ సంస్దగా ఏర్పాటు చేశారు తప్ప ముస్లింల కోసం కాదు. ముస్లింలు, క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరించాలని కూడా గోల్వాల్కర్‌ చెప్పారు. హిందువులు-ముస్లింలకు సంబంధం లేని ఆయన స్పష్టం చేశారు. ముస్లింల మీద ఇవన్నీ కొత్తగా వృద్ది చెందిన ఆలోచనలు ” అని నయా ఇండియా అనే పత్రికలో శంకర షరాన్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ” భగవత్‌ ప్రతి ఒక్కరి సంరక్షకుడు కాదు. ఆయన తన డిఎన్‌ఏ గురించి ఎలా అయినా మాట్లాడవచ్చు. బహుశా ఆయన ఔరంగజేబు డిఎన్‌ఏ పంచుకొని ఉండవచ్చు, అది అందరి విషయంలో వాస్తవం కాదు ” అని ఘజియాబాద్‌లోని దర్శన దేవి దేవాలయ వివాదాస్పద పూజారి యతి నరసింహానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ఇక విశ్వహిందూ పరిషత్‌ నేత సాధ్వి ప్రాచీ అయితే ” ఆవు మాంసాన్ని తినేవారెవరినీ ఎన్నడూ మనలో కనుగొనలేము” అన్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ నేత భగవత్‌ మీద ధ్వజమెత్తిన వారే కాదు, భజన చేసిన వారు కూడా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి పుస్తకాలు రాసిన రతన్‌ శారద ఆయన ఉపన్యాసంలో కొత్తగా చెప్పిన విషయాలేమీ లేవన్నారు. సుదర్శన్‌ గారు అధిపతిగా ఉన్న 2000-09లో కూడా హిందూాముస్లిం ఐక్యత గురించి చెప్పారు. అందుకోసమే ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ను ఏర్పాటు చేశారు.ఆహార అలవాట్లు, పూజా పద్దతులు వేర్వేరుగా ఉండవచ్చుగానీ ఏకీకరణ మీద అవి పెత్తనం చేయలేవు, మెజారిటీ, మైనారిటీ అనేవి లేవు. ప్రార్ధించే పద్దతిని బట్టి సమాజంలో వర్గీకరణ చేయటమే ముస్లింల సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాలకు కారణం, ఆర్‌ఎస్‌ఎస్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నది ” అన్నారు. భగవత్‌ డిఎన్‌ఏ ఉపన్యాసంతో తలెత్తిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సంఘీయులు ఊహించినట్లుగానే సాము గరిడీలు చేస్తున్నారు. గురూజీ హిందూత్వను వదులుకున్నట్లు ప్రకటించలేదు, దానికే కట్టుబడి ఉన్నారు, ఐక్యతను మాత్రమే కోరుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్‌, ఇతర హిందూ సంస్ధలు చేపట్టిన ఘర్‌వాపసీ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించిన అంశాన్ని గుర్తు తెచ్చుకోండి. గోవధ హిందూత్వ వ్యతిరేకం అని కూడా చెప్పారు. సంఫ్‌ు ఇంతకాలంగా చెబుతున్నదానిని-భగవత్‌ ప్రసంగాన్ని విడదీసి చూస్తే కొత్తగా చెప్పినట్లు అనిపించవచ్చు తప్ప కొత్తేమీ లేదు అంటూ మొత్తం మీద సంఫ్‌ు అజెండాలో ఎలాంటి మార్పూ లేదు కనుక ఎవరూ కంగారు పడనవసరం లేదనే భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.భగవత్‌ ప్రసంగాన్ని విమర్శించిన వారిని ఎక్కడా తప్పు పట్టటం లేదు. ఆయన మాట్లాడింది ముస్లింలు పాల్గొన్నసభ, ఐక్యతను కోరుకుంటున్నది, రెండు మతాల మధ్య ఒక చర్చను ప్రారంభించాలనే లక్ష్యంతో మాట్లాడినవిగా గుర్తించాలని ఓదార్పు పలుకుతున్నారు. భారతీయత గురించి మాట్లాడటం అంటే దాని అర్ధం ముస్లింలు, ఇతర మైనారిటీలను తిరిగి మతమార్పిడి చేస్తామని కాదు, వారు ఈ గడ్డను స్వంతంగా చేసుకొని, విధేయులై జీవించాలన్నదే అని ముస్లింలకు హామీ ఇస్తున్నారు.


అయితే ఇప్పుడెందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత డిఎన్‌ఏ, హిందూ ముస్లిం ఐక్యత అంశాన్ని మరోసారి ముందుకు తెచ్చారు. ఊరకరారు మహాత్ములు అన్నట్లుగా ఎలాంటి ఉద్దేశ్యం లేకుండానే అలా మాట్లాడతారా ? ప్రతి పార్టీ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకొనేందుకు ప్రయత్నించటం రాజకీయాల్లో సహజం. బిజెపి పత్తిత్తేం కాదు. మెజారిటీగా ఉన్న హిందూ మత ఓటు బ్యాంకును సృష్టించుకొనేందుకు దాని మాతృ సంస్ధ సంఘపరివార్‌ ఎంచుకున్న మార్గం వారి సంతుష్టీకరణ. హిందువుల ఉనికికే ప్రమాదం ముంచుకు వస్తోందని, కొద్ది కాలంలో ముస్లింలు మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని ప్రచార యుద్దం చేస్తున్న విషయం తెలిసిందే. సాధ్వి ప్రాచీ ఎవరు ఎంత మంది భార్యలను అయినా కలిగి ఉండండి, పిల్లలు మాత్రం ఇద్దరి కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పారు. 1990దశకం చివరిలో వాజ్‌పాయి అధికారానికి వచ్చారు. అందువలన భవిష్యత్‌లో 14శాతంగా ఉన్న ముస్లిం ఓట్లను గంపగుత్తగా ప్రతిపక్షాలకు వేయించటం మంచిది కాదు గనుక వారి పట్ల రాగం, తానం, పల్లవి మార్చాలనే ఆలోచన సంఘపరివార్‌లో ప్రారంభమైంది. ఈ సమయంలోనే 2002 మార్చినెలలో జరిగిన గుజరాత్‌ మారణకాండ ముస్లింలలో మరింత భయాన్ని రేకెత్తించటమే కాదు, బిజెపికి పెద్ద మచ్చగా మారింది. అంతకు ముందు వరకు ఇతర పార్టీల మీద తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ముస్లిం సంతుష్టీకరణకు తానూ నాంది పలికింది. అదే ఏడాది డిసెంబరులో ముస్లిం రాష్ట్రీయ మంచ్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ కొత్త దుకాణాన్ని తెరిచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో అంతకు ముందు వచ్చిన ఓట్లు సీట్లను కూడా బిజెపి నిలుపుకోలేకపోయింది. ఎన్నికలకు మూడు నెలల ముందే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భగవత్‌ అదే ఏడాది డిసెంబరులో తొలిసారిగా డిఎన్‌ఏ ప్రస్తావన చేశారు. ఆ సమయంలో బిజెపి, దాని అభిమానులు ఓటమి విషాదంలో ఉన్నారు గనుక పెద్దగా పట్టించుకోలేదనిపిస్తుంది.
ఇటీవలి కాలంలో అభిమానులు విశ్వగురువుగా కీర్తించే నరేంద్రమోడీ పరువు ప్రపంచ వ్యాపితంగా పోయింది. అసహనం, ఢిల్లీ దాడులు, రైతుల ఉద్యమం సందర్భంగా రోడ్లపై మేకులు కొట్టటాలు, టూల్‌కిట్‌ కేసులు, కరోనాను నిర్లక్ష్యంలో పేరుమోసిన ప్రపంచ నేతల్లో ఒకరిగా మోడీ పేరు చేరటం వంటి అనేక కారణాలు అంతర్జాతీయంగా, జాతీయంగా పలుకుబడిని మసకబార్చాయి. మోడీ ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతు ఉంటేనే మోడీకి పదవి అన్నది స్పష్టం కనుక పరస్పరం రక్షించుకోవటంలో భాగంగా మోహన్‌ భగవత్‌ డిఎన్‌ఏ సుభాషితాలకు తెరతీశారన్నది కొందరి అభిప్రాయం.
అన్నింటి కంటే ముఖ్యమైనది ఆఫ్ఘనిస్తాన్‌ పరిణామాలు అన్నది మరో బలమైన అభిప్రాయం. సంపాదించే ఇంటి యజమాని కరోనాతో అనూహ్యంగా మరణిస్తే ఆ కుటుంబం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో ఇప్పుడు నరేంద్రమోడీ అదే స్ధితిలో ఉన్నారు. రవి గాంచనిది అజిత్‌ దోవల్‌కు కనిపించింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో మన ప్రభుత్వం సయోధ్య కుదుర్చుకుంది. ఒకేసారి పాక్‌, చైనాలతో వైరుధ్యం కొనసాగించటం సాధ్యం కాదు కనుక ఈ ఏర్పాటు అని కొందరు చెబితే, తాలిబాన్ల సమస్య దానికి పురికొల్పిందన్న వారు మరికొందరు. ఏ ఉగ్రవాదం మీద పోరు సలుపుతామని మోడీ సర్కార్‌ అమెరికాతో కలసి భీకర ప్రతిజ్ఞలు చేసిందో, ఆ ఉగ్రవాద తాలిబాన్లతో తెరముందు -వెనుక మంతనాలు ప్రారంభించింది. అమెరికా ట్రంపు లేడు, తిరిగి వచ్చే అవకాశాలూ లేవు, జో బైడెన్‌తో ఇంకా కౌగిలింతలు ప్రారంభం కాలేదు. చైనాతో సయోధ్యగా ఉంటామని ఆ తాలిబాన్లు ఏకపక్షంగా ప్రకటించటమే కాదు బీజింగ్‌ వెళ్లి మరీ ఆ దేశ నేతలను కలసి వచ్చారు. ఈ నేపధ్యం కూడా దేశంలోని ముస్లింలను సంతుష్టీకరించాల్సిన అవసరం ఉందని సంఘపరివార్‌ ఆలోచించి ఉండవచ్చన్నది కొందరి అభిప్రాయం. ఈ దశలో దేన్నీ తోసిపుచ్చలేము.
2009 డిసెంబరు నాలుగున ఢిల్లీలోని బాబా సాహెబ్‌ ఆప్టే స్మారక సమితి దేశ విభజన గురించి ఒక జాతీయ గోష్టిని ఏర్పాటు చేసింది. దానిలో మోహన భగవత్‌ ఒక వక్త.దేశంలో నివసిస్తున్న వారందరూ హిందూ వారసులే, ఈ ప్రాంతంలోని వారందరి డిఎన్‌ఏ ఒకటే అని సైన్సు కూడా నిరూపించింది. మనం కోరుకుంటే జాతీయ ఐక్యత మరియు ఏకత్వాన్ని పునరుద్దరించవచ్చు, మనల్ని విడదీస్తున్న విబేధాలను తొలగించుకోవచ్చు అని భగవత్‌ చెప్పారు. సరే హిందూత్వ గురించి అంతకు ముందు నుంచీ చెబుతున్నవాటినే పునశ్చరణ చేశారు. ఆ గోష్టిలో పాల్గొన్నవారందరూ కాషాయ దళానికి చెందిన వారే. ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ నివేదించినదాని ప్రకారం బిజెపి నేత విజయకుమార్‌ మల్హోత్ర చేసిన ప్రసంగం ఎలా ఉందో చూడండి.ఐక్యతా యత్నాలతో పాటు దేశంలో నేడున్న పరిస్దితిని కూడా చూడాలంటూ ” హిందువుల జనాభా 90 నుంచి 80శాతానికి తగ్గింది. ముస్లింలు 13శాతానికి పెరిగారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ముస్లింలు అధికులుగా ఉన్నారు. జాతీయ సంపదల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని చివరికి ప్రధాని కూడా బహిరంగంగా చెబుతున్నారు. ఇది సిగ్గు చేటు. పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ముస్లిం జనాభా ప్రస్తుతం దేశంలోని ముస్లింలను కలుపుకుంటే మొత్తం నలభైశాతానికి పెరుగుతారు, అప్పుడు హిందువుల పరిస్ధితి ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.” అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గోవులను తరలిస్తున్నారనో, గో మాంసం తింటున్నారనే సాకుతోనో గోరక్షకుల పేరుతో ముస్లింలను వధించటం తెలిసిందే. మోహన్‌ భగవత్‌ తన ప్రసంగంలో గోవులను వధించటం హిందూత్వకు వ్యతిరేకం అన్నారు. ఇది ఎదురుదాడి, గోరక్షణలో వాటిని వధించేవారి కంటే రక్షించేవారే ఎక్కువ మంది మరణిస్తున్నారని పరివార్‌ ప్రచారం తెలిసిందే. ముస్లింలందరూ గోవులను వధించకపోయినా వధిస్తున్నవారందరూ ముస్లింలే అని మాట్లాడుతున్నారు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాకపోయినా ఉగ్రవాదులందరూ ముస్లింలే అనే ప్రచారం తెలిసిందే. ఉగ్రవాదం, చర్యలు ఇస్లామ్‌కు వ్యతిరేకం అని అనేక సంస్ధలు ప్రకటించాయి. ఇలాంటి మాటలను ఎవరు చెప్పినా తప్పు పట్టాల్సిన పని లేదు. ఆచరణ ఏమిటన్నదే ముఖ్యం.


తాము మారిపోయామని చెప్పుకొనేందుకు, బిజెపికి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పడుతున్న తంటాలు ఒకటి రెండు కాదు, టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నింటినీ ప్రయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతుల్లో ఎంఎస్‌ గోల్వాల్కర్‌కు ప్రత్యేక స్దానం ఉంది. రెండవ అధిపతిగా దీర్ఘకాలం ఉన్నారు. బంచ్‌ ఆఫ్‌ థాట్స్‌(ఆలోచనల గుత్తి ) పేరుతో ఆయన హిందూత్వ గురించి రాసిన అంశాలు పరివార్‌కు ప్రామాణికాలుగా ఉన్నాయి. రెండవసారి నరేంద్రమోడీ సర్కార్‌ తిరిగి అధికారానికి వచ్చే అవకాశాల్లేవనే అభిప్రాయం సర్వత్రా వెల్లడి అవుతున్న తరుణంలో ఎన్నికలకు ఆరునెలల ముందు 2018 సెప్టెంబరులో విజ్ఞాన్‌ భవన్‌లో మూడు రోజుల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఉపన్యాసాల కార్యక్రమం జరిగింది. చివరి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో మారిన పరిస్ధితులకు అనుగుణ్యంగా లేని గోల్వాల్కర్‌ చెప్పిన అంశాలను కొన్నింటిని తిరస్కరిస్తున్నట్లు భగవత్‌ చెప్పారు. ఇదేదో అనాలోచితంగా చెబుతున్నది కాదు, కొన్ని సంవత్సరాలుగా సంఫ్‌ు అంతర్గత మధనంలో ఉన్నదే, ఇప్పుడు బయటికి చెబుతున్నా, అందరికీ తెలియాల్సిన సమయం అసన్నమైందన్నారు. కొన్ని సందర్భాలలో చెప్పిన మాటలు అప్పటికి తగినవి కావచ్చు, అవే శాశ్వతంగా ఉండవు, కాలాలతో బాటు ఆలోచనలు కూడా మారుతుంటాయి.మారేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్దాపకుడు డాక్టర్‌ హెడ్గెవార్‌ అనుమతి ఇచ్చారు అన్నారు. అదే భగవత్‌ ఏడాది తరువాత 2019 అక్టోబరు 2న ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌కు హెడ్గేవార్‌ ప్రవచించిన హిందూ రాష్ట్ర తప్ప ప్రత్యేక సిద్దాంతం, సిద్దాంతకర్తలంటూ ఎవరు లేరు అని చెప్పారు. గోల్వాల్కర్‌ రాసిన ఆలోచనల గుత్తి పుస్తకంతో సహా ఏదీ ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రతినిధి కాదు, హెడ్గెవార్‌ కూడా సంఘగురించి తనకు పూర్తిగా తెలుసని ఎప్పుడూ చెప్పలేదు, అర్ధం చేసుకోవటం ప్రారంభించానని మాత్రమే చెప్పారు అని భగవత్‌ చెప్పారు. అందువలన గోల్వాల్కర్‌నే కాదంటున్న వారు రేపు మరో అధిపతి వచ్చిన తరువాత డిఎన్‌ఏ సిద్దాంతం కూడా మారదని భగవత్‌తో సహా ఎవరూ చెప్పలేరు. హిందూ రాష్ట్రతప్ప ప్రతిదీ మారుతుంటుంది, దానికోసం దేనికైనా సిద్దపడతారు.


అసలు సంతుష్టీకరణ అన్నదానిని కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ విదేశాల నుంచి అరువు తెచ్చుకున్నదే అని చెప్పవచ్చు.జర్మన్‌ కార్మికులు కమ్యూనిస్టుల వైపు ఎక్కడ మొగ్గుతారో అనే భయంతో వారిని సంతుష్టీకరించేందుకు మొదటి ప్రపంచ యుద్దం తరువాత ” నేషనల్‌ సోషలిస్టు జర్మన్‌ వర్కర్స్‌ పార్టీ ”ని 1920లో ఏర్పాటు చేశారు.ఒక ఏడాది పాటు వేరే అతను అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ 1921నుంచి 1945వరకు హిట్లర్‌ అధిపతిగా ఉన్నాడు.మెజారిటీ జర్మన్లను యూదుల మీద రెచ్చగొట్టటం, కుహనా జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావటం వంటి అంశాలన్నీ తెలిసినదే. మన దేశంలో యూదులు లేరు గనుక హిందూత్వ శక్తులు ముస్లింలను ఎంచుకున్నాయి. అందువలన ఆ విధానాలన్నీ విదేశీ హిట్లర్‌ నుంచి అరువు తెచ్చుకున్నారని అంటే ఎవరూ ఉడుక్కోనవసరం లేదు. దానికి కాంగ్రెస్‌ అనుసరించిన దివాలా కోరు విధానాలు అవి పెరగటానికి దోహదం చేశాయి. హిందువుల చట్టాల్లో జోక్యం, మార్పులు చేసిన మాదిరి ఇతర మతాల వారి విషయంలో జరగలేదని సంఘపరివార్‌ చేస్తున్న ప్రచారాన్ని షా బానో కేసులో సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ప్రభుత్వం వమ్ము చేయటం నిర్దారించింది. వివాదాస్పద బాబరీ మసీదు గేట్లను తెరిచేందుకు రాజీవ్‌ గాంధీ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం మెజారిటీ హిందువులను సంతుష్టీకరించేందుకే అన్నది స్పష్టం.1989 ఎన్నికల ప్రచారాన్ని తొలుత నాగపూర్‌ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ వేదికను అయోధ-ఫైజాబాద్‌కు మార్చటం ఆ రాజకీయాల కొనసాగింపే అన్నది స్పష్టం. తొలుత మైనారిటీ సంతుష్టీకరణ తరువాత మెజారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది. చివరికి రెండిటికీ చెడ్డ రేవడిలా మారటాన్ని చూశాము.


కాంగ్రెస్‌కు భిన్నంగా సంఘపరివార్‌-బిజెపి తొలుత మెజారిటీ సంతుష్టీకరణ-మైనారిటీ విద్వేషాన్ని రెచ్చగొట్టింది. అధికారం వచ్చాక దాన్ని నిలుపు కొనేందుకు ఇప్పుడు మైనారిటీ సంతుష్టీకరణకు పూనుకుంది.నిత్యం ముస్లింలు, ఇతర మైనారిటీల పట్ల విద్వేష ప్రసంగాలు, ప్రచారం చేసే వారందరూ ఆర్‌ఎస్‌ఎస్‌ అంశ నుంచి వచ్చిన వారు లేదా అది తయారు చేసిన ప్రచార వైరస్‌ బాధితులే. దేశం మొత్తాన్ని మెజారిటీ మతోన్మాద పులిని ఎక్కించేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. వామపక్షాలు మినహా రాజకీయంగా బిజెపిని వ్యతిరేకించే ఇతర పార్టీల వారు కూడా గణనీయంగా పులిని ఎక్కారు. చెవులు కొరుకుతారు తప్ప బహిరంగంగా చెప్పరు. ఈ నేపధ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ వ్యాఖ్యలలో నిజాయితీ ఉందా ? రెండు మతాలవారూ కలసి మెలసి ఉండాలని, డిఎన్‌ఏ ఒకటే అని చెబుతున్నవారు ఆర్‌ఎస్‌ఎస్‌లో ముస్లింలకు చోటు, నాయకత్వంలో భాగస్వామ్యం కల్పించ కుండా ఇతర వేదికలను ఎందుకు ఏర్పాటు చేసినట్లు ? ఇంతకాలం తాము నిర్వహించిన విద్వేష ప్రచారానికి స్వస్తి పలుకుతామని, ఇంతకు ముందు చేసిన దానికి చెంపలు వేసుకుంటున్నామని చెప్పి ఉంటే కాస్తయినా విశ్వసనీయత ఉండేది ! అవేమీ లేవు. అందుకే టక్కు టమార విద్యలని అనాల్సి వస్తోంది, కాదంటారా !