Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనాతో సరిహద్దు వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవటం మినహా మరొక మార్గం లేదని తేలిపోయింది. ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా గాల్వన్‌ ఉదంతం తరువాత రెండు దేశాల మధ్య మరో ఘర్షణకు తావు లేకుండా ఇప్పటి వరకు 12 దఫాల చర్చలు జరపటమే అందుకు నిదర్శనం. పరస్పరం విశ్వాసం కుదిరి రెండు వైపులా మోహరించిన సేనల ఉపసంహరణ జరిగేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. చర్చలు ఒకవైపు జరుపుతూనే మరోవైపు ఉభయ దేశాలూ సరిహద్దు వెంట బలాలను మోహరిస్తున్నాయి. ఎవరు ముందు, ఎవరు వెనుక అన్నది పక్కన పెడితే ఎవరి సైనికులను వారు ఉత్సాహపరిచేందుకు లేదా నైతికంగా మద్దతు ప్రకటించేందుకు ఉభయ దేశాల నేతలు సరిహద్దు సందర్శనలు చేశారు. ఎవరి జాగ్రత్త వారు పడాలనటంలో ఎలాంటి పేచీ లేదు. పరస్పరం అనుమానాలను పెంచినప్పటికీ ఈ చర్యలు తప్పదు. యుద్దం జరిగే అవకాశాలేమీ లేవు, అందుకు ఎవరూ సిద్దంగా లేరు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గత నెలాఖరులో మన దేశ సందర్శనకు వచ్చారు. రావటాన్ని తప్పు పట్టనవసరం లేదు, వచ్చి ఏం చేశాడనేదే సమస్య.


ఈ సమావేశాల తరువాత ఢిల్లీలోని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె డోర్జీ డామడుల్‌ వివిధ మీడియా సంస్ధల ప్రతినిధులతో మాట్లాడాడు.గెషె గతంలో దలైలామాకు దుబాసీగా వ్యవహరించాడు. పౌర సమాజంతో కలయిక పేరుతో జరిగిన సమావేశంలో అమెరికా మంత్రి బ్లింకెన్‌ పాల్గొన్నాడు.ఈ సందర్భంగా దలైలామా ప్రతినిధి, టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వంలో కీలక వ్యక్తి అయిన గోడుప్‌ డోంగ్‌ చంగ్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యాడు. చైనా విస్తరణ వ్యూహాన్ని అమెరికా, భారత్‌ ఐక్యంగా దెబ్బతీయాలని,ప్రపంచ శాంతికి చైనా శత్రువు అని టిబెట్‌ హౌస్‌ డైరెక్టర్‌ గెషె ఆరోపించాడు. టిబెట్‌కు అమెరికా మద్దతు ఇవ్వటం చైనా కమ్యూనిస్టు పార్టీని నిలువరించేందుకే అని ప్రపంచానికి బలమైన సందేశం ఇవ్వటమే అని కూడా అన్నాడు.ప్రపంచంలో ప్రజాస్వామ్య సూత్రాలు, చట్టాలు, నాగరికతను చైనా నాశనం చేస్తున్నదని, టిబెట్‌కు ఏం జరిగిందో ప్రపంచానికి అదే జరుగుతుందని ఆరోపించాడు.


పాక్‌ ఆక్రమిత కాశ్మీరులో జరిపిన ఎన్నికలు, తాలిబాన్ల ప్రతినిధులు చైనా సందర్శన, చైనా-పాక్‌ అర్ధిక నడవా గురించి మన దేశం స్పందించింది. ఆక్రమించిన ప్రాంతాలన్నింటి నుంచి పాక్‌ వైదొలగాలని మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్జీ డిమాండ్‌ చేశారు. ఆక్రమిత ప్రాంతంలో ఎన్నికలు మసిపూసి మారేడు కాయ చేయటం తప్ప మరొకటి కాదు, చట్టవిరుద్దం అన్నారు. దీని గురించి తీవ్ర నిరసన తెలిపామన్నారు. ఆ ఎన్నికలను స్ధానికులు నిరసించి తిరస్కరించారన్నారు. చైనా-పాక్‌ ఆర్ధిక నడవా అక్రమంగా పాకిస్తాన్‌ ఆక్రమించిన మన ప్రాంతం నుంచి పోతున్నదని చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలలో యథాతధ స్దితిలో మార్పు చేయటాన్ని అంగీకరించబోమన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ మన దేశాన్ని సందర్శించిన సమయంలోనే తాలిబాన్ల ప్రతినిధులు బీజింగ్‌లో చైనా విదేశాంగ అధికారులను కలిశారు. తమ గడ్డను మరో దేశానికి వ్యతిరేకంగా వినియోగించుకొనేందుకు అంగీకరించేది లేదని వారు అంతకు ముందే ప్రకటించారు. ఏకపక్షంగా మరో దేశం ఆప్ఘనిస్తాన్‌ మీద తమ వాంఛలను రుద్దటాన్ని భారత్‌ అంగీకరించదని, అలాంటి చర్య అక్కడ స్ధిరత్వాన్ని, చట్టబద్దతను కల్పించదని మన ప్రతినిధి అరిందమ్‌ అన్నారు. గత రెండు దశాబ్దాలుగా సాధించిన విజయాలను పరిరక్షించాలని చెప్పారు.


టిబెట్‌ లేదా చైనా విషయంలో భారత్‌ చేయాల్సినంతగా చేయటం లేదని,తన ప్రయోజనాలను సాధించుకొనేందుకు టిబెట్‌ సమస్యను భారత్‌ ఉపయోగించుకోరాదని మన దేశంలోని టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వ నూతన అధ్యక్షుడు పెంపా సెరింగ్‌ అన్నారు. మే నెలలో తాను ఎన్నికైన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దౌత్య, రాజకీయ అవసరాల కోసం టిబెట్‌ను ఉపయోగించుకోరాదని ఇప్పుడు భారత్‌ గుర్తిస్తున్నదని, ఇప్పటి వరకు అదే చేశారని, దానికి బదులు సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలన్నాడు.అసలు భారత్‌ – చైనా మధ్య సరిహద్దే లేదని అది టిబెట్‌ -భారత్‌ మధ్య సరిహద్దు అన్నాడు. ఆ రీత్యా చైనాకు భూమి దక్కదన్నాడు. దీర్ఘకాలంగా భారత దేశం చైనా పట్ల సానుకూలంగా ఉందని, అయితే భారతీయుల మనోభావాలను చైనా గాయపరచిందన్నాడు. సెరింగ్‌ కర్ణాటకలోని టిటెట్‌ శరణార్దుల శిబిరం బయలకుప్పెలో జన్మించాడు.


తాలిబాన్ల చేతుల్లో చావు దెబ్బలు తినటం లేదా వారిని అణచివేయటంలో వైఫల్యంతో అమెరికా, దాని మిత్రపక్షాలు వారికి ఒక సలాంగొట్టి తమ మిలిటరీని ఉపసంహరించుకొనేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లుగా వారిద్దరూ బాగానే ఉన్నారు, మనకు సమస్యను తెచ్చిపెట్టారు. తాము తప్పుకుంటూ తాలిబాన్లతో పోరాడే బాధ్యతను మనకు అంట గట్టేందుకు అమెరికా తెలివిగా పావులు కదిపింది. ఇప్పటికీ వదలటం లేదు. నరేంద్రమోడీని ”దేశపిత ” అని కీర్తిస్తూ మనలను మునగ చెట్టు ఎక్కించటంలో గతంలో ట్రంప్‌ ఏమి చేశాడో ఇప్పుడు బైడెన్‌ కూడా అదే బాటలో ఉన్నాడు. లేకపోతే ఢిల్లీ వచ్చిన బ్లింకెన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ స్ధిరత్వానికి, అభివృద్దికి భారత్‌ ఎంతో చేయాల్సి ఉంది, కొనసాగిస్తుంది అని చెప్పడు. ఆ సమస్య మనలను వదిలేట్లు లేదు. నరేంద్రమోడీ అమెరికా తలనొప్పిని తగిలించుకుంటారా, లేదా, ఏం జరగనుందో తెలియదు.


అమెరికా ఖాళీ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ స్ధానాన్ని చైనా ఆక్రమించుకుంటుందనే వార్తలను వండి వారుస్తున్నారు.చైనాను భూతంగా చూపి మన దేశాన్ని ఇరికించే ఎత్తుగడ దీనివెనుక ఉందన్నది స్పష్టం. అక్కడ అధికారంలో ఎవరు ఉండాలనేది తేల్చుకోవాల్సింది అదేశ వాసులే. తాలిబాన్లే అధికారాన్ని పొందినా లేదా మిలిటరీ పైచేయి సాధించి వారిని అణచివేసి ఇప్పుడున్న ప్రభుత్వమే కొనసాగినా తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇతర దేశాలు దౌత్య సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుంది. అక్కడ స్ధిరత్వం ముఖ్యం. మిగతా అంశాలు తరువాత. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాలని ఎవరు కోరారు, ఇప్పుడు ఖాళీ చేయాలని ఎవరు చెప్పారు ? అమెరికా అనుభవం చూసిన తరువాత ఎవరైనా అక్కడ అడుగుపెట్టి చేతులు కాల్చుకుంటారా ? ఒకటి స్పష్టం ఆక్కడ స్ధిరత్వం ఉండటం సరిహద్దు బంధం లేని మన దేశానికి ఎంత అవసరమో బంధం ఉన్న చైనాకూ అంతకంటే ఎక్కువే ఉంది. ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్‌ ద్వారా తాలిబాన్లు దిగుమతి అయితే చైనాకు నేరుగా వెళ్లారు, చైనా తాలిబాన్లకు తమ గడ్డమీద ఆశ్రయం కల్పించారు.


అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్‌ మన దేశంలో దలైలామా ప్రతినిధులను కలవటాన్ని చైనా వ్యతిరేకించింది. టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా విధానానికి ఇది వ్యతిరేకమని, దలైలామా కోరుతున్న స్వాతంత్య్రాన్ని అంగీకరించరాదని, చైనా నుంచి వేరు చేసే చర్యలను సమర్ధించరాదని వ్యాఖ్యానించింది. టిబెట్‌ సమస్యల పేరుతో తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది. తైవాన్‌, టిబెట్‌, హాంకాంగ్‌తో సహా చైనాలో అంతర్భాగమే అని అధికారికంగా అమెరికా గుర్తిస్తున్నది. అయితే ఏదో ఒకసాకుతో వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది. భౌగోళికంగా టిబెట్‌ ప్రధాన ప్రాంతానికి దూరంగా ఉండటం, చైనా పాలకులకు సామంత రాజ్యంగా ఉంది తప్ప చరిత్రలో స్వతంత్ర దేశంగా లేదు. అయితే బ్రిటన్‌, నేపాల్‌, మంగోలియాలు అక్కడ దౌత్య కార్యాలయాల ఏర్పాటు, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం, వాటిని గుర్తించకపోవటం వంటి అంశాలన్నీ చరిత్రలో ఉన్నాయి. వాటికి ఎవరికి తోచిన, అవసరమైన భాష్యాన్ని వారు చెబుతున్నారు. టిబెట్‌ సామంత పాలకులు బ్రిటీష్‌ వారితో చేసుకున్న ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు.

1910లో నాటి చైనా పాలకులు(కమ్యూనిస్టులు కాదు) దలైలామా తిరుగుబాటును అణచేందుకు సైన్యాన్ని పంపారు. నాటి దలైలామా పారిపోయి మన దేశం వచ్చి మూడు సంవత్సరాలు ఇక్కడే ఉండి తిరిగి టిబెట్‌ వెళ్లాడు. మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి అక్కడ ఉన్న బ్రిటీష్‌ వారి దౌత్య కార్యాలయం భారత కార్యాలయంగా మారింది. కమ్యూనిస్టులకు ముందు చాంగ్‌కై షేక్‌ అధికారంలో ఉన్నపుడు అమెరికా, బ్రిటన్‌ వంటి పశ్చిమ దేశాలన్నీ టిబెన్‌ను చైనా అంతర్భాగంగానే గుర్తించాయి. స్వాతంత్య్రం తరువాత మన ప్రభుత్వం మాత్రం స్వతంత్ర దేశమనే వైఖరితోనే వ్యవహరించింది. దాని కొనసాగింపుగానే 1959లో దలైలామా తిరుగుబాటుకు అమెరికా పన్నిన కుట్రలో మనమూ భాగస్వాములమై ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పించాము. తరువాత 1962లో యుద్దం, సరిహద్దు వివాద చరిత్ర తెలిసిందే. 1988లో ప్రధాని రాజీవ్‌ గాంధీ చైనా పర్యటన చేసిన సమయంలో టిబెట్‌ స్వయం ప్రతిపత్తి కలిగిన చైనా రాష్ట్రమనే దీర్ఘకాలిక వైఖరిని పునరుద్ఘాటిస్తున్నట్లు ప్రకటించి ఒక స్పష్టతను ఇచ్చారు.2003లో ఎన్‌డిఏ ప్రధాని అతల్‌ బిహారీ వాజపాయి ఈ మేరకు చైనాతో ఒక ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. రాజీవ్‌ గాంధీ తొలుత ప్రకటన చేసినప్పటికీ వాజపాయి మాత్రమే అధికారిక గుర్తింపు ఇచ్చారు. అదే సమయంలో టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని కూడా మన గడ్డపై కొనసాగించారు. అదే ద్వంద్వ వైఖరి ఇప్పటికీ కొనసాగుతున్నది. టిబెట్‌ వ్యవహారాల్లో పరోక్షంగా మనం వేలుపెడుతూనే ఉన్నాం.

టిబెట్‌ తిరుగుబాటు దారులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము.2014లో నరేంద్రమోడీ ప్రమాన స్వీకార ఉత్సవానికి టిబెట్‌ తిరుగుబాటు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న టిబెన్‌-అమెరికన్‌ లోబ్‌ సాంగ్‌ సాంగేకి ఆహ్వానం పంపాము.2017లో అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండు ఒక ప్రకటన చేస్తూ తమ రాష్ట్రానికి టిబెట్‌తో తప్ప చైనాతో సరిహద్దు లేదని ప్రకటించాడు. తరువాత దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణ పర్యటనకు వెళ్లాలన్న నిర్ణయాన్ని చైనా అభ్యంతర పెట్టింది.ప్రధాని నరేంద్రమోడీ 2018లో చైనాలో ఊహాన్‌ నగర సందర్శన తరువాత మన అధికారులు తిరుగుబాటు టిబెట్‌ ప్రభుత్వ కార్యక్రమాలకు, దలైలామా కార్యక్రమాలకు ఎవరూ హాజరు కాకూడదని మన విదేశాంగశాఖ ఆదేశాలు జారీ చేసింది. గాల్వన్‌ ఉదంతమైనా, అదే విధంగా సరిహద్దు సమస్య అయినా చైనాతో మన ప్రభుత్వం పరిష్కరించుకోవాల్సి ఉంది. చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటు టిబెటన్లతో ఏర్పాటు చేసిన అనధికార, కిరాయి స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌(ఎస్‌ఎఫ్‌ఎఫ్‌) వంటి చర్యలు చైనాను రెచ్చగొట్టేవే అన్నది స్పష్టం. ప్రవాస టిబెటన్‌ ప్రభుత్వం, దలైలామాలను మనం చైనాతో బేరసారాలకు వినియోగించుకోవటం, కీడెంచటం ప్రతికూల ఫలితాలకు దారి తీసిందని మన విదేశాంగశాఖ కార్యదర్శిగా పని చేసిన శ్యామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించారు.

గత నెలాఖరులో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ తిరుగుబాటు టిబెటన్‌ ప్రతినిధులతో భేటీ కావటాన్ని మన గడ్డ మీద అనుమతించటం కూడా అలాంటిదే. అమెరికా కోసం మనం చైనాతో తగాదా తెచ్చుకోవాల్సిన అగత్యం ఏమిటి ? కావాలంటే అమెరికన్లు దలైలామాను తమ దేశానికి పిలిపించుకోవచ్చు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయటం అమెరికా కాదు,దాని తాతలు దిగివచ్చినా జరిగేది కాదు.మనం సహకరిస్తే అది జరుగుతుందని ఎవరైనా అనుకుంటే వారు ఈ లోకానికి చెందిన వారు కాదు. కాశ్మీరులో కొంత భాగం మన ఆధీనంలో లేదు. టిబెట్‌ విషయంలో చైనాకు అలాంటి సమస్య లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో భాగమే అని చెబుతున్నప్పటికీ దానికోసం సాయుధ చర్యకు పూనుకుంటామనే మాట చైనా వైపు నుంచి లేదు. టిబెట్‌ వ్యవహారంలో మనం ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న కారణంగానే కాశ్మీరు విషయంలో చైనా కూడా అదే పద్దతిలో వ్యహరిస్తున్నది. చైనా పూర్తి మద్దతు లేకుండా ఎప్పటికైనా ఆక్రమిత కాశ్మీరును తిరిగి తెచ్చుకోవాలనుకొనే మన ప్రభుత్వం అనుసరించే ఎత్తుగడలు సరైనవేనా ? అంతిమంగా నష్టపోయేది ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చైనాను కాల్చేందుకు అమెరికా మన భుజాల మీద తుపాకి ఎక్కుపెడుతున్నది. మనమెందుకు దాన్ని మోయాలి ? కాశ్మీరు సమస్యను మరింత సంక్లిష్టం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ?