Tags

, ,


ఎం కోటేశ్వరరావు


జూలై మూడవ వారంలో మన దేశంతో సహా ప్రపంచ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేమంటే జపాన్‌ మీద అణుబాంబులు వేస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది లేదా ప్రకటించింది. నిత్యం చైనాను రెచ్చగొట్టే దేశాలలో జపాన్‌ కూడా ఒకటి గనుక దానికి చైనా దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందని ఎవరైనా కమ్యూనిస్టులు కూడా లోలోపల సంతోషించారేమో తెలియదు. వ్యతిరేకులు మాత్రం వెంటనే అందుకున్నారు. దీనిలో నిందలు- నిజాలేమిటి ? కౌపీన సంరక్షణార్ధం చివరికి ఒక సర్వసంగ పరిత్యాగి సంసార ఊబిలోకి దిగాల్సి వచ్చిందనే కథ తెలిసిందే కదా ! సదరు వార్తను పట్టుకొని గోతికాడ నక్కల్లా కూర్చున్న కొందరు అలాంటి కథలనే అల్లారు, వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో చెప్పింది ఏమిటి ?


” అణ్వాయుధాలను తాముగా ముందు ఉపయోగించబోమని గతంలో ప్రకటించిన విధానానికి చైనా తిలోదకాలు ఇచ్చింది. ఇప్పుడు జపాన్ను బెదిరించింది కనుక యావత్‌ దేశాలకూ ముప్పు వచ్చింది. చైనా వారు 250 అణుబాంబులను భూగర్భంలో దాస్తున్నారు. వాటిని ప్రత్యర్ధులు పసిగట్టలేరు. కానీ అమెరికా కనుగొన్నది. ప్రత్యర్ధుల దాడికి దొరకవు. అందువలన ఆసియన్‌ దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలి.” ఇలాంటి వ్యాఖ్యానాలతో చైనా బెదిరింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. ఈ కధనాలను ఆగస్టు ఆరవ తేదీన ఈనాడు పత్రికలో వ్యాసరచయిత కూడా తలకెత్తుకొని నేను సైతం అన్నట్లుగా ఒక రాయి వేశారు.


చైనా గురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యల్లో నిజమెంత, అసలేం జరుగుతోంది ? తైవాన్ను ఆక్రమించుకొనేందుకు చైనా ప్రయత్నించినపుడు దాన్ని అడ్డుకొనేందుకు జపాన్‌ ఒక సైనికుడు, ఒక నౌక, ఒక విమానాన్ని పంపినప్పటికీ అది లొంగిపోయేంతవరకు అణుబాంబులను ప్రయోగించాల్సిందే అని చైనా కమ్యూనిస్టు పార్టీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. చైనా ప్రధాన ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో తైవాన్‌ దీవి ఉంది. అది చైనాలో తిరుగుబాటు రాష్ట్రం. దానికి ఒక వైపున దక్షిణ చైనా సముద్రం, రెండో వైపు తూర్పు చైనా సముద్రం ఉంది. మరోవైపున జపాన్‌ ఉంది. ఐక్యరాజ్యసమితి జాబితాలో తైవాన్‌ అనే దేశం లేదు. నిత్యం వివాద పడుతున్న అమెరికా, జపాన్‌ కూడా ఆ ప్రాంతం చైనాకు చెందినదే అని అంగీకరించాయన్న వాస్తవాన్ని ముందు తెలుసుకోవాలి. చైనా విప్లవ సమయంలో కమ్యూనిస్టులను ఎదిరించిన నాటి పాలకుడు చాంగ్‌కై షేక్‌ అప్పటి మిలిటరీ, ఆయుధాలను అన్నింటినీ తీసుకొని తైవాన్‌ దీవిలో కేంద్రీకరించాడు. అతగాడికి అమెరికా,బ్రిటన్‌,జపాన్‌ వంటి దేశాలన్నీ ఆయుధాలు అందించి పటిష్టపరిచాయి. కమ్యూనిస్టులు తైవాన్‌ దీవి మీద తమ బలాన్నంతటినీ కేంద్రీకరించటం కంటే మిగతా దేశంలో ఎదురవుతున్న ప్రతిఘటనను అణచివేయటమే ముఖ్యం, తరువాత తైవాన్‌ సంగతి చూద్దాం లెమ్మని అనుకున్నారు. మావో నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తన అధికారాన్ని స్ధిరపరచుకొనేందుకు పది సంవత్సరాల పట్టింది. ఈలోగా తైవాన్‌లోని మిలిటరీని మరింత పటిష్టపరిచారు.

1970వరకు అంటే రెండు దశాబ్దాల పాటు తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనాగా ఐక్యరాజ్యసమితిలో గుర్తించటం, అధికారిక సంబంధాలు పెట్టుకోవటం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపధ్యంలో సైనిక చర్య కంటే శాంతియుత విలీనానికే ప్రాధాన్యత ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. తరువాత రెండు చైనాలు అనేవి లేవు, ఉన్నది ఒకటే, అది కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్న ప్రధాన ప్రాంతంలోనిదే అసలైన చైనా అని, తైవాన్‌ దానిలో అంతర్భాగమే అని ఐరాస గుర్తించింది. కానీ విలీనానికి తగిన పరిస్ధితులు లేవు, తైవానీయుల్లో అనుమానాలు ఉన్నాయి, అవి తొలగిన తరువాతే విలీనం జరగాలి అంటూ అమెరికా నాయకత్వంలోని దేశాలు అప్పటి నుంచి నేటికీ విలీనానికి అడ్డుపడుతున్నాయి.


జపాన్ను బెదిరించిందంటూ పేర్కొంటున్న ఆ వీడియో కథేమిటి ? మిలిటరీ వ్యవహారాలను పరిశీలించే కొందరు వ్యాఖ్యాతలు సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ పేరుతో నడుపుతున్న ఇంటర్నెట్‌ ఛానెల్లో సదరు వీడియోను ప్రసారం చేశారు. దాన్ని గ్జి గువా (యు ట్యూబ్‌ వంటిది)లో పెట్టారు. సదరు ఛానల్‌తో కమ్యూనిస్టు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అవసరం అయితే అణుబాంబులు వేయాలి అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోను తొలగించాలని చైనా ప్రభుత్వం సలహా ఇచ్చి ఉండవచ్చు లేదా ఛానల్‌ స్వయం నిర్ణయంతోగానీ దాన్ని తొలగించారు. అయితే అప్పటికే దానిని లక్షలాది మంది షేర్‌ చేశారు. స్ధానిక కమ్యూనిస్టు పార్టీ శాఖలు నిర్వహించే సామాజిక మాధ్యమ ఛానళ్లు వాటిలో ఉన్నాయి. వాటిని కూడా తరువాత తొలగించారు. ప్రపంచ మీడియాలో వార్తలకు కారణమైన సదరు వీడియో బావోజీ అనే పట్టణంలోని కమ్యూనిస్టు పార్టీ ఛానల్‌లో అలాగే ఉంది. దాన్ని చూపి అమెరికాలో స్ధిరపడిన చైనా జాతీయురాలు ఒకామె జపాన్ను కమ్యూనిస్టు పార్టీ బెదిరించింది అంటూ ట్వీట్లు చేశారు, దానిలో ఉన్న వ్యాఖ్యానాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. వాటిని ఆధారం చేసుకొని మీడియాలో కథలు రాశారు. తరువాత దాన్నుంచి కూడా తొలగించారు.


దేశ విధానం, ప్రభుత్వాలతో, అధికార పార్టీలతో నిమిత్తం లేకుండా ఇలాంటి అనధికార వ్యక్తులు, వారి వ్యాఖ్యలతో కూడిన వీడియోల ప్రచారాన్ని పార్టీలు, ప్రభుత్వాలకు అంటగట్టటం రాళ్లు వేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఇక్కడ మౌలిక సమస్య ఆ వీడియో ఇప్పుడు ఎందుకు వచ్చింది ? ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనానికి చైనా చేసే యత్నాలు తమ అస్తిత్వానికే ముప్పు అంటూ జూలై రెండవ వారంలో విడుదల చేసిన జపాన్‌ మిలిటరీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గడచిన ఐదు దశాబ్దాల్లో జపాన్‌ వైపు నుంచి ఇలాంటి పదజాలంతో ఆరోపణలు లేదా నివేదికలు లేవు, ఇదే తొలిసారి. ప్రస్తుతం అమల్లో ఉన్న జపాన్‌ రాజ్యాంగం ప్రకారం ఆత్మరక్షణకు అవసరమైతే యుద్దానికి దిగేందుకు అనుమతి ఉంది. అందుకే జాగ్రత్తగా అస్తిత్వం అనే పదాలను వినియోగించారు.దీని ప్రకారం చైనా మిలిటరీ గనుక తైవాన్‌ విలీనానికి పూనుకుంటే అది తమ ఉనికికే ముప్పు గనుక యుద్ధానికి దిగి అమెరికా దళాలతో కలసి జపాన్‌ ప్రతిఘటిస్తుందని జపాన్‌ ఉపప్రధాని తారో అసో ప్రకటించారు. అదే చేస్తే జపాన్‌ మిలిటరీని నాశనం చేస్తామని చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌లో వ్యాఖ్యాతలు పేర్కొన్నారు తప్ప అణుదాడి చేస్తామని ఎక్కడా చెప్పలేదు. చైనా 1964లో అణుబాంబును రూపొందించింది. ఆత్మరక్షణకు ప్రత్యర్ధులు ఉపయోగిస్తే తప్ప తాముగా ముందు వాటిని ప్రయోగించబోమని ప్రకటించింది. జపాన్‌ విషయంలో ఆ విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదని సిక్స్‌ ఆర్మీ స్ట్రాటజీస్‌ వీడియో సలహా యిచ్చింది.


జపాన్‌ మీద చైనాలో అంత ఆగ్రహం ఎందుకు ఉంది ? ఎవరినుంచి ఎవరికి ముప్పు ఉంది? ఆసియాలో మిలిటరీ శక్తిగా ఎదిగిన జపాన్‌ ఆక్రమించిన దేశాలలో చైనా కూడా ఒకటి. దానికి వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు తెలిసినవే. అందుకే జపాన్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పెద్ద సంఖ్యలో నెటిజన్లు బలపరిచారు. జపాన్‌ దేశం దీవుల సముదాయం. ప్రధాన దీవుల ప్రాంతం నుంచి ఒకినావా అనే దీవి 640కిలోమీటర్లు, (అదే టోకియో నగరానికి 1,550 కిలోమీటర్లు,) అక్కడి నుంచి తైవాన్‌ 500కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సముద్రతీర ప్రాంతం ఏడు వందల కిలోమీటర్లలో ఉంది. జపాన్‌ మొత్తంలో ఎన్ని అమెరికా నౌకా స్దావరాలు ఉన్నాయో వాటిలో 62శాతం అంటే 28 ఈ దీవిలోనే ఉన్నాయి. అక్కడ పన్నెండు వందల అణ్వాయుధాలు, యాభైవేల మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఎందుకటా ? అక్కడికి పన్నెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూయార్క్‌, ఇతర అమెరికా ప్రాంతాల భద్రత కోసం ఇక్కడ తిష్టవేయాలని అమెరికా చెబుతోంది. అందుకు జపాన్‌ అంగీకరించింది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి ఎక్కడుందో చూద్దామని అని చెప్పినట్లుగా లేదూ !


సదరు వీడియోలో ఉన్నదేమిటి ? ” మనం తైవాన్ను విముక్తి చేసినపుడు ఒక వేళ జపాన్‌ బలంతో జోక్యం చేసుకుంటే, అది ఒక సైనికుడిని, ఒక విమానాన్ని, ఒక నౌకను మాత్రమే దించినా మనం ప్రతిదాడికి దిగటమే కాదు, పూర్తి స్ధాయి యుద్దానికి పూనుకోవాలి. తొలిసారిగా మనం అణుబాంబులను వినియోగించాలి. బేషరతుగా లొంగిపోతున్నట్లు రెండవ సారి జపాన్‌ ప్రకటించే వరకు అణుబాంబులను వినియోగిస్తూనే ఉండాలి.(రెండవ ప్రపంచ యుద్దంలో తొలిసారిగా బేషరతుగా లొంగిపోతున్నట్లు బ్రిటన్‌,చైనాలతో జపాన్‌ ఒప్పందం చేసుకుంది) జపాన్‌ యుద్ద సామర్ధ్యం పూర్తిగా కోల్పోయేవరకు మన లక్ష్యం ఉండాలని మేము చెబుతున్నాము.ఇంకే మాత్రం యుద్ద మూల్యం చెల్లించలేమని జపాన్‌ గుర్తించినపుడే తైవాన్‌కు దూకుడుగా అది సైన్యాన్ని పంపేందుకు సాహసించదు.


ఇప్పుడు అంతర్జాతీయ పరిస్ధితి నాటకీయంగా మారిపోయింది.ప్రస్తుతం మన దేశం ఒక శతాబ్ది కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఒక ప్రధాన పరివర్తన మధ్యలో ఉంది. అన్ని రాజకీయ విధానాలు, ఎత్తుగడలు, వ్యూహాలను దానికి అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి, పరివర్తనకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అణువిధానాన్ని కూడా పరిమిత సర్దుబాట్లకు వీలుగా మార్చాల్సి ఉంది. జపాన్‌ మినహాయింపు అనే సిద్దాంతాన్ని ఒక నిష్టగా మనం ముందుకు తీసుకుపోవాలి. అణ్వాయుధాలను తొలి సారిగా ఉపయోగించకూడదు అనే విధానానికి జపాన్‌ మినహాయింపు అని సూచించాలి. మనం జపాన్‌కు హెచ్చరిక చేస్తున్నాం, ప్రపంచానికి తెలియచేస్తున్నాం. అదేమంటే ప్రధాన భూభాగంతో తైవాన్‌ విలీనంతో సహా జపాన్‌ మిలిటరీ పద్దతుల్లో మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే జపాన్‌కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ఉపయోగించాలి. బేషరతుగా లొంగిపోయేంతవరకు వాటిని వినియోగిస్తూనే ఉండాలి.


జపాన్‌ గనుక మూడోసారి చైనాతో యుద్దానికి దిగితే చైనా జనం పాత, కొత్తల బదులు తీర్చుకోవాలి. వారితో శాంతి చర్చలు వద్దు. దియాయు,రియుకు దీవులను (ఒకినావా పరిసరాల్లో ఉన్న దీవులు) తిరిగి స్వాధీనం చేసుకుందాం ” అనే వ్యాఖ్యానం ఆ వీడియోలో ఉంది.
జపాన్‌ మిలిటరీ నివేదికను వెలువరించక ముందే తైవాన్‌ గురించి జపాన్‌ రెచ్చగొడుతున్నది. జూన్‌ 24న రక్షణ మంత్రి నోబు కిషి మాట్లాడుతూ తైవాన్‌ భద్రతకు జపాన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉంది అన్నాడు. చైనా ఒకటే అనే విధానం అనుసరించాలంటే అది కాలపరీక్షకు నిలబడుతుందా ? అది సరైనదేనా, నాకు తెలియదు అని జపాన్‌ ఉపరక్షణ మంత్రి యుషిహైడ్‌ నకయామా అన్నాడు. అధికారికంగా జపాన్‌ వైఖరిలో మార్పు లేనప్పటికీ దానికి కట్టుబడి ఉండాల్సిన అగత్యం లేదని పరోక్షంగా చెప్పటం, తైవాన్‌ సమస్యను తురుపుముక్కగా ఉపయోగించుకొనే యత్నమే. తైవాన్‌ వేరు కాదు, చైనాలో అంతర్భాగమే అని గుర్తిస్తూనే దానికి ఆయుధాలు అందిస్తున్న అమెరికా బాటలోనే జపాన్‌ కూడా నడుస్తున్నది. చైనాాజపాన్‌ సాధారణ సంబంధాలు నెలకొల్పుకొని ఐదు దశాబ్దాలు గడచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, జపాన్‌ ప్రధాని సుగా విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో తొలిసారిగా తైవాన్‌ సమస్యను ప్రస్తావించారు. ప్రస్తుతం జపాన్‌ రాజ్యాంగం ప్రకారం జపాన్‌ నేరుగా చైనా మీద యుద్దానికి దిగకపోయినా తన గడ్డపై ఉన్న అమెరికా స్దావరాలకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించగలదు. ఒక వేళ నేరుగా యుద్దంలోకి దిగితే చైనా చేతిలో చావు దెబ్బలు తింటుంది.


చైనా వీడియో ప్రయివేటు వ్యవహారం గనుకనే జపాన్‌ అధికారికంగా స్పందించలేదు. దాని రక్షణకు హామీ ఇచ్చిన అమెరికా వైపు నుంచి కూడా వ్యాఖ్యలేమీ లేవు. మరి మీడియా వార్తలు ఏమిటి అంటే, స్పందన ఎలా ఉంటుందో తెలుసుకొనేందుకు అమెరికా, జపాన్‌ ప్రచారదాడిలో భాగంగా వెలువడిన కట్టుకధలు మాత్రమే.ట్రంప్‌ ప్రారంభించిన వాణిజ్య యుద్దంలో బైడెన్‌ కొత్తగా చేరినా అమెరికన్లు నెగ్గే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఏదో విధంగా చైనాతో గిల్లి కజ్జా పెట్టుకోవాలంటే దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌ సాకులు ఉన్నాయి. జపాన్‌, ఆస్ట్రేలియాలు అన్ని విషయాల్లో, కొంత మేరకు మన దేశం అమెరికాతో యుగళగీతాలు పాడుతోంది.