Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


” ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం,
తారీఖులు దస్తావేజులు ఇవి కాదోయి చరిత్ర సారం ” అన్న శ్రీశ్రీని మనం ఇప్పుడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుర్తు తెచ్చుకోవటం అవసరం. స్వాతంత్య్రానికి ముందు పుట్టి తరువాత దేశాన్ని చూసిన వారి కలలు కల్లలయ్యాయి. తరువాత పుట్టిన వారు ఈ దేశం మాకేమిచ్చిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్ధితి. బిడ్డ పుట్టి పెరిగే క్రమంలో జరిగే పరిణామాల మాదిరే స్వాతంత్య్ర తరువాత దేశంలో కూడా మార్పులు వచ్చాయి. పుట్టిన బిడ్డ ఆరోగ్యంతోనా లేక ఈసురో మంటూ ఎదిగినట్లా అన్నదే అసలు సమస్య. స్వాతంత్య్ర దేశాన్ని కూడా అలాగే చూడాలి.


కాలం గడిచే కొద్దీ మెరుగు పరచాల్సిన ప్రజాస్వామ్య వ్యవస్ధలకు తూట్లు పొడుస్తున్నారు. విపరీత అర్ధాలు చెబుతున్నారు. పోరాడి సాధించుకున్న హక్కులు ఒక్కొక్కటి హరించుకుపోతున్నాయి లేదా కదలా మెదల్లేని బంధనాల్లో ఇరుక్కు పోతున్నాయి. మనకు నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా ? స్వాతంత్య్రం అంటే ఇదా, ఇలాంటిది మనకు అవసరమా అనే ప్రశ్నలు అనేక మందిలో ఉన్నాయి. ఇంతకాలం తరువాత ఇలాంటి ఆలోచనలు కలగటం విచార, విషాదకర స్దితి. ప్రస్తుత తీరు తెన్నులు చూస్తుంటే రానున్న రోజుల్లో పరిస్దితి ఇంకా దిగజారుతుందా అన్న ఆందోళన తలెత్తుతోంది. సాగు, నిత్య పర్యవేక్షణ లేకపోతే పంట భూముల్లో కలుపు మొక్కలు పుట్టినట్లు లేదా కబ్జాకు గురైనట్లుగానే అనేక దేశాల్లో ఇలాంటి పరిస్ధితులు తలెత్తినపుడు నియంతలు ముందుకు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. ఎవడొస్తే మనకేంలే మన మీద భారాలు, మనకు బాధలు తప్పవు అని జనం నిర్లిప్తతకు లోనవుతారు.


డెబ్బయి అయిదేళ్ల స్వాతంత్య్ర సందర్భాన్ని ఏమని పిలవాలి అన్నది ఒక మీమాంస. వజ్రోత్సవం లేదా ప్లాటినం వాటి నిర్వచనాలకు సరిపోదు. నూటయాభయ్యవ సంవత్సరాన్ని ఆంగ్లంలో సెస్‌కో సెంటెనియల్‌ అన్నారు. దీనికి తెలుగులో తగిన పదం లేదని గూగుల్తల్లి నిఘంటువు సమాధానం చెప్పింది. తెలిసిన వారెవరైనా సూచిస్తే దాన్నే ఉపయోగిద్దాం. డెబ్బయి అయిదు అంటే నూటయాభైలో సగం కనుక సెమీ సెస్‌కో సెంటినియల్‌ అనాలన్నారు. మన ప్రధాని నరేంద్రమోడీ గారు అమృత మహౌత్సవ్‌ అన్నారు. పేరులోనేమున్నది పెన్నిధి. వదిలేద్దాం. దానితో ఎవరికీ పేచీ లేదు.
జూలై ఒకటిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలైన సందర్భంగా వారు ఎంత గొప్పగా ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారో, కమ్యూనిస్టు ఆశయాలకు ఎలా పునరంకితమయ్యారో యావత్‌ ప్రపంచం చూసింది. మనకంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా అక్కడ కష్టజీవుల ప్రభుత్వం ఏర్పడింది, 75 ఏండ్ల ఉత్సవాన్ని వారెలా జరుపుకుంటారో తరువాత చూద్దాం. మోడీ గారు ఏడేళ్ల క్రితం అనేక మాటలు చెప్పారు. తరువాత చెప్పిన మాట చెప్పకుండా చేసేది చెప్పకుండా చెప్పింది చెయ్యకుండా అసాధారణ ప్రతిభతో ” నిత్య నూతనత్వంతో ” గడుపుకు వస్తున్నారు. నిజంగా మనం ఇప్పుడు అమృత మహౌత్సవం జరుపుకొనే స్ధితిలో ఉన్నామా హాలాహలం మింగాల్సిన దుస్దితిలో ఉన్నామో తెలియటం లేదు. అచ్చేదిన్‌ (మంచి రోజులు) తెస్తామని వాగ్దానం చేసిన ప్రస్తుత కేంద్ర పాలకులు జనం చేత దేన్ని మింగిస్తారో అర్ధం కావటం లేదు.


ప్రతి ఏడాదీ పంద్రాగస్టు పండగ జరుపుకుంటున్నాం. అదొక తంతులా మారిపోయిందని ఎవరైనా అంటే తప్పు పట్టాల్సిన పని లేదు. అంతకు మించి జరుగుతున్నదేమీ లేనపుడు ఎవరైనా అలాగే అనుకుంటారు మరి. పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవార్లకు చాలు ఐదు వరహాలు అన్నట్లుగా మార్చివేశారు. ఉదయాన్నే దేశభక్తి గీతాలు, పాటలను వినిపించటం, మూడు రంగుల జండా ఎగురవేయటం, ప్రతిజ్ఞలు, పప్పు బెల్లాల స్ధానంలో ఏదో ఒకటి తిని మిగిలిన రోజంతా సెలవుగా గడిపేయటానికి అలవాటు పడ్డాము. స్వాతంత్య్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన సంస్దగా ఉన్న కాంగ్రెస్‌ను రాజకీయ పార్టీగా మార్చి వేశారు. ఆ ఉద్యమం ఏ లక్ష్యాలనైతే ముందుకు తెచ్చిందో వాటిని ఆ పార్టీ 1947 ఆగస్టు 16 నుంచే మరచి పోయింది. దాన్ని నీరుగార్చే, ముప్పు తెచ్చే, జనానికి విశ్వాసం కోల్పోయే చర్యలకు పాల్పడింది. చరిత్ర దాస్తే దాగేది కాదు. విజేతలే చరిత్రను రాస్తారు అన్నది తెలిసిందే. అందువలన అది వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జనం కూడా చరిత్రను రాస్తున్నారు. అందువలన దానిలో ఎలాంటి వివక్ష, పక్షపాతం ఉండదు. చరిత్ర నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కాంగ్రెస్‌ వైఫల్యాలను ఉపయోగించుకొనేందుకు స్వాతంత్య్ర ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేకపోవటమే కాదు బ్రిటీష్‌ వారికి సేవచేసుకుంటామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన వారి వారసులతో నిండిన బిజెపి రంగంలోకి దిగింది. బ్రిటీష్‌ పాలన నుంచి దేశ విముక్తి అన్న నినాదాన్ని కాపీ కొట్టి కాంగ్రెస్‌ విముక్త భారత్‌ అనే పేరుతో జనం ముందు మాట్లాడింది. కాంగ్రెస్‌ విధానాలనే వేగంగా అమలు చేస్తూ దేశం మరింత దిగజారే విధంగా ఏలుబడి సాగిస్తోంది.


ఎందుకీ పరిస్ధితి తలెత్తింది ? దీక్షా దినంగా పాటించాల్సిన స్వాతంత్య్ర దినాన్ని సెలవుగా మార్చినపుడే ఆ మహౌద్యమాన్ని జనం మరచి పోవాలన్న అంశం దానిలో ఇమిడి ఉంది. చివరకు అది ఎంతవరకు వచ్చిందంటే స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాలకు ముప్పు వచ్చిందని చెబుతున్నవారిని ఇప్పుడు జనం అపహాస్యం చేస్తున్నారు. అవి ఉంటేనేం లేకపోతేనే అంటున్నారు. పంద్రాగస్టు పండగకు 75 వారాల ముందే ప్రధాని నరేంద్రమోడీ మార్చి 12న గుజరాత్‌లో అజాదీ కా అమృతమహౌత్సవాన్ని ప్రారంభించారు. 2022 ఆగస్టు 15న నాటికి డెబ్బయిఅయిదు సంవత్సరాలు నిండి 76వ ఏట ప్రవేశిస్తాము. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాయి. ఇది రాసిన సమయానికి వాటిని ఖరారు చేయలేదు. అమృతమహౌత్సవాన్ని ప్రజాఉద్యమంగా నిర్వహించాలని దాని అమలుకు హౌమ్‌ మంత్రి అమిత్‌ షా నాయకత్వాన ఒక జాతీయ కమిటీ ఉంటుందని చెప్పారు. వారేమి చేస్తారో, అవెలా ఉంటాయో మరో సందర్భంగా చర్చించుకుందాం.


స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు అందరూ ఒకే పార్టీలో లేరు, అనేక పార్టీలలో చేరారు. మెజారిటీ కాంగ్రెస్‌ పార్టీలో చేరినందున తామే దేశాన్ని విముక్తి చేశామని వారు చెప్పుకుంటారు. అలాంటి కాంగ్రెస్‌ దేశానికి శనిలా దాపురించిందని దాన్నుంచి ముక్తి కలిగిస్తామంటూ కాంగ్రెస్‌ ముక్త భారత్‌గా మారుస్తామని బిజెపి ప్రకటించుకుంది. దేశ రాజ్యాంగం ప్రకారం నాలుగు ఉన్నత పదవుల్లో అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, ముందే చెప్పుకున్నట్లు బ్రిటీష్‌ వారికి లొంగిపోయిన వారి రాజకీయ వారసులు ఇప్పుడు అధిష్టించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి,ప్రధాని,లోక్‌సభ స్పీకర్లుగా సంఘపరివార్‌ రాజకీయ విభాగమైన బిజెపికి చెందిన వారే ఉన్నారు. జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాధూరామ్‌ గాడ్సే ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, హత్య సమయంలో అతను తమ సంస్ధలో లేడని వారు చెబుతారు గానీ గాడ్సే కుటుంబసభ్యులు సంఘపరివార్‌లోనే ఉన్నట్లు చెప్పారు. అది తేలేది కాదు గనుక ఆ వివాదాన్ని పక్కన పెడదాం. గాంధీని నేనెందుకు చంపాను అంటూ కోర్టులో గాడ్సే చేసిన వాదనలను పుస్తకరూపంలో ప్రచురించి ప్రచారం చేస్తున్నవారు, సామాజిక మాధ్యమంలో అవే వాదనలను చేస్తున్న వారెవరో మనకు తెలుసు, అయితే అదంతా అనధికారికంగానే అనుకోండి. అలాంటి వారికి స్వాతంత్య్రం , దాని లక్ష్యాల మీద , ప్రజాస్వామిక వ్యవస్ధల పట్ల గౌరవం ఉంటుందా ? ఒకవైపు గాంధీకి నివాళులు అర్పిస్తూ మరోవైపు గాడ్సేను ఆరాధించే వారు పెరుగుతున్నారు, వారు ఎంతకైనా తెగిస్తారు. ఇంతకంటే ఆందోళనకరమైన అంశం ఏముంటుంది ?


జనాభాలో సగ భాగం గురించి ఇన్నేండ్లుగా కబుర్లు చెప్పటమే తప్ప ఫ్యూడల్‌ భావజాలం నుంచి ఇంకా బయటపడలేని స్ధితి ఇప్పటికీ కొనసాగుతోంది. అనేక దేశాల చట్ట సభల్లో మహిళలు సగం మంది ఉన్నారు. తాజాగా చిలీ రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. మన దేశంలో చట్టసభల్లో 33శాతం గురించి ఎప్పటి నుంచో చర్చ. తమకు సంపూర్ణ మెజారిటీ ఉంటే అమలు జరుపుతామని బిజెపి చెప్పింది. ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయ సభల్లో వారికి, వారిని బలపరిచే మిత్రపక్షాలతో కలిపి అవసరమైన మెజారిటీ ఉంది. మెజారిటీ రాష్ట్రాలూ వారివే. అయినా దాని గురించి ఎప్పుడైనా ప్రధాని మన్‌కీబాత్‌లో ప్రస్తావన చేశారా అంటే లేదు.


మన దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందింది అని చెబుతుంటాం, నిజమే. కానీ అది జనానికి ఏ మేరకు ఉపయోగపడిందన్నదే గీటురాయి. వేల కోట్ల రూపాయలను పెట్టి రాఫెల్‌ విమానాలను కొనుగోలు చేయటానికి, అవసరం లేకపోయినా కొత్త పార్లమెంట్‌ భవనం కట్టేందుకు నిధుల కొరత లేదు. కరోనా మహమ్మారి పోరు గురించి కబుర్లకూ అంతకంటే కొదవ లేదు. అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధించి రాకెట్లను ఎగరేశాం గానీ చాలా చౌకగా లభించే ఆక్సిజన్‌ ఇవ్వలేకపోయారు. అనేక మంది కరోనా పీడితులు ఆ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆనందయ్య ఆకుల పసరు ఆక్సిజన్‌ అందిస్తుందంటే, పచ్చడి కరోనాను అరికడుతుందంటే నిజమని జనం నమ్మారు. దీన్ని ఎలా చూడాలి ? కరోనా నిరోధం కోసం లాక్‌డౌన్‌ పెట్టినపుడు రెక్కాడితే తప్ప డొక్కాడని వలస కార్మికులు స్వస్ధలాలకు వెళ్లేందుకు అయ్యే రైలు ఖర్చులను కేంద్రం – రాష్ట్రాలు ఎవరు భరించాలి అని వివాదపడిన అపర మానవతా వాదులను మనం తప్ప మరేదేశమూ చూడలేకపోయింది.

పది లక్షల కోట్ల రూపాయల పారుబాకీలను వేళ్ల మీద లెక్కించదగిన బడాబాబులకు రద్దు చేయటానికి ఉదారంగా నిర్ణయాలు చేసిన పాలకులకు వాక్సిన్లు వేయటానికి చేతులు రాలేదు. తాము స్వయంగా చెప్పిన ఉచితవాక్సిన్లు వేసేందుకు మధ్యలో ఠలాయించి సగం భారం రాష్ట్రాల మీద మోపేందుకు, చివరకు సుప్రీం కోర్టు వాక్సిన్ల పేరుతో కేటాయించిన సొమ్ముకు లెక్కలు చెప్పండని నిలదీస్తే తప్ప లొంగని నేతలు ఇప్పుడున్నారు. కరోనాను ప్రపంచ విపత్తుగా ప్రకటించారు. మనం దేశంలో విపత్తు సహాయ చట్టం ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారు. కరోనా జాతీయ విపత్తుగా పరిగణించినపుడు నష్టపరిహారం ఎందుకు ఇవ్వరు. ఎవరి జేబులో డబ్బు ఇస్తున్నారు ? ఎవరు ఎవరికి జవాబుదారులుగా ఉన్నారు, ఎవరు ఎవరిని రక్షిస్తున్నారు ? రెండు విడతలుగా ఇరవై ఆరులక్షల కోట్ల ఆత్మనిర్భర తాయిలాలను అందించిన కేంద్ర పెద్దలు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు వాయిదాల కరువు భత్యం చెల్లింపునకు ఎసరు పెట్టారు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. అనేక దేశాలలో కరోనా సహాయ చర్యలకు గాను ప్రభుత్వాలు కార్పొరేట్ల మీద ప్రత్యేక పన్ను విధించి నిధులు సమకూర్చుకున్నారు. మన దేశంలో అలాంటిదేమీ లేకపోగా ఉద్యోగుల పొట్టగొట్టేందుకు పూనుకున్నారు. నిలిపివేసిన కరవు భత్యాన్ని వాయిదాల రూపంలో లేదా పిఎఫ్‌ ఖాతాలకు జమ చేస్తామన్నా అదొక దారి, ఎగ్గొట్టటం ఏమిటి ?
(రెండవ భాగంలో ముగింపు https://vedikaa.com/2021/08/09/india-independence-75-what-is-happening-part-two/ )