Tags

, ,


ఎం కోటేశ్వరరావు


మన జీవితాలు ఎలా తయారయ్యాయంటే రోజుకు ఒక కుహనా వార్త లేదా వక్రీకరణ అంశం లేకుండా గడవని పరిస్ధితి. నరేంద్రమోడీ గారు మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చి వస్తువులను తయారు చేసి ఎగుమతి చేసి చైనాను మించి పోవాలని చెప్పారు. దానికి బదులు కొద్ది పెట్టుబడితో పుంఖాను పుంఖాలుగా కుహనా వార్తలను తయారు చేసే ఫ్యాక్టరీలు ఇటీవలి కాలంలో పుట్టుకువచ్చాయి. మంచి వార్తలు రాసే వారికి జీతాలు సరిగా ఉండవు గానీ వక్రీకరణ వార్తలు, వీడియోలు తయారు చేసే వారికి ఎలాంటి సమస్యలూ లేవు. కరోనాతో అనేక మీడియా సంస్దలు సిబ్బందిని తొలగించాయి గానీ కుహనా వార్తల తయారీ ఇంకా పెరిగింది. లేని గొప్పలు చెప్పుకోవటంలో భాగంగా కట్టు కధలు అల్లటం, పిట్టకథలు చెప్పటం ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా వాట్సాప్‌ యూనివర్సిటీ పండితులు, పట్టభద్రులు పెరిగిపోయిన తరువాత ఇక చెప్పనవసరం లేదు. చెబుతున్న కథలు కూడా కాపీ, పేర్లు మారతాయంతే ! కొందరికి అభిమానులుగా ఉన్న వారు నిజానిజాలను నిర్దారించుకోకుండా వారి గురించిన అతిశయోక్తులను తాము నమ్మటమే కాకుండా ఇతరులకూ పంపిణీ చేస్తుంటారు. కొన్నింటిని పరిశీలించుదాం.


వియత్నాంలోని హౌచిమిన్‌ సిటీలో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టారన్నది వాటిలో ఒకటి. వియత్నాం ఒక చిన్న దేశం. జపాన్‌, ఫ్రెంచి, అమెరికన్‌ సామ్రాజ్యవాదులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరుతాగించి తమ గడ్డమీది నుంచి పారదోలిన వీరగడ్డ. అంత పెద్ద దేశం మీద మీరు ఎలా విజయం సాధించారు అని ఒక విలేకరి అడిగితే మాకు ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ద పద్దతి ఉపయోగపడింది అని వియత్నాం అధ్యక్షుడు చెప్పాడట. నేను గొప్ప రాజైన శివాజీ వ్యక్తిత్వం,చర్యల గురించి చదివాను, యుద్దతంత్రం నన్ను ఎంతో ఉత్తేజపరించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా వాటిని ఉపయోగించాం, విజయం సిద్దించింది. అలాంటి రాజు గనుక మా దేశంలో జన్మించి ఉంటే ప్రపంచాన్ని ఏలి ఉండేవారం.
శివాజీకి నివాళిగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారన్నది ఒక పిట్టకధ. తన సమాధిరాయి మీద శివాజీ మహరాజ్‌ గురించి రాయించుకున్నాడని కూడా కథలు చెప్పారు. తరువాత కొన్నేండ్లకు వియత్నాం మహిళా విదేశాంగ మంత్రి భారత పర్యటనకు వచ్చి ఎర్ర కోట, మహాత్మాగాంధీ సమాధులను సందర్శించినపుడు శివాజీ సమాధి ఎక్కడ అని అడిగారట. కంగారు పడిన అధికారులు మహారాష్ట్రలోని రైగఢ్‌లో ఉందని చెప్పగా తాను అక్కడికి వెళ్లాలని చెప్పినట్లు, తరువాత సమాధిని సందర్శించి అక్కడి మట్టి తీసుకొని తన బ్రీఫ్‌కేసులో వేసుకున్నట్లు, విలేకర్లు ఎందుకా మట్టి అని అడగ్గా తమ దేశమట్టిలో దాన్ని కలుపుతానని, అలా చేస్తే శివాజీ వంటి ధైర్యవంతులు అక్కడ పుడతారని ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. దీన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ విలేకరి రాసినట్లు పేర్కొన్నారు. అసలు విషయం ఏమంటే అమెరికా మీద యుద్దం ముగిసిన తరువాత ముగిసిన తరువాత వియత్నాం విదేశాంగ మంత్రిగా మహిళలెవరూ పని చేయలేదు. అమెరికా దురాక్రమణలో ఉన్న దక్షిణ వియత్నాంలో కమ్యూనిస్టులు ఏర్పాటు చేసిన తిరుగుబాటు ప్రభుత్వంలో 1969-76 మధ్య కాలంలో గుయెన్‌ తీ దిన్‌ అనే కమ్యూనిస్టు పార్టీ నాయకురాలు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అన్నింటికీ మించిన పెద్ద అబద్దం ఏమంటే హౌచిమిన్‌ సిటీలో ఉన్నట్లు చెబుతున్న విగ్రహం అసలు శివాజీది కాదు. వియత్నాం మాజీ రాజు ట్రాన్‌ నగాన్‌ హన్‌ విగ్రహమది.


మరొక కధలో శివాజీతో పాటు రాజపుత్ర రాజు మహారాణా ప్రతాప్‌ సింగ్‌ పేరు చేర్చి ప్రచారం చేశారు. రెండు కథల్లోను రాసిన మరొక అంశం ఏమంటే వియత్నాం అధ్యక్షుడు తాను మరణించిన తరువాత తన సమాధి మీద ” ఇతడు శివాజీ, రాణాప్రతాప్‌ ఆరాధకుడు ” అని రాయించాలని ఆదేశిస్తే అలాగే చేశారట ఇక్కడ మనం గమనించాల్సింది. శివాజీ, రాణా ప్రతాప్‌ సింగ్‌లు వియత్నాం కమ్యూనిస్టులకు ఉత్తేజమిచ్చారని చెప్పటం కట్టుకధలు తప్ప మరొకటి కాదు. భారత చరిత్ర గురించి అధ్యయనం చేసిన పండితులు ఒకరిద్దరికి ఆ పేర్లు తగిలి ఉండవచ్చు తప్ప కమ్యూనిస్టు పార్టీకి ఉత్తేజమిచ్చేంత సీన్‌ లేదు.వియత్నామీయులకు ఉత్తేజమిచ్చింది మార్క్సిజం-లెనినిజం, సోవియట్‌ యూనియన్‌, చైనా కమ్యూనిస్టు పార్టీ తప్ప శివాజీ, రాణాలు కాదు. వారి నుంచి మన దేశంలోని వారే ఉత్తేజం పొందలేదు. అదే జరిగి ఉంటే మొగలాయీల పాలనకు, తరువాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి ఉండేవారు. అదేమీ లేదు.


శివాజీ, రాణా ప్రతాప్‌ కథలను ప్రచారం చేసింది కాషాయ దళాలు అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారిని కాపీకొట్టిన వారు వారి పేర్ల బదులు అంబేద్కర్‌ పేరు చేర్చి మరొక కథను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అదెలా ఉందో చూడండి. ” వియత్నాం ప్రపంచంలో ఒక చిన్న దేశం. అది అమెరికా లాంటి బలమైన దేశం మెడలు వంచింది.దాదాపు 20 సంవత్సరాల వరకు జరిగిన యుద్ధంలో అమెరికా పరాజయం చెందింది. అమెరికాపై విజయం సాధించిన తర్వాత వియత్నాం దేశాధ్యక్షున్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.ప్రశ్న అందరికీ విదితమే, మీరు యుద్ధం ఎలా గెలిచారు? అమెరికాను ఎలా తలవంచేలా చేశారు.కాని,ఆ ప్రశ్న కు ఇచ్చిన జవాబు మీరు వింటే కేవలం ఆశ్చర్యమే కాదు. మీ గుండె గర్వం తో నిండి పోతుంది.ఇచ్చిన జవాబును మీరు చదవండి. దేశాలన్నీంటిలోకీ అమెరికా చాల బలమైన దేశాన్ని ఓడించుటకు భారతదేశానికి చెందిన ఒక గొప్ప మహా నేత చరిత్ర ను చదివాను.ఆయన జీవితం యొక్క ప్రేరణను ఆచరించి నేను సులభంగా విజయాన్ని సాధించాను.ఎవరు ఆ గొప్ప నాయకుడు అని జర్నలిస్ట్‌ అడిగాడు.


”మిత్రులారా! ఇది నేను చదినప్పటినుండి నా గుండె గర్వంతో ఉప్పొంగినది. అలాగే మీ గుండె కూడ గర్వంతో నిండి పోతుంది. వియత్నాం అధ్యక్షుడు లేచి నిలబడి ఇలా సమాధానం చెప్పాడు.ఆయనే భారతదేశ మహానాయకుడు భీంరావ్‌ అంబేద్కర్‌. ఆయన అగ్రవర్ణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అన్నారు. బాబాసాహేబ్‌ అంబేద్కర్‌ పేరును ఉచ్చరించే సమయంలో తన కళ్ళలో వీరత్వం మెరిసిసింది.అంతేకాదు, ఒకవేళ ఆ వ్యక్తి మా దేశంలో పుట్టిఉంటే నేను ప్రపంచాన్నే పాలించేవాన్ని అన్నారు.కొన్ని సంవత్సరాలకు ఆ దేశాధ్యక్షుడు మరణించిన తరువాత తన సమాధి పై ఏం రాయించుకున్నాడో తెలుసా! ”ఈ సమాధి ఒక భీంరావ్‌ అంబేద్కర్‌ శిష్యుని సమాధి అని”. కొన్ని సంవత్సరాల తరువాత వియత్నాం విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటన కు వచ్చాడు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం మొదట ఎర్రకోట తరువాత గాంధీ సమాధి చూపించారు. ఇదంతా చూచిన తరువాత ఆ మంత్రి మహానీయ భీంరావ్‌ అంబేద్కర్‌ సమాధిó ఎక్కడ అని అడిగాడు.అప్పుడు భారత అధికారి ఆశ్చర్య పోయి ముంబై లోని దాదర్‌లో ఉన్న చైత్య భూమి అని చెప్పాడు.ఆ వియత్నాం విదేశాంగ మంత్రి ముంబై వెళ్ళారు.అక్కడ బాబాసాహేబ్‌ సమాధిని దర్శించుకున్నారు. సమాధి వద్ద కొంత మట్టిని తిసుకుని బ్యాగ్‌ లో నింపుకున్నాడు.ఓ విలేకరి ఆ మట్టి గురించి అడగగా ఆ మంత్రి ఇలా అన్నారు.”ఈ మట్టి బాబాసాహేబ్‌ పాదాల వద్ద ఉన్నది. ఈ మట్టిని నాదేశ మట్టితో కలుపుతాను ,దీనితో నాదేశంలో ఇలాంటి నాయకుడు జన్మిస్తాడని ఆశిస్తున్నాను.బాబాసాహేబ్‌ భీం రావ్‌ అంబేద్కర్‌ కేవలం భారత దేశానికే కాకుండా సమస్త విశ్వానికే గర్వ కారణం.” ఈ కథ ఇప్పుడు వాట్సాప్‌లలో తిరుగుతున్నది. అంబేద్కర్‌ ఒక సంస్కర్తగా దేశ చరిత్రలో ఆయన స్దానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అతిశయోక్తులు చెప్పటం ద్వారా సాధించేదేమిటి ? కాపీ కథ ఆయనకు గౌరవం పెంచుతుందని భావిస్తున్నారా ?


ఇక అతిశయోక్తులు, ఘనతల చెప్పుకోవటాలు సరేసరే ! ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి రోజువారీ అంశాల గురించి చర్చ జరుపుతుంది. దాని నిబంధనల ప్రకారం శాశ్వత, రెండు సంవత్సరాల పాటు సభ్యులుగా ఉండే దేశాలలో నెలకు ఒకరు చొప్పున అధ్యక్షత వహిస్తుంటారు. సాధారణంగా ఐరాసలో శాశ్వత అధికారులుగా ఉన్న ఆయా దేశాల ప్రతినిధులే ఆ పని చేస్తారు. ఆగస్టు నెల అధ్యక్ష పదవి మన దేశానికి వచ్చింది. ఆంగ్ల అక్షరమాల ప్రకారం వంతులను నిర్ణయిస్తారు. ఇదేదో ప్రధాని నరేంద్రమోడీ పలుకుబడికి నిదర్శనం అన్నట్లుగా కొందరు ప్రచారం చేశారు. భద్రతా మండలికి మన దేశం ఎన్నిక కావటం మొదటిసారి కాదు, ఎన్నికైన ప్రతిసారీ మనవంతు వచ్చినపుడు ఆ బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం టిఎస్‌ తిరుమూర్తి మన శాశ్వత ప్రతినిధిగా ఉన్నారు. గతంలో మోడీ సర్కార్‌లో మంత్రిగా ఉన్న హర్దీప్‌ సింగ్‌ పూరీ రెండు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. మరొకటి తొలిసారిగా ఒక భారత ప్రధాని భద్రతా మండలి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నారంటూ అదొక ఘనతగా ప్రచారం చేస్తున్నారు. భద్రతా మండలిలో ప్రతినెలా వివిధ అంశాల మీద బహిరంగ చర్చలు జరుగుతుంటాయి. భద్రతా మండలి సభ్యదేశాల అధిపతులు లేదా ప్రతినిధులు వాటిలోప్రత్యక్షంగా పాల్గొంటారు, కాని దేశాల వారు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా సమర్పిస్తారు. అలాంటి నెలవారీ కార్యక్రమంగా ఈనెలలో సముద్రయాన భద్రత అంశం గురించి చర్చిస్తున్నారు. దానికి మన ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎంత మంది దేశాధినేతలు పాల్గొంటారో తెలియదు. ఇదొక గోష్టి వ్యవహారం తప్ప అంతకు మించి ప్రాధాన్యత ఉండదు. పెగాసస్‌ భూతంతో అనేక అంశాలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోడీకి ఈ గోష్టి ప్రపంచ మీడియాలో చోటు కల్పిస్తుంది. ఇలాంటి వాటిని గొప్పగా చెప్పుకోవటమా లేదా అన్నది ఎవరి అభిరుచి వారిది !