Tags
75th India Independence Day, India foreign policy under narendra modi, India independence @75, Narendra Modi Failures, Quadrilateral Security Dialogue
ఎం కోటేశ్వరరావు
1757లో ప్లాసీ యుద్దంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించిన తరువాత ఆంగ్లేయులు మన దేశంలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1947వరకు పాలించారు, మన సంపదలను దోచుకున్నారు, వారి పారిశ్రామిక ఉత్పత్తులకు మన దేశాన్ని ముడి వస్తువులను సరఫరా చేసేదిగానూ, వినియోగ మార్కెట్‌గా మార్చివేశారు. ఏడున్నర దశాబ్దాల తరువాత చూస్తే పరిస్ధితి ఏమిటి ? బ్రిటీష్ వారు భౌతికంగా మనలను పాలించటం లేదు తప్ప ఆ దేశానికి చెందిన వాటితో సహా అనేక దేశాల సంస్దలు మనలను కొత్త రూపాల్లో ఇంకా దోపిడీ చేస్తూనే ఉన్నాయి. మన దగ్గర లేని పెట్టుబడులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు విదేశీ కంపెనీలను అనుమతించాలా వద్దా అంటే అనుమతించక తప్పదు, ఎవరూ అభ్యంతర పెట్టటం లేదు. కానీ ఆ పేరుతో విదేశీ కంపెనీలకు మన మార్కెట్ ద్వారాలు తెరిస్తే మనం అభివృద్ధి చెందేది ఎప్పుడు, మన జనానికి ఉపాధి దొరికేది ఎన్నడు ? ప్రభుత్వ రంగమూ లేదు, ప్రయివేటు రంగం ముందుకు రావటం లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు చైనాకు పోటీగా మన దేశాన్ని మరో ప్రపంచ ఫ్యాక్టరీగా చేస్తామని నరేంద్రమోడీ మేక్ ఇండియా,మేకిన్ ఇండియా అన్నారు. వాటి సూచనలే లేవు. పిలుపులు ఇస్తే చాలదు, ఆచరణకు అనువైన విధానాలను చేపట్టాలి. చివరకు ఆ చైనా నుంచే వస్తువులను దిగుమతి చేసుకోకపోతే గడవని స్ధితి.
మన కంటే రెండు సంవత్సరాలు ఆలశ్యంగా విదేశీ దురాక్రమణ నుంచి రెండవసారి స్వాతంత్య్రం తెచ్చుకుంది చైనా. ఆ నాటికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మనకంటే వెనుకబడి ఉంది. అలాంటి దేశం ఇప్పుడు ఎక్కడ ఉంది ? అత్యంత అభివృద్ది చెందిన అమెరికా, ఐరోపా ధనిక దేశాలను అధిగమించి ముందుకు పోతున్నది. మరో పది సంవత్సరాలలో ఆర్ధికంగా అమెరికాను వెనక్కు నెట్టి ప్రధమ రాజ్యంగా అవతరించనుంది. ఇప్పటికే టెలికాం రంగం, మరికొన్ని పరిజ్ఞానాల్లో పశ్చిమ దేశాల కంటే ముందుంది. వారికి సాధ్యమైంది మనకు ఎందుకు కావటం లేదు ? అది కమ్యూనిస్టు నియంత దేశం మనది ప్రజాస్వామ్యం కనుక చైనాతో పోల్చకూడదు అంటారు. ప్రపంచంలో అనేక దేశాలను ఏలిన నియంతలందరూ తమను ప్రజాస్వామ్యవాదులుగా వర్ణించుకున్నారు. మరి ఆ దేశాలు చైనా మాదిరి వృద్ది చెందలేదేం ? పోనీ మనది నిజమైన ప్రజాస్వామ్యం అనుకుంటే చైనాతో పోల్చితే మనం ఎక్కడ ఉన్నాం. స్వేచ్చ, స్వాతంత్య్రం అవసరం అయినదాని కంటే ఎక్కువ ఉందంటున్నారు గనుక అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో మన జనం పని చేయాలి కదా ? లోపం ఎక్కడుంది ?
బ్రిటీష్ వారు వెళ్లిపోతూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. హిందూ-ముస్లిం విబేధాలను రగిలించారు. ఆ సందర్భంగా జరిగిన హింసాత్మక ఉదంతాలలో లక్షలాది మంది మరణించారు, ఆ సంఖ్యను రెండు నుంచి 20లక్షలుగా చెబుతారు. అలాగే కోటి నుంచి రెండు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. నాడు ఆంగ్లేయులు తమ అజెండాను అమలు చేసేందుకు తనకు అనుకూలంగా పాకిస్ధాన్ పేరుతో కొంత ప్రాంతాన్ని మరల్చుకొనేందుకు మత విభజనను ముందుకు తెచ్చారు. ఏడున్నర దశాబ్దాల తరువాత ఇప్పుడు దేశంలో పెరుగుతున్న మత విభజనను ఎవరు తెస్తున్నారు, ఎవరి ప్రయోజనం కోసం ? వీరికీ బ్రిటీష్ వారికీ తేడా ఏముంది ? బ్రిటీష్ వారిని తప్పు పట్టిన వారు వీరి విషయంలో అలా ఎందుకు ఉండలేకపోతున్నారు ?
మనకు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ప్రభుత్వం దగ్గర అవసరమైన పెట్టుబడిలేకపోవటంతో ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్ని కూడా ప్రోత్సహిస్తూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ పేరుతో ప్రభుత్వం ఒక పునాది వేసింది. పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి సాధించాలనే పద్దతిని అనుసరించారు. ప్రభుత్వ రంగం ప్రజల ఆస్తులను పెంచటమే కాదు, సామాజిక న్యాయాన్ని అమలు జరపటంలో, ఆదర్శయజమానిగా వ్యవహరించటంలో ముందుంది. మిలిటరీ, కరెన్సీ, పోలీసుల, సరిహద్దుల భద్రత, కీలకమైన రక్షణ పరిశ్రమల వంటి తప్ప మిగిలిన రంగాల నుంచి ప్రభుత్వం వైదొలగాలన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ఆదేశాల మేరకు 1990దశకం నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతోంది. ప్రభుత్వ రంగ సంస్ధలను క్రమంగా వదిలించుకుంటున్నారు. ఈ విధానాలలో కాంగ్రెస్-బిజెపికి ఉన్న తేడా ఏమంటే బిజెపి వేగం పెంచింది. గత మూడు దశాబ్దాలలో ఎవరు అధికారంలో ఉన్న కొన్ని రక్షణ విభాగాల్లో తప్ప మిగతావాటిలో ఎక్కడా ఒక్క పైసా కూడా పెట్టుబడులు పెట్టటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే చేస్తున్నాయి. తాజాగా రక్షణ రంగంలో కూడా ప్రయివేటుకు ద్వారాలు తెరిచారు. అమెరికా, ఐరోపా దేశాల అనుభవం చూసినపుడు ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ పరిశ్రమల సముదాయాలు అభివృద్ధి చెందాయి. ఫలితంగా వాటి లాభాలను పెంచేందుకు ప్రపంచ వ్యాపితంగా నిత్యం ఎక్కడో ఒకచోట స్వయంగా యుద్దాలకు దిగటం లేదా రెండు దేశాల మధ్య తంపులు పెట్టి ఇరుపక్షాలకూ ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నది. గతంలో భారత్ -పాక్ మధ్య అదేపని చేసిన అమెరికా ఇప్పుడు చైనా మీదకు మనలను ఉసిగొల్పి మనకు ఆయుధాలు అమ్ముతున్నది. విమానాలతో సహా స్వంతంగా తయారు చేసుకొనే స్ధితిలో వారున్నారు గనుక అమెరికా ఆయుధాల భారం మోసేది మనమే. ఏడు సంవత్సరాలుగా చమురు పన్నులు పెంచుతున్న పాలకులు ఎందుకు పెంచారంటే గాల్వన్ ఉదంతాన్ని చెబుతున్నారు. అది జరిగింది ఎప్పుడు ? మనల్ని బాదటం ప్రారంభించింది ఎప్పుడు ?
ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారీ పరిశ్రమలను ఆసరా చేసుకొని అనేక ప్రయివేటు పరిశ్రమలు అభివృద్ది చెందాయి. ఐడిపిఎల్‌లో పని చేసిన వారు అనేక మంది ఔషధ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగారో చూస్తున్నాము. అలాంటి వారు నేడు ప్రభుత్వ రంగంలో ఫార్మా పరిశ్రమలను మూసివేసే విధంగా వత్తిడి తెచ్చి వాటి స్ధానాన్ని వారు అక్రమించటం తెలిసిందే. వాక్సిన్ల తయారీని సీరం, భారత్ బయోటెక్ వంటి ప్రయివేటు సంస్ధలకు వదలివేసి ప్రభుత్వరంగంలోని సంస్ధలను పాడు పెట్టటం గురించి ఇటీవలనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మన దేశంలో తయారీ బదులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే లాభమా నష్టమా అని లెక్కలు వేసుకొని మన బిహెచ్‌యిఎల్‌ను దెబ్బతీసి దిగుమతులు చేసుకోవటం విద్యుత్ రంగంలో చూశాము.ఇదే పరిణామం అనేక రంగాల్లో కనిపిస్తుంది. మన దేశంలో అనేక మంది నిపుణులు ఉన్నప్పటికీ పరిశోధన-అభివృద్ది రంగంలో తగిన పెట్టుబడులు పెట్టకుండా సాంకేతిక రంగంలో ముందుకు పోవటం ఏ దేశానికీ సాధ్యం కాదు. చైనాలో సోషలిస్టు వ్యవస్ధను నిర్మించాలన్న కమ్యూనిస్టు పార్టీ లక్ష్యమొక్కటే కాదు, పరిశోధనా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కారణంగానే నేడు పశ్చిమ దేశాలకు సవాలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ముందుకు పోతోంది.
ప్రభుత్వం పెట్టుబడులు పెట్టటం నిలిపివేసింది. ప్రయివేటు రంగం మీద అన్నింటినీ వదలివేసింది. అమెరికా, ఐరోపా దేశాల ప్రయివేటు సంస్ధలు తమ దేశాల్లో పరిశ్రమలు పెట్టటం కంటే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలనుంచి వినియోగవస్తువులను దిగుమతి చేసుకొని లబ్దిపొందాయి. గత ఏడు సంవత్సరాల కాలంలో నరేంద్రమోడీ ఏలుబడిలో చైనా నుంచి దిగుమతులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయంటే దాని అర్ధం ఇక్కడి పారిశ్రామిక-వాణిజ్య సంస్దలు కూడా అదేబాట పట్టాయన్నది స్పష్టం.లడఖ్ సరిహద్దులోని గాల్వన్‌లోయలో రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తరువాత చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టారు. ఏడాది కాలంలో కరోనా కారణంగా మొత్తంగా మన దిగుమతులు తగ్గాయి కనుక ఆమేరకు చైనా నుంచి తగ్గాయి తప్ప ఇప్పటికీ అక్కడి నుంచే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాము. ఇటీవలి కాలంలో తిరిగి పెరుగుదల ప్రారంభమైంది.
విదేశాంగ విధానంలో అటు అమెరికా ఇటు సోవియట్ వైపు మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించి అలాంటి దేశాల నేతగా మన దేశం ఎదగటమే కాదు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించింది. సోవియట్ యూనియన్ను కూల్చివేసిన తరువాత మన దేశం అలీన విధానానికి స్వస్తిపలికింది. అమెరికాకు చేరువ కావటమే కాదు, దాని జూనియర్ భాగస్వామిగా మారేందుకు అడుగులు వేసింది. దానితో సంబంధాల కారణంగానే యుపిఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. గత ఏడు సంవత్సరాల పరిణామాలను చూస్తే అమెరికాకు దగ్గరయ్యే వేగం పెరిగింది. ట్రంప్ హయాంలో మన దేశం నుంచి చేసుకుంటున్న దిగుమతుల మీద ఇస్తున్న పన్ను రాయితీలను అమెరికా రద్దు చేసింది. అదే విధంగా మనం అనుసరిస్తున్న కనీస మద్దతు ధరల విధానం ద్వారా పరిమితులకు మించి సబ్సిడీలు ఇస్తున్నామనే పేరుతో దాన్ని రద్దు చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధలో అమెరికా కేసులు దాఖలు చేసింది. ఆ వత్తిడికి లొంగి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల పేరుతో చట్టాలను పార్లమెంట్‌లో ఎంత హడావుడిగా ఆమోదింప చేయించుకుందో చూశాము. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు అప్పగించేందుకు వేసిన తొలి అడుగు అవి. వాటి ప్రమాదాన్ని గ్రహించిన పంజాబ్, హర్యానా, యుపిలోని వ్యవసాయ ప్రధాన ప్రాంతాల రైతాంగం గతేడాది నవంబరు నుంచి నిరవధిక ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
అలాంటి అమెరికాతో కలసి మలబార్ తీరంలో సైనిక విన్యాసాలు జరుపుతున్నాము. మనకు సంబంధం లేని దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్చగా నౌకారవాణాను అనుమతించాలనే పేరుతో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలసి చతుష్టయం పేరుతో చైనా వ్యతిరేక కూటమిలో చేరాము. అంతేకాదు అమెరికాకు అంగీకారం లేదు గనుక ప్రాంతీయ ఆర్దిక సమగ్ర భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)లో చేరేందుకు నిరాకరించాము. దానిలో చేరితే మన రైతాంగం, పరిశ్రమలు, వాణిజ్యాలకు హాని జరిగే మాట నిజం. దాన్ని సాకుగా చూపినప్పటికీ అమెరికాతో బిగుస్తున్న ముడే ప్రధానంగా వెనక్కు లాగింది. మరోవైపు తమ ప్రయోజనాలను బేరీజు వేసుకొని అమెరికా వద్దని వారిస్తున్నా ఆర్‌సిఇపిలో జపాన్, ఆస్ట్రేలియా భాగస్వాములయ్యాయి. ఈ పరిణామాల తరువాత ఆకస్మికంగా గాల్వన్ ఉదంతాలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి ప్రత్యేక అజెండా లేకుండానే నరేంద్రమోడీ చైనా పర్యటన తరువాత గ్జీ జింపింగ్ అదే మాదిరి మహాబలిపురం వచ్చిన విషయం తెలిసిందే.
రాచపీనుగ ఒంటరిగా పోదన్న సామెత తెలిసిందే. అమెరికాతో అంటకాగితే దానికి వచ్చే సమస్యలను మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. దానికి చక్కటి ఉదాహరణ ఆఫ్ఘన్ ఉదంతమే. అక్కడి నుంచి అమెరికా సేనల ఉపసంహరణ తరువాత వారి నమ్మి పెట్టుబడులు ఏమౌతాయో తెలియదు. అన్నింటికీ మించి తాలిబాన్ల ముప్పు మన దేశానికి ఎదురవుతుందా అన్న సమస్య ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికాతో వ్యవహరించిన మన దేశం అమెరికా మాదిరే ఉగ్రవాదులైన తాలిబాన్లతో రహస్యంగా చర్చలు జరపాల్సి వచ్చింది. తాలిబాన్లను అదుపు చేయాలంటే పాకిస్దాన్ సహకారం అవసరం గనుక నాటకీయ పరిణామాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ గురించి ఒప్పందం కుదిరినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో మన ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇరాన్ – అమెరికా వివాదంలో మనకేమీ సంబంధం లేదు. అమెరికన్లు ఇరాన్ మీద ఆంక్షలు విధించారు. తమ నిర్ణయాన్ని ఉల్లంఘించే దేశాల మీద కూడా చర్యలు తీసుకుంటామని అమెరికా బెదిరించింది. మన దేశం భయపడిపోయి ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసింది.అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మన మిత్రదేశం ఇరాన్ గతంలో సమదూరంలో ఉండేది ఇప్పుడు చైనాకు దగ్గర అయింది. మన చుట్టుపక్కల దేశాలన్నీ అదే విధంగా మారాయి. కారణం అమెరికాను మనం కౌగలించుకోవటమే.
తొలి 75 సంవత్సరాల స్వాతంత్య్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రధానంగా ముందుకు వచ్చిన ధోరణి కాంగ్రెస్ వ్యతిరేకత. ఇప్పుడు 75 సంవత్సరాల తరువాత దాని స్ధానంలో బిజెపి వ్యతిరేకతకు పునాది పడింది. రెండింటికీ కారణం ఒక్కటే. కాంగ్రెస్ ఎలా అయితే అప్రజాస్వామికంగా ప్రత్యర్ది పార్టీల ప్రభుత్వాలను కూల్చివేయటం, పార్టీలను దెబ్బతీయటం చేసిందో, బిజెపి ఏడు సంవత్సరాల్లోనే దాన్ని మించి పోయింది. దానికి తోడు మతతత్వాన్ని జోడిస్తోంది. ఇది సమాజం చీలిపోవటానికి దారి తీస్తుంది. వామపక్షాలు మినహా కాంగ్రెస్, బిజెపి, వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య ఆర్దిక విధానాల విషయంలో ఎలాంటి పేచీ లేదు. పంచాయతీ అల్లా అధికారం దగ్గరే. అందుకే గతంలో కాంగ్రెస్ వ్యతిరేకత ముందుకు వస్తే దాని స్దానంలో ఇప్పుడు బిజెపి వచ్చింది. అయితే జనం కాంగ్రెస్‌కు ఇచ్చినంత అవకాశం బిజెపికి ఇచ్చే స్ధితి లేదు.
ఏ దేశమైనా తమ ప్రయోజనాలకు తొలి పీట వేయటం ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతోంది. అది దురహంకారంగా మారకపోతే, ఇతర దేశాల ప్రయోజనాలకు ఎసరు పెట్టే విధంగా లేకపోతే ఇబ్బంది లేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు తమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను బాగు చేసుకోవటం లేదా ముందుకు పోవటం ఎలా అనేదాని కంటే చైనాను దెబ్బతీయటం మీదనే కేంద్రీకరిస్తున్నాయి.దేశీయంగా దివాలా కోరు విధానాలను అనుసరిస్తున్నంత కాలం మరో 75 సంవత్సరాలు గడచినా జన జీవితం మెరుగు పడదు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని వదలి ఏదో ఒక దేశానికి తోకగా మారితే దాని తప్పులకు మనం కూడా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పాలకులు ఎలాగూ ఈ విషయాలను పట్టించుకొనే స్ధితి లేదు. జనం పట్టించుకోకపోతే ఆమృత మహౌత్సవం ముగిసిన తరువాత హాలా హలాన్ని మింగాల్సి వస్తుందన్నదే 75వ స్వాతంత్య్రదినోత్సవ హెచ్చరిక !
మొదటి భాగం https://vedikaa.com/2021/08/08/india-independence-75-what-is-happening-part-one/
Pingback: ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్రం-1 : అమృత ఉత్సవమా ! హాలాహలమా !! | vedika