Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఆందోళన చెందుతున్నది కమ్యూనిస్టులా ? పెట్టుబడిదారులా ? వారి చౌకీదార్లుగా ఉన్నవారా ? పెట్టుబడిదారీ విధానానికి, మతాలకు ఉన్నట్లే కమ్యూనిస్టు లక్ష్యాల కోసం, కుల, మత రహిత సమాజం కోసం పోరాడేవారికీ చౌకీదార్లు ఉంటారు. భిన్న లక్ష్యాలతో నిరంతరం కాపాడుతూ ఉంటారు. కమ్యూనిస్టులు చెబుతున్నట్లుగా తూర్పు ఐరోపా రాజ్యాలు, సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌లను కూల్చివేసినపుడు లేదా ఇతరులు భావిస్తున్నట్లు అవి పతనమైనపుడు అనేక మంది కమ్యూనిస్టులు పార్టీల పేర్లు, జండాలు, అజెండాలు మార్చుకున్నారు. వేరే పార్టీల్లో చేరిపోయారు. కమ్యూనిస్టులకు భవిష్యత్‌ లేదని భావించటమే దానికి కారణం. అలాంటి వారంతా పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందా ?


రోజులెప్పుడూ ఒకే విధంగా ఉండవు. జనం ఎప్పుడూ మత్తులోనే ఉండరు. అది మానవ లక్షణం కాదు. అయినా కొందరు మార్పును గుర్తించేందుకు భయపడతారు.1948 ఫిబ్రవరి 21న కమ్యూనిస్టు ప్రణాళిక తొలి ముద్రణ జరిగింది. నాడు జర్మనీలో తీవ్ర నిర్బంధం కారణంగా మార్క్స్‌-ఎంగెల్స్‌ దాన్ని లండన్‌లో ముద్రించారు. ప్రస్తుతం ఐరోపాను ఒక భూతం భయపెడుతోంది. అది కమ్యూనిస్టు భూతం అన్న పదాలతో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అదే బ్రిటన్‌లో పెట్టుబడిదారులను మరోసారి వెంటాడుతోంది. కుర్రకారు సోషలిజం అంటున్నది, దీన్ని తేలికగా తీసుకోవద్దు అంటూ పెట్టుబడిదారీ విధాన చౌకీదారు డాక్టర్‌ క్రిస్టినా నిమెట్జ్‌ తీవ్ర హెచ్చరిక చేశాడు.


ఈ రోజు నేటి తరం వామపక్షం వైపు చూస్తున్నదని అనుకుంటున్నాము త్వరలో మొత్తం బ్రిటన్‌ జనాభాయే వామపక్షంగా మారిపోవచ్చని హెచ్చరిస్తూ లండన్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ ఎఫైర్స్‌(ఐఇఏ) సంస్ద జూలైనెలలో 76పేజీల ఒక పత్రాన్ని వెలువరించింది.డాక్టర్‌ క్రిస్టియన్‌ నిమిట్జ్‌ దాన్ని రాశారు. దానిలో పేర్కొన్న అంశాలు పెట్టుబడిదారీ వ్యవస్ధకు మేలుకొలుపు అని లండన్‌ ఎకనమిక్‌ సంస్ధ తన సమీక్షలో హెచ్చరించింది. ఇంకా అనేక పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలు దాని గురించి చర్చించాయి. ఐఇఏ సర్వేలో తేలిన అంశాలేమిటి ? బ్రిటన్‌లోని 67శాతం మంది మిలీనియల్స్‌, జడ్‌ తరం (1981-96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌ అని పిలిస్తే 1997 తరువాత పుట్టిన వారిని జెడ్‌ తరం అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధలో జీవించాలనుకుంటున్నారని, 70శాతం మంది పెట్టుబడిదారీ వ్యవస్ధ స్వార్ధాన్ని ప్రోత్సహిస్తున్నదని భావిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. వాతావరణ,గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ వ్యవస్తేకారణమని యువతరం భావిస్తున్నది. సోషలిజం అంటే సమానత్వం, న్యాయమైన, జనం కోసమనే సానుకూల వైఖరి, పెట్టుబడిదారీ వ్యవస్ధ అంటే దోపిడీ, అన్యాయం, ధనికులు, కార్పొరేట్లకోసం పని చేసేదనే ప్రతికూల అభిప్రాయాలను బ్రిటన్‌ యువతరం ఎక్కువగా కలిగి ఉంది.


యువతరం పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారని, సోషలిస్టు ప్రత్యామ్నాయం పట్ల సానుకూలంగా ఉన్నట్లు పరిశోధన నిర్ధారించింది. లెఫ్ట్‌ టర్న్‌ ఎహెడ్‌ (వామపక్ష మార్గం ముందున్నది) అనే పేరుతో రూపొందించిన పత్రం మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదార్లకు ఒక మేలుకొలుపుగా ఉండాలి.పెట్టుబడిదారీ విధానాన్ని తిరస్కరిస్తున్నట్లు సంగ్రహరూపంలోనే ఉండవచ్చు గానీ అది బ్రెక్సిట్‌ ( ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు రావటం )కూ వర్తిస్తుంది. ఈ పరిశోధన 2021 ఫిబ్రవరి -మార్చినెలలో 16-34 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న రెండువేల మంది మీద జరిగింది. అరవై ఏడుశాతం మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పు ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని 75శాతం మంది అంగీకరించారు. బ్రిటన్‌లో గృహ సంక్షోభానికి పెట్టుబడిదారీ విధానమే కారణమని 78శాతం చెప్పారు. ఇంధనం, నీరు, రైల్వేలను తిరిగి జాతీయం చేయాలని 72శాతం మంది కోరారు. జాతీయ ఆరోగ్య సేవలు(ఎన్‌హెచ్‌ఎస్‌) ముప్పు ఎదుర్కోవటానికి ప్రయివేటు రంగమే కారణమని 72శాతం మంది నమ్ముతున్నారు. సోషలిజం మంచి భావనే, అయితే అది వైఫల్యం చెందటానికి అమల్లో లోపమే అని 75శాతం మంది చెప్పారు.


యువతలో వామపక్ష భావాలకు మద్దతు లేదని మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు చెబుతుంటారు. కానీ యువతరాన్ని వామపక్ష భావాలకు దూరంగా ఉంచగలమని పెట్టుబడిదారులు ఇంకెంతో కాలం తమకు తాము నచ్చచెప్పుకోలేరు. మిలీనియల్స్‌ మరియు జడ్‌ తరం మధ్య గతంతో పోల్చితే పెద్దగా తేడా లేదు.మిలినియల్స్‌ సోషలిస్టు భావన వెలుపల ఉన్నారనుకుంటే జూమర్స్‌(1990దశకం తరువాత పుట్టిన వారు) దానిలోనే పెరుగుతారని తేలింది. ఈ సర్వేలో తేలిన అంశాల అర్ధం భావజాల పోరులో పెట్టుబడిదారీ వ్యవస్ధ మద్దతుదారులు ఓటమిని అంగీకరిస్తూ తెల్లజెండా ఎత్తి, భవిష్యత్‌ సోషలిజానిదే అని అంగీకరించాల్సిందే అన్నట్లుగా వ్యహరించాలని కాదు, దాని బదులు మిలియన్ల సోషలిజాన్ని ఇప్పటి కంటే మరింత తీవ్రంగా పరిగణించాలని. విశ్లేషణ పత్ర రచయిత నిమిట్జ్‌ వాదించినట్లు లండన్‌ ఎకనమిక్‌ సమీక్షకుడు పేర్కొన్నారు.


తన పత్రంలో క్రిస్టియన్‌ నిమిట్జ్‌ ఇలా చెప్పారు.” మిలీనియల్‌ సోషలిజం కేవలం సామాజిక మాధ్యమంలో జరిగే తీవ్ర ప్రచారం కాదు. జర్మీ కార్బిన్‌(లేబర్‌ పార్టీ నేత) రాజీనామా మాదిరి తాత్కాలిక సంచలనంగా ముగిసేది కాదు. లేదా 1960దశకం నాటి విద్యార్ధుల సమూల సంస్కరణవాద పునశ్చరణ కాదు. వైఖరుల్లో వచ్చిన దీర్ఘకాలిక మొగ్గు ఇది. అది దానంతట అదే పోదు. మార్కెట్‌ ఆర్ధిక వ్యవస్ధ మద్దతుదారులు ఈ సవాలును స్వీకరించాల్సి ఉంది. దానికి అనుగుణ్యంగా ఎదగాలి. దాన్ని తోసిపుచ్చటం లేదా అదేమీ జరగటం లేదని నటించకూడదు. యువత ఎదుర్కొంటున్న సమస్యలకు మార్కెట్‌ ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని సానుకూలమైనదిగా చూపాల్సి ఉంది. ప్రతిచోట, అన్ని వేళలా సోషలిజానికి దారులు మూసుకుపోయినప్పటికీీ అది ఇంకా ఎందుకు మరులు గొల్పుతున్నదో మనం వివరించాలి.” అన్నారు. ” అనాసక్తి తరం ” వామపక్ష తరం ”గా మారుతున్నదని ఈ నివేదిక పేర్కొన్నది.


కుర్రాళ్లు సోషలిజాన్ని అభిమానిస్తున్నారనే ఐయిఏ విశ్లేషణను టాక్‌ రేడియో వ్యాఖ్యాత మైక్‌ గ్రాహమ్‌ కొట్టి పారవేశాడు. పక్కతడిపే-నిద్రలేవగానే కంప్యూటర్లపై వేళ్లాడించే మధ్యతరగతి కుర్రాళ్లు సోషలిజానికి మద్దతు ఇచ్చినంత మాత్రాన జరిగేదేమీ ఉండదన్నాడు. వారికి లేబర్‌ పార్టీ నేత జెర్మీ కోర్బిన్‌ ఒక ఆధ్యాత్మిక నేత, సాంకేతికంగా అతనింకే మాత్రం ప్రతిపక్ష నేతగా ఉండడు అన్నాడు. నోరుపారవేసుకున్న గ్రాహమ్‌పై పలువురు విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ నేత ఆవెన్‌ జోన్స్‌ ట్వీట్‌ చేశాడు. వర్తమానంలో యువతలో ఎక్కువ మంది అప్పులు చేసి చదువుకున్నారు, అద్దె ఇండ్లలో ఉన్నారు, రుణభారంలో కూరుకుపోయారు.దారుణమైన పరిస్ధితుల్లో తక్కువ వేతనాలతో పని చేస్తున్నారు.అందరూ మధ్యతరగతి వారే. వృద్దులు ఎక్కువ మందికి స్వంత ఇళ్లు ఉన్నాయి, వారంతా కార్మికులు. సమాజంలో 75శాతం మంది మధ్యతరగతి ఉంటారా, వారంతా కలిగిన వారేనా, మీరు నిజాయితీగా ఆలోచిస్తున్నారా అంటూ మరికొందరు విమర్శించారు. గ్రాహమ్‌ వంటి వారిని ఉద్దేశించి నిమిట్జ్‌ పెట్టుబడిదారీ మద్దతుదార్లను తీవ్రంగా హెచ్చరించాడని చెప్పవచ్చు.


ఇటీవలి సామాజిక ఉద్యమాలు నల్లజాతీయుల జీవన సమస్యలు, గ్రేటా టన్‌బెర్గ్‌ వాతావరణ పరిరక్షణ, 2017ఎన్నికల్లో జెర్మీ కార్బిన్‌ ప్రచారం, అహింసాత్మక పర్యావరణ ఉద్యమం వంటి వాటితో ఇటీవలి కాలంలో యువత రాజకీయాలను అధ్యయనం చేస్తున్నది. వయస్సులో ఉన్నపుడు కమ్యూనిస్టు – ముదిరిన తరువాత కాపిటలిస్టుగా యువత మారిపోతుందనే వాదనలను నిమిట్జ్‌ కొట్టిపారవేశాడు. ఆర్ధిక విషయాల పట్ల యువతలోనూ, 40దశకం ప్రారంభంలో ఉన్నవారిలో పెద్దగా తేడాలు లేవు. పెద్దవారయ్యే కొద్దీ యువత సోషలిజానికి దూరం అవుతారనేది ఇంకేమాత్రం నిజం కాదు అన్నారు. నేడు వామపక్ష తరం చిన్నదిగానే ఉండవచ్చు గానీ రేపు బ్రిటన్‌లో అదే ప్రధాన స్రవంతి అభిప్రాయంగా మారవచ్చు. ఇటీవలి ఎన్నికల్లో వర్గ భావన కంటే వయస్సు ప్రధాన రాజకీయ విభజన అంశంగా మారింది. 2019 ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ వయస్సు మీరిన ఓటర్లలో సామాజిక మితవాద భావనలను ముందుకు తెచ్చి వారిలోని మెజారిటీ ఓట్లను పొంది విజయం సాధించాడు. నాలుగు పదులు దాటిన వారు ఎక్కువ మంది లేబర్‌ పార్టీ బదులు కన్సర్వేటివ్‌ పార్టీనే ఎంచుకున్నారు. 1980 తరువాత పుట్టిన వారు(వామపక్ష తరం) అత్యధికులు జర్మీ కోర్బిన్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ వైపు మొగ్గారు. యువతరంతో పోల్చితే వయస్సు పైబడిన వారు ఒకరికి ఇద్దరు ఉన్నారు. రానున్న సంవత్సరాలలో ఈ తేడా క్రమంగా అంతరిస్తుంది. వామపక్ష తరం 2019లో ఓటర్లలో 38శాతం ఉండగా 2024 నాటికి 43శాతానికి, 2030 నాటికి 52శాతానికి పెరుగుతుందని అంచనా. ఇది మితవాద రాజకీయ వ్యూహానికి పెద్ద సవాలుగా మారనుంది. జుట్టునెరిసిన వారు ఎక్కువై 2010లో లేబర్‌ పార్టీ ఓడిపోయినట్లుగానే రాబోయే రోజుల్లో కన్సర్వేటివ్‌ పార్టీకి అదే పరిస్ధితి ఎదురు కావచ్చు.” పెట్టుబడిదారీ వ్యతిరేక యువతరం కేవలం నడుస్తున్న ఒక దశకాదు, వారు దాన్నుంచి బయటపడరు. ఇదే ధోరణి కొనసాగితే అవి భవిష్యత్‌లో మొత్తం జనాభాలో ప్రధాన స్రవంతి అభిప్రాయాలుగా మారతాయి. వామపక్ష తరం కాస్తా వామపక్ష జనంగా మారుతుందని నిమిట్జ్‌ అన్నాడు.