Tags
75 years India Independence, CPI(M), India Flag, MS Golwalkar, RSS Duplicity, RSS Hindutva, RSS Mohan Bhagavat, RSS Propaganda War
ఎం కోటేశ్వరరావు
చారిత్రాత్మక దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకసారి చెప్పింది మరొకసారి మాట్లాడని ప్రధాని నరేంద్రమోడీ తన శైలి, సంప్రదాయాన్ని తప్పి వరుసగా మూడవ సంవత్సర ప్రసంగంలో కూడా వంద లక్షల కోట్ల పెట్టుబడుల గురించి పునశ్చరణ చేశారు. మార్పు ఏమంటే దానికి ” ప్రధాన మంత్రి గతిశక్తి ” అని పేరు పెట్టారు. ఈ మాత్రానికే మూడు సంవత్సరాలు తీసుకుంటే దాని అమలు గురించి చెప్పుకుంటే చాల బాగోదు. కరోనా సందర్భంగా ప్రకటించిన 25లక్షల కోట్ల ఆత్మనిర్భర పాకేజి బండారం ఏమిటో తెలిసిందే. 75వారాల ముందే అమృతోత్సవంగా ఈ సందర్భాన్ని ప్రారంభించుకున్నాము. ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో చూసిన తరువాత వాటిని మరోమారు సమీక్షించుకుందాం.
డెబ్బయి అయిదవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ నిర్ణయించింది. ఈ నిర్ణయం గురించి మీడియాలో చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి, ఇంకా రావచ్చు. కొత్త బిచ్చగాడికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధమే లేకపోగా లేకపోగా బ్రిటీష్ వారితో చేతులు కలిపిన కాషాయ దళాల వారసులు సిపిఎం నిర్ణయం మీద ఉక్రోషాన్ని దాచుకోలేక కక్కలేక ఇబ్బంది పడుతున్నారు. సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు తమ విజయం అని బిజెపి నేతలు కొందరు విపరీత వ్యాఖ్యానాలు చేశారు. మార్క్సిస్టుల నిర్ణయాన్ని మీడియాలో ఇంత సంచలనాత్మకంగా ఎందుకు చేశారు ? కమ్యూనిస్టుల్లో మార్పును జీర్ణించుకోలేకపోతున్నారా లేక వారిమీద వేసే రాళ్ల సంఖ్య తగ్గిపోయిందనే దుగ్దా ? ఏమైనా కావచ్చు.
సంఘపరివార్ దళాలు సామాజిక మాధ్యమంలో స్పందించాయి. ప్రజాజీవనంలో ఒక ఉదంతం జరిగినపుడు స్పందించటం ఒక ప్రజాస్వామిక హక్కు. అందువలన దాన్ని తప్పు పట్టనవసరం లేదు. స్పందనలో ఉన్న విషయం ఏమిటనే అంశంపై ఇతరులకూ అదే హక్కు ఉంటుంది. అందువలన కమ్యూనిస్టులు, కాషాయవాదుల్లో వచ్చిన మార్పుల తీరుతెన్నుల గురించి ఒక పరిశీలన ఇది. ముందుగా ఆర్‌ఎస్‌ఎస్-దేశభక్తి, జాతీయ జెండా బండారాన్ని చూద్దాం. నిజాలను తట్టుకొనగలిగే, చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారు ముందుకు పోవచ్చు. లేని వారు ఇంతటితో ముగించవచ్చు.
అతల్ బిహారీ వాజపాయి ప్రధాన మంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో లోక్‌సభలో జాతీయ పతాకం గురించి చర్చ జరిగింది. బిఆర్ అంబేద్కర్ మనవడు, తొలుత రిపబ్లికన్ పార్టీ తరువాత భరిపా బహుజన మహాసంఘ పార్టీ తరఫున ఎన్నికైన ప్రకాష్ అంబేద్కర్ జీరో అవర్‌లో మాట్లాడుతూ నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌ఎస్‌ఎస్ ఎన్నడూ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేదని, మువ్వన్నెల జెండా అంటే గౌరవం లేదని విమర్శించారు. అప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ కొల్‌కతాలో సిపిఎం కార్యాలయం మీద కూడా జాతీయ జెండాను ఎగురవేయలేదని గొంతు కలిపారు. అప్పుడు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్న ప్రమోద్ మహాజన్ మాట్లాడుతూ తాను చిన్నతనం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నానని సంస్ధ కార్యాలయాల వద్ద జెండాను ఎగురవేశారని చెప్పారు. అలాంటి ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందటం తగదన్నారు. కావాలంటే జనవరి 26న ప్రకాష్ అంబేద్కర్‌ను నాగపూర్ తీసుకు వెళ్లి ఆయనతోనే జెండా ఎగురవేయిస్తామన్నారు.మంత్రి మాటలను ఖండిస్తూ 1998లో నాగపూర్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశం ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించాలని ప్రతినిధి వర్గాన్ని పంపాలని, ఒక వేళ వారే స్వంతంగా ఎగురవేయకపోతే వెళ్లిన వారు ఎగురవేయాలని నిర్ణయించినట్లు ప్రకాష్ అంబేద్కర్ గుర్తు చేశారు.1999లో వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్లి జండాను ఎగురవేసేందుకు ప్రయత్నించగా వారి మీద లాఠీచార్జి జరిగిందని, 2000 సంవత్సరంలో కూడా అదే ప్రయత్నం చేయగా తమ భవనం మీద జెండా ఎగురవేయటాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అడ్డుకున్నదని ప్రకాష్ అంబేద్కర్ చెప్పారు. వ్యక్తులు, సంస్ధలు ఎవరైనా తమ ఇండ్ల మీద భవనాలపై జెండాను ఎగురవేయవచ్చని, ఈ సందర్భంగా ఎంపీలు అందరూ తమ ఇండ్ల మీద జెండాలు ఎగురవేయటాన్ని తాను చూడలేదని, అంతమాత్రాన వారు దేశభక్తి లేని వారని అర్ధమా అని మంత్రి మహాజన్ ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ జెండా ఎగురవేయటం గురించి మహాజన్ నిజం చెప్పులేదు, మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సభను తప్పుదారి పట్టించారు.
2002 జనవరి 26న తొలిసారిగా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం దగ్గర జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు సంవత్సరం ఆగస్టు 15న రాష్ట్ర ప్రేమీ యువదళ్ అనే సంస్ధకు చెందిన ముగ్గురు యువకులు బలవంతంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ముందు జండా ఎగురవేశారు. జాతీయ జండాను ఎందుకు ఎగురవేయటం లేదు అని అడిగితే జెండా నిబంధనల ప్రకారం ప్రయివేటు వ్యక్తులు ఎగురవేయకూడదనే నిబంధన ఉందని, 2002లో దాన్ని సవరించినందున అప్పటి నుంచి ఎగురవేస్తున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ వారు చెబుతారు. వారు ప్రచారం చేసే పచ్చి అబద్దాల్లో ఇది ఒకటి. పోస్ట్ కార్డ్ న్యూస్ పేరుతో నిరంతరం ఫేక్ న్యూస్ వండి వడ్డించే విక్రమ్ హెగ్డే, ఓప్ ఇండియా పేరుతో వక్రీకరణ రాతలు రాయించే నూపూర్ శర్మ వంటి అనేక మంది ఈ మేరకు ట్వీట్లు చేశారు. జండా నిబంధనలను సడలించిన తరువాత ఆర్‌ఎస్‌ఎస్ ఎగురవేస్తున్నదని చెప్పారు. వాస్తవం ఏమిటి ?
1995 ఫిబ్రవరిలో నవీన్ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఢిల్లీ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేశారు.తన ఫ్యాక్టరీ వద్ద అన్ని రోజులూ జాతీయ జెండాను ఎగురవేయకుండా అధికారులు ఆటంకాలు కల్పించారని ఆయన ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి, స్వాతంత్య్రదినోత్సవం, రిపబ్లిక్‌దినోత్సవం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పౌరులు జాతీయ జెండాను ఎగురవేయరాదనే నిబంధనలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తరువాత 2002 జనవరి 15న ప్రధాని అతల్ బిహారీ వాజపాయి అధ్యక్షతన కేంద్రమంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి సంబంధించి నియమించిన పిడి షెనారు కమిటీ నివేదికను ఆమోదించారు. అదే జనవరి 26 నుంచి అన్ని రోజులూ ఎవరైనా ఎగురవేయవచ్చని ప్రకటించారు. అయితే 1971 జూన్ 15న హౌంమంత్రిత్వశాఖ జారీ చేసిన లేఖలో ఈ మూడు రోజులలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చని పేర్కొన్నారు.1982లో పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన వివరాల ప్రకారం ఆ మూడు రోజులతో పాటు జలియన్‌వాలాబాగ్ అమరజీవుల సంస్మరణ వారమైన ఏప్రిల్ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు, జాతియావత్తూ సంతోష పడే ఏదైనా రోజు కూడా జాతీయపతాకాన్ని ఎగురవేయవచ్చని పేర్కొన్నారు. అంటే ఆర్‌ఎస్‌ఎస్ లేదా మరొకరు గానీ ఆ పని చేయవచ్చు, కానీ అనుమతి లేనందున తాము ఎగురవేయటం లేదన్న ఆర్‌ఎస్‌ఎస్ నేతల భాష్యం కుంటి సాకు,అవాస్తవం తప్ప మరొకటి కాదు.
నాగపూర్‌లో బిజెపిఏతర పార్టీలు, సంస్ధలకు చెందిన వారు ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం దగ్గర జెండా ఎగురవేసేందుకు చేసిన యత్నాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశం కావటం, సరిగ్గా ఆ సమయంలో వాజపాయి ప్రధానిగా ఉండటంతో విధిలేక తన వ్యతిరేకతను దిగమింగి ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండాను ఎగురవేయటం ప్రారంభించింది. ఒకసారి అధికార రుచి మరిగిన తరువాత మైనారిటీలు, ఇతరుల సంతుష్టీకరణలో భాగంగా, ప్రపంచంలో ఉన్న మత శక్తి అనే ముద్రను చెరిపివేసుకొనేందుకు గురువుగా దశాబ్దాలుగా పిలుస్తున్న ఎంఎస్ గోల్వాల్కర్ రచనలతో తమకు సంబంధం లేదని చెప్పుకొనేంతవరకు వెళ్లింది. ఆయన ప్రఖ్యాత రచన బంచ్ ఆఫ్ థాట్స్(ఆలోచనల గుచ్చము), ఇతర పుస్తకాలను ఆర్‌ఎస్‌ఎస్ ప్రామాణికంగా తీసుకొని దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నది. ఆ సంస్ధ చెప్పే జాతీయతకు గోల్వాల్కర్ చెప్పిన అర్ధం ఏమిటి ? ” మేము లేదా మన జాతి గుర్తింపు నిర్వచనం(ఉరు ఆర్ అవర్ నేషన్‌హుడ్ డిఫైన్‌డ్ )” అనే శీర్షికన 1938లో రాసిన పుస్తకంలో ” హిందూస్తాన్‌లో హిందూయేతరులు వారు విధిగా హిందూమతంలోకి మారాలి లేదా హిందూ రాజ్య చేతికిందివారుగా(రెండవ తరగతి) దేశంలో ఉండవచ్చు.ఎలాంటి ప్రత్యేకహక్కులు, చివరికి పౌరహక్కులు కూడా కోరకూడదు.” 1940 నుంచి 1973లో మరణించే వరకు ఆర్‌ఎస్‌ఎస్ అధినేతగా సుదీర్ఘకాలం కొనసాగిన గోల్వాల్కర్ ఆ కాలమంతా తన భావాలను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు నూరిపోశారు. తరువాత కూడా అదే సాగింది.
2004లో దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో బిజెపి ఎన్నికల్లో దిగి పరాజయం పాలు కావటం, దాని సిద్దాంతాలను చూసి కొన్ని పార్టీలు ఇబ్బంది పడటం తదితర కారణాలతో ఆర్‌ఎస్‌ఎస్ తన పులిచారలను కనపడకుండా చేసేందుకు ప్రయత్నించింది. దానిలో భాగంగానే 2006లో తొలిసారిగా గోల్వాల్కర్ జాతి గుర్తింపు నిర్వచన పుస్తకానికి – తమకూ సంబంధం లేదని ప్రకటించుకోవాల్సి వచ్చింది. ” గోల్వాల్కర్ పుస్తకంతో తమకు సంబంధం లేదని అధికారికంగా చెప్పిన ఆర్‌ఎస్‌ఎస్ ” అనే శీర్షికతో 2006 మార్చి 9న అక్షయ ముకుల్ అనే విలేకరి రాసిన వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ” అందరూ నమ్ముతున్నట్లుగా ఉరు పుస్తకం ఆర్‌ఎస్‌ఎస్ బైబిలు కాదు. అది నిజంగా బైబిల్ అయి ఉంటే సంఘకార్యకర్త ప్రతిఒక్కరూ దాన్ని చదివి ఉండేవారు, ప్రతి వారి ఇంట్లో ఉండేది, అలా జరగలేదు ” అని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధిగా పని చేసిన ఎంజి వైద్య చెప్పిన మాటలను ఆ వార్తలో పేర్కొన్నారు. చిత్రం ఏమిటంటే గోల్వాల్కర్ బతికి ఉన్నంతవరకు మూడుదశాబ్దాలకు పైగా ఆ పుస్తకంలోని అంశాలను పక్కన పెట్టినట్లు ఎవరూ చెప్పలేదు. మరణించిన తరువాత మరో మూడు దశాబ్దాలు కూడా ఎవరూ మాట్లాడలేదు.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లెక్చరర్ రాకేష్ సిన్హా 2006లో ”శ్రీ గురూజీ-ముస్లింలు ” అనే పేరుతో రాసిన పుస్తకంలో సరికొత్త కథను ముందుకు తెచ్చారు. గోల్వాల్కర్ రచన ఉరు పుస్తకంలోని అంశాలు నిజానికి గూరూజీవీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌వి కాదట. ఆ పుస్తకంలోని అంశాలు తనవి కాదని గురూజీ బతికి ఉండగా చెప్పేవారట. జిడి సావర్కర్ రాసిన ” రాష్ట్ర మీమాంస” అనే పుస్తక సంక్షిప్త రూపం తప్ప గోల్వాల్కర్ భావాలు కాదని, కానీ వాటిని గురూజీకి ఆపాదించి లౌకిక సామాజిక శాస్త్రవేత్తలు ఉపశమనం పొందారని రాకేష్ సిన్హా ధ్వజమెత్తారు. అప్పటి నుంచి ఆ పుస్తకం మినహా గోల్వాల్కర్ ఇతర పుస్తకాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పటికీ ప్రచురించి బోధ చేస్తూనే ఉంది. గోల్వాల్కర్ పేరుతో సాగిన బోధనల గురించి సిగ్గుపడటం సరే. కానీ ఇక్కడ సమస్య ఏమిటి ? ఆ పుస్తకంలోని భావాలు, సూత్రీకరణలను ఆరు దశాబ్దాల పాటు సంఘపరివార్‌లోని వారెవరికీ అభ్యంతరం అనిపించలేదా ? భిన్నాభిప్రాయం వెల్లడికాలేదా ? ఎవరూ నోరుమెదపలేని పరిస్ధితి పరివార్‌లో ఉన్నట్లే అని భావించాలా ? జిడి సావర్కర్ పేరుతో సదరు పుస్తకాన్నే సంక్షిప్తం చేసి ప్రచురించవచ్చు, కానీ దాని సంక్షిప్త రూపానికి పేరు మార్చి గోల్వాల్కర్ తన పేరు ఎందుకు పెట్టుకున్నట్లు ? గోల్వాల్కర్ స్వయంగా చెప్పారు అంటున్నవారు అలా ఎందుకు చేశారనే ప్రశ్నించే స్వేచ్చ పరివార్‌లో లేకపోయిందా ? పోనీ ఆయన బతికి ఉండగా పక్కన పెట్టేందుకు ధైర్యం లేకపోతే మరణించిన తరువాత అయినా వెంటనే ఆ పని ఎందుకు చేయలేదు ? మొత్తం ఆరు దశాబ్దాల పాటు దాన్ని ఆర్‌ఎస్‌ఎస్ ఎందుకు ప్రచారం చేసింది. అందుకే విశ్వసనీయత సమస్య ముందుకు వస్తోంది. అది గురూజీది కాదంటున్నారు గనుక ఆయన పెద్ద కాపీ మాస్టర్ అని తేలిపోయింది.
2018 సెప్టెంబరు 20న న్యూస్ 18 టీవీ, ఇతర పత్రికలు కూడా ఒక వార్తను ప్రచురించాయి.ఆర్‌ఎస్‌ఎస్ అధిపతిగా ఉన్న మోహనభగవత్ ఒక కార్యక్రమంలో ప్రశ్నలకు సమాధానాలిస్తూ 1966లో గురు గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్స్(ఆలోచన గుచ్చము) అనే పుస్తకం తమకు నిత్య అఖండజ్యోతి కాదని వాటిలో కొన్ని కాలానుగుణ్యంగా లేవని అన్నారు. హిందూయేతర మతపరమైన మైనారిటీలలో ఆర్‌ఎస్‌ఎస్ వైఖరి గురించి భయాలున్నాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ వాటిలో చెప్పిన అంశాలు కొన్ని పరిస్ధితులు, ఒక నిర్దిష్ట పూర్వోత్తర సంబంధంగా చెప్పినవి. మేము ”గూరూజీ- విషన్ అండ్ మిషన్ ” (గురూజీ ఊహ-కార్యక్రమం) అనే పుస్తకాన్ని ప్రచురించాము. వాటిలో కొన్ని పరిస్ధితుల్లో చెప్పిన వాటిని తొలగించాము. గురూజీ అనశ్వర ఆలోచనలను కొనసాగించాము” అన్నారు. బంచ్ ఆఫ్ థాట్స్ గురించి చెబుతూ ఆర్‌ఎస్‌ఎస్ పరిధీకృత సంస్ధ కాదు (గీసుకున్న గిరికి పరిమితం), కాలంతో పాటు మా ఆలోచనలు, వాటి స్పష్టత వక్కాణింపులో కూడా మార్పులు ఉంటాయి. బంచ్ ఆఫ్ థాట్స్‌లో రాసిన అంశాల ఆధారంగా ఆర్‌ఎస్‌ఎస్ గిరిగీసుకున్న సంస్ధ అనే సందేహాలుంటే మా పనేమిటో చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం” అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గిరిగీసుకున్న సంస్ధ కానట్లయితే మహిళలకు, మైనారిటీ మతస్ధులకు సభ్యత్వాన్ని, బాధ్యతలు లేదా నాయకత్వ స్దానాలను ఎందుకు అనుమతించటం లేదు.
ఇక జాతీయ జెండా విషయానికి వస్తే ఆర్‌ఎఎస్ పత్రిక ఆర్గనైజర్ 1947 జూలై 17తేదీ సంచిక, తరువాత రాసిన సంపాదకీయాల్లో చెప్పిందేమిటి ? తంతే గారెల బుట్టలో పడ్డట్లు జనాలు అధికారానికి వచ్చి మన చేతుల్లో మూడు రంగుల జండాను పెట్టవచ్చు, కానీ హిందువులెవరూ ఎన్నడూ దాన్ని గౌరవించరు, తమదానిగా చేసుకోరు. మూడు అనే పదమే ఒక దుశ్శకునం, జండాకు ఉన్న మూడు రంగులు మానసిక ప్రభావాన్ని కలుగ చేస్తాయి, జెండా దేశాన్ని గాయపరుస్తుంది” అని పేర్కొన్నారు. 1946 జూలై 14న గోల్వాల్కర్ నాగపూర్ సభలో మాట్లాడుతూ కాషాయ జెండా మాత్రమే మన ఘనమైన సంస్కృతికి ప్రతీక, అది దేవుని అవతారం, అంతిమంగా యావత్ జాతి కాషాయ జెండా ముందు మాత్రమే తలవంచుతుందని మనం గట్టిగా నమ్ముతున్నాం ‘అన్నారు.
శ్యామ ప్రసాద ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్ తమ హీరోగా పరిగణిస్తుంది. ఆయన 1943 నుంచి 46వరకు అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయాలని బెంగాల్ కాబినెట్ మంత్రిగా ఉంటూ 1942 జూలై 26న నాటి బెంగాల్ గవర్నర్ జాన్ హరబర్టుకు లేఖ రాసిన అపర దేశభక్తుడు. బెంగాల్లో ఈ ఉద్యమాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న అని సదరు లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే ఈ దేశభక్తుడిని పార్టీలో చేర్చుకొనేందుకు, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు నాడు నెహ్రూకు అభ్యంతరం లేకపోయింది. కొద్ది కాలంలోనే నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చేరదీసి 1951లో భారతీయ జనసంఫ్‌ు పార్టీని ఏర్పాటు చేయించింది.
సంఘపరివారం వీర సావర్కర్‌గా పిలిచే వినాయక్ దామోదర్ సావర్కర్ జాతీయ జెండాను గురించి చెప్పిందేమిటి ? ( ఆయనకు వీర బిరుదు ఎవరిచ్చారంటే ఎవరూ సమాధానం చెప్పరు ) ” మూడు రంగుల జండాను హిందూస్తాన్ జాతీయ జండాగా ఎన్నటికీ గుర్తించలేము. కాషాయ జెండా మాత్రమే ఉండాలి… హిందువులు మరొక జెండాకు ఏ స్దాయిలోనూ విధేయులుగా వందనం చేయరు.” అన్నారు. పాకిస్తాన్ ఏర్పాటు చేయాలని 1940లో ముస్లింలీగ్ డిమాండ్ చేసింది.దానికి మూడు సంవత్సరాల ముందే 1937లో అహమ్మదాబాద్‌లో జరిగిన హిందూమహాసభ 19వ సమావేశంలో సావర్కర్ మాట్లాడుతూ రెండుదేశాల సిద్దాంతాన్ని సమర్ధించారు. ఈ రోజు దేశం ఇంకేమాత్రం ఐక్యంగా ఒకటిగా ఉండలేదు, హిందూ, ముస్లిందేశాలుగా ఉన్నాయి. జిన్నా రెండు దేశాల సిద్దాంతంతో నాకేమీ పేచీ లేదు, చారిత్రకంగా చూస్తే హిందూ ముస్లింలు రెండుదేశాలుగా ఉన్నారని 1943ఆగస్టు 15న నాగపూర్ సమావేశంలో సావర్కర్ చెప్పారు. తిరువాన్కూర్ సంస్ధాన దివానుగా ఉన్న సిపి రామస్వామి అయ్యర్ తమ సంస్దానం ప్రత్యేక దేశంగా ఉంటుందని 1947జూన్ 11న ప్రకటించారు.అఖండ భారత్ గురించి చెప్పిన సావర్కర్ జూన్ 20 ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ టెలిగ్రామ్ పంపారు. ” తిరువాన్కూరును మన హిందూ స్వతంత్ర దేశంగా ప్రకటించేందుకు ముందు చూపు, దైర్యం కావాలి” అని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన జనం దాన్ని వ్యతిరేకించి విలీనానికి పోరాడారు. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి మెరుగని వాటిని ప్రపంచమంతా ఆరాధిస్తుంటే మన రాజ్యాంగ పండితులకు అది పట్టలేదని 1949నవంబరు 30 ఆర్గనైజర్ పత్రిక రాసింది.
నిషేధాన్ని ఎత్తివేయించుకొనేందుకు రాజకీయాల్లో పాల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా ఉంటా మంటూ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ ఆ సంతకాల తడి ఆరక ముందే జనసంఫ్‌ును ఏర్పాటు చేయించి తమవారిని నేతలుగా పెట్టింది. ఇప్పుడు బిజెపిలో ఉన్నవారందరూ వారే. అయినా తమది రాజకీయ సంస్ద కాదని ఇప్పటికీ చెప్పుకుంటుంది. నిత్యం స్వదేశీ అని పశ్చిమ దేశాలను విమర్శించే ఆర్‌ఎస్‌ఎస్ తన యూనిఫామ్ విషయానికి వస్తే ఆ పశ్చిమ దేశాల నుంచే అరువు తెచ్చుకుంది.నిక్కర్ల నుంచి పాంట్లకు మారినా స్వదేశీ ఊసులేదు.ఆరు సార్లు యూనిఫామ్‌లో మార్పులు చేసుకుంది. తమ వెనుక ఇన్ని పిల్లి మొగ్గలు, అవగాహనలను మార్చుకున్న చరిత్ర తమ వెనుక ఉంచుకొని సిపిఎం వైఖరి మార్చుకున్నదని చెప్పటం విశేషం. ఇక్కడ గమనించాల్సిందేమంటే గోల్వాల్కర్ పుస్తకాలను పక్కన పెట్టినా, జెండా ఎగరవేయటం గురించి విధానాన్ని మార్చుకున్నా, అవగాహన మారిందని చెప్పుకున్నా అదంతా పైపై వ్యవహారం తప్ప అసలైన హిందూత్వ అజెండాలో ఎలాంటి మార్పు లేదు. వచ్చిన అధికారాన్ని నిలుపుకోవాలంటే గతంలో తాము చెప్పిన వాటికి కట్టుబడి ఉన్నట్లు పునశ్చరణ చేసినా, ముందుకు తీసుకుపోయినా కుదరదు కనుకనే పులిచారలు కనిపించకుండా కొత్త దుస్తులు వేసుకుంటోంది, మాటలను మారుస్తోంది. మరి కమ్యూనిస్టుల సంగతేమిటి ? వారెందుకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరిపేందుకు, జాతీయ జండాను ఎగురవేసేందుకు నిర్ణయించుకున్నారు ? మరో భాగంలో చూద్దాం !
సంబంధిత వ్యాస రెండవ భాగ లింకు దిగువ ఉంది.
జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? https://vedikaa.com/2021/08/17/indian-national-flag-matters-what-changed-in-cpim-stand/
Pingback: జాతీయ జండా ఆవిష్కరణ అంశం: సిపిఐ(ఎం) వైఖరిలో మార్పు ఏమిటి ? ఎందుకు ? | vedika