Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. అలాంటపుడు ఆర్‌ఎస్‌ఎస్‌ అయినా సిపిఎం అయినా మారకుండా ఎలా ఉంటుంది. తన వైఖరిలో మార్పును ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్ధించుకున్నపుడు, సిపిఎం వైఖరిలో మార్పు మీద వ్యాఖ్యాతలకు అంత ఉక్రోషం ఎందుకు ? మార్పు సరైనదిగాక పోతే విమర్శించవచ్చు. అది ఎవరికైనా ఉన్న హక్కు. సంఘపరివార్‌ దాని సోదర సంస్ధలు జమాతే ఇస్లామీ, ముస్లింలీగ్‌, మజ్లిస్‌ వంటివి మతాన్ని ఇంటికి పరిమితం చేసి ఆరోగ్యకర రాజకీయాల్లో పాల్గొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అలాంటి పార్టీలు సరైన వైఖరి తీసుకోమనే ఎవరైనా చెప్పేది. అదే సూత్రంతో కమ్యూనిస్టులకూడా తప్పు చేస్తున్నారని ఎవరికైనా అనిపిస్తే వారికీ అలాంటి సలహా ఇవ్వవచ్చు. ఏ సంస్ధలు, పార్టీలు ఏం మార్చుకుంటాయి, ఏం మార్చుకోవు అన్నదాని మీద నిరంతరం చర్చ, విమర్శలు చేసేందుకు ఎవరికైనా హక్కుంది.” జాతీయ జెండా ఆవిష్కరణ అంశం : గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ” అనే శీర్షికతో ఆ సంస్ద తీరుతెన్నుల గురించి చర్చించాము. దిగువ లింకులో దాన్ని చదవవచ్చు. ఇప్పుడు సిపిఎం వైఖరిలో వచ్చిన మార్పు, కారణాల గురించి చూద్దాం.


స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన కృషి, భారత్‌ అన్న భావనను పటిష్టపరచటం, స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారితో ఆర్‌ఎస్‌ఎస్‌ కుమ్మక్కు, వర్తమానంలో రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచటాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివరించాలని, వివిధ కార్యక్రమాల్లో భాగంగా కార్యాలయాల ముందు జాతీయ జెండాలను ఆవిష్కరించాలని నిర్ణయించినట్లు ఆగస్టు తొమ్మిదిన సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.


స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపటం, జాతీయ జెండాను ఎగురవేయటమే దేశభక్తికి నిదర్శనం అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అధికారిక సంస్దలు స్వాతంత్య్రదినం, రిపబ్లిక్‌ దినోత్సవం, గాంధీ జయంతి రోజులలో విధిగా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే నిబంధనలు ఉన్నాయి తప్ప ప్రయివేటు సంస్ధలు, పార్టీలు విధిగా జరపాలని, జాతీయ జెండాలను ఎగురవేయాలనే అంశం రాజ్యాంగంలో లేదు. ఇప్పుడు కొత్తగా మారిందేమీ లేదు. స్వాతంత్య్రదినోత్సవం జరుపుకోవటమా లేదా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు, బలవంతం ఏమీ లేదు. జాతీయ జెండాను ఎగురవేసేందుకు జండా నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పింది కనుకనే అది అవాస్తవం చెబుతోందని,పైన చెప్పిన మూడు రోజుల్లో ఎవరైనా ఆపని చేయవచ్చని ప్రభుత్వ నిబంధనలను పేర్కొనాల్సి వచ్చింది. కానీ ఎన్నడూ కమ్యూనిస్టులు అలాంటి నిబంధనల కుంటి సాకులు చెప్పలేదు. సిపిఎం నిర్ణయాన్ని కొందరు 75 సంవత్సరాల్లో తొలిసారి అని శీర్షికలు పెట్టి మరీ వ్యాఖ్యలు చేశారు. సిపిఎం ఏర్పడిందే 1964లో అంటే 57 సంవత్సరాల క్రితం ఏర్పడింది. రాయి వేసేవారికి ఈ చిన్న విషయం కూడా తెలియదంటే ఏమనుకోవాలి. ఇది చిన్న విషయం వదిలివేద్దాం.


కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఎం వారు తమ కార్యాలయాల మీద జాతీయ జెండాలను ఎగురవేసి ఉత్సవాలు జరపలేదుగాని ముఖ్యమంత్రులుగా లేదా స్ధానిక సంస్థల అధిపతులుగా ఎన్నికైన సందర్భాలలో రాజ్యాంగవిధిగా దాన్ని పాటించారు, పాటిస్తున్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలినప్పటి నుంచీ సిపిఐ జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుతున్నది. సిపిఎం నుంచి విడిపోయి సాయుధ పోరాటం పేరుతో రహస్యంగా పని చేస్తున్న కమ్యూనిస్టు గ్రూపుల వారు అసలు స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్నే గుర్తించటం లేదు గనుకు వారు ఎగురవేసే సమస్యే ఉత్పన్నం కాదు. తరువాత పలు ముక్కలై తమదే అసలైన కమ్యూనిస్టు పార్టీ అని ప్రకటించుకున్న వివిధ బృందాలలో కొన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో పాల్గొంటున్నా జండా పండగలకు దూరంగా ఉంటున్నాయి.


స్వాతంత్య్రానికి ముందే తెలంగాణాలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వచ్చిన తరువాత నిజాం బదులు నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మిలిటరీని పంపి కమ్యూనిస్టులను అణచివేసిన చరిత్ర తెలిసిందే. ఆ నేపధ్యం, దానితో పాటు దేశ రాజ్యాంగం స్వాతంత్య్ర ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణ్యంగా లేదనే వైఖరి కారణంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కమ్యూనిస్టుల్లో ఉంది. స్వాతంత్య్రం ఒక మేడి పండు అన్నట్లుగా భావించారు. అంతే తప్ప తాము స్వాతంత్య్రాన్ని, జాతీయ పతాకాన్ని గుర్తించటం లేదని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఎక్కడా చెప్పలేదు.ఆర్‌ఎస్‌ఎస్‌ మాదిరి జండా గురించి రచ్చచేసిన దాఖలాలు అంతకంటే లేవు. సిపిఎం నుంచి విడిపోయిన తరువాత రాజ్యాంగాన్ని గుర్తించని నక్సల్‌ గ్రూపులు చెప్పిన అంశాలకు, భాష్యాలకు సిపిఎంకు సంబంధం ఉండదు. రాజ్యాంగాన్ని గుర్తించి దానికి అనుగుణ్యంగా తొలి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ పాల్గొన్నది, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికయింది. మరి ఇప్పుడు ఎందుకు ఎగురవేయాలని సిపిఎం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది.


కమ్యూనిస్టు సిద్దాంతం ఒక దేశానికి పరిమితమైంది కాదు. అందువలన దాన్ని పాటించిన వివిధ కమ్యూనిస్టు పార్టీలు వివిధ సమస్యల పట్ల ఎప్పుడు ఎలాంటి వైఖరులు తీసుకున్నాయో అర్ధం చేసుకుంటే తప్ప వాటిలో వచ్చిన మార్పులు తలకు ఎక్కవు. మార్క్సిజం-లెనినిజం అనే సిద్దాంతాలు గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు, వేదాల్లో, ఉపనిషత్తులో, మనుస్మృతి, ఫలానా పురాణం లేదా బైబిల్‌, ఖురాన్‌లలో ఫలాన చోట ఫలానా విధంగా చెప్పబడింది, అవి అంతే అన్నట్లుగా కమ్యూనిస్టు సిద్దాంతం పిడివాదం కాదు. అది ఒక పురోగామి శాస్త్రం. అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా మార్పులు జరుగుతాయి. అదే విధంగా కమ్యూనిస్టు పార్టీలు కూడా మూసపోసినట్లుగా పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లుగా పని చేయవు.


పొరుగునే ఉన్న చైనా, ఇతర దేశాల కమ్యూనిస్టు పార్టీల చరిత్రను చదివిన వారికి అర్ధం అవుతుంది. రెండవ ప్రపంచ యుద్దంలో హిట్లర్‌ను ఓడించేందుకు సోవియట్‌ యూనియన్‌తో బ్రిటన్‌ చేతులు కలిపింది. సోవియట్‌ బలపడాలనే అభిప్రాయంతో భారత కమ్యూనిస్టులు ఆ రోజుల్లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ఇచ్చిన క్విట్‌ ఇండియా పిలుపుకు దూరంగా ఉన్నారు. తరువాత కాలంలో అలా వ్యవహరించటం తప్పని గుణపాఠం నేర్చుకున్నారు. మరి ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించినట్లు ? బ్రిటీష్‌ వారికి సహకరిస్తామని ఎందుకు చెప్పినట్లు ? కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి దూరంగా ఉంది తప్ప పాల్గొన్నవారిని తప్పు పట్టలేదు. ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటీష్‌ వారికి తోడ్పడలేదు. అలాంటి ఉదాహరణలు ఉంటే ఎవరైనా చూపవచ్చు.


ఇన్ని దశాబ్దాలుగా స్వాతంత్య్ర దినం పాటించని కమ్యూనిస్టులు ఎందుకు వైఖరి మార్చుకున్నారు ? పరిస్ధితులే వారిని అలా మారేందుకు పురికొల్పాయి. చైనాలో కొమింటాంగ్‌ పార్టీ స్వాతంత్య్రం కోసం, యుద్ద ప్రభువులను పక్కన పెట్టేందుకు పోరాడింది, విజయం సాధించి 1911లో రాజరికాన్ని కూలదోసి స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే రాజరిక పాలన అయితే తప్పింది గానీ సామాన్యులు ముఖ్యంగా రైతాంగంపై జరిగే దోపిడీకి అడ్డుకట్టపడలేదు. యుద్ద ప్రభువులు తిరిగి తలెత్తి సవాలుగా మారారు. దాంతో చైనా జాతిపితగా పరిగణించబడిన సన్‌ఏట్‌ సేన్‌ 1921లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానించి 1924లో యునైటెడ్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి యుద్ద ప్రభువుల అణచివేతకు పూనుకున్నాడు. అయితే మరుసటి ఏడాదే కాన్సర్‌తో మరణించాడు. కొమింటాంగ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన చాంగ్‌కై షేక్‌ తమతో కలసి పోరాడుతున్న కమ్యూనిస్టులు రోజు రోజుకూ బలం పెంచుకోవటం చూసి వారిని ఊచకోత కోయించాడు. 1927 నాటికి రెండు పార్టీలు వైరిశిబిరాలుగా మారిపోయాయి.1931లో జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకోవటం మొదలు పెట్టారు. దాంతో 1936లో తమ కార్యకర్తలను ఊచకోత కోయించిన ఆ చాంగ్‌కై షేక్‌తోనే ఐక్యసంఘటనగా ఏర్పడిన కమ్యూనిస్టులు జపాన్‌ సామ్రాజ్యవాదులను తరిమి వేశారు. తరువాత ఆ చాంగ్‌కై షేక్‌నే తరిమికొట్టి దేశాన్ని విముక్తి చేశారు. అనేక మంది ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోలేకపోయారు. మన కార్యకర్తలు, నాయకులను చంపించిన వాడితో చేతులు కలపటం ఏమిటని చర్చ జరిగింది. అక్కడ అందరికీ ఉమ్మడి శత్రువైన జపాన్ను తరిమి వేయాల్సిన కర్తవ్యం కమ్యూనిస్టులను ఐక్య సంఘటనకు పురికొల్పింది.


జయప్రకాష్‌ నారాయణ ప్రారంభించిన ఉద్యమంలో నాటి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి. జయప్రకాష్‌ నారాయణ మతశక్తి కానప్పటికీ జనసంఘం ఉన్న కారణంగా దానిలో పాల్గొనాలా లేదా అన్న అంశం మీద సిపిఎంలో తీవ్ర చర్చలు జరిగాయి. తరువాత 1975లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్ధితిని ప్రకటించి జనసంఘం, ఆర్‌ఎస్‌ఎస్‌, సిపిఎం, సోషలిస్టు ఇతర తనను రాజకీయంగా వ్యతిరేకించే పార్టీల వారందరినీ జైలు పాలు చేశారు. ఆ నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే అంశం ప్రధానంగా ముందుకు వచ్చింది. ఆ కారణంగానే అత్యవసర పరిస్ధితిని ఎత్తివేసిన తరువాత జనసంఘం, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇతర పార్టీలన్నీ కలసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. దానిలో జనసంఘం-ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ముఖ్యపాత్రధారి అని తెలిసినప్పటికీ సిపిఎం తన రాజకీయ కర్తవ్యంలో భాగంగా జనతా పార్టీని బలపరిచింది. జనతా పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకున్న సిపిఎం అభ్యర్ధులకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా జనతా పార్టీలోని జనసంఘం కార్యకర్తలు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యం, పౌరహక్కుల రక్షణ కోసం తన వైఖరిని మార్చుకొనేందుకు నాడు సిపిఎం తన వైఖరిని సవరించుకుంది.


మన స్వాతంత్య్రానికి చైనాలో జరిగిన మాదిరి విదేశాల నుంచి ప్రత్యక్ష ముప్పు లేకపోయినా అంతర్గతంగా బిజెపి పాలకులు అనుసరిస్తున్న విధానాలు ముఖ్యంగా అన్ని వ్యవస్ధలను దిగజార్చటం ప్రజాస్వామ్యం, పౌరహక్కులకే ముప్పు తెచ్చేవిగా ఉన్నాయని కమ్యూనిస్టులు కాని వారు కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకపోవటమే కాదు, బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి వారసులు నేడు ఆ పరిమిత స్వాతంత్య్ర లక్ష్యాలు, ప్రజాస్వామ్యానికే ముప్పు తెచ్చే చర్యలకు పాల్పడుతున్నారని గత కొద్ది సంవత్సరాలుగా సిపిఎం హెచ్చరిస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం, జాతీయ జెండాలకు దూరంగా ఉంటూ వాటిని కాపాడేందుకు జనం ముందుకు రావాలని పిలుపు ఇస్తే అర్ధం ఉండదు. అందుకే సిపిఎం వైఖరిలో ఈ మార్పు అన్నది స్పష్టం.
సంబంధిత వ్యాసం మొదటి భాగం లింకు దిగువ ఉంది. .

జాతీయ జండా ఆవిష్కరణ అంశం: గురువు గోల్వాల్కర్‌నే పక్కన పెట్టిన ఆర్‌ఎస్‌ఎస్‌ ఊసరవెల్లి ! https://vedikaa.com/2021/08/16/indian-national-flag-matter-why-rss-disowned-ms-golwalkar-thoughts/