Tags

, ,


ఎం కోటేశ్వరరావు


తనకు ఎదురు లేదని విర్రవీగిన అగ్రరాజ్యం అమెరికాకు, దాని తోకపట్టుకు తిరిగిన వారికి ఆఫ్ఘనిస్తాన్లో చెప్పుకోలేని చోటదెబ్బలు తగిలాయి. తమ సైనికులు, పౌరులకు ఎలాంటి హాని లేకుండా దేశం విడిచి పోనివ్వాలనేదే తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం. అయినా అనేక మంది అమెరికన్‌ సైనికులను తాలిబాన్లు చావుదెబ్బలు కొట్టినట్లు వచ్చిన వార్తలను మిలిటరీ అధికారులు పరోక్షంగా అయినా అంగీకరించకతప్పలేదు.అధ్యక్షుడు జో బైడెన్‌ నిస్సహాయ స్ధితిలో తాను దేనికీ హామీ ఇవ్వలేను అని చేతులెత్తేశాడు. అంగీకరించిన గడువు ఆగస్టు 31లోగా దేశం విడిచి పోవాల్సిందే లేకపోతే జరిగే పరిణామాలకు తమది బాధ్యత కాదని తాలిబాన్లు హెచ్చరించారు. దాంతో ఎన్నడూ లేని విధంగా తరలింపు ప్రక్రియను చేపట్టారని వార్తలు వస్తున్నాయి. అక్కడేం జరగనుంది. నల్లేరు మీద బండిలా తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా ? అంతర్యుద్దం జరుగుతుందా ? సెప్టెంబరు ఒకటవ తేదీ తరువాత స్పష్టత వస్తుందా ? ఏం జరగనుంది అనేది ఎవరూ చెప్పలేని స్ధితి ఉంది.


తాలిబాన్లు కాబూల్‌ను వశం చేసుకొనేందుకు కనీసం తొంభై రోజులు పడుతుందని అమెరికా సిఐఏ వేసిన అంచనాను మీడియాకు అందించారు. అయితే తొమ్మిది రోజుల్లోపలే పతనమైంది. సిఐఏ పప్పులో కాలేసింది. ఆ సందర్భంగా వచ్చిన వార్తలు, ఫొటోలను పేర్కొంటూ సరిగ్గా వియత్నాం నుంచి అమెరికా సైనికులు పారిపోతున్న మాదిరే దృశ్యాలు ఉన్నట్లు కొందరు వర్ణించారు. ఆ పోలిక సరైనదేనా ? అంతకు మించి ఏమీ లేదా ?
నాలుగున్నర దశాబ్దాల క్రితం అమెరికన్ల దాడిలో వియత్నాంలో సర్వనాశనమైన నాటి సైగాన్‌ పట్టణం మన ముంబయి వంటిది. తరువాత హౌచిమిన్‌ సిటీగా మారి ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా ఉంది. దేశ జిడిపిలో కోటి మంది జనాభాతో ఆ నగరం పరిసరాల నుంచి 22శాతం వస్తున్నదంటే దాని ప్రాధాన్యతను అర్దం చేసుకోవచ్చు.

ఇండో చైనా అంటే ఇప్పటి వియత్నాం, లావోస్‌, కంపూచియా, మయన్మార్‌, థాయిలాండ్‌, చైనాలోని గ్వాంగ్‌జూ ప్రాంతాలు. వీటిలో మొదటి మూడు దేశాలను ఫ్రాన్సు తన వలసలుగా చేసుకుంది. మనం ఇప్పుడు వాడుకలో ఇండోచైనా అని పిలుస్తున్నవి ఈ మూడింటినే. వలసవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో భాగంగా ఇండోచైనా కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్‌ మిలిటరీ ఫ్రెంచి దళాలపై దాడులు చేసింది. అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పోరాడారు. ఫ్రాన్స్‌ ఓడిపోవటంతో వియత్నాంను 1945లో స్వాతంత్య్ర దేశంగా కమ్యూనిస్టు నేత హౌచిమిన్‌ ప్రకటించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర వియత్నాం మాత్రమే పూర్తిగా కమ్యూనిస్టులు, జాతీయవాదుల ఆధీనంలోకి వచ్చింది. రాజు తన అధికారాన్ని వదులుకున్నాడు. అయితే ఆ యుద్దంలో జపాన్‌ ఓడిపోయి తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న తరువాత ఫ్రాన్స్‌ తిరిగి వియత్నాంను ఆక్రమించుకుంది.దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టారు. కమ్యూనిస్టులు విజయం సాధించే అవకాశాలు కనిపించటంతో 1949లో ఫ్రెంచి పాలకులు మాజీ వియత్నాం రాజును రంగంలోకి దించి దక్షిణ వియత్నాంలో సైగాన్‌ రాజధానిగా ఇదే అసలైన ప్రభుత్వం అని తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1953లో లావోస్‌, కంపూచియా స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. ఆరు సంవత్సరాల పాటు అమెరికా మద్దతుతో జరిపిన యుద్దంలో పరాజయం పాలైన ఫ్రాన్స్‌ జెనివా ఒప్పందం చేసుకొని 1954 ఆ ప్రాంతం నుంచి వైదొలిగింది.

1956లో ఎన్నికలు జరిపి విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఒప్పందంలోని ప్రధాన అంశం.ఆ దశలో రంగంలోకి వచ్చిన అమెరికా దక్షిణ వియత్నాం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. జెనివా ఒప్పందాన్ని తాము అంగీకరించటం లేదని, ఎన్నికలు జరిపేది లేదని ప్రభుత్వం అడ్డం తిరిగింది. అమెరికా, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టులు, జాతీయ వాదులు ఆయుధాలు చేపట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం యోధుల మీద అమెరికా యుద్దాన్ని ప్రకటించింది. పెద్ద సంఖ్యలో అమెరికన్‌ సైనికులు మరణిస్తుండటంతో వియత్నాం యుద్దానికి వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దాంతో 1968లోనే నాటి అమెరికా అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ శాంతి ప్రతిపాదనలు చేశాడు. మరోవైపున దాడులు కొనసాగించాడు. దశలవారీ సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. యుద్దం జరుగుతుండగానే 1969 సెప్టెంబరు రెండున 79 సంవత్సరాల వయస్సులో హౌచిమిన్‌ మరణించారు. అయినా కమ్యూనిస్టులు ముందుకు సాగిపోయారు. శాంతి గురించి మాట్లాడిన తరువాత ఏడు సంవత్సరాలు దాడులు చేసి 1975లో అమెరికా పారిపోయింది. అఏడాది ఏప్రిల్‌ 29న సైగాన్‌ విమానాశ్రయం నుంచి ఒక్కరోజే ఏడువేల మంది చివరి అమెరికన్‌ సైనికులు, వారి తొత్తులను తరలించారు.

సరిగ్గా ఇటీవల కాబూల్‌లో కనిపించిన దృశ్యాలే అప్పుడూ దర్శనమిచ్చాయి. అందుకే కొందరు నాటి నేటి ఉదంతాలను పోల్చారు. మరుసటి రోజు సైగాన్‌ కమ్యూనిస్టుల వశమైంది. అదే రోజు సైగాన్‌ నగరాన్ని హౌచిమిన్‌ పేరుతో తిరిగి నామకరణం చేశారు. ఈ యుద్దంలో అమెరికన్లు ఇరవై లక్షల మంది వియత్నాం మిలిటరీ, సామాన్య పౌరుల ప్రాణాలు తీశారు. వేల టన్నుల రసాయనిక బాంబులు వేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలను సాగుకు , నీరు తాగేందుకు పనికిరాకుండా చేశారు. అమెరికా యుద్ద చరిత్రలో అత్యధికంగా 58వేల మంది తన సైనికులను కోల్పోయింది. లక్షలాది మంది మానసిక రోగులుగా తయారయ్యారు. తమకు తొత్తులుగా పనిచేసిన వేలాది మంది వియత్నామీయులకు అమెరికా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి పారిపోతున్నారని చెబుతున్నవారు కూడా అలాంటి వారే. తాలిబాన్లకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి, అమెరికా సేనలకు అనుకూలంగా వ్యవహరించిన వారిని తాలిబాన్లు వదలివేసే అవకాశం లేదు. అలాంటి వారందరూ ఇప్పుడు ఎక్కడికి వీలైతే అక్కడికి పోవాలని చూస్తున్నారు. అమెరికా, దానితో పాటు యుద్దంలో పాల్గొన్న ఐరోపా దేశాలు తప్ప మిగిలిన దేశాలేవీ వారికి ఆశ్రయం కల్పించే లేదా శరణార్ధులుగా అంగీకరించే అవకాశం లేదు.


పరాభవం పాలైన అమెరికా తరువాత కాలం ఇతర కమ్యూనిస్టు వ్యతిరేక ఐరోపా దేశాలతో కలసి వియత్నాం మీద ఆర్ధికదాడిని ప్రారంభించింది. వాణిజ్య ఆంక్షలతో పాటు పెట్టుబడులు రాకుండా అడ్డుకుంది. చివరికి ఫోన్‌, మెయిల్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో లేకుండా చేసింది.1986లో వియత్నాం సంస్కరణల బాట పట్టి విదేశీ, ప్రయివేటు పెట్టుబడులను ఆహ్వానించింది. కార్పొరేట్ల వత్తిడి మేరకు అనివార్య పరిస్ధితిలో 1994లో ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. 2000 సంవత్సరంలో బిల్‌క్లింటన్‌ వియత్నాంను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడికా చరిత్రకెక్కాడు.


అమెరికా విదేశాంగ , మిలిటరీ విధానాలు ఎంత లోపభూయిష్టమైనవో, అదెంత సంక్షోభంలో ఉందో తాజా ఆప్ఘన్‌ ఉదంతం కూడా నిర్ధారించింది. మూడులక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేసి తనకు అనుకూలమైన అవినీతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తప్ప మరొకటి కాదు. ఇంతా చేసి పరువు పోగొట్టుకొని తమ ప్రభుత్వం సాధించింది ఏమిటనే ప్రశ్న ఇప్పుడు అమెరికా సమాజంలో తలెత్తింది. అసలు అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్‌ ఎందుకు ముజాహిదీన్లు, తాలిబాన్లకు మద్దతు ఇచ్చింది ? మీడియాలో ఇరవై సంవత్సరాల గురించే చెబుతున్నారు.1970దశకంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ముజాహిదీన్ల పేరుతో అక్కడి భాషా, తెగల నేతలను రెచ్చగొట్టటంలో అమెరికా పాత్రను మూసిపెడుతున్నారు. ఆ సమయంలో అమెరికన్ల చేతిలో పాకిస్తాన్‌ కీలుబొమ్మగా ఉంది. ఆ కారణంగా అఫ్ఘన్‌ ప్రభుత్వానికి మద్దతుగా వచ్చిన సోవియట్‌ యూనియన్‌ అక్కడ స్ధిరపడిన తరువాత తమ దేశంపై కూడా దాడి చేయవచ్చనే తప్పుడు అంచనాకు పాక్‌ నాయకత్వం వచ్చింది. ఆ కారణంగానే పెద్ద ఎత్తున జోక్యం చేసుకొని ప్రభుత్వ వ్యతిరేక శక్తులను చేరదీసి శిక్షణ ఇచ్చింది.

సోవియట్‌ నాయకత్వంలో వచ్చిన మార్పుల కారణంగా వారు ఉపసంహరించుకున్న తరువాత కర్ర ఉన్నవాడిదే గొర్రె అన్నట్లుగా అంతకు ముందు వామపక్ష ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దాడులు చేసిన వారందరూ ఎవరికి వారు తమదే అక్షయ పాత్ర అన్నట్లుగా కీచులాడుకున్నారు. ఈ స్ధితిలో తాము స్వచ్చమైన పాలన అందిస్తామని తాలిబాన్లు పుట్టుకు వచ్చారు. కుమ్ములాటలు లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రారంభమయ్యారు. తమ అవసరాల కోసం, అమెరికా ఎత్తుగడల ప్రకారం తాలిబాన్లకు శిక్షణ ఇవ్వటమే కాదు, ముజాహిదీన్‌ నేతలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు పాకిస్దాన్‌ వేల మంది కిరాయి మూకలను కూడా అఫ్ఘనిస్తాన్‌లోకి పంపింది. అదే విధంగా వారు సృష్టించిన ఐఎస్‌ తీవ్రవాదులు తరువాత ఏకు మేకయ్యారు.ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లోని పెంజేష్వర్‌ లోయలో తాలిబాన్లను ప్రతిఘటిస్తున్న దేశ ఉపాధ్యక్షుడు సాలేV్‌ా వెనుక ముజాహిదిన్ల ఒక ముఠానేత అహమ్మద్‌ షా మసూద్‌ సోదరులు, కుమారులు ఉన్నారు. ఇతర ముుఠాలతో రాజీచేసుకొని అధికారానికి వచ్చిన మసూద్‌ను 2001 సెప్టెంబరు తొమ్మిదిన విషమిచ్చి చంపారు. తరువాత రెండు రోజులకే న్యూయార్క్‌లోని ప్రపంచ వాణిజ్య కేంద్రం మీద ఆల్‌ఖైదా ఆత్మాహుతి విమానదాడికి పాల్పడింది. మసూద్‌ హత్యకు దీనికి సంబంధం ఉందని చెబుతారు. ఆ దాడిని ఆసరా చేసుకొని తాలిబాన్లు, ఆల్‌ఖైదాను అంతమొందించాలనే పేరుతో అమెరికా అదే ఏడాది జోక్యం చేసుకొని రెండు దశాబ్దాలు దాడులు చేసింది.ఆల్‌ఖైదా నేత బిన్‌ లాడెన్‌కు ఆశ్రయమిచ్చింది, అతని అనుపానులు తెలియచేసి హతమార్చేందుకు సహకరించింది పాకిస్తాన్‌ అన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు మసూద్‌ అనుచరులకు నాయకత్వం వహిస్తున్న సాలేV్‌ాకు గతంలో అమెరికా సిఐఏ శిక్షణ ఇచ్చి ఆఫ్ఘన్‌ గూఢచార వ్యవస్ధ అధిపతిగా ఏర్పాటు చేసింది.తరువాత ఉపాధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు తానే తాత్కాలిక అధ్యక్షుడిని అని ప్రకటించుకున్న ఆ ముఠాకు అమెరికా మద్దతు ఉందనే వార్తలు వస్తున్నాయి.


వియత్నాం-ఆఫ్ఘన్‌ పరిణామాలను చూసినపుడు అమెరికా ఆయుధ శక్తి ఆదేశాల మీద పని చేయలేదు. ఒక చోట కమ్యూనిస్టులు ప్రతిఘటిస్తే మరొక చోట మతవాదులు ఆపని చేశారు. అమెరికాను తరిమివేసిన తరువాత కమ్యూనిస్టుల నాయకత్వంలోని వియత్నాం వినాశనం నుంచి దేశాన్ని తిరిగి నిర్మించి నేడు అభివృద్ది బాటలో ఎలా నడుస్తున్నదో చూస్తున్నాము. ఆప్ఘనిస్తాన్‌లో వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసిన తరువాత ఏర్పడిన ముజాహిదీన్ల,తాలిబాన్ల ప్రభుత్వం, గత రెండు దశాబ్దాలుగా అమెరికా కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వం గానీ దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్ధలను మెరుగుపరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు దశాబ్దాలలో పరిస్ధితి దిగజారింది. ఆఫ్ఘనిస్తాన్‌లో 2,400 మంది అమెరికన్‌ సైనికులు మరణించినప్పటికీ దానికి నాలుగు రెట్లు ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘన్‌ మిలిటరీ, పోలీసుల శిక్షణకు 90బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసినా ఫలితం లేదని స్పష్టమైంది. మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అదుపు చేసేందుకు పది బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసిన తరువాత నల్లమందు సాగు పెరిగింది. ఆర్ధిక వృద్ధికి 24బి.డాలర్లు ఖర్చు చేసినట్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తం మూడులక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే లాభపడింది అమెరికన్‌ కంపెనీలు, ఆఫ్ఘనిస్తాన్‌లో అవినీతి పరులు తప్ప మరొకరు కాదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు గత రెండు దశాబ్దాలలో 104 బిలియన్‌ డాలర్లు తీసుకున్నారు. ఆఫ్ఘన్‌ పార్లమెంటులో తొలి మహిళా సభ్యురాలు మలాలై జోయా అమెరికా సేనల ఉపసంహరణకు ముందు రాసిన ఒక వ్యాసంలో తమకు ముగ్గురు శత్రువులున్నారని పేర్కొన్నారు. తాలిబన్లు, ప్రభుత్వ ముసుగులో ఉన్న యుద్ద ప్రభువులు, అమెరికా మిలిటరీ అని పేర్కొన్నారు. ఇప్పుడు తాలిబాన్లు తప్ప మిగిలిన ఇద్దరు శత్రువులు లేరు.తాలిబాన్లు దేశాన్ని బాగు చేస్తారా ? గతంలో అలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు చేసే అవకాశమూ కనిపించటం లేదు. అమెరికాను తరిమివేయటంలో వియత్నాంతో పోలిక ఉండవచ్చు గానీ అభివృద్ది, జనం విషయంలో తాలిబాన్లకు అలాంటి లక్షణాలు, లక్ష్యమూ లేదు.