ఎం కోటేశ్వరరావు
చైనా అధినేత గ్జీ జింపింగ్ ఆగస్టు 17న చేసిన ప్రసంగంలో పదే పదే ప్రస్తావించిన ” ప్రజల ఉమ్మడి సౌభాగ్యం ” అనే పదం గురించి ప్రపంచంలో అనేక మంది దాని అర్ధం ఏమిటబ్బా అని మల్లగుల్లాలు పడుతున్నారు.ముఖ్యంగా సోషలిస్టు విధానం నుంచి వైదొలిగిన చైనా ”ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానాన్ని” అనుసరిస్తున్నదని సంతృప్తి ( సోషలిజం కాదంటున్నారు గనుక పోనీలే ఏదో ఒక పెట్టుబడిదారీ విధానం అని) చెందుతున్నవారికి ఇది మింగుడు పడటం లేదు. కావాలంటే దిగువ వారిని పైకి తీసుకురావచ్చు తప్ప పెరిగేవారిని అదుపు చేసే పితలాటకం ఏమిటి అని చిరచిరలాడుతున్నారు. అచిర కాలంలోనే అద్భుత విజయాలు సాధించిన చైనా ప్రయాణం మరో మలుపు తిరగనుందా ? తన ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో అడపాతడపా దేశ ఉమ్మడి సౌభాగ్యం గురించి ప్రస్తావన చేస్తున్న అధ్యక్షుడు గ్జీ గింపింగ్ ఐదు సంవత్సరాల క్రితం ఒక ప్రసంగంలో క్రీస్తుపూర్వం 571-479 మధ్య కాలంలో జీవించిన చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ తన శిష్యులకు చెప్పిన ఒక లోకోక్తిని ఉటంకించారు.” తెలివైన నేత దారిద్య్రాన్ని గురించి కాదు అసమానతల గురించి ఆందోళన చెందుతాడు.తన జనం తక్కువ మందే ఉన్నారని కాదు వారిలో తీవ్ర విభజన ఉందని ఆందోళన చెందుతాడు.” అని చెప్పాడు.
చైనాలో అసమానతలు పెరుగుతున్నాయన్న విమర్శలు, ఆవేదన, ఆందోళనలు గత కొంత కాలంగా ఇంటా బయటా పెరుగుతున్న విషయం తెలిసిందే. చైనా 2021లో 1,058 మంది బిలియనీర్లతో ప్రపంచంలో అగ్రస్ధానంలో ఉంది, 696మందితో అమెరికా, 177 మందితో మన దేశం మూడవ స్ధానంలో ఉంది. ఈ అంకెలను చూసి చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం తప్ప సోషలిస్టు వ్యవస్ధ కాదని కొంత మంది కమ్యూనిస్టులు కూడా భావించుతున్నారు. గ్జీ లేదా కమ్యూనిస్టు పార్టీ మాటలకు అర్ధం తెల్లవారేసరికి చైనాలోని బిలియనీర్ల సంపదలు మొత్తం స్వాధీనం చేసుకొని అందరికీ సమంగా పంచబోతున్నారని కాదు, కొత్తగా ఎవరినీ ధనవంతులను కానివ్వకుండా అడ్డుకోనున్నారనీ కాదు. పేదలు-ధనికుల మధ్య అంతరాన్ని మరింతగా పెరగటాన్ని అనుమతించకూడదని ఈ ఏడాది జనవరిలో జింపింగ్ చెప్పాడు. నిర్దిష్టమైన కార్యక్రమం గురించి ఎలాంటి స్పష్టత ఇంకా లేదు.
ఆగస్టు 17 ప్రసంగంలో గ్జీ పదే పదే ఉమ్మడి సౌభాగ్యం గురించి చెప్పటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కాలంలో తన ప్రసంగాల్లో 30సార్లు అపదాన్ని వినియోగిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 65సార్లు చెప్పినట్లు అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయలో చైనా రాజకీయ పదజాల అధ్యయనవేత్త మరియా రెపినికోవా వెల్లండించారు. గ్జీ ఉద్దేశ్య బలాన్ని ఇది సూచిస్తున్నదన్నారు. నేతల నినాదాలు విధాన దిశ లేదా మార్పును సూచిస్తాయని,కొన్ని సందర్భాలలో అసందిగ్గత, భాష్యాల సర్దుబాటుకు అవకాశం కూడా ఇస్తారని చెప్పారు. ఆగస్టు 17వ తేదీన కమ్యూనిస్టు పార్టీ ఆర్ధిక మరియు విత్త వ్యవహారాల కమిటీ సమావేశంలో గ్జింపింగ్ ప్రసంగించారు. ఆదాయ పంపిణీ, అక్రమ మరియు సహేతుకంగానీ ఆదాయాల సమస్యలను ఎదుర్కొనేందుకు, అధిక ఆదాయాలను సహేతుకంగా సర్దుబాటు చేసేందుకు గాను అధికపన్నులు, సామాజిక భద్రత, చెల్లింపుల బదలాయింపుల వంటి విధానాలను ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశం జరిగిన మరుసటి రోజు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో ఉమ్మడి సౌభాగ్యం అంటే క్లుప్తంగా ఏమిటి అంటూ ఒక గీతల చిత్రాలతో గ్జిన్హువా వార్తా సంస్ధ విడుదల చేసిన ఒక వివరణ ప్రచురించారు.” మరింత న్యాయమైన పంపిణీ మరియు అత్యంత నాణ్యమైన అభివృద్ది మీద చైనా దృష్టి సారించింది. ఉమ్మడి సౌభాగ్యం అంటే ఏమిటి ? భౌతిక మరియు సాంస్కృతిక పరిభాషలో ప్రతి ఒక్కరూ సంపదను పంచుకోవటాన్ని ఉమ్మడి సౌభాగ్యం అనే మాట చెబుతున్నది.కొంత మంది మాత్రమే భాగ్యవంతులుగా ఉండకూడదు. సమానత్వ రహిత విశ్వాసిగా ఉండకూడదు. ఉమ్మడి సౌభాగ్యానికి ప్రాతిపదిక ఏమిటి ? జనాలు తమ అభివృద్ధి సామర్ధ్యాలను వృద్ది చేసుకొనేందుకు మెరుగైన పరిస్ధితులను కల్పించటం. మరింత ఎక్కువ మంది ధనవంతులు అయ్యేందుకు వీలుకలిగించే పరిసర వాతావరణాన్ని కల్పించటం. ఉమ్మడి సౌభాగ్య సూత్రాలేమిటి ? ప్రతి ఒక్కరూ లబ్ది పొందేలా ఒక సహేతుకమైన పంపిణీ వ్యవస్ధను ఏర్పాటు చేయటం. ప్రజల సంక్షేమానికి సదుపాయాలు కల్పించటం. క్రమబద్ద మరియు పురోగామి పద్దతిలో ఉమ్మడి సౌభాగ్యాన్ని ప్రోత్సహించటం. ఉమ్మడి సౌభాగ్యాన్ని సాధించేందుకు మార్గాలేమిటి ? ఆదాయ పంపిణీకి అవసరమైన ప్రాధమిక వ్యవస్ధాపరమైన సదుపాయాలను కల్పించటం.అధిక ఆదాయాన్ని సర్దుబాటు చేయటం, అక్రమ ఆదాయాన్ని నిషేధించటం. మధ్య ఆదాయ తరగతి పరిమాణాన్ని పెంచటం. తక్కువ ఆదాయ తరగతుల సంపాదన పెంచటం. తదుపరి పనిపై కేంద్రీకరణ ఏమిటి ?అందరికీ సమంగా అందేట్లుగా ప్రజా మౌలిక సదుపాయాలను మరిన్ని నిర్మించటం. మేథోసంపత్తి హక్కులను రక్షించటం, చట్టబద్దమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు అవకాశం ఇవ్వటం, పెట్టుబడి ఆరోగ్యవంతమైన పద్దతుల్లో పెరిగేందుకు వీలు కల్పించటం. గ్రామీణ ప్రాంతాలు, రైతులలో సంపదలు పెరిగేట్లుగా ప్రోత్సహించటం.”
గ్జిన్హువా ప్రభుత్వ అధికార సంస్ద గనుక కమ్యూనిస్టు పార్టీ, ప్రభుత్వ ఆలోచనకు ప్రతిబింబంగా తీసుకొని ప్రపంచవ్యాపితంగా మీడియా సంస్దలు ఉమ్మడి సౌభాగ్యం మీద వార్తలు, వ్యాఖ్య, విశ్లేషణలు ఇచ్చాయి. పెద్ద మొత్తాలలో ఆదాయాలున్న కంపెనీల మీద చర్యల గురించి ఊహాగానాలను ప్రచురించారు. ఉమ్మడి సౌభాగ్యం అనే భావనను మావో జెడాంగ్ ముందుగా పార్టీలో ప్రవేశపెట్టారని, ముందుగా ఆర్ధిక వృద్ధి మీద కేంద్రీకరించాలని, అది కొంత మంది జనాలు ధనికులు అయ్యేందుకు అనుమతిస్తుందని, ఉమ్మడి సౌభాగ్యం తరువాత వస్తుందని చెప్పిన డెంగ్ గ్జియావోపింగ్ తన ఉపన్యాసాల్లో ఆ పదాలను ఉపయోగించలేదని బ్లూమ్‌బెర్గ్ వ్యాఖ్యానించింది. చైనా సంపదల పంపిణీలో అసమానతల గురించి అక్కడి నాయకత్వం దాచిందేమీ లేదు. అయితే అధికారికమైన సమాచారం లేని కారణంగా విదేశీ మీడియాలో వచ్చే అంకెలను పూర్తిగా విశ్వసించలేము అలాగని తోసిపుచ్చలేము. ఒక సంస్ధ లేదా విశ్లేషకులు ఇచ్చిన సమాచారం మరొక దానికి వెళ్లేసరికి పొంతన ఉండదు. ఉదాహరణకు చైనా ఉమ్మడి సౌభాగ్యం గురించి తాజాగా ఇచ్చి బ్లూమ్‌బెర్గ్ వార్త ప్రకారం మధ్యతరగతి వారు 40కోట్ల మంది కాగా అమెరికన్ పూ సర్వే సంస్ద ఇచ్చిన ప్రకారం 2018లోనే 70.7 కోట్ల మంది ఉన్నారు. అంటే జనాభాలో 50.8శాతం మంది. వీరిలో కూడా ఆదాయ తేడా ఉంటుంది.ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2000-2018 మధ్య బ్రిక్స్ దేశాలలో మధ్య తరగతి జనాభాలో జరిగిన మార్పు వివరాలు ఇలా ఉన్నాయి.(ఆధారం చైనాపవర్ డాట్ క్రైసిస్ డాట్ ఓఆర్‌జి)
దేశం××2000లో జనాభాలోశాతం×× 2018లో శాతం×××× మార్పు శాతం
చైనా ×××××× 3.1 ××× 50.8 ×××× 47.7
రష్యా ×××××× 28.2 ××× 71.5 ×××× 43.3
బ్రెజిల్ ×××× 30.3 ××× 51.4 ×××× 21.1
ద.ఆఫ్రికా×××× 15.1 ××× 22.5 ×××× 7.4
భారత్ ××××× 1.2 ××× 5.7 ×××× 4.5
2035 నాటికి అందరికీ ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు ఎంతో పురోగతి సాధించాల్సి ఉందని గ్జీ జింపింగ్ గతేడాదే చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా 2025నాటికి 45శాతం ఆదాయాన్ని పెంచటం ద్వారా అంతరాన్ని తగ్గించేందుకు ఝెజియాంగ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు.అసమానతల తగ్గింపునకు అధిక ఆదాయం ఉన్నవారిపై పన్నులు పెంచాలని ఆమొత్తాలను దిగువ ఆదాయం ఉన్నవారి సంక్షేమానికి ఖర్చు చేయాలన్నది ఒక ఆలోచన. ఎంత ఆదాయం ఉన్నవారి మీద ఎంత పెంచాలి అనే కసరత్తు జరుగుతోంది. అక్రమ ఆదాయం, పన్ను ఎగవేతల మీద ముందుగా దృష్టి పెడతారు. అది ముందుగా పార్టీ కార్యకర్తలతోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఎకానసమిస్టు పత్రిక రాసింది.హాంగ్‌ఝౌ పట్టణంలోని 24,800 మంది కార్యకర్తలు స్ధానికంగా ఉన్న సంస్ధల నుంచి అక్రమంగా రుణాలు తీసుకోవటం లేదా స్వప్రయోజనాలకు పాల్పడిందీ లేనిదీ స్వచ్చందంగా వెల్లడించాలని పార్టీలో అవినీతి నిరోధక విభాగం కోరినట్లు ఆ వార్తలో పేర్కొన్నది. అధిక ఆదాయం కలిగిన వారి నుంచి స్వచ్చందంగా విరాళాల ద్వారా నిధులు సమీకరించాలని కూడా భావిస్తున్నారని, ఆ కారణంగానే ఆగస్టు 17 సమావేశం తరువాత ఇంటర్నెట్ బడా కంపెనీ టెన్‌సెంట్ 770 కోట్ల డాలర్లను సామాజిక కార్యక్రమాలకు విడుదల చేసిందని పేర్కొన్నది. రూళ్ల కర్ర మాదిరి అన్ని చోట్లా ఒకే రకమైన నిబంధనల అమలు కాకుండా స్దానికంగా ఉన్న పరిస్దితిని బట్టి వర్తింప చేయాలని కోరటంతో ఆమేరకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఝెజియాంగ్ రాష్ట్రంలోని పట్టణాలలో కసరత్తు ప్రారంభమైందని, రాష్ట్ర ఆదాయంలో కార్మికుల వాటాను 50శాతానికి పెంచాలన్నది ఒక నిర్ణయమని ఎకానమిస్టు పేర్కొన్నది.
ఉమ్మడి సౌభాగ్య పధకం అమల్లో భాగంగానే ఇటీవల టెక్నాలజీ కంపెనీల మీద నియంత్రణ చర్యల ప్రారంభమని సిఎన్‌బిసి వ్యాఖ్యాత పేర్కొన్నారు.ఆచరణాత్మకంగా అమలు ఉంటుందని ఎకానమిస్ట్ పత్రిక ఆర్ధికవేత్త యూ సు వ్యాఖ్యానించారు. అధిక ఆదాయం గలవారు, పెట్టుబడి మీద వచ్చే ఆదాయంపై పన్నులు పెంచుతారని ఈ చర్య పెట్టుబడులు తగ్గేందుకు, బయటకు పోయేందుకు దారితీస్తుందని, ఆర్ధిక వ్యవస్ధ మీద పున:పంపిణీ విధానాల ప్రభావాన్ని చైనా ప్రభుత్వం విస్మరించజాలదని చెప్పారు. ఫ్రెంచి ఆర్ధికవేత్త థామస్ పికెటీ బృందం 2019లో తమ విశ్లేషణలో చెప్పినదాని ప్రకారం 1978లో అగ్రభాగంలోని పదిశాతం మందికి 27శాతం ఆదాయం వస్తే 2015 నాటికి అది 41శాతానికి పెరిగింది. తమ దేశంలో దుర్భరదారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించినట్లు గతేడాది చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆర్ధిక వ్యవస్ధలో మధ్య ఆదాయ తరగతి వాటాను పెంచేందుకు చైనా చర్యలు తీసుకుంటున్నదని మోర్గాన్ స్టాన్లే విశ్లేషకులు పేర్కొన్నారు. చైనాలోని బడా టెక్నాలజీ కంపెనీలు చిన్న సంస్ధలను మింగివేస్తున్నాయనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం కొన్ని నియంత్రణ చర్యలు తీసుకుంది. రెండు నెలల కాలంలో ఆలీబాబా, జెడిడాట్‌కామ్ కంపెనీల వాటాల ధరలు స్టాక్‌ఎక్సేంజ్‌లో 29శాతం పడిపోయాయి. మరికొన్ని కంపెనీలదీ అదే పరిస్ధితి. ఆర్ధిక విధానంలో వచ్చిన మార్పును విదేశీ మదుపుదార్లు అర్ధం చేసుకొని దానికి అనుగుణ్యంగా మారాల్సి ఉంటుందని షాంఘైలోని ఒక సంస్ధ ప్రొఫెసర్ ఝు నింగ్ చెప్పాడు. కొంత మందినైనా ముందు ధనవంతులను కానిద్దాం అనే విధానానికి ఇది విరుద్దమని అన్నాడు.
జాక్ మా ఆధీనంలోని అలీబాబా కంపెనీని విదేశీ సంస్దల పోటీ నుంచి తట్టుకొనేందుకు ప్రభుత్వం సంవత్సరాల పాటు కాపాడింది. దాని అనుబంధ యాంట్ గ్రూపు వాటాల విక్రయాన్ని గతేడాది నవంబరులో నిలిపివేసింది. ఈఏడాది ఏప్రిల్‌లో 18.23 బిలియన్ యువాన్ల అపరాధ రుసుం విధించింది. ఆహార పదార్దాలను సరఫరా చేసే జొమాటో, స్విగ్గీవంటి సంస్ధలలో పని చేసే వారికి స్ధానిక కనీస వేతనాలు చెల్లించాలని నియంత్రణ సంస్ద ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీ వస్తుసరఫరాలో కొన్ని సంస్దల గుత్తాధిపత్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చిన్న వ్యాపారుల స్వాగతిస్తున్నారు. పోటీ లేని కారణంగా పదిహేను నుంచి 25శాతం వరకు తమ నుంచి కమిషన్ డిమాండ్ చేస్తున్నారని, ఎక్కువ కంపెనీలు రంగంలో ఉంటే తమకు బేరమాడే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.యాప్‌ల ద్వారా చిన్న దుకాణాల వారు ఆర్డర్లు తీసుకొని తామే సరఫరా చేస్తున్నారు. చైనాలో 14 కోట్ల మంది చిన్న దుకాణాల వారున్నారని అంచనా. ఇప్పటి వరకు పిల్లలకు ట్యూషన్లు చెప్పేందుకు అమెరికా తదితర విదేశీ మదుపుదార్లు పెద్దమొత్తాలను పెట్టుబడులు పెట్టి తలిదండ్రుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. ట్యూషన్లు చెప్పే కంపెనీలను లాభాల ప్రాతిపదికన నడపకూడదని, విదేశీ పెట్టుబడులను అనుమతించరాదని గత నెలలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి కంపెనీల వాటాల ధరలు పతనమయ్యాయి.
చైనా ప్రభుత్వం అక్కడి టెక్నాలజీ సంస్దలపై నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా అక్కడి సంస్దల్లో పెట్టుబడులు పెట్టేవారు వేరే దేశాలను చూసుకుంటారని, అందువలన మన దేశంలోని అంకుర సంస్దలు లబ్ది పొందవచ్చని కొందరు చెబుతున్నారు. నిజంగా అలాంటి వారు ముందుకు వస్తే అభ్యంతర పెట్టాల్సినపని లేదు. మనం అభివృద్దిలో చైనాతో పోల్చుకుంటున్నాం, వీలైతే దాన్ని అధిగమించి పోవాలని చెబుతున్నారు. అంతకంటే కావాల్సింది ఏముంది.పైన చెప్పుకున్న వివరాల ప్రకారం కొనుగోలు శక్తి ఎక్కువగా ఉండే మధ్య తరగతి ఆదాయవర్గాన్ని పెంచకుండా అది సాధ్యం కాదు. అందువలన మన దేశంలో దారిద్య్రాన్ని పూర్తిగా నిర్మూలించటం, క్రమంగా మధ్యతరగతి, ధనికులను ఎలా పెంచటమా అన్నదే సమస్య. ఆచరణను చూస్తే ఆ దిశగా ఎలాంటి ఆలోచనా లేదు, చర్యలూ లేవు.
ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తరువాత అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వేతనాల వాటా పడిపోతోంది. దీనికి సాంకేతికంగా వచ్చిన మార్పులతో ఉత్పత్తి పెరగటం, కార్మికులు తగ్గటం వంటి కారణాలు కూడా ఉన్నప్పటికీ వేతనాల శాతం పడిపోతోంది. ఆ ధోరణికి భిన్నంగా వేతనాల శాతాన్ని పెంచాలని చైనా తలపెట్టింది. ఈ కారణంగానే గతంలో తక్కువ వేతనాలు ఉన్నాయని వచ్చిన అనేక కంపెనీలు ఇప్పుడు చైనా కంటే తక్కువ వేతనాలు దొరికే దేశాలకు మారిపోవాలని చూస్తున్నాయి. అయితే అవి బయటకు పోతే అతి పెద్ద చైనా మార్కెట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. అందువల్లనే అనేక కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. నూతన పరిస్ధితులకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకుంటున్నాయి. సేవారంగంలోని తాత్కాలిక కార్మికుల (జోమాటో, స్విగ్గీ వంటివి) వేతనాలు పెంచిన కారణంగా చైనాలో ఆహార సరఫరా చేసే కంపెనీ మెయిటువాన్ షేర్ ధర 18శాతం పడిపోయింది. ఎక్కడ అయితే తృప్తి, సమ్మతము ఉంటుందో అక్కడ ప్రజల తిరుగుబాట్లు ఉండవు అన్న కన్ఫ్యూషియస్ ప్రవచనాన్ని గ్జీ ఉటంకించారు. ఆ దిశగా చైనా చర్యలు ఉన్నాయని చెప్పవచ్చు.చైనా మాదిరి అభివృద్ది చెందాలని చెబుతున్నవారు దీన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా ?