Tags
BJP, Narendramodi, National Monetisation Pipeline, Nirmala Sitharaman, Niti Aayog, NMP, Rahul gandhi, Smriti Irani
!
ఎం కోటేశ్వరరావు
కేంద్ర ప్రభుత్వ ఆస్తుల ద్వారా 2025 నాటికి ఆరులక్షల కోట్ల రూపాయల ధన ఆర్జనకు నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 23వ తేదీన ప్రకటించారు. దీనికి నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్-ఎన్‌ఎంపి( జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ) అని నామకరణం చేశారు. గొట్టపు బావుల ద్వారా నీటిని తోడినట్లు ప్రభుత్వ ఆస్తులతో ధనాన్ని సంపాదిస్తామన్నది అర్ధం. సమర్ధించేవారు ముందుకు తెస్తున్న వాదనలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రభుత్వం ఒక కుటుంబం అనుకుందాం. మనింట్లో ఉన్న బావిని మన కుటుంబం ఒక్కటే వినియోగిస్తున్నది. నీళ్లు తోడమంటే కుటుంబసభ్యులే విసుక్కుంటున్నారు. ఎక్కువ సేపు నిరుపయోగంగా పడి ఉంటున్నది. దాన్ని ఇతరులకు అద్దెకు ఇచ్చి రోజంతా నీళ్లు తోడిస్తే మనకు కొంత సొమ్ము ముట్టచెబుతారు. నీళ్లు లేనివారికి నీటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. కొంత మందికి పని కల్పిస్తారు, తద్వారా ప్రభుత్వానికి పని కల్పించే, నీళ్లు అందించే ఖర్చు తప్పుతుంది. ఒప్పంద గడువు ముగిసే వరకు బావికి వచ్చే మరమ్మతులు, నిర్వహణకు తీసుకున్నవారే పెట్టుబడి పెడతారు. తిరిగి మన బావిని మనకు అప్పగిస్తారు. వారు ఇచ్చే మొత్తాన్ని వేరే అవసరాలకు వినియోగించి మరిన్ని సంపదలు సమకూర్చుకోవచ్చు.
మరొక ఉదాహరణ. మీకు ఒక ఇల్లు ఉంది. ఉద్యోగ రీత్యా వేరే ఊరు, రాష్ట్రం, దేశం పోతారు. దాన్ని అద్దెకు ఇచ్చుకుంటామా పాడు పెట్టుకుంటామా ? అలాగే ఖాళీ స్ధలం ఉంది, ఎవరికైనా అద్దె లేదా కౌలుకు ఇచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయా రావా? అలా చేస్తామా, చెట్లుచేమలను మొలిపిస్తామా, పాములు, పుట్టలను పెరగనిస్తామా ? ప్రభుత్వ ఆస్తులను అమ్మటం లేదు, పధకాలకు అవసరమైన డబ్బుకోసం వినియోగానికి మాత్రమే ప్రయివేటు వారికి ఇస్తున్నారు.యాజమాన్య హక్కు ప్రభుత్వానిదే, ప్రయివేటు వారు అభివృద్ధి చేసి గడువు తీరిన తరువాత తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. దీని మీద రచ్చ చేయటం ఏమిటి ? ఇది తీరు ! దీనిలో వాస్తవం లేదా ? కాదని ఎలా అంటాం, ఎంత మంచి ఆలోచన !
దేశవ్యాపితంగా దీని గురించి చర్చ జరుగుతోంది. నరేంద్రమోడీ డీమానిటైజేషన్ షాకు తిన్న జనానికి ఇప్పుడు నిర్మలమ్మ మానిటైజేషన్ ఆశచూపుతున్నారు. సామాన్యులు ఎంతవరకు పట్టించుకున్నారో తెలియదు. ఆ పదానికి అసలైన అర్ధం ఏమిటి అని కొందరు పండిత చర్చ చేస్తున్నారు. నిఘంటు అర్ధం గురించి తీరికగా తెలుసుకుందాం. ప్రధాని గారూ డీమానిటైజేషన్ ఎందుకు అంటే ఉపయోగంలో లేకుండా ఎక్కడెక్కడో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీసేందుకు, తద్వారా పెట్టుబడులకు అందుబాటులోకి తెచ్చి అభివృద్ధి కోసం అని చెప్పారు. కమ్యూనిస్టులు, ఇతరులు కొందరు తప్ప అత్యధికులు ఆహౌ ఓహౌ మహత్తర ఆలోచన, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అని నోట్లు మార్చుకొనేందుకు ఎలా వరుసలు కట్టి నిలుచున్నారో తెలిసిందే. ఇంకేముంది సమాంతర ఆర్ధిక వ్యవస్ధను నడుపుతున్న నల్లధనం నడుం విరిగిపోతుంది అని కొందరు జోశ్యం చెప్పారు. అసలు ఆ ”అవిడియా” నాదే అని చెప్పిన చంద్రబాబు గురించీ తెలిసిందే. ఆచర్యతో ఎంతో నష్టం తప్ప నల్లధనం వెలికి వచ్చిందీ లేదు,వృద్ది ఇంకా దిగజారింది తప్ప దేశానికి వీసమెత్తు ఉపయోగం లేదు. (ఇప్పుడు వీసం పదం వినియోగంలో లేదు గనుక సెంటీమీటరు లేదా పావలా ప్రయోజనం లేదు అనుకోవచ్చు) అనేక అంశాలలో తలలు బొప్పి కట్టిన తరువాత మోడీగారు ధనార్జన పధకాన్ని ప్రకటించటానికి నిర్మలమ్మగారికి అప్పగించారు. ఆచరణలో డబ్బు ఆర్జన జరుగుతుందని చెబుతున్నారు గనుక అలాగే పిలుద్దాం. ప్రభుత్వ అంటే ప్రజల ఆస్తులను కొంత మంది పెద్దలు కాజేయటం ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా మిగిలి ఉన్న ఏ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా అని చాలా కాలం నుంచే తన్నుకుపోయేందుకు రాబందుల్లా ఆకాశంలో కార్పొరేట్ శక్తులు తిరుగుతున్నాయి.గోతికాడ నక్కల్లా భూమ్మీద కాచుకు కూర్చున్నాయి.భూమి ప్రమేయం ఉన్న ఆస్తులను తెగనమ్మటానికి ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి అధికారం లేదు. ఎవరికైనా వినియోగహక్కు మాత్రమే ఉంటుంది. అందువలన దాన్ని వేరే రూపంలో కట్టబెట్టేందుకు ఎంచుకున్న సరికొత్త మార్గం ఇది అన్నది స్పష్టం.అంతే కాదు తమ మాదిరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ధనార్జనకు పూనుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు.
బిజెపివారు, కేంద్ర ప్రభువులు, భుజం మార్చుకోకుండా వారిని మోస్తున్నవారు చెబుతున్నట్లుగా నిరుపయోగంగా ఉన్నవాటిని ఎవరైనా వృద్ది చేస్తామంటే ఎవరు అభ్యంతర పెడతారు. సామాన్య జనానికి ప్రయోజనం లేక కేవలం పెద్దల విలాసాలకు మాత్రమే ఉపయోగపడే, ఖజానాకు భారంగా మారిన హౌటళ్లను పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు ప్రభుత్వం వదిలించుకుంది. చైనా తరువాత ప్రపంచంలో పెద్ద దేశమైన మనం ఒలింపిక్స్‌లో స్వర్ణం కోసం ఎంత తపించామో, ఏ స్ధితిలో ఉన్నామో తెలిసిందే. వినియోగంలో లేని స్టేడియాలను అభివృద్ధి చేసి క్రీడాకారులను ప్రోత్సహించితే ఎవరు వద్దన్నారు. ఆపని చేయకుండా వాటిని కార్పొరేట్లకు అప్పగించితే వాణిజ్య ప్రయోజనాలు తప్ప క్రీడలకు ప్రోత్సాహం ఎక్కడి నుంచి వస్తుంది ? ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రణాళికలు లేకుండా ఏ దేశంలో అయినా క్రీడాకారులు అభివృద్ది చెందిన దాఖలా ఉందా ? లేదూ వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు అటువంటి లక్ష్యం ఉంటే ఏ సంస్ధ ఇప్పటి వరకు ఎంత మందిని తయారు చేసి ఎన్ని పతకాలు సాధించిందో చెప్పమనండి. నరేంద్రమోడీ గారు టీ అమ్మాను అని చెబుతున్న రైల్వే స్టేషన్ల వంటివి చాలా ఉన్నాయి. దేశభక్తులైన కార్పొరేట్ సంస్ధలు, వ్యాపారులు అలాంటి వాటిని అభివృద్ధి చేయమనండి ఇబ్బంది లేదు. కానీ విజయవాడ, సికిందరాబాద్ రైల్వే స్టేషన్లు నిరుపయోగంగా ఉన్నాయని బుర్రలో గుంజున్నవారు ఎవరైనా చెబుతారా ? తిరిగే వాహనాలు లేక జాతీయ రహదారులుపాడుపడి పోయాయని తలలో మెదడు ఉన్నవారు అనగలరా ? విశాఖ, కాకినాడ వంటి రేవులకు ఓడలు రాక బోసిపోతున్నాయని రుజువు చూపగలరా ? అందువలన నిరుపయోగంగా ఉన్నవాటిని ప్రయివేటు వారికి ఇచ్చి డబ్బు సంపాదిస్తామని బిజెపి వారు చెబుతున్నదానిలో వాస్తవం ఎంత ? అందుకే ప్రయివేటీకరణకు మారు పేరే మానిటైజేషన్ అంటున్నవారిని తప్పుపడితే ఎలా !
దేశం ముందుకు పోవాలంటే,ప్రపంచ స్ధాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలంటే మోనిటైజేషన్ ఒక్కటే ఏకైక మార్గం అని నీతి అయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు. పూర్వం బ్రతుకు తెరువు కోసం గ్రామాల్లో బుర్రకథలు, హరికథలు చెప్పేవారు గ్రామీణులను ఉబ్బించి సొమ్ము చేసుకొనేందుకు అసలు మీ ఊరి గురించి మీకేమి తెలుసు చుట్టుపట్ల అరవై ఆరు ఊళ్లకు పోతుగడ్డ అనగానే నిజమే కదా అనుకొని పండిన ధాన్యం, పప్పు ధాన్యం వంటివి పెద్ద మొత్తంలో ఇచ్చి సత్కరించే వారు. ఇప్పుడు పాలకులు-అధికారులు ఎవరున్నా ప్రపంచ స్దాయి సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే చేస్తున్నవన్నీ అని చెప్పటం పోతుగడ్డలను గుర్తుకు తెస్తోంది.
ప్రపంచ స్ధాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ పంచ రంగుల చిత్రాన్ని చూపుతున్నారు. పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పినపుడు జరిగిన చర్చ ఏమిటి గ్యాస్ స్టౌవ్‌లు ఇస్తే చాలదు వాటి మీద వండుకొనేందుకు సరకులు, అవికొనుగోలు చేసేందుకు అవసరమైన ఆదాయానికి ఉపాధి సంగతి ఏమిటన్నదే కదా ! కరోనా సమయంలో ఆత్మనిర్భర పధకంలో చెప్పింది ఏమిటి ? కార్పొరేట్ ఆసుపత్రులను నెలకొల్పేందుకు తోడ్పాటు అందిస్తామనే కదా ? కార్పొరేట్‌లు గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆసుపత్రులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? వినియోగించే జనం ఆర్ధిక స్ధాయి, చెల్లించేశక్తిని బట్టి క్రమంగా సౌకర్యాలను పెంచాలి తప్ప ప్రపంచస్ధాయి పేరుతో ధనికులకు మాత్రమే ఉపయోగపడే, కార్పొరేట్లకు లాభాలు తెచ్చే వాటిని అమలు జరిపితే అసమానతలు మరింతగా పెరుగుతాయి తప్ప అభివృద్ధి ఫలాలు అందరికీ అందవు. రోడ్ల నిర్మాణానికి పెట్రోలు, డీజిలు కొనుగోలు చేసేవారందరూ సెస్ పేరుతో పన్ను కడుతున్నారు. వాటితో వేశామని చెబుతున్న రోడ్లను ఉపయోగించినందుకు తిరిగి వారే టోలు టాక్సు కడుతున్నారు. జాతీయ రోడ్ల అభివృద్ది సంస్ద రోడ్లు వేయగలిగినపుడు వాటిని నిర్వహించలేదా ? అంత అసమర్ధంగా ప్రభుత్వం – అధికార యంత్రాంగం ఉందా ? గత కాంగ్రెస్‌కు బిజెపికి ఇంక తేడా ఏముంది ?
ధనార్జన గొట్టపు మార్గ పధకాన్ని ప్రకటించింది నిర్మలా సీతారామన్ అయినప్పటికీ ఇది నరేంద్రమోడీ గారి కలకు రూపకల్పన అని ఆమే చెప్పారు. గతంలో ప్రణాళికా సంఘం ద్వారా ఆస్తుల కల్పన జరిగింది. దాని స్ధానంలో మోడీగారు తెచ్చిన నీతి అయోగ్ వాటిని కొంత మందికి కారుచౌకగా కట్టబెట్టే పనిలో ఉంది. ఆ సంస్ధ నివేదిక విడుదల-జాతీయ ధనార్జన గొట్టపు మార్గం ప్రారంభం సందర్భంగా ఆర్ధిక మంత్రి ప్రభుత్వ లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.వర్తమాన సంవత్సర బడ్జెట్‌లోనే ప్రభుత్వం దీని గురించి చెప్పిది. ఇదేమీ కొత్త కాదు, వినూత్న పధకమూ కాదు. ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య మెల్లగా అయినా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇక్కడ జర్మన్ నాజీ నరహంతకుడు హిట్లర్ పాలన గురించి తొలుత భ్రమపడి చివరకు జైల్లో పడిన తరువాత కనువిప్పు కలిగిన ఒక మతాధికారి జైల్లోనే రాసిన ప్రఖ్యాత కవితను ఇక్కడ గుర్తుకు తేవటం సమయోచితంగా ఉంటుంది. మొదటి లైను జర్మను కవిత, రెండవది దానికి సామ్యం.
” వారు తొలుత కమ్యూనిస్టుల కోసం వచ్చారు నేను కమ్యూనిస్టును కాదు గనుక మౌనంగా ఉన్నాను-
తొలుత నష్టాలు తెచ్చే కంపెనీలను వదిలించుకుందాం అని చెప్పారు కనుక నిజమే పోతే పోనీ అనుకున్నా
వారు తరువాత కార్మిక నేతల కోసం వచ్చారు -నేను కార్మికుడిని కాదు కనుక మాట్లాడలేదు-
ప్రయోజనం లేని కంపెనీలు కొనసాగటం అనవసరం అమ్మేద్దాం, మూసేద్దాం అంటే కామోసు అనుకున్నాను
వారు తరువాత యూదుల కోసం వచ్చారు – నేను యూదును కాదు గనుక ప్రశ్నించలేదు-
కొన్ని కంపెనీల్లో కొన్ని వాటాలు అమ్ముతాం అన్నారు, కొన్నే కదా ఇబ్బందేముంది అనుకున్నా
వారు చివరికి నాకోసం వచ్చారు – తీరా చూస్తే నాగురించి ప్రశ్నించేవారు మిగల్లేదు –
చివరిగా లాభనష్టాలతోనిమిత్తం లేకుండా నేను పనిచేస్తున్న కంపెనీ ప్రయివేటుకు ఇస్తా మంటున్నారు, నాకు మద్దతుగా మాట్లాడేవారు లేకుండా పోయారు ”
అన్నట్లుగా అనేక మంది ఇప్పుడు ముప్పు ముంచుకు వస్తున్నందున వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. వారి సంఖ్య పెరిగే లోపు, ప్రతిఘటనకు సిద్దపడేలోగా లాభాలు, సంపదలను సృష్టించే కంపెనీలను కూడా వదిలించుకొనేందుకు విధానపరంగా పూనుకున్నారు. అందువలన ఇక దాచేదేముంది చెప్పేదేదో గట్టిగా చెబితే అటో ఇటో తేలిపోతుందని, ఇంక ఎంత వ్యతిరేకించినా జరిగేది జరగక మానదని జనం నిరుత్సాహంతో నీరుగారి పోవాలనే ఎత్తుగడతో ఆర్భాటంగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాము ఎంత కఠినంగా ఉండేది దేశానికి చూపేందుకు రైతులు ఢిల్లీకి రాకుండా రోడ్ల మీద మేకులు కొట్టి, ఎంతకాలం రోడ్ల మీద ఉంటారో ఉండండి అని భీష్మించుకున్న తీరును చూస్తున్నాము. దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతిన్నది కనుక దానికి నిధులు అవసరమని ఒక సాకుగా చూపవచ్చు. కొంత మందిని అయినా నమ్మించి వ్యతిరేకతను తగ్గించవచ్చు.
ఇప్పటికే ఉన్న ఆస్తుల ద్వారా స్ధిరమైన ఆదాయాన్ని పొందుతామని చెబుతున్నారు. జాతీయ మౌలిక సదుపాయాల గొట్టం(నేషనల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ పైప్‌లైన్-నిప్) కోసం 43లక్షల కోట్ల రూపాయలతో రూపొందించిన పధకానికి ధన ఆర్జన గొట్టం ద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలని ప్రతిపాదించారు. మరికొన్ని లెక్కల ప్రకారం వీటితో సహా మొత్తం 111 లక్షల కోట్లతో అభివృద్ది అని చెబుతున్నారు. 2022-25 ఆర్ధిక సంవత్సరాల మధ్య రోడ్లను ప్రయివేటు వారికి అప్పగించటం ద్వారా రు.1,60,200 కోట్లు, రైల్వేల ద్వారా రు.1,52,496 కోట్లు, పవర్ ట్రాన్సిమిషన్ ద్వారా రు.45,200 కోట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 39,832 కోట్లు, సహజవాయు పైప్‌లైన్ ద్వారా రు.24,462 కోట్లు, టెలికాం టవర్ల ద్వారా రు.35,100, గోదాముల ద్వారా రు.28,900, గనుల నుంచి రు.28,747, ప్రోడక్ట్ పైప్‌లైన్ ద్వారా రు.22,504, వైమానిక రంగం నుంచి రు.20,782, పట్టణ రియలెస్టేట్ నుంచి రు.15,000, రేవుల ద్వారా రు,12,828, స్టేడియంల ద్వారా రు.11,450 కోట్ల రూపాయలను ఆర్జించాలని ప్రతిపాదించారు. వీటిలో నిరర్దక ఆస్తులు లేదా ఆదాయం రాని ఆస్తులు ఏవో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఈ మధ్య బ్రౌన్ ఫీల్డ్ మరియు గ్రీన్ ఫీల్డ్ ఆస్తులు అనే పదాలు వాడుతున్నారు. ఇప్పుడు ఉనికిలో ఉన్న ఆస్తులు మొదటి తరగతి, కొత్తగా ఏర్పాటు చేసేవి రెండవ తరగతి. రెండవ తరగతిని ప్రయివేటు రంగానికి అప్పగించాలన్నది నిర్ణయం. ఉన్న వాటిని ప్రయివేటీకరించటం లేదా కౌలుకు ఇవ్వటం ద్వారా జనాల నుంచి పిండే మొత్తాల విషయాన్ని కూడా పాలకులు చెబితే నిజాయితీని అర్ధం చేసుకోవచ్చు.
ఆస్తులను ప్రయివేటు వారికి అప్పగించే కేంద్ర ప్రకటన, విధానాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. దాని మీద నిర్మలమ్మ, మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇతరులకు ఆగ్రహం వచ్చింది. బిడ్డా 2008లో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అభివృద్దికి ప్రయివేటు వారిని ఆహ్వానించినపుడు ఏం చేసినవ్, వాటి పత్రాలను నాడు ఎందుకు చించివేయలేదు ? ఎందుకు నోర్మూసుకున్నవ్ అని నిర్మలమ్మ ప్రశ్నించారు. మీ అమ్మ సోనియా గాంధీ అప్పుడు దేశాన్ని అమ్మేందుకు ప్రయత్నించారని స్మృతి ఇరానీ అన్నారు. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాలు కూడా చేస్తున్నది ఇదే, దాని అర్ధం అవి కూడా ప్రయివేటీకరిస్తున్నాయా అని నిలదీశారు. ఒకటి స్పష్టం. గతంలో కాంగ్రెస్-ఇప్పుడు బిజెపి రెండూ ప్రజల ఆస్తులను ఏదో ఒక సాకుతో ప్రయివేటు పరం చేస్తున్నారని తేలిపోయింది. అప్పుడు పూర్తిగా చేయలేకపోయారు, ఇప్పుడు తెగించి సంపూర్ణం చేయదలచారు. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల పాలిత రాష్ట్రాలు కూడా వీటికి మినహాయింపు కాదు. ఏడు దశాబ్దాల్లో సమకూర్చిన రత్నాలను ఇద్దరు ముగ్గురు స్నేహితులైన వాణిజ్యవేత్తలకు బహుమతిగా కట్టబెడుతున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మొత్తం ప్రయివేటీకరణ, మోనిటైజేషన్ గుత్తాధిపతులను సృష్టించేందుకే అని ఇదంతా ఎవరికోసం చేస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు అన్నారు.
సుపరిపాలన అందిస్తామని చెబుతున్న పాలకులు ప్రభుత్వ రంగంలో పని చేసే వారిని దారిలో పెట్టి కమశిక్షణ కలిగిన జాతిగా రూపొందించే కృషిలో పని సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ఎందుకు ప్రయత్నించరు , వారు చెప్పే జాతి నిర్మాణం అంటే ఏమిటి ? ప్రభుత్వ రంగం అంటే అసమర్ధకు మారు పేరు అంటున్న వారు ప్రయివేటు రంగం అసమర్ధత గురించి ఎందుకు చెప్పరు ? నరేంద్రమోడీ ప్రపంచనేత అని చెబుతున్నారు, ధనార్జన ఆయన కలల సాకారం అని కూడా చెప్పారు. అనేక దేశాలను పర్యటించిన అనుభవం కూడా ఉంది. గనుక ఇలాంటి ధనార్జన చేస్తున్న ఇతర దేశాల అనుభవాలను జనానికి ఎందుకు చెప్పరు ? అన్ని దేశాల సంగతి వదిలేద్దాం. చతుష్టయంలో భాగమైన ఆస్ట్రేలియా గురించి అయినా ఎందుకు ప్రస్తావించలేదు ? అక్కడేం జరిగింది ? మరో భాగంలో చూద్దాం !
ఈ వ్యాసానికి రెండవ ముగింపు భాగ లింక్
https://vedikaa.com/2021/08/29/national-monetisation-pipeline-part-two-modi-inviting-failed-private-sector-to-take-over-public-assets/
Pingback: ఏడేండ్ల మోడీ ఏలుబడి : నాడు చెప్పింది ఆస్తుల వృద్ది – నేడు చేస్తున్నది ఉన్న వాటి అమ్మకం ? | vedika