Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రయివేటీకరణ విషయంలో కాంగ్రెస్‌కు -బిజెపికి ఉన్న మౌలికమైన తేడాలు ఏమిటన్నది కొందరికి సందేహం.సూటిగా చెప్పాలంటే ఆస్తులను సృష్టించిన ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించిన పార్టీ కాంగ్రెస్‌, వాటిని తెగనమ్మేందుకు పూనుకున్న పక్షం బిజెపి. మొదటి పక్షానికి కాస్త బెరుకు ఉండేది, రెండో పార్టీకి అలాంటి వేమీ లేవు, ఎందుకంటే వారి ఏలుబడిలో సృష్టించిన ఆస్తులేమీ లేవు కదా ! కాకపోతే మిగతా అంశాల్లో ఎలా అయితే ముసుగులు వేసుకుందో ఈ విషయంలో కూడా అదే చేస్తోందన్నది పరిశీలకుల భావన. అదే పూర్తిగా కట్టబెట్టటం కాదు, నిర్వహించి ప్రభుత్వానికి కొంత ముట్టచెప్పటం అని చెబుతున్నది దానికే మోనిటైజేషన్‌ అని పేరు పెట్టారు. ప్రయివేటు రంగం గురించి దేశ ప్రజలకు భ్రమలు, మరులు కొల్పించటం, ఆశ్రితులకు కారుచౌకగా ప్రజల ఆస్తులను కట్టబెట్టటం కొత్త కాదు. నయావుదారవాద విధానంలో అవి ఒక ప్రధాన అంశం.జాతీయ మౌలిక సదుపాయాల గొట్టపు పధకం పేరుతో దానికి తెరతీశారు. గత మూడు దశాబ్దాలుగా చెప్పిన కబుర్లు సినిమా నిర్మాణానికి ప్రమోషన్‌ లేదా ప్రచారంలో భాగంగా చెప్పినవి అనుకుంటే ఇప్పుడు సినిమా చూపిస్తమామా అంటూ విడుదల గురించి ఆర్భాటం చేస్తున్నారు. పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు-కార్మికులు అసమర్ధులు, అవినీతి పరులని పరోక్షంగా అంగీకరిస్తూ ప్రయివేటు రంగ మంత్రం జపిస్తున్నారు. మన కళ్ల ముందే బడా కార్పొరేట్‌ కంపెనీలు ఎలా, ఎందుకు విఫలమయ్యాయో చెబితే వాటి బండారాన్ని జనం అర్ధం చేసుకుంటారు. కానీ ఎక్కడా అలాంటి సమాచారం నరేంద్రమోడీ గారు మిత్రోంకు అందచేసిన దాఖలాల్లేవు.


ప్రయివేటు రంగం ఎంత అవినీతి, అక్రమాలతో జనాలను పీక్కుతింటుందో, ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో కరోనా మహమ్మారి వెల్లడించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, ఎస్‌బ్యాంకు, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టాటా టెలిసర్వీసెస్‌, ఓడాఫోన్‌, సత్యం కంప్యూటర్స్‌, ఇలా అనేక కంపెనీలు ఎలా మోసాలకు పాల్పడ్డాయో తెలిసిందే.ఇలాంటి వారికి ప్రభుత్వ ఆస్తులను అప్పగిస్తే వారు బాగుచేస్తారన్న హామీ ఏమిటి ? రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ -అనిల్‌ అంబానీ ఘోరవైఫల్యం గురించి తెలిసిందే. మన కళ్ల ముందు దివాలా తీసిన అతి పెద్ద ప్రయివేటు కంపెనీ. వారి సామర్ధ్యం ఏమైంది ? పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులున్న సదరు కంపెనీ 50వేల కోట్ల అప్పులతో ఐపి( దివాలా పిటీషన్‌ ) పెట్టింది. దానికే రాఫెల్‌ విమానాల కాంట్రాక్టును కట్టపెట్టారు. పెద్ద మనిషిగా పేరు గాంచిన రతన్‌ టాటా గ్రూపుకు చెందిన టాటా సన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ వివాదం గురించి తెలిసిందే. సైరస్‌ మిస్త్రీ నియామకం, తొలగింపు, కోర్టు వివాదాలు. అసలు ఏం జరుగుతోంది, వారు దేని గురించి దెబ్బలాడుకుంటున్నారో జనానికి తెలుసా ? పారదర్శకత ఉందా ! వారి సమస్యలనే వారు పరిష్కరించుకోలేక బజారుకు ఎక్కిన వారు దేశాన్ని ఉద్దరిస్తారంటే నమ్మటం ఎలా ? వారుగాకపోతే మరొకరు. బండారం బయటకు రానంతవరకే పెద్దమనుషులు. తెరతొలిగితే విశ్వరూపం కనిపిస్తుంది.


ఐసిఐసిఐ బ్యాంకు-వీడియోకాన్‌ బాగోతం ఏమిటి ? ఐసిఐసిఐ బ్యాంకు వీడియోకాన్‌కు 2009లో 300 కోట్ల రుణం ఇస్తే దానిలో 64కోట్లు మరుసటి రోజే నూపవర్‌ అనే కంపెనీకి బదలాయించారు. రుణం ఇచ్చింది ఎవరు ? చందాకొచ్చర్‌ నాయకత్వంలోని బ్యాంకు బృందం. ఐదోవంతు మొత్తాన్ని తరలించిన పవర్‌ కంపెనీ ఎవరిది, చందాకొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌ది. ఆ బృందంలోని మిగతా సభ్యులకు ఏమీ తెలియకుండానే ఈ వ్యవహారం జరిగిందా ? అది లంచం తప్ప మరొకటి కాదు అని కేసు నమోదు చేసి ఇడి, సిబిఐ దర్యాప్తు చేస్తున్నాయి.పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు-నీరవ్‌ మోడీ రు.11,400 కోట్ల అవినీతి బాగోతం గురించి చెప్పనవసరం లేదు. సత్యం కంప్యూటర్స్‌ అవినీతి గురించి తెలిసిందే. కార్పొరేట్‌ కంపెనీ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు అవలంభించిన కంపెనీగా, అమెరికా అధ్యక్షుడి సరసన కూర్చున్న సత్యం కంప్యూటర్స్‌కు గోల్డెన్‌ పీకాక్‌ గ్లోబల్‌ అవార్డును కూడా బహుకరించారు.తప్పుడు లెక్కలను తయారు చేసి మదుపుదార్లను మోసం చేసింది ఆ కంపెనీ. తన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న రెండు కంపెనీలు సత్యమ్‌ను తిరగేసి మైటాస్‌ అని పేరుపెట్టి ఏడువేల కోట్ల రూపాయల పెట్టుబడులను వాటికి మళ్లించేందుకు ప్రయత్నించారు. సత్యం కంపెనీతో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రపంచబ్యాంకు ఎనిమిది సంవత్సరాల నిషేధం విధించింది. పెద్దలు ఎలా మోసం చేస్తారో ప్రపంచానికి ఎంతో స్పష్టంగా ఈ ఉదంతం తెలిపింది.


ఇక సింగ్‌ సోదరులుగా పేరుమోసిన మాల్విందర్‌ సింగ్‌ – శివిందర్‌ సింగ్‌ ఫార్మా దిగ్గజాల్లో ఒకటైన రాన్‌బాక్సీ తదితర కంపెనీల యజమానులు.రెల్‌గేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరుతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ నుంచి రుణాలు తీసుకొని ఆ మొత్తాలను వేరే కంపెనీలకు మరలించి ఈ కంపెనీని దివాలా తీయించారు, 2,387 కోట్ల నష్టాల పాలు చేశారు.పది సంవత్సరాల కాలంలో వీరు 22,500 కోట్ల రూపాయలను నొక్కేశారని తేలింది.
మరో మోసకారి కంపెనీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌(డిహెచ్‌ఎఫ్‌ఎల్‌).కంపెనీ బాంద్రా శాఖ పేరుతో ఖాతా పుస్తకాలను తయారు చేశారు. అసలు అలాంటి శాఖే లేదు.బాంద్రాబుక్స్‌గా పిలుస్తున్న ఈ కంపెనీ కుంభకోణంలో జరిగిందేమిటి ? రు.23,815 కోట్లను 2,60,315 మందికి రుణాలు ఇచ్చినట్లు పుస్తకాల్లో రాశారు. వాస్తవంగా ఇచ్చింది రు.11,755 కోట్లు. వాటిలో కూడా కొన్నింటిని తనిఖీ చేస్తే రుణం తీసుకున్నవారు అదే యాజమాన్యంలోని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా తేలింది. లెక్కలను తారుమారు చేస,ి లేని ఆదాయాన్ని చూపి రు.24వేల కోట్ల మేరకు రుణసెక్యూరిటీల రూపంలో మదుపుదార్ల నుంచి వసూలు చేశారు.


ఇతర బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు తిరస్కరించిన వారికి రుణాలు ఇచ్చి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసిఅచిర కాలంలోనే పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించినదిగా పేరు మోసిన ఎస్‌ బ్యాంక్‌ చివరికి దివాలా తీసింది. ఎలాగూ ఎగవేసేవే గనుక బ్యాంకు కోరినంత ఫీజులు చెల్లించి మోసగాండ్లు రుణాలు తీసుకున్నారు.చివరికి బ్యాంకులో మదుపు చేసిన వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సి వచ్చింది. కేఫ్‌ కాఫీ డే కంపెనీ యజమాని సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాఫీ గింజలను పండించటంలో 140 సంవత్సరాల చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చి అత్యాశకు పోయి అప్పులపాలై చివరకు అలా ముగిసింది. విదేశీ కంపెనీల నుంచి రుణాలు తీసుకున్నారు, తగిన ఆదాయం లేక చివరకు 2,700 కోట్లకు అప్పు పెరిగి ఇచ్చిన వారి వత్తిళ్లను తట్టుకోలేక సిద్దార్ద ఆత్మహత్య చేసుకున్నాడు.దేశంలో రెండవ స్ధానంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ యజమానులు బ్యాంకులకు రు.8,500 కోట్ల బకాయి పడ్డారు. ఇతరులకు మరో 25వేల కోట్ల మేరకు ఇవ్వాల్సి ఉంది. కింగ్‌ఫిషర్‌, సహారా, డెక్కన్‌ ఇలాంటి విమాన సంస్ధలన్నీ తప్పుడు విధానాలకు పాల్పడి తాము మునిగి బ్యాంకులు, ఇతరులను ముంచాయి. పేరుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డులు ఉన్నా అవన్నీ వేలుముద్రలు లేదా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేవారితో నిండి ఉంటాయి. ఇలాంటి ప్రయివేటు సంస్దలకు ప్రజల ఆస్తులను అప్పగించబోతున్నారు.
ఇక ప్రయివేటు బ్యాంకులు తీరు తెన్నులను చూద్దాం. గతంలో బ్యాంకులను జాతీయకరణ చేసినందుకు ఇందిరా గాంధీకి జనం బ్రహ్మరధం పట్టారంటే అమాయకులై కాదు. ప్రయివేటు రంగంలోని బ్యాంకులు, బీమా కంపెనీలు జనానికి టోపీ పెట్టాయి గనుకనే హర్షించారు. ఇప్పుడు జాతీయ సంపదలుగా ఉన్నవాటిని తిరిగి ప్రయివేటు రంగానికి కట్టబెట్టబోతున్నారు.1947 నుంచి 1969వరకు 559 ప్రయివేటు బ్యాంకులు దివాలా తీశాయి. ఈ కాలంలో 736 బ్యాంకులను విలీనం లేదా రద్దు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బ్యాంకులను తిరిగి ప్రయివేటీకరించాలని కోరుతున్నారు. వాటిని ప్రయివేటు వారు కరిమింగిన వెలగపండులా మారిస్తే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత తీసుకుంటారు.1969 బ్యాంకుల జాతీయకరణ తరువాత కూడా కొన్ని ప్రయివేటు బ్యాంకులను అనుమతించారు. వాటిలో ఇప్పటి వరకు 36 బ్యాంకులు అక్రమాలకు పాల్పడ్డాయి. అవేవీ ఇప్పుడు ఉనికలో లేవు. గ్ల్రోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకు వాటిలో ఒకటి, దానిని ఓరియంటల్‌ బ్యాంకుతో విలీనం చేశారు.ప్రయివేటు యాజమాన్యాలు అంత సమర్ధవంతమైనవి అయితే ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది. ఇప్పుడున్న ప్రయివేటు బ్యాంకులు తమ వాటాను ఎందుకు పెంచుకోలేకపోతున్నాయి.2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 563 ప్రయివేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అక్కడ మొత్తం ప్రయివేటు రంగానిదే ఆధిపత్యం కదా !


జాతీయ ధనార్జన గొట్టపు పధకాన్ని (మోనిటైజేషన్‌) ప్రకటించే ముందు ఆస్ట్రేలియా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నారా అంటూ మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసలు అలాంటి ప్రశ్నలు మన మీడియాలో వచ్చేదే అపురూపం, ఎందుకంటే మీడియా యాజమాన్యాలు ప్రయివేటీకరణకు అనుకూలం గనుక. ప్రయివేటీకరణ లేదా నిర్వహణకు ప్రయివేటు వారికి అప్పగించటం పేరు ఏది పెట్టినా మన పాలకులు వాటిని పాడి గేదెలు లేదా ఆవులుగా మారుస్తామని చెబుతున్నారు. ఒకసారి మన గేదె, ఆవును ఇతరులకు అప్పగించి మేపి, పాలు తీసి అమ్ముకొని మీరు నాలుగు డబ్బులు వెనకేసుకొని మాకు నాలుగు ఇమ్మని చెప్పిన తరువాత వారు ఎంత ధర చెబితే అంతకు మనం కూడా పాలు కొనాల్సిందే, ధర మీద మనకు అజమాయిషీ ఉండదు. ముసలిదైపోయి పాలిచ్చే అవకాశం లేని దశలో మనకు అప్పగిస్తారు.


అందువలన అలాంటి పనులు చేయబోయే ముందు పోటీ తత్వం ఉందో లేదో , వినియోగదారులను అధిక ధరలతో పిండకుండా చూసేందుకు ప్రభుత్వం బహిరంగ సమీక్షలు జరపాలని ఆస్ట్రేలియా పోటీతత్వ నిఘా సంస్ద అధ్యక్షుడు రోడ్‌ సిమ్స్‌ చెప్పారు. మరి తామే అసలైన జవాబుదారులం, చౌకీదారులం అని చెబుతున్న మోడీ సర్కార్‌ అలాంటి చర్చ ఎన్నడైనా, ఎక్కడైనా జరిపిందా ? ఆస్ట్రేలియాలో తరచుగా పోటీ లేకుండా ప్రయివేటు వారికి అప్పగిస్తున్నారని సిమ్స్‌ వాపోయాడు.నియంత్రణలు లేకపోతే జనాన్ని పీక్కుతింటారని అన్నాడు. ఆస్తులను పాడిగేదెల మాదిరి మారిస్తే ఆర్ధిక సామర్ధ్యానికి ప్రతిబంధకం అవుతుందన్నాడు. 2013లో పోటీ తత్వం లేకుండా బోటనీ అనే ఆస్ట్రేలియా రేవును ప్రయివేటు వారికి అప్పగించారు. తరువాత న్యూకాజిల్‌ ప్రాంతంలో మరొక కంటెయినర్‌ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. దాన్ని నిర్మించితే రేవు నూతన యజమానులకు 510 కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. ప్రయివేటీకరించిన రేవులు, విమానాశ్రయాలు యజమానుల మార్కెట్‌ శక్తిని తగ్గించటం లేదని సిమ్స్‌ పేర్కొన్నాడు. అంటే పోటీని అనుమతించటం లేదనే అర్దం. ఇదే సిమ్స్‌ ఏడు సంవత్సరాల క్రితం ఇదే హెచ్చరిక చేశాడు. పోటీకి అనుకూల సంస్కృతిని ఆస్ట్రేలియా కోల్పోతోందని చెప్పాడు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌లో విద్యుత్‌ స్ధంభాలు, వైర్ల ప్రయివేటీకరణ చేసిన తరువాత ఐదు సంవత్సరాల్లో వినియోగదారులకు విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. దాంతో ప్రభుత్వం వినియోగదారుల మీద భారం తగ్గించే చర్యలను చేపట్టింది.
సిడ్నీ నగరంలో నిర్మిస్తున్న భూగర్భ రోడ్డు మార్గంలో 51శాతం వాటాను ప్రయివేటు కంపెనీకి అమ్మివేశారు. దాని గురించి సమాచార హక్కు కింద వివరాలు ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని, ఆడిటర్‌కు కూడా పరిమితులు పెట్టారని సిడ్నీమోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రిక రాసింది.సింగపూర్‌లో రైల్వేలను కొంత మేరకు ప్రయివేటీకరించారు. తీసుకున్న యజమాని తగినంత పెట్టుబడి పెట్టని కారణంగా రైళ్లు ఆగిపోతున్నాయి. అందువలన తిరిగి జాతీయం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది.


పలు కంపెనీలు టెలికాం రంగంలోకి వచ్చినపుడు పోటీ పడి చార్జీలు తగ్గించిన విషయం తెలిసిందే. ఆలశ్యంగా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్‌ జియో వినియోగదారులను అతి తక్కువ ఛార్జీలతో ఆకర్షించింది. తన ఆర్ధికశక్తిని పెట్టుబడిగా పెట్టింది. గణనీయమైన మార్కెట్‌ను ఆక్రమించింది. పోటీ కంపెనీలు దివాలా దీసిన తరువాత చార్జీలు పెంచుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడున్న ఒకటి రెండు కంపెనీలు కూడా రంగం నుంచి తప్పుకుంటే ముకేష్‌ అంబానీ ఎంత చెబితే అంత చెల్లించకతప్పదు. రేపు రోడ్లయినా, విద్యుత్‌ మరొకటి ఏదైనా అంతే మొత్తం ప్రయివేటు వారి నిర్వహణకు పోతే వారెంత చార్జీ చెల్లించాలంటే అంత చెల్లించాల్సిందే. పజల ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెట్టటం మన దేశంలోనే కాదు అనేక దేశాల పాలకులు సమర్పించుకుంటున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న వాటి విలువ కనిష్టంగా 75లక్షల కోట్ల డాలర్లని నాలుగు సంవత్సరాల నాటి ఒక అంచనా.రాష్ట్ర,స్ధానిక ప్రభుత్వాల వాటిని కూడా కలుపుకుంటే కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వాల అప్పులు అనేక దేశాల్లో జిడిపికి వందశాతం దాటి నందున రాబోయే రోజుల్లో ఆర్ధిక వృద్ధి మరియు ఉపాధి కల్పనకు నిధుల కేటాయింపు మరింత ఇబ్బంది అవుతుందని, అవసరాలకు – కేటాయింపులకు మధ్య తేడా 2040 నాటికి 15లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. మన దేశంలో కూడా అదే జరుగుతోంది.


1998నాటికి మన కేంద్ర ప్రభుత్వ రుణం 9,896,997,300( దాదాపు పదిలక్షల కోట్లు), అది 2014లో నరేంద్రమోడీ అధికారానికి వచ్చే నాటికి 53లక్షల కోట్లకు పెరిగింది.2021 మార్చి నాటికి ఆ మొత్తం 116,217,806,400 కోట్లు( 116లక్షల కోట్లు) వర్తమాన ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి అది 132లక్షల కోట్లు అవుతుందని అంచనా. కేంద్రం-రాష్ర ప్రభుత్వాల రుణాల మొత్తం జిడిపిలో 2019-20నాటికి 70శాతం అయితే, మరుసటి ఏడాదికి అది 90శాతానికి చేరింది. వందశాతం మార్కు దాటటానికి ఎంతో దూరంలో లేము. అందువలన పాలకులు తెగబడి ప్రభుత్వ ఆస్తులను అయినకాడికి తెగనమ్మి లేదా అనుభవానికి అప్పగించి సొమ్ము చేసుకొని లోటు పూడ్చుకొనేందుకు లేదా అప్పులు తీర్చేందుకు పూనుకున్నారు. ఇవన్నీ అయిపోయిన తరువాత జనం మీద మరిన్ని భారాలు మోపటమే తరువాయి. నిరుపయోగంగా పడి ఉన్న ఆస్తులను ధనార్జన అని నిర్మలమ్మ నమ్మబలుకుతున్నా అసలు విషయం వేరే. 2021 ఫిబ్రవరి 24 మన ప్రధాని నరేంద్రమోడీ జాతికి ఒక సందేశం ఇచ్చారు. మోనిటైజ్‌ అండ్‌ మోడర్నయిజ్‌ (ధనార్జన మరియు నవీకరణ) అనే ఇతివృత్తంతో బడ్జెట్‌ను రూపొందించామని, ప్రభుత్వం ఉన్నది పాలన చేయటానికి తప్ప వాణిజ్యం చేయటానికి కాదు అన్నారు.కేంద్ర ప్రభుత్వశాఖ ” దీపం ”(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) ఏర్పాటు చేసిన ఒకవెబ్‌నార్‌లో మోడీ మాట్లాడారు. ప్రయివేటీకరణ మరియు ధనార్జన(మోనిటైజేషన్‌) ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు వినియోగిస్తామన్నారు. అంటే వీలైన వాటిని తెగనమ్మేస్తారు, కాని వాటిని మోనిటైజేషన్‌ పేరుతో ప్రయివేటు వారి అనుభవానికి సమర్పిస్తారు. చిత్రం ఏమిటంటే బ్రిటన్‌ కంపెనీ అయిన వోడా ఐడియా కంపెనీ చేతులెత్తేసి మా వాటాలను అప్పగిస్తాం మమ్మల్ని ఊబి నుంచి బయటపడేయండి అని వేడుకోళ్లకు దిగింది. దాన్ని కొనుగోలు చేసేందుకు జియో ఇతరులు పోటీ పడుతున్నాయి. ఇంకా అనేక కంపెనీలు అదే స్ధితిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్తులతో ఆర్జన మాచేత కావటం లేదు వీటిని తీసుకొని మాకు నాలుగు రూకలిచ్చేవారు ఎవరైనా ఉన్నారా అంటూ మోడీ సర్కార్‌ వీధుల్లో నిలబడింది. ఏడు సంవత్సరాల క్రితం మీరు మాదేశానికి రండి, వస్తువులను తయారు చేయండి, ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోండి అని విదేశీ కార్పొరేట్‌లు, వాణిజ్య సంస్ధలకు విజ్ఞప్తి చేసిన నరేంద్రమోడీ ఇప్పుడు అవే సంస్ధలకు మా ఆస్తులను తీసుకోండి, నిర్వహించండి, మాకు కొంత సొమ్ము ముట్ట చెప్పండి అని వేడుకుంటున్నారు. ఎంతలో ఎంత మార్పు !


బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి కేంద్ర ప్రభుత్వ ధనార్జన గొట్టపు మార్గం గురించి చేసిన వ్యాఖ్యతో దీన్ని ముగిద్దాం.” ఆర్ధిక వ్యవస్ధ అధోగతి పాలైనపుడు ప్రజల ఆస్తులను అమ్మటం మానసిక దివాలా మరియు నిరాశకు ఒక సూచిక. ఇది ఆరోగ్యకరమైన సైద్దాంతిక విధాయకత కాజాలదు.2016 నుంచి జిడిపి వృద్ది రేటు ఏడాది తరువాత ఏడాది, త్రైమాసికం తరువాత త్రైమాసికం దిగజారుతున్నదని సిఎస్‌ఓ సమాచారం వెల్లడిస్తున్న అంశాన్ని మోడీ ప్రభుత్వం తిరస్కరించజాలదు.”
ఈ వ్యాసానికి మొదటి భాగ లింక్‌