Tags

, ,


ఎం కోటేశ్వరరావు


అవునా ? పరిణామాలను చూస్తే ఆ దిశలోనే అడుగులు పడుతున్నాయి. అందువలన తొందరపడి వీరంగం వేస్తూ ఇతరుల గురించి ముందే ఏదిబడితే అది మాట్లాడి ఇబ్బందుల్లో పడతారో లేక సంయమనం పాటిస్తారో భక్తులు ఆలోచించుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటు తధ్యం, అయితే వారిలో ఏ ముఠా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది, దాన్ని మిగతావారు అంగీకరిస్తారా, అంతర్యుద్దం జరుగుతుందా అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వాటికి వెంటనే సమాధానం దొరకదు. కాబూల్‌ విమానాశ్రయ పరిసరాల్లో ఆత్మాహుతిదళం పేలుళ్లు తాలిబాన్లను సవాలు చేసే శక్తులు ఉన్నాయనేందుకు ఒక సూచిక. అవి బలమైనవా లేక బేరమాడేందుకు అలాంటి దారుణాలకు పాల్పడుతున్నారా ? ఏదీ చెప్పలేం !
మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ఆగస్టు 27న మాట్లాడుతూ ఆఫ్ఘన్‌ ప్రభుత్వ గుర్తింపు గురించి అడగ్గా ఏదీ ఇప్పుడేగా దాని గురించి ఆలోచిస్తున్నాం, ఇంకా అంతవరకు రాలేదు అన్నారు. ఇతర దేశాలు ఏమి చేస్తాయో వేచి చూస్తున్నాం, ఇప్పుడు అక్కడున్నవారిని స్వదేశానికి రప్పించటం గురించే కేంద్రీకరించాం అని చెప్పారు. ప్రాధమికంగా హిందువులు, సిక్కుల మీదనే కేంద్రీకరించినప్పటికీ మనతో ఉన్న ఆప్ఘన్‌లకు కూడా బాసటగా ఉంటాం అన్నారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయో తెలియదు. చివరి అమెరికన్‌ సైనికుడు వెళ్లిపోయిన తరువాత మరొక అంకం ప్రారంభం అవుతుంది.


తాలిబాన్లు ఆగస్టు 15న కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజే మన దేశం అధ్యక్ష స్ధానంలో ఉన్న భద్రతా మండలి చేసిన తీర్మానంలో ఆఫ్ఘన్‌గడ్డ మీద నుంచి ఉగ్రవాద చర్యలను తాలిబాన్లు అనుమతించరాదని కోరింది. ఆగస్టు 27న చేసిన మరో తీర్మానంలో తాలిబాన్లు అనే పదాన్ని తొలగించి ఏ బృందం లేదా వ్యక్తులు ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి భారత్‌ ఎంతో ముఖ్యమైనది. ఆర్ధిక, వాణిజ్య సంబంధాలను కోరుకుంటున్నాం. గతంలో మాదిరే సంబంధం కొనసాగుతుందని ఆశిస్తున్నాం అని తాలిబాన్‌ ప్రతినిధి స్టానెకజాయి ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కతార్‌లోని దోహాలో అమెరికా-తాలిబాన్ల మధ్య జరిగిన చర్చల ప్రతినిధి బృందానికి స్టానెకజాయి నాయకత్వం వహించాడు. గత కొన్ని నెలలుగా తెరవెనుక మన ప్రభుత్వం తాలిబాన్‌ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నప్పటికీ వారి వైపు నుంచి ఇలాంటి స్పష్టమైన వైఖరి వెల్లడి కాలేదు. ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌ అమెరికాను నమ్ముకొని వ్యవహరించిన తీరుతో ఇరుగుపొరుగు దేశాలన్నింటినీ మనం దూరం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపున ఆప్ఘనిస్తాన్‌లో చైనా పెత్తనాన్ని అడ్డుకోవాలంటే భారత్‌ అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించి సంబంధాలు పెట్టుకోవాలనే వాదనలను కొందరు ప్రారంభించారు. చైనాను సాకుగా చూపి తాలిబన్‌ ప్రభుత్వాన్ని మన ప్రభుత్వం గుర్తించినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీని మీద మాజీ దౌత్యవేత్తలు, ఇతర పండితులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలోనే అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతారనే స్పష్టమైన సంకేతాలు వెలువడినప్పటికీ ఏమి జరిగితే ఎలా వ్యవహరించాలి అనే ముందు చూపు మన వ్యూహకర్తలకు, అక్కడి పరిస్దితి గురించి సరైన అంచనా మన విదేశాంగ శాఖకు ఉన్నట్లు కనపడలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను జేమ్స్‌బాండ్‌ అని పొగుడుతారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల బలం, ప్రభుత్వ బలహీనతలపై అంచనా లేదు. ఒప్పందం ఆరునెలల ముందుగానే కుదిరినప్పటికీ ముందుగానే మన జాతీయులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా లేవు. తొంభై రోజుల్లో కాబూల్‌ తాలిబాన్ల వశం అవుతుందని సిఐఏ అంచనా వెలువడి తొమ్మిది రోజులు కూడా గడవక ముందే కూలిపోయింది. మన గూఢచార వ్యవస్ద దాన్ని పసిగట్టలేకపోయింది.


ఆప్ఘనిస్తాన్‌ నుంచి వైదొలుగుతామని బరాక్‌ ఒబామాయే ప్రకటించినప్పటికీ గత పన్నెండు సంవత్సరాలుగా ఆ పని చేయలేదు. ట్రంపు ప్రకటనలు, తరువాత అధికారానికి వచ్చిన జోబైడెన్‌ ప్రకటనలను ఉత్తుత్తివిగానే మన దేశం పరిగణించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తక్షణమేగాకున్నా పరిస్ధితులు కుదుట పడిన తరువాత అయినా గతంలో మనం విదేశాంగ విధానంలో అనుసరించిన తప్పిదాలను సరి చేసుకొనే చర్యలను ఇప్పుడు మోడీ సర్కార్‌ తీసుకుంటుందా అన్నది పెద్ద ప్రశ్న. తాలిబాన్లు అధికారానికి రానున్న నేపధ్యంలో వారి వెన్నంటి ఉన్న పాకిస్తాన్‌, ఇతర దేశాలతో సంబంధాలను సమీక్షించుకోవాల్సి ఉంటుంది. రాచపీనుగ ఒంటరిగా పోదన్నట్లుగా అమెరికాతో అంటకాగిన కారణంగా మనం ఇప్పుడు జీహాదీ ఉగ్రవాదం వంటి దాని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో మునుపటి మాదిరిగానే రాసుకుపూసుకు తిరిగితే కుదరదు. ఆప్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వైదొలిగి, మన భద్రతకు ముప్పు తెచ్చిన తీరును మన ప్రభుత్వం మాట మాత్రంగా అయినా తప్పుపట్టలేని బలహీన స్ధితిలో ఉంది.


భారత ఆందోళనను ఏమాత్రం అమెరికా పట్టించుకోలేదని వాషింగ్టన్‌ కేంద్రంగా పని చేస్తున్న హడ్సన్‌ సంస్ధ దక్షిణాసియా దేశాల డైరెక్టర్‌ అపర్ణ పాండే వ్యాఖ్యానించారు. భారత ఆందోళనను విస్మరించటమే కాదు, పాకిస్తాన్‌ గురించి లేవనెత్తిన వాటిని కొట్టిపారవేసింది, చివరికి పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడిందని కూడా ఆమె చెప్పారు. తాలిబాన్లపై రెండు దశాబ్దాలుగా దాడులు జరిపిన అమెరికాయే వారితో రాజీచేసుకున్నపుడు, అనేక దేశాలతో తాలిబాన్లు సంబంధాలు పెట్టుకున్నపుడు మన ప్రయోజనాల రక్షణకు మోడీ సర్కార్‌ తీసుకున్న చర్యలు ఏమిటన్నదే అసలు ప్రశ్న. సైద్దాంతికంగా తాలిబన్లకు మద్దతు ఇవ్వనవసరం లేదు.వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు ఒక దేశంతో మరొక దేశ సంబంధాలు ఏమిటన్న సమస్య ముందుకు వస్తుంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయనందున భారత్‌ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వాషింగ్టన్‌ డిసిలోని విల్సన్‌ కేంద్రంలోని ఆసియా కార్యక్రమ డైరెక్టర్‌ మైఖేల్‌ కుగ్లెమాన్‌ అన్నారు. తాలిబాన్లతో సంబంధాలను నెలకొల్పుకోవటంలో భారత్‌ ఆలశ్యం చేసింది. ఈ ఆలస్యం తిరిగి స్నేహాన్ని నెలకొల్పుకొనే క్రమంలో తాలిబాన్ల నూతన ప్రభుత్వ ఏర్పాట్లలో పాత్ర లేకుండా భారత్‌ మూల్యం చెల్లించిందని చెప్పారు.


కాబూల్‌ను స్వాధీనం చేసుకోక ముందు తాలిబాన్లు రష్యా, పాకిస్తాన్‌, చైనా, ఇరాన్‌, తుర్కిమెనిస్తాన్‌ వెళ్లారు తప్ప భారత్‌ వైపు చూడలేదు. వీటిలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప మిగిలిన దేశాలేవీ తాలిబాన్లను సమర్ధించినవి కాదు. అమెరికా చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి చైనా మన మీద దాడికి వస్తోందని గాని మరొకటని గానీ లడక్‌ సరిహద్దులో ఇప్పుడు రెండులక్షల మంది సైన్యాన్ని మోహరించాము. మేము ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బయటకు వచ్చాం గనుక భారత్‌తో సహా అందరం కలసి చైనా మీద కేంద్రీకరించుదామని అంటున్నారు. తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండవు. ఎక్కడో ఒక చోట ఉద్రిక్తతలు, యుద్దాలు లేకుండా, ఆయుధాలు అమ్ముకోకుండా అమెరికన్లకు పూటగడవదు. ఓకే, రేపు చైనా వారు ఎత్తుగడగా అమెరికా వారికి వాణిజ్య పరంగా కొన్ని రాయితీలు ఇస్తూ దిగుమతులను ఎక్కువ చేసుకొనేందుకు అంగీకరించారనుకోండి. అప్పుడు అమెరికా వాడు తనదారి తాను చూసుకుంటే వాడిని నమ్మి తాయత్తు కట్టుకొని బరిలోకి దిగే మన పరిస్ధితి ఏమిటి ? ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి అమెరికా వెనక్కు తగ్గిన పరిణామం సరిహద్దు వెంట చైనాతో ఉద్రిక్తతలను తగ్గించుకొనే వైపు భారత్‌ను బలవంతంగా నెడుతుందని హడ్సన్‌ సంస్ద డైరెక్టర్‌ అపర్ణ పాండే చెప్పారు. భారత్‌ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మార్చుకొనేందుకు, తనకు మరింత దగ్గరయ్యేందుకు అమెరికా వైపు నుంచి ప్రయత్నాలు ఉండవచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిణామాలు భారత్‌ను ఏమాత్రం అమెరికాకు మరింత దగ్గరకు చేర్చకపోగా తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వదులుకోకుండా మరింత గట్టిపరుస్తాయి. హిమాలయ ప్రాంతంలో తాను ఒంటరి అని భారత్‌కు తెలుసు గనుక చైనా వైపు మరింతగా దూకే సాహసం చేస్తుందని తాను అనుకోవటం లేదని కూడా అపర్ణ పాండే చెప్పారు.


ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల గురించి భారత్‌ ఆందోళన పడనవసరం లేదు, పాకిస్తాన్‌ వారిని అదుపు చేసే విధంగా రష్యా,చైనా, ఇరాన్‌లను చూసుకోనివ్వండి అని విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి శ్యామ్‌ సరణ్‌ అభిప్రాయపడ్డారు. తాలిబాన్ల ఆధ్వర్యంలో అక్కడ సుస్ధిరత ఏర్పడితే పాకిస్తాన్‌ కంటే వ్యూహాత్మకంగా చైనా మరింత ఎక్కువ లోతుల్లోకి పోతుంది. అది మధ్య ఆసియాలో తన పట్టును మరింత పటిష్టపరచుకుంటుంది అనికూడా చెప్పారు. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ లాల్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా ఉంది.తాలిబాన్లు అధికారంలోకి వస్తే అమెరికా పాత్ర పరిమితం అవుతుంది. ఆసియాకు రక్షణ కల్పించే ప్రధాన దేశంగా చైనా తయారవుతుంది. అది చతుష్టయ కూటమి పెరుగుదలను ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత ప్రాధాన్యత పలుచనవుతుంది. ద్వౌపాక్షిక సమస్యల్లో భారత దేశం అమెరికా మీద ఆధారపడకూడదని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ పర్యటన స్పష్టం చేసింది. అందువలన భారత అవకాశాలు పరిమితం అవుతాయి. అమెరికన్లు ఈ ప్రాంతంతో వ్యవహారించే వ్యూహాన్ని గతంలో మాదిరి తిరిగి పాకిస్తాన్‌తో ఏర్పరచుకుంటారు. అప్పుడు భారత్‌ తిరిగి హామీతో కూడిన, జీవితాంత మిత్రమైన రష్యాతో చేతులు కలపాల్సి ఉంటుంది.దాని కుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. అయినప్పటికీ భారత్‌ వైఖరులను మార్చుకోవటానికి సిద్దపడాలి. అది ఆఫ్ఘనిస్తాన్‌లోని పాలకులకు వ్యతిరేకంగా ఉండకూడదు. చైనా, రష్యా, ఇరాన్‌ వ్యూహాలకు అనుగుణ్యంగా సర్దుబాటు చేసుకోవాలి. భారత భద్రతకు రష్యా, ఇరాన్‌ ఎంతో కీలకం.


కొంత మంది తాలిబాన్లు వారు సైన్యంలో భాగంగా ఉన్నపుడు భారత్‌లో శిక్షణ పొందారు. భారత్‌ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు వారు తోడ్పడతారు. తద్వారా భారత ప్రయోజనాలను కాపాడుకోవచ్చు.కనుక బుర్రను ఉపయోగించకుండా గుడ్డిగా అమెరికాను అనుసరించటం కాకుండా మన ప్రయోజనాలను కాపాడుకొనేందుకు నేరుగా తాలిబాన్లతో సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం అవసరం. ఆఫ్ఘన్‌ పౌరులలో మనకు పరపతి ఉంది. అందువలన వేచి చూడకుండా ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని గుర్తించే తొలి జాబితాలో మనం ఉండాలి. ముల్లాల నుంచి లబ్దిపొందాలి. ఇది పాకిస్తాన్‌కు ప్రతిగా పలుకుబడిని కలిగిస్తుంది. ఒక వేళ తాలిబాన్లు స్ధిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే పంజేష్వర్‌ లోయలోని ప్రతిఘటన బృందంతో చర్చించేందుకు భారత్‌కు సానుకూల అంశం అవుతుంది.ఎందుకంటే గత తాలిబాన్‌ ప్రభుత్వంలో ఉన్న నార్తరన్‌ అలయన్స్‌లో అది భాగం, దాన్ని భారత్‌ సమర్దించింది.ఐఎస్‌కెపి రాష్ట్రంలోని శక్తులు తాలిబాన్ల మీద యుద్దాన్ని ప్రకటించాయి. ఈ అంశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఇబ్బందికర అంశంగా ఉంటుంది. అలా జరిగితే అక్కడ శాంతి, స్దిరత్వాల సాధనపై ప్రభావం చూపేందుకు తాత్కాలికంగా అయినా భారత్‌ చోదకశక్తిగా ఉంటుంది. అని అనిల్‌ కుమార్‌ చెప్పారు.


తాలిబన్లు ఉగ్రవాదులు, మతశక్తులే, మహిళలు, యావత్‌ జనానికి వారి చర్యలు వ్యతిరేకమే అనటంలో ఎలాంటి సందేహం లేదు. ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అజెండాలో భాగంగా గతంలో వారు పాల్పడిన అకృత్యాలను పదే పదే చూపుతూ, పాత వీడియోలు, దృశ్యాలను చూపుతూ మన ప్రధాన స్రవంతి మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాషాయ తాలిబాన్ల సంగతి సరేసరి, చెప్పనవసరం లేదు. ఆఫ్ఘన్‌ తాలిబాన్లతో పార్టీగా సంబంధాలు పెట్టుకోవటం వేరు, వారు లేదా వారి ప్రమేయం ఉన్న శక్తులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరిని అనుసరించాలనే అంశం వేరు. అమెరికా మనలను పట్టించుకోకుండా మోసం చేసిందని లోలోపల కుమిలిపోతున్నారు. ఇప్పుడు తాలిబన్లను గుర్తిస్తే వ్యతిరేకతను రెచ్చగొట్టిన కారణంగా మోడీ అభిమానులు, మతశక్తులు ప్రభుత్వ వైఖరిని జీర్ణించుకుంటాయా ?


మొత్తం మీద చూసినపుడు ఆఫ్ఘన్‌ కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి భద్రతా మండలిలో నెల రోజుల మన అధ్యక్ష పదవీ కాలం ముగుస్తుంది, సెప్టెంబరు నెలలో ఐర్లండు వంతు వస్తుంది. ఒక విధంగా మన దేశం తాత్కాలికంగా ఇరకాటం నుంచి బయటపడుతుంది. అమెరికాతో అంటకాగటం కొనసాగించాలా లేక ఒక స్వతంత్ర వైఖరితో ఉండాలా అన్నది నరేంద్రమోడీ సర్కార్‌ ముందున్న సవాళ్లలో ఒకటి. అమెరికా బెదిరింపులతో ఇరాన్‌ నుంచి నిలిపివేసిన చమురు కొనుగోళ్లను పునరుద్దరిస్తామని ఇప్పటికే ఒక సంకేతం ఇచ్చారు. మన ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని కూడా నిర్ణయించినట్లు చెబుతున్న విషయం తెలిసిందే. అప్పులోడు-చెప్పులోడి వెంట వెళ్ల కూడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. మనల్ని తప్పించుకొనేందుకు అప్పులోడు ఎటు తీసుకుపోతాడో తెలియదు. తనకు చెప్పులున్నాయి గనుక చెప్పులోడు ముళ్ల కంపలు, రాళ్లురప్పల మీదకు మనలను తీసుకుపోతాడు. అమెరికా కూడా అంతే . దాన్ని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఎటు తీసుకుపోతుందో తెలియదు. మనకే కాదు, నాటో కూటమి దేశాలకు సైతం తలబొప్పి కట్టింది. దానికి తన ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఇతరులు ఏమైనా పట్టదు.మన ప్రయోజనాలను పరి రక్షించుకుంటూ ఇరుగు పొరుగు దేశాలతో సమస్యలుంటే సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే వైఖరి, స్వతంత్ర విదేశాంగ విధానం అవసరం. మోడీ సర్కార్‌ ఆ దిశగా ఆలోచిస్తుందా ? అమెరికాను వదలి వెనక్కు తిరిగిరాలేని స్ధితికి వెళ్లి పోయిందా ?