ఎం కోటేశ్వరరావు
” మదుపుదార్లకు మూడులక్షల కోట్ల డాలర్ల నష్టం కలిగించిన చైనా ‘ విప్లవం ” అన్నది అమెరికా మీడియా సిఎన్‌ఎన్ ఒక విశ్లేషణకు పెట్టిన శీర్షిక.వర్తమాన సంవత్సరంలో మన దేశ జిడిపి అంచనాకు అది సమానం. లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టే, తలిదండ్రులను, విద్యార్ధులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ఆన్‌లైన్ ట్యూషన్ సంస్ధలను మూసివేసిందంటూ మరొక వ్యాఖ్యాత గుండెలు బాదుకున్నాడు. ఇంత మొత్తం నష్టం కలిగించే చర్యలకు చైనా ఎందుకు పాల్పడింది, అందునా కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్న స్దితిలో అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులకూ, అభిమానించే వారికీ ఆసక్తి కలిగించే అంశమే. చైనాలో ఉన్నది పెట్టుబడిదారీ వ్యవస్ద తప్ప సోషలిజం కాదూ పాడూ కాదు అన్నది ఒక అభిప్రాయం. కమ్యూనిస్టులమని చెప్పుకొనే వారు కూడా కొందరు వారిలో ఉన్నారు. మరి అలాంటి వ్యవస్ధ ఒక్కసారిగా మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు మదుపర్లకు నష్టం కలిగించే చర్యలు ఎందుకు తీసుకుంటుంది అంటే జవాబు ఉండదు. అక్కడ జరుగుతున్నది మంచా చెడ్డా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ముందు అక్కడే జరుగుతోందో తెలుసుకుందాం.
వివాదాస్పదమైన, దేశవ్యతిరేక రాజకీయ వైఖరులు తీసుకొనే మరియు అప్రయోజనమైన పద్దతుల్లో వ్యవహరించే కళాకారులను ప్రోత్సహించవద్దు. కార్యక్రమాలలో పాల్గొనే వారికి, అతిధులుగా వచ్చే వారికి చెల్లించే మొత్తాల మీద పరిమితులు విధించాలి. కళా రంగంలో దేశభక్తి పూరితమైన వాతావరణం ఉండేట్లు చూడాలి. నియంత్రణ చర్యల్లో భాగంగా ఎవరికి ఎంత పలుకుబడి ఉందనే సమాచారాన్ని ప్రచారం చేసే జాబితాల మీద, అభిమానాన్ని ఆదాయంగా మార్చే వైఖరుల మీద నిషేధం. పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు వారానికి మూడు గంటలు మాత్రమే వీడియోగేమ్స్ ఆడాలి. ఇంటర్నెట్ కంపెనీలు సేకరించిన సమాచారం ద్వారా దేశభద్రతకు ప్రమాదం కలిగించే ముప్పు నివారణ, మరియు అమెరికాతో సహా ఇతర దేశాల్లో వాటాల విక్రయం(ఐపిఓ)పై ఆంక్షలు. పౌర సంస్ధలు(కార్పొరేషన్లు, మున్సిపాలిటీలవంటివి) తమ సమాచార(డాటా) నియంత్రణ ప్రయివేటు కంపెనీల్లో గాకుండా ప్రభుత్వ రంగసంస్ధల్లో నిక్షిప్తం చేసేందుకు వీలుగా మార్పులు చేసుకోవాలి.
ఎలక్ట్రానిక్ కామర్స్(ఆన్లయిన్ లావాదేవీలు) నిర్వహించే సంస్ధలు వాణిజ్య నైతిక నియమావళిని, న్యాయబద్దంగా వుండే సూత్రాలను పాటించాలి. వినియోగదారులతో అధిక మొత్తాలను ఖర్చు చేయించే విధంగా వివాదాస్పదంగా మారి సమస్యలు తలెత్తకుండా చూడాలి.( ఒక వ్యాపారి తన వస్తువులను ఒక వేదిక నుంచి అమ్ముకోవాలని ఒప్పందం చేసుకున్న తరువాత మరొక వేదిక నుంచి అమ్మటానికి వీల్లేదని ఆంక్షలు విధించిన అలీబాబా కంపెనీకి 275 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు.) ఆహార సరఫరా కంపెనీలు కార్మికులకు మెరుగైన రక్షణ కల్పించాలి.
లాభాల కోసం పని చేస్తూ విదేశాల్లో పెట్టుబడులు సేకరించే ప్రయివేటు ట్యూషన్ కంపెనీలపై నిషేధం.లాభాపేక్ష లేని సంస్ధలు ట్యూషన్లు చెప్పవచ్చు.స్కూళ్లలో చెప్పిన వాటిని బోధించరాదు, వారాంతాలు, సెలవు రోజుల్లో ట్యూషన్లు చెప్పకూడదు. తలిదండ్రులకు భారం లేకుండా టూషన్లు ఉండాలి.ఆన్లయిన్ రుణాలపై పరిమితులు విధించారు.ఒక రాష్ట్రంలో నమోదైన కంపెనీలు వేరే రాష్ట్రాల్లో రుణాలు ఇవ్వకూడదు. వ్యక్తులకు ఇచ్చే రుణాలపై పరిమితులు పెట్టారు. ఆన్లయిన్ చెల్లింపు సంస్ధలు క్రిప్టో కరెన్సీ(బిట్‌కాయిన్) చెల్లింపులు, పరిష్కారాలు చేయకూడదు. బిట్ కాయిన్ – ప్రభుత్వ కరెన్సీ మార్పిడి సేవలు నిర్వహించకూడదు.ఫండ్ల నిర్వహణ సంస్థలు ఆస్తులుగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెట్టకూడదు. రియలెస్టేట్ బుడగలు ఏర్పడి అవి పేలిపోయి నష్టం జరగకుండా ఉండేందుకు అవి తీసుకొనే రుణాలపై నియంత్రణలు విధించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని అంశాల మీద విధించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకొనే చర్యలు అక్కడి శ్రమ జీవుల జీవితాల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయా లేక ఇప్పటి వరకు అనుమతించిన ప్రయివేటు కంపెనీల లాభాపేక్ష, అవినీతి,అక్రమాల మీదనా అన్నదే గీటురాయిగా చూడాలి.
టెక్నాలజీ, విద్య, ఇతర ప్రయివేటు సంస్ధలపై గత కొద్ది వారాలుగా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకుంటున్న కారణంగా వివిధ కంపెనీల మార్కెట్ విలువ స్టాక్‌మార్కెట్‌లో ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల డాలర్ల మేరకు తగ్గిపోయిందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెరగవచ్చు. మావో హయాంలో సాంస్కృతిక విప్లవం పేరుతో తీసుకున్న కొన్ని దుందుడుకు చర్యలతో కొందరు వీటిని పోలుస్తున్నారు. నియంతృత్వ చర్యలు అంటున్నారు. అలాంటిదేమీ లేదని కొందరు చెబుతున్నారు. ఇప్పటికీ దీర్ఘకాల పెట్టుబడులకు చైనాలో పరిస్ధితులు సజావుగానే ఉన్నాయి.ఇటీవల తీసుకున్న నియంత్రణ చర్యలు ఎప్పుడో తీసుకోవాల్సింది, అక్కడి వృద్ధి రేటు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంది అంటున్నారు. స్విస్ ప్రయివేటు బ్యాంకు పిక్‌టెట్ గ్రూపుకు చెందిన అసెట్ మేనేజిమెంటు ప్రధాన వ్యూహకర్త లూకా పొవోలినీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఢోకాలేదన్నారు. దీని ఆధ్వర్యంలో 746 బిలియన్ డాలర్ల ఆస్తుల పర్యవేక్షణ జరుగుతోంది.ప్రపంచంలో అతి పెద్ద ఆస్తుల నిర్వహణ సంస్ధ బ్లాక్‌రాక్, ఫిడెలిటీ, గోల్డ్‌మాన్ శాచ్స్ వంటివి కూడా చైనాలో పెట్టుబడులు, కొనుగోళ్ల సమయంలో ఆచితూచి లావాదేవీలు జరపవచ్చనే చెబుతున్నాయి.ఆర్ధిక స్ధిరత్వం కోసం చైనా నియంత్రణ చర్యలను సమతూకంగా ఉండేట్లు చూస్తారని, అభివృద్ధి మందగించినపుడు, మార్కెట్లో అస్థిర పరిస్థితి ఏర్పడితే నియంత్రణలను సడలించవచ్చని చెబుతున్నాయి. అయితే ఈ చర్యలను సమీపకాలంలో ఎత్తివేయవచ్చు అని భావించలేమని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొన్నది.
బడా సంస్ధలపై నియంత్రణ ఆకస్మికంగా సంభవించిన పరిణామం కాదు. జాక్ మా సంస్ధలపై గత ఏడాది నవంబరులో తీసుకున్న చర్యలే అందుకు నిదర్శనం.ఉమ్మడి సౌభాగ్యం అన్న లక్ష్యాన్ని సాధించేందుకు అధ్యక్షుడు గ్జీ జింపింగ్ వెల్లడించిన విధాన నిర్ణయంతో పాటు సమాజంలోని సోషలిస్టేతర లక్షణాల పెరుగుదలను అదుపు చేసేందుకు వివిధ చర్యలను ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చైనా మార్కెట్ పెట్టుబడిదారుల స్వర్గం అన్న భావనకు స్వస్ది పలికేందుకు విప్లవాత్మక చర్యలను చేపట్టినట్లు సిఎన్‌ఎన్ పేర్కొన్నది. అంతర్జాతీయ పెట్టుబడిదారు జార్జి సోరస్ ఫైనాన్సియల్ టైమ్స్‌లో ఒక విశ్లేషణ రాస్తూ చైనాలో పెట్టుబడులు పెట్టాలనుకొనే విదేశీ మదుపుదార్లు అక్కడి ముప్పును గుర్తించటం కష్టం అన్నారు. మదుపుదార్లకు తెలిసిన చైనా వేరు గ్జీ చైనా వేరు అన్నాడు. మీడియా, వినియోగదారుల సేవలు, విద్య, చిల్లర వ్యాపారం, రవాణా, బయోటెక్ రంగాలు సృష్టించి సామాజిక లేదా సాంస్కృతిక సమస్యను పరిష్కరించేందుకు చైనా కేంద్రీకరించిందని, రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా నియంత్రించవచ్చని, ఈ రంగాల కంపెనీల వాటాలు కొనవద్దని కొందరు సలహాయిస్తున్నారు.
ఆన్‌లైన్ విద్య, పాఠశాల అనంతర ట్యూషన్లు చెప్పటం చైనాలో కంపెనీలకు పెద్ద ఆదాయవనరుగా ఉంది. ఇప్పుడు వాటిని నిషేధించారు. ఇవి సమాజంలో ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండి అసమానతలకు దోహదం చేస్తున్నాయని కమ్యూనిస్టు పార్టీ భావించిన ఫలితమే ఈ చర్య. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన అవకాశాలను కలిగించినట్లయింది. పిల్లలు సెల్‌ఫోన్లకు, పెద్దవాళ్లు లాప్‌టాప్‌లకు అతుక్కుపోతున్నారనే ఆవేదన అన్ని చోట్లా ఎప్పుడో ప్రారంభమైంది.కరోనా కారణంగా పాఠశాలల మూత సమయంలో అదింకా పెరిగి ఒక విధంగా ఒక వ్యవసనంగా తయారైంది. చైనాలో వీడియోగేమ్స్ ఆడే సమయాన్ని గణనీయంగా తగ్గించి పిల్లలు, యువతను వేరే అంశాలవైపు మళ్లించేందుకు కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. కొంత మంది దీనిని స్వేచ్చను హరించటంగా చిత్రిస్తుండగా, బాధ్యతాయుతమైన యువతను తయారు చేయటంగా ఎక్కువ మంది భావిస్తున్నారు.ఈ చర్య కారణంగా టెక్నాలజీ కంపెనీల ఆదాయం పెద్ద ఎత్తున పడిపోనుంది. వీటిని నిర్వహించే టెక్ కంపెనీల మీద గత పదిహేను సంవత్సరాలుగా నియంత్రణ లేదు. పిల్లలు, యువతలో వేలం వెర్రిగా మారటంతో ఇప్పుడు ఆపని చేస్తున్నారు. సమాజాన్ని సరిదిద్దే ఈ చర్యను నియంతృత్వంగా కొందరు చిత్రిస్తున్నారు.అవాంఛనీయమైన తప్పుడు ప్రచారానికి, విచ్చలవిడితనాన్ని, నేరాలను ప్రోత్సహించే సాధనాలుగా మారిన వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్ మాధ్యమాలపై ఇప్పటికే చైనాలో ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో రోజుకు గంటన్నర పాటు, సెలవు రోజుల్లో మూడు గంటల పాటు వీడియో గేమ్స్ ఆడేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు పేర్కొన్న మూడు గంటలు శుక్రవారం, వారాంతంలో మాత్రమే అనుమతిస్తారు.ప్రభుత్వ సెలవు దినాల్లో ఒక గంట అదనంగా అనుమతిస్తారు.
పాఠశాలల్లో సిలబస్ భారాన్ని తగ్గించటంతో పాటు వీడియో గేమ్స్‌కు అతుక్కుపోతున్న పిల్లల్లో హ్రస్వదృష్టి సమస్యల నివారణ, ఇంటి వెలుపల కార్యకలాపాలను ఎక్కువగా ప్రోత్సహించటం, క్రీడల పట్ల ఆసక్తి పెంచటం వంటి అనేక అంశాలు ఉన్నాయి. ఆరు సంవత్సరాల లోపు వారిలో దృష్టి సమస్యలను గుర్తించేందుకుగాను 90శాతానికి పైగా పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. రోజుకు రెండు గంటల పాటు భౌతిక కార్యకలాపాల్లో ఉండే విధంగా పిల్లలను ప్రోత్సహించాలి. ఆరు-పన్నెండు సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న పిల్లలతో ప్రతిసారి 20-30 నిమిషాలకు మించి చదివించటం లేదా రాయించకూడదు. వారు కనీసం పది గంటల పాటు నిద్రపోయేట్లు చూడాలి. హౌం వర్క్‌ను పరిమితం చేయాలి. అది నాణ్యమైనదిగా ఉండాలి. హాస్టల్ వసతి ఉన్న పాఠశాలల్లో సాయంత్రాలు చదివించే వ్యవధిని తగ్గించాలి.ఆన్లయిన్ గేమ్స్‌లో ఎక్కువ సేపు గడపటం వలన తరుణ వయస్సు వారి భౌతిక, మానసిక స్ధితి , చదువు సంధ్యలు,వ్యక్తిత్వ వికాసం మీద కూడా ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయి. వీడియో గేమ్స్ మీద ఏటా 20.71శాతం ఆదాయం పెరుగుతోంది. కంపెనీల వార్షిక మార్కెట్ విలువ 2020లో 278.7 బిలియన్ యువాన్లు కాగా దానిలో సగం వాటా టెన్‌సెంట్ కంపెనీదే ఉంది. సిచువాన్ రాష్ట్రంలో జరిపిన ఒక సర్వే ప్రకారం వీడియోగేమ్‌లకు బానిసలైన విద్యార్దులు 26.23శాతం ఉన్నారు. వారిలో రెండు మూడు రోజులకు ఆడేవారు కొందరైతే 11.66శాతం మంది దాదాపు రోజూ ఆడుతున్నారు. ఆన్లయిన్ గేమ్స్‌ను పరిమితం చేసేందుకు ఐదు వేల సంస్ధలకు చెందిన పదివేల గేమ్స్‌తో ఒక వ్యవస్ధను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ చర్యలు స్వేచ్చను హరించేవా, పిల్లలను సరైనదారిలో పెట్టేవా ?
మన దేశంలో, ప్రపంచంలో చైనా గురించి ఒక విచిత్ర మానసిక స్ధితి రోజు రోజుకూ పెరిగిపోతోంది.చైనా సాధించిన విజయాల గురించి చెబితే అవన్నీ తప్పుడు లెక్కలు లేదా నియంతృత్వం కారణమని చెప్పేవారున్నారు. కరోనాను చైనా సృష్టించలేదు, దాని వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టింది, రికార్డు స్ధాయిలో వాక్సిన్లు వేస్తోంది అని ఎవరైనా చెబితే అది దేశద్రోహుల ప్రచారం అంటున్నారు. మరోవైపు ఒకటో అరా కంపెనీ చైనా నుంచి బయటకు వచ్చినా, రావాలని ప్రకటించినా ఇంకేముంది చైనా కుప్పకూలిపోనుంది, కంపెనీలన్నీ మన దేశానికి వస్తున్నాయనే విపరీత భ్రమలకు లోను కావటం మరోవైపు చూస్తున్నాము. ఇప్పుడు వివిధ అంశాల మీద నియంత్రణ చర్యలు తీసుకుంటే వాటి మీద ప్రపంచమంతటా గుండెలు బాదుకోవటం ప్రారంభమైంది.
అవే నియంత్రణలు భారత్ లో ప్రభుత్వం చేస్తే ఒప్పుకుంటావా.. గుండెలు బాదుకుని గగ్గోలు పెడతారు.
నీలాంటోళ్ళకి అది –
చైనా లో చేస్తే నియంత్రణ
భారత్ లో చేస్తే నియంతృత్వం .
LikeLike
LikeLike
అవే నియంత్రణలు భారత్ లో ప్రభుత్వం చేస్తే ఒప్పుకుంటావా.. గుండెలు బాదుకుని గగ్గోలు పెడతారు.
నీలాంటోళ్ళకి అది –
చైనా లో చేస్తే నియంత్రణ
భారత్ లో చేస్తే నియంతృత్వం .
నీ పాత ఆర్టికల్స్ తిరగేసి చూసుకో.
LikeLike
మీరు నా ఆర్టికల్ మీద స్పందించినందుకు కృతజ్ఞతలు. నా ఆర్టికల్స్‌ను మీరు చదివి ఉంటే ఇలాంటి వ్యాఖ్య చేసి ఉండేవారు కాదు.సరిగ్గా, సరిగ్గా ఏడాది క్రితం సెప్టెంబరు నాలుగునే పబ్జిపై దాడిలో మోడీజి నిజాయితీ ఎంత అనే శీర్షికతో ఒక ఆర్టికల్ రాశాను. నా గురించి ముందుగా ఏర్పరుచుకున్న ఒక దురభిప్రాయంతో విమర్శ చేశారు గానీ, చైనా మాదిరి మన దేశంలో చర్యలు తీసుకుంటే తప్పకుండా స్వాగతిస్తాను. ఇంతకు మించి మిమ్మల్ని నమ్మించలేను. నా పాత ఆర్టికల్ చదివి దాని మీద కూడా ఒక అభిప్రాయం చెప్పగలరు.
LikeLike
LikeLike