ఎం కోటేశ్వరరావు
ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి నరేంద్రమోడీ పుట్టిన రోజును సేవా దినంగా పాటించిన బిజెపి 71వ జన్మదినాన్ని ఇరవై రోజుల భజన దినోత్సవంగా పాటించేందుకు పిలుపునిచ్చింది.ఈ నెల 17 నుంచి ఇరవై రోజుల పాటు అక్టోబరు ఏడవ తేదీవరకు ప్రధాని నరేంద్రమోడీ రెండు దశాబ్దాల రాజకీయ సేవ మరియు అంకిత బాట గురించి స్తోత్ర పారాయణం చేయాలని బిజెపి పిలుపు ఇచ్చింది. ఆ సందర్భంగా మోడీకి కృతజ్ఞతలను తెలుపుతూ దేశ వ్యాపితంగా పెద్ద ప్రకటనల ఫలకాలు(హౌర్డింగ్‌లు) ఏర్పాటు చేస్తారు. వాటి మీద ఉచితంగా వాక్సిన్, ఆహార ధాన్యాలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ బొమ్మవేసి రాస్తారు. మోడీ జీవిత చిత్రమాలికలతో ప్రదర్శనలు,రక్తదానాలు, పారిశుధ్యకార్యక్రమాల వంటి వాటిని చేపడతారు. పార్టీ ప్రజాప్రతినిధులందరూ రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఉచితంగా బియ్యం, గోధుమలను ఇచ్చింది ఇదిగో మా మోడీగారే అంటూ వీడియోలను చూపుతూ కృతజ్ఞతలు చెబుతారు. ఇంకా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశమంతటి నుంచీ ఐదు కోట్ల పోస్టు కార్డులతో ప్రతి ఎన్నికల బూత్ ప్రాంతం నుంచి కృతజ్ఞతలు చెబుతూ పోస్టు చేస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో అయితే కార్యకర్తలు ప్రత్యేకంగా71 చోట్ల గంగా నదిని శుద్ధి, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికీ మేథావులు, ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తారు. మీడియాలో వ్యాసాలు, విశ్లేషణలు రాయిస్తారు.ప్రధానికి వచ్చిన బహుమతులన్నింటినీ వెబ్‌సైట్ ద్వారా వేలం వేస్తారు. పార్టీ కిసాన్ మోర్చా కార్యకర్తలు ఈ సందర్భంగా రైతులు-జవాన్లను సన్మానిస్తారు. రాజు తలచుకొంటే దేనికైనా కొదవేముంది ! ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు బిజెపి జాతీయ నేతలలో దగ్గుబాటి పురందరేశ్వరి ఉన్నారు.
నరేంద్రమోడీ ప్రభుత్వ పరంగా, రాజకీయంగా ఈ ఏడాది ఇప్పటి వరకు తిన్నన్ని ఎదురు దెబ్బలు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ రుచిచూసి ఉండరు. అయినా అవేమీ తెలియనట్లు, దేశమంతా వెలిగిపోతున్నట్లు పొగడ్తలకు పూనుకున్నారంటే జనానికి జ్ఞాపకశక్తి తక్కువనే చిన్న చూపు తప్ప మరొకటేమైనా ఉందా ? మచ్చుకు కొన్నింటిని చూద్దాం. వర్తమాన అర్ధిక సంవత్సరం 2021-22 తొలి మూడు మాసాల్లో జిడిపి వృద్ధి 20.1శాతంతో రికార్డు సృష్టించిందని, దీనికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నట్లుగా ప్రచారం సాగింది. దీన్ని ఘనవిజయం చెప్పుకుంటే ఇబ్బందుల్లో పడేది నరేంద్రమోడీ, పాలక బిజెపి ఎన్‌డిఏ కూటమే అని అభిమానులు గుర్తించాలి. కొంత మంది రిజర్వు బ్యాంకు తీసుకున్న చర్యల వలన ఇది సాధ్యమైందని అన్నారు. 2019-20 సంవత్సరం తొలి మూడు మాసాల్లో జిడిపి విలువ రు.35.96లక్షల కోట్లు. ఈ మొత్తం మీద 24.4శాతం దిగజారి మరుసటి ఏడాది 2020-21లో విలువ రు.26.95 లక్షల కోట్లకు తగ్గింది. ఈ మొత్తం మీద వర్తమాన సంవత్సరంలో అది 20.1శాతం పెరిగి రు.32.38లక్షల కోట్లకు చేరింది. దీన్నే ఘనతగా చిత్రిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి దేశవ్యాపితమైన లాక్‌డౌన్ లేదు, కార్మికుల వలసలూ అంతగా లేవు. అఫ్‌కోర్సు ఉపాధి కూడా లేదనుకోండి. అయినా ఇలా ఉందంటే పరిస్ధితి ఆందోళనకరమే అన్నది స్పష్టం.
పెట్రోలు, డీజిలు ధరలు, వాటి పెరుగుదలకు మూలమైన పన్నుల గురించి జనానికి పట్టకపోయినా ప్రభుత్వానికి పెద్ద ఆదాయవనరుగా మారింది. వినియోగం ఎంత పెరిగితే కేంద్రానికి, ధరలు ఎంత పెరిగితే రాష్ట్రాలకు అంతగా ఆదాయం పెరుగుతున్నది. వెనెజులా మాదిరి దాదాపు ఉచితంగా జనానికి అందించకపోయినా స్ధానికంగా ఉత్పత్తి పెరిగితే వినియోగదారుల మీద భారం, అన్నింటికీ మించి విలువైన విదేశీమారక ద్రవ్యం ఎంతో ఆదాఅవుతుంది. తమ ప్రభుత్వ సామర్ద్యం గురించి బిజెపి చెప్పుకోని రోజు లేదు. 2013-14లో 37.8 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తిచేస్తే అది 2020-21 నాటికి 30.5 మి.టన్నులకు దిగజారింది. ఈ ఏడాది ప్రతినెలా తగ్గుదలే తప్ప ఉత్పత్తి పెరుగుదల లేదు. ఎందుకు ఈ వైఫల్యమో ఇంతవరకు చెప్పిన కేంద్ర పాలకులు లేరు. మరోవైపు దిగుమతులపై ఆధారం 2012లో 81శాతం ఉండగా 2020 నాటికి 87.6 శాతానికి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం కొన్ని కంపెనీలతో తలెత్తిన వివాదాల కారణంగా వెనుకటి తేదీల నుంచి వసూలు చేయాల్సిన పన్నులను రద్దు చేయాలని నిర్ణయించి వేళ్ల మీద లెక్కించదగిన కార్పొరేట్ కంపెనీలకు లబ్దిని, సంతోషాన్ని కలిగించింది. కానీ కోట్లాది మంది చమురు వినియోగదారులకు గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మొత్తాలకు కొన్ని రెట్లు అదనంగా ఇప్పుడు వినియోగదారుల నుంచి మోడీ సర్కార్ వసూలు చేస్తోంది. అడిగేవారు లేకపోవటం అంటే ఇదే. కాంగ్రెస్ హయాంలో జారీ చేసిన చమురు బాండ్ల భారం తమ మీద పడిందని, వాటిని తాము తీర్చాల్సి వస్తోందని గత ఏడు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆమొత్తం ఎంత ? లక్షా 34వేల కోట్లు. ఈ మొత్తం కూడా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా వినియోగదారులకు ఇచ్చిన రాయితీలకు గాను చమురు సంస్ధలకు ప్రభుత్వం చెల్లించాల్సిస సబ్సిడీ మొత్తం ఇది. ఆ మేరకు చమురు సంస్ధలకు బాండ్ల రూపంలో ఇచ్చారు. అంటే వడ్డీ మరియు అసలు చెల్లించే ప్రామిసరీ నోట్ల వంటివి ఇవి. మన్మోహన్ సింగ్ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే క్రమంగా పెంచి రూ.32.98, 31.83 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కారణంగా ఏడాదికి 2020-21లో కేంద్రానికి 3.35లక్షల కోట్లు సమకూరింది. వినియోగం పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుంది.
ఆత్మనిర్భర కార్యక్రమం పేరుతో 26లక్షల కోట్ల రూపాయల సాయాన్ని చేస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేశారు.అసలా కార్యక్రమం ఏమిటో, సామాన్యులకు ఎలా ఉపయోగపడుతుందో అసలు ప్రయోజనమో కాదో కూడా ఇప్పటికీ, ఎప్పటికీ తెలియని వారెందరో. చట్ట సభల్లో అధికార పార్టీ సభ్యులు సాధారణంగా తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టని, గొప్పలు చెప్పుకొనేందుకు వీలయ్యే ప్రశ్నలే అడుగుతారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ సామాజిక సహాయపధకం(ఎన్‌ఎస్‌ఎపి-వృద్ధాప్య, ఇతర పెన్షన్ పధకాలు) కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని బిజెపి సభ్యుడు వసంత కుమార్ పాండా లోక్‌సభలో అడిగారు. దానికి జాతీయ గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అలాంటి ప్రదిపాదన తమ వద్ద లేదు సార్ అంటూ ఆగస్టు మూడవ తేదీన రాతపూర్వక సమాధానంలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 41కింద సామాజిక సహాయ పధకాన్ని అమలు జరపాలని ఉంది. ఆ మేరకు 1995లో దీన్ని ప్రారంభించి రు.75గా నిర్ణయించారు. తరువాత 2006లో రు.200కు పెంచారు. 2013లో జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ మొత్తాన్ని రు.300కు పెంచాలని సిఫార్సు చేసింది. ఎనిమిది సంవత్సరాల తరువాత తమ వద్ద అలాంటి ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజాలు పలుకుతున్నారా, అబద్దాలు చెబుతున్నారా ?
అసలు ఒక వృద్దుడు లేదా వృద్దురాలు రెండువందల రూపాయలతో నెల రోజులు ఏ విధంగా గడపగలుగుతారో ఎవరైనా చెప్పగలరా ? మంత్రి సమాధానాన్ని బట్టి అపర మానవతా మూర్తులైన పాలకులకు అలాంటి ఆలోచన కూడా లేదన్నది స్పష్టం. మన దేశం జిడిపిలో సామాజిక భద్రతా పెన్షన్ పధకాలకు ఖర్చు చేస్తున్న మొత్తం 0.04శాతం కాగా, ఆఫ్రికాలోని బోట్సవానాలో 0.3, పొరుగునే ఉన్న నేపాల్లో 0.7, లాటిన్ అమెరికా ఖండదేశమైన బొలీవియాలో 1.3 శాతాల చొప్పున ఖర్చు చేస్తున్నారు. వృద్దులకు రు.200, ఎనభైశాతంపైగా వికలాంగులైన వారికి, నలభై దాటిన వితంతువులకు 300, ఎనభై దాటిన వృద్దులకు 500 రూపాయల చొప్పున ఇప్పుడు కేంద్రం చెల్లిస్తున్నది. ఈ మొత్తాలకు అదనంగా జతచేసి తెలంగాణాలో వృద్ధాప్య పెన్షన్ రు.2000, ఆంధ్రప్రదేశ్‌లో రు.2250 చెల్లిస్తున్నారు. హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఇస్తున్నారు. దేశంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులలో పదికోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం నెలకు మూడువేల రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తే ఏడాదికి రు.3.6లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది జిడిపిలో 1.8శాతం. అనేక దేశాలలో మాదిరి సంపదపన్ను, లేదా కార్పొరేట్ పన్ను ద్వారా ఈ మొత్తాన్ని సేకరించవచ్చు. లేదూ ప్రభుత్వమే ఖర్చు చేసినా నష్టం ఉండదు. పెన్షనర్లు ఆ మొత్తాన్ని తమ రోజు వారీ అవసరాలకే వినియోగిస్తారు తప్ప బ్యాంకుల్లో డిపాజిట్లు చేయరు లేదా నల్లధనంగా మార్చి విదేశీ బ్యాంకులో పెట్టరు. ఆ మొత్తం ఖర్చు చేస్తే జిడిపి రెట్టింపు 3.8శాతం అవుతుంది. దానిలో సగటున పదిహేనుశాతం పన్నుగా తిరిగి కేంద్రం, రాష్ట్రాలకు చేరుతుంది. ఆ మొత్తం జిడిపిలో 0.54శాతం అవుతుంది. అంటే కేంద్రం నిఖరంగా ఖర్చు చేసే మొత్తం 1.26శాతమే అవుతుంది. మరి కేంద్రానికి ఎందుకు చేతులు రావటం లేదు ?
వృద్దులు, అనాధల పరిస్ధితి ఇలా ఉంటే వారిని ఆదుకోవాల్సిన యువత పరిస్ధితి ఏమిటి ? జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో పదిహేను లక్షల ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయని సిఎంఐయి తెలిపింది. నిరుద్యోగశాతం 6.96 నుంచి 8.32కు చేరింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం ఉద్యోగ అవకాశాలు తగ్గటానికి కారణమని సదరు సంస్ధ అధిపతి మహేష్ వ్యాస్ చెప్పారు. ముందే చెప్పుకున్నట్లు ఆర్ధిక కార్యకలాపాలు పెరిగి తొలి మూడు మాసాల్లో జిడిపి 20.1శాతం వృద్ది చెందింది అని సంబరాలు చేసుకుంటున్న తరుణంలోని పరిస్ధితి ఇది. ఎనిమిది రాష్ట్రాల్లో హర్యానాలో 35.7, రాజస్తాన్‌లో 26.7, ఝార్ఖండ్ 16, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీరులో 13.6, ఢిల్లీలో 11.6శాతాల చొప్పున నిరుద్యోగులను కలిగి ఉన్నాయి. తగినంత ఉపాధి లేని కారణంగా కరోనా కాస్త తగ్గుముఖం పట్టగానే కడుపు చేత పట్టుకొని వలస కార్మికులు తిరిగి పట్టణాలకు చేరుకుంటున్నారు.2021 జూలై నెలతో పోలిస్తే ఆగస్టు నెలలో ఉపాధి పధకం కింద పని చేసిన వారు 58శాతం తగ్గారు. దీనికి వ్యవసాయ పనులు కూడా ఒక కారణంగావచ్చుగానీ పట్టణాలకు వలసలే ప్రధానం అన్నది స్పష్టం. ఉపాధిని కల్పించే పర్యాటక, ఆతిధ్య రంగాలలో వృద్ధి లోటులోనే ఉంది. మన ఎగుమతులు పెరిగాయని సంతోషించవచ్చుగానీ, ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ప్రయివేటు వినిమయం అంతకు ముందు మూడు మాసాలతో పోల్చితే 8.9శాతం తగ్గిపోయింది. ఉపాధిలేకపోవటం, అవసరమైన వాటినే జనం కొనుగోలు చేస్తున్నట్లు ఇది సూచిస్తోంది. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ధన ఆర్జన పధకం కింద ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు వారికి కట్టబెడితే పర్మనెంటు ఉద్యోగాలకు కోత పడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తక్కువ వేతనాలు, తక్కువ సిబ్బందితో ప్రయివేటు సంస్ధలు లాభాలు పిండుకొనేందుకు చూస్తాయన్నది తెలిసిందే.
ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం లేదన్నది స్పష్టం. అంకెల గారడీతో ఎంతగా దాచిపెట్టాలని చూసినా కుదరదు.ద్రవ్యోల్బణం పెరగటం అంటే ధరలు పెరగటం. ఉదాహరణకు జవహర్‌లాల్ నెహ్రూ ఏలుబడిలో 1961లో వంద రూపాయల వస్తువులు కొన్నాం. ఆ ఏడాది ద్రవ్యోల్బణం రేటు 1.7శాతం. మరుసటి ఏడాది ద్రవ్యోల్బణం 3.63శాతం పెరిగింది. ఆ కారణంగా అదే వస్తువులకు మనం 103.63 చెల్లించాం. అంటే మన రూపాయి విలువ తగ్గినట్లా పెరిగినట్లా ? మనం ఒక్కసారిగా బిజెపి వాజ్‌పాయి గారి పాలనకు వద్దాం. 1999లో ఆ వంద రూపాయల వస్తువుల విలువ రు.2,032.56 అయింది. వారి పాలనలో దేశం వెలిగిపోయింది అని చెప్పారు కదా ! 2004లో అది రు.2,464.60కు చేరింది. మన్మోహన్ సింగ్ గారు దిగిపోయిన 2014 నాటికి రు.5,483.69కి పెరిగింది. ఇక మంచి రోజులు తెస్తానని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ గారి ఏలుబడిలో 2021నాటికి ఆ మొత్తం రు.7,646.39కి చేరింది.( 2021లో జూలైలో అంతకు ముందు పన్నెండు నెలల సగటు మేరకు వేసిన లెక్క. ఏడాది పూర్తయిన తరువాత ఇంకా మొత్తం పెరుగుతుందే తప్ప తగ్గదు). ఈ అంకెలకు ప్రపంచబ్యాంకు సమాచారం ఆధారం.ఆరు దశాబ్దాల సగటు ద్రవ్యోల్బణం రేటు 7.64శాతం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే నెహ్రూ కాలంలో ఒక రూపాయి ఇప్పుడు మోడీగారి హయాంలో 76.46కు సమానం. ఈ మేరకు కార్మికుల వేతనాలు, జన ఆదాయాలు పెరిగాయా ?
మనం తగినంత చమురును ఉత్పత్తి చేయని కారణంగా లేదా బంగారం వంటి నిరుత్పాదక వస్తువులను దిగుమతి చేసుకోవటం ద్వారా వాటితో పాటు ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేస్తున్నాం. ఎలా అంటే, నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలో రూపాయి విలువ ఒక డాలరుకు 58 ఉంది. ఇప్పుడు 73-74 మధ్య కదలాడుతోంది. అంటే ఒక లీటరు పెట్రోలు దిగుమతి చేసుకుంటే ఏడు సంవత్సరాల్లో దాని ధర అంతర్జాతీయ మార్కెట్లో స్ధిరంగా ఉందని అనుకుంటే మన వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం 58 నుంచి 73-74 పెరుగుతుంది. అదే చమురు ధర పెరిగిందనుకోండి ఆ మేరకు అదనంగా పెరుగుతుంది. అదే మన రూపాయి విలువ దిగజారకుండా డాలరుతో స్ధిరంగా ఉంటే 58 మాత్రమే చెల్లించాలి.అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత అదనం అవుతుంది. నరేంద్రమోడీ, బిజెపి నేతల మాటల ప్రకారం రూపాయి విలువ 58 నుంచి 40కి తగ్గిందనుకోండి మనం చెల్లించే మొత్తం తగ్గి ఉండేది. మనం ఏడు సంవత్సరాల్లో రెండింటికీ చెడ్డాం. కరెన్సీ విలువ తగ్గితే ఎగుమతులు పెరగాలి. 2014లో జిడిపిలో ఎగుమతుల విలువ 25.43శాతం, డాలర్లలో 472.18 బిలియన్లు కాగా 2020 నాటికి అవి 18.08 శాతం, 474.15బిలియన్లుగా ఉన్నాయి. ఎగుమతులు పెరగకపోగా తగ్గాయి. మరోవైపు దిగుమతులు పెరిగాయి.
ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నందుకు, కరోనా వాక్సిన్ ఉచితంగా వేస్తున్నందుకు నరేంద్రమోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలట. మోడీగారు తాను చిన్న తనంలో అమ్మినట్లు చెబుతున్న టీ సంపాదన డబ్బు నుంచి తీసి జనానికి అందిస్తే నిజంగానే కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిదేమీ కాదే, జనం చెల్లించిన పన్నులు, కార్పొరేట్ టాక్సులు, జాతి మొత్తానికి చెందిన ప్రకృతి వనరుల నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఏ మూలకూ చాలని ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇచ్చినందుకు మోడీగారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ బిజెపి ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా అన్న భక్తరామదాసు గుర్తుకు రావటం లేదూ ! కరోనా వాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతగా జనం నోళ్లలో నానిందో, గబ్బుపట్టిందో తెలిసిందే. విధిలేని స్ధితిలో ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు జరుపుతున్నారు. దీనికీ జనం సొమ్మేగా ఖర్చు చేస్తోంది. ఆపద కాలంలో ఉన్న వారిని ఆదుకోవటం, మహమ్మారుల నుంచి జనాలను రక్షించటం పాలకుల బాధ్యత. దానికి కృతజ్ఞతలను ఆశించటం ఏమిటి ? ఏదో ఒక సందర్భాన్ని ఉపయోగించుకొని మోడీ స్తోత్రపారాయణం చేయటం ద్వారా పడిన మచ్చలను కనిపించకుండా చేయాలనే కార్యక్రమం తప్ప ఏం సాధించారని ఇరవై రోజుల పాటు మోడీ గారిని పొగడాలి ?