Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు

రోజూ ఆవు మూత్రం తాగితే కరోనాను దూరంగా ఉంచవచ్చని,తాను అలా తాగి కరోనా బారి నుంచి తప్పించుకున్నానని భోపాల్‌ బిజెపి ఎంపీ, మాలెగావ్‌ పేలుళ్ల ఉగ్రవాద కేసు నిందితురాలు ప్రజ్ఞాసింగ్‌ చెప్పిన విషయం తెలిసిందే, అమె అంతకు ముందు కాన్సర్‌ నిరోధం గురించి కూడా సెలవిచ్చారు. నాలుగేండ్ల క్రితమే పతంజలి వ్యాపారి రామదేవ్‌ బాబా కంపెనీ సిఇఓ బాలకృష్ణ ఒక ప్రకటన చేస్తూ తాము రోజుకు ఐదువేల లీటర్ల గోమూత్రం తయారు చేస్తున్నామని, అది కాన్సర్‌, లివర్‌, కిడ్నీ తదితర సర్వరోగ నివారిణిగా పని చేస్తుందని చెప్పారు. ఇప్పుడు గోమూత్ర పానం చేసే వారు, వాటితో వ్యాపారం చేసే వారికి మరొక శుభవార్త.


ఆవు విసర్జనాలైన మూత్రం, పేడ పర్యావరణానికి కలిగిస్తున్న హాని నివారణకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. జర్మన్‌ ఫెడరల్‌ రిసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఎనిమల్‌ హెల్త్‌ మరియు రిసర్చి ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ ఫామ్‌ ఏనిమల్‌ బయాలజీ(ఎఫ్‌బిఎన్‌), న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ విశ్వవిద్యాలయం వారు జర్మనీలో సంయుక్తంగా చేసిన పరిశోధనల ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఆవులు మరుగుదొడ్లను వినియోగించే విధంగా శిక్షణ ఇచ్చి జయప్రదమయ్యారు.విదేశాల్లో రోజుకు ఒక్కో ఆవు 30 నుంచి 40కిలోల పేడ వేస్తుందని, 30 లీటర్ల మూత్ర విసర్జన చేస్తుందని అంచనా.(మన దేశ ఆవుల సామర్ధ్యం ఎంతో తెలియదు) మన దేశంలో మాదిరే అన్ని చోట్లా బయట తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ, గోశాలల్లో అవి తమ పని కానిస్తాయి.ప్రపంచ వ్యాపితంగా ఆవులను పెంచుతారు, పాలు పిండుకుంటారు, బీఫ్‌కు వినియోగిస్తారు. బహుశా మన దేశంలో తప్ప ఎక్కడా ఆవు మూత్రం తాగరు, తాగమని ప్రోత్సహించేవారు కూడా లేరు.


ఆవు మూత్రం, పేడతో విషపదార్ధాలు తయారవుతాయి.( గోమాతను ఇలా అంటారా అని ఎవరైనా మనోభావాలను గాయపరచుకుంటే చేయగలిగిందేమీ లేదు. శాస్త్రం అలా చెబుతోంది మరి ) గోమూత్రం నుంచి నైట్రేట్‌ మరియు నైట్రస్‌ ఆక్సైడ్‌ ఉద్భవిస్తాయి. వాటితో జలాశయాలు, నదులు, చెరువులు, కుంటలు కూడా కలుషితం అవుతాయి. అవి ఎంత ప్రమాదకరం అంటే కార్బన్‌ డయాక్సైడ్‌ కంటే 300 రెట్లు ఎక్కువ శక్తి కలిగినవి. నైట్రేట్‌ కలిసిన నీరు గడ్డి మొక్కలతో పాటు నీటిలో విషపూరితమైన పాచి పెరిగేందుకు దోహదం చేస్తుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌ ఎలా ఉంటుందంటే న్యూజిలాండ్‌లో పర్యావరణంలోకి విడుదలయ్యే రేడియో ధార్మిక పరిగ్రహణాన్ని హరించే గ్రీన్‌హౌస్‌ వాయువు వంద అనుకుంటే గోమాతలు 12శాతం వాటాను విడుదల చేస్తున్నాయట. బయట తిరిగే వాటి కంటే గోశాలల్లో ఉండే గోమాతలు మరొక ప్రమాదాన్ని కూడా తెస్తున్నాయని ఐరోపా, అమెరికాల్లో వెల్లడైంది. అదేమంటే వాటిని ఒక చోట కట్టివేసినపుడు విసర్జించే పేడ, మూత్రం రెండూ కలిస్తే అమ్మోనియా వాయువు పుడుతుంది.అది గోమాతల ఆరోగ్యానికేగాక, మానవాళికి కూడా ప్రమాదకారకమే.


ఈ ముప్పులను తప్పించేందుకు మార్గం ఏమిటి అనే ఆలోచనతో శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. అదేమంటే చిన్న పిల్లలకు ఎలా అయితే మరుగుదొడ్డిని అలవాటు చేస్తామో గోమాతల మీద కూడా అదే ప్రయోగం చేసి సఫలీకృతం అయ్యారు. జర్మనీలోని ఓక్స్‌వాగన్‌ ఫౌండేషన్‌ వారి సాయంతో ముందే చెప్పుకున్న ఎఫ్‌బిఎన్‌ సంస్ధలో ఒక నిర్ణీత ప్రదేశంలో మూత్రవిసర్జన చేసే విధంగా ఆవుదూడలకు శిక్షణ ఇచ్చారు. ఒక గదిని ఏర్పాటు చేసి ఒక వైపు దాణాగా బార్లీని ఒక గిన్నెలో పోసి ఆవులను వాటిలోకి వదిలారు. అవి దాణా తింటూ అక్కడే మూత్రం పోయటాన్ని అలవాటు చేసుకున్నాయి. తొలుత ఆవులను ఒక ఇరుకు సందులోకి తోలారట. అవి అక్కడ మూత్ర విసర్జనకు ఉపక్రమించగానే భయంకరమైన శబ్దాలను చేసి మరుగుదొడ్లోకి వెళ్లేట్లు ప్రయత్నించినా ఫలితం కనపడకపోవటంతో చివరికి వాటి మీద నీళ్లు చల్లి వెళ్లేట్లు చేశారు. పక్షం రోజుల పాటు ఇలా రోజుకు 45 నిమిషాల పాటు శిక్షణ ఇచ్చిన తరువాత 16ఆవుల్లో 11 మరుగుదొడ్లోకి వెళ్లటం అలవాటు చేసుకున్నాయట. పిల్లల్ని అలవాటు చేయటానికి పట్టే వ్యవధి కంటే ఆవులు తక్కువ సమయంలోనే ఆ పనిచేశాయట. ఈ ప్రయోగంతో అన్ని అవులు కొద్ది సంవత్సరాల్లో మరుగుదొడ్లకు వెళతాయని ఆవుల మానసిక నిపుణుడు డాక్టర్‌ లాంగ్‌ బెయిన్‌ అంటున్నారు.


అసలు సమస్య ఇక్కడే తలెత్తింది. మానవ ప్రయత్నం లేకుండా ఆవులకు మరుగుదొడ్డి అలవాటు చేయటం ఎలా, పెద్ద సంఖ్యలో బయట తిరిగే ఆవులతో పాటు గోశాల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేయటం ఎలా అన్న ఆలోచన మొదలైంది. ఇక్కడ మన దేశంలో ఆవు మూత్రం తాగే వారికి మరింత చౌకగా, విస్తృతంగా అందుబాటులోకి రావాలంటే పతంజలి వంటి ఆవు మూత్ర వ్యాపారులకు లభ్యత కూడా అవసరం. తక్కువ మొత్తమే అయినప్పటికీ మన దేశం అమెరికా, నెదర్లాండ్స్‌,జర్మనీ,ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, థాయలాండ్‌ పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. వాటికి లేని అభ్యంతరాలు మూత్రం దిగుమతి చేసుకొనేందుకు ఉండాల్సిన అవసరం లేదు. అందువలన విదేశాల్లో ఆవు మరుగుదొడ్ల సంస్ధలతో ఒప్పందాలు చేసుకొని దిగుమతి చేసుకుంటే చౌకగా లభ్యం అవుతాయి. లేదా మన దేశంలోనే ఏర్పాటు చేసినా ఖర్చులు కలసి వస్తాయి. అయితే మనుషులకే ఇంకా పూర్తిగా మరుగుదొడ్లు లేని స్ధితిలో ఆవులకు సాధ్యమా ? కేంద్ర ప్రభుత్వం, యోగి ఆదిత్యనాధ్‌ వంటి ఆవు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తలచుకుంటే అసాధ్యం కాదేమో !


గుజరాత్‌లోని జునాఘడ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవు మూత్రంలో బంగారాన్ని కనుగొన్నట్లు చెప్పారు. ఇతర ప్రభుత్వ సంస్ధలు ఆవు మూత్రంలో ఔషధ గుణాల గురించి పరిశోధనలు చేస్తున్నాయి. అందువలన విదేశాల్లో పనికి రాని ఆవు మూత్రాన్ని రవాణా, సేకరణ ఖర్చు చెల్లించి మనం ఉచితంగానే దిగుమతి చేసుకోవచ్చు. బంగారంగా మార్చుకోవచ్చు. అవి సర్వరోగ నివారిణి అని నమ్మేవారి కోసం వాటితో పనిచేసే ఆసుపత్రులను ఏర్పాటు చేసి చేరే వారికి చికిత్స చేయవచ్చు. ఈ ఆసుపత్రులకు నిపుణులైన వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలు కూడా అవసరం లేదు. వలంటీర్లతో నడుస్తాయి. ప్రస్తుతం మన దేశంలో ఆవు పాల కంటే మూత్రం రేటే ఎక్కువగా ఉంది. అమెజాన్‌ ద్వారా తెప్పించుకుంటే లీటరు రు.260కి బదులు 198కే దొరుకుతుందనే ప్రకటనలను ఎవరైనా చూడవచ్చు. అందువలన దిగుమతి చేసుకుంటే ఇంకా తక్కువకే జనాలకు అందచేయవచ్చు. అనేక విదేశీ వస్తువులను తెప్పించుకుంటున్నమనం ఆవు మూత్రానికి అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు.


విదేశీయులు పర్యావరణం అంటూ గొడవ చేస్తున్నారు గనుక వారెలాగూ ఆవు మూత్రాన్ని వదిలించుకోవాలని చూస్తారు. దాన్ని మనం తెచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందేమో ! పూజకు పనికి వస్తుందని భావిస్తున్న ఆవు పేడను మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాము.ఈ ఏడాది మేనెలలో మన దేశం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో అమెరికా వెళ్లిన ఒక ప్రయాణీకుడి సూట్‌ కేసులో ఆవు పేడ పిడకలను అక్కడి భద్రతా సిబ్బంది కనుగొన్నారు. మన వారు పవిత్రంగా భావించే ఆవు పేడను అధికారికంగా అవసరమైతే పెద్ద మొత్తంలో పన్నులు విధించి అయినా దిగుమతికి అనుమతించాలని నరేంద్రమోడీ తన పలుకుబడిని వినియోగించి అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని అక్కడి భారతీయులు కూడా కోరవచ్చు. అమెరికాకు మన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు గనుక బైడెన్‌ సర్కార్‌ అనుమతించవచ్చు కూడా. ఆవులకు మన దేశంలోనే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే వాటికి శిక్షణ ఇచ్చేందుకు జనం కావాలి కనుక కొంత నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. పకోడీ బండి వేయటం కూడా ఉపాధి కల్పనకిందికే వస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీయే చెప్పారు కనుక వీటి గురించి కూడా తీవ్రంగా ఆలోచించాలి. కావాలంటే ఆవు మూత్రం అపవిత్రం కాకూడదు అనుకుంటే గోవు పవిత్రతను కాపాడుతున్న వారికే వాటి నిర్వహణ కూడా పూర్తిగా అప్పగించవచ్చు. గో రక్షకుల నుంచి తలెత్తుతున్న శాంతి భద్రతల సమస్య కూడా పరిష్కారం అవుతుంది.


ఇక ఆవు రాజకీయాలకు వస్తే మన దేశంలోనే కాదు నైజీరియాలో కూడా నడుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌, హర్యానాల్లోతప్ప ఇంతవరకు బిజెపి పాలనలోని గోవా, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడా బీఫ్‌ తినేవారి మీద గోరక్షకులు దాడులు చేసినట్లు వార్తలు లేవు. నైజీరియాలో గోపాలకులు ఎకె-47 తుపాకులు పట్టుకొని మరీ ఆవులను మేపుతున్నారనే వార్తలు, దృశ్యాలు ఎవరైనా చూడవచ్చు. దేశ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక సామాజిక తరగతికి చెందిన వారే ఎక్కువగా ఆవులను పెంచుతారు. వ్యాపారులు ఆవులను ఇచ్చి మేపేట్లు ఒప్పందాలు చేసుకుంటారు. బహిరంగంగా ఆవులు, ఇతర పశువులు గడ్డి మేయటాన్ని నిషేధించటం సైతాను చట్టం అని మియెట్టీ అల్లా కౌతల్‌ హౌర్‌ జాతీయ కార్యదర్శి సాలే అల్‌హసన్‌ ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అది ముస్లిం దేశమని తెలిసిందే.2023లో అక్కడ జరిగే ఎన్నికల కారణంగా ఆవు రాజకీయాలు రంగంలోకి వచ్చాయి.ఈ చట్టం అనేక మంది జీవనోపాధికి, ప్రాధమిక హక్కులకు, వ్యాపారాలకు నష్టం కలిగిస్తున్నదని పేర్కొన్నాడు. నైజీరియా దక్షిణాది రాష్ట్రాలలో గోవుల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతుంది. తుపాకులు పట్టుకొని ఆవులను మేపుతున్న వారిని బందిపోట్లని ప్రభుత్వం చిత్రిస్తున్నదని సాలే హసన్‌ విమర్శించాడు.


మనకు సహజమిత్రమని వాజ్‌పాయి నుంచి నరేంద్రమోడీ వరకు చెబుతున్న అమెరికాలో జరుగుతున్నదేమిటి ? ఆవుమాంసం తినటాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రచారం, ఇతర అవసరాల కోసం ప్రతి ఆవుకు పెంపకందార్లు ఒక డాలరు చెల్లిస్తున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా ఉన్న ఈ పధకాన్ని నిలిపివేయాలా లేదా అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ప్రతి ఆవుకు చెల్లిస్తున్న ఒక డాలరుతో స్ధానిక బీఫ్‌ను ప్రత్యేకంగా ప్రోత్సహించటం లేదు కనుక నిలిపివేయాలన్నది ఒక వాదన.ప్రస్తుతం దిగుమతులు పెద్ద ఎత్తున వచ్చిపడుతున్నాయి, నకిలీ మాంస ఉత్పత్తిదారులు లబ్దిపొందుతున్నారన్నది ఆరోపణ. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలనేందుకు ఓటింగ్‌ జరపాలని కొంత మంది సంతకాల సేకరణ ప్రారంభించారు. అందుకు అవసరమైన సంఖ్యలో సంతకాల సేకరణకు అక్టోబరు మూడవ తేదీ వరకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమం కింద చెల్లింపులు చేయాలని ప్రభుత్వమే ఆదేశించింది. అయితే ఈ నిధులతో పంది, కోడి మాంసం వంటి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదు, బీఫ్‌ కోసం ప్రచారం తప్ప లాబీయింగ్‌ కూడా చేయకూడదు.కానీ లాబీయింగ్‌కు ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు చౌకగా లభించే దేశాల నుంచి దిగుమతులు చేసుకొని తమ ముద్రవేసుకొని వినియోగదారులను మోసం చేసే ప్రచారానికి దేశీయ పెంపకందార్లు చెల్లిస్తున్న ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నారన్నది విమర్శ.


తగిన ప్రచారం లేనట్లయితే దేశీయ బీఫ్‌ డిమాండ్‌ తగ్గిపోయి ఉండేదని, ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇండ్లకు వచ్చే వారు దుకాణంలో కొన్న బీఫ్‌ను ఇలా స్టౌ మీద పెట్టి అలా తినేందుకు వీలుగా తయారు చేసిన వాటి కొనుగోలుకే మొగ్గుచూపుతున్నారు. కేవలం నాలుగు పాకింగ్‌ సంస్ధలు 80శాతం వాటాతో అమెరికా బీఫ్‌ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వాటి గుత్తాధిపత్యాన్ని నిరోధించేందుకు బైడెన్‌ సర్కార్‌ చర్య తీసుకుంది. పోటీలేని కారణంగా బీఫ్‌ అమ్మకాల్లో రైతులకు వచ్చే వాటా గత ఐదు సంవత్సరాల్లో 51.5 నుంచి 37.3శాతానికి పడిపోయింది. మరోవైపు ధరలు పెరిగాయి. టైసన్‌, జెబిఎస్‌ యుఎస్‌ఏ, కార్గిల్‌, నేషనల్‌ బీఫ్‌ అనే సంస్ధలు కరోనా సమయంలో ఎగుమతులు జరపటంతో కొరత ఏర్పడి అమెరికా వినియోగదారులు ఇబ్బంది పడ్డారు.అమెరికాలో సరకులను విక్రయించే దుకాణాలు కూడా నాలుగు బడా కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. వాల్‌మార్ట్‌, టార్గెట్‌, ఆల్బర్ట్‌సన్స్‌, క్రోగర్‌ చేతిలో మొత్తంగా 40శాతం, పట్టణాల్లో 70శాతం దుకాణాలు ఉన్నాయి. నాలుగు మాంసకంపెనీలు సులభంగా మార్కెటింగ్‌ ఒప్పందం చేసుకోవటానికి ఈ పరిస్ధితి కూడా తోడ్పడింది.గత ఏడాది వాల్‌మార్ట్‌ కంపెనీ కూడా మాంస పాకింగ్‌ వ్యాపారంలో ప్రవేశించింది. మాంసపాకింగ్‌ కంపెనీల్లో ఒకటైన జెబిఎస్‌పై ఇటీవల సైబర్‌ దాడి జరగటంతో అమెరికాలో ఐదోవంతు మాంస పాకింగ్‌ కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. దీంతో సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. గుత్తాధిపత్యాన్ని తగ్గించాలని ఈ ఉదంతం బైడెన్ను పురికొల్పి ఉంటుంది. అమెరికా మాంస యుద్దం ఎలా ముగుస్తుందో తెలియదు !