Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు


తెలంగాణాలో రాజకీయాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి.ఈ నెల 27న భారత బంద్‌ను జయప్రదం చేసేందుకు, బిజెపి,టిఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కాంగ్రెస్‌, వామపక్షాలు, టిజెఎస్‌ నేత కోదండరామ్‌, ఇంటి పార్టీ నేతలు ఒక్కటిగా కదలాలని నిర్ణయించటం సరికొత్త పరిణామం. ఇది కేవలం రెండు పాలక పార్టీల విధానాల మీద ఉద్యమించటం వరకే పరిమితం అవుతుందా ? రాబోయే ఎన్నికల సర్దుబాట్లకు దారి తీస్తుందా అన్నది ఇప్పుడే చెప్పలేము. అధికార టిఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు, తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు రంగంలోకి దిగిన కొత్త పార్టీ వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ పార్టీ, మాజీ ఐపిఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజకీయ తీర్ధం పుచ్చుకున్న బిఎస్‌పి, మజ్లిస్‌, వామపక్షాలైన సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలు, శక్తులు తమ తమ అజెండాలతో ముందుకు పోతున్నాయి. అన్ని పార్టీలు ఒకే పద్దతిలో, ఒకే స్ధాయిలో లేవు. కాంగ్రెస్‌ తన శంఖారావాన్ని పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నియోజకవర్గమైన గజ్వేల్‌ను ఎంచుకోవటం అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించటం గమనార్హం. మరోవైపున కాంగ్రెస్‌ నుంచి ఎదురవుతున్న సవాలను ఎదుర్కొనేందుకు బిజెపి కూడా నడుం కట్టింది. అమిత్‌షాను రప్పించి సెప్టెంబరు 17 తెలంగాణా విమోచన పేరుతో తన మత అజెండాను నిర్మల్‌లో ప్రారంభించింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ హస్తినలో తిష్టవేసి జరిపిన మంత్రాంగం గురించి ఎవరికి తోచిన ఊహాగానాలతో వారు ఉన్నారు. వాటిని పూర్తిగా కొట్టిపారవేయనవసరం లేదు అలాగని యథాతధంగా తీసుకోవాల్సిన అగత్యమూ లేదు. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.


గత అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, లేదా స్ధానిక సంస్థలకు వచ్చిన సాధారణ ఎన్నికల సమయంలో కొట్టవచ్చినట్లు కనిపించిన ఒక అంశం ఏమంటే వాగ్దానాల వరద. అది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఎన్నికైన ప్రతినిధులు రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలు జరిపించాలనే డిమాండ్లు తలెత్తేందుకు దోహదం చేశాయి. చేసిన వాగ్దానాలు, చెప్పిన ఊసులు అమల్లోకి వస్తాయా లేదా అని ఎవరూ చూడటం లేదు. అన్నీ జరగవనీ తెలిసి కూడా ఎందుకు కోరుకుంటున్నారు అంటే అసల్లేనిదాని కంటే ఎంతో కొంత జరుగుతుంది కదా అన్నది అంతర్గత తర్కం.

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందు జరిగిందేమిటి ? వరదల్లో మునిగిపోయిన వారికి, మునిగిపోయినట్లు నమోదైన వారికీ పదివేల రూపాయల చొప్పున చాలా మందికి ఇచ్చారు. ఎన్నికల నిబంధనల ఆటంకం కారణంగా మిగిలిన వారికి తరువాత ఇస్తామని వాగ్దానం చేశారు. ఏం జరిగింది, అధికారపక్షానికి అనుకున్న స్ధాయిలో స్ధానాలు రాలేదు. ఎన్నికలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి గనుక అప్పుడు చూసుకుందాం లెమ్మని నిజమైన బాధితులకు సైతం ఎగనామం పెట్టారు. హుజూర్‌ నగర్‌, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల సమయంలో, తరువాత జరిగింది కూడా దీనికి భిన్నమేమీ కాదు.


ఇప్పుడు హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. మిగతా రాష్ట్రాలతో పాటు దీనికి ప్రకటించలేదు. దానికి ఎవరి కారణాలను వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారే వాయిదా వేయించారన్నది ఒక కథనం. కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్నికల కమిషన్‌ దగ్గర బిజెపి కంటే కెసిఆర్‌ పలుకుబడి ఎక్కువ కాదు, ఎలాగూ గెలిచేది తామే కనుక ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు బిజెపి వారే వాయిదా వేయించారన్నది మరొక కథ. ఇక్కడ ఏ కధ వాస్తవం అయినా రాజ్యాంగ వ్యవస్దల విశ్వసనీయత ప్రశ్నార్దకం అవుతోంది. ఎన్నికను వాయిదా వేయాల్సినంతగా కరోనా తీవ్రత లేదన్నది నిజం.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఎట్టి పరిస్ధితిలో అయినా ఓడించాలన్నది అధికారపక్ష పట్టుదల, ఎలాగైనా గెలిచి తమదే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ఓటర్ల ముందుకు వెళ్లాలన్నది బిజెపి తాపత్రయం. ఈ నేపధ్యంలో వచ్చిందే దళిత బంధు. ఈ పధకాన్ని ఏ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం ఉండదు. బండి గుర్రానికి కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లుగా దీన్ని ఆశచూపితే దళితులందరూ తమకే ఓట్లు వేస్తారని, ఓటు బ్యాంకుగా మారతారన్నది అధికారపక్ష ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీ దళిత బంధుతో పాటు గిరిజన బంధు ఎందుకు అమలు జరపరంటూ ముందుకు వచ్చింది. మిగిలిన సామాజిక తరగతుల్లో కూడా నిజమే కదా మాకూ బంధు ఎందుకు అమలు జరపరు అనే ఆలోచన ప్రారంభమైంది.తమ పధకంతో ప్రతిపక్షాలను దెబ్బకొట్టటంతో పాటు దళితులను బుట్టలో వేసుకుంటామన్నంత వరకే అధికారపార్టీ ఆలోచించింది తప్ప అది అంతటితో ఆగదు అన్నది ఊహించి ఉండరు. ఎవరికైనా తట్టినా ముఖ్యమంత్రికి చెప్పే సాహసం చేసి ఉండరు. అలాంటి వాతావరణం లేదు కదా !


మొత్తం మీద ఇతర కులాల్లో కూడా దళితబంధు ప్రచారం కావటంతో అధికారపక్షానికి సెగతగిలింది. అర్హులైన దళిత కుటుంబాలు ఎన్ని ? పన్నెండు లక్షలా, పదిహేను లక్షలా ? ఆ కుటుంబాల సంఖ్య పెరగదు, స్ధిరంగా ఉంటుంది అనుకుంటే పన్నెండు అయితే లక్షా ఇరవై, పదిహేను అయితే లక్షా యాభై వేల కోట్లు కావాలి.ఒకటో తారీఖున ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలే ఇవ్వని స్ధితిలో ఉన్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది అన్నది ఒక ప్రశ్న. షెడ్యూలు కులాలు, గిరిజనులకు ఉప ప్రణాళికల నిధులు, వారికి అమలు జరుగుతున్న కొన్ని పధకాల నుంచి దళితుల వాటాను ఈ కొత్త పధకానికి మళ్లించే అవకాశం ఉంది. ఈ పధకంతో దళిత కుటుంబాలను ఉద్దరించినట్లే అని రికార్డుల్లో రాసి అమల్లో ఉన్న కొన్ని పధకాలకు మంగళం పాడినా, నామమాత్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుందన్నది అప్పుడే చెప్పలేము. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ముగిసే వరకు అది బ్రహ్మదార్ధమే. దళితులకు మూడెకరాల భూమి కొందామని చూస్తున్నా భూమి, దానికి అవసరమైన నిధులు లేవని చేతులెత్తేసిన పెద్దలు ఆ ఎన్నిక తరువాత దళిత బంధుకూ అదే గతి పట్టించినా ఆశ్చర్యం లేదు.


దళిత బంధును ఇప్పుడు హుజూరాబాద్‌కే అమలు జరిపి వచ్చే బడ్జెట్‌లో ఇరవైవేల కోట్ల నిధులు కేటాయిస్తాం అని కెసిఆర్‌ చెప్పారు. అది నెరవేరినా పన్నెండు లక్షల కుటుంబాలైతే ఆరు సంవత్సరాలు, పదిహేను అయితే ఎనిమిదేండ్లు పడుతుంది. ఇతర కులాల్లో అసంతృప్తి లేదా ఆశ ప్రారంభం కావటంతో వీలైతే వారికి కూడా అమలు చేస్తాం అని బండి గుర్రపు గడ్డి కట్టలను సిఎం ప్రదర్శించారు. పులిని ఎక్కిన వారు దాన్ని అదుపు చేయాలి లేకపోతే అది ఎక్కిన వారిని మింగివేస్తుంది. సంక్షేమ, ప్రజాకర్షక పధకాలు కూడా అంతే. పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు సంస్ధలను ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీ ఇస్తున్నారు. వస్తువులను ఎగుమతులు చేసినందుకూ ప్రోత్సహకాల పేరుతో కట్టబెడుతున్నారు. అందువలన మన సమాజంలో రక్షణ లేని, అల్పాదాయ వర్గాలకు సంక్షేమ పధకాలను అమలు జరపాలనటంలో మరొక మాట ఉండనవసరం లేదు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా ఒక పరిమితి దాటితే వాటిని అమలు జరపటం ఎలా అన్నదే సమస్య. రాష్ట్ర వ్యాపితంగా పేదలు, మధ్యతరగతి వారు ఉపయోగించే ఆర్‌టిసికి వస్తున్న నష్టాలను భర్తీ చేసేందుకు ముందుకు రాకుండా దాన్ని మూసివేసేందుకు పావులు కదుపుతున్న సర్కార్‌ మరోవైపు హైదరాబాద్‌ మెట్రోకు వస్తున్న నష్టాలను భరించేందుకు ఆలోచిస్తామని సిఎం చెప్పారు.


రకరకాల సాకులు చూపి ఉద్యోగులకు పిఆర్‌ఎసి అమలు విషయంలో ఎంతదగా చేశారో చూశాము. ఒక ఏడాది మినహా మిగిలిన కాలానికి బకాయిలు ఇచ్చేది లేదన్నారు. ఆ ఏడాది మొత్తాలను కూడా పెన్షనర్లకు 36వాయిదాల్లో ఇస్తామన్నారు. సర్వీసులో ఉన్న వారికి వాటిని పిఎఫ్‌ ఖాతాల్లో జమచేసినా వాటి మీద నామమాత్ర వడ్డీ అయినా వచ్చేది. అలాగాక వారు ఉద్యోగవిరమణ సమయంలో ఆ మొత్తాలను ఇస్తారట.ప్రకటించిన నెలలో నూతన వేతనాలను అమలు చేయలేదు. ఆ కాలానికి నగదు వేతనాలు, పెన్షన్లతో పాటు ఇస్తామని చెప్పారు. వాటిని కూడా ఇంతవరకు చెల్లించలేదు. మూడు వాయిదాల డిఏ బకాయిలు ఉన్నాయి. జనవరి నాటికి మరోవాయిదా సిద్దం అవుతున్నది. ఇలా చేయించుకున్న పనికే చెల్లించటానికి ఎగనామం పెట్టి, ఇబ్బందులు పెడుతున్నవారు అవసరం తీరిన తరువాత సంక్షేమ పధకాలకు మంగళం పాడితే…!

ఎరువుల సబ్సిడీకి పరిమితి విధించిన కేంద్ర ప్రభుత్వం రైతాంగంలో తలెత్తిన ఆందోళనను తగ్గించేందుకు కిసాన్‌ యోజన పేరుతో ఆరువేల రూపాయలను మూడు విడతలుగా ఇచ్చే పధకాన్ని అమలు జరుపుతోంది. పెరిగిన ఎరువుల ధరల భారంతో పోల్చితే అది నామమాత్రం. ఇప్పుడు విద్యుత్‌ రాయితీలకు మంగళం పాడేందుకు కేంద్రం పూనుకుంది. దాంతో జరిగేదేమిటి ? ఒక యూనిట్‌ విద్యుత్‌ను వినియోగదారుడికి చేర్చేందుకు అయ్యే మొత్తం ఖర్చులో ఇరవై శాతానికి మించి రాయితీలు ఉండకూడదు. ఒక యూనిట్‌ ధర ఏడు రూపాయలైతే సబ్సిడీ 140 పైసలు మాత్రమే ఇవ్వాలి.ఇప్పటి వరకు రాష్ట్రాలు వివిధ వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించి రైతులకు ఉచితంగా ఇస్తున్నాయి. నూతన విద్యుత్‌ బిల్లు చట్టమైతే కొందరి వద్ద అదనంగా వసూలు చేసేందుకు, దాన్ని ఇతరులకు సబ్సిడీగా ఇచ్చేందుకు వీలు ఉండదు. అందువలన అనివార్యంగా రాష్ట్రాలు తమ బడ్జెట్ల నుంచి కేటాయింపులు జరపాలి. గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఎరువులకు నిర్ణీత మొత్తాలను కేటాయించి సరిపెట్టుకోమని చెప్పేస్తున్నాయి. విద్యుత్‌కూ అదే రాబోతున్నదని చెప్పవచ్చు. ఎరువుల ధరలు మార్కెట్లో ఎంత ధర ఉంటే అంత మొత్తం చెల్లించి రైతులు కొనుగోలు చేయాలి.ధరతో నిమిత్తం లేకుండా నిర్ణీత సబ్సిడీ మొత్తాన్ని దాన్నుంచి తగ్గిస్తారు. పెరిగితే ఆ భారాన్ని రైతులే పెట్టుకోవాలి.ఇప్పుడు వంట గ్యాస్‌కు దాన్ని వర్తింప చేశారు. టిఆర్‌ఎస్‌ విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రధాన పంటగా మారిన వరి ఆ పార్టీకి ఉరిగా మారుతుందా అన్నట్లుగా పరిస్ధితి ఉంది. రైతులకు ఉన్నంతలో మెరుగైన ఫలితాలనిచ్చే ముతక బియ్యం(ఉప్పుడు బియ్యానికి పనికి వచ్చే రకాలు) రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారవచ్చు. దాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకొనే అవకాశమూ లేకపోలేదు. గతంలో అంగీకరించిన మేరకు తప్ప అదనంగా తమకు అవసరం లేదని ఎఫ్‌సిఐ ఇప్పటికే చెప్పేసింది. ఏం జరుగుతుందో తెలియదు. రైతులకు ఎంత ఆర్ధిక నష్టం జరిగితే టిఆర్‌ఎస్‌కు అంతమేరకు రాజకీయ ప్రతికూలత పెరుగుతుంది.

రాష్ట్రంలో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల తీరు తెన్నులు చూస్తుంటే ఈ సారి కూడా అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయా అన్న అనుమానాలు కొందరిలో ఉన్నాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నికవరకే అయితే ఇంత హడావుడి ఉంటుందా అన్నదే సందేహం. ఆ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం అవుతుంది.కేంద్రం విద్యుత్‌ సంస్కరణల బిల్లును ఆమోదించి చట్టంగా మారితే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిలే విద్యుత్‌ షాక్‌ దేనికి దారి తీస్తుందో తెలియదు. విద్యుత్‌, వరి, దళితబంధు వంటి పధకాలు-పర్యవసానాలు జనానికి తెలిసే ముందే ఏదో ఒకసాకుతో ఆకస్మికంగా ఎన్నికలకు పోయినా ఆశ్చర్యం లేదు. పోయిన సారి కాంగ్రెస్‌, బిజెపి బలహీనంగా ఉన్నపుడే తమకు లాభమని కెసిఆర్‌ భావిస్తే ఇప్పుడు తన వైఫల్యాలు మరింతగా జనం నోళ్లలో నానక ముందు, ఆ రెండు పార్టీలు పుంజుకోక ముందే అసెంబ్లీ ఎన్నికలు జరపటం మంచిదనే అంశం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. దాని గురించి మరోసారి చెప్పుకుందాం. ఇప్పుడున్న పరిస్ధితి ఏమిటి ? కేంద్రంలోని బిజెపితో అధికార పార్టీ టిఆర్‌ఎస్‌ దోబూచులాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యవసానాలేమిటి ?


దేశంలోని వివిధ రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీల తీరుతెన్నులను చూసినపుడు మొత్తంగా ఒక స్ధిరమైన వైఖరితో ఉండటం లేదు.రాష్ట్రాల హక్కుల పరిరక్షణ నేపధ్యంలో పుట్టిన పార్టీలన్నీ ఆ లక్ష్యాన్ని వదలివేశాయి. తెలంగాణా రాష్ట్ర సమితి కూడా అదే బాటలో నడుస్తున్నది. ఎప్పుడు ఏ అవకాశవాద వైఖరి తీసుకుంటుందో చెప్పలేము.ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు జరపటం లేదని అమావాస్యకు పౌర్ణానికి విమర్శించటం తప్ప నిర్దిష్ట కార్యాచరణ లేదు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జనాల మనోభావాలను ఉన్నత స్ధాయికి తీసుకుపోయారు. ఏడు సంవత్సరాలుగా నియామకాల ప్రహసనం ఎలా సాగుతోందో చూస్తున్నాం. నిధుల సమస్య ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే పరిష్కారమైంది. ఉమ్మడి ఆస్తుల పంపకం మాత్రమే మిగిలి ఉంది. ఇక నీళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వివాదంతో మనోభావాలతో ఆడుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అమల్లో ఉన్న నీటి న్యాయానికి భిన్నమైన డిమాండ్లను ముందుకు తెచ్చారు.

తమిళనాడులో గతంలో మాదిరి లోక్‌సభ సీట్లను గణనీయంగా జాతీయ పార్టీకి అప్పగించి రాష్ట్ర అధికారం నిలుపుకొనేందుకు ప్రయత్నించిన డిఎంకె, అన్నాడిఎంకె మాదిరి మీకది మాకిది అన్నట్లు బిజెపితో ఒప్పందానికి రావటానికి కేసిఆర్‌కు ఇబ్బంది లేదు. అయితే వరుసగా అన్ని రాష్ట్రాలను కబళించేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి అందుకు అంగీకరించటం లేదు. ఈ రాష్ట్రంలోని నేతలు ప్రతిఘటిస్తున్నారు. ఆ పంచాయతీ తెగేట్లు లేదు. పశ్చిమబెంగాల్‌ పరిణామాలను చూసిన తరువాత అనివార్యం అయితే టిఆర్‌ఎస్‌ బిజెపితో అమీతుమీ తేల్చుకుంటుంది. దానికి సిద్దపడగానే కేంద్రం ఇడి, సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్దలను రంగంలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లతో ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బల నేపధ్యంలో బిజెపి ఇప్పటికిప్పుడు టిఆర్‌ఎస్‌తో తెగేదాకా లాగకపోవచ్చు. కొన్ని తురుపు ముక్కలను అట్టి పెట్టుకుంటుంది. అదే ఎత్తుగడను టిఆర్‌ఎస్‌కూడా అనుసరిస్తుంది. ఈ లోగా బండి సంజయ-దానికి పోటీగా అధికారపార్టీ నేతల నోటిదూలతో జనానికి కిక్కు ఎక్కిస్తారు.


ఇప్పటికిప్పుడు చూస్తే టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా మొదటి స్ధానంలో ఉంది. దాని ధనశక్తి, మీడియా మద్దతును తక్కువ అంచనా వేయలేము. జనంలో వాగ్దానాలను విస్మరించిందన్న అసంతృప్తి ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌,బిజెపి పట్ల ప్రత్యేకమైన అభిమానం లేదు. ఏమైనా సరే టిఆర్‌ఎస్‌ను ఓడించాలనే వాతావరణం ప్రస్తుతం ఉన్నట్లు చెప్పలేము. అయితే అది శాశ్వతం కాదని టిఆర్‌ఎస్‌ నేతలకు అర్దం అయింది. కొండమీది రాయి కిందికి జారనంత వరకు స్దిరంగా ఉన్నట్లే కనిపిస్తుంది. కదలటం ప్రారంభమైన తరువాత వేగం అందుకుంటుంది. జనంలో వ్యతిరేకత కూడా అంతే. అందుకే కొత్త కొత్త ప్రజాకర్షక నినాదాలతో, వివాదాలతో ముందుకు వస్తుంది. జనంలో అసంతృప్తి పెరిగితే వాటి కారణంగానే పతనం కూడా అవుతుంది.


దుబ్బాక ఉప ఎన్నిక, తరువాత హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వచ్చిన ఊపుతో బిజెపి తమదే రెండో స్ధానం అని చెప్పుకుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్‌తో సహా ఇతర పార్టీల నేతలు బిజెపి వైపు చూశారు, లోపాయకారీ సంబంధాలను కూడా పెట్టుకొన్నారు. ఇప్పటికీ టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు బిజెపి పావులు కదుపుతోంది. అయితే అధికారమే పరమావధిగా ఉన్న నేతలు ఎంత వీలైతే అంత అధికార పక్షంలో ఉండి పిండుకొని ఎన్నికల ముందు వేరే పార్టీలోకి ఫిరాయించటం ఇటీవలి కాలంలో సాధారణమైంది. తెలంగాణా దానికి మినహాయింపు కాజాలదు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో తగిలిన దెబ్బ, ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటమి బిజెపి ప్రచార గాలిని తీశాయి. దీనికి తోడు కాంగ్రెస్‌ సారధిగా నోటి దురుసులో ముఖ్యమంత్రి, బిజెపి నేతలకు పోటీగా ఉండే రేవంతరెడ్డి నియామకంతో కాంగ్రెస్‌ నుంచి వలసలకు బ్రేకు పడింది. బిజెపి కంటే మెరుగైన స్ధానానికి చేరుకుంది. అయితే అది నిలుస్తుందా లేదా అన్నది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అంతకు ముందు బీహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్ధితి పెద్దగా మెరుగుపడకపోయినా పెద్దగా దిగజారలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఫలితాలు కూడా ఆ పార్టీ మీద ప్రభావం చూపవచ్చు. బిజెపికి తగిలే దెబ్బలు, ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు లాభించే అవకాశం ఉంది.


తెలంగాణాలో వామపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే తమ ఉనికిని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను బలపరిచిన సిపిఐ బావుకున్నదేమీ లేదు. వ్యతిరేకించిన సిపిఎం సహజంగానే కొంత దెబ్బతిన్నది. అయితే ప్రజాసమస్యలపై ఆ పార్టీలు, అవి పనిచేస్తున్న ప్రజాసంఘాల కార్యకలాపాలు వాటి ఉనికిని కాపాడుతున్నాయి. అన్నింటికీ మించి నయా ఉదారవాద విధానాలు పాలకపార్టీల మీద జనంలో పెద్ద ఎత్తున భ్రమలు కొల్పాయి. ఈ నేపధ్యంలో వామపక్షాలు, వాటి నినాదాలు జనానికి అంత ఆకర్షణీయంగా కనిపించటం లేదు. అయితే ప్రపంచంలో ముఖ్యంగా అమెరికా, లాటిన్‌ అమెరికా దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు వామపక్షాల వైపు తిరిగి జనం చూడకతప్పదనే భావం కలుగుతోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా జనం పట్ల నిబద్దతే వాటిని కాపాడుతుంది.


ముస్లిం మైనారిటీలు గణనీయంగా ఉన్న తెలంగాణాలో మరింతగా మతతత్వాన్ని రెచ్చగొట్టి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తుంటే అదే అస్త్రంతో మజ్లిస్‌ కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. టిఆర్‌ఎస్‌-మజ్లిస్‌ బంధం గురించి బిజెపి ఎంత రెచ్చగొట్టినా దానికి ఆశించిన ఫలితాలు రావటం లేదు. వచ్చే అవకాశాలు కూడ కనిపించటం లేదు. రాబోయే రోజుల్లో టిఆర్‌ఎస్‌-బిజెపి అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకుంటే మైనారిటీలు సహజంగా బెంగాల్లో మాదిరి టిఆర్‌ఎస్‌వైపే మొగ్గుతారు, లేదా కాంగ్రెస్‌ బలపడితే, బిజెపిని ఓడించే పార్టీ అదే అని భావిస్తే ఆ పార్టీ వైపు మొగ్గినా ఆశ్చర్యం లేదు. రెండవ అంశం ప్రస్తుతానికి ఊహాజనితమే. వైఎస్‌ షర్మిల నాయకత్వంలోని పార్టీ ప్రస్తుతానికి ఎవరి అవకాశాలను దెబ్బతీసే లేదా ప్రయోజనం కలిగించే పరిస్దితిలో లేదు. ఒక అధికారిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తీసుకున్న చర్యలు దళితుల్లోని మధ్య తరగతిలో ఆయనపట్ల అభిమానాన్ని పెంచటం సహజం. అయితే అది ఎన్నికల్లో ఫలితాలను ఇస్తుందని చెప్పలేము. ఉత్తర ప్రదేశ్‌లో గతంలో బిఎస్‌పికి ఉన్న పట్టు ఇప్పుడు లేదు, రాబోయే ఎన్నికల్లో వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి పొందిక తెలంగాణాలో వచ్చే అవకాశం లేదు గనుక బిఎస్‌పి, దాని సారధ్యం పుచ్చుకున్న ప్రవీణ్‌ కుమార్‌ భవిత్యం ఏమిటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్దకమే. ఇక వ్యక్తులుగా ఉన్న వారు ఏ వైఖరి తీసుకున్నప్పటికీ వారు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరు.