Tags

, , ,

ఎం కోటేశ్వరరావు


ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అని ఆడిపోసుకున్నారు గానీ నిజానికి అమెరికా మాటలకే అర్ధాలు వేరు. ఆఫ్ఘనిస్తాన్నుంచి ఉపసంహరించుకున్న అమెరికా ఎక్కడ ఎలా కొత్త పధకంతో వస్తుందో అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో కలసి చేసుకున్న మిలిటరీ ఒప్పందం(అకుస్‌)తో సరికొత్త చిచ్చు రేపింది. ఆ మాటలు ఇంకా చెవుల్లో ఉండగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఐరాసలో చేసిన తొలి ప్రసంగంలోనే ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకున్నాడు. మరోసారి తాము ప్రచ్చన్న యుద్ధాన్ని కోరుకోవటం లేదని చెప్పాడు. మరి ఎవరు కోరుకుంటున్నారు ?

అసలు ప్రచ్చన్న యుద్దాన్ని ప్రారంభించింది ఎవరు ? ఇంకెవరు అమెరికన్లే. తొలిసారిగా అణుబాంబులను ప్రయోగించి ప్రపంచాన్ని భయపెట్టిన అమెరికా దుర్మార్గ నేపధ్యంలో బ్రిటీష్‌ రచయిత జార్జి ఆర్వెల్‌ తొలిసారిగా ప్రచ్చన్న యుద్ద పదాన్ని 1945 అక్టోబరు 19న ట్రిబ్యూన్‌ పత్రికలో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. మరుసటి ఏడాది మార్చి పదవ తేదీన అబ్జర్వర్‌ పత్రికలో బిటన్‌కు వ్యతిరేకంగా సోవియట్‌ యూనియన్‌ ప్రచ్చన్న యుద్దాన్ని ప్రారంభించిందని ఆరోపించాడు.1947 ఏప్రిల్‌ 16న అమెరికాను ఏలిన డెమోక్రటిక్‌ పార్టీల అధ్యక్షులకు సలహాదారుగా పనిచేసిన బెర్నార్డ్‌ బరూచ్‌ మాట్లాడుతూ మనల్ని మనం మోసం చేసుకోవద్దు, మనం ప్రచ్చన్న యుద్దం మధ్యలో ఉన్నామని ప్రకటించాడు.1991 డిసెంబరు 26న సోవియట్‌ యూనియన్‌ రద్దయినట్లు అధికారికంగా ప్రకటించారు. దాని మీద స్పందించిన అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్‌ ” మన జీవితాల్లో, నా జీవితకాలంలో ప్రపంచంలో జరిగిన అతి పెద్ద అంశం ఏమంటే దేవుడి దయ వలన ప్రచ్చన్న యుద్దంలో అమెరికా విజయం సాధించింది” అన్నాడు.

అలాంటి దుష్ట అమెరికా పాలకుడిగా జో బైడెన్‌ ఐరాసలో తొలిసారిగా నోరు విప్పి పచ్చి అబద్దం ఆడాడు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాటిని ఎన్నింటిని వినాల్సి వస్తుందో, ఎన్ని దుర్మార్గాలకు పాల్పడతారో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌లో పొందిన పరాభవం నుంచి అమెరికా పాలకవర్గం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదు. చైనా గతంలోని సోవియట్‌ యూనియన్‌ కాదు అని తెలిసినప్పటికీ అమీతుమీ తేల్చుకునేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది.

చైనాకు వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దం 2.0లో భాగంగానే ట్రంప్‌ ప్రారంభించిన దుర్మార్గాలన్నింటినీ బైడెన్‌ కొనసాగిస్తున్నాడు. దానిలో తాజా చర్య అకుస్‌ ప్రకటన. చైనాకు వ్యతిరేకంగా మూడు దేశాలూ కూటమి కడితే దానితో ఆర్ధికంగా ప్రభావితమైన ఫ్రాన్స్‌ మండిపడింది. దానికి బాసటగా ఐరోపా యూనియన్‌ నిలవటం తాజా పరిణామం. కొన్ని సంవత్సరాలుగా డీజిలుతో నడిచే సంప్రదాయ జలాంతర్గాముల గురించి ఆస్ట్రేలియా-ఫ్రాన్స్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు అవి కానసాగుతుండగానే ఫ్రాన్స్‌ను ఏమార్చి అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సరఫరా చేసే ఒప్పందాన్ని నాటకీయంగా ప్రకటించాయి. ” మేము ఆస్ట్రేలియాతో సంబంధాలను విశ్వసించాము, దాన్ని ఇప్పుడు వమ్ముచేశారు, ఇది వెన్ను పోటు ” అని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జీన్‌ వెస్‌ లీ డ్రెయిన్‌ వర్ణించాడు. అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి తన రాయబారులను ఫ్రాన్స్‌ వెనక్కు పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తిగా మారింది.అకుస్‌ ఒప్పందం పూర్తి బాధ్యతా రహితమైందని చైనా వర్ణించింది.చైనాను రెచ్చగొడుతున్నారని, ఎలాంటి దయా దాక్షిణ్యాల్లేకుండా ఆస్ట్రేలియాను శిక్షిస్తుందని గ్లోబల్‌టైమ్స్‌ పత్రిక సంపాదకీయం హెచ్చరించింది.


అకుస్‌ చర్యకు ప్రతిగా ఆస్ట్రేలియాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాన్ని పునరాలోచించాల్సిందిగా ఐరోపాయూనియన్ను ఫ్రాన్స్‌ కోరింది. ఇప్పటి వరకు పదకొండు దఫాల చర్చలు జరిగాయని, పన్నెండ విడత చర్చలు మామూలుగానే జరుగుతాయని, వచ్చే ఏడాది ముగింపుకు రావచ్చని ఆస్ట్రేలియా మంత్రి డాన్‌ టెహాన్‌ చెప్పాడు. ఇండో-పసిఫిక్‌ వ్యూహం గురించి చర్చించే ఐరోపా యూనియన్‌ సమావేశానికి కొద్ది గంటల ముందే గత బుధవారం నాడు అకుస్‌ ఒప్పందాన్ని బహిర్గతం చేశారు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకాలు చేసిన ఆస్ట్రేలియాకు అణు ఇంధనంతో నడిచే జలాంతర్గాముల తయారీ పరిజ్ఞానాన్ని అందచేయాలని నిర్ణయించటం అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన తప్ప మరొకటి కాదు. అణ్వాయుధాల తయారీకి దోహదం చేసే యురేనియం శుద్ధి రియాక్టర్లను జలాంతర్గాములలో అమరుస్తారు. ప్రస్తుతం ఒప్పందంలో వాటికి అణ్వాయుధాలను అమర్చే ప్రతిపాదన, లక్ష్యం లేనప్పటికీ వాటిని అమర్చేందుకు వీలుగా తయారీ జరుగుతుంది. కనుక సాంకేతికంగా ఆస్ట్రేలియా అణ్వాయుధాలను తయారు చేయకపోయినా ఏదో ఒకసాకుతో అమెరికా, బ్రిటన్‌ అమర్చేందుకు వీలు కలుగుతుంది. ఇది ఒక ప్రమాదకర పరిణామం. అమెరికా తలచుకుంటే ఏ దేశానికైనా ఇలాంటి వాటిని అందచేయవచ్చు.


హిందూ మహాసముద్రం-పసిఫిక్‌ సముద్ర ప్రాంతంలో అమెరికా వ్యూహం ప్రకారం ఆస్ట్రేలియా కీలక స్ధానంలో ఉంది. తొంభై బిలియన్‌ డాలర్ల విలువగల డీజిల్‌తో నడిచే 12 ఫ్రెంచి జలాంతర్గాములకు బదులుగా అమెరికా, బ్రిటన్‌ అందచేసే పరిజ్ఞానంతో నిర్మితమయ్యే 66 బిలియన్‌ డాలర్ల విలువ గల ఎనిమిది అణుశక్తితో నడిచే జలాంతర్గాములను ఆస్ట్రేలియాకు సమకూర్చాలని నిర్ణయించారు. ఒప్పందంలో ఎక్కడా చైనా పేరు ప్రస్తావన లేనప్పటికీ అది చైనాకు వ్యతిరేకం అన్నది స్పష్టం. ఒక వైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌లతో కూడిన చతుష్టయం(క్వాడ్‌) ఉన్నప్పటికీ అకుస్‌ను రంగంలోకి తెచ్చారు. చతుష్టయం మిలిటరీ కూటమి కాదని ప్రకటించిన కారణంగా ఆ పేరుతో మిలిటరీ చర్యలు, ఆయుధాలను విక్రయించే అవకాశాలు లేవు. రెండవది భారత్‌ ఎంత మేరకు మిలిటరీ కూటమిలో భాగస్వామి అవుతుందో అనే అనుమానాలు అమెరికాకు ఉన్నాయి.


ఈ ఒప్పందంతో ఆస్ట్రేలియా మిలిటరీ స్ధావరాలు అమెరికాకు మరింతగా అందుబాటులోకి వస్తాయి. సోవియట్‌ యూనియన్‌తో అమెరికా జరిపిన ప్రచ్చన్న యుద్దంలో మిలిటరీ రంగంలో పోటీ కేంద్రీకృతం అయింది. ఇప్పుడు చైనాతో ప్రారంభించిన ప్రచ్చన్న యుద్దంలో మిలిటరీతో పాటు ఆర్ధిక రంగంలో అమెరికాకు సవాలు ఎదురుకావటం కొత్త పరిణామం. మధ్య ప్రాచ్యంతో పోల్చితే ఆసియన్‌ దేశాలలో తమ అమ్మకాలు వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోందని 2018లో సింగపూర్‌లో జరిగిన షాంగ్రి లా సమావేశంలో అమెరికా ఆయుధ కంపెనీ జనరల్‌ డైనమిక్స్‌ సిఇఓ హెబె నోవాకోవిక్‌ చెప్పారు. ఆమె అమెరికా రక్షణశాఖ, సిఐఏలో కూడా పనిచేశారు. మొరటుగా ఉండే అధికారులను ఆకట్టుకుంటే అమెరికా ఆయుధ వ్యాపారుల ఆదాయాలు రెట్టింపు అవుతాయని, స్వంతంగా తయారు చేసుకోవాలనే జాతీయ ప్రయత్నాలను నిరుత్సాహపరచాలని కూడా సెలవిచ్చింది. ఇలాంటి ఆయుధ వ్యాపారుల ఆకాంక్షల పర్యవసానమే ఇప్పుడు ఆసియాలో పెరుగుతున్న ఆయుధపోటీ, అమెరికా విధానాలు అని చెప్పవచ్చు. బైడెన్‌ హయాంలో ఇవి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. వాణిజ్యవేత్త అయిన కర్ట్‌ఎం కాంప్‌బెల్‌ అధ్యక్ష భవన సమన్వయకర్తగా, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, రక్షణ మంత్రి లాయడ్‌ ఆస్టిన్‌, నలుగురికీ ఆయుధవ్యాపారులతో దీర్ఘకాలికంగా ఆర్ధిక సంబంధాలున్నాయి.

ప్రపంచం మొత్తం దిగుమతి చేసుకొనే ఆయుధాలలో ఆసియా మరియు ఓషియానా దేశాల వాటా 42శాతం ఉంది. వీటిలో మధ్య ప్రాచ్య దేశాల వాటానే 33శాతం ఉంది. 2020లో అమెరికా 778 బిలియన్‌ డాలర్లను మిలిటరీకి ఖర్చు చేయగా చైనా చేసింది 252బి.డాలర్లు. చైనా ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 4.7శాతం చేసుకుంటున్నది. అమెరికా పుణ్యమా అని తన ఆయుధాలను అమ్ముకొనేందుకు వేసిన ఎత్తుగడలతో ప్రస్తుతం దాని మిత్రదేశంగా ఉన్న మనం అత్యధికంగా 9.5శాతం, ఆస్ట్రేలియా 5.1, జపాన్‌ 2.2శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాము. వీటిని చూసి చైనాను దెబ్బతీయవచ్చనే అంచనాలతో కొందరు రెచ్చిపోతున్నారు.ప్రస్తుతం ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో అమెరికా 37శాతంతో అగ్రస్ధానంలో ఉంది, ఇది చైనా ఎగుమతులతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ.న్యూయార్క్‌ప్రపంచ వాణిజ్య కేంద్రంపై ఉగ్రదాడి తరువాత అమెరికా ఇప్పటి వరకు వివిధ దేశాల్లో యుద్దాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దీనిలో దీనిలో ఎక్కువ భాగం తన ఆయుధ కంపెనీలకే తిరిగి చేరిందన్నది తెలిసిందే. ఆసియాలో శాంతి భద్రతలు సజావుగా ఉంటే 2050 నాటికి మూడువందల కోట్ల మంది ఆసియన్లు ఐరోపాలోని జీవన ప్రమాణాలను అందుకుంటారని 2011లో ఆసియా అభివృద్ది బ్యాంకు అంచనా వేసింది. అమెరికా, దానితో చేతులు కలుపుతున్న దేశాల చర్యలు దీన్ని సాకారం చేసేవిగా లేవు.


నాటో కూటమిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉన్న ఫ్రాన్స్‌కు తెలియకుండా బ్రిటన్ను భాగస్వామిగా చేసుకొని అమెరికన్లు ఆస్ట్రేలియాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు అన్నది ఆసక్తికరమే. ఐరోపాలో బ్రిటన్‌ పాత్ర అమెరికాకు బంటు తప్ప మరొకటి కాదని ఐరోపా యూనియన్‌ వ్యవహారాల్లో స్పష్టమైంది. ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా బయటకు వచ్చింది కనుక దానిష్టం వచ్చినట్లు వ్యహరించవచ్చు. అమెరికా అణు పరిశోధనలు, బ్రిటన్‌ పరిశోధనలు, సహకారం ఎప్పటి నుంచో నడుస్తోంది.1958లో బ్రిటన్‌ జలాంతర్గాములకు అణుశక్తితో నడిపే రియాక్టర్లను అమెరికా అంద చేసింది. తరువాత వాటిలో అమెరికా క్షిపణులు మోహరించే విధంగా మార్పులు చేశారు. ఇక బ్రిటన్‌ కామన్‌వెల్త్‌ దేశంగా ఉన్న ఆస్ట్రేలియాలో బ్రిటన్‌ తన అణు ప్రయోగాలను నిర్వహించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య గూఢచార సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ఒప్పందం 1941లోనే కుదిరింది. దీన్ని యుకుసా లేదా ఐదు నేత్రాలు అని పిలిచారు. తరువాత అనేక దేశాలతో ఇలాంటి ఒప్పందాలు కుదిరినప్పటికీ ఈ కూటమి ఇప్పటికీ కొనసాగుతోంది. దీన్ని దక్షిణకొరియాను కలుపుకొని విస్తరించేందుకు పూనుకున్నారు.


ఆస్ట్రేలియా మిలిటరీ అమెరికా తరఫున కొరియా, వియత్నాం, ఆప్ఘనిస్తాన్‌ తదితర యుద్దాలలో విశ్వాసపాత్ర దేశంగా పాల్గొన్నది.ఇటీవలి కాలంలో అమెరికా తన చేతికి మట్టి అంటకుండా ఇతర దేశాలను ప్రయోగిస్తున్నది. దానిలో భాగంగానే ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఆస్ట్రేలియాను సాయుధం చేసేందుకు పూనుకున్నట్లు కనిపిస్తోంది. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ విలీనం సమస్యపై చైనాతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న అమెరికా, జపాన్‌లకు ఇప్పుడు ఆస్ట్రేలియాను కూడా తోడు చేయాలని నిర్ణయించినట్లు చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో ఈ దేశాలు తైవాన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు అణుశక్తి జలాంతర్గాములను సమకూర్చితే పరిసర దేశాలు అభద్రతకు గురయ్యే అవకాశం ఉంది.బ్రిటన్‌ కూడా ఈ ఏడాది మార్చినెలలో తన అణ్వాయుధాల సంఖ్యను 180 నుంచి 260కి పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం అణుశక్తితో నడిచే జలాంతర్గాములున్న దేశాలలో మనది కూడా ఒకటి. అమెరికా,చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం రష్యా సహకారంతో అరిహంట్‌ అనే జలాంతర్గామిని నిర్మించాము. మరో ఆరింటిని సమకూర్చుకోవాలని నిర్ణయించాము. ఆధునిక అణుశక్తి జలాంతర్గాములకు ఒకసారి అణుఇంధనాన్ని సమకూర్చితే వాటి జీవిత కాలం వరకు పని చేస్తాయి. మన అరిహంట్‌ను ఆరు-ఏడు సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి ఇంధనం నింపాల్సి ఉంటుంది.

ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశాలకు హాజరైన ఐరోపా యూనియన్‌ ప్రతినిధులు సమావేశమై ఫ్రాన్స్‌కు మద్దతు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. సమావేశ అనంతరం విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్‌ బోరెల్‌ మాట్లాడుతూ అకుస్‌ ప్రకటన తమను ఆశ్చర్యపరించిందన్నాడు. ఏకపక్షంగా, అనూహ్యంగా, దుర్మార్గంగా వ్యవహరించే ట్రంప్‌ ధోరణులను బైడెన్‌ కొనసాగిస్తున్నాడని తోటి భాగస్వామిని గౌరవించటం లేదని ఫ్రెంచి మంత్రి లీ డ్రెయిన్‌ ఆగ్రహించాడు. అమెరికా విశ్వాసపాత్రత లేకుండా వ్యవహరించిందని ఐరోపా యూనియన్‌ అధ్యక్షుడు ఛార్లెస్‌ మైఖేల్‌ ఆగ్రహించాడు. జోబైడెన్‌ నూతన యంత్రాంగంతో వెనుకటి అమెరికా తిరిగి వచ్చింది.ఈ నూతన ప్రభుత్వం పంపిన చారిత్రాత్మక సందేశం ఇది, ఇప్పుడు మా ముందు ప్రశ్నలు ఉన్నాయి. దీని అర్ధం ఏమిటి అని ప్రశ్నించాడు.అమెరికా నిర్ణయం ద్వారా అట్లాంటిక్‌ ప్రాంత కూటమిని బలహీనపరచింది, అమెరికాకు చైనా మీద కేంద్రీకరించటమే ప్రధానమైతే ఆస్ట్రేలియా, బ్రిటన్‌తో చేతులు కలపటం చాలా అసాధారణంగా ఉందన్నాడు.


అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, మిలిటరీ మీద ఆధారపడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తితో ఐరోపా వ్యవహరించాలని ఫ్రాన్స్‌ చెబుతోంది. ఐరోపా యూనియన్‌-అమెరికా సంబంధాల విషయానికి వస్తే గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా గుర్రుగా ఉంది.చైనాతో గత సంవత్సరం జర్మనీ, ఫ్రాన్స్‌ పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఫ్రాన్స్‌-అమెరికా సహకార ఒప్పందానికి 240 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ఉత్సవాలను ఫ్రాన్స్‌ రద్దు చేసింది.చైనాను దిగ్బంధనం కావించేందుకు అమెరికా ఉద్దేశించిన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో ఒక పాత్ర పోషించాలని 2018లోనే నిర్ణయించుకున్న తొలి ఐరోపా దేశం ఫ్రాన్స్‌. మీరు కూడా రావాలని జర్మనీ, మొత్తం ఐరోపా అనుసరించాలని కూడా కోరింది.అలాంటిది ఇప్పుడు ఒప్పందంలో తమను కలుపుకోలేదనే దుగ్దతప్ప మరొకటి లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితిలో ఫ్రాన్స్‌ను దూరం చేసుకొనేందుకు అమెరికా ఎట్టి పరిస్ధితిలోనూ ప్రయత్నించదు. అందుకే దాన్ని సంతృపరచేందుకు బైడెన్‌ యంత్రాంగం రంగంలోకి దిగినట్లు వార్తలు వచ్చాయి. అవి ఫలిస్తాయా, బేరమాడేందుకు ఉపయోగించుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.ఫ్రాన్స్‌ ప్రధమ కోపం ప్రదర్శించినప్పటికీ తెగేదాకా లాగుతుందని చెప్పలేము.