Tags

, ,

ఎం కోటేశ్వరరావు


దారుణం, ఘోరం, అన్యాయం, అక్రమం,నీతులు చెప్పే కమ్యూనిస్టు చైనా ఇంతకు తెగిస్తుందా ? ఇప్పటికైనా నిజం బయటపడింది. ఇక మన దేశానికి మంచి రోజులు వస్తాయి, పెట్టుబడులే పెట్టుబడులు అంటూ కొంత మంది నమ్మించ చూస్తున్నారు. నిజంగా పెట్టుబడులు రావటానికి ప్రపంచబ్యాంకు రాంకులు అవసరమా ? మంచి ర్యాంకులున్న దేశాల నుంచి పెట్టుబడులు ఎందుకు తరలిపోతున్నాయి ? అవి లేక ముందు పెట్టుబడులు రాలేదా, వాణిజ్యం జరగలేదా ? అసలు సమస్య ఏమిటి ?


సులభతర వాణిజ్యం చేసుకొనే అవకాశం, తద్వారా లాభాలు పిండుకొనే అవకాశం ఎక్కడ, ఎలా ఉందో సూచించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఒక సూచికను ప్రకటిస్తున్నది. 2018లో చైనా ర్యాంకు 78, పందొమ్మిదిలో 46, ఇరవైలో 31. ఒక్కసారిగా ఇలా ఎలా పెరిగిపోతుంది. అంతా చేతివాటం అన్నది ప్రచారం. దాని మీద తనిఖీ చేయించినట్లు చెప్పిన ప్రపంచ బ్యాంకు ఆ సూచికల ప్రకటనను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తమ మీద వేసిన నింద మీద పూర్తి స్ధాయిలో దర్యాప్తు జరపాలని చైనా డిమాండ్‌ చేసింది. బ్యాంకు నివేదిక విశ్వసనీయతతో పాటు దాని సభ్యదేశాల గౌరవాన్ని కూడా కాపాడాలని కోరింది. గతంలో ప్రపంచబ్యాంకులో పని చేసి ప్రస్తుతం ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న క్రిస్టాలినా జియోర్‌గివే దర్యాప్తు నివేదికలో పేర్కొన్న భాష్యాలతో, తన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా విబేధిస్తున్నట్లు ప్రకటించారు.


కాసేపు కొంత మందిని సంతుష్టీకరించేందుకు చైనా అక్రమాలకు పాల్పడింది, లబ్ది పొందిందే అనుకుందాం ! మన దేశానికి, ప్రపంచానికి జరిగిన నష్టం ఏమిటి ? వెంటనే వచ్చే సమాధానం, మన దేశానికి వచ్చే పెట్టుబడులను చైనా తన్నుకు పోయింది. ప్రపంచ బ్యాంకు ఏర్పడనపుడు, అది ప్రకటించే సులభతర వాణిజ్య సూచికలు లేనపుడు వాణిజ్యం జరగలేదా ? ప్రచారదాడికి గురై మాట్లాడటం తప్ప సూచికలను బట్టి ఎవరైనా వాణిజ్యం చేసే అమాయకులుంటారా ! 2006లో మనదేశ స్ధానం 116 అయినా పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు రాలేదు. అది 2016నాటికి 142వ స్ధానానికి దిగజారింది. సదరు సూచిక 2020 నాటికి 63కు పెరిగింది. ఈ కాలంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడి కావాలి, వృద్ధి రేటు తారాజువ్వలా లేవాలి, జిడిపి పరుగులు తీయాలి. అదేమి మహత్యమో మరొకటో ఎనిమిదిశాతంగా ఉన్న వృద్ది రేటు నాలుగుశాతానికి పతనమైంది. సూచికలు ఎందుకు నిలబెట్టలేకపోయాయి ?భారత రాంకు తక్కువగా ఉన్న 2010 జడిపిలో పెట్టుబడులు 40శాతం ఉంటే గణనీయంగా మెరుగుపడిన తరువాత 2019లో 30శాతానికి పడిపోయాయి.


కమ్యూనిస్టు దేశాలు తప్పుడు పనులకు పాల్పడవచ్చా అన్నది ఒక ప్రశ్న. ఎవరూ పాల్పడకూడదు. కొందరి లెక్క ప్రకారం కమ్యూనిస్టు దేశాలు నిజాయితీగా ఉండాలి, మిగతా దేశాలు మోసాలకు పాల్పడవచ్చు తప్పులేదు అన్నట్లుగా ఉంది. ఒక వేళ చైనా, మరొక దేశం తప్పు చేసిందే అనుకుందాం. ఆ జాబితా నుంచి వాటిని తొలగించి మిగతా దేశాలకు రాంకులు కొనసాగించవచ్చు కదా ? చైనాను సాకుగా చూసి అసలు రాంకులు ఇవ్వటాన్నే తాత్కాలికంగా అయినా ప్రపంచ బ్యాంకు ఎందుకు నిలిపివేసినట్లు ? దాని నిజాయితీ ప్రశ్నార్ధకం కాదా ? అసలు ఈ సూచికలను ఎందుకు ముందుకు తెచ్చారు ? స్వేచ్చా వాణిజ్యం జరిగేందుకు, సభ్య దేశాలు పన్నులను తగ్గించేందుకు ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)ను ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే అది ఏర్పడిన నాటి నుంచి దానితో నిమిత్తం లేకుండా అనేక దేశాలు, కూటములు ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం ప్రారంభించాయి. 1996లో ప్రపంచ వాణిజ్య సంస్ధను ఉనికిలోకి తెచ్చారు.2001లో దోహా దఫా చర్చలు ప్రారంభమయ్యాయి. ఇంతవరకు ఎటూ తేలలేదు. అసలు ఒక అంగీకారానికి వస్తారో రారో తెలియదు. ప్రపంచ బ్యాంకు ఇది గమనించే కావచ్చు 2006 నుంచి రాంకింగులను ప్రారంభించింది. రాజు గారి గంగాళంలో నేనొక్కడిని నీళ్లు పోస్తే ఎవరికీ అనుమానం రాదులే అని ప్రతి వారూ పాలకు బదులు నీళ్లు పోసినట్లుగా ఎవరికి వారు స్వేచ్చా వాణిజ్య కబుర్లు చెబుతూనే రక్షణ చర్యలు ప్రారంభించారు. దాంతో దేశాల మధ్య పోటీ పెట్టి వాణిజ్యవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు ప్రపంచబ్యాంకు వేసిన ఎత్తు ఇది. దీని లక్ష్యం ఎలాంటి నియంత్రణలు లేకుండా లేదా నామమాత్రంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్ధితిని కల్పించటమే. ఈ సూచికలు సామాజిక ప్రగతిని పట్టించుకోవని, అసమమానతలను పెంచుతాయని కొందరు పరిశోధకులు వెల్లడించారు. ఈ అవాంఛనీయ ర్యాంకుల పద్దతిని మన దేశంలో రాష్ట్రాల మధ్యకూడా ప్రవేశపెట్టటంతో అక్రమాలకు తెరలేచిందనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతకీ చైనా చేసినట్లు చెబుతున్న అక్రమం ఏమిటి ?


ప్రపంచ బ్యాంకు ఇస్తున్న ర్యాంకుల మీద ఫిర్యాదులు మామూలే. అనేక సార్లు ర్యాంకులకు అవసరమైన మార్కులను ఇచ్చే పద్దతులు, ప్రశ్నలను మార్చారు. వాటిని ఉపయోగించుకొని ప్రతి దేశం ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అందుకే ఇచ్చిన ర్యాంకుల మీద అంతర్గత తనిఖీ నిర్వహిస్తారు. 2018 సెప్టెంబరు 12న ఆ ఏడాది నివేదిక గురించి చైనా అధికారులతో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ చర్చించాడట.తరువాత రెండు రోజులకు బ్యాంకు సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా చైనా అధికారులతో చర్చించిన తరువాత ర్యాంకులు మారిపోయాయని అమెరికా కంపెనీ చెబుతోంది. ఏ దేశ అధికారులైనా బ్యాంకు ఉన్నతాధికారులను కలిస్తే అక్రమాలకు పాల్పడినట్లేనా ? ఇదెక్కడి తర్కం ! బ్యాంకు ఉన్నతాధికారి సూచన మేరకు 2020 నివేదికలో జోర్డాన్‌ రాంకును తగ్గించి సౌదీ అరేబియా ర్యాంకును పెంచారట. దీని వెనుక ఎవరున్నారు ?


చైనా అక్రమాలకు పాల్పడిందంటున్నారు గనుక ఇప్పుడు పెట్టుబడులు మన దేశం వైపు మరలుతాయని కొందరు చెబుతున్నారు. సంతోషించాల్సిందే. అదే అయితే మన కంటే ముందున్న వాటిలో చైనాను మినహాయిస్తే ఇంకా అరవై ఒక్క దేశాలుంటాయి వాటన్నింటినీ దాటిన తరువాతే కదా ఎవరైనా మనవైపు చూసేది, కనుక ఆ మాటలను ఎంతవరకు నమ్మాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ గారే స్వయంగా ముఖ్యమంత్రుల సమావేశంలో చైనా నుంచి కంపెనీలు వచ్చేస్తున్నాయి, ఎర్ర తివాచీలు పరిచేందుకు సిద్దంగా ఉండండి అని చెప్పారు. ఇంతవరకు ఎన్ని వచ్చాయో, దారి మధ్యలో ఎక్కడ ఆగాయో చెప్పినవారు లేరు. ఇప్పుడు రాంకులు మారిపోయాయి గనుక పెట్టుబడులే పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు చైనా బదులు భారత్‌కు రావాలని చూస్తున్నట్లు కొందరు కొత్త గానాలాపన మొదలు పెట్టారు. చైనా ర్యాంకును పక్కన పెట్టండి, మన ర్యాంకు 142 నుంచి 63కు పెరిగిన కాలంలో చెప్పిన విధంగా పెట్టుబడులు వచ్చాయనేందుకు ఆధారాలు లేవు. వచ్చి ఉంటే కరోనాకు ముందే వృద్ది రేటు, జిడిపి దిగజారేది కాదు కదా !


2018,2020 సూచికల మీద అలాంటి తనిఖీని అమెరికాకు చెందిన విల్మర్‌హేల్‌ అనేక కంపెనీకి అప్పగించారు. వారు తయారు చేసిన నివేదిక ప్రకారం అక్రమాలు జరిగాయని ప్రకటించారు. నాటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యోంగ్‌ కిమ్‌, సిఇఓ క్రిస్టాలినా జియోర్‌గియేవా జోక్యం చేసుకొని చైనా ర్యాంకు పెంచాలని సిబ్బంది మీద వత్తిడి చేశారట.2018లో అలా చేసినందున చైనా ర్యాంకు 85బదులు 78గా ఉందట. వాణిజ్యం ప్రారంభించటం, రుణాలు పొందటం, పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో చైనాకు 65.3 పాయింట్లు వచ్చినట్లుగా లెక్కించగా రాంకు 78 వచ్చింది. అమెరికా కంపెనీ తనిఖీలో పాయింట్లు 64.5కు తగ్గాయట. దాని ప్రకారం అయితే 85 వస్తుందట. పాయింట్ల తేడా 0.8, ఈ మాత్రం దాని కోసం ప్రపంచ బ్యాంకు అధిపతులు జోక్యం చేసుకున్నట్లు తేల్చారు. ఏడు రాంకులు పెరిగితే ఏమిటి తగ్గితే ఏమిటి ? తనిఖీ చేసిన అమెరికా కంపెనీ పెద్దలు లెక్కించిన పద్దతి తప్పు కావచ్చు, చైనా వ్యతిరేకతతో అలాంటి నివేదిక ఇచ్చి ఉండవచ్చుగా !


దేశాల మధ్య అనారోగ్యకర పోటీని, అవాంఛనీయ చర్యలను ప్రోత్సహించే రాంకుల మతలబు గురించి విమర్శలు, ఆరోపణలు గతంలోనే వచ్చాయి. అసలా రాంకుల పద్దతి నిలిపివేయాలని అనేక మంది కోరుతున్నారు. 2020ఆగస్టు 31న ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషణలో కొన్ని అంశాలను పేర్కొన్నారు. 2015 లాటిన్‌ అమెరికాలోని చిలీ పన్నుల చెల్లింపు రాంకు 33గా ఉంది. మరుసటి ఏడాది దాని రాంకు 120కి పడిపోయింది. ఇదెలా జరిగింది? మితవాద శక్తులు అధికారంలో ఉన్నపుడు పరిస్ధితి మెరుగ్గా ఉంది, సోషలిస్టు పార్టీ అధికారంలోకి రాగానే దిగజారింది అని చిత్రించటం దీని వెనుక ఉందని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నలే రాసింది. దాన్ని ఖండించిన బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్త పాల రూమర్‌ కొద్ది వారాల తరువాత ఇంటిదారి పట్టాడు. సౌదీ అరేబియా రాంకు ఐదు సంవత్సరాల్లో 49 నుంచి 62కు దిగజారటం, అజర్‌బైజాన్‌ రాంకు 80 నుంచి 34కు పెరగటం, యుఏయి 22 నుంచి 16కు పెరగటం, చైనా 90 నుంచి 31 పెరగటం వెనుక కిరికిరి జరిగిందని కూడా ఆ పత్రిక రాసింది. ఇన్ని ఉదంతాలు ఉండగా ఒక్క చైనా మీదనే ఎందుకు దాడి కేంద్రీకరించారు అన్నది ప్రశ్న !

రాంకులను తారుమారు చేయటం ఎంతో సులభమని అనేక మంది చెబుతున్నారు. మన దేశం విషయానికి వస్తే విద్యుత్‌ ధర మిగతా పోటీ దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో ప్రయివేటు సరఫరాదారులున్న ముంబై, ఢిల్లీ సమాచారాన్ని మాత్రమే ప్రపంచబ్యాంకు ప్రమాణంగా తీసుకుందని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ రాసింది. అంటే అర్ధం ఏమిటి కృత్రిమంగా మన దేశ ర్యాంకును పెంచేందుకు ఇలా చేశారనే కదా ! రాంకుల్లో మన స్ధానం ఎంతో మెరుగుపరుచుకున్నా వాణిజ్యం, జిడిపిలో పెరుగుదల లేకపోగా వృద్ది రేటు దిగజారిపోవటం వెనుక మతలబు ఏమిటి అనేక మంది ప్రశ్నిస్తున్నారు. మన దేశం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ర్యాంకు దోహదం చేస్తుందనే అంచనాతో మెరుగుపరుచుకొనేందుకు అనేక చర్యలు తీసుకుంది.నరేంద్రమోడీ హయాంలో అది మరింత వేగంగా జరిగింది.2020 నాటికి భారత్‌ 50వ స్ధానంలో ఉంటుందని 2018లోనే నరేంద్రమోడీ దవోస్‌లో ప్రకటించారు. దాని కోసం ఏకంగా ఒక కమిటీనే 2015లో ఏర్పాటు చేశారు. కాంట్రాక్టు లేబరు నియామకానికి అనుమతి, కనీసవేతన చట్టాలకు మంగళం, ఎనిమిది గంటలకు బదులు ఏదో ఒకసాకుతో ఎన్నిగంటలైనా పని చేయించుకొనే వీలు కల్పించటం,వేతనంతో కూడిన వార్షిక సెలవుల రద్దు, ఎలాంటి ముందుస్తు సమాచారం లేకుండా కార్మికులను తొలగించే అవకాశాలను కల్పించటం వంటి చర్యలు. మన ర్యాంకు పెరిగేందుకు దోహదం చేసి ఉండవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్మికరంగంలో తీసుకురాదలచిన మార్పులు అమల్లోకి వస్తే ఇంకా మెరుగుపడవచ్చు. కానీ కార్మికుల పరిస్ధితి మరింత దిగజారటం ఖాయం. ఇప్పటికే ఆర్ధిక అసమానతల్లో మన దేశ తాజా రాంకు 158కి 141లో ఉన్నాం. మరి దీని సంగతి ఏమిటి ? దీన్ని మెరుగుపరచేందుకు నరేంద్రమోడీ తీసుకున్న చర్యలేమిటి ? వాణిజ్య రాంకు మెరుగుదలకు కమిటీ ఏర్పాటు చేసిన పెద్దలు ఆర్ధిక అంతరాలు తగ్గించటం గురించి ఎందుకు పట్టించుకోరు ?


చైనా ఆర్ధిక రంగంలో సాధించిన అద్భుతాలను కొంత మంది ఎన్నటికీ అంగీకరించరు. దాని వలన వారికి కలిగే లాభం లేదు, చైనాకు వచ్చే నష్టం లేదు. ఈ అభివృద్ధి వెనుక ప్రపంచబ్యాంకు రాంకులు లేవు.1948 జనవరి ఒకటిన ఉనికిలోకి వచ్చిన ”గాట్‌” (జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారిఫ్‌ అండ్‌ ట్రేడ్‌ – పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం)లో చైనా స్ధాపక సభ్యురాలు.అయితే 1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత ఆ ప్రభుత్వాన్ని కాకుండా తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ కేంద్రంగా నడిచిన ప్రభుత్వాన్నే గుర్తించారు.1971లో ఐరాసలో కమ్యూనిస్టు చైనాను గుర్తించినా గాట్‌లో, దాని వారసురాలిగా వచ్చిన ప్రపంచ వాణిజ్య సంస్ధలో అసలైన చైనాకు స్ధానం ఇవ్వలేదు, 2001డిసెంబరులో మాత్రమే చేర్చుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపివేసిన 2020లో 2.3శాతం వృద్దిరేటుతో ముందుకు పోయిన ఏకైక పెద్ద ఆర్ధిక వ్యవస్ధ చైనాదే.1948లో దాని విదేశీ వాణిజ్యం 907 బిలియన్‌ డాలర్లయితే 2020లో 4.65లక్షల కోట్ల డాలర్లు. చైనా వాణిజ్యం 1978లో 26వ స్ధానంలో ఉంటే 2017నాటికి ఒకటవ స్ధానానికి చేరి, నాలుగేండ్లుగా అదే స్ధాయిలో కొనసాగుతోంది. 1986లో తలసరి ఖర్చు చేయగల ఆదాయం వెయ్యి యువాన్లయితే(ఒక యువాన్‌ పదకొండు రూపాయలు), 2005నాటికి పదివేలు,2020లో32,129 యువాన్లుంది. గ్రామీణుల సగటు 17,131అయితే పట్టణసగటు 43,834 యువాన్లు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు 1950లో యాభైవేల మంది ఉంటే ఇప్పుడు యాభై లక్షలు దాటారు. పరిశోధన మరియు అభివృద్ది కోసం 1980లో 13 బిలియన్‌ యువాన్లు ఖర్చు చేస్తే 2020లో2.4లక్షల కోట్ల యువాన్లు ఉంది.2020లో తొలిసారిగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐదు వందల కంపెనీలలో 133తో చైనా తొలిసారిగా అమెరికాను అధిగమించింది. ఇవన్నీ ప్రపంచ బ్యాంకు సులభతర వాణిజ్య సూచికల తారుమారు కారణంగానే జరిగాయని ఎవరైనా అనుకుంటే చేయగలిగిందేమీ లేదు.


గతంలో వివిధ దేశాలకు చెందిన ర్యాంకుల కోసం సమాచారాన్ని తారు మారు చేసిన ఉదంతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్ధికవేత్తగా ఉన్న పాల్‌ రోమర్‌ రాజీనామా చేసి ఇంటి బాట పట్టాడు. వివిధ దేశాల రాజకీయ అవసరాల కోసం లెక్కింపు పద్దతులను పదే పదే మార్పులు చేసిన కారణంగా ర్యాంకుల్లో మార్పులు జరిగాయని రోమర్‌ చెప్పాడు.2006-2017 మధ్య చిలీ ర్యాంకులు తారుమారయ్యాయి. సోషలిస్టు పార్టీకి చెందిన మిచెల్లీ బాచ్‌లెట్‌ హయాంలో దేశ పరిస్ధితి దిగజారిందని, మితవాది, నియంత సెబాస్టియన్‌ పినేరా హయాంలో మెరుగుపడిందని చూపేందుకు కావాలని ఆ పని చేశారు. అందుకు గాను వ్యక్తిగతంగా తాను క్షమాపణలు చెబుతున్నట్లు రోమర్‌ ప్రకటించాడు. వత్తిడి రావటంతో మాట మార్చాడు, చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఆ ఉదంతం తెలిసిన బ్యాంకు అధ్యక్షుడు, సిఇవో చైనాకు అనుకూలంగా మార్పులు చేయాలని కోరారన్న ఆరోపణలు నమ్మదగినవేనా ?


రాంకులను బట్టే పెట్టుబడులు వచ్చేట్లయితే 2006-20 మధ్య అమెరికా రాంకు 3-8, జపాన్‌ రాంకు 10-39 మధ్య, బ్రిటన్‌ 9-10, ఆస్ట్రేలియా 6-18, కెనడా 4-23 మధ్య ఉంది. మరి ఆ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, కంపెనీలు తమ దేశాలను వదలి ఫేక్‌ రాంకులు తెచ్చుకున్నట్లు చెబుతున్న చైనాలో ఎందుకు పెట్టుబడులు పెట్టినట్లు ? ఒకవేళ ఎవరైనా మోసపోయి చైనా వెళ్లిన తరువాత అక్కడ అంత సీన్‌ లేదని మిగతా కంపెనీలకు చెప్పి ఉండాలి కదా ? ఒకరిని చూసి ఒకరు పొలోమని ఎందుకు వెళ్లినట్లు ? పోనీ చైనా తప్పుదారి పట్టించింది అనుకుందాం, అక్కడ పెట్టుబడులు పెట్టి దివాలా తీసిన విదేశీ కంపెనీలెన్ని, ఆత్మహత్యలు చేసుకున్న పారిశ్రామికవేత్తలెందరో ఎవరైనా చెప్పగలరా ! చైనాలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు కేవలం ఎగుమతుల కోసమే కాదు, అక్కడి అంతర్గత మార్కెట్లో తమ సరుకులు అమ్ముకొనేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు కూడా వెళతాయి. అలాంటి అవకాశం ప్రస్తుతం మన దేశంలో ఉందా ? మన దేశంలో వినియోగఖర్చు ఎలా ఉందనే అంశంపై అధికారిక లెక్కలు 2012నాటివే అందుబాటులో ఉన్నాయి. జాతీయ గణాంక సంస్ధ 2017-18లో సేకరించిన సమాచారాన్ని విడుదల కాకుండా నిలిపివేశారు. లీకుల సమాచారం ప్రకారం ఖర్చు తగ్గినట్లు తేలింది, దాన్ని మరోవిధంగా చెప్పాలంటే దారిద్య్రం పెరిగింది. నరేంద్రమోడీ సర్కారుకు ప్రధాన ఆర్ధిక సలహాదారుగా పని చేసిన అరవింద సుబ్రమణ్యం దేశ ఆర్ధిక స్ధితి ఐసియులో ఉందని చెప్పారు. ఆర్ధిక వ్యవస్ద మాంద్యంలో ఉందని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ అన్నారు.చివరికి ప్రపంచబ్యాంకు కూడా మన ఆర్ధిక వ్యవస్ధ చక్రియ మందగింపు తీవ్రంగా ఉందని చెప్పింది. ఇవన్నీ కరోనాకు ముందు వ్యాఖ్యలు. పెట్టుబడులు పెట్టాలనుకొనే వారు వీటన్నింటినీ చూడరా ?