Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


చైనా మీద ఉక్రోషంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హువెయి కంపెనీ అధికారిని కిడ్నాప్‌ చేయించాడు.దాని పర్యవసానాలను తట్టుకోలేని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ దిగివచ్చి రాజీ చేసుకున్నాడు. బాధితురాలు చైనాకు చెందిన వాంగ్‌ వాన్‌ఝౌ స్వదేశం చేరుకొనే సమయంలోనే చతుష్టయ దేశాధినేతల తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరిగింది. చతుష్టయ సమావేశం ముందుగా నిర్ణయించుకున్నదే, మరి మొదటి ఉదంతం ? యాదృచ్ఛికమా ? కానేకాదు ! ఈ చర్య అమెరికా-చైనాల మధ్య సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదం చేయనుందనే వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.మరోవైపు చైనాను రెచ్చగొట్టే చర్యలకు ” అకుస్‌” ఒప్పందం చేసుకున్నారు. చతుష్టయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో నాటకీయంగా సుఖాంతమైన కిడ్నాప్‌ ఉదంతం, దీని ద్వారా భారత్‌ సహా మిత్రదేశాలకు అమెరికా ఇచ్చిన సందేశం ఏమిటి ?


చైనాతో వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా టెలికాం కంపెనీ హువెయి సిఎఫ్‌ఓ, కంపెనీ స్ధాపకుడి కుమార్తె మెంగ్‌ వాన్‌ఝౌను 2018డిసెంబరు ఒకటవ తేదీన కెనడాలో ” రాజకీయ కిడ్నాప్‌ ” చేయించాడు. మెంగ్‌ చైనా నుంచి మెక్సికో వెళుతూ విమానం మారేందుకు కెనడాలోని వాంకోవర్‌ విమానాశ్రయంలో దిగింది. అమెరికా వత్తిడికి లొంగిన కెనడా సర్కార్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్బంధించింది. ఇదే సమయంలో గూఢచర్యానికి పాల్పడుతూ దొరికిపోయిన ఇద్దరు కెనడీయులను చైనా అరెస్టు చేయటమే కాదు, విచారణ జరిపి శిక్షలు కూడా విధించింది. ఈ పరిణామాలతో అమెరికా-చైనా సంబంధాలు గత నాలుగుదశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దిగజారటమే కాదు, కెనడా ఇరుక్కుపోయి చైనాతో వైరాన్ని కొని తెచ్చుకుంది.


ఇంతకీ వాంగ్‌ మీద మోపిన నేరం ఏమిటి ? ఇరాన్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలను వమ్ము చేసేందుకు హుబెయి కంపెనీ కుట్ర చేసిందట, దానికి గాను సిఎఫ్‌ఓను అరెస్టు చేసి తమకు అప్పగించాల్సిందిగా కెనడాను కోరింది. కెనడా అరెస్టయితే చేసింది గానీ చైనాతో వచ్చే ముప్పును గ్రహించి వాంగ్‌ను అమెరికాకు అప్పగించలేదు. ఒకవైపు అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయ (క్వాడ్‌) తొలి సమావేశం వాషింగ్టన్‌లో జరుపుతున్న సమయంలోనే నాటకీయ పరిణామాల మధ్య వాంగ్‌ విడుదలకు చైనాతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది. వాంగ్‌ శనివారం నాడు ప్రత్యేక విమానంలో చైనా చేరుకుంది. ఒప్పంద వివరాలు పూర్తిగా తెలియదు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగే విషయం ఇతర భాగస్వామ్య పక్షాలతో చెప్పకుండానే నిర్ణయం తీసుకున్న అమెరికా ఇప్పుడు ఈ పరిణామంతో చతుష్టయంలోని మిగిలిన దేశాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లయింది.


ఈ ఒప్పందానికి జో బైడెన్‌ యంత్రాంగాన్ని ప్రేరేపించిన అంశాలేమిటి ? చైనా వైపు నుంచి కొత్తగా పొందిన రాయితీలేమీ లేవు. ఒక వైపు అక్కడి గుత్త సంస్ధలపై అనేక చర్యలను జింపింగ్‌ సర్కార్‌ ప్రకటిస్తున్నది. ఇతర దేశాలపై ఆధారపడకుండా స్వంత పరిజ్ఞానం, వనరులతో అభివృద్ధి వ్యూహాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. జనవరిలో అధికారాన్ని స్వీకరించిన బైడెన్‌ వాణిజ్య ప్రతినిధిగా కాథరీన్‌ తాయి నియామకం జరపటంతో వాణిజ్యవేత్తలు తమ సమస్యలను పట్టించుకుంటారనే ఆశాభావం వెలిబుచ్చారు. అయితే నెలలు గడుస్తున్నా వ్యూహాత్మక ఓపిక పేరుతో కాలం గడుపుతున్న బైడెన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు రాకపోవటంతో కొంత మందిలో ఓపిక స్దానంలో ఆగ్రహం వ్యక్తమౌతోంది. వెంటనే చైనాతో చర్చలు జరిపి సాధారణ సంబంధాలతో తమ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే వత్తిడి తెస్తున్నారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో చైనాతో కుదుర్చుకున్నట్లు ప్రకటించిన తొలి దశ వాణిజ్యం ఒప్పందం ఏమేరకు అమలు జరిగిందో స్పష్టత లేదు. కరోనా వైరస్‌ను చైనాయే తయారు చేసి వదలిందని నోరు పారవేసుకున్న ట్రంప్‌ చైనాతో వైరాన్ని మరింత పెంచాడు. ఒప్పందంలో ఏమి చెప్పినప్పటికీ అమెరికాకు ఆగ్రహం కలిగినా, దాంతో చైనాకు చిర్రెత్తినా నష్టపోయేది అమెరికాయే గనుక అక్కడి వాణిజ్యవేత్తలు బైడెన్‌ వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు తొలివారంలో అమెరికాలోని అతి పెద్ద వాణిజ్య సంస్ధల సంఘాలు సమావేశమై చైనాతో సర్దుబాటు చేసుకొని వాణిజ్య అవకాశాలను పెంచుతారా లేదా అని బైడెన్‌కు ఒక విధంగా హెచ్చరికను జారీ చేశాయి. కొన్ని ఉత్పత్తుల తయారీకి అవసరమైన ఉత్పాదకాలు చైనాలో మాత్రమే దొరుకుతాయి, ఇతర దేశాల్లో పరిమితంగా లభ్యమైనా అధికధరలకు వాటిని కొనుగోలు చేసి మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోలేకపోతున్నామని, అందువలన చైనా సరఫరాదార్ల మీద ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశాయి. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కార్మికులు, అమెరికా పోటీతత్వాన్ని కాపాడాలంటే చైనాతో రాజీకి రావాలని స్పష్టం చేశాయి.


అమెరికా కంపెనీలను చైనీయులు ఎలా ప్రభావితం చేస్తున్నారో మచ్చుకు విమానాలను తయారు చేసే బోయింగ్‌ కంపెనీ ఉదంతాన్ని చూద్దాం. అసలే ఆ కంపెనీ కష్టాల్లో ఉంది, అది తయారు చేసే విమానాల్లో ఐదోవంతు కొనుగోలు చేసే చైనా నుంచి 2017 తరువాత ఆర్డర్లు లేవు. లాభాలు తెస్తుంది అనుకుంటున్న బోయింగ్‌ 737 మాక్స్‌ రకం తన గగన తలంపై ఎగిరేందుకు చైనా అనుమతించ లేదు. దాంతో ఇతర దేశాలు అనుమతి ఇచ్చినా, విమానాలు కొనుగోలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. ఇదంతా ట్రంపు చేసిన కంపు అని అది మండిపడుతోంది. రాబోయే పది సంవత్సరాల్లో ప్రపంచం వంద విమానాలు కొనుగోలు చేస్తుందనుకుంటే వాటిలో 25 చైనా వాటా.ఈ కారణంగా బోయింగ్‌ వాటాదారులు ఇటీవల కంపెనీ మీద ధ్వజమెత్తారు. ఎన్ని అడ్డుంకులను అధిగమించినా చైనాతో సాధ్యం కావటం లేదు, చైనాతో సర్దుబాటు చేసుకోకపోయినా, ఆలస్యం అయినా మన కంపెనీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సిఇఓ దవే కాలహన్‌ వాపోయాడు. మే నెలలో కొత్తగా 73 విమానాలకు అర్డర్లు వస్తే అదే నెలలో 53 ఆర్డర్లు రద్దయ్యాయి. కనుక ఇలాంటి కార్పొరేట్లకు ఆగ్రహం కలిగినా, మద్దతు లేకపోయినా అమెరికాలో ట్రంపూ, బైడెన్‌ ఎవరూ తెరమీద కనిపించరు.


బోయింగ్‌ వంటి కంపెనీలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి ? రానున్న రెండు దశాబ్దాలలో చైనాకు 8,700 విమానాలు అవసరమన్నది ప్రస్తుత అంచనా. చైనా వృద్ధి రేటు, పౌరుల ఆదాయాలు పెరిగితే ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. మరోవైపు 2025నాటికి స్వంత విమానాలను ఎగురవేయాలని చైనా ముమ్మరంగా పరీక్షలు జరుపుతోంది.2008లో ఏర్పాటు చేసిన కంపెనీ రెండు రకాల విమానాలను అభివృద్ది చేస్తోంది. ఎక్కడా ఆగకుండా 5,555 కిలోమీటర్ల దూరం 156 నుంచి 168 మంది, పన్నెండు వేల కిలోమీటర్లు ఆగకుండా 250 నుంచి 320 మంది ప్రయాణీకులను చేరవేయగలిగే విమానాలను తయారు చేస్తున్నారు. వెయ్యి చిన్న విమానాలను ఈ ఏడాది చివరి నాటికి వాణిజ్య అవసరాలకు ప్రవేశపెడతారని, 2025నాటికి పెద్ద విమానం సిద్దమౌతుందని భావిస్తున్నారు. అవి రంగంలోకి వస్తే ఐరోపా ఎయిర్‌బస్‌, అమెరికా బోయింగ్‌లకు పెద్ద పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ లోగా వీలైనన్ని విమానాలను అమ్ముకోవాలని ఆ రెండు కంపెనీలు తొందరపడుతున్నాయి. తమ ప్రభుత్వాల మీద వత్తిడి చేస్తున్నాయి.


వచ్చే ఏడాది నవంబరులో అమెరికా పార్లమెంట్‌ మధ్యంతర ఎన్నికల జరగాల్సి ఉంది. చైనాతో ఒప్పందం చేసుకుంటే లొంగిపోయినట్లుగా ట్రంప్‌ గ్యాంగ్‌ ఓటర్లను రెచ్చగొట్టవచ్చని డెమోక్రటిక్‌ పార్టీ భయపడుతోంది. లేకపోతే కార్పొరేట్లు గుర్రుమంటున్నాయి.మరోవైపు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్ధిక వ్యవస్దను నడపాలనే వైఖరితో ముందుకు పోతున్న చైనా నాయకత్వ వైఖరి కూడా పెట్టుబడిదారులకు ఆందోళన కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు చతుష్టయంలోని భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలను చైనాకు వ్యతిరేకంగా అమెరికా రెచ్చగొడుతూ దూరం పెంచుతోంది. మరోవైపు తన వ్యాపారాన్ని తాను చక్కపెట్టుకొంటోంది.2021 తొలి ఎనిమిది నెలల్లో అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 36.6శాతం పెరిగి చైనా-అమెరికా వాణిజ్యం రెండు వైపులా రికార్డులను బద్దలు కొట్టి 470బిలియన్‌ డాలర్లకు చేరింది. అమెరికా నుంచి 48శాతం ఎగుమతులు(111బి.డాలర్లు) పెరిగితే చైనా నుంచి 33.3శాతం(354 బి.డాలర్లు) పెరిగాయి. ఏడాది మొత్తం మీద రెండు దేశాల మధ్య 700 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. ఇది వాణిజ్య యుద్దానికి ముందున్న స్ధాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పుతుందని చెబుతున్నారు.


చైనా నుంచి కంపెనీలు మన దేశం వస్తున్నాయన్న ప్రచారం తెలిసిందే. కరోనా సమయంలో(2020) చైనాలోని తమ అసోసియేషన్‌లోని 95శాతం మంది చైనా మార్కెట్లో లబ్దిపొందారని అమెరికా-చైనా వాణిజ్య మండలి(యుఎస్‌సిబిసి) ఒక శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే ట్రంప్‌ వైఖరినే బైడెన్‌ కొనసాగిస్తారనే భయం అమెరికన్‌ కార్పొరేట్లలో ఉంది, అందుకే వత్తిడి పెంచారు.అదే జరిగితే చైనా ప్రతిదాడికి దిగితే వాణిజ్యంతో పాటు సామాన్య అమెరికన్లు కూడా ఇబ్బంది పడతారనే భయం వ్యక్తమౌతోంది. అంతర్గతంగా రాయితీలు ఇవ్వటాన్ని ప్రపంచ వాణిజ్య సంస్ధ కూడా అడ్డుకోలేదు.ఆధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దితో 2025 నాటికి ఒక మైలురాయిని దాటాలని చైనా పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తూ స్ధానిక పరిశోధన, అభివృద్దిని ప్రోత్సహిస్తోంది. ఇది కూడా అమెరికన్లకు ఆందోళనకరంగా మారింది. ట్రంప్‌ మార్గంలో పయనిస్తే మరోదారీ, తెన్నూ లేని చోటికి పయనిస్తామని, కనుక వెంటనే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా చర్చలు జరపాలని కార్పొరేట్లు డిమాండ్‌ చేస్తున్నాయి.ఈ నేపధ్యంలోనే సెప్టెంబరు పదిన జో బైడెన్‌-గ్జీ జింపింగ్‌ మధ్య అనేక అంశాలపై ఫోను ద్వారా సంభాషణలు జరిగాయి. పదిహేను రోజుల్లోనేే హుబెయి సిఎఫ్‌ఓ వాంగ్‌ఝౌ విడుదల ఆఘమేఘాల మీద జరిగింది.


అమెరికన్‌ కార్పొరేట్లు బైడెన్‌ సర్కారు మీద మరోవత్తిడిని కూడా ప్రారంభించాయి. ఆర్ధికంగా చిక్కుల్లో ఉన్న వ్యవస్ధను గట్టెక్కించేందుకు ప్రభుత్వం 3.5లక్షల కోట్ల డాలర్లను వివిధ పధకాల మీద ఖర్చు చేయాలని ప్రతిపాదించింది. అందుకు గాను వాణిజ్య, పారిశ్రామిక సంస్దల నుంచి వసూలు చేసే పన్ను మొత్తాల పెంపుదల, ఇతర చర్యల ద్వారా నిధుల సేకరణ జరపాలన్న ప్రతిపాదనలున్నాయి.ఇదే చేస్తే దేశ ఆర్ధిక వ్యవస్ధ ఉనికే ప్రశ్నార్దకం అవుతుందని అమెరికా వాణిజ్య మండలి ధ్వజమెత్తింది.దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున టీవీల్లో ప్రకటనలు జారీ చేసి ప్రచారం చేస్తోంది. ఈ మొత్తం దేశంలోని 50 రాష్ట్రాల బడ్జెట్లకు రెండు రెట్ల కంటే ఎక్కువని, దీని వలన ఫలితం లేకపోగా మొదటికే ముప్పు వస్తుందని వాణిజ్య మండలి సిఇఓ సుజానే క్లార్క్‌ విమర్శించాడు.ఈ ప్రతిపాదనలను ఆమోదించవద్దని, మద్దతు ఇస్తే ఏ సభ్యుడికీ తమ మద్దతు ఉండదని హెచ్చరిస్తూ పార్లమెంట్‌ సభ్యులకు ఒక లేఖను కూడా మండలి రాసింది. ఇదే సమయంలో ఎట్టి పరిస్ధితుల్లో ఈ ప్రతిపాదనను ఆమోదించాల్సిందే అని కొంత మంది ఎంపీలు బహిరంగంగా ప్రకటించారు.


ప్రపంచీకరణ పేరుతో ప్రపంచమార్కెట్లను ఆక్రమించేందుకు అమెరికా ప్రయత్నిస్తే అనుకున్నదొకటీ అయింది మరొకటి. ప్రపంచీకరణ శ్రమశక్తి ఖర్చును తగ్గించింది. అది అమెరికా కార్పొరేట్లకు వరంగానూ, కార్మికవర్గానికి శాపంగానూ మారింది. స్ధానిక మార్కెట్ల ద్వారా వృద్ధి సాధించే అవకాశాలు తగ్గిపోయాయి. అమెరికా వస్తువుల కంటే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవటం లాభదాయయకంగా మారింది. 2001లో ప్రపంచ వాణిజ్య సంస్ధలో చైనా చేరినప్పటి నుంచీ అంతకు ముందు యాభై సంవత్సరాలతో పోల్చితే అమెరికన్‌ కార్పొరేట్ల లాభాలు 22శాతం పెరిగాయి.చైనాలో పెట్టుబడి పెట్టిన వారు కూడా ఇదే విధంగా లబ్ది పొందారు. దశాబ్దాల తరబడి క్యూబా, ఉత్తర కొరియా,రష్యా,సిరియా, తదితర దేశాల మీద అమెరికా విధించిన ఆంక్షలు పరిస్ధితిని మరింతగా దిగజారాయి తప్ప ప్రయోజనం లేకపోయింది. అవన్నీ ఇబ్బందులను భరించాయి తప్ప అమెరికాకు లొంగలేదు. అమెరికా విధించిన ఆంక్షల వలన ఆయా దేశాలు బోయింగ్‌ బదులు ఎయిర్‌బస్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇదే ఇతర అంశాల్లోనూ జరుగుతోంది. క్రమంగా చైనా పెట్టుబడిదారీ వ్యవస్ధకు మారుతుందని పశ్చిమదేశాలు వేసిన అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. ఇప్పుడు అక్కడ బడా సంస్దల మీద నియంత్రణ, ఉమ్మడి సౌభాగ్యం పేరుతో తీసుకుంటున్న చర్యల గురించి అర్ధంగాక జుట్టుపీక్కుంటున్నాయి.


గత దశాబ్దకాలంలో చైనా సంస్దలు అమెరికా నుంచి 76బిలియన్‌ డాలర్లను సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 13బిలియన్‌ డాలర్లను పొందాయి.2016 నుంచి అమెరికాలోని స్టాక్‌మార్కెట్‌లో వాటాలను విక్రయిస్తున్న చైనా కంపెనీలు రెట్టింపై 400కు చేరాయి. వాటి లావాదేవీల మొత్తం 400 బిలియన్‌ డాలర్ల నుంచి 1.7లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా విదేశాంగ విధానంలో ఆర్ధిక అంశాలు చిన్నచిన్న దేశాలను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. మిలటరీ చర్యలు కూడా ఎలా పరువు తీశాయో ఆప్ఘనిస్తాన్‌ స్పష్టం చేసింది. మిత్రదేశమైన మెక్సికో సరిహద్దులో వలస కార్మికులను అడ్డుకొనేందుకు ఏకంగా ట్రంప్‌ సర్కార్‌ గోడనే కట్టించిన విషయం తెలిసిందే. చైనా మీద విధించిన ఆంక్షలను ఐరోపాలోని జర్మనీ వంటి దేశాలే ఖాతరు చేయటం లేదు. హువెయి కంపెనీ టెలికాం ఉత్పత్తుల దిగుమతిని వ్యతిరేకించిన జర్మనీ ఇప్పుడు పునరాలోచనలో పడి ఐరోపా యూనియన్‌ మీదనే ఆంక్షలకు వ్యతిరేకంగా వత్తిడి తెస్తోంది. చైనాతో ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది చైనాతో దాని వాణిజ్యం 243 బిలియన్‌ డాలర్లు. ఆర్ధిక ఆంక్షల కొరడాను అమెరికా ప్రయోగిస్తుంటే అదే ఎత్తుగడను చైనా అనుసరిస్తోంది. ఆస్ట్రేలియా, జపాన్‌, కెనడా, దక్షిణ కొరియా వంటి అమెరికా అనుకూల దేశాలకు నీవు నేర్పిన విద్యయే అంటూ జవాబిస్తోంది.


మాఫియా ముఠాలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకొనేందుకు ఎరలు వేసి యువతను ఆకర్షించి వారి చేత తప్పులు చేయించి తమ చక్రబంధంలో ఇరికించుకొని మరిన్ని తప్పులు చేయిస్తాయి.ఆ విషవలయం నుంచి ఎవరైనా బయటపడాలన్నా తమ మీద ఆధారపడటం తప్ప తప్పుకోలేని స్ధితికి నెడతారు. సరిగ్గా అమెరికా కూడా అదే పద్దతులను అనుసరిస్తోంది. పేకాటలో గెలిచేందుకు వేసే ఎత్తుగడల్లో భాగంగా, ఎదుటివారిని మభ్యపెట్టేందుకు కొన్ని పేకలను పడవేయటాన్ని తురుపు ముక్కలు అంటారు. వాటిని చూసి ఎదుటి వారు ఆడితే తప్పుదారి పట్టినట్లే.్ల అమెరికా తన క్రీడలో కూడా అలాంటి తరుపుముక్కలను ఉంచుకుంటుంది. మన దేశం విషాయనికి వస్తే స్వతంత్ర లేదా అలీన విధానాన్ని అనుసరించినపుడు మనకు ఉన్న మిత్రదేశాలెన్ని ఇప్పుడు దూరమయ్యాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. ఆసియాలో మన చుట్టూ ఉన్న అనేక దేశాలు మన నుంచి దూరం జరిగి చైనాకు సన్నిహితం అవుతున్నాయి.అయినప్పటికీ ప్రస్తుత మనపాలకుల వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. చైనా, లేదా మరొకదేశానికి లొంగిపోవాలని లేదా దాని అనుయాయిగా మారాలని ఎవరూ చెప్పటం లేదు. మన రక్షణ, ప్రయోజనాలూ ముఖ్యం. అమెరికా చెప్పుడు మాటలు విని దాని కోసం మనం ఇరుగు పొరుగు వారితో విబేధాలను కొనితెచ్చుకోవటం సరైన వైఖరికాదు. సరిహద్దు సమస్యను ఉభయ దేశాలు పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా ఆర్చేది కాదు తీర్చేది కాదు.


ఐరోపా యూనియన్‌కు మోటారు వంటి జర్మనీలో ఇటీవల ఒక నివేదిక వెలువడింది. మన అపర దేశభక్తులు దాని గురించి ఒక్కసారి చూడటం మంచిదేమో ఆలోచించండి. బిట్స్‌ అండ్‌ చిప్స్‌ అనే వెబ్‌సైట్‌లో సెప్టెంబరు ఒకటవ తేదీన ఒక వార్త వచ్చింది. దానికి పెట్టిన శీర్షిక ” చైనా విషయంలో మనం అమెరికా అజండాను గుడ్డిగా అనుసరించకూడదు ”. జర్మన్‌ ఎకనమిక్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించిన ఒక నివేదిక మీద సమీక్ష మాదిరి రాశారు. ఐరోపా ఎగుమతి వస్తాదుగా ఉన్న జర్మనీ ఇటీవలి కాలంలో చైనాతో ఓడిపోతోంది అని పేర్కొన్నారు. ఇదే వెబ్‌సైట్‌లో అంతకు ముందు విశ్లేషణ రాసిన సానే వాన్‌డెర్‌ లగట్‌ ఇలా చెప్పారు.” గావుసియన్‌ అనే చైనా కంపెనీ శుభ్రం చేసే రోబోట్లను ఉన్నతమైన నాణ్యతతో అందచేస్తున్నది. వాటన్నింటి కంటే నేను ఒక ప్రధాన పెద్ద భ్రమ గురించి హెచ్చరిక చేయదలచాను.సాంకేతికంగా ఆసియా దేశాల కంటే ముందున్నామని ఇంకా అనుకుంటున్నాము. దాన్ని మనం కాపాడుకోవాలంటే అపహరించకుండా, కొనుగోలు, కాపీ చేయకుండా చూడాలని అనుకుంటున్నాము. మనం ఒక అంశానికి సిద్దపడటం లేదు, అదేమంటే ఉదారవాద మార్కెట్‌లో మన స్వంత చట్టాల ప్రకారమే మన మాదిరే అనేక కంపెనీలు మరింత ఆధునిక ఉత్పత్తులతో ముందుకు వస్తున్నాయి.”


ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వైదొలిగితే జరిగే పర్యవసానాల గురించి భాగస్వామ్య దేశమని పొగడ్తలు కురిపించిన మనతో లేదా అక్కడికి సైన్యాన్ని పంపిన నాటో కూటమి దేశాలతో కూడా అమెరికా మాట మాత్రం చెప్పకుండా తనదారి తాను చూసుకుంది. మనం బహిరంగంగా తప్పు పట్టకపోగా తాలిబాన్లతో ప్రయివేటు ఒప్పందాన్ని హర్షించాము. చతుష్టయం పేరుతో మన దేశం, జపాన్‌, ఆస్ట్రేలియాలను ముగ్గులోకి దించి చైనాకు వ్యతిరేకంగా నిలబెడుతోంది. జపాన్‌, మనదేశంతో చెప్పకుండానే మిత్రదేశమైన ఫ్రాన్స్‌ ప్రయోజనాలను కూడా దెబ్బతీసి ఆస్ట్రేలియాకు తమ అణుశక్తి జలాంతర్గాములను అమ్ముకొనేందుకు బ్రిటన్‌తో కలసి కొత్త కూటమి అకుస్‌ను ఏర్పాటు చేసింది. మూడు సంవత్సరాలుగా హుబెయి సిఎఫ్‌ఓను కెనడాలో నిర్బంధించిన అమెరికా నాటకీయ రీతిలో కేసులు ఎత్తివేసింది. దాని మాట నమ్మి అరెస్టు చేసిన కెనడా, ఆ చర్యను సమర్ధించిన దేశాలన్నీ ఇప్పుడు తలెత్తుకోలేని స్ధితిలో పడ్డాయి. ఇదంతా ఎందుకు అంటే చైనాతో తన వాణిజ్యాన్ని పెంచుకొనేందుకే అన్నది స్పష్టం. అందుకోసం అమెరికన్లు దేనికైనా సిద్దపడతారు. మనం ఇప్పటికే చాలా దూరం ప్రయయాణించాం. ఎక్కడకు పోతామో తెలియదు. అందువలన మన దేశంలోని అమెరికా గుడ్డి అరాధకులు, భక్తులు ఇప్పటికైనా దాని తోకను వదలి పెట్టటం గురించి ఆలోచించాలి.