Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ గారు అమెరికా పర్యటనకు వెళ్లారు, తిరిగి వచ్చారు. అరవై అయిదు గంటల వ్యవధిలో 20 సమావేశాలలో, ప్రయాణ సమయంలో విమానంలో నాలుగు సమావేశాల్లో పాల్గొన్నారట. తిరిగి వస్తూనే కొత్త పార్లమెంట్‌ భవన సముదాయ నిర్మాణం ఎలా జరుగుతోందో రాత్రిపూట పర్యవేక్షించారు. రాగానే ప్రధాని నిర్మాణ స్ధలాన్ని సందర్శించటంలో పెద్ద విశేషం ఏమీ లేదు గానీ (కరోనా సమయంలో భరోసా ఇచ్చేందుకు ఏ ఆసుపత్రినీ సందర్శించలేదు గానీ అన్న కాంగ్రెస్‌ విమర్శ వేరే అంశం), విదేశాలకు వెళ్లినా, స్వదేశంలో ఉన్నా మన ప్రధానికి పని యావతప్ప మరొకటి ఉండదనే సందేశాన్ని మోడీ మీడియా మేనేజ్‌మెంట్‌ బృందం ఇచ్చిందని చెప్పవచ్చు. తన శరీర ధర్మాన్ని ఎలా కావాలనుకుంటే అలా మార్చుకొనే రహస్యాలు ప్రధాని దగ్గర ఉన్నందున విమాన ప్రయాణ బడలికకు ఏమాత్రం గురికాలేదని, ఎల్లవేళలా ఉత్సాహంగా ఉన్నారని కూడా వార్తలు వచ్చాయి. వాటిని అదేదో అంటున్నారుగా డబ్బిచ్చి రాయించుకోవటం అని అదా, విలేకరులే ఉత్తేజితులై రాశారా అంటే, ప్రధాని వెంట ఎప్పుడూ విలేకర్లు ఉండరు, వారి పొడ గిట్టదని తెలిసిందే.


ఇంత హడావుడి చూసిన తరువాత ఒక సినిమాలో నువ్వు ఎవరు అని ప్రశ్నించినట్లుగా ప్రధాని అమెరికా, ఐరాస పర్యటనలో సాధించింది ఏమిటి అనే అంశం ముందుకు వస్తుంది. ఫలితం వస్తేనే పని చేసినట్లుగా భావిస్తున్న రోజులు కనుక అలాంటి ప్రశ్న వేసిన వారి మీద ఆగ్రహించనవసరం లేదు. అమెరికాలో ఇండియన్‌ అమెరికన్‌ వాణిజ్యవేత్తలతో సహా పలు కంపెనీల అధిపతులతో సమావేశం జరిపినట్లు వార్తలు వచ్చాయి. వారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారా లేక పెట్టుబడుల విషయమై చర్చించారా అన్నది తెలియదు. సులభతర వాణిజ్యంలో మోడీ ఏలుబడిలో 142 నుంచి 63కు ఎదిగిన తరువాత కొత్తగా వారు తెలుసుకొనేదేమి ఉంటుంది-మోడీగారు చెప్పేది మాత్రం ఏం ఉంటుంది ? వచ్చే నెలలో అమెరికా నుంచి ఒక ఉన్నత స్ధాయి బృందం రానుందని వార్తలు.


ప్రధాని పర్యటన ఫలితాలు-పర్యవసానాలు వెంటనే వెల్లడికావాలనేదేమీ లేదు. ఈ పరిమితులను గమనంలో ఉంచుకొని జరిగిన కొన్ని విషయాల గురించి చూద్దాం. మొత్తం మీద మూడు అంశాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఐరాస వార్షిక సమావేశంలో ప్రసంగించటం, రెండవది అమెరికా, జపాన్‌,ఆస్ట్రేలియా, భారత్‌లతో ఏర్పడిన చతుష్టయ కూటమి శిఖరాగ్ర సమావేశంలో చైనా, పాకిస్తాన్‌లకు గట్టి పరోక్ష హెచ్చరిక , ఈ సందర్భంగా వాణిజ్య ప్రముఖులు ఇతరులతో భేటీ కావటంగా చెప్పవచ్చు.బిజెపి నేతలు ఈ పర్యటన ఒక చారిత్రాత్మక మలుపు అన్నట్లుగా చిత్రించారు. వెంపల చెట్లను నిచ్చెనలతో ఎక్కే జనాలున్న రోజులివి. కొత్తగా జరిగిన పరిణామాలేవీ లేవు, కొత్తగా పొరుగుదేశాలకు చేసిన హెచ్చరిక ఏమిటన్నది ఒక బ్రహ్మపదార్దం.ఐరాస, ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ బహుముఖ సంస్థలు అసంగతమైనవిగా మారాయని వాటిని సంస్కరించాలని కోరారు. వాస్తవమే, ఇది కూడా పరోక్ష వ్యవహారమే.భద్రతా మండలిలో శాశ్వత స్ధానం కావాలని మనం కోరుతున్నాం. ఆ హౌదా ఉన్న దేశాలు దాన్ని దేనికి వినియోగిస్తున్నాయన్నది వివాదాస్పదం, ప్రజాస్వామ్య విరుద్దం. ఆ హక్కు ఎవరికీ ఉండకూడదు. ఐరాస జనరల్‌బాడీ లేదా భద్రతా మండలి మెజారిటీ తీర్మానాలను ఏ ఒక్కదేశం వీటో చేసినా అవి చెల్లవు. అలాంటి హక్కును మనం కోరుతూ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాఠాలు చెబుతున్నాం. అయినా చైనాతో సహా అందరూ మనకు మద్దతు పలుకుతున్నారు. ఇదే సమయంలో మనతో సహా ఎవరి రాజకీయం వారు చేస్తున్నందున అది ముందుకు పోవటం లేదు, ఆశ కూడా కనిపించటం లేదు.


తిరోగామి దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఐరాసలో ప్రధాని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ గడ్డను ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా ఉపయోగించటాన్ని అనుమతించకూడదని, ఏ దేశమూ అక్కడి పరిస్ధితిని వినియోగించుకొనేందుకు వీల్లేకుండా చూడాలనీ చెప్పారు, నిజమే, ఆ పేరుతో ఇరవై ఏండ్లు ప్రత్యక్షంగా మరో 23 ఏండ్లు పరోక్షంగా అమెరికా చేసింది ఏమిటో పరోక్షంగా అయినా చెప్పి ఉంటే మరింత ఘనంగా ఉండేది. అమెరికా, దానికి ఇంతకాలం మద్దతు ఇచ్చిన మనం ఏ రకమైన దేశాల జాబితాలోకి వస్తాం ? ఉగ్రవాదంపై పోరు పేరుతో అమెరికా ఆప్ఘనిస్తాన్‌లో మిలిటరీ జోక్యం చేసుకుంది. అక్కడి జనజీవితాలను అతలాకుతలం గావించింది. తాలిబాన్‌, ఇతర ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన పాకిస్తాన్‌కు ఆయుధాలతో సహా అన్ని రకాల మద్దతు ఇచ్చింది. మాదారిన మేం పోతాం మా జోలికి రావద్దు అని వారితోనే ఒప్పందం చేసుకుంది, అయినా ఒక్క మాట అనేందుకు మనకు ధైర్యం లేదు.


ప్రధాని అంతర్జాతీయ వేదిక మీద తన గురించి తాను పొగుడుకోవటాన్ని ఎవరైనా తప్పు పడితే వారి మీద విరుచుకుపడితే కుదరదు. ఇతరులు పొగిడితే అందం చందం. మనల్ని మనమే పొగుడుకుంటే ”చాల బాగోదు ”. ఒక రోజు రైల్వే స్టేషన్‌లో తేనీరు అమ్మేందుకు తన తండ్రికి సహకరించిన ఒక చిన్న కుర్రవాడు నేడు నాలుగోసారి ఐరాస సమావేశంలో ప్రసంగించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం అని మోడీ తన గురించి చెప్పుకున్నారు. అయితే అదే చిన్న కుర్రవాడు పెద్దయిన తరువాత ఆ రైల్వేస్టేషన్లను ఏం చేయచూస్తున్నారో చూస్తున్నదే. ఆ కుర్రవాడి ఊరి రైల్వే స్టేషన్‌ తేనీరు అమ్మేంత పెద్దది కాదని, అందుకు ఆధారాలేవీ లేవని మన దేశ మీడియాలో వచ్చిన వార్తలను చదువుకున్న విదేశీయులు భారత ప్రధాని గురించి ఏమనుకుంటారు ? కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్లుగా మనం వదిలేద్దాం.


అమెరికా పర్యటనలో నరేంద్రమోడీ సాధించిందేమిటి అనే ప్రశ్నకు మోడీ అద్భుత అమెరికా సందర్శన – ప్రదర్శన ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు ఒక మూలమలుపు అని బిజెపి అధికార ప్రతినిధి తుహిన్‌ ఏ సిన్హా ఏకంగా ఒక పెద్ద వ్యాసమే రాశారు. ఎవరికైనా అలా అనిపించిందా ? ప్రతి సందర్భంలోనూ చాతుర్యం ప్రదర్శించారని, సునాయాసంగా, ఎంతో చక్కగా ఐరాసలో ప్రసంగించారని వర్ణించారు. హిందీ, గుజరాతీలో ఆయన మంచి వక్త అని కొత్తగా చెప్పాల్సిందేముంది. మోడీ ప్రసంగం ప్రపంచంలో ఏదైనా కొత్త పరిణామానికి నాంది పలికిందా, దానికి సూచనలు కూడా లేవు. అందుకే ఒరిగిందేమిటి అనాల్సి వస్తోంది. 1950దశకంలో మనకు భద్రతా మండలిలో శాశ్వత స్ధానం దక్కే అవకాశాన్ని నెహ్రూ చైనాకు వదలివేశారని బిజెపి ప్రతినిధి గోబెల్స్‌ ప్రచారాన్ని పునరుద్ఘాటించారు. భద్రతా మండలిలో చైనాకు శాశ్వత స్దానం వచ్చిన 1945లో మనకు అసలు స్వాతంత్య్రం రాలేదు, చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి రాలేదు, వచ్చిన 1949 నుంచి 1971వరకు కమ్యూనిస్టు చైనాకు ఐరాసలో అసలు గుర్తింపే లేదు. తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ ప్రభుత్వాన్నే అసలైన చైనా పేరుతో కథ నడిపించిన చరిత్ర దాస్తే దాగేది కాదు.


ప్రస్తుతం భద్రతా మండలిని విస్తరించాలనే మల్లగుల్లాల్లో భాగంగా భారత్‌, జపాన్‌, జర్మనీ,బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. భారత్‌ విషయంలో ఒక్క పాకిస్తాన్‌ తప్ప చైనాతో సహా మరేదేశమూ అభ్యంతరం చెప్పలేదు. తమ దేశాలపై యుద్దనేరాలకు పాల్పడిన జపాన్‌ వైపు నుంచి ఇప్పటికీ సరైన పశ్చాత్తాపం లేనందున చైనా, ఉత్తరకొరియా, వియత్నాం వంటి దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.ఇటలీ పరోక్షంగా జర్మనీకి వ్యతిరేకంగా ఉంది. మరికొన్ని ఐరోపా, ఆఫ్రికాదేశాలు కూడా జర్మనీని వ్యతిరేకిస్తున్నాయి.బ్రెజిల్‌ను కొన్ని లాటిన్‌ అమెరికా దేశాలు అంగీకరించటం లేదు. మన దేశాన్ని తన అనుయాయిగా మార్చుకొనేందుకు తెరవెనుక మంతనాల్లో నెహ్రూ ప్రభుత్వానికి అమెరికా భద్రతా మండలి శాశ్వత స్ధానం అనే బిస్కెట్‌ను వేసింది. మాక్కూడా ఇస్తే అంగీకారమే గాని చైనాను తప్పించి ఆ స్ధానం మాకు అవసరం లేదు అని నెహ్రూ చెప్పారు. ఇప్పుడు మన దేశం జపాన్‌కు మద్దతు ఇస్తున్నది. మీ సంగతి మీరు చూసుకోండి తప్ప జపాన్‌కు మద్దతు మానుకోవాలని మన దేశానికి చైనా చెబుతున్నది. నాటి నెహ్రూ వైఖరిని తప్పుపడుతున్న నేటి నరేంద్రమోడీ సర్కార్‌, బిజెపి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందా ? అలా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.అలాంటి వారికి నెహ్రూను విమర్శించే నైతిక హక్కు ఎక్కడ ఉంది ?


నరేంద్రమోడీ అమెరికా పర్యటనలో చతుష్టయ(క్వాడ్‌) సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఇది మిలిటరీ కూటమి కాదు, చైనాకు వ్యతిరేకం కాదని గతంలో మన దేశ వైఖరి గురించి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు. ఇప్పుడు నరేంద్రమోడీ వైఖరిలో అంత స్పష్టత లేదు. అది ఎత్తుగడ లేదా ముసుగు కావచ్చు, కానీ ఒక పార్టీగా బిజెపి అధికార ప్రతినిధి ఏం చెబుతున్నారు ? బ్రెజిల్‌, రష్యా, ఇండియా,చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్‌ కూటమి 2006లో ఏర్పడింది. అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, భారత్‌తో కూడిన చతుష్టయం(క్వాడ్‌) 2007లో ఉనికిలోకి వచ్చింది. బ్రిక్స్‌ అవసరార్ధం, ఎడముఖం పెడముఖంగా ఉండేదేశాలతో ఏర్పడిందని, అంతగా అయితే రద్దు చేయకుండానే సార్క్‌ మాదిరి వదలివేయవచ్చట. పురోగామి ప్రజాస్వామిక దేశాలతో కూడిన చతుష్టయం సహజంగా ఉనికిలోకి వచ్చిందట. జగడాలంటే ఇష్టపడటం దాని స్వభావమట. ఎవరి మీద ? ఇది ఎల్లవేళలా చైనాకు వ్యతిరేకంగానే కనిపిస్తుందని,కమ్యూనిస్టు-ఇస్లామిస్టు కూటమికి వ్యతిరేకంగా పని చేసేందుకు అని కూడా బిజెపి ప్రతినిధి సెలవిచ్చారు. లడఖ్‌ సరిహద్దు వివాదం ఎందుకు,ఎలా జరిగిందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చేమో !అంతేకాదు, భవిష్యత్‌ ప్రపంచ రాజకీయాలను మలచటంలో చతుష్టయం భారత్‌కు అత్యంత అనుకూల స్ధానాన్ని చేకూర్చుతుందని కూడా చెప్పారు. ఇక ఐరాస ప్రసంగంలో మోడీగారు చెప్పిన అంశాలలో ” భారత్‌ అభివృద్ది చెందినపుడు ప్రపంచం అభివృద్ధి చెందుతుంది… భారత్‌ సంస్కరణలు అమలు జరిపినపుడు ప్రపంచం మారుతుంది ” దీని మీద వ్యాఖ్యానించనవసరం లేదు. ఒకవైపు చతుష్టయ రాజకీయం చేస్తూనే మరోవైపు అకుస్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియాకు అణుపరిజ్ఞానాన్ని అంద చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు. దీంతో చతుష్టయం కూడా ఒక బాతాఖానీ కేంద్రంగా మారుతుందని కొందరు చెబుతున్నారు. దీనితో చైనాను దెబ్బతీసే అవకాశం మనకు వచ్చిందని బిజెపి చెబుతోంది.


మోడీ గారి అమెరికా పర్యటనలో పెద్ద జోక్‌ పేలింది. జో బైడెన్‌, నరేంద్రమోడీ ఇద్దరూ మాట్లాడుకొనేందుకు అధ్యక్ష భవనంలో సమావేశమయ్యారు.అప్పుడు బైడెన్‌ మన ప్రధాని మోడీతో మాట్లాడుతూ అమెరికా కంటే భారత మీడియా చాలా మెరుగ్గా ప్రవర్తిస్తుంది.మీరు అనుమతిస్తే నేను ఒక్క మాట చెబుతాను. పత్రికల వారిని తీసుకొచ్చేట్లున్నారు. మనం వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవద్దు, ఎందుకంటే వారు నిర్దిష్ట అంశం మీద ఏ ప్రశ్నా అడగరు” అన్నాడు. మరొక వార్త ప్రకారం అమెరికా జర్నలిస్టులు ఏ అంశం మీదా సరిగా ప్రశ్నలు అడగరని వాటికి మీరు సమాధానం చెప్పలేరని అన్నట్లుగా ఆర్‌ఎన్‌సి రిసర్చ్‌ రాసింది. ఏదైనా జరిగి ఉండవచ్చు గానీ, అసలు నరేంద్రమోడీ భారత్‌లో కూడా మీడియాతో ఇంతవరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మాట్లాడలేదు, అస్సలు నోరు విప్పరు అనే అంశం జో బైడెన్‌కు తెలియదా, అంతటి అమాయకండా ఉన్నాడా ? అసలు విషయం ఏమంటే అమెరికా మీడియా నరేంద్రమోడీ గురించి అనేక విమర్శనాత్మక కథనాలు రాసింది. అందువలన తమ దేశ మీడియాను బైడెన్‌ అవమానిస్తూ మాట్లాడి మోడీని సంతోషపెట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఇదే సమయంలో అమెరికన్‌ మీడియా మీద జోబైడెన్‌ కూడా వివిధ కారణాలతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఉనికే సహించటం లేదని చతుష్టయ సమావేశాల సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో బైడెన్‌ భేటీ సందర్భంగా వెల్లడైంది. సిబ్బంది విలేకర్లను దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు.


సాధారణంగా ఒక ప్రాంతానికి అలవాటు పడినవారు మరో చోటికి వెళ్లినపుడు అందునా నిద్రవేళలు పూర్తిగా తారుమారైపుడు నిద్రపట్టకపోవటం, అలసి పోవటం, అక్కడి సమయాలకు వెంటనే అనువుగా అలవాటు పడకపోవటం తెలిసిందే. అయితే నరేంద్రమోడీ ఎక్కడికి వెళ్లితే అక్కడి సమయాలకు అనుగుణంగా విమానం ఎక్కగానే తన శరీర ధర్మాన్ని మార్చుకుంటారని ఆయనను అనుసరించిన వారు చెప్పినట్లు వార్త వెలువడింది. ఇవన్నీ సిబ్బంది చెప్పి రాయించిన వార్తలన్నది స్పష్టం. సాధారణ వ్యక్తులకే ఎంతో పని ఉంటుంది, అలాంటిది ప్రధాని మోడీ తన ముమ్మర కార్యక్రమాలకు అనుగుణ్యంగా ఉన్నత స్ధాయిలో శక్తిని ప్రదర్శించేలా తన శరీరాన్ని ఉంచుకున్నారని, ఎంత వత్తిడి ఉన్నా, ఎన్ని గంటలైనా ఎల్లవేళలా ఉల్లాసంగా విదేశీ ప్రయాణాల్లో ఉంటారని కూడా రాశారు. అలసటను జయించిన ప్రధాని అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, విమానబడలికకు దూరంగా ఉన్న ప్రధాని రహస్యాలు అనే అర్ధంతో హిందూస్తాన్‌టైమ్స్‌ పత్రికలు ప్రత్యేక కథనాలు రాశాయి.వీటిని ఆధారం చేసుకొని పిటిఐ వార్తా సంస్థ తన కథనాన్ని వండి వార్చింది. విమానాల్లో ప్రయాణించేటపుడు శరీరంలోని తడి ఆరిపోతుంది కనుక వైద్యుల సలహామేరకు ప్రధాని నీటిని ఎక్కువగా తాగుతారని పేర్కొన్నది.1990 దశకంలో నెలవారీ టిక్కెట్లు తీసుకొని రైల్లో తిరిగినట్లుగా మోడీ అమెరికా వెళ్లివచ్చేవారట. రాత్రిపూటే ప్రయాణించటం, విమానాలు లేదా విమానాశ్రయాల్లోనే సేద తీరేవారు తప్ప హౌటళ్లకు ఒక రూపాయి కూడా ఖర్చు చేసే వారు కాదట.

గోద్రా ఉదంత అనంతర గుజరాత్‌ మారణకాండ తరువాత నరేంద్రమోడీ పర్యటనకు అమెరికా అసలు వీసా ఇవ్వలేదని తెలిసిందే. ప్రధాని అయిన తరువాతే వెళ్లారు. అంతకు ముందు ఒక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌గా అంతగా అమెరికాలో పని ఏమి ఉండి ఉంటుంది,1993లో ఒక్కసారి అమెరికా వెళ్లి అక్కడి సినిమా స్టూడియోలను సందర్శించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ఇతరంగా ఫొటోలు అంతర్జాలంలో దర్శనమిచ్చాయి. పోనీ రోజుకు ఒకసారి వెళ్లివచ్చారనే అనుకుందాం. నష్టం ఏముంది ? ఎన్నికల ప్రచారం వంటి సందర్భాలలో ప్రముఖుల ప్రచారశైలి గురించి మీడియా రాయటం తెలిసిందే, దాన్ని అర్ధం చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణాల్లో శరీరధర్మాన్ని మార్చుకోవటం వంటి అతిశయోక్తులు వ్యక్తిపూజకు నిదర్శనం. ఇలాంటి అంశాలు గతంలో కూడా అనేక మంది ప్రముఖుల గురించి రాసిన విషయం తెలిసిందే. నరేంద్రమోడీ కూడా ఆ కీర్తి కండూతి జాబితాలో చేరిపోయారు.ప్రత్యేకత ఏముంది ? ఇలాంటి వార్తలు, లేదా వ్యక్తిగత అలవాట్ల గురించి రాసి భక్తులను ఆనందపెట్టటం తప్ప దేశానికి జరిగే ప్రయోజనం ఏముంది ? బిజెపి నేతలు చెబుతున్నట్లు ప్రపంచ రాజకీయాలను మోడీ గారు ఎలా మలుస్తారో, చారిత్రాత్మకం ఏమిటో తరువాతైనా కనిపిస్తాయోమో చూద్దాం !

.