Tags
Anti China Propaganda, Anti communist, Austrian Communist Party, I Love Communism, Left politics, Styrian capital Graz
ఎం కోటేశ్వరరావు
మారిన పరిస్ధితులను గమనించకుండా మొరటుగా వ్యవహరిస్తే ఏమౌతుందో అమెరికాలోని ఒక స్కూలు పిల్లలు నిరూపించారు. కరోనా నిరోధ చర్యల్లో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని హంటింగ్‌టన్ బీచ్ హైస్కూలు అధికారులు మాస్కులు ధరించి రావాలని పిల్లలను ఆదేశించారు. అయితే మాస్కులను వ్యతిరేకిస్తున్న బయటి వారు కొంత మంది వారం రోజుల క్రితం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో స్కూలు దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. మాకు నిరసన తెలిపే హక్కు ఉంది, రోజంతా ఇక్కడే ఉంటాం అని మెగాఫోన్‌లో ఒక వ్యక్తి ప్రకటించాడు. అంతటితో ఆగలేదు. మాస్కులు పెట్టుకున్న పిల్లలను చూసి ఈ గుంపును చూస్తుంటే కమ్యూనిజానికి మద్దతు ఇచ్చే విధంగా వీరి బుద్ది శుద్ది చేసినట్లుగా ఉంది అంటూ తన వద్ద ఉన్న కెమెరాను వారి వైపు తిప్పాడు. దాంతో ఒక బాలిక కమ్యూనిజం అంటే ఏమిటో చెప్పండి అని అతగాడిని ప్రశ్నించింది. చూస్తుంటే మీకు అదేమిటో తెలిసినట్లు లేదు అన్నాడతడు. మాకు కమ్యూనిజం అంటే ఇష్టం అని ముక్తకంఠంతో పిల్లలు అరిచారు. అయితే మీరు క్యూబా ఎందుకు పోలేదు అని నోరు పారవేసుకున్నాడతడు. దాంతో మరో పిల్ల నేను క్యూబన్నే అంది. నువ్వు క్యూబన్ అంతే కదా అంటే నువ్వొక క్యూబన్ పిచ్చిగొడ్డువి, నువ్వొక బుద్దిలేని క్యూబన్ ఆడదానివి అంటూ బూతులకు దిగాడు. దాంతో ఒళ్లు మండిన పిల్లలంతా ఒక్కుమ్మడిగా బుద్దిలేని వాడివి నువ్వు, చండాలమైన శ్వేతజాతి దురహంకారివి అంటూ ముందుకు వచ్చి నేను కమ్యూనిజాన్ని ప్రేమిస్తాను అంటూ కెమెరా వైపు వేళ్లు చూపుతూ నినాదాలు చేశారు.
దాంతో గుక్కతిప్పుకోలేని అతగాడు ఓV్‌ా మీరంతా కమ్యూనిస్టులన్నమాట, నేను తెలుసుకుంటాను, అలా అయితే మీరు ఉండకూడని దేశంలో ఉన్నారు. అంటూ వారి వద్ద నుంచి జారుకున్నాడు. తరువాత కెమెరా ముందు మాట్లాడుతూ మన పిల్లల బుద్దిని ఇలా శుద్ది చేశారు, వారు కమ్యూనిజాన్ని ఆరాధిస్తున్నారు. స్వేచ్చను ద్వేషిస్తున్నారు. వారిని చూడండి అందరూ కమ్యూనిస్టులు, వారిని మనం భరించాలి. పాఠశాల వ్యవస్ధ మన పిల్లలకు ఇలాంటి బోధన చేస్తోంది అని వ్యాఖ్యానించాడు. ఈ ఉదంతాన్ని చిత్రించిన ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఒక విద్యార్ధి ” మేము కేవలం స్కూలు పిల్లలం, ఇలాంటి నిరసన అవాంఛనీయం. రోజంతా స్కూల్లో ఉన్నాం, ఈ నిరసన గురించి మాకు తెలియదు, ఇలాంటి వారిని ఎదుర్కొనే శక్తికూడా మాకు లేదు అని వ్యాఖ్యానించింది. నిరసన కారులు పాఠశాల బయటే ఉన్నందున పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.న్యూస్‌వీక్ వంటి పత్రికలు ఈ ఉదంతం గురించి రాశాయి. ఈ నిరసన ఘటన మీద తలిదండ్రులు నిరసన తెలిపారు. విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని నిరసన తెలపటం ఏమిటని అభ్యంతర పెట్టారు. మాస్కు ధరించాలా లేదా అన్నది స్కూలు కమిటీలు నిర్ణయిస్తాయి. టీచర్లు, విద్యార్ధులు ఆ నిర్ణయాల మీద అభిప్రాయాలు చెప్పవచ్చు తప్ప అంతిమ నిర్ణయం కమిటీలదే.అమెరికాలో కమ్యూనిస్టు పార్టీకి పార్లమెంటులో సీట్లు లేవు. ఓటర్లను ప్రభావితం చేయగల పరిస్ధితి కూడా లేదు. అయినా కమ్యూనిస్టు సిద్దాంతాన్ని మేము ప్రేమిస్తామని స్కూలు పిల్లలు కూడా చెబుతున్నారంటే అర్ధం ఏమిటి ? పెట్టుబడిదారీ విధానం తమను ఉద్దరించదు అని వారికి కూడా తెలిసిపోతోందనే కదా ! గతంలో కమ్యూనిజం విఫలమైందనే బోధనలు విన్న అమెరికన్లు ఇప్పుడు తమ అనుభవంలో పెట్టుబడిదారీ విధానం విఫలమైంది, కమ్యూనిజమే మెరుగని భావిస్తున్నారు. ముఖ్యంగా యువతలో అలాంటి ధోరణులు పెరుగుతున్నాయి. అదే ఈ స్కూల్లో కూడా ప్రతిబింబించింది.
పొద్దున లేస్తే చైనాలో మానవహక్కులు లేవు, మట్టి లేవు అంటూ ప్రచారం చేసే దేశాలలో బ్రిటన్ ఒకటి. ఊరందరినీ ఉల్లిపాయ తినొద్దని చెప్పాను తప్ప మనింట్లో వేయవద్దన్నానా అని మండిపడిన బోధకుడి కధ తెలిసిందే. బ్రిటన్ తమ దేశంలో ఉద్యోగవిరమణ చేసిన వారి పెన్షన్ నిధులను అదే చైనాలో పెట్టుబడులుగా పెడుతోంది. ఇటీవలి నెలల్లో బ్రిటన్ పెన్షన్ నిధులు, ఇతర పెట్టుబడి సంస్ధలు చైనాలో పెట్టిన పెట్టుబడులు కొత్త రికార్డు నెలకొల్పినట్లు హాంకాంగ్ వాచ్ అనే సంస్ధ తాజాగా ప్రకటించింది. చైనా మీద విమర్శలు చేసే విధాన నిర్ణేతలు, ప్రజానాయకులు-పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకొనే నిపుణుల మధ్య సమాచార, అవగాహన దూరం ఉందని, బాధ్యత లేకుండా ఉన్నారని ఆ సంస్ధ ధ్వజమెత్తింది. ఆర్ధిక వ్యవస్ధలకు లాభాలు తప్ప సామాజిక పరంగా పడే ప్రభావాలు పట్టటం లేదని వాపోయింది. ఝెజియాంగ్ దహువా టెక్నాలజీస్ అనే సంస్ధ ముఖాలను గుర్తించే ఒక సాఫ్ట్‌వేర్‌ను కమ్యూనిస్టు పార్టీకి తయారు చేసి ఇచ్చిందట. అది మనుషుల్లో ఎవరు ఏ జాతి వారో గుర్తు పడుతుందట. దానిలో భాగంగా యుఘీర్ ముస్లింలను గుర్తించి పార్టీకి తెలియచేస్తుందట. ఆ సంస్ధలో లీగల్ అండ్ జనరల్ అనే నిధుల సంస్ధ పెట్టుబడి పెట్టిందట. ముస్లింలను గుర్తించే ఉత్పత్తి చేసినట్లు తెలిసిన తరువాత అక్కడి నుంచి తీసుకొని వేరే కంపెనీల్లో పెట్టిందట. దానితో పాటు యూనివర్సిటీస్ సూపర్‌యాన్యుయేషన్ స్కీము(యుఎస్‌ఎస్) అనే సంస్ధ కూడా ఈఏడాది మార్చి ఆఖరుకు చెనా అలీబాబా, టెన్సెంట్ కంపెనీలలో 80 కోట్ల పౌండ్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది.ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటైన చైనాలో పెట్టుబడులు పెట్టాలని రిషి సునాక్ అనే ఛాన్సలర్ ప్రోత్సహించినట్లు కూడా హాంకాంగ్ వాచ్ పేర్కొన్నది. ఈ గ్రూప్ ఇంతగా స్పందించటానికి కారణం అది చైనా నుంచి హాంకాంగ్ వేర్పాటును సమర్ధిస్తున్నది.లీగల్ అండ్ జనరల్ సంస్ధ తాజాగా కూడా పెట్టుబడులను విస్తరించాలని చూసినట్లు లండన్ పత్రిక టెలిగ్రాఫ్ రాసింది. ఒక్క బ్రిటన్ సంస్ధలే కాదు, అమెరికా, ఐరోపాలకు చెందిన అనేక సంస్ధలు చైనా మార్కెట్లో లాభాల కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్నాయి.
హిట్లర్‌కు జన్మనిచ్చిన ఆస్ట్రియా తరువాత కాలంలో అదే హిట్లర్ దురాక్రమణకు గురైంది. తరువాత 1955లో తటస్ధ రాజ్యంగా ప్రకటించుకుంది. 1959 నుంచి పార్లమెంట్‌లో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లేదు.అలాంటి చోట రాజధాని వియన్నా తరువాత మూడు లక్షల జనాభాతో రెండవ పెద్ద నగరంగా ఉన్న గ్రాజ్ కార్పొరేషన్ ఎన్నికలలో అనూహ్యంగా కమ్యూనిస్టులు పెద్ద పక్షంగా ఎన్నికయ్యారు. పార్టీలో ఎంత మంది ఉన్నారు అని గాకుండా ఆశయం కోసం పని చేస్తే ఎక్కడైనా కమ్యూనిస్టులను జనం ఆదరిస్తారు అనే అంశం ఇక్కడ ముఖ్యం. పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదే, మనల్ని ఎవరు ఆదరిస్తారు అని అక్కడి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించి ఉంటే అసలు ఎర్రజెండానే ఎగిరేది కాదు. పద్దెనిమిది సంవత్సరాలు విరామం లేకుండా అధికారంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేక మితవాద పార్టీని ఓడించి కమ్యూనిస్టులు ఇలా ముందుకు వస్తారని ఎవరూ ఊహించలేదు.వారికి 48 డివిజన్లు ఉన్న కార్పొరేషన్‌లో 28.8శాతం ఓట్లు, 15 సీట్లు వచ్చాయి. గ్రీన్స్ పార్టీకి తొమ్మిది వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసేందుకు అవకాశం ఉంది, అయినా మెజారిటీకి ఒక ఓటు తక్కువ గనుక మరొక పక్షం మద్దతు అవసరం. దాని గురించి సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇక్కడ ఒక కార్పొరేషన్‌లో అధికారం రావటం ముఖ్యం కాదు. పక్కనే ఉన్న తూర్పు ఐరోపా సోషలిస్టు దేశాలు, సోవియట్ యూనియన్ కూలిపోయాయి. కమ్యూనిస్టు వ్యతిరేకులు రెచ్చిపోతున్నారు. చుట్టూ కనుచూపు మేరలో కమ్యూనిజం గురించి ఆశారేఖలు కనిపించని చోట ఎర్రజెండాను ఎత్తుకొని నిలవటం, దాని మీద ఉన్న అచంచల విశ్వాసం ప్రదర్శించటం. ఊపుగా ఉన్నపుడు జండాను పట్టుకొని ముందువరుసలో హడావుడి చేయటం, ఎదురుదెబ్బలు తగలగానే పత్తాలేని వారిని ఎందరినో చూస్తున్న తరుణంలో ఏ ఆశారేఖ ఆస్ట్రియా కమ్యూనిస్టులను ముందుకు నడిపించిందో అందరూ అధ్యయనం చేయటం అవసరం. ఆస్ట్రియా ప్రస్తుతం మితవాదశక్తుల పట్టులో ఉంది. అలాంటి చోట ఎర్రజెండా ఎగిరింది.
తొమ్మిది రాష్ట్రాల ఫెడరేషన్ ఆస్ట్రియా, జనాభా 90లక్షలు. వాటిలో ఒక రాష్ట్రం స్ట్రిరియా, దాని రాజధాని గ్రాజ్. అక్కడే కమ్యూనిస్టులు విజయం సాధించారు. జాతీయ ఎన్నికల్లో ఒకశాతం ఓట్లు మాత్రమే సాధిస్తున్నా, ఈ రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఇరవైశాతం ఓట్లు తెచ్చుకొంటోంది. పార్టీకి నిబద్దులైన నాయకులు,కార్యకర్తలు నిరంతరం జనం, వారి సమస్యల పట్ల స్పందించటం, మిగిలిన పార్టీలన్నీ ప్రయివేటీకరణ ప్రవాహంలో కొట్టుకుపోయినా వ్యతిరేక వైఖరి తీసుకోవటం సరైనదని జనం గుర్తించారు.అందుకే రాజధాని నగరంలో పెద్ద పార్టీగా ఎన్నికైంది.1991లో అద్దెకుండే వారి సమస్యలను తీసుకొని జనానికి దగ్గరకావటంతో పాటు, పార్టీ లీగల్ సాయం కూడా అందించటంతో జనంలో విశ్వాసం ఏర్పడింది. తమ ఆదాయంలో 55శాతం అద్దెలకే చెల్లిస్తున్న తరుణంలో మూడోవంతు కంటే ఎవరి నుంచీ అద్దె వసూలు చేయకూడదని గ్రాజ్ పట్టణ కౌన్సిల్లో కమ్యూనిస్టు పార్టీ ఒక తీర్మానం పెట్టింది, దాన్ని మిగతా పార్టీలనీ తిరస్కరించాయి. అయితే చట్టంలో ఉన్న ఒక అవకాశాన్ని వినియోగించుకొని పదిహేడువేల మంది ప్రభుత్వ గృహాల్లో ఉండేవారు, అద్దెకుండే వారి నుంచి సంతకాలు సేకరించి తిరిగి అదే తీర్మానాన్ని ప్రవేశపెట్టటంతో ఏకగ్రీవ ఆమోదం పొందింది.1998లో కమ్యూనిస్టు పార్టీ 7.9శాతం ఓట్లు పొందింది. అప్పటి పాలక సంస్ధ కమ్యూనిస్టు పార్టీ నేత కాల్ట్‌నెగర్‌కు గృహాల స్ధాయీ సంఘ బాధ్యత అప్పగించింది. దాని నిర్వహణలో పార్టీ వైఫల్యం చెందుతుందనే దురాలోచన మిగతా పార్టీల్లో ఉంది. అయితే అనుకున్నదొకటి జరిగింది మరొకటి అన్నట్లుగా ప్రభుత్వం ఇచ్చిన గృహాలకు అంతకు ముందు కంటే భిన్నంగా ప్రతి ఇంటికి విడిగా మరుగుదొడ్డి, స్నానాలగది ఉండేట్లు కమ్యూనిస్టు నేత సాధించారు. దాంతో మరుసటి ఎన్నికల్లో పార్టీ 20.8శాతం ఓట్లు పొందింది.
కౌన్సిల్లో ఉన్న ప్రాతినిధ్యంతో పాటు బయట పార్టీ వైపు నుంచి కూడా ఉద్యమాలతో వత్తిడి తేవటంతో కమ్యూనిస్టులు, మిగతా పార్టీలకు ఉన్న తేడాను జనం గమనించారు. ఎన్నికలు జరిగిన మరుసటి ఏడాది 2004లో పట్టణంలోని ప్రభుత్వ గృహాలను ప్రయివేటీకరించేందుకు మిగిలిన పార్టీలన్నీ అంగీకరించినా కమ్యూనిస్టుపార్టీ అడ్డుకుంది. అదే సమయంలో పక్కనే ఉన్న జర్మనీలో సంకీర్ణ కూటమిలో అధికారంలో ఉన్న వామపక్ష డైలింక్ పార్టీ గృహాల ప్రయివేటీకరణ చేసింది. దానితో పోల్చుకున్న గ్రాజ్ పట్టణ ప్రజలు ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ వైఖరిని ప్రశంసించారు. పదివేల మంది సంతకాలు సేకరించి ప్రయివేటీకరణ జరపాలా లేదా అని అధికారయుతంగా పట్టణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపే విధంగా కమ్యూనిస్టులు చేసిన కృషి ఫలించింది. పౌరుల్లో 96శాతం మంది ప్రయివేటీకరణను వ్యతిరేకించటంతో అది ఆగిపోయింది.
అక్కడి నిబంధనల ప్రకారం దామాషా పద్దతిలో వచ్చిన ఓట్లను బట్టి నగరపాలక సంస్ధలో సీట్లు కేటాయిస్తారు. అ విధానం కూడా కమ్యూనిస్టులకు అనుకూలించింది. పార్టీ ప్రతినిధులు ఎన్నడూ పాలకపక్షంగా లేకపోయినా రోడ్లు, రవాణా, ఆరోగ్య స్ధాయీ సంఘాలకు బాధ్యత వహించి పౌరుల మన్ననలు పొందారు. వృద్దులు ఆసుపత్రులకు పోనవసరం లేకుండా ఇంటి దగ్గరే సేవలు పొందేందుకు అవసరమైన అలవెన్సును అందచేసే ఏర్పాటు చేశారు. అన్నింటికీ మించి కరోనా సమయంలో ఆరోగ్య స్ధాయీ సంఘబాధ్యతలో ఉన్న కమ్యూనిస్టు నేత చేసిన కృషి ప్రశంసలు పొందింది.ఈ ఎన్నికల్లో అది ప్రతిఫలించి పార్టీని ప్రధమ స్ధానానికి చేర్చింది. కమ్యూనిస్టువ్యతిరేక వాతావరణం పరిసర దేశాల్లో ఉన్నప్పటికీ ఆస్ట్రియా కమ్యూనిస్టులు అవసరమైనపుడు తాము మార్క్స్, ఎంగెల్స్, లెనినిజాలకు కట్టుబడి ఉన్నామని బహిరంగంగా చెప్పారు, గర్వపడ్డారు.
సోవియట్ కాస్మొనాట్ యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లి ఆరుదశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ ఉత్సవాలను జరపాలని పిలుపు ఇచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకొని అన్ని రకాల భావజాలాలను వ్యతిరేకిస్తున్నట్లు, వాటికి దూరంగా ఉంటామని అన్ని పార్టీలూ నగరపాలక సంస్ధలో ఒక తీర్మానం ద్వారా వెల్లడించాలని అధికార మితవాద ఓవిపి పార్టీ ప్రతిపాదించింది. కమ్యూనిస్టులు తప్ప వామపక్షంగా చెప్పుకొనే గ్రీన్స్, ఎస్‌పిఓతో సహా అన్ని పార్టీలు ఆమోదించాయి. చరిత్ర గురించి ఎవరికి వారు చర్చించి వైఖరి తీసుకోవాలి తప్ప కమ్యూనిజాన్ని-నాజీజాన్ని ఒకే గాటన ఎలా కడతామని కమ్యూనిస్టు పార్టీ ప్రశ్నించింది. దాన్ని అవకాశంగా తీసుకొని అధికారంలోని మితవాద పార్టీ కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టినప్పటికీ గ్రాజ్ పట్టణంలో పార్టీ నిత్యం జనంతో ఉన్న కారణంగా వాటిని తోసిపుచ్చారని ఫలితాలు వెల్లడించాయి. పార్టీ సోషలిజం సాధన ఆశయంగా పని చేస్తున్నప్పటికీ స్ధానిక సంస్ధల ఎన్నికలు గనుక ప్రజాసమస్యలే ప్రధానంగా పని చేసింది. ఈ ఎన్నికల్లో సోషలిజం గురించి తాము బోధించనప్పటికీ వామపక్ష రాజకీయాలను కింది నుంచి నిర్మించాలని, ఒక్క మున్సిపాలిటీ అనే కాదు, ఒక దుకాణంలో పని చేసే వారి దగ్గర నుంచి అంటే అత్యంత దిగువ స్ధాయి నుంచి పార్టీ నిర్మాణం జరిపితే జాతీయ రాజకీయాలకు ఎదగటం సాధ్యమే అని ఇరుగుపొరుగు పోర్చుగీసు, బెల్జియం వంటి ఐరోపా దేశాల అనుభవాలు సూచిస్తున్నాయని ఆస్ట్రియా కమ్యూనిస్టులు చెబుతున్నారు.