Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


కొందరి దృష్టిలో కమ్యూనిస్టుల తప్పిదాలతో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయింది. మరొక కోణం ప్రకారం కుట్రతో సామ్రాజ్యవాదం కూల్చివేసింది. దేని పాత్ర ఎంత అనేది ఎవరికి వారు గుణపాఠాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ ఉదంతం జరిగి మూడు దశాబ్దాలు దాటింది. ఇంతకాలం తరువాత అక్కడ కమ్యూనిస్టులు ఏమి చేస్తున్నారు, ఉద్యమం ఎలా ఉంది అనేది వామపక్ష అభిమానులు, వ్యతిరేకులకూ ఆసక్తికరమైన అంశమే. పుతిన్‌కు తలనొప్పిగా మారుతున్న కమ్యూనిస్టులు అనే శీర్షికతో అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఒక సమీక్ష రాసింది. రష్యాను మరోసారి కమ్యూనిస్టు భూతం వెంటాడుతోందా అనే వాక్యంతో అది ప్రారంభమైంది.నిజమేనా -అతిశయోక్తా ? అసలు అక్కడేం జరుగుతోంది ?


సెప్టెంబరు 17-19 తేదీలలో రష్యన్‌ డ్యూమా(పార్లమెంటు ) ఎన్నికలు జరిగాయి.నాలుగు వందల యాభై స్ధానాలకు గాను 225 దామాషా ప్రాతినిధ్యం పద్దతిలో మిగిలిన 225 నియోజకవర్గాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి 49.82 శాతం ఓట్లు, 324 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షంగా మొదటి స్ధానంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి 18.93శాతం ఓట్లు, 57 సీట్లు వచ్చాయి. జస్ట్‌ రష్యా పార్టీకి 7.46 శాతం ఓట్లు 27 సీట్లు, ఎల్‌డిపిఆర్‌కు 7.55శాతం ఓట్లు 21 సీట్లు,న్యూపీపుల్‌ పార్టీకి 5,32శాతం ఓట్లు 13 సీట్లు, మరో మూడు పార్టీలకు ఒక్కొక్కసీటు, స్వతంత్రులకు ఐదు వచ్చాయి. మాస్కో తదితర ప్రాంతాలో అధికార పార్టీ అనేక అక్రమాలకు పాల్పడటంతో ప్రత్యక్ష ఎన్నికలలో కమ్యూనిస్టులు కొందరు ఓడిపోయారు.వాటి మీద కోర్టులో కేసులు దాఖలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికలలో మొత్తం ఓట్లలో 47.8శాతం పోలుకాగా ఈ సారి 45.15శాతానికి తగ్గాయి. అధికారపక్ష ఓట్లు 54.20శాతం నుంచి 49.82శాతానికి తగ్గాయి.

కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్షాలకు చెందిన అనేక మంది అభ్యర్ధులపై తప్పుడు కేసులు బనాయించి పోటీలో లేకుండా చేసుకోవటం, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ అక్రమాలకు పాల్పడటంలో పుతిన్‌ అధికార యంత్రాంగం పేరు మోసింది. వాటన్నింటినీ అధిగమించి కమ్యూనిస్టులు ప్రధాన ప్రతిపక్షంగా ముందుకు రావటం, అక్రమాలను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటంతో అసలు సిసలు ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని పరిశీలకులు, సామాన్యజనం కూడా గుర్తించారు. అనేక మంది చురుకైన యువ కమ్యూనిస్టులు ఈ ఎన్నికలలో పని చేయటం, జనం ఆదరించటం గతం కంటే ఆరుశాతం ఓట్లు 15 సీట్లు పెరగటాన్ని చూసి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులతోనే పుతిన్‌కు సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.వాషింగ్టన్‌ పోస్టు విశ్లేషణ సారాంశమిదే.


కమ్యూనిస్టు పార్టీ ఇటీవలి కాలంలో అనుసరిస్తున్న ఎత్తుగడలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను సంఘటితం చేసేందుకు చేసిన యత్నాలు ఫలిస్తున్నట్లు ఈ ఎన్నికలు నిరూపించాయి.గత అధ్యక్ష ఎన్నికలలో (2018) కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా పురోగామి భావాలు కలిగిన స్ట్రాబెరీ వాణిజ్యవేత్త పావెల్‌ గ్రుడినిన్‌ పోటీ చేశారు.గ్రుడినిన్‌కు విదేశాల్లో ఆస్తులున్నాయని, పుతిన్‌ మీద పోటీ చేసిన ఆయనకు 90లక్షల మంది మద్దతుదారుల లేరనే పేరుతో ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడిగా ప్రకటించారు. ప్రాంతీయ అసెంబ్లీలలో ఈ విధంగా ఐదుగురు ప్రముఖ కమ్యూనిస్టునేతలను అనర్హులుగా ప్రకటించారు. కమ్యూనిస్టు మద్దతుదారులే కాదు, పుతిన్‌ విధానాలను వ్యతిరేకించే ఇతర ఓటర్లు కూడా ఈ ఎన్నికలలో కమ్యూనిస్టులవైపు మొగ్గటం స్పష్టంగా కనిపించింది. ఇది వచ్చే అధ్యక్ష ఎన్నికలలో కూడా పుతిన్‌ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగతా ప్రతిపక్ష పార్టీనేతలను తప్పుడు కేసులతో, ఏదో ఒకసాకుతో జైలు పాలు చేసి, కమ్యూనిస్టుల మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తే అది ఎదురుతన్నే అవకాశం ఉందనే అంశం పుటిన్‌కు తెలియంది కాదు.

కమ్యూనిస్టులకు ఈ ఎన్నికలలో కోటీ ఆరులక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. దేశంలోని 41 ప్రాంతాల(మన రాష్ట్రాల మాదిరి)లో నాలుగు చోట్ల ు 30 నుంచి 36శాతం ఓట్లతో కమ్యూనిస్టు పార్టీ పెద్ద పక్షంగా అవతరించింది. మిగతా చోట్ల 20 నుంచి 30శాతం ఓట్లు వచ్చాయి.38 ప్రాంతీయ శాసనసభల్లో గతంలో 158 స్ధానాలుండగా ఇప్పుడు 254వచ్చాయి. ఇవన్నీ అనేక చోట్ల అధికారపక్షం అక్రమాలకు పాల్పడిన నేపధ్యంలో వచ్చిన విజయాలు అని గ్రహించాలి. మూడు రోజుల పాటు ఎందుకు ఎన్నికలు జరిపారు అంటే కరోనా అని సాకులు చెప్పారు. అధికారపక్షానికి ఎదురుగాలి వీస్తున్నదనే సూచికలు ఎన్నికల ముందు సర్వేలు వెల్లడించాయి. దాంతో ఓటింగ్‌కు రాని ప్రభుత్వ రంగ కార్మికులు,ఇతరులను పెద్ద ఎత్తున సమీకరించటం, పరోక్ష ఎలక్ట్రానిక్‌ పద్దతిలో అధికారపక్షానికి ఓటు వేయించారు.


మీడియా కేంద్రీకరణ మొత్తం అధికారపక్షం వైపు తప్ప ప్రతిపక్షాలను ముఖ్యంగా కమ్యూనిస్టులను విస్మరించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మాయాజాలం గురించి చెప్పాలంటే మాస్కో నగరం, పరిసరాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సెప్టెంబరు 19వ తేదీ రాత్రి ఏడు గంటల సమయంలో ప్రత్యక్ష ఓట్ల లెక్కింపులో కమ్యూనిస్టు-అధికార యునైటెడ్‌ రష్యా పోటాపోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు వెల్లడైంది. తరువాత పరోక్ష ఎలక్ట్రానిక్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఒక గంటలోనే పరిస్ధితి తారుమారైంది. ఇది రిగ్గింగుతప్ప మరొకటి కాదు. అనేక పోలింగ్‌ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఏదో ఒకసాకుతో వేలాది ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఇలాంటి అక్రమాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు తప్ప ఇతర పార్టీలేవీ ఎక్కడా ఆందోళన జరపలేదు. పోలీసులు, అధికార యంత్రాంగం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాలలో ప్రవేశించి బెదిరించటం, అరెస్టులు చేయటం, ప్రదర్శనలను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. పార్టీ వెబ్‌సైట్‌ను నిరోధిస్తామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కేసులు దాఖలు చేసేందుకు వివరాలను సేకరిస్తున్న లాయర్లను బెదిరించారు.పదిరోజుల పాటు జైలుపాలు చేశారు.

ఎన్నికలకు ముందు ఆల్‌ రష్యన్‌ సెంటర్‌ అనే ప్రజాభిప్రాయసేకరణ సంస్ధ జరిపిన సర్వేలో కమ్యూనిస్టు నేత జుగనోవ్‌ మీద విశ్వాసం ప్రకటించిన వారు 30.7శాతం ఉన్నట్లు ప్రకటించింది. కమ్యూనిస్టులకు ఎన్నికలలో 16.6, రష్యన్‌ ఫెడరేషన్‌లో 23.3శాతం వస్తాయని పేర్కొన్నది. ఎన్నికలలో అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. పార్టీ సిద్దాంతాలు, ఆచరణకు జనం మద్దతు పెరిగినట్లు ఫలితాలు వెల్లడించాయని కమ్యూనిస్టు పార్టీ సమీక్షలో పేర్కొన్నది. అక్రమాలు చోటు చేసుకోనట్లయితే ఇంకా ఓటింగ్‌ శాతం, సీట్లు పెరిగి ఉండేవి.కమ్యూనిస్టు పార్టీని ప్రధాన ప్రతిపక్షంగానే కాదు, అసలైన ఏకైక ప్రతిపక్షంగా జనం భావించారు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేకులు కమ్యూనిస్టుల వైపు మొగ్గారు.


గత పదిసంవత్సరాలుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పుతిన్‌కు అసలైన ప్రతిపక్షం ఉదారవాదులు తప్ప కమ్యూనిస్టులు కాదని జనాల మెదళ్లలో ఎక్కించేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తికాదు. అమెరికాలో మాదిరి ఎవరు అధికారంలో ఉన్నా ఉదారవాద పెట్టుబడిదారీ విధానాలను అనుసరించే శక్తులతోనే రాజకీయ రంగాన్ని నింపాలన్నది ఎత్తుగడ. తన అధికారాన్ని సుస్ధిరం చేసుకొనే యత్నాలలో భాగంగా వ్లదిమిర్‌ పుతిన్‌ ఏ పెట్టుబడిదారి విధాన సమర్ధపక్షాన్ని కూడా బతకనివ్వలేదు. గతేడాది చేసిన రాజ్యాంగ సవరణల ప్రకారం అధ్యక్ష పదవిని ఎవరు ఎన్నిసార్లయినా అధిరోహించవచ్చు. దాని ప్రకారం 2036వరకు ఆరోగ్యం సహకరించి అన్నీ అనుకూలిస్తే పుతిన్‌ అధికారంలో కొనసాగవచ్చు. అయితే ఉదారవాద పార్టీలకు బదులు కమ్యూనిస్టులే అసలైన ప్రతిపక్షం అని ఈ ఎన్నికలు నిరూపించటం గమనించాల్సిన ముఖ్య అంశం.


ఆగస్టు నెలలో లెవడా కేంద్రం జరిపిన ఒక సర్వే ప్రకారం 62శాతం మంది ఏది మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ సరైనది అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు సోవియట్‌ప్రణాళికా విధానం అని చెప్పారు. లెనిన్‌, స్టాలిన్లపై గత మూడు దశాబ్దాలుగా ఎంతగా బురద జల్లినా, విద్వేషాన్ని రెచ్చగొట్టినా ఏ సర్వేలో చూసినా 50శాతం మంది వారి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు జరిపే ప్రతి ప్రదర్శనలోనూ వారి చిత్రాలు దర్శనమిస్తాయి. పార్టీ కూడా తన అభిప్రాయాలను దాచుకోవటం లేదు. సోషలిస్టు వ్యవస్ధను కూలదోసిన తరువాత ఉనికిలోకి వచ్చిన పెట్టుబడిదారీ వ్యవస్ధ మీద అనేక మంది భ్రమలు పెట్టుకున్నారు. పరిస్ధితి అంతకు ముందు కంటే దిగజారిపోవటాన్ని చూసి జనం అడిగే ప్రశ్నలకు సోషలిస్టు వ్యవస్ధను వ్యతిరేకించే వారు ఇప్పటికీ చెబుతున్న సమాధానం ఏమంటే అనుకున్నట్లుగా మంచి పెట్టుబడిదారీ విధానానికి బదులు తప్పుడు వ్యవస్ధ వచ్చిందని, మంచి పెట్టుబడిదారీ విధానం కోసం పని చేస్తున్నామని ఉదారవాదులుగా చెప్పుకొనే వారు జనాన్ని నమ్మిస్తున్నారు. మరోవైపున తమ కళ్ల ముందే అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడిదారీ వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని రష్యన్‌ యువతరం గ్రహించకుండా ఎలా ఉంటుంది. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా అమెరికా నుంచి రష్యాకు ముప్పు ఉందనే జాతీయ భావాలను కూడా ముందుకు తెచ్చారు. అయితే ఇటీవలి కాలంలో అమెరికా కేంద్రీకరణ రష్యామీద కంటే చైనావైపు ఎక్కువగా ఉండటంతో ఆ ప్రచారం రష్యన్లలో అంతగా ఎక్కే అవకాశం లేదు. అనేక దేశాలలో తమకు అనుకూలమైన శక్తులను ప్రతిష్టించేందుకు అమెరికా అంతర్గత అంశాలు, ఎన్నికలలో జోక్యం చేసుకొంటోంది. పుతిన్‌ బదులు మరొకరిని ప్రోత్సహించాలని చూసినా అందుకు తగిన శక్తులు రష్యాలో కనిపించటం లేదు. పురోగామి సోషలిస్టు మార్గాన పయనించటానికి తాము కట్టుబడి ఉన్నామని వెనక్కి తగ్గేది, లొంగిపోయేది లేదని, జన ధోరణి తమకు అనుకూలంగా మారుతోందని కమ్యూనిస్టు పార్టీ ఈ ఎన్నికల ఫలితాల విశ్లేషణ తరువాత ప్రకటించింది.


” ఓటర్లు మేం చెప్పింది విన్నారు. ఓటర్లు మమ్మల్ని నమ్మారు. మాకు ఓట్లు వేశారు ” అని పార్టీ అగ్రనేత గెన్నడీ జుగనోవ్‌ చెప్పారు. నియోజవర్గ ప్రాతిపదికన ప్రత్యక్ష ఓటింగ్‌ జరిగిన 225 స్ధానాల్లో కమ్యూనిస్టులకు తొమ్మిది రాగా అధికారపక్షానికి 198వచ్చాయి. ఈ సీట్లలో అనేక అక్రమాలు జరిగాయనే విమర్శలు వచ్చాయి. మొత్తగా 50శాతం కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న అధికారపార్టీ నియోజకవర్గ ప్రాతిపదికన జరిగిన చోట అత్యధిక సీట్లు గెలిచిన కారణంగా మొత్తం సీట్లలో 72శాతం వచ్చాయి. అదే కమ్యూనిస్టులకు 19శాతం ఓట్లు వచ్చినా సీట్లు 12.7శాతమే వచ్చాయి. స్వతంత్ర విశ్లేషకుడు సెర్గీ షిఫిల్‌కిన్‌ అంచనా ప్రకారం కమ్యూనిస్టులకు వాస్తవంగా 31-33 శాతం మధ్య ఓట్లు వచ్చాయని అన్నాడు.మాస్కో ప్రాంతంలోని పదిహేను నియోజకవర్గాలలో అధికారపక్షం రిగ్గింగుకు పాల్పడిన కారణంగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్దులు ఓడిపోయారన్నది స్పష్టం. ప్రత్యక్షంగా వేసిన ఓట్ల లెక్కింపు జరిగినంతసేపూ అధికారపక్షం, కమ్యూనిస్టులు పోటా పోటీగా ఓట్లు తెచ్చుకున్నట్లు ప్రకటించిన అధికారులు ఎలక్ట్రానిక్‌ఓట్ల లెక్కింపు సమయంలో ఫలితాలు మారు చేశారన్నది అభియోగం. కమ్యూనిస్టులు గట్టి పోటీ ఇచ్చిన ప్రతి చోటా ఇదే జరిగినట్లు చెబుతున్నారు.


కమ్యూనిస్టు పార్టీలో పెరుగుతున్న యువత రానున్న రోజుల్లో మరింతగా మిలిటెంట్‌ పోరాటాలకు సిద్దమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జైలు పాలైన ఒక ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నవల్నీ అధికారపక్షాన్ని ఓడించే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. అతని మద్దతుదారులు కొందరు కమ్యూనిస్టులకు ఓటు వేశారని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్‌ అంతరించి మూడు దశాబ్దాలు గడచింది. కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నలభై ఏండ్ల లోపు వారికి నాటి విషయాలు వినటం తప్ప ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. అలాంటి వారు అనేక మంది జాతీయ పార్లమెంట్‌, స్ధానిక అసెంబ్లీలకు ఎన్నికయ్యారు. దేశంలో పెరుగుతున్న అవినీతి, అక్రమాలకు, పెట్టుబడిదారీ వ్యవస్ధ దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి ఇప్పటి కమ్యూనిస్టు పార్టీకి తేడా ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ముందుకుపోతామని అనేక మంది యువనేతలు చెప్పినట్లు మీడియా పేర్కొన్నది. ఆర్ధిక రంగంలో పుతిన్‌ వైఫల్యాల కారణంగా ఇటీవలి కాలంలో కార్మికవర్గంలో అసంతృప్తి పెరుగుతున్నది. మరొక ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేనందున కమ్యూనిస్టు పార్టీ ముందుకు పోవటానికి ఇది కూడా దోహదం చేస్తుందన్నది తెలిసిందే.లెనిన్‌ జన్మించిన ఉల్యనోవస్క్‌ పట్టణం, పరిసరాలలో కమ్యూనిస్టులు 30శాతంపైగా ఓట్లు సాధించారు. ఆ నియోజకవర్గంలో గత ఎన్నికలలో విజయం సాధించిన కమ్యూనిస్టులను అడ్డుకొనేందుకు అధికారపక్షం అనేక ప్రయత్నాలు చేసినా తిరిగి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు విజయం సాధించారు. లెనిన్‌ పదిహేడు సంవత్సరాల వయస్సులో ఉల్యనోవస్క్‌ను విడిచి వెళ్లిన తరువాత తిరిగి అక్కడికి వెళ్లలేదు. అయినా అంతటి మహానేత జన్మించిన ప్రాంతం తమదని అక్కడి వారు గర్వపడతారు. తిరిగి తమ జీవిత కాలంలో రష్యన్‌ సోషలిజాన్ని చూస్తామనే విశ్వాసం కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఉంది.


మాస్కోలోని మాక్రో అడ్వైజరీ సంస్ధ అధిపతి క్రిస్‌ వీఫర్‌ ఎన్నికల గురించి విశ్లేషిస్తూ ” జనాభాలో మారుతున్న నిష్పత్తి పుతిన్ను భయపెడుతున్న అసలైన సమస్య, సోవియట్‌ యూనియన్‌ అంతరించిన తరువాత జన్మించిన జనాభా ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఓటర్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. ఈ తరం పెద్ద ఎత్తున ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నది, అనేక దేశాలు తిరిగి వస్తున్నది. దేశం స్ధిరపడాలనే పుతిన్‌ కబుర్లను వినేందుకు వీరు సిద్దంగా లేరు. మెరుగైన జీవనం, ఆదాయం, సామాజిక భద్రత, మెరుగైన భవిష్యత్‌ను కోరుకుంటున్నారు. వీరి ఆకాంక్షలను నెరవేర్చుతూ అధికారంలో కొనసాగటం అనేది పుతిన్‌ ముందున్న పెద్ద సవాలు. ప్రస్తుత వైఫల్యాలు వచ్చే ఎన్నికల్లో ఎవరు అధ్యక్ష అభ్యర్ధిగా ఉన్నా వారికి గుదిబండలుగా మారతాయి” అన్నాడు.