ఎం కోటేశ్వరరావు
వేలాది పందులను వధిస్తున్నారా ! ఇలాంటివి మామూలే కదా ! పెంపుడు జంతువులు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది. ఇరుగు పొరుగు దేశాల్లో లేని చమురు, వస్తు కొరత బ్రిటన్‌లోనే ఎందుకు తలెత్తింది ? అది గిరాకీని బట్టి ఉంటుంది.డైనోసార్ లేస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు విలేకర్ల నుంచి ఎదురైన ప్రశ్నలు, ఆ పెద్ద మనిషి స్పందించిన తీరు ఇది. చైనాలో తలెత్తిన విద్యుత్ కొరత, ఎవర్‌గ్రాండే అనే రియెలెస్టేట్ కంపెనీ చెల్లింపుల సమస్య కారణంగా కొన్ని రేటింగ్ సంస్ధలు చైనా ఆర్ధిక రంగం గురించి తమ రేటింగ్స్‌ను సవరించాయి. దాంతో ఇంకేముంది చైనాలో సంక్షోభం తలెత్తిందని కొందరు తెగ సంతోషపడిపోతున్నారు. ఒక వేళ అదే జరిగినా చైనాతో పాటు ప్రపంచం కూడా నష్టపోతుందనే సృహ వారిలో ఉన్నట్లు కనపడదు. అలాంటి దుష్ట ఆలోచనలు పెట్టుకున్నవారు ఆశాభంగం చెందకతప్పదు. ఇదే సమయంలో ఐరోపా ధనిక దేశాల్లో ఒకటైన బ్రిటన్‌లో చమురు సరఫరాకు అవసరమైన వాహనాలను నడిపే డ్రైవర్లు లేక అక్కడ తీవ్ర సమస్య తలెత్తింది. దీని గురించి రేటింగ్ సంస్ధలు స్పందించలేదు.ఎనిమిది సంవత్సరాల నాటి గరిష్ట రికార్డును చమురు ధరలు అధికమించాయి. పెరిగిన చమురు ధరలతో పాటు సిబ్బంది వేతనాల పెంపుదలను కూడా వినియోగదారుల నుంచే వసూలు చేస్తున్నారు. బ్రెంట్ రకం చమురు ధర 82-83 డాలర్ల మధ్య కదలాడుతోంది. ద్రవ్యోల్బణ పెరుగుదల ఇలాగే కొనసాగితే 2022లో అది 180 డాలర్లకు పెరగవచ్చనే అంచనాలు వెల్లడయ్యాయి. చమురు టాంకర్లను నడిపేందుకు మిలిటరీ రంగంలోకి దిగింది. విదేశాల నుంచి పదివేల మంది డ్రైవర్లకు వీసాలు ఇస్తామని ప్రకటిస్తే మంగళవారం నాటికి కేవలం 127 మంది మాత్రమే ముందుకు వచ్చారని వార్తలు. తన ప్రభుత్వ విధానాలను బ్రిటన్ ప్రధాని పూర్తిగా సమర్ధించుకున్నారు. అసలు జరుగుతోందేమిటి ?
బ్రిటన్‌లో చమురు, గ్యాస్ పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిని బంకుల్లోకి చేర్చేందుకు అవసరమైన టాంకర్లను నడిపే డ్రైవర్ల కొరత కారణంగా సరఫరాలో తీవ్ర సమస్య తలెత్తింది. దీంతో డ్రైవర్లు ఉన్నా చమురు లేక ఆసుపత్రులు, ఆహార, వస్తు దుకాణాల వంటి రవాణా సంబంధిత రంగాలన్నీ ప్రభావితం అయ్యాయి. అనేక దుకాణాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలిక సమస్యగానే భావిస్తున్నప్పటికీ అనేక మంది నమ్మటం లేదు. ఎంతకాలం ఉంటుందో తెలియని స్ధితి. దేశ ప్రధానే నిర్దిష్టంగా చెప్పలేకపోయాడు. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం అని అందరూ వేలెత్తి చూపుతున్నారు. ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయేందుకు(బ్రెగ్జిట్) నిర్ణయించుకున్న సమయంలో పర్యవసానాల మంచి చెడ్డలను పాలకులు బేరీజు వేయలేదనే అభిప్రాయం వెల్లడి అవుతోంది.
అమెరికా, జపాన్ ఆర్ధిక పోటీ నుంచి తట్టుకొనేందుకు రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐరోపా యూనియన్ రంగంలోకి వచ్చింది. దాని నిబంధనల ప్రకారం సభ్య దేశాలకు చెందిన పౌరులు ఎలాంటి అనుమతులు, అంగీకారాలు లేకుండా ఏ సభ్య దేశంలో అయినా పని చేసేందుకు, నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు వీలు కలిగింది. ఇది ధనిక దేశాల్లోని వాణిజ్య, పారిశ్రామిక సంస్దలకు చౌకగా శ్రమశక్తిని అందించే వ్యవస్ధగానూ, పేద దేశాలకు నిరుద్యోగ సమస్య తీరేందుకు, ఆదాయవనరుగా ఉపయోగ పడింది. 2020 జనవరి 31 నుంచి బ్రిటన్ ఐరోపా యూనియన్ నుంచి విడిపోయింది. దీంతో అక్కడి సంస్ధలకు అవసరమైన చౌకగా లభించే శ్రామికుల కొరత ప్రారంభమైంది. ఇప్పుడు వేతనాలు పెంచినా శ్రమజీవులు దొరకటం లేదు.
వర్తమాన స్ధితి గురించి మీడియాలో 1978-79 నాటి ఆర్ధిక దిగజారుడు, కార్మిక ఆందోళనల మాదిరి తయారు కావచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. స్టాగ్‌ఫ్లేషన్ (ఆర్ధిక వృద్ధి నిలిచిపోవటం-ధరల పెరుగుదల వలన ద్రవ్యోల్బణ పెరుగుదల)కు గురికావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి చమురు బంకులు, అనేక దుకాణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్‌లో తమకంటే మెరుగైన వేతనాల కారణంగా గతంలో అనేక పేద దేశాల కార్మికులు వలసలు వచ్చారు. వలస విధానంలో భాగంగా ఆఫ్రికా దేశాల నుంచి కూడా వలసలను అనుమతించారు. పది సంవత్సరాల వ్యవధిలో నాలుగుశాతం వలస కార్మికులు పెరిగారు. దీంతో స్ధానికులకు అవకాశాలు తగ్గి అసంతృప్తి తలెత్తింది. తమ దుస్ధితికి ఐరోపాయూనియన్‌లో ఉండటమే కారణమని భావించి దానికి వ్యతిరేకత తెలిపారు. తమ పలుకుబడితో ఇతర దేశాలతో ప్రత్యక్ష ఒప్పందాలు చేసుకోవటం లాభదాయకంగా ఉంటుందని కార్పొరేట్‌లు కూడా విడిపోవటానికి మద్దతు ఇచ్చాయి. స్ధానికుల అసంతృప్తిని తగ్గించేందుకు ఇతర దేశాల నుంచి నైపుణ్యం తక్కువగా ఉండే కార్మికులను అనుమతించకూడదని బ్రిటన్ నిర్ణయించింది. అదే ఇప్పుడు వ్యవసాయం, కోళ్ల, పశుపెంపకం వంటి రంగాలలో పని చేసే కార్మికులు, డ్రైవర్ల కొరతకు దారి తీసింది. ఇతర ఉద్యోగాలతో పోల్చితే డ్రైవర్లకు ఇచ్చే వేతనాలు తక్కువ, పనిభారం ఎక్కువ, తగినంత గౌరవం కూడా లేకపోవటంతో స్ధానికులు వాటి పట్ల మొగ్గుచూపటం లేదు. బయటివారికి అవకాశం లేదు.
ఈ ఏడాది జూన్-ఆగస్టు మాసాల మధ్య పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జాతీయ గణాంక సంస్ధ వెల్లడించింది. సంస్ధ వివరాల ప్రకారం గతేడాది మార్చి నెలాఖరుకు ఉన్న సంఖ్యతో పోల్చితే భారీ వాహనాలను నడిపే ఐరోపా యూనియన్ డ్రైవర్ల సంఖ్య పదహారువేలు తక్కువగా ఉంది. బ్రిటన్ రవాణా అసోసియేషన్ చెబుతున్నదాని ప్రకారం మొత్తం లక్ష మంది కార్మికుల కొరత ఉంటే వారిలో ఇరవైవేల మంది విదేశీయులని వెల్లడించారు. డ్రైవర్లు లేక కొన్ని వస్తువుల కొరత ఏర్పడి రెస్టారెంట్‌లు, పబ్‌లు, సూపర్‌మార్కెట్లను అనేక చోట్ల మూసివేశారు.కొన్ని చోట్ల సిబ్బంది కారత కూడా తోడైంది. కరోనా సమయంలో స్వదేశాలకు వెళ్లిన కార్మికులు కొందరు తిరిగి రాకపోవటం కూడా పరిస్ధితిని దిగజార్చింది. కరోనా కారణంగా ప్రభుత్వం వారానికి 20 పౌండ్లు (రు.2020) ఇవ్వటం కూడా కార్మికుల కొరతకు దారి తీసిందని కొందరు చెబుతున్నారు. పదిన్నరవేల మంది ట్రక్కు డ్రైవర్లు, ఐదువేల మంది కోళ్ల పరిశ్రమలో పనిచేసే విదేశీ కార్మికులకు తాత్కాలిక వీసాలు ఇవ్వాలని బ్రిటన్ సర్కార్ నిర్ణయించింది. కార్మికుల కొరత కారణంగా కొన్ని చోట్ల పంటలను పొలాల్లోనే వదలి వేస్తున్నారని, ఆహార పంటలు పనికి రాకుండాపోతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిస్మస్ సందర్భంగా పెరిగే గిరాకీ కోసం టర్కీ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతారు, ఈ సారి వాటి కొరత ఏర్పడుతుందని భావిస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా అమెరికన్లు టాయిలెట్ పేపర్లను విరగబడి కొనుగోలు చేసి నిలవచేసుకున్నట్లుగా ు్లగా ప్రస్తుతం బ్రిటన్‌లో సరఫరా కొరత కారణంగా చమురుతో పాటు మద్యం, నిల్వచేసుకొనే మాంసం, పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులను కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి నిల్వచేసుకోవటంతో దుకాణాలు ఖాళీ అయ్యాయి. ధరలు కూడా పెరిగాయి. డిసెంబరు నాటికి మెరుగుపడకపోతే పరిస్ధితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు.
తాము కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భుజాలను తానే తట్టుకున్నాడు. ప్రస్తుత పరిస్ధితికి బ్రెగ్జిట్ కారణమని కొందరు భాష్యం చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం గాకపోయినా ప్రస్తుత సమస్య తీవ్రతరం అయ్యేందుకు బ్రెగ్జిట్ దోహదం చేసిందని మరికొందరు సూత్రీకరణ చేస్తున్నారు. నిజానికి బ్రిటన్ కన్సర్వేటివ్ పార్టీ ఎంచుకున్న ఆర్ధిక నమూనాయే దీనికి మూలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా ఎదురయ్యే షాక్‌లను తట్టుకొనేందుకు దేశ ఆర్ధిక వ్యవస్ధ తగినదిగా లేదు. 2008లో తలెత్తిన సంక్షోభ సమయంలో బ్యాంకుల బలహీనతలు వెల్లడయ్యాయి. ఆసమయంలో కార్పొరేట్ సంస్ధలు తగిన నిధులు కలిగి ఉండటంతో నష్టాలను పూడ్చుకున్నాయని, ఇప్పుడు కంపెనీల వద్ద తగినన్ని నిధులు లేకపోవటం వలన ఉత్పాదక గొలుసు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్నదని చెబుతున్నారు. ప్రతి దేశం ఇలాంటి సమస్యలతో ఉన్నప్పటికీ బ్రిటన్ ఎక్కువగా ప్రభావితమైందని తాజా పరిస్ధితి వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా భారీ వాహనాలను నడిపే డ్రైవర్లు బ్రిటన్ వదలి వెళుతున్నారనే సూచనలు వెలువడినప్పటికీ కాగల కార్యం గంధర్వులు తీరుస్తారులెమ్మనట్లు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇల్లు తగులబడుతుంటే బావి తవ్వేందుకు పూనుకున్నట్లు ఇప్పుడు అనేక సంస్థలు వేతనాలు పెంచుతూ కార్మికులను ఆకర్షించేందుకు పూనుకున్నాయి, ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందస్తు ప్రణాళిక, ఏర్పాట్లకు, వాటి నిర్వహణకు పెట్టుబడులు అవసరం గనుక వాటి జోలికి పోకుండా ఇప్పటికి గడిస్తే చాలన్నట్లుగా గత కొంత కాలంగా వ్యయహరిస్తున్నారు. చలికాలం వస్తే గ్యాస్ వినియోగం పెరుగుతుంది.ప్రస్తుతం గత దశాబ్దికాలంలో కనిష్ట స్ధాయిలో నిల్వలున్నాయి. దేశ నిల్వసామర్ధ్యంలో 70శాతం కలిగిన రఫ్ అనే కేంద్రాన్ని 2017లో మూసివేశారు. నిల్వకేంద్రాల నిర్వహణకు అవసరమైన రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం తిరస్కరిస్తున్న కారణంగా ప్రయివేటు వారు కూడా ముందుకు రావటం లేదు. నాలుగు లేదా ఐదు రోజుల చలికాలానికి అవసరమైన నిల్వలు మాత్రమే బ్రిటన్‌లో ఉన్నాయి.
దేశంలో 8,300 చమురు బంకులు ఉంటే వాటిలో ఐదువేల వరకు మూతబడ్డాయి.పందుల వధశాలల్లో కార్మికుల కొరత కారణంగా రైతులు ఇటీవలి కాలంలో లక్షా 20వేల జీవాలను వధించి పారవేసినట్లు జాతీయ పందుల పెంపకదారుల అసోసియేషన్ ప్రకటించింది. విదేశీ వలస కార్మికులతో తక్కువ వేతనాలతో పని చేయించుకొనే పద్దతి నుంచి ఎక్కువ వేతనాలతో నిపుణులైన స్ధానిక కార్మికులతో పని చేయించుకొనే పద్దతికి మారుతున్నట్లు చెప్పుకుంటున్నా అంత తేలిక కాదని అనేక మంది చెబుతున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు చిల్లర దుకాణాల సిబ్బంది వేతనాలు 44శాతం పెరిగాయి, అయినా సిబ్బంది కొరత వెంటాడుతూనే ఉంది. వేతనాలు పెరుగుతున్నందున అంతర్జాతీయ మార్కెట్లో పోటీ, ఎగుమతుల సమస్య కూడా తలెత్తనుంది.
చమురు సంక్షోభం, పందుల వధ వంటి పరిణామాలు బ్రెక్సిట్ అనంతర సంధి దశలో తప్పదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. పందుల వంటి పెంపుడు జంతు వధ మామూలు విషయమే అన్నారు వలసలు, తక్కువ వేతనాలతో కూడిన విఫలమైన పాత విధానానికి వెళ్లే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. కన్సర్వేటివ్ పార్టీ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్ వరకు సరఫరాలోఅంతరాయం ఉంటుందన్నారు. పన్నులను మరింతగా పెంచే అంశాన్ని కూడా తోసిపుచ్చలేదు. సరఫరా వ్యవస్ధలో తలెత్తిన సమస్యల గురించి మాట్లాడుతూ ఏమౌతుంది ? కొద్ది దశాబ్దాల క్రితం రైతులు గ్రామీణ దుకాణాల్లో పాలు అమ్ముకొనేవారు, సూపర్‌మార్కెట్లనే వాణిజ్య భక్షకుల కారణంగా ఆ పరిస్ధితి పోయింది, తిరిగి అది వస్తే సంతోషిస్తా అన్నాడు.చమురు, వస్తువుల కొరత దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందన్నాడు. ఇలాంటి సమస్యలను మిగతా ఐరోపా దేశాలు ఎదుర్కోవటం లేదు ఎందుకంటే గిరాకీని బట్టి ప్రత్యేక సమస్య తలెత్తుతుందని సమర్ధించుకున్నాడు. తమ సర్కార్ విధిస్తున్న పన్నులు మార్గరెట్ థాచర్‌కంటే తక్కువ హరోల్డ్ విల్సన్ కంటే ఎక్కువ అన్నాడు.” అయినా మీరు మాట్లాడుతున్నదంతా చెత్త, ఎందుకంటే ఆ ప్రముఖులిద్దరూ మా మాదిరి మహమ్మారిని ఎదుర్కోలేదు. మా మాదిరి ద్రవ్య పరమైన ఉల్కాపాతాలకు గురి కాలేదు ” అన్నాడు.బ్రిటన్లో తలెత్తిన కొరతలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. క్రిస్మస్ నాటికి పరిస్ధితి ఒక కొలిక్కి రానట్లయితే కొత్త పరిణామాలు, పర్యవసానాలకు దారి తీసే అవకాశం ఉంది. ఇది బ్రిటన్ స్వయం కృతం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.