ఎం కోటేశ్వరరావు
మరోసారి అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ కారణంగానే ప్రతి రోజూ వినియోగదారుల మీద భారం పెరుగుతోందని ఇంకోసారి చెప్పనవసరం లేదు. బుధవారం నాడు పీపాధర బ్రెంట్ రకం 82-83 డాలర్ల మధ్య కదలాడింది. గురువారం నాడు 80.7 డాలర్లతో ప్రారంభమై 81.36 మధ్య ఉంది. మనం దిగుమతి చేసుకొనే రకం ఒకటి-రెండు డాలర్లు తక్కువగా ఉంటుంది. తొంభై డాలర్ల వరకు పెరగవచ్చని గోల్డ్‌మన్ శాచస్ జోశ్యం చెప్పింది. ఏం జరగుతుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేని స్ధితి. జనం జేబులు కొల్లగొట్టటం ఎలా అని తప్ప భారం తగ్గింపు ఆలోచనలో కేంద్రం లేదు. రాష్ట్రాలకు అలాంటి అవకాశం పరిమితం. మిగతా వస్తువుల మాదిరే చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తెచ్చి వాటి ఆదాయాలకు హామీ ఇస్తే రాష్ట్రాలు ఆ విధానానికి ఆమోదం తెలుపుతాయి. అందుకు కేంద్రం సిద్దంగా లేదు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఓపెక్+దేశాలు నవంబరు నెలలో రోజుకు నాలుగు లక్షల పీపాల కంటే ఉత్పత్తిని ఎక్కువ పెంచేందుకు తిరస్కరించటం ఒక ప్రధాన కారణం.ఈ ఏడాది ఇప్పటి వరకు చమురు ధరలు 50శాతంపైగా పెరిగాయి. కరోనా కారణంగా కుదేలైన రంగాలు తిరిగి కోలుకుంటే చమురు గిరాకీ పెరుగుతుంది. అప్పుడు ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వంద డాలర్లకు చేరే అవకాశం గురించి జోశ్యాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగితే వచ్చే ఏడాది 180డాలర్లను అధిగమించవచ్చని కూడా చెబుతున్నారు. కరోనాకు ముందు ఉన్న ఉత్పత్తి స్ధాయికి చేరుకొనే వరకు నెలకు నాలుగు లక్షల పీపాలకు మించి పెంచేది లేదని ఒపెక్+దేశాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే వంద రూపాయలు దాటిన పెట్రోలు ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలియదు.
ఐరోపాతో సహా అనేక దేశాలలో సహజవాయు ధరలు విపరీతంగా పెరిగాయి.బొగ్గు కూడా మండుతోంది. ఈ నేపధ్యంలో అనేక విద్యుత్ కంపెనీలు గ్యాస్‌కు బదులు చమురుతో విద్యుత్ ఉత్పత్తి చౌక అని ఆలోచించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది. అమెరికాలో ఇడా హరికేన్ కారణంగా మూడు కోట్ల పీపాల చమురు ఉత్పత్తి పడిపోయింది.ఇది కూడా ఒక తక్షణ కారణం. ఉత్పత్తి కంటే కంపెనీల వాటాదారుల లాభాలు ముఖ్యం అనుకుంటున్న అమెరికాలోని షేల్ చమురు కంపెనీలు ఉత్పత్తిని పరిమితం చేశాయి. ధరలు పెరిగినా ఫరవాలేదు, ఉత్పత్తి పెంచాలనే డిమాండ్ అమెరికా వైపు నుంచి వచ్చింది. దాన్ని ఉత్పత్తి దేశాలు ఖాతరు చేయలేదు. రోజుకు ఎనిమిది లక్షల పీపాల ఉత్పత్తి పెంచుతారు అన్న అనధికారిక వార్తలు వాస్తవం కాదని తేలిపోయింది.
రానున్న శీతాకాలంలో అనేక దేశాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కోనున్నట్లు చెబుతున్నారు.పూర్తి స్ధాయిలో ఆర్ధిక కార్యకలాపాలను సాగిస్తున్న చైనా తన అవసరాల కోసం ఎక్కడెక్కడి చమురు, గ్యాస్, బొగ్గును కొనుగోలు చేస్తోంది. ఐరోపా ఇబ్బందులు పడుతోంది. ధర ఎక్కువైనా స్ధానిక ఉత్పత్తి కారణంగా అమెరికాలో ఇబ్బంది లేదు. ఐరోపా గ్యాస్ నిల్వలు పదేండ్ల కనిష్టానికి తగ్గాయయి.
రష్యా గ్యాస్ సరఫరా చేయగలిగినప్పటికీ ఐరోపా దేశాలతో ఉన్న విబేధాల కారణంగా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే గ్యాస్ ఆధారిత పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి ప్రభావితం అవుతాయి. సాధారణ వినియోగదారులు, పరిశ్రమలు, కార్మికుల నుంచి రాజకీయ నాయకత్వాలకు సమస్యలు ఎదురవుతాయి. నిరసనలకు దారి తీసి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినా ఆశ్చర్యం లేదు. ఇంధన సరఫరా ముప్పు గురించి ప్రతి వారూ చర్చిస్తున్నారు గానీ పరిష్కారాలు కనిపించటం లేదు. ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పన్నులు తగ్గించటం తప్ప మరొక మార్గం లేదు. సహజవాయు ధరలపై నియంత్రణ ఎత్తివేయటంతో ఏ రోజు కారోజు ధరల విధానంవైపు మార్కెట్‌ను నెట్టారు. మరోవైపు రష్యా నుంచి ఐరోపా దేశాలకు సహజవాయు సరఫరా చేసే గొట్టపు మార్గంపై రాజకీయ కారణాలతో అమెరికా విధించిన ఆంక్షలను ఐరోపా వ్యతిరేకిస్తోంది. దీనివలన ఎక్కువగా నష్టపోయేది ఐరోపా దేశాలే. తాము వాయు సరఫరాను పెంచుతామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించటం వెనుక అమెరికా పలుకుబడిని దెబ్బతీసే ఎత్తుగడ ఉంది.దీని వలన పదిశాతం ధరలు కూడా తగ్గాయి. గొట్టపు మార్గం పని చేసేందుకు అనుమతించేందుకు జర్మనీ సిద్దంగా ఉంది.
ఐరోపాలో ఒక మెగావాట్ అవర్ విద్యుత్(ఐరోపాలో 330 ఇండ్లలో ఒక గంటపాటు వినియోగించేదానికి సమానంగా పరిగణిస్తారు) ధర రికార్డును బద్దలు కొట్టి 106 యూరోలను తాకింది. ఇది పీపా చమురు ధర 205 డాలర్లకు సమానం. రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుందని భావిస్తున్నారు. ఆసియా, ఇతర కొనుగోలుదారులకు సౌదీ అరేబియా పీపాకు చమురు ధరలో 0.42 డాలర్లు తగ్గించటంతో చమురు ధరలు గురువారం నాడు స్వల్పంగా తగ్గాయి. రానున్న చలికాలంలో ఇంధన సరఫరాలు తగ్గకుండా చూడాలని చైనా ప్రభుత్వం ఆదేశించటం కూడా ధరల పెరుగుదలకు దారి తీసింది.
మన దేశంలో చమురు ధరల పెరుగుదలకు అంతర్జాతీయ కారణాలతో పాటు నరేంద్రమోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు కూడా దోహదం చేస్తున్నాయి. ఎగుమతులను పెంచేందుకు మన రూపాయి విలువను పతనం కావించటం ఒకటి. అక్టోబరు ఆరవ తేదీన రూపాయి డాలరుకు 75కు పతనమైంది. సెప్టెంబరు 28న 74 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్ధిరంగా ఉన్నప్పటికీ రూపాయి విలువ పతనమైతే వినియోగదారుల నుంచి ఆ మేరకు వసూలు చేస్తారు. ఇప్పుడు చమురు ధర పెరుగుదల, రూపాయి పతనం రెండూ జరుగుతున్నాయి. దీన్నే గోడదెబ్బ-చెంపదెబ్బ అంటారు. దేశీయంగా జరుగుతున్న చమురు ఉత్పత్తిని పెంచకపోగా గత స్ధాయిని కొనసాగించటంలో కూడా నరేంద్రమోడీ సర్కార్ విఫలమైంది. ఇథనాల్ ఉత్పత్తి చేసి ఆమేరకు భారం తగ్గిస్తామని చెప్పిన మాటలు కూడా అమలు కాలేదు. ప్రస్తుతం మన దేశం 80శాతం చమురు దిగుమతులపై ఆధారపడుతున్నది.
గతంలో ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి కొనుగోలు చేసిన చమురు విలువలో సగం మొత్తాన్ని రూపాయిలలో చెల్లిస్తే సరిపోయేది. మన దేశం నుంచి ఇరాన్‌కు ఎగుమతులు చేసిన వారికి మన ప్రభుత్వం సర్దుబాటు చేసేది. మన అవసరాల్లో పదిశాతం అక్కడి నుంచే దిగుమతి చేసుకొనే వారం. ఇరాన్ దగ్గర చమురు కొన్న దేశాల మీద ఆంక్షలు విధిస్తామన్న అమెరికా బెదిరింపులతో మన సర్కార్ భయపడిపోయి అక్కడి నుంచి పూర్తిగా కొనుగోళ్లను ఆపివేసింది. అందువలన ఆ మేరకు డాలర్లు చెల్లించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. దీంతో ఇరాన్ మన దేశం నుంచి దిగుమతులను కూడా పరిమితం చేసింది. 2018-19లో రెండు దేశాల వాణజ్య విలువ 17బిలియన్ డాలర్లు ఉండేది. మరుసటి ఏడాదికి అది 4.77 బి.డాలర్లకు పడిపోయింది. మన ఎగుమతులు 2019తో పోల్చితే 42శాతం తగ్గి 2020లో 2.2బి.డాలర్లకు, 2021లో మరింతగా పడిపోయాయి.
మరోవైపున ఇరాన్-చైనా బంధం మరింత గట్టిపడింది.రాయితీలతో కూడిన చమురు నిరంతరాయంగా ఇరాన్ సరఫరా చేస్తే చైనా 400 బిలియన్ డాలర్ల మేరకు వివిధ పధకాలలో పెట్టుబడులుగా పెట్టనుంది. అమెరికా బెదిరింపుల కారణంగా మనం ఇరాన్‌తో స్నేహాన్ని ప్రశ్నార్దకం చేసుకోవటంతో పాటు వాణిజ్య అవకాశాలను కూడా కోల్పోయాము. వినియోగదారుల మీద భారం మోపుతున్నారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇరాన్‌తో సాధారణ సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే అది మన అర్ధిక వ్యవస్ధ మీద తీవ్ర ప్రభావం చూపనుంది. బడ్జెట్‌లోటు పెరిగితే సంక్షేమ చర్యలకు కోత పెడతారు.పరిమితంగా ఉన్న సబ్సిడీలను కూడా ఎత్తివేస్తారు. చమురు, గాస్ ధరలు పెరిగితే ఎరువుల ధరలు కూడా పెరిగి రైతాంగం మీద భారాలు పెరుగుతాయి. ఇది మరొక సంక్షోభానికి దారితీస్తుంది. ఇప్పటికే రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు తిరస్కరిస్తూ రాజధాని చుట్టూ ఇనుప మేకులు పాతి పది నెలలుగా రైతులను రాజధానిలోకి రాకుండా అడ్డుకుంటున్న సర్కార్ చమురు భారాలకు వ్యతిరేకంగా జనం ఉద్యమిస్తే ఏం చేయనుందో చూడాలి.