Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


అక్టోబరు మూడవ తేదీన ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై బిజెపి నేతల వాహనాలను ఎక్కించి నలుగురిని దారుణంగా హత్య చేశారు. ఆ వాహనాల్లో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అషిష్‌ మిశ్రా ఉన్నాడా, అతనే స్వయంగా వాహనాన్ని రైతుల మీద ఎక్కించాడా లేక వాహనంలో ఉండి డ్రైవర్‌ను అందుకు పురికొల్పాడా అన్నది ఇప్పటివరకు వివాదాస్పద అంశంగా ఉంది. ఆ సమయంలో తన కుమారుడు అక్కడ లేడని కేంద్ర మంత్రి నమ్మబలుకుతున్నారు. దారుణ, గర్హనీయ ఉదంతం జరిగింది తమ ఏలుబడిలోని రాష్ట్రం, పోలీసులు, పాలకులూ తమ వారే, కేసులో ఇతర నిందితులు ఎవరైనా మంత్రిగారి కొడుకు ఉన్నందున పోలీసు కస్టడీ అయినా, రిమాండ్‌లో ఉన్నా ఇతర సాధారణ నిందితుల మాదిరి పోలీసు మర్యాదలేమీ ఉండవు, మంచిగానే చూసుకుంటారు. అయినా అక్టోబరు మూడున ఉదంతం జరిగితే ఇది రాస్తున్న సమయానికి కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. లేదా మంత్రిగారు అమాయకుడని చెబుతున్న తన కుమారుడిని పోలీసులకు అప్పగించలేదు. చట్టాన్ని అమలు జరపాల్సిన వారు, దాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసిన వారి తీరూ ఇలా ఉంది.

ఆరోగ్యం సరిగా లేని కారణంగా గురువారం నాడు తన కుమారుడు పోలీసుల ఎదుట హాజరుకాలేదని, శనివారం నాడు వెళతాడని మంత్రి అజయ మిశ్రా చెప్పారు. అమాయకుడని మరోసారి చెప్పారు. కాగా శనివారం ఉదయం పదకొండు గంటలకు హాజరు కావాలనే నోటీసును శుక్రవారం నాడు పోలీసులు కేంద్ర మంత్రి ఇంటి గోడకు అంటించారు. రుజువులు లేకుండా వత్తిడి తెచ్చినంత మాత్రాన ఎవరి మీదా ఎలాంటి చర్యలూ ఉండవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ చెప్పారు. పార్టీ వైఖరికి భిన్నంగా రైతు ఉద్యమం, లఖింపూర్‌ ఖేరీ ఉదంతంపై స్పందించిన బిజెపి ఎంపీ వరుణ్‌ గాంధీ, మాజీ మంత్రి, వరుణ్‌ తల్లి అయిన మేనకా గాంధీని బిజెపి కేంద్ర కార్యవర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మరణించిన జర్నలిస్టు రామన్‌ కాశ్యప్‌ కుటుంబాన్ని శుక్రవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్దూ నిందితులను అరెస్టు చేసేంత వరకు తాను అక్కడే మౌన వ్రత దీక్ష చేయనున్నట్లు ప్రకటించి ప్రారంభించారు.


విశ్వగురువుగా భజంత్రీలు కీర్తిస్తున్నారు గనుక నిజమే అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే లఖింపూర్‌ ఖేరీ ఉదంతం తన స్థాయికి తగినదని భావించలేదా లేక ఇంకా పెద్దవి జరిగితే తప్ప స్పందించరో గానీ మొత్తం మీద ప్రధాని నరేంద్రమోడీ నోరు విప్పలేదు. ఈ ఉదంతం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చిందని బహుశా యంత్రాంగం మోడీగారికి నివేదించి ఉండకపోవచ్చు. రాజును బట్టే కదా బంట్లు . అనూహ్యమైన ఈ పరిణామాన్ని బిజెపి పెద్దలు ఊహించి ఉండరు.అందుకే షాక్‌లో ఉన్నారు, గుక్క తిప్పుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారానికి కీలకమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎలాగైనా తిరిగి గద్దెను దక్కించుకొనేందుకు పధకాల మీద పధకాలను రచిస్తున్న వారి జాబితాలో వేరే ఉంటాయి తప్ప ఇలాంటి మెడకు చుట్టుకునే దారుణాలు ఉండవు. రైతు ఉద్యమం మీద నిరంతరం బురద చల్లటం, ఎద్దేవా చేయటం, అసహనానికి గురై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఇలాంటివి జరగటం సాధారణం. నేను ప్రజాప్రతినిధిని గాక ముందు మనిషిగా ఉండి ఉంటే రెండు నిమిషాల్లో తేల్చేసి ఉండేవాడిని అని ఒక సారి రౌడీ షీటరుగా నమోదైన అజయమిశ్రా సెప్టెంబరు 25న ఆప్రాంతంలోనే మంత్రి వేషంలో ఉండి చెప్పారంటే ఏమనుకోవాలి. ఇదే సమయంలో హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ వంటి జాతి రత్నాలు తక్కువ తినలేదు. సమూహాలుగా ఏర్పడి కర్రలు తీసుకొని తిరగండి, జైలుకు పోవటం గురించి ఆలోచించవద్దని బిజెపి కార్కకర్తలకు కర్తవ్యబోధ చేశారంటే పుత్రరత్నాలు వాహనాలను జనం మీదకు నడపటం లేదా నడిపించటంలో ఆశ్చర్యం ఏముంది.

లఖింపూర్‌ ఖేరీ కేసు ఏమౌతుంది. అనేక కేసులు ఏమయ్యాయో ఇది కూడా అదే అవుతుంది. కేసు గురించి కాదు, పాలకపార్టీ ప్రమాదకర పోకడల గురించి తీవ్రంగా ఆలోచించాలి. సుప్రీం కోర్టుకు రాసిన లేఖలను తీసుకొని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేత్రత్వంలోని బెంచ్‌ కేసును విచారణ జరుపుతోంది. ఇంకా ఎందుకు మంత్రి పుత్రరత్నాన్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించాల్సి వచ్చింది. ఇతర కేసుల్లో ఇలాంటి విచారణకు ఉన్నత న్యాయస్ధానానికి అవకాశం ఉంటుందా అంటే కచ్చితంగా ఉండదు. చిత్రం ఏమంటే సుప్రీం కోర్టు కేసు చేపట్టినట్లు తెలిసిన తరువాత కూడా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు ఆషిష్‌ మిశ్రాను అరెస్టు చేయలేదు. ఏం చేస్తారో చూద్దామనో లేక సుప్రీం కోర్టు అయితే ఏంటి అన్న వైఖరో తెలిదు. ఇతర హత్యకేసుల్లో కూడా మీరు ఇలాగే పని ప్రవర్తిస్తారా అని కోర్టు ప్రశ్నించాల్సి వచ్చింది. తాను పోలీసుల ముందుకు రావటానికి మరింత సమంయం కావాలని ఆషిష్‌ మిశ్రా కోరాడని శనివారం ఉదం పదకొండు గంటల వరకు వ్వధి ఇచ్చినట్లు, అప్పటికీ రాకపోతే అరెస్టు వారంటు జారీ చేస్తామని ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.ఎంతైనా యోగుల పాలన గనుక నిందితుల మనోభావాలను గౌరవించటంగా దీన్ని భావించవచ్చు.

కేసును ఈనెల 20కి వాయిదా వేసినందున మరో పది రోజుల పాటు ఏదో ఒక సాకుతో పోలీసులు కాలం గడపవచ్చు. లేదా కోర్టును సంతృప్తిపరచేందుకు అరెస్టు చూపవచ్చు. రిపబ్లిక్‌ దినోత్సవం రోజున జరిగిన ఢిల్లీలో ఉదంతంలో కుట్రదారైన బిజెపికి చెందిన నటుడు దీప్‌ సిద్దు తమ కళ్ల ముందునుంచే వెళుతున్నా అడ్డగించని పోలీసులు అతగాడిని పదిహేను రోజుల తరువాత అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన ఉదంతాలలో ప్రభుత్వ వ్యతిరేకుల మీద మోపిన కేసుల్లో పోలీసులు ఎంత వేగంగా అరెస్టులు చేశారో చూశాము. కానీ లఖింపూర్‌ ఖేరీ ఉదంతంలో నిదానమే ప్రదానం అన్నట్లుగా యోగి సర్కార్‌ ఉంది. సమస్య సున్నితత్వం కారణంగా తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదదని, కేసులో ఉన్న వ్యక్తుల కారణంగా సిబిఐ గురించి ఏమీ చెప్పనప్పటికీ అది పరిష్కారం కాదని,ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధికారులతో దర్పాప్తు సరిగా జరగదని, ఉన్న సాక్ష్యాలను నాశనం చేయకూడదని ప్రధాన న్యామూర్తి ఎన్‌వి రమణ అన్నారంటే కేసు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. బిజెపికి ఈ సున్నితత్వం అర్దం అవుతుందా ?


పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ” ఈ ఉదంతం సాయంత్రం మూడు గంటల సమయంలో జరిగింది.ఆషిష్‌ మిశ్రాతో పాటు 15-20 మంది ఆ వాహనాలలో ఉన్నారు. నిరసన తెలుపుతున్న బబీర్‌పూర్‌ వద్దకు మూడు వాహనాల్లో వచ్చారు. ఆషిష్‌ మిశ్రా తన మహింద్రా తార్‌ వాహనంలో ఎడమవైపు కూర్చున్నాడు.రోడ్డుకు రెండు వైపులా ఉన్న రైతుల మీదకు వాహనాలను పోనిచ్చిన తరువాత రైతుల మీద కాల్పులు జరిపాడు. గుర్విందర్‌ సింగ్‌ అనే రైతు కాల్పుల కారణంగా అక్కడికక్కడే మరణించాడు. వాహనాలు బోల్తాపడిన కారణంగా పక్కనే ఉన్నవారు గాయపడ్డారు. తరువాత ఆషిష్‌ కాల్పులు జరుపుతూ చెరకు తోటలవైపు వెళ్లి అక్కడ దాక్కున్నాడు.” అని ఉంది. ఇలాంటి తీవ్రనేరారోపణ చేసిన కేసుల్లో ఇతరులైతే అరెస్టుకు మీనమేషాలు లెక్కిస్తారా ? అయితే తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ నేరారోపణ చేసే సమయానికి దానిలో మార్పులు చోటు చేసుకోవని చెప్పలేము. మంత్రి కుమారుడి కాల్పుల కారణంగా మరణించినట్లు చెబుతున్న గుర్విందర్‌ సింగ్‌ పోస్టు మార్టంలో తుపాకి గాయాల ప్రస్తావన లేదు. దాంతో కుటుంబ సభ్యుల డిమాండ్‌ మేరకు రెండోసారి చేసినా అదే మాదిరి ప్రస్తావన లేని అంతకు ముందు నివేదికే ఇచ్చారు. మంత్రి కుమారుడిని రక్షించేందుకు ఇది జరిగిందనే అనుమానాలు రావటం సహజం.


ఈ దారుణకాండలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు, ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీదే కేసులు కూడా పెట్టారు. అంటే ప్రజాస్వామ్యం సంగతి రాముడెరుగు బాధిత కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలిపేందుకు యోగి అంగీకరించరన్నది స్పష్టం. ఇది హత్రాస్‌ ఉదంతంలో కూడా జరిగింది. చివరికి పోలీసులే అంత్యక్రియలను కూడా ఎలా చేశారో చూశాము. మంత్రి అనుచరుల కార్ల మీద రైతులు దాడి చేసినపుడు అవి బోల్తాపడి రైతులు మరణించారని ముందు చెప్పారు. తరువాత కార్లను ఎక్కిస్తున్న వీడియో బయటకు రావటంతో వేరే కథలు వినిపిస్తున్నారు. కార్లను రైతుల మీద నడిపించినపుడు నిజంగా మంత్రి కుమారుడు ఉంటే ఆగ్రహించిన రైతులు అతన్ని ప్రాణాలతో బతకనిచ్చి ఉండేవారా అని ఎదురుదాడి చేస్తున్నారు. కారు డ్రైవరు, మరో ఇద్దరు బిజెపి కార్యకర్తల మాదిరి చంపివుండేవారు కదా అని తర్కిస్తున్నారు. అయితే అతను ఆ సమయంలోవేరే చోట ఉన్నట్లు చెప్పటం తప్ప ఇంతవరకు ఎలాంటి ఆధారాలను ఈ వాదన చేస్తున్న మంత్రిగానీ, అనుచరులుగానీ వెల్లడించలేదు.


లఖింపూర్‌ ఖేరీ ఉదంత రాజకీయ పర్యవసానాల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తు సిబిఐ లేదా ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు గానీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే లోగా తేలుతుందన్నది అనుమానమే.ఆలస్యం జరిగినా లేక మంత్రి కుమారుడి ప్రమేయం లేదని చెప్పినా లేదా విధిలేక అతగాడే దారుణానికి కారకుడని తేలినా బిజెపి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. పది నెలలుగా జరుగుతున్న రైతు ఉద్యమం ఈ ఉదంతంతో మరోమలుపు తిరిగింది. మరణించిన రైతుల కర్మకాండలు ముగిసేలోగా నిందితులను అరెస్టు చేయాలని, మంత్రిని తొలగించాలని కోరుతున్నారు. మంత్రిని తొలగిస్తే తప్పిదాన్ని అంగీకరించినట్లు లేకపోతే తమ వారిని రక్షించుకొనేందుకే బిజెపి పూనుకున్నదనే సందేశం రైతుల్లోకి వెళుతుంది. అన్నింటికీ మించి రాబోయే రోజుల్లో ప్రతి చోటా బిజెపి మంత్రులు, ప్రజాప్రతినిధుల కార్యక్రమాల సందర్భంగా రైతుల ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ చెప్పినట్లు బిజెపి కార్యకర్తలు కర్రలు తీసుకొని దాడులకు దిగితే, మరిన్ని లఖింపూర్‌ ఖేరీ ఉదంతాలు జరిగితే ఏం జరుగుతుందో చెప్పలేము.


లఖింపూర్‌ ఖేరీ దారుణం జరిగి 48 గంటలు కూడా గడవక ముందే అక్కడి నుంచి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని లక్నో నగరానికి అక్టోబరు 5వ తేదీన ఎన్నికల శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు, మూడు రోజుల అజాదీ కా అమృత మహౌత్సవం ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోడీ వచ్చారు. ఉపన్యాసం చేశారు.ఎన్నికల పధకాల్లో భాగంగా నయా భారత్‌కా నయా ఉత్తర ప్రదేశ్‌ పేరుతో 75 పధకాలను ప్రధాని ప్రారంభించారు. దేశాన్ని కుదిపివేసిన లఖింపూర్‌ ఉదంతం ప్రస్తావనే చేయలేదు. ఆ కార్యక్రమం ఎంతో ముందుగానే రూపొందించి ఉండవచ్చు, వాయిదా వేస్తే భిన్నమైన రాజకీయ సంకేతాలు వెళతాయని దాన్ని కొనసాగించి ఉండవచ్చు. తమ మంత్రి, అతని కుమారుడి నిర్వాకం కారణంగా జరిగిన ఉదంతం మంచి చెడ్డలను ప్రస్తావించకపోవచ్చు గానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎనిమిది విలువైన ప్రాణాలు పోతే కుటుంబాలకు సానుభూతి ప్రకటన చేస్తే సొమ్మేం పోతుంది. మరణించిన వారిలో ఇద్దరు బిజెపి కార్యకర్తలు, మంత్రి కారు డ్రైవర్‌, ఒక జర్నలిస్టు కూడా ఉన్నారుగా. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాణాలకు లేదా ?
.