ఎం కోటేశ్వరరావు
దేశంలో అధికార రాజకీయ క్రీడ ఒక వైపు, దానిలో ఓడిపోకుండా ఉండేందుకు వెంపర్లాట మరోవైపు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక పాంచజన్య ఒకవారం ఇన్ఫోసిస్ దేశభక్తిని శంకిస్తే మరో వారం కథనంలో అమెజాన్ రెండో తరం ఈస్టిండియా కంపెనీ అని వర్ణించింది. అది ఒక కంటితోనే చూస్తోంది. మరోకంటితో అవలోకిస్తే విదేశీ ఒప్పందాల కోసం నరేంద్రమోడీ సర్కార్ వెంపర్లాడుతున్న దృశ్యం కూడా కనపడి ఉండేది. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అనే అంశం తెలిసినా సర్దుబాటు చేసేందుకు పూనుకున్నారు. చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం మధ్య ప్రభుత్వ వాణిజ్య విధానంలో పెద్ద మార్పు అనే పేరుతో ఒక వార్తా సంస్ధ విశ్లేషణ వెలువడింది. పెద్ద మార్పు అంటే ప్రధాని నరేంద్రమోడీ సర్కార్ త్వరత్వరగా ప్రయోజనాలు పొందే ఒప్పందాలు చేసుకోనున్నది అని కూడా దానిలో చెప్పారు. కేంద్ర మంత్రులు లేదా ఉన్నతాధికారులతో జర్నలిస్టులు సంభాషించిన తరువాతనే ఇలాంటి విశ్లేషణలు వస్తుంటాయి లేదా పని కట్టుకొని రాయిస్తుంటారు. ఇది మొదటి కోవకు చెందినదే.
ఎందుకు ఇలాంటి విశ్లేషణలు అంటే ప్రతిదాని వెనుక ఒక లక్ష్యం ఉంటుంది. ఇప్పుడు నరేంద్రమోడీ ఎందుకు తొందరపడుతున్నారు ? అధికారానికి వచ్చిన తొలిరోజుల నుంచి కొన్ని సంవత్సరాల పాటు చమురు ధరలు పడిపోవటంతో వచ్చిన వెసులుబాటు నరేంద్రమోడీ ఘనతే అన్నట్లుగా ప్రచారం చేశారు. మీడియా కూడా అదే భజన చేసింది. అది నూతన సాధారణ స్ధాయికి చేరటం, చమురు ధరలు పెరగటంతో ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరు సంవత్సరాల కాలంలో దేశవృద్ది రేటు ఎనిమిది నుంచి నాలుగుశాతానికి దిగజారింది. అప్పటి నుంచి ప్రతిదానికీ కరోనాను సాకుగా చూపుతున్నారు. ఇంకేమాత్రం ఆ కబుర్లు నమ్మేందుకు జనం సిద్దంగా లేరు. తొలి నెలల్లో విదేశాల్లో, విమానాల్లోనే మోడీ ఎందుకు కాలం గడుపుతున్నారు అంటే పెట్టుబడుల కోసం అని చెప్పారు. కొత్తగా వచ్చిందేమీ లేదు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా అన్నారు. ఉన్న ఎగుమతులు కూడా తగ్గాయి. తరువాత చైనా నుంచి ఇతర దేశాల కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెప్పారు. వాటి జాడలేదు.
ఇప్పుడు ఆత్మనిర్భరత, ఉత్పత్తి, ఎగుమతుల ఆధారిత రాయితీలంటూ విఫల పధకాన్ని మరోసారి ప్రచారంలో పెట్టారు. ఇప్పుడు విదేశాలతో ఒప్పందాలని హడావుడి చేస్తున్నారు.చైనా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలు ఒకవైపు ఎగుమతులు-మరోవైపు తమ పౌరుల కొనుగోలు శక్తి పెంచేవిధంగా ఆదాయాల పెంపు వంటి విధానాలను అనుసరిస్తున్న కారణంగా అవి ముందుకు పోతున్నాయి. రెండవది జరగకుండా ఎగుమతులతో ముందుకు పోవాలని మోడీ సర్కార్ ఆత్రంగా ఉంది. అలాంటి విధానాలను అనుసరించిన లాటిన్ అమెరికా దేశాల అనుభవాలను ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడదు.
ఎగుమతులు, పెట్టుబడుల ఆకర్షణకు సమగ్ర ఒప్పందాలు కుదరాలంటే ఏండ్లూ పూండ్లూ పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం తమకే పెద్ద పీట అంటే మీ దేశానికి వస్తే మాకేమి ఇస్తావు, మాదేశం వస్తే మాకేం తెస్తావు అన్నట్లుగా ఉన్నాయి. బేరాలాడుతున్నాయి. చైనాతో తగాదా పెట్టుకొన్న మోడీ కౌగిలింతల భాగస్వామి డోనాల్డ్ ట్రంప్‌కు ఏ గతి పట్టిందో చూసిన తరువాత ఎవరికి మాత్రం ఆందోళన, ఆత్రం ఉండదు ! ఎన్నికలు, రాజకీయాలు నిలవనీయవు కదా ! తక్షణ ఫలితాలను జనానికి చూపాలి, అందుకు గాను ఏదో ఒకటి చేయాలి మరి. అందుకే వెంటనే అమల్లోకి వచ్చే తాత్కాలిక ఒప్పందాలు అని చెబుతున్నారు. నిజమే కదా… చేసుకుంటే తప్పేమిటి ? కోడలు మనవడిని కంటానంటే అత్త వద్దంటుందా అన్న సామెత తెలిసిందే.(ఇది ఆడపిల్లల పట్ల వివక్షే అని వేరే చెప్పనవసరం లేదు) మన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ గారు గత ఏడాది జరిగిన 290బిలియన్ డాలర్ల ఎగుమతులను 2022లో 400బి.డాలర్లకు(40వేల కోట్లు) పెంచాలని, 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని చెపుతున్నారు. ప్రస్తుతం కనీసం ఇరవై దేశాలతో ఒప్పందాల సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రేలియా,బ్రిటన్, ఐరోపాలోని మరికొన్నింటితో క్రిస్మస్‌లోగా ఒప్పందాలు చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు ఉత్పాదకతతో ముడిపెట్టిన రాయితీలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చూస్తున్నారు.గతంలో మేకిన్, మేడిన్ ఇండియా ప్రచారంలో భాగంగా ఇలాంటి రాయితీల ఆశ చూపినా ప్రయోజనం కలగలేదు. తమకు దేశ ప్రయోజనాలు ముఖ్యం కనుక దేశాలతో ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలమే అని స్వదేశీ జాగరణ మంచ్ సహకన్వీనర్ అశ్వనీ మహాజన్ చెప్పారు. కరోనా సమయంలో వాణిజ్యలోటు తగ్గింది, ఇప్పుడు తిరిగి గణనీయంగా పెరుగుతోంది.
2019లో కుదిరిన ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)ని జనవరి నుంచి అమల్లోకి తెచ్చేందుకు చైనా, ఇతర ఒప్పంద దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే 15దేశాలకు గాను పది దేశాలు సంతకాలు చేశాయి. ఇది ప్రపంచంలో అతి పెద్ద వాణిజ్య ఒప్పందం. ఆసియన్ కూటమిలోని ఆరు, ఇతర దేశాల్లో మూడు సంతకాలు చేసిన తరువాత రెండు నెలల్లో ఇది అమల్లోకి వస్తుంది. అనుకున్నట్లుగా అమల్లోకి వస్తే ఆ దేశాలకు చెందిన 91శాతం వస్తువులు ముఖ్యంగా పారిశ్రామిక వస్తువులపై పన్నులు పూర్తిగా రద్దు లేదా నామమాత్రం అవుతాయి. తాను లేని ఈ ఒప్పందాన్ని అమెరికా ముందుకు పోనిస్తుందా అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. ఒకవేళ అమలైతే మన దేశానికి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఏ దేశం ముందుకు వస్తే వారితో వెంటనే ఏదో ఒక ఒప్పందం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎగుమతుల్లో పురోగతి లేక దిగుమతులు పెరిగి చెల్లింపుల సమస్య తలెత్తితే 2024 ఎన్నికల్లో ఎదురీదక తప్పదు.
మన దేశానికి స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం కొత్త కాదు.మన దేశం ఇప్పటి వరకు వివిధ దేశాలతో పెట్టుబడులకు సంబంధించి 86 ఒప్పందాలు చేసుకుంది. వాటిలో పదమూడు మాత్రమే అమల్లో ఉన్నాయి.వివాదాల కారణంగా అనేక ఒప్పందాల నుంచి వైదొలిగాము. అయితే గత అనుభవం ఏమంటే మన ఎగుమతులకు బదులు దిగుమతులు విపరీతంగా పెరిగాయి. అంటే లబ్ది ఇతర దేశాలకు కలిగింది.2001లో మన వాణిజ్యలోటు ఆరుబిలియన్ డాలర్లు ఉంటే 2017నాటికి 109బి.డాలర్లకు పెరిగింది. ఒప్పందం చేసుకున్న దేశాలలో ఒక్క శ్రీలంకతో మాత్రమే మనకు మిగులు ఉంది. 2011-17 మధ్య జపాన్, దక్షిణ కొరియాతో వాణిజ్యలోటు రెట్టింపైంది. చైనా విషయానికి వస్తే 50శాతం పెరిగింది. దీంతో రెండు అంశాలు ముందుకు వచ్చాయి. దిగుమతి వస్తువులతో వాణిజ్యం చేసే వారు లబ్ది పొందారు. అవే వస్తువులను మన దేశంలో తయారు చేసే సంస్ధలు పోటీని తట్టుకోలేక మూతపడ్డాయి. మన్మోహన్ సింగ్ హయాంలో, అంతకు ముందు చేసుకున్న ఒప్పందాల సారమిదే. వాటికి వ్యతిరేకంగానే ఆర్‌ఎస్‌ఎస్ స్వదేశీ జాగరణ మంచ్ అనే ఒక సంస్ధనే రంగంలోకి తెచ్చింది. మన్మోహన్ సింగ్ చివరి సంవత్సరాలలో కొన్ని ఒప్పందాలను సమీక్షించాలన్నంత వరకు ఆలోచన చేశారు. దాని ప్రభావం తరువాత ఏలుబడిలోకి వచ్చిన మోడీ సర్కార్ మీద పడి కొత్త ఒప్పందాలేవీ చేసుకోలేదు. ఆర్‌సిఇపిలో చేరకూడదని నిర్ణయించింది.
ఏ ఒప్పందం చేసుకున్నప్పటికీ అది ఆ దేశ వాణిజ్య పోటీతత్వం మీద ఆధారపడి ఉంటుంది. స్విడ్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే ఐఎండి సంస్ధ ప్రకటించే ప్రపంచ పోటీతత్వ సూచికలో 64దేశాలలో మనం 2021లో 43వ స్ధానంలో ఉండగా చైనా 16 దగ్గర ఉంది. గత ఐదు సంవత్సరాల సూచికలను చూస్తే మనం 45 నుంచి 43కు పెంచుకుంటే చైనా 18 నుంచి 16కు ఎదిగింది. 2017 నుంచి వరుసగా 45,44,43,43,43 సూచికలతో మనం ఉండగా చైనా 18,13,14,20,16తో ఉంది. ప్రస్తుతం మనం ఒప్పందాల కోసం సంప్రదింపులు చేసే దేశాలన్నీ మన కంటే మెరుగైన సూచికలతో ఉన్నందున మనం పోటీ పడగలమా ?
తమ వైఫల్యాలను జనం గ్రహించకముందే ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో మోడీ సర్కార్ ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతి దేశమూ రక్షణాత్మక చర్యలను అమలు జరుపుతోంది. మనం ఆర్‌సిపిఇలో చేరకపోవటం కూడా దానిలో భాగమే.గత స్వేచ్చా వాణిజ్య ఒప్పందాల గురించి ముందే చెప్పుకున్నాము. ఆ కారణంగానే గత ఏడు సంవత్సరాలలో వాటి పట్ల మోడీ సర్కార్ పెద్దగా మొగ్గుచూపలేదు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్ (ఎస్‌జెఎం) అలాంటి ఒప్పందాలను వ్యతిరేకిస్తూ ప్రచారం చేయటం కూడా దీని కారణాల్లో ఒకటి. అయితే వాణిజ్య, పారిశ్రామికవేత్తల నుంచి ఇటీవలి కాలంలో వత్తిడి పెరుగుతోంది. అందుకే వారి ఉత్పత్తులకు మార్కెట్లను వెతికేపనిలో భాగంగా ఐరోపా యూనియన్, విడివిడిగా వివిధ దేశాలో ఒప్పందాలు చేసుకొనేందుకు పూనుకుంది. అయితే ఆ దేశాలు విధించే షరతులు బిజెపి ఓటు బ్యాంకుగా ఉన్న చిన్న వ్యాపారులు, చివరికి పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు సైతం మింగుడు పడక ముందుకు సాగటం లేదు. మరోవైపు అలాంటి ఒప్పందాలను ప్రపంచ వాణిజ్య సంస్ధలో సవాలు చేసే అవకాశం కూడా ఉంది. అందువలన తాత్కాలిక ఒప్పందాల ముసుగులో పని కానివ్వాలని చూస్తున్నారు.
కరవమంటే కప్పకు కోపం-విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా పరిస్ధితి ఉంది. అనేక వస్తు దిగుమతులపై రక్షణాత్మక చర్యల్లో భాగంగా పన్నులను పెంచారు. ఇప్పుడు వాటిని తగ్గించకపోతే విదేశాలు ముందుకురావు, తగ్గిస్తే స్ధానిక సంస్ధలు నష్టపోతాయి. ప్రపంచ వాణిజ్య సంస్ధ సభ్యరాజ్యాల మధ్య ప్రత్యేక ఒప్పందాలు కుదిరితే మిగతా దేశాలకు కూడా వాటిని వర్తింప చేయాల్సి ఉంటుంది. లేనట్లయితే వివాదాలే. తాత్కాలిక ఒప్పందాలకు కాలపరిమితిని స్పష్టం చేయాల్సి ఉంటుంది, అది అనిశ్చితికి దారితీస్తుంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో నామమాత్ర పన్నులు విధించే చర్యలకు త్వరలో మంగళం పాడే అవకాశం ఉంది. ఏ బహుళజాతి కంపెనీ ఎక్కడ పెట్టుబడులు పెట్టినా పదిహేనుశాతం పన్ను విధించాలన్న ఒప్పందాన్ని అంగీకరించిన 140కి గాను 136 దేశాలు సంతకాలు చేశాయి. దీనివలన దేశాల మధ్య పోటీ నివారణ అవుతుందని భావిస్తున్నారు. అది అమల్లోకి వస్తే ద్విపక్ష ఒప్పందాలు ఏమౌతాయో తెలియదు.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు, ద్విపక్ష పెట్టుబడి ఒప్పందాల తీరుతెన్నులు చూసినపుడు కొన్ని అంశాలు స్పష్టం అయ్యాయి.ప్రజల,పర్యావరణాన్ని ఫణంగా పెట్టి బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు పెద్ద పీట వేసే సాధనాలుగా పని చేస్తాయి. 1950-70దశకం వరకు నూతనంగా స్వాతంత్య్రం పొందిన అనేక దేశాల్లోని వలస దేశాల పెట్టుబడుల రక్షణకు వీటిని సాధానాలుగా చేసుకున్నారు. తరువాత స్వేచ్చామార్కెట్ పేరుతో వాటిని మరింత ఎక్కువ చేశారు. ఇప్పుడు మూడువేలకు పైగా పెట్టుబడి రక్షణ ఒప్పందాలున్నాయని అంచనా.వీటిని ఆధారం చేసుకొని అనేక కంపెనీలు ప్రభుత్వాలతో వివాదాలకు దిగాయి. పన్నుల తగ్గింపు లేదా అసలు కొన్నింటిపై పన్ను లేకుండా చేస్తారు. ఈక్రమంలో వాణిజ్యపోటీలో నిలిచే పేరుతో కార్మికుల వేతనాల తగ్గింపు, బేరమాడేశక్తి లేకుండా చేసే కార్మిక చట్టాలను వారి మీద రుద్దుతారు.ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకొని విదేశీ-స్వదేశీ కార్పొరేట్లకు జనాన్ని అప్పగిస్తాయి. ఐరోపా ఫ్రీ ట్రేడ్ ఏరియా(ఇఎఫ్‌టిఏ), ఐరోపా యూనియన్‌తో 2007-08లోనే చర్చలకు నాంది పలికాము. వారి కార్లు, మద్యం దిగుమతులకు అంగీకరించాము. మన ధాన్యసేకరణ రంగం, బీమా, బాంకు, ఇతర ఆర్ధిక సేవల రంగంలో ప్రవేశానికి అనుమతించాలన్న వత్తిడి కారణంగా 2013లో అవి నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
మోడీ సర్కార్ ముందుకు తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో ధాన్యసేకరణ ప్రయివేటును అనుమతించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. నరేంద్రమోడీ సర్కార్ కరోనా సమయంలో ఎలాంటి చర్చకు వీల్లేకుండా ఆదరాబాదరా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆ క్రమంలో భాగమే. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన వస్తున్నది, పదినెలలుగా సాగుతున్న రైతు ఉద్యమం దానిలో భాగమే.దీన్ని అణచివేసిన తరువాత కార్మిక హక్కులను హరించేందుకు అవసరమైన బిల్లులను సిద్దం చేశారు. అనూహ్యమైన రైతు ఉద్యమం కారణంగా సమయం కోసం చూస్తున్నారు. కార్పొరేట్లపై పన్ను తగ్గింపు కారణంగా తలెత్తిన లోటును పూడ్చుకొనేందుకు, కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించేందుకు ప్రజల మీద పన్ను భారాలు మోపుతారు. పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వం పెంచిన పన్ను, సెస్సుల మర్మమిదే. పెరుగుతున్న ధరలకు అనుగుణ్యంగా రైతులకు సబ్సిడీలను పెంచకుండా నామమాత్రం చేస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ఎరువుల సబ్సిడీ ఏటా 70-80వేల కోట్ల మధ్యనే ఉంచటమే దానికి నిదర్శనం. ప్రతిపాదిత విద్యుత్ బిల్లు ప్రకారం విద్యుత్ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదని చెప్పటం కూడా దానిలో భాగమే. రాష్ట్ర ప్రభుత్వాలకు క్రాస్ సబ్సిడీ అవకాశాలను ఎత్తివేస్తారు. ముందుగా వినియోగదారులనుంచి వసూలు చేసి తరువాత వారి ఖాతాలో జమచేసే విధానాన్ని తీసుకురానున్నారు. వంటగ్యాస్ మాదిరి ధరలు పెంచుకుంటూపోయి నామమాత్రం చేస్తారు. రాష్ట్రాలకు అధికారం లేకుండా నియంత్రణ కమిషన్ల పేరుతో చట్టసభల అవకాశాలను పరిమితం చేసి కాలక్షేప కేంద్రాలుగా మార్చివేస్తారు. ఇవి చట్టసభలకు జవాబుదారీగా ఉండవు.
రైతాంగానికి, పరిశ్రమలకు నష్టం అనే వైఖరి తీసుకున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వత్తిడి, ఆందోళనల కారణంగా, హిందూ మత, మితవాదుల మాతృక ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పాటు చేసిన స్వదేశీ జాగరణ మంచ్ తదితర సంస్ధల వైఖరి వలన మోడీ సర్కార్ ఆర్‌సిఇపిలో చేరలేదు.అది హ్రస్వ దృష్టికి నిదర్శనమని విదేశాంగశాఖ మాజీ అధికారి శ్మామ్ సరణ్ వంటి వారు విమర్శించారు. మరోవైపు అదే మోడీ సర్కార్ ఇతర దేశాలతో స్వేచ్చా, ద్విపక్ష ఒప్పందాల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు అదే జాగరణమంచ్ దేశం కోసం ఇవి అవసరం అని కొత్త పల్లవి అందుకుంది. తాము బహుళ దేశాలతో కూడిన వాటికి తప్ప ద్విపక్ష ఒప్పందాలకు అనుకూలం అంటోంది. చిల్లు కాదు తూటు అన్నట్లుగా ఆర్‌సిఇపి ఒప్పందంలోని అంశాలే వీటిలో కూడా ఉంటాయి, నాడు దాన్నెందుకు తప్పన్నారు, నేడు వీటినెందుకు ఒప్పంటున్నారు ? విదేశీ రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు వరుసలు కట్టి వస్తున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐరోపా యూనియన్, గల్ఫ్ సహకార సంస్ధ, యుఏయి, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. పూర్వం గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు, ఇతర కళారూపాలను ప్రదర్శించేవారు. గ్రామపెద్దలు, పౌరుల నుంచి పెద్ద మొత్తంలో కానుకల కోసం అబ్బో మీ ఊరు చుట్టుపక్కల అరవై ఆరు గ్రామాలకు పోతుగడ్డ, మీది పెద్ద చేయి అంటూ పొగిడేవారు. ఇప్పుడు మన మార్కెట్ మీద కన్నేసిన దేశాలన్నీ అలాంటి పొగడ్తలే కురిపిస్తున్నాయి, మనకు బిస్కెట్లు వేస్తున్నాయి.
స్వదేశీ కంపెనీలకు రక్షణకు కట్టుకున్న మడిని పక్కన పెట్టి మోడీ సర్కార్ మంత్రులు, అధికారులు వీటితో మాట్లాడుతున్నారని గ్రహించాలి. వచ్చే ఏడాది మార్చినాటికి బ్రిటన్‌తో, తరువాత ఆస్ట్రేలియాతో తాత్కాలిక ఒప్పందాలు కుదురుతాయని చెబుతున్నారు. ఐరోపా,ఆస్ట్రేలియా వంటి దేశాలతో అంటే వాటి పాల ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తుతాయి. అప్పుడు పాల ఉత్పత్తిలో ముందున్న రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీ వద్ద నిరసనలకు దిగకతప్పదు. ఐరోపా యూనియన్నుంచి బయటకు వచ్చిన బ్రిటన్‌కు ఇప్పుడు ఇతర దేశాలతో ఒప్పందాలు అవసరం గనుక అది వెంటపడుతోంది. చైనాతో వివాదం వచ్చింది కనుక ఆస్ట్రేలియా తన ఉత్పత్తులను మన దేశంలో విక్రయించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్, టెలికాం పరికరాల కోసం చైనా మీద ఆధారపడకుండా ఉండాలంటే బ్రిటన్‌తో ఒప్పందం అవసరమని స్వదేశీ జాగరణ మంచ్ నేత అశ్వనీ మహాజన్ వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాతో మన వాణిజ్యం మిగులుతో ఉంది. కనుక తన వ్యవసాయ, పాడి, కోళ్ల ఉత్పత్తులను మన మార్కెట్లో కుమ్మరించాలని చూస్తోంది. దానికి అంగీకరిస్తే మన రైతాంగం నష్టపోతుంది. తన ఆయుధాలు, చమురుతో పాటు వీటిని కూడా దిగమతులు చేసుకోవాలని మన మీద వత్తిడి తెస్తోంది.
అమెరికా, ఐరోపా యూనియన్ దేశాలు కుదుర్చుకొనే ద్విపక్ష ఒప్పందాలలో కార్మికులకు సంబంధించి ప్రపంచ కార్మిక సంస్ధ(ఐఎల్‌ఓ) ఆమోదించిన ఎనిమిది కీలక అంశాల అమలును ఒక షరతుగా పెడతాయి. యజమానులకు ఇష్టమైనపుడు కార్మికులను పెట్టుకొనే, లేనపుడు తొలగించే, అసలు సంఘాలు పెట్టుకోవటాన్నే అసాధ్యం చేసే విధంగా కార్మిక చట్టాలను మార్చేందుకు పూనుకన్న మోడీ సర్కార్ మరి వాటిని ఎలా అంగీకరిస్తుంది. అంగీకరించి అమలు జరపకపోతే కార్మికులు ఊరుకుంటారా ? ఈ మార్పులను చివరికి సంఘపరివార్ సంస్ధ బిఎంఎస్ కూడా అంగీకరించటం లేదు. నిజంగా దేశానికి తద్వారా మన జనాలకు మేలు కలిగించే ఇలాంటి ఒప్పందాలు చేసుకోవటానికి చైనాతో వివాదం, తాలిబాన్ల అధికారం వంటి పరిణామాలను సాకుగా చూపటం అవసరమా అనే ప్రశ్నలు అడగకూడదు. అపర దేశభక్తులు చెప్పింది వినాలి తప్ప బుర్రతో ఆలోచించకూడదు. మోడీ ప్రారంభించిన ఒప్పందాల తీరుతెన్నులు గతంలో మన్మోహన్ సింగ్‌కు తెచ్చిన తలనొప్పులనే పునరావృతచేస్తాయా ? మోడీ దూకుడు అలానే ఉంది మరి.