Tags
BJP, India's dependence on China, India's Trade deficit, India-China trade, Manmohan Singh, Narendra Modi, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
ఈ ఏడాది ఆఖరు నాటికి చైనా-భారత వాణిజ్యం గత రికార్డులను బద్దలు కొట్టి వంద బిలియన్ల డాలర్లకు చేరనుందనివార్త. సెప్టెంబరు ఆఖరుకు 90.7బి.డాలర్లుగా ఉంది. ఈ లెక్కన వచ్చే మూడు నెలల్లో నెల సగటు పది బి.డాలర్ల చొప్పునైతే120బి.డాలర్లు లేదా కనీసంగా వంద బి.డాలర్లు అవుతుందని అంచనా. సరిహద్దులో గాల్వన్‌లోయలో అంత పెద్ద ఉదంతం జరిగినా చైనా వస్తువులను బహిష్కరించాలని ”అపరదేశ భక్తులు” ఎంతగా గొంతు చించుకున్నా, మీడియా ఎంత రచ్చ చేసినా ప్రధాని నరేంద్రమోడీ వాటిని ఎడం కాలుతో తన్నేసి దిగుమతులకు అనుమతులిచ్చారు.వ్యాపారులు తెచ్చుకున్నారు. దీన్ని కొందరు మింగా లేరు కక్కలేరు.2018లో మనం గరిష్టంగా 76బి.డాలర్ల మేరకు దిగుమతులు చేసుకున్నాం, ఈ ఏడాది ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నాం అని చెప్పవచ్చు.
రెండు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేకున్నా ఆకస్మికంగా వస్తువుల దిగుమతి నిలిపివేయలేరని హాంకాంగ్ నుంచి వెలువడే ఆలీబాబా దినపత్రిక సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు పేర్కొన్నది. ఆత్మనిర్భర పేరుతో ముడి పదార్ధాలు, విడిభాగాల కోసం చైనా మీద ఆధారపడకూడదని నరేంద్రమోడీ కోరుకుంటున్నా వెంటనే సాధ్యం కాదని ఆ పత్రిక పేర్కొన్నది.భారత ఎగుమతి సంస్ధల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి అజయ సాహీ చైనాతో సంబంధాలు బలంగా ఉన్నాయన్నారు. 2021 సెప్టెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల్లో గతేడాదితో పోలిస్తే చైనా నుంచి 51.7శాతం(68.46బి.డాలర్లకు) దిగుమతులు పెరిగాయి. ఇదే కాలంలో మన దేశ ఎమతులు 42.5శాతం(21.91బి.డాలర్లు) పెరిగాయి. మన దేశ లోటు 46.55బి.డాలర్లు. సంఘపరివార్ అనుబంధ సంస్ధ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) 500 చైనా ఉత్పత్తుల జాబితాను విడుదల చేసి 13బి.డాలర్ల మేరకు 2021లో దిగుమతులను తగ్గించాలని పిలుపునిచ్చింది. ఇంకేముంది మనం దిగుమతులు నిలిపివేస్తే చైనా వారు మన కాళ్ల దగ్గరకు రావాల్సిందే, ఇదే దేశభక్తి అంటూ వీరంగం వేస్తూ అనేక మంది ఎక్కడికో వెళ్లిపోయారు.2020లో చైనా దిగుమతుల్లో మన వాటా (20.86బి.డాలర్లు) కేవలం 1.2శాతం, 18వ స్ధానంలో ఉన్నాము. మొదటి స్ధానంలో ఉన్న జపాన్ 174.87 (పదిశాతం) మరో పదిశాతం ఉన్న దక్షిణ కొరియా నుంచి 172.76, అమెరికా నుంచి 136(7.9శాతం) ఆస్ట్రేలియా నుంచి 114.84(6.6శాతం) ఉన్న దేశాలే చైనాతో బేరాలాడుతున్నాయి. అలాంటి స్ధితిలో మనం చైనాను కాళ్ల బేరానికి రప్పిస్తామని ఏ ధైర్యంతో కొందరు చెబుతున్నారో తెలియదు.
ఇండియా టుడే సమాచారం ప్రకారం 2010లో మనం వంద వస్తువులను దిగుమతి చేసుకుంటే చైనా నుంచి 10.7 ఉండేవి, నరేంద్రమోడీ ఏలుబడిలో 2018నాటికి 16.4కు పెరిగి, 2020లో 13.8కి తగ్గాయి. ఈ ఏడాది గత రికార్డును అధిగమించేట్లుంది. గతేడాది మనం మొత్తంగా 473 బి.డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటే 65బి.డాలర్లతో చైనా అగ్రస్ధానంలో, రెండవ స్ధానంలో ఉన్న అమెరికా నుంచి 35.6 బి.డాలర్లు, 7.5శాతం చేసుకున్నాము. మనం వంద వస్తువులను ఎగుమతి చేస్తుంటే చైనాకు చేస్తున్నవి కేవలం(2020) 5.3 మాత్రమే. మన గరిష్ట ఎగుమతులు 2010లో 6.5శాతం. అందుకే నిజాలు తెలిసినా మన ఎగుమతుల మీద చైనా ఆధారపడుతోందని కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన వాణిజ్య లోటు విషయానికి వస్తే 2010లో 19.2 బి.డాలర్లు కాగా 2018లో గరిష్టంగా 63 బి.డాలర్లు. ఈ ఏడాది ఇప్పటికే 46.55 బి.డాలర్లుంది. పదేండ్లలో చైనా నుంచి మన దిగుమతులు రెట్టింపు అయ్యాయి.వాటిని తగ్గించేందుకు దిగుమతి సుంకాలు విధించాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చినా ఖరారు కాలేదు. పన్ను విధించినా దిగుమతులు కొనసాగితే ఆ భారం మన వినిమయదారులే భరించాల్సి ఉంటుంది.మనం పన్నులు విధిస్తే చైనా ఊరుకుంటుందా ?
2012లో నాటి చైనా ప్రధాని వెన్‌జియాబావో – మన ప్రధాని మన్మోహన్ సింగ్ ఇరు దేశాల వ్యాపార లావాదేవీలు 2015నాటికి వంద బి.డాలర్లకు పెంచాలని ఆకాంక్షించారు. తాజా సమాచారాన్ని బట్టి మన ఆత్మనిర్భర, మేకిన్, మేడిన్ ఇండియా పిలుపులిచ్చిన నరేంద్రమోడీ దాన్ని ఈ ఏడాది నెరవేర్చేదశలో ఉన్నారు. 2017-18లో గరిష్టంగా 89.6బి.డాలర్లకు చేరగా ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టారు. త్వరలో 100బి.డాలర్ల రికార్డు నెలకొల్పనున్నారు.కొన్ని వస్తువులను వయా హాంకాంగ్ దిగుమతి చేసుకుంటున్నాము. వాటిని కూడా కలుపుకుంటే అంతకంటే ఎక్కువే ఉంటుంది. వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2018లో విడుదల చేసిన ఒక నివేదికలో భారత పరిశ్రమపై చైనా వస్తు ప్రభావం గురించి పేర్కొన్నారు. దిగుమతి పన్ను చట్టాలు సరిగా అమలు కావటం లేదని ఔషధరంగంలో ముడి సరకులు, సోలార్ పరికరాల దిగుమతుల మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. మన ఎంఎస్ఎంఇ పరిశ్రమలు మూతపడుతున్నట్లు కూడా తెలిపారు.
చైనా నుంచి పెరుగుతున్న దిగుమతులు నిత్యం చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్న రాజకీయ నేతలు, సంస్ధలు, మీడియాకు, వాటి ప్రచారాన్ని భుజానకెత్తుకున్నవారికి చెప్పుకోలేని చోట తగిలిన దెబ్బ అంటే అతిశయోక్తి కాదు.వారి విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తారు. దీన్ని మరోకోణం నుంచి చూస్తే వీరి చర్యల పర్యవసానాలేమిటో కూడా చూడాలి. నాలుగు దశాబ్దాల క్రితం చైనా నుంచి ఇలాంటి దిగుమతులు లేవు.1990దశకంలోనే ఎగుమతులు ప్రారంభమయ్యాయి.అప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు సంఘపరివార్ శక్తులే అధికారంలో ఉన్నాయి. వారి హయాంలో చైనా నుంచి దిగుమతులు పెరిగాయి తప్ప తగ్గలేదు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది వందలకు పైగా చైనా కంపెనీలు ఉన్నాయి. వాటిలో 75వరకు వినియోగ వస్తువులను తయారు చేసేవే.అంకుర కంపెనీలలో చైనా పెట్టుబడులు 400 కోట్ల డాలర్లు ఉన్నాయి.ఫ్లిప్‌కార్ట్, పేటియం, ఓలా, బైజూస్ వంటివి ఉన్నాయి. అనేక ఔషధ పరిశ్రమలు చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాయి. వీటికి ప్రత్నామ్నాయం చూడకుండా తెల్లవారేసరికి చైనా వస్తువులను బహిష్కరిస్తే నష్టపడేది కోట్లాది మంది సామాన్యులే. చైనాకు నష్టం ఉండదు. అత్యవసర జీవన ఔషధాల తయారీకి వినియోగించే ఎపిఐలో 75శాతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము.ఎలక్ట్రానిక్ వస్తువులు, సోలార్ పానెల్స్, రసాయనాల గురించి చెప్పనవసరం లేదు. జనజీవితాలు, పారిశ్రామిక రంగం నుంచి ఇప్పటికిప్పుడు చైనాను పక్కన పెట్టే అవకాశాలు లేవు. అందుకే నరేంద్రమోడీ సర్కారు ఆత్మనిర్భరత , స్వయం సమృద్ధి వంటి ఎన్నికబుర్లు చెప్పినా దిగుమతులను అనుమతించిందన్నది స్పష్టం. లేకపోతే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో అధికారపార్టీకి కష్టం.చైనాలో తయారైన వస్త్రాలను బంగ్లాదేశ్‌కు తీసుకువచ్చి అక్కడ దుస్తులు తరాయారు చేసి మన దేశానికి ఎగుమతి చేస్తున్నారు. ఇలా అనేక దేశాల నుంచి వేరే రూపంలో చైనా వస్తువులు వస్తున్నాయి. వీటిని అడ్డుకుంటే మన ఎగుమతులూ ఆగుతాయి. జనానికి చౌకగా వస్తువులూ దొరకవు.
మబ్బులను చూసి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్లుగా అమెరికాను నమ్మి బొమనం బస్తీమే సవాల్ అని గనుక తారసిల్లితే అంతర్జాతీయ రాజకీయాల్లో నెగ్గుకు రాలేము. అందుకు నిదర్శనం ఆస్ట్రేలియా. ఇప్పుడు నిండా మునిగి చైనాతో వైరం కొని తెచ్చుకుంది. వారిని ముందుకు నెట్టి రెచ్చగొట్టిన అమెరికా ఇప్పుడు తన లాభాన్ని తాను చూసుకొంటోంది. చైనాకు వ్యతిరేకంగా నిలవటం ఒక గౌరవ ప్రదమైన ఘనతగా భావించిన ఆస్ట్రేలియా వెనక్కితిరిగి చూసుకుంటే తన నీడ తప్ప మరొకరు కనిపించని స్ధితికి వెళుతోందని సిడ్నీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జేమ్స్ లారెన్స్‌సన్ హెచ్చరించాడు.ఆర్ధిక లబ్దికోసం చైనా, రక్షణ అవసరాల కోసం అమెరికా మీద ఎలా ఆధారపడకూడదో ఆస్ట్రేలియా పరిణామాలు వెల్లడిస్తున్నాయన్నారు.2016 రెండవ అర్దభాగం నుంచి చైనాకు వ్యతిరేకంగా మారటం ప్రారంభమైంది. దీంతో చైనా తీసుకున్న చర్యల కారణంగా మద్యం నుంచి బొగ్గువరకు అనేక ఆస్ట్రేలియా ఎగుమతులు ప్రభావితమయ్యాయి.
బలవంతపు వాణిజ్య పద్దతులను వ్యతిరేకించాలని ఆస్ట్రేలియాతో కలసి జపాన్,భారత్ ఉమ్మడి ప్రకటనలు చేయ వచ్చు గానీ జపాన్, భారత్ ఎక్కడా చైనా పేరెత్తేందుకు సిద్దం కాదని, ఇండోనేషియా ఆప్రకటన మీద సంతకం చేసేందుకు సిద్దం కాదని లారెన్స్ సన్ చెప్పారు. మార్చినెలలో ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారి మైక్ గోల్డ్‌మన్ మాట్లాడుతూ మీరు చేస్తున్నదానితో విశ్వాసంతో ముందుకు పోండి,ఆమెరికా ఇతర ప్రజాస్వామిక దేశాలు మీ విజయాన్ని ఎంతో ఆసక్తితో చూస్తాయి అన్నాడు. మిమ్మల్ని రోడ్డు మీద వంటరిగా వదిలేది లేదని మేనెలలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చెప్పాడు. వాణిజ్య దాడులకు ఆస్ట్రేలియా గురైనంత కాలం తాము చైనాతో సంబంధాల మెరుగుదలకు సిద్దం కాదని ఇండో-పసిఫిక్ అమెరికా పార్లమెంట్ సమన్వయకర్త కర్ట్ కాంప్‌బెల్ సెలవిచ్చాడు. ఆరునెలల తరువాత వాణిజ్య లావాదేవీల వివరాలను చూస్తే చైనా నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఎగుమతుల స్ధానాన్ని అమెరికా కంపెనీలు తమ సరకులతో నింపుతున్నట్లు తేలింది.ఇదేం పని అని అడిగితే అమెరికా ఏమీ మాట్లాడదు. అంతేకాదు అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమండో మాట్లాడుతూ చైనా వాణిజ్యాన్ని పెంచుకొనేందుకు తాము చర్చలు జరుపుతున్నట్లు చెప్పాడు. ఉద్రిక్తతలను సడలించేందుకు ముమ్మర వాణిజ్యం తోడ్పడుతుందని సెలవిచ్చాడు.అమెరికా-చైనా వాణిజ్యం తీరుతెన్నులపై ఎనిమిది నెలల సమీక్ష తరువాత అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి మాట్లాడుతూ తాము చైనాతో విడగొట్టుకొనేందుకు బదులు సంధానం చేసుకోవటం గురించి అజెండాను ముందుకు జరపనున్నామని చెప్పింది. ఇవన్నీ చెప్పిన సదరు ప్రొఫెసర్‌గారు చెప్పిందేమంటే అమెరికా తన సంగతి తాను చూసుకుంటున్నపుడు చైనాతో మనం తగాదా ఎందుకు పడాలని తమ పాలకులను ప్రశ్నించాడు.
ఇది మన దేశానికి వర్తించదా ? మనకూ అలాంటి అనుభవం ఎదురైతేగానీ మోడీ సర్కార్ తన వైఖరిని మార్చుకోదా ? చైనాతో స్నేహం చేసేదీ లేనిదీ పక్కన పెడితే తగాదా అవసరమా ? గాల్వన్ వివాదం మన సైనికుల మరణం విచారకరమే, కానీ అదే చైనా నుంచి మనం రికార్డు స్ధాయిలో దిగుమతులు చేసుకుంటున్నది ఆ తరువాతే కదా ? మనోభావాలతో ఆడుకుంటూ జనంలో దేశ భక్తి, చైనావ్యతిరేకతను రెచ్చగొడుతూ రాజకీయరగా బిజెపి ఉంటే దిగుమతిదారులు తమ లాభాల సంగతి తాము చూసుకుంటున్నారు. నరేంద్రమోడీ వాటిని అనుమతిస్తున్నారు. ఏమి దేశభక్తిరా బాబూ ఇది.
ఒక సోషలిస్టు దేశంగా చైనాను కమ్యూనిస్టులు, ఇతర పురోగామి శక్తులు అభిమానించవచ్చు. దాని మాదిరి మన దేశం, ఇతర దేశాలూ ముందుకు పోవాలనీ కోరుకుంటారు. అందుకోసం ఉద్యమాలు చేస్తారు తప్ప చైనాతో వాణిజ్యం చేయరు. ఇంతకు ముందు అలా చేసిన నేతలూ లేరు, ఇప్పుడూ లేరు, ఇక ముందూ ఉండరు.చేసేదంతా పారిశ్రామిక,బడా బాబులే, వారికి సహకరించేది అధికారంలో ఉన్న పార్టీల నేతలే. వ్యాపారం వ్యాపారమే. ఎవరికైనా లాభం వస్తేనే చేస్తారు. భారత కమ్యూనిస్టులు ఇక్కడి ప్రజల ప్రయోజనాలకే ప్రధమ పీటవేస్తారు తప్ప మరొక దేశానికి దోచిపెట్టమని ఎక్కడా చెప్పలేదు, చెప్పరు. గాల్వన్ లోయ ఉదంతం సందర్భంగా ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చైనా మన ప్రాంతాలను ఆక్రమించలేదని స్వయంగా చెప్పారు. సరిహద్దు వివాదం కొత్తగా తలెత్తింది కాదు. దాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని కమ్యూనిస్టులు ప్రత్యేకించి సిపిఎం మొదటి నుంచీ చెబుతోంది. అలా చెప్పిన వారిని దేశద్రోహులుగానూ, చైనాతో తగాదా కోరుకున్నవారిని దేశభక్తులుగానూ చిత్రిస్తున్నారు. దేశభక్తి అంటే చైనాను వ్యతిరేకించటంగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆ చైనా నుంచి రికార్డు స్ధాయిలో దిగుమతి చేసుకుంటున్నవారిని, అనుమతిస్తున్నవారిని ఏమనాలి ? దేశద్రోహులా, భక్తులా ?
సామాజిమాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసేందుకు బిజెపి దాని మాతృసంస్ధ సంఘపరివారం వెచ్చించే సమయంలో వెయ్యవ వంతు దేశం మీద కేంద్రీకరించినా – ఎందుకంటే దేశమంతటా తామే ఉన్నామని చెబుతున్నారు గనుక ఇక్కడే ఉత్పత్తి పెరిగి చైనా మీద ఆధారపడటం కాస్తయినా తగ్గి ఉండేదేమో ! మన జనాలకు పనీపాటా దొరికేదేమో !