Tags
BJP, BJP motormouth, BJP u turn on Fuel prices, crude oil price, Fuel Price in India, Narendra Modi
ఎం కోటేశ్వరరావు
పెట్రోలు ధరలు లీటరుకు వంద రూపాయలు దాటగానే వచ్చిన విమర్శలను తట్టుకోలేని నరేంద్రమోడీ-బిజెపి అభిమానులు సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయారు. వంద కాదు రెండు వందలైనా చెల్లిస్తాం, దేశం కోసం తప్ప నరేంద్రమోడీకి ఇస్తున్నారా అంటూ ఎదురుదాడులకు దిగారు. వారిలో ఏ దుష్ట క్షణంలో అలాంటి భావం కలిగిందో గానీ తధాస్తు దేవతలు వారి కోరికను తీర్చనున్నట్లు పరిణామాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు పీపా ధర త్వరలో వంద డాలర్లు కానుంది ఎవరైనా పందెం కాస్తారా అని సవాలు చేసే వారిని మరికొందరు పందెం రాయుళ్లు వందేంటి వచ్చే ఏడాది చివరికి రెండువందల డాలర్లు చూసుకుందామా అంటున్నారు.
శుక్రవారం నాడు ఢిల్లీలో పెట్రోలు ధర రు.106.89, హైదరాబాదులో రు. 111.18 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది రాసిన సమయానికి పీపా ముడి చమురు ధర 85.24 డాలర్లుంది. కొద్ది రోజుల క్రితం 86డాలర్లు దాటింది. పెరుగుతున్న ధరల గురించి ఏం చెప్పాలో తెలియక బిజెపి నేతలు నోటి తుత్తర వినోదం పండిస్తుంటే అది జనాలకు విషాదాన్ని నింపుతోంది. మద్దతు ఇచ్చిన మోజో లేక తగ్గకపోతాయా అన్న ఆశ, రోడ్లమీదకొస్తే నీకు దేశభక్తి లేదా, నువ్వు భారతీయుడివి కాదా ? వేయించుకున్న వాక్సినుకు డబ్బు ఇచ్చావా అని కాషాయదళాలు నిలదీస్తాయన్న భయం, ఏదైనా కావచ్చు, వినియోగదారుల నుంచి స్పందన లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని ధరల పెరుగుదల గురించి బిజెపి నేతలు అపహాస్యంగా మాట్లాడుతున్నా అది ప్రతిపక్ష నేతలను అనుకుంటున్నారు తప్ప తమను కూడా వెర్రివెంగళప్పలను చేస్తున్నారని అనుకోవటం లేదు. గుర్తించటం లేదు.
తాజాగా ఉపేంద్ర తివారీ అనే ఉత్తర ప్రదేశ్ మంత్రిగారు ” కార్లున్న కేవలం కొద్ది మందికి మాత్రమే పెట్రోలు అవసరం, 95శాతం మందికి అవసరం లేదు. వందకోట్ల కరోనా వాక్సిన్లు ఉచితంగా వేశారు.తలసరి ఆదాయంతో పోల్చితే పెట్రోలు ధరలు ఇప్పుడు చాలా తక్కువ.” అని చెప్పారు. గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి గారేమన్నారంటే ” మన ప్రభుత్వం దేశంలోని 130 కోట్ల మందికి ఉచితంగా వాక్సిన్లు వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది. చమురు మీద వేసే పన్నుల నుంచే వస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు మా మంత్రిత్వశాఖ నుంచి ఆరోగ్యశాఖకు నిధులు మళ్లించాము. మీరు గనుక హిమాలయ బ్రాండ్ మంచినీరు తాగాలంటే సీసాకు వంద రూపాయలు పెట్టాలి.” కర్ణాటక మంత్రి ఉమేష్ విశ్వనాధ్ కత్తి ఏం చెప్పారంటే ” కరోనాను కట్టడి చేయాలంటే ఖర్చు అవుతుంది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వానికి డబ్బు అవసరం గనుక చమురు ధరలు పెరిగాయి.త్వరలో వీటిని పరిష్కరిస్తారు.” అన్నారు. మధ్యప్రదేశ్ మంత్రి ప్రద్యుమ్న సింగ్ తోమర్ ఏమని సెలవిచ్చారంటే ” కూరగాయల మార్కెట్‌కు పోవాలంటే సైకిలును ఉపయోగిస్తామా ? అలా చేస్తే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, కాలుష్యమూ ఉండదు. ధరలు ఎక్కువే కానీ దీని ద్వారా పేదలకు లబ్ది సమకూర్చేందుకు డబ్బులు వస్తాయి. మనకు దేశ ఆరోగ్య సేవలు ముఖ్యమా పెట్రోలు, డీజిలు ధరలు ముఖ్యమా ? ” అని ఎదురుదాడికి దిగారు. అదే రాష్ట్రానికి చెందిన మరొక మంత్రి ఓమ్ ప్రకాష్ సక్లేచా జనాన్ని వెర్రివెంగళప్పలను ఎలా చేశారో చూడండి.” కష్టాలు వచ్చినపుడే మంచి రోజుల్లో ఉన్న సంతోషం ఏమిటో మీరు గుర్తిస్తారు, ఇబ్బందుల్లేవనుకోండి మీరు సంతోషాన్ని అనుభవించలేరు. ” అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో చమురు రేట్లు తక్కువంట అక్కడకు వెళ్లండి అన్న పెద్ద మనుషుల గురించి తెలిసిందే, ఇలాంటి వారు మీకు రోజూ చాలా మంది తగులుతూనే ఉంటారు.
గతేడాది ఏప్రిల్ 22న పీపా ముడిచమురు 16డాలర్లకు తగ్గింది. మనకు పైసా కూడా తగ్గించలేదు. ఇప్పుడు ఒక డాలరు పెరిగినా తెల్లవారే సరికి పెంచేస్తున్నారు. 2019-20లో మన దేశం దిగుమతి చేసుకున్న చమురు విలువ 130బి.డాలర్లు, మరుసటి ఏడాది కరోనా కారణంగా 82.4 బి.డాలర్లకు తగ్గింది. వర్తమాన సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే బిల్లు 70.5బి. డాలర్లుగా ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మిగిలిన ఆరునెలల్లో ఏమేరకు పెరుగుతుందో తెలియదు. ఎంత పెరిగితే అంత మన జేబుల నుంచి తీసుకుంటారు, పన్ను తగ్గించరు, పైసా సబ్సిడీ ఇవ్వరు. గతంలో రుపాయి విలువ పడిపోతే మన్మోహన్ సింగ్ అసమర్దత అని బిజెపి నేతలు సెలవిచ్చారు. గత ఏడు సంవత్సరాల్లో 58 నుంచి 75కు పతనమైంది. ఇది మోడీగారి సామర్ధ్యానికి నిదర్శనం, దేశం కోసమే అని మనం అంగీకరించాలి. ఇది కూడా చమురు ధరలను పెంచుతోంది. 2020 జూన్‌తో ముగిసిన మూడు మాసాల్లో మన చమురు దిగుమతి బిల్లు 8.5బి.డాలర్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 24.7 బి.డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని జనం నుంచి పిండారు. ఈ కారణంగా ధరల పెరుగుదలతో మరెంత భారం పెరిగిందో లెక్కలు లేవు. పీపా ధర పది డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం ప్రాతిపదిక సూచి పది పెరుగుతుంది.
బ్రెంట్ రకం ముడి చమురు ధర 2018లో 85 డాలర్లు ఉంది. ఇప్పుడు దాన్ని దాటింది. ఏడాది క్రితం దీనిలో సగం ధర ఉంది. దానికి ఒకటి రెండు డాలర్లు తక్కువగా మనం వాడే చమురు ధర ఉంటుంది. సహజంగా ఆర్ధిక రంగం కోలుకుంటే సంతోషంగా ఉంటుంది, కానీ పెరుగుతున్న చమురు ధరలను చూస్తుంటే భయమేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికాలో పరిస్ధితి ఎలా ఉందంటే ముందస్తు ఒప్పందం ప్రకారం చమురు తీసుకొనేందుకు కంపెనీలు తిరస్కరించాయి, సరఫరాదార్లకు ఎదురు డబ్బిచ్చి చమురొద్దురా బాబూ నిలవకు జాగా లేదు అన్నాయి. ఇప్పుడు దానికి విరుద్దంగా ఎక్కడ చూసినా ఖాళీ టాంకులే ఉన్నాయట. అంతకు ముందుతో పోలిస్తే నాలుగోవంతు మాత్రమే ఉందట.ఐరోపాలో కూడా నిల్వలు తగ్గాయి. చమురు ధరల పెరుగుదలకు ఇది ఒక కారణంగా చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి-మార్చి మాసాల్లో 95డాలర్లకు పెరగవచ్చని జెపిమోర్గాన్ సంస్ధ జోశ్యం చెప్పింది.
కొందరి అంచనాల ప్రకారం ప్రస్తుతం 83 డాలర్లకు పైగా ఉన్న అమెరికన్ రకం ముడి చమురు డిసెంబరు నాటికి వంద డాలర్లకు, వచ్చే ఏడాది డిసెంబరుకు 200 డాలర్లకు చేరవచ్చని చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లో ఈ మేరకు బ్రెంట్ రకం 200 డాలర్లకు కాల్ ఆప్షన్ లావాదేవీలు జరిగాయి.2022 డిసెంబరులో 200 డాలర్లు ఉంటుందని ఒకరు పది పీపాల మీద రెండు డాలర్ల చొప్పున 20డాలర్ల ప్రీమియం చెల్లించాడనుకుందాం. గడువు నాటికి చమురు ధర అంతకంటే తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని కోల్పోతాడు. లేదు 210 డాలర్లకు పెరిగిందనుకోండి. ఒక్కొక్క పీపాకు ప్రీమియం పోను ఎనిమిది డాలర్లు అతనికి లాభం వస్తుంది. ఇలా ఎన్ని పీపాల మీద పందెం కాస్తే నష్టం లేదా లాభం దాన్ని బట్టి ఉంటుంది. అమెరికా, ఐరోపాల్లో ఉన్న స్ధితి, ఆర్ధిక రంగం కోలుకుంటున్నది కనుక డిమాండ్ పెరిగి చమురు ధరలు పెరుగుతాయనే అంచనాలు దీన్ని సూచిస్తున్నాయి. ఇదొక జూదం, దీన్ని ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు గానీ విస్మరించకూడదు. అమెరికా ముడిచమురు వచ్చే ఫిబ్రవరిలో వంద డాలర్లకు చేరనుందని పందాలు పెరుగుతున్నాయి. 95 నుంచి 180 డాలర్ల వరకు రకరకాల పందాలను కాస్తున్నారు. పెట్రోలు, డీజిలును వాడేది కార్ల యజమానులు మాత్రమే కాదని, వివిధ పరిశ్రమలు కూడా వాడతాయని తద్వారా వస్తువుల ధరలు పెరుగుతాయని బిజెపి మంత్రులకు ఎవరు చెప్పాలి ? కరోనాతో నిమిత్తం లేకుండానే పన్నులు పెంచారని బిజెపి నేతలకు ఎలా చెప్పాలో జనానికే వదిలేద్దాం !