Tags

, , , , , ,

ఎం కోటేశ్వరరావు

మన వాళ్లు వొట్టి వెధవాయలోయి(తెల్లవారు) చుట్టకాల్చటం నేర్పినందుకు థాంకు చెయ్యక అన్నాడు మహాకవి గురజాడ గిరీశం. ఆ పెద్దమనిషి ఇప్పుడు ఉండి ఉంటేనా అసలు సిసలు భారతీయులం అనుకొనే మన వాట్సాప్‌ పండితుల భాష్యాలు, వక్రీకరణలు, వారి జ్ఞానాన్ని జనానికి ఉచితంగా పంచుతున్న మహాదాతృత్వం గురించి ఎలాంటి పదజాలం ఉపయోగించి ఉండేవారో కదా ! వాట్సాప్‌ పండితులు, కాషాయ దళాల ప్రచారంలో భాగంగా ముస్లింల నుంచి ముప్పు లేదా మన దేశంలో మెజారిటీగా మారేందుకు కుట్ర చేస్తున్నారనే ప్రచారం నిరంతరం జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24వ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెబ్‌సైట్‌లో ఒక వార్తకు పెట్టిన శీర్షిక ” భారత్‌లో హిందూ జనాభా వృద్ది రేటు తగ్గుదల, ముస్లింలో గర్భధారణ శక్తి (ప్రజనన) ఎక్కువ : పూ సర్వే సంస్ధ నివేదిక” అనే పేరుతో కొన్ని వివరాలు ఇచ్చారు. నిజానికి ఈ నివేదిక గురించి సెప్టెంబరు 21నే పూ సంస్ధ సర్వే వివరాలను ఇచ్చింది. ఈ శీర్షిక తప్పుదారి పట్టించేదిగా, తప్పుడు ప్రచారం చేసే వారిని సంతుష్టీకరించేదిగా ఉంది.


ఇంతకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం బిజెపితో సహా దాని సంస్ధలు, వారి ప్రచారదాడి మహమ్మారి సోకిన వారు చేస్తున్న ప్రచారం ఏమిటి ? 2035 నాటికి( సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి గాని సారాంశం ఒక్కటే) మన దేశంలో ముస్లిం జనాభా హిందువుల కంటే ఎక్కువ అవుతుంది. హమ్‌ పాంచ్‌, హమారే పచ్చీస్‌ (మనం ఐదుగురం మనకు ఇరవై ఐదు) దీని అర్దం ఏమిటి ? ప్రతి ముస్లిం పురుషుడు నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు, వారికి ఐదుగురి చొప్పున పిల్లలు పుడతారు అని చెప్పటమే.2002 గుజరాత్‌ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి ? ” నేనేం చేయాలి ? వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా ? ” అనేకదా ! ఆర్‌ఎస్‌ఎస్‌ వారి ఈ వైఖరిలో మార్పు వచ్చిందా ?2017లో బిజెపి ఎంపీ సాక్షి మహరాజ్‌ మీరట్‌ సభలో మాట్లాడుతూ ”నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి ” అని చెప్పారు.


విశ్వహిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్‌ తొగాడియ గుజరాత్‌లోని బహరుచ్‌ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.” హిందూ పురుషలూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. మతమార్పిడి వద్దనండి, ఘర్‌వాపసికి అవునని చెప్పండి. లవ్‌ జీహాద్‌ వద్దు, ఉమ్మడి పౌరస్మృతి కావాలనండి, బంగ్లా ముస్లింలు వద్దనండి..హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.” ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఫ్‌ుసంచాలక్‌ మోహన్‌ భగవత్‌ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు. కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు.” ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగ కూడదని ఏ చట్టం చెప్పింది ” అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్‌ మరోనేత దత్తాత్రేయ హౌసబలే అంతకు ముందు చెప్పిందేమిటి ?చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.” 2018లో రాజస్తాన్‌ బిజెపి ఎంఎల్‌ఏ బన్వారీలాల్‌ సింగ్‌ సింఘాల్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. ముస్లింలు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12-14 మందిని కంటున్నారని ఆరోపించారు. ముస్లింలు పాలకులైతే హిందువులు రెండోతరగతి పౌరులౌతారన్నారు. ముస్లిం జనాభా పెరుగుతోందనే ప్రచారం కొనసాగింపుగా ఫలానా సామాజిక తరగతి అనే పేరు లేకుండా ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం జనాభా నియంత్రణ బిల్లును ముందుకు తెచ్చింది. అసోం కూడా అదే దారిలో ఉంది. రెండు చోట్లా ముస్లింల మీద తప్పుడు ప్రచారం ఎన్నికల లబ్దే అసలు కథ.


పూ సంస్ధ కనుగొన్న ముఖ్యఅంశాలంటూ ఆర్గనైజర్‌ రాసిన కొన్ని అంశాలూ, అది చేసిన వ్యాఖ్యానం ఎలా ఉన్నప్పటికీ వాటి నిజానిజాలేమిటో చూద్దాం. కాషాయ దళాలు చేస్తున్నది గోబెల్స్‌ ప్రచారం, వక్రీకరణ అని అనేక వివరాలు వెల్లడించినా ఆప్రచారం కొనసాగుతూనే ఉంది. ఒక అబద్దాన్ని వందసార్లు ప్రచారం చేస్తే 101వ సారి నిజం అవుతుందన్నది గోబెల్స్‌ సిద్దాంతం. మనకూ బ్రాహ్మణుడు, మేక, నలుగురు దొంగల కథ తెలిసిందే.మన జనాభా వివరాలు 2011లో సేకరించినవి మాత్రమే అధికారికంగా ఉన్నాయి. ఆ తరువాత పెరిగిన జనాభా సంఖ్య అంచనా మాత్రమే. 1951-2011 మధ్య మొత్తం జనాభా 36.1 కోట్ల నుంచి 120 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో హిందువులు 30.4 కోట్ల నుంచి 96.6కోట్లకు పెరిగింది. ముస్లింలు 3.5 నుంచి 17.2 కోట్లకు, క్రైస్తవులు 0.8 నుంచి 2.8 కోట్లకు, సిక్కులు 0.68 నుంచి 2.08 కోట్లకు, బౌద్దులు 0.27 నుంచి 84లక్షలకు, జైనులు 17 నుంచి 45లక్షలకు పెరిగారు. పార్సీలు 1.2లక్షల నుంచి 60వేలకు తగ్గారు.


1990దశకకానికి ముందు మొత్తం జనాభా పెరుగుదల రేటు 22శాతం ఉండగా 2000నాటికి 18శాతానికి తగ్గింది. ఇదే కాలంలో హిందువుల పెరుగుదల రేటు 24 నుంచి 17శాతానికి తగ్గగా ముస్లింల రేటు తగ్గుముఖం పట్టి 25శాతం వద్ద, క్రైస్తవుల రేటు 16శాతం వద్ద ఉంది. ముస్లింల రేటును చూపే కాషాయ దళాలు కుట్ర సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి.ప్రస్తుతం హిందువులు 79.8శాతం, ముస్లింలు 14.2, క్రైస్తవులు ఆరుశాతం ఉన్నారు.1951-2011కాలంలో హిందువులు నాలుగుశాతం తగ్గగా ముస్లింలు నాలుగుశాతం పెరిగారు. అలాంటపుడు 2035 నాటికి ముస్లింలు హిందువులను మించి పోతారని ఏ గణాంకాలు లేదా వాస్తవాలను బట్టి ఎలా చెబుతున్నారు ? నమ్మేవారు ఎలా చెవులప్పగిస్తున్నారు ? దేశంలో జరుగుతున్నదేమిటి ? 1992లో మిగతా సామాజిక తరగతులతో పోలిస్తే ముస్లిం మహిళలు సగటున ఒక బిడ్డను ఎక్కువగా కలిగి ఉన్నారు. 1992లో మొత్తం మహిళలకు సగటున 3.4గురు పిల్లలు ఉండగా 2015 నాటికి 2.2కు తగ్గారు. ఇదే కాలంలో 4.4గా ఉన్న ముస్లిం పిల్లలు 2.6కు, హిందూ పిల్లలు 3.3 నుంచి 2.1కి తగ్గారు. దీని అర్ధం ఏమిటి ? రెండు సామాజిక తరగతుల పిల్లల తేడా 1.1 నుంచి 0.5కు తగ్గింది. క్రైస్తవుల పిల్లలు 2.9 నుంచి రెండుకు తగ్గారు. మరి క్రైస్తవులు, ముస్లింలతో దేశాన్ని నింపివేసే కుట్ర జరుగుతోందని చేస్తున్న ప్రచారానికి ఆధారం ఏమిటి ?ప్రజనన లేదా గర్భధారణకు మహిళల్లో విద్యకు సంబంధం ఉంటుందనేది అంతర్జాతీయంగా రుజువైన అంశం.2015 సమాచారం ప్రకారం క్రైస్తవుల్లో మహిళలు సగటున ఏడున్నర సంవత్సరాలు, హిందువుల్లో 4.2, ముస్లింల్లో 3.2సంవత్సరాలు ఉంది. అందువలన ముస్లింల్లో కూడా విద్య పెరిగితే పిల్లల సంఖ్య తగ్గుతుంది. విద్యతో పాటు మత విశ్వాసాలు, పరిసరాలు, సంపద, ఆదాయం వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

2019లో ఐక్యరాజ్య సమితి వెల్లడించిన సమాచారం ప్రకారం భారత్‌లో జన్మించిన వారు విదేశాల్లో 1.75లక్షల మంది నివసిస్తుండగా విదేశీయులు 52లక్షల మంది నివసిస్తున్నారు. ఇది ఆ ఏడాది మన జనాభాలో కేవలం 0.4శాతం మాత్రమే. అందువలన వలసవలన మతపరంగా పెద్దగా ఎలాంటి మార్పు లేదని కూడా తేలింది.కొన్ని వార్తల ప్రకారం మరికొన్ని లక్షల మంది ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చి అనధికారికంగా భారత్‌లో నివసిస్తున్నారని చెబుతున్నారని అయితే దానికి తగిన రుజువులు లేవని పూ సంస్ధ పేర్కొన్నది.2012 పూ సంస్ధ అంచనా ప్రకారం భారత్‌ను వదలి వెళుతున్నవారిలో ముస్లింలు, క్రైస్తవులే ఎక్కువ ఉంటారని, భారత్‌కు వలస వచ్చే వారిలో మూడింట రెండువంతుల మంది హిందువులని పేర్కొన్నది. మతమార్పిడి ప్రచార బండారాన్ని కూడా పూ సంస్ధ వెల్లడించింది. ఇటీవల జరిపిన తమ సర్వే ప్రకారం 99శాతం హిందువులు,97శాతం ముస్లింలు, 94శాతం క్రైస్తవులు తాము పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నామని చెప్పారని, 0.7శాతం మంది హిందువులుగా పెరిగిన వారు తాము హిందువులుగా ఉండదలచుకోలేదని చెప్పగా హిందూమతానికి వెలుపల పెరిగిన 0.8శాతం మంది తాము ఇప్పుడు హిందువులుగా ఉన్నట్లు చెప్పారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి ? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ము-కాశ్మీరులో కోటీ 30లక్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు.దేశ జనాభాలో వీరు ఐదుశాతమే, 95శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబులో సిక్కులు, నాగాలాండ్‌(20లక్షలు), మిజోరం(పది లక్షలు), మేఘాలయ(30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. మరి హిందువులు ? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. కాషాయ దళాల వేదగణిత లెక్కలు కాకుండా దీనికి భిన్నమైన అధికారిక తాజా సమాచారం ఉంటే సరిచేసుకుందాం.2011లెక్కల ప్రకారం వహిందువుల్లో జననాల రేటు 1991-2001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి ? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబనియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా ? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా ? దేశంలో పురుషులు-స్త్రీల నిష్పత్తి 1000-940, అదే పిల్లల్లో చూస్తే 1000-916 మాత్రమే ఉంది. ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా ? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946,911గానూ జమ్మూకాశ్మీరులో 889,862గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా ? అనేక మంది పేదరికం కారణంగా హైదరాబాద్‌ వంటి చోట్ల ముస్లింలు అరబ్‌ షేకులకు తమ పిల్లలను కట్టబెడుతున్నారనే అంశం పలుసార్లు వెలుగులోకి వచ్చింది.


అయితే దేశంలో బహుభార్యాత్వం లేదా ? ఘనమైనదిగా కొందరు చెప్పుకొనే మన చరిత్ర, సంస్కృతిలో ఎక్కువ మంది దేవుళ్లకు, రాజులు, రంగప్పలకు ఒకరి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని లొట్టలు వేసుకుంటూ రంజుగా చెప్పుకుంటాం కదా. ఇక వర్తమానానికి వస్తే దేశమంతటా ముస్లింలకు, గోవాలో హిందువులు ఒకరి కంటే ఎక్కువ మందిని కలిగి ఉండవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. చిత్రం ఏమంటే అనుమతి ఉన్న ముస్లింల్లో బహుభార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8శాతం ఉంది. దీన్నేమంటారు ?
2035నాటికి ముస్లింల సంఖ్య పెరిగి పోనుందనే ప్రచార కథేమిటో చూద్దాం. అసలు ఇది ఎక్కడ పుట్టింది ? ఒకరాయి వేద్దాం మనల్ని అడగొచ్చేదెవరులే అనే ధైర్యంలో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. 2017ఏప్రిల్‌ ఐదవ తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూ సంస్ధ విశ్లేషణకు ” 2035 నాటికి ముస్లింల పిల్లల సంఖ్య ఇతరులను అధిగమించనుంది ” అనే శీర్షిక పెట్టింది. కానీ పూ సంస్ధ నివేదిక చెప్పిందేమిటి ? ప్రపంచంలో 2075నాటికి ఇస్లాం పెద్ద మతంగా అవతరిస్తుంది. 2015 -2060 మధó్య ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువ మంది పిల్లలను కంటారు. ఆ రెండు మతాల మధ్య 2055-60లో తేడా 60లక్షలు. ముస్లింలు 23.2 కోట్లు, క్రైస్తవులు 22.6కోట్లు అని, 2035నాటికి స్వల్పంగా క్రైస్తవ తల్లుల కంటే ముస్లిం తల్లులు కనే పిల్లల సంఖ్య ఎక్కువ ఉంటుందని పేర్కొన్నది. దాన్ని మన దేశంలో హిందూత్వశక్తులు హిందూమతానికి వర్తింప చేసి ప్రచారం చేస్తున్నారు. ఇదే కాలంలో మన దేశంలో హిందువుల సంఖ్య తగ్గనుందని అంచనా. 2050నాటికి ముస్లింలు ఇప్పుడున్న 14.4 నుంచి 18.4శాతానికి పెరుగుతారని అంచనా వేస్తున్నారు.ఇప్పుడున్న మాదిరి వారిలో కూడా కుటుంబనియంత్రణ వేగం పెరిగితే తగ్గనూ వచ్చు.

ఇక వాట్సాప్‌ను బిజెపి ఎలా ఉపయోగిస్తోందో అమిత్‌ షా మాటల్లోనే చెప్పాలంటే ” అది నిజమైనా కల్పితమైనా ఏ సందేశాన్నైనా మనం వైరల్‌(విపరీతంగా ప్రచారం) చేయగలం. సామాజిక మాధ్యమం ద్వారా మనం కేంద్రంలో, రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. వర్తమానాలను వైరల్‌ చేయాలి. ఉత్తర ప్రదేశ్‌లో మనం ఇప్పటికే 32లక్షల మందితో వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశాం. ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు వారు ఒక వర్తమానాన్ని పంపుతారు. ” ఇది 2018లో రాజస్తాన్‌లోని కోట పట్టణంలో బిజెపి సామాజిక మాధ్యమ కార్యకర్తల సమావేశంలో చేసిన ప్రసంగం అంటూ హిందీ దినపత్రిక దైనిక్‌ భాస్కర్‌ రాసిన వార్త. దేశమంతటా దానికి అలాంటి వాట్సాప్‌ గ్రూపులు, వాటిలో పంపే సమాచారం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


భక్తుల నీరాజనాలు, విశ్వగురువు అంటూ ప్రశంసలు అందుకుంటున్న బిజెపి నేత నరేంద్రమోడీ ఏ క్షణాన జాతీయ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టారో అది ఎలాంటి ముహూర్తమో తెలియదు. మేకిన్‌ ఇండియా(భారత్‌లో తయారీ), మేక్‌ ఇండియా(భారత్‌ తయారీ) పేరు ఏదైతనేం గానీ ఇచ్చిన పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే మన జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దానికి అవరమైన సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయెల్‌, అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు లేదా అక్కడ నైపుణ్య శిక్షణ పొందారు. పుంఖాను పుంఖాలుగా అవివేకం, కుహనావార్తల ఉత్పత్తి జరుగుతోంది, దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమిది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.

” ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి.ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే ” తన మీన్‌ కాంఫ్‌ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్‌ రాసిన అంశమింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు దేశంలో కాషాయ దళాల ప్రచారాల తీరు ఎలా ఉందో కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా అవగతం అవుతుంది.