Tags

, , , ,

ఎం కోటేశ్వరరావు


రష్యా నవంబరు విప్లవం గురించి ప్రపంచాన్ని కుదిపివేసిన ఆ పదిరోజులు అంటూ అమెరికన్‌ జర్నలిస్టు జాన్‌ రీడ్‌ రాశారు. 1917 నవంబరు ఏడవ తేదీ( పాత కాలెండరు ప్రకారం అక్టోబరు 25)న జారు చక్రవర్తిని కూల్చివేసి కమ్యూనిస్టులు ప్రధమ శ్రామిక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు.1991లో దాన్ని కూల్చివేశారు.అయినా ఆ విప్లవం ఇప్పటికీ,ఎప్పటికీ శ్రమజీవుల పోరాటాలకు ఉత్తేజం కలిగించేదే, గుణపాఠాలు నేర్పేదే. దాని గురించి ఎంత రాసినా, ఎన్నిసార్లు రాసినా తరిగేది కాదు. 2017నవంబరు ఆరవ తేదీన అమెరికాలోని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక రాసిన విశ్లేషణకు ” వందేండ్ల తరువాత తిరిగి వచ్చిన బోల్షివిజం, మనం ఆందోళన పడాలి ” అని శీర్షిక పెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. దాని ప్రకారం అక్టోబరు విప్లవం పునరావృతం అవుతుందా ? రష్యాలో తిరిగి సోషలిజం వస్తుందా ? అమెరికాలో కుర్రకారు పెట్టుబడిదారీ విధానాన్ని ఎందుకు తిరస్కరిస్తోంది ? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు.చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా, లావోస్‌, కంపూచియా సోషలిస్టు దేశాలుగా నిలిచి కొనసాగుతున్నప్పటికీ సోవియట్‌, తూర్పు ఐరోపా దేశాలకు తగిలిన ఎదురు దెబ్బలతో అనేక మంది నిరాశ చెందారు. తరువాత లాటిన్‌ అమెరికా, ఇతర అనేక దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు వామపక్ష శక్తులకు ఉత్తేజమిస్తున్నాయి. నవంబరు విప్లవదినం సోషలిస్టు దేశాలకు ఉత్సవ రోజైతే మిగిలిన వారికి దీక్షాదినం. ఒక్కసారి తాజా పరిణామాలను అవలోకిద్దాం.


తమకు నచ్చనివారిని, విబేధించేవారిని దేశద్రోహులు, అర్బన్‌నక్సల్స్‌, తుకడేతుకడే గాంగ్‌, హిందూవ్యతిరేకులని ముద్రవేయటం మన దేశంలో ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం. నిత్యం స్వదేశీ కబుర్లు చెబుతూ విదేశాల నుంచి తెచ్చుకున్న అనుకరణ ఇది. దీన్ని మెకార్ధిజం అంటారు. అమెరికాలో 1947 నుంచి 1957వరకు జోసెఫ్‌ మెకార్ధీ అనే సెనెటర్‌ ఉండేవాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. మీడియాలో అందరూ వామపక్ష భావజాలం ఉన్నవారే కనుక ఇలాంటి వార్తలు ఎక్కడా రావు అంటూ కల్పిత అంశాలను వాట్సాప్‌లో పంపే అబద్దాల కోర్లు మనకు నిత్యం దర్శనమిస్తుంటారు. వీరికి ఎల్లవేళలా మెకార్ధీ ఉత్తేజమిస్తుంటాడు. వారి స్నేహితుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నపుడూ, ఇప్పుడు పదవి పోయిన తరువాత మెకార్ధీని అనుసరిస్తున్నాడు. మెకార్ధీ బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు, నచ్చని వారికి కమ్యూనిస్టు ముద్రవేసేవాడు.రచయితలు, జర్నలిస్టులు, సినిమాతారలు, వాణిజ్యవేత్తలు ఒకరేమిటి లొంగని ప్రతివారినీ బెదిరించేవాడు. అలాంటి వారందరినీ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసేది. ఎంతగా వాడి ప్రభావం పెరిగిందంటే ఎన్నికల్లో వాడు సమర్ధించిన వారు గెలిచి, వ్యతిరేకించిన వారు ఓడారు. వాడి ఉపన్యాలకు మీడియా విపరీత ప్రచారమిచ్చేది.చివరికి వాడు చెప్పిన అబద్దాలకు సెనెట్‌ మందలించింది. అబద్దాలు, అవలక్షణాలన్నీ విచారణలో బహిర్గతమయ్యాయి.నలభై ఎనిమిది సంవత్సరాలకే పచ్చి తాగుబోతుగా మారి జబ్బులతో దిక్కులేని చావు చచ్చాడు. ఇప్పుడు అమెరికాలో మెకార్ధీలు తామరతంపరగా పుట్టుకువచ్చారు. డెమోక్రాట్లు, పురోగామివాదులు, తమను ఆక్షేపించేవారిని సోషలిస్టులు, కమ్యూనిస్టులుగా ముద్రవేసి గతాన్ని పునరావృతం చేసేందుకు పూనుకున్నారు.అయితే బెర్నీశాండర్స్‌ వంటి ప్రముఖులు అవును మేము సోషలిస్టులమే అని ముందుకు రావటంతో లక్షల మంది యువత తాము కూడా సోషలిస్టులమే,కమ్యూనిస్టులమే అని ప్రకటించుకోవటం పెరుగుతోంది.

నవంబరు విప్లవ సమయంలో సోషలిజం ఒక ఊహ. దానికి వ్యతిరేకంగా సైద్దాంతిక చర్చ జరిగింది. పెట్టుబడిదారులు సవాళ్లు విసిరారు. తరువాత సోవియట్‌ , సోషలిస్టు శిబిరం ఏర్పడింది. వైఫల్యాలు ఎదురయ్యాయి. గత వందేళ్లుగా సోషలిజం వైఫల్యం గురించి ప్రచారం చేశారు, దానికి అమెరికా ప్రధాన కేంద్రం. చిత్రం ఏమంటే ఇప్పుడు అక్కడ సోషలిజం వైఫల్యం బదులు పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ జరుగుతోంది. ఇదొక అనూహ్య పరిణామం. పెట్టుబడిదారీ సమర్ధకులు మింగా కక్కలేని స్ధితిలో ఉన్నారు. అక్కడ మీడియా సోషలిజానికి అనుకూలం కాదు, బలమైన కమూనిస్టుపార్టీ లేదు. అయినా అక్కడి విదార్ధులు సోషలిజం మంచిది, ప్రైవేటు ఆస్తిహక్కులు రద్దవుతాయి అని చెబుతున్నారు. ఎంత మాట అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా ఇది, వేదంలా విలువైన మాట అనేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు.కాబట్టి ప్రైవేటు ఆస్తి హక్కులను తీసివేసే వారిని ఎన్నుకోవాలని మీరు కోరుకుంటున్నారు అని ఒక విలేకరి ఒక విద్యార్ధితో అన్నాడు. దానికి లేదు కేవలం పన్ను ఎగవేతకు మాత్రమే ఆస్తి హక్కులు కాదు అన్నాడు విద్యార్ది. డబ్బు అంటే ఆస్తేకదా అని విలేకరి రెట్టించాడు. పన్ను ఎగవేత ఆస్తి హక్కు అనేట్లైతే కచ్చితంగా దాన్ని రద్దు చేయాల్సిందే అని విద్యార్ధి సమాధానమిచ్చాడు. అమెరికా అంతటా ఇలాంటి ఉదంతాలు రోజురోజుకూ పెరుగుతున్నా. అసమానతలు, తమ రుణాలు కొండల్లా పెరగటం, తీరే దారి కనిపించకపోవటంతో విద్యార్దులు, యువతలో ఇలాంటి ఆలోచనలు పెరుగుతున్నాయి.


గత వంద సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పుడు 40శాతం మంది అమెరికన్లలో, 49శాతం మంది యువతలో సోషలిజం పట్ల సానుకూలత ఉంది. అమెరికాలో స్కూలు విద్యాకమిటీలు చురుకుగా పని చేస్తున్నాయి. వాటి సమావేశాలు కమ్యూనిస్టు వ్యతిరేకులకు దడపుట్టిస్తున్నాయి. ఆ సమావేశాల్లో రాజకీయాలను చర్చించకూడదనే వారు కొందరైతే, రద్దు కోరుతున్నారు కొందరు. అది ఎంతగా అంటే ఆ కమిటీల ద్వారా తదుపరి అక్టోబరు విప్లవాన్ని త్వరలో కమ్యూనిస్టులు ప్రారంభించనున్నారని ఒక జర్నలిస్టు తాజాగా తన అక్కసును వెళ్లగక్కాడు. వాస్తవాన్ని చూస్తే దేశమంతటి నుంచి డెమోక్రటిక్‌ సోషలిస్టులు వందమంది ఎన్నికయ్యారని, బెర్లిన్‌ గోడ పతనంతో సోషలిజాన్ని వ్యతిరేకించే వారికి నోరుపడిపోయిందని, తరువాత ఒక మంచి అంశంగా తీవ్రవాద ముస్లిం జీహాద్‌ ప్రచారం వచ్చింది. మార్క్సిస్టు టీచర్లు మీ పిల్లల లింగమార్పిడి చేస్తున్నారని మధ్యతరగతి అమెరికన్లను నమ్మించటం కంటే ఉగ్రవాదంపై పోరులో మనం విజయం సాధించామని చెప్పటం కష్టమని, ఎందుకంటే అవమానకర రీతిలో ఉగ్రవాదంపై మన ప్రపంచ పోరు ముగిసిందని వాపోయాడు. అమెరికా కమ్యూనిజం వైపు పయనిస్తోందని జనాన్ని రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు.చివరకు కరోనా కారణంగా క్రిస్మస్‌ సందర్భంగా ఎక్కువ మంది గుమికూడవద్దని అమెరికా అంటువ్యాధుల నివారణ సంస్ద డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌసీ సలహా ఇవ్వటం కూడా కమ్యూనిజం దిశగా ప్రయాణంలో భాగమే అని రిపబ్లికన్‌ పార్టీ ఎంపీ జిమ్‌ జోర్డాన్‌ ఆరోపించాడు. పాఠశాల విద్యాకమిటీలు వామపక్ష అధికార కేంద్రాలుగా ఉన్నాయని, వాటి సమావేశాలకు వెళ్లే వారిని స్ధానిక ఉగ్రవాదులుగా ఎఫ్‌బిఐ పరిగణించాలని సెలవిచ్చాడు.


కమ్యూనిజానికి వ్యతిరేకంగా గూఢచారిగా పని చేసిన ఒక మాజీ అధికారి అమెరికాలో కమ్యూనిస్టుల కార్యక్రమం ఇదీ అంటూ పత్రికల్లో రాశాడు. ఏమిటట,యువతను సెక్స్‌, మాదక ద్రవ్యాలు, వీడియో గేమ్‌లకు బానిసలుగా చేసి వారి ధృడత్వాన్ని దెబ్బతీసి 17-24 ఏండ్ల వయసున్నవారిలో 71శాతం మందిని మిలిటరీకి పనికి రాకుండా చేయటం.ప్రస్తుతం 1,500 దినపత్రికలు, 1,100 వార,పక్ష,మాసపత్రికలు, 1,500 టీవీ ఛానళ్లు, 9,000వేల రేడియో స్టేషన్లు, 2,400 ప్రచురణ సంస్దలుండగా అవన్నీ కేవలం ఆరు కార్పొరేషన్ల ఆధీనంలో ఉన్నాయి, వీటిన్నింటి ప్రచారం మీద అదుపుసాధించటం, జనాలను శత్రుబృందాలుగా విడదీయటం, తమ నేతల మీద విశ్వాసం లేకుండా చేయటం, ప్రజాస్వామ్యం గురించి ప్రబోధించి నిర్దాక్షిణ్యంగా, అక్రమాలతో వేగంగా అధికార స్వాధీనం,ప్రభుత్వంతో ఇష్టం వచ్చినట్లు వివిధ పధకాలకు ఖర్చు చేయించటం, ప్రజల్లో అశాంతిని ప్రోత్సహించటం, నైతిక విలువలను కుప్పకూల్చటం, మారణాయుధాలను కొనిపించాలి, తరువాత వాటిని తిరిగి తీసుకొని జనాన్ని ఇబ్బందుల్లో పడేయటం. ఈ కార్యక్రమంతో కమ్యూనిస్టులున్నారు గనుక మన దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 2022లో వాటిని తొలగించాలంటూ రాశాడు. ఊరూపేరూ లేకుండా లేదా ఏదో ఒక సంస్ద పేరుతో ముస్లింల అజెండా లేక హిందువుల అజెండా ఇది అని రెచ్చగొడుతూ రాసి పంచే కరపత్రాల గురించి మనకు తెలిసిందే. అమెరికా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటివే జరుగుతుంటాయి.


అమెరికాలో మాదిరి బ్రిటన్‌ యువతలో కూడా పెట్టుబడిదారీ విధానం మీద భ్రమలు తగ్గుతున్నాయి. ఇటీవల జరిగిన సర్వేల్లో 80శాతం మంది కుర్రకారు తమ ఇబ్బందులకు పెట్టుబడిదారీ విధానమే కారణమన్నారు. మూడింట రెండువంతుల మంది సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధ కావాలన్నారు.పద్దెనిమిదవ శతాబ్దిలో తత్వవేత్త జీన్‌ జాక్విస్‌ రౌసియవు చెప్పిన అంశాలను ఒక విశ్లేషకుడు ఉటంకించారు. ” తినేందుకు జనానికి ఏమీ మిగలనపుడు వారు ధనికులను తింటారు” అన్నాడు. దీనికి సూచికగానే బ్రిటన్‌ సామాజిక మాధ్యమంలో దర్శనమిస్తున్న టిక్‌టాక్‌, ఇతర వీడియోలలో యువత ఏదైనా తినే సమయంలో వినియోగించే ఫోర్కులతో కార్లలో ఉన్నవారు, ఫ్రిజ్‌ల దగ్గర ఉన్నవారిని చూపుతూ ఇవి మాకు లేకపోవటానికి మీరే కారకులు అనే అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కనుక ధనికులు నిద్రించేటపుడు ఒకకన్ను తెరవటాన్ని ప్రారంభించాలన్న మాట అని ఒక విశ్లేషకుడు పేర్కొన్నాడు. లండన్‌ కేంద్రంగా పని చేసే ఎకనమిక్‌ ఎఫైర్స్‌ అనే సంస్ధ జూలైలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం దేశంలో గృహ సంక్షోభానికి కారణం పెట్టుబడిదారీ విధానమే అని 80శాతం యువత భావిస్తోంది. వాతావరణ అత్యవసర పరిస్ధితి ప్రత్యేకించి పెట్టుబడిదారీ వ్యవస్ధ సమస్య అని75శాతం మంది చెప్పారు. సోషలిస్టు ఆర్ధిక వ్యవస్ధలో జీవించాలని కోరుకుంటున్నట్లు 67శాతం చెప్పారు పెట్టుబడిదారీ విధాన సమర్ధకులకు ఇది హెచ్చరిక అని సదరు సంస్ధ పేర్కొన్నది. ఈ లెక్కల గురించి కొందరికి చిన్న చూపు ఉండవచ్చు, వీటిని చెప్పింది వామపక్షవాదులు కాదని గమనించాలి.2019లో బర్నార్డో సంస్ధ జరిపిన సర్వేలో పాతికేండ్ల లోపు వారిలో మూడింట రెండువంతుల మంది తమ తలిదండ్రులతో పోలిస్తే తమ జీవితాలు అధ్వాన్నంగా ఉంటాయనే భయాన్ని వ్యక్తం చేశారు.ఆర్ధిక పరిస్ధితులే యువతను వామపక్ష అభిమానులుగా మారుస్తున్నాయని ” జనరేషన్‌ లెఫ్ట్‌ ” అనే పుస్తక రచయిత కెయిర్‌ మిల్‌బరన్‌ అన్నారు.


బ్రిటన్‌లో సుఖవంతమైన జీవితం గడపాలంటే చేతిలో మంచి జీతం తెచ్చే ఒక డిగ్రీ ఉండాలని చెప్పిన రోజులున్నాయి.2020లో జరిపిన సర్వే ప్రకారం డిగ్రీ ఉన్న-లేని వారి వేతన తేడా గణనీయంగా తగ్గినట్లు తేలింది. మరోవైపు విద్యార్ధుల అప్పులు సగటున ఒకరికి 40,280 పౌండ్లకు చేరాయి.మూడోవంతుకు పైగా డిగ్రీ ఉన్న వారు డిగ్రీతో పనిలేని ఉద్యోగాలు చేస్తున్నట్లు తేలింది.దీనికి తోడు మొత్తంగానే వేతనాలు పడిపోతున్నాయి.మన దేశంలో రైతులు ఎక్కడ కావాలంటే అక్కడ తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని పాలకులు చెబుతున్నట్లుగానే బ్రిటన్‌ నేతలు కూడా మీకు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం ఏముంది ” స్వయం ఉపాధి పధకంలో చేరండి ” అని చెప్పారు. మూడోవంతు మంది పాతికేండ్ల లోపు కార్మికులు వారానికి ఎంత వేతనం వస్తుందో తెలియని పనులు చేస్తున్నారు. స్వయం ఉపాధి పేరుతో నమోదైన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టర్లవద్ద కనీసవేతనాలు, వేతనంతో కూడిన సెలవులు లేని పనులు చేస్తున్నారు. స్వేచ్చ దొరికింది గానీ పనికి భద్రత లేమి వారికి బహుమతిగా దక్కింది.యువత సోషలిజం వైపు మొగ్గుతున్నదంటే దాని అర్దం వారంతా విప్లవకారులుగా మారుతున్నారని కాదు. ఎలాంటి సంక్షోభాలు లేని సోషలిస్టు చైనా, అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్న సరకులను వారు నిత్యం చూస్తున్నారు గనుక అలాంటి విధానం మంచిదనే సానుకూలతవైపు మొగ్గుతున్నారు. అవసరమైతే తరువాత విప్లవకారులుగా మారతారు.యువ రచయిత్రి సాలీ రూనే తాజా నవల ” ఇన్‌ ద బ్యూటిఫుల్‌ వరల్డ్‌ వేర్‌ యు ఆర్‌ ” (అందమైన లోకంలో మీరెక్కడున్నారు)లో ఒక పాత్ర చేత ఇలా పలికించారు. ” తొలుత నేను మార్క్సిజం గురించి మాట్లాడినపుడు జనాలు నన్ను చూసి నవ్వారు, ఇప్పుడు అది అందరి నోటా నానుతోంది” దీని అర్ధం ఏమిటి ప్రచ్చన్న యుద్దంలో తాము విజయం సాధించినట్లు పెట్టుబడిదారులు ప్రకటించుకున్న మూడు దశాబ్దాల తరువాత కుర్రకారు మరింత స్వేచ్చగా పెట్టుబడిదారీ విధానం, సోషలిజం గురించి చర్చిస్తున్నారనే కదా ! అందుకే ఆర్ధికవేత్త జేమ్స్‌ మిడ్‌వే ఇటీవల ఒక తన వ్యాసానికి ” జనరేషన్‌ లెఫ్ట్‌ మైట్‌ నాట్‌ బి దట్‌ లెఫ్ట్‌ ఆఫ్టరాల్‌ ” ( ఆ వామపక్ష వాదులా… వారెంత అని ఉపేక్షించిన మాదిరి కాదు కుర్ర వామపక్షవాదులు ” అని శీర్షిక పెట్టారు.


రష్యన్‌ కమ్యూనిస్టు పార్టీ అక్కడి ప్రభుత్వం పట్ల దూకుడుగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం కొంత మందిలో ఉంది. ఇది ఎవరూ తీర్పు ఇచ్చే అంశం కాదు. ” తాజాగా జరిగిన డ్యూమా(పార్లమెంట్‌) ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్లు,యువ కమ్యూనిస్టులు, పార్టీతో కలసిన ఇతర వామపక్ష శక్తులు అధ్యక్షుడు పుతిన్‌కు అనూహ్య సవాలు విసురుతున్నారు. పాత తరం అంతరిస్తున్నది, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే కొత్త పటాలం, సామాజిక మాధ్యమంతో పనిచేసే కమ్యూనిస్టులు ఎదుగుతున్నారు. వారు సిద్దాంత ఉపన్యాలు చేయకపోవచ్చు, ఎర్రజెండాలను ఊపకపోవచ్చు, వారు పుతిన్‌ ప్రభుత్వ అవినీతి, దేశంలో దారిద్య్రం గురించి నిరసన తెలుపుతున్నారు ” అని ఒకరు పేర్కొనగా, ” ఇది నిజంగా రష్యన్‌ రాజకీయాలలో శక్తివంతమైన టెక్టోనిక్‌ ప్లేట్ల (భూమి ఖండాలుగా విడిపోయి కోట్ల సంవత్సరాలు గడచినా ఆ ముక్కలు సముద్రంలో ఇంకా కుదురుకోలేదు, వాటి కదలికలు సునామీలు, భూకంపాలకు దారితీస్తున్నాయి. వాటినే శిలావరణం అంటున్నారు-రష్యన్‌ యువ వామపక్ష వాదులు రాజకీయ సునామీలు, భూకంపాలు సృష్టించగలిగిన వారని భావం) వంటివి, మార్పునకు ఇది ప్రారంభం ” అని లండన్‌ విశ్లేషకుడు మార్క్‌ గలియోటి అన్నాడు. సెప్టెంబరు పార్లమెంటు ఎన్నికల్లో అధికారికంగా ప్రకటించిన వాటి కంటే కమ్యూనిస్టులకు ఎక్కువ, అధికార పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా గలియోటి అన్నాడు. ” అధికార యునైటెడ్‌ రష్యా పార్టీకి వెల్లడైన మద్దతు స్ధాయి గురించి రష్యన్‌ కులీనులకు ఎలాంటి భ్రమలు లేవు ” అని ఆర్‌ పోలిటిక్స్‌ అనే రాజకీయ సలహా సంస్ధను ఏర్పాటు చేసిన తాతియానా స్టానోవయా చెప్పింది. రష్యా రాజకీయాలలో కమ్యూలను ఇంకేమాత్రం విస్మరించకూడదని, వారిని అణచివేస్తే అజ్ఞాతవాసానికి వెళతారని కొందరు పేర్కొన్నారు. ఇంకా అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పటికీ స్ధలాభావం వలన మరోసారి చర్చించవచ్చు.


చరిత్ర పునరావృతం అవుతుందని పెద్దలు చెప్పారు, దాని అర్ధం గతం మాదిరే జరుగుతుందని కాదు. ప్రతి తరంలోనూ నిరంకుశ పాలకులు తలెత్తినపుడు వారిని ఎదిరించేవారు కూడా అదేమాదిరి తయారవుతారు. ఒకానొక కాలంలో ప్రత్యక్షంగా తలపడ్డారు, కర్రలు, విల్లంబులు, కత్తులతో తిరుగుబాట్లు జరిపారు. తుపాకులు వచ్చిన తరువాత అలాంటి అవసరం లేదు. పద్దతి మారింది తప్ప తిరుగుబాటు లక్ష్యం ఒక్కటే -అదే అణచివేత, దోపిడీ నిర్మూలన, ఇప్పుడూ అదే జరుగుతోంది. ” ఐరోపాను ఒక భూతం వేటాడుతోంది-అది కమ్యూనిస్టు భూతం. పాత ఐరోపాలోని అధికారశక్తులన్నీ ఈ దయ్యాన్ని వదిలించుకొనేందుకు అపవిత్ర కూటమి గట్టాయి. పోప్‌, జార్‌, మెట్రినిచ్‌, గుయిజోట్‌, ఫ్రెంచి విప్లవకారులు, జర్మన్‌ పోలీసు గూఢచారులు చేతులు కలిపారు.” అనే పదాలతో 1848 ఫిబ్రవరి 21న తొలిసారిగా ప్రచురితమైన కమ్యూనిస్టు ప్రణాళిక (మానిఫెస్టో) ప్రారంభ పదాలవి. తరువాత పరిస్దితి మారింది. ఆ కమ్యూనిస్టు భూతం అన్ని ఖండాలకు విస్తరించింది. అందువలన ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు వ్యతిరేకులందరూ అప్పటి నుంచి ఏదో ఒక రూపంలో దాన్ని అంతమొందించాలని చూస్తూనే ఉన్నారు. ఒక దుర్మార్గుడు మరణిస్తే మరొకడు పుట్టుకువచ్చినట్లుగా ఒక విప్లవకారుడిని అంతమొందిస్తే వేయి మంది కొత్తవారు రంగంలోకి వస్తున్నారు. దోపిడీ శక్తులను ప్రతిఘటించే, పీచమణిచే కమ్యూనిస్టులూ అవతరిస్తున్నారు. ఇరు పక్షాల ఎత్తుగడలూ, రూపాలు అన్నీ మారాయి.


ఈ నేపధ్యంలో చూసినపుడు మహత్తర నవంబరు(పాత కాలెండర్‌ ప్రకారం అక్టోబరు) విప్లవం గతం. అది ఒక్క రష్యాలోనే కాదు, దోపిడీ జరిగే ప్రతిచోటా అనివార్యం. దాని అర్ధం నవంబరులోనే జరగాలని, జరుగుతుందనీ కాదు. నవంబరు విప్లవం అంటే నరజాతి చరిత్రలో తొలిసారిగా రష్యా శ్రామికులు జారు చక్రవర్తి రూపంలో ఉన్న దోపిడీ శక్తులను కూల్చివేసి శ్రామిక రాజ్యఏర్పాటుకు నాందిపలికిన ఉదంతం. తరువాత చైనా విప్లవం అక్టోబరులోనే జయప్రదమైంది. రష్యాలో ఇప్పుడు జారు చక్రవర్తి లేడు. వాడి స్ధానంలో ఇప్పుడు ఉన్న శక్తులు వేరే ముసుగులు ధరించి ఉన్నాయి. ఆ లెనిన్‌, స్టాలిన్లు లేరు, నూతన తరం కమ్యూనిస్టులున్నారు. తిరిగి సోషలిజం స్ధాపన అనివార్యం అని నమ్ముతున్నారు. అయితే గతంలో మాదిరే వింటర్‌ పాలెస్‌ ముట్టడిస్తే కుదరదు. ఎందుకంటే అక్కడ జారు చక్రవర్తి లేడు. అధికార కేంద్రం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నుంచి మాస్కోకు మారింది. అందువలన మరోపద్దతి, మరో రూపం అనుసరించాల్సిందే. విప్లవ కాలంలో రష్యాలో కార్మికులు, రైతులూ, చైనాలో రైతులు ఎక్కువగా కార్మికులు తక్కువగా ఉన్నారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులు నామమాత్రం. దోపిడీ కొనసాగుతూనే ఉంది, దాన్ని అంతమొందించాల్సిందే. అందువలన అక్కడ విప్లవం రావాలంటే పాత పద్దతులు, ఎత్తుగడలూ పనికి రావు. విప్లవం చుంచెలుక వంటిది. అది నిరంతరం నేలను తవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ ఎలా బయటకు వస్తుందో తెలియదు, విప్లవం కూడా అలాంటిదే నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఎక్కడ, ఎలా బయట పడుతుందో చెప్పలేము.


వలసవాద కాలంలో శత్రువు ప్రత్యక్షంగా కనిపించేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పరిస్ధితులు మారాయి. కార్మికులకు తమ శ్రమను దోచుకుంటున్నవాడు ప్రత్యక్షంగా కనిపించడు, అసలు ఫ్యాక్టరీలే లేకుండా కూడా దోపిడీ సాగుతోంది. అందువలన ఎక్కడికక్కడ స్ధానిక పద్దతులు, ఎత్తుగడలు అనుసరించాల్సిందే. ఒక నమూనా అనేది లేదు, సాధ్యం కాదు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పాటు వ్యతిరేకించేశక్తులూ, సవాళ్లూ పెరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామాలను వివరించటం సాధ్యం కాదు. అందుకే అమెరికా, బ్రిటన్‌, రష్యాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలనే పరిమితంగా సృజించాల్సి వచ్చింది.