Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


వారు కన్నూరు, కాసరగోడ్‌, కోజికోడ్‌, మలప్పురం పట్టణాలలో ఏర్పాటు చేయరు. ఎర్నాకులం, తిరువనంతపురం, కొట్టాయంలలో చేస్తారు, ఇప్పుడు పాలక్కాడ్‌కు, ఎందుకు అంటూ ఆంగ్లంలో ఒక పోస్టు వాట్సాప్‌లో తిరుగుతోంది. కేరళకు చెందిన ఎంఎ యుసుఫ్‌ అలీ కుటుంబం అబుదాబీ కేంద్రంగా నిర్వహిస్తున్న లూలు గ్రూపు ఏర్పాటు చేస్తున్న షాపింగ్‌ మాల్స్‌ గురించిన పోస్టు అది. దేశంలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు కాషాయ దళాల అమ్ముల పొదిలోని అనేక అస్త్రాలలో లవ్‌ జీహాద్‌ ఒకటి. ఇప్పుడు కేరళలో దానికి షాపింగ్‌ మాల్‌ జీహాద్‌ను జత చేశారు. వ్యాపారానికి కూడా మతం రంగు పులిమారు. దాన్లో భాగమే లూలూ గ్రూప్‌ గురించి ప్రచారం. కొన్ని పట్టణాలలోనే మాల్స్‌ ఎందుకట ? ముస్లింలు నిర్వహిస్తున్న చిన్న దుకాణాలకు బదులు హిందువులు, క్రైస్తవులు ఎక్కువగా నిర్వహించే చిన్న దుకాణాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకొని వారిని దెబ్బతీసేందుకు ఇలా చేస్తున్నారని ఆ పోస్టులో చెప్పారు. ఒక్కో మాల్‌కు ఇరవై వేల మంది సిబ్బందిని తీసుకుంటారట. వారిలో మలప్పురం ప్రాంతం నుంచి ముస్లిం యువకులను15వేల మందిని, ఐదువేల మంది ముస్లిమేతర యువతులను తీసుకుంటారట. ఇలా వారిని ఒక దగ్గరకు చేర్చి లవ్‌ జీహాద్‌ను ప్రోత్సహించుతున్నారట. నోరుమెదిపితే ఉద్యోగం నుంచి తీసివేస్తారు గనుక యువతులు మౌనంగా ఉంటున్నారట. దీనిలో మరొక అంశం పదిహేనువేల మంది విశ్వాసపాత్రులైన ముస్లింకుటుంబాలను ముస్లిమేతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించటం. ఇది ఎందుకట ? ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఫలితాన్ని ప్రభావితం చేయాలంటే 30వేల ఓట్లు అవసరం కనుక ఇలా చేస్తున్నారట. అందుకోసమే ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారట. ఇందుకు గాను, ప్రపంచ ఉగ్రవాదులకు నిధులు అందచేయటంలో పేరు మోసిన ఒక అరబ్‌ దేశం నుంచి లూలు యజమాని పెట్టుబడులు సేకరిస్తున్నాడట. ఈ మాల్స్‌ వచ్చిన చోట ముస్లింల దుకాణాలు పెరిగి ఇతరులవి మూతపడుతున్నాయట. కనుక ఇలాంటి మాల్‌ జీహాద్‌ను అంతమొందించాలంటే రిలయన్స్‌, సెంట్రల్‌, బిగ్‌బజార్‌లకు మద్దతు ఇవ్వాలట. వినేవారుంటే ఏమైనా చెబుతారు, ఒక్కొక్క మాల్‌లో ఇరవైవేల మంది సిబ్బంది ఉంటారా ?


అసలు నిజం ఏమిటి ? లూలూ గ్రూపు బెంగలూరులో మాల్‌ ప్రారంభ సమయంలో అక్టోబరు 11న పిటిఐ వార్తా సంస్ద విలేకరితో యజమాని యుసుఫ్‌ అలీ మాట్లాడారు. కోచి, త్రిసూరులో తమ మాల్స్‌ ఏర్పాటు చేశామని, మొదటి దశలో నాలుగున్నరవేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఐదింటిలో మరో రెండు తిరువనంతపురం, లక్నోలో ఏర్పాటు అవుతాయన్నారు. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ టర్నోవర్‌ గత ఏడాది 740కోట్ల డాలర్లు.
ఇక ముస్లిమేతరులు ఉన్న ప్రాంతాల్లోనే మాల్స్‌ ఏర్పాటు అన్న ప్రచార బండారాన్ని చూద్దాం. ఇరవై రెండు దేశాల్లో ఈ కంపెనీకి 215 దుకాణాలున్నాయి. వీటిలో పెద్ద మాల్స్‌ 23. ఒమన్‌లో 50, సౌదీలో 34, కతార్‌లో 13, బహరెయిన్‌ 8,కువాయిత్‌ 6,ఇండోనేసియా 5, ఈజిప్టు, మలేసియాల్లో రెండేసి, సురినామ్‌, ఎమెన్‌లలో ఒక్కొక్కటి ఉన్నాయి. మనదేశంలోని ఐదు మినహా మిగిలినవన్నీ ఏడు ఐక్యఅరబ్‌ ఎమిరేట్స్‌లో ఉన్నాయి.మత కళ్లద్దాలతో చూసే వారు దీని గురించి ఏమి చెబుతారు. వాట్సాప్‌ ఉన్న జనాలందరిని వెర్రివాళ్లుగా పరిగణిస్తే తప్ప ఇలాంటి అసంబద్ద, అవాస్తవ పోస్టులను ఎవరైనా పెట్టగలరా ? ఇవన్నీ ముస్లిం దేశాలే కదా, ఇక్కడ ఎవరిని దెబ్బతీసేందుకు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు ? అమెరికా, ఐరోపా దేశాల్లో అనేక కంపెనీలు మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి ? మరి అవి ఎవరిని దెబ్బతీసేందుకు ? క్రైస్తవులనా ? వ్యాపారులకు లాభాలు తప్ప మతాలవారీ జనాభా కాదు. ఎక్కడ మార్కెట్‌ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తారు. మాల్‌ జీహాద్‌ కథలు కూడా తప్పుడు ప్రచారమే.మనం బుర్రకు పని పెట్టకుండా చెవులు అప్పగిస్తే ఏమైనా ఎక్కిస్తారు.


ఈ బాపతుకు ముస్లిం వ్యతిరేకత తప్ప మరొకటి పట్టదు. బిగ్‌బజార్‌, డీమార్ట్‌, మెట్రో, విశాల్‌, రిలయన్స్‌, బ్రాండ్‌ ఫ్యాక్టరీ వంటి కంపెనీల గొలుసు దుకాణాలు, ప్రతి పెద్ద పట్టణంలో వెలుస్తున్న ఇతర మాల్స్‌ ఏ మత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెడుతున్నారు? దేశంలో 80శాతం మంది హిందువులే ఉన్నారు. ఆ ప్రాంతాలన్నింటా చిన్న దుకాణాలను నడిపేది వారే. పైన చెప్పుకున్న కంపెనీల దుకాణాలు దెబ్బతీస్తున్నది ఎవరిని ? ఎందుకీ ఉన్మాదం ? ఎవరిని ఉద్దరించేందుకు ? ఉదాహరణకు ఒక డి మార్ట్‌ దుకాణం చుట్టూ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలోని చిల్లర దుకాణాల అమ్మకాలు పడిపోతున్నాయి. అనేకం మూతపడ్డాయి, కొత్తగా పెట్టిన వారు వెంటనే ఎత్తివేస్తున్నారు. ఆన్‌లైన్‌లో సరకుల అందచేత గురించి చెప్పనవసరం లేదు.


రెడ్‌ సీర్‌ అనే సంస్ధ చేసిన పరిశోధన ప్రకారం దేశంలో కోటీ 50లక్షలు, నీల్సన్‌ సర్వే ప్రకారం కోటీ 20లక్షల చిల్లర దుకాణాలున్నాయి. అన్ని రకాల అంకుర సంస్ధలలో పెట్టుబడులు వంద రూపాయలనుకుంటే ఇంటి అవసరాల సరకుల సరఫరా సంస్దల వాటా 40గా ఉందంటే రానున్న రోజుల్లో ఇవి ఎంతగా విస్తరించనున్నాయో ఊహించుకోవచ్చు. ఆన్‌లైన్‌ విక్రయాల వాటా 0.2 నుంచి 2023 నాటికి 1.2శాతానికి పెరుగుతుందన్నది ఒక అంచనా. కరోనా వీటిని మరింతగా పెంచింది.జనాలు వాటికి అలవాటు పడిపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ఆప్‌లు అందుబాటులోకి వచ్చినందున ప్రతిదాన్నీ ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. ఐస్‌క్రీమ్‌, కూరగాయలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. అనేక కంపెనీలు చిల్లర దుకాణదారులతో ఒప్పందాలు చేసుకొని తమ సరకుల విక్రయ కేంద్రాలు, ఏజంట్లుగా మార్చుకోబోతున్నాయి. స్టాకిస్టులు, ఏరియా, జిల్లా పంపిణీదారులు, హౌల్‌ సేలర్ల వంటి దొంతరలేమీ లేకుండా కంపెనీలే నేరుగా ఉత్పత్తిదారు నుంచి కొనుగోలు చేసి తమ దుకాణాలు, చిల్లర దుకాణల ద్వారా విక్రయించే, కమిషన్‌ ఏజంట్లుగా మార్చబోతున్నాయి. ఇవి దెబ్బతీసేది ఎవరిని ? హిందువులనా, ముస్లింలనా ?ఇవి దెబ్బతీసే ఉపాధి ఏ మతం వారిది ?


ఇలాంటి ప్రచారాలు చేసేది పనీ పాటాలేని జనాలా ? కానే కాదు. ఒక పధకం ప్రకారం చేస్తున్న ప్రచారం ఇది. దీని వెనుక పాలకుల పని తీరు గురించి జనాల దృష్టి మళ్లించటం ఒక ఎత్తుగడైతే, జనాల్లో పరస్పర అనుమానాలు , విద్వేషం రేకెత్తించటం శత్రుశిబిరాల్లో చేర్చటం మరొకటి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క అజెండా ఉంటుంది. ఉదాహరణకు 5జి టెక్నాలజీలో చైనా ముందుంది గనుక దాన్ని దెబ్బతీయాలంటే వక్రీకరణ ప్రచారం జరపాలి. దాన్లో భాగంగానే చైనా 5జి కారణంగా కరోనా వైరస్‌ పుట్టిందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని ప్రచారం చేసే వారికి కనీస పరిజ్ఞానం లేదన్నది స్పష్టం. రేడియో తరంగాలు వైరస్‌ను వ్యాపింప చేస్తే అవి ఒక్క 5జికే, కరోనాకే ఎందుకు పరిమితం కావాలి ? ఇతర వైరస్‌ల పట్ల వాటికి వివక్ష ఏముంది? కరోనాతో వాటికేమైనా ఒప్పందం ఉందా ?

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టే అంశాలను కావాలనే నియంత్రించటం లేదని గతంలో, తాజాగా వెల్లడైంది. దాని అంతర్గత పత్రాలను ఫ్రాన్సెస్‌ హేగన్‌ బయటపెట్టిన అంశం తెలిసిందే. మన దేశంలో 40కోట్ల మంది వాట్సాప్‌, 34కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారులు ఉన్నారు. ఫేస్‌బుక్‌ బిజెపి, ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా పని చేసినట్లు గతేడాది అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ రాసింది. హేగన్‌ వెల్లడించిన పత్రాలు దాన్ని నిర్దారించాయి. ఫేస్‌బుక్‌ మాజీ అధికారిణి, బిజెపితో సంబంధాలున్న అంఖీదాస్‌ స్వయంగా ముస్లిం వ్యతిరేక అంశాలను షేర్‌ చేసినట్లు నిర్ధారణైంది. బిజెపితో వ్యాపార సంబంధాలున్నందున కొంత మంది పార్టీ నేతల విద్వేష పూరిత ప్రసంగాల అంశాలను తొలగించవద్దని సిబ్బందిని ఆమె ఆదేశించినట్లు కూడా వెల్లడైంది.2020 డిసెంబరులో రాసిన అంతర్గత పత్రంలో అమెరికా వెలుపల ఇతర దేశాల్లో ఫేస్‌బుక్‌ స్ధానిక అధికారులను సాధారణంగా అధికార పార్టీలకు చెందిన వారిని, సహజంగా వారికి లొంగేవారిని నియమించారని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే విద్వేష ప్రచారాన్ని అనుమతిస్తున్నారు.


ఈ ఏడాది మార్చినెలలో ఫేస్‌బుక్‌ లోటస్‌ మహల్‌ (కమలం మహల్‌) పేరుతో ఒక పత్రాన్ని రూపొందించింది. కమలం పువ్వు బిజెపి ఎన్నికల గుర్తు అన్నది తెలిసిందే. బిజెపితో సంబంధం ఉన్న వారు పుంఖాను పుంఖాలుగా ఫేస్‌బుక్‌ ఖాతాలను తెరిచి లవ్‌ జీహాద్‌తో సహా అనేక అంశాలతో ముస్లిం వ్యతిరేక ప్రచారాన్ని నింపినట్లు దానిలో పేర్కొన్నారు. బిజెపి నేత ఒకరు ఢిల్లీలోని రోడ్డు మీద నిరసన తెలుపుతున్న ముస్లింలను తొలగించాలని ఇచ్చిన పిలుపుతో జరిగిన దాడుల్లో 53 మంది మరణించినట్లు దానిలో రాశారు. కరోనాను వ్యాపింప చేశారని, వైద్యుల మీద ఉమ్మారనే కల్పిత అంశాలను ప్రచారం చేశారని, ఇలాంటి ప్రచారం చేసిన హిందూత్వ గ్రూపుల మీద ఫేస్‌బుక్‌ ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఉదంతాన్ని ఆసరా చేసుకొని ముస్లిం వ్యతిరేకతను ఎలా రెచ్చగొట్టిందీ తెలిసిందే.


చరిత్రను వక్రీకరించే పోస్టుల ప్రచారం గురించి చెప్పనవసరం లేదు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 1945లోనే చైనా శాశ్వత రాజ్యంగా ఉన్న అంశం తెలిసినా మనకు శాశ్వత హౌదా ఇస్తామంటే తిరస్కరించి చైనాకే ఇవ్వాలని నెహ్రూ కోరినట్లు జరుగుతున్న ప్రచారం చేస్తున్నారు. కళ్ల ముందున్న వాస్తవాలను వక్రీకరించి వివిధ అంశాలపై బాహాటంగా చేస్తున్న ప్రచార బండారాన్ని లూలూ, నెహ్రూ ఎవరి గురించైనా ఎవరికి వారు తర్కబద్దంగా ఆలోచించి ఎండగట్టాలి.