Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


రష్యాలో ఏం జరుగుతోంది ? వందేండ్ల క్రితం బోల్షివిక్‌ విప్లవం జరిగినపుడు జారు చక్రవర్తి ఒక సామ్రాజ్యవాది, ఇతర సామ్రాజ్యవాదులతో విబేధాలు ఉన్నాయి. ఇప్పుడు పుతిన్‌ నాయకత్వంలోని రష్యా పెత్తనాన్ని కోరుకొంటోంది. అందుకోసం అమెరికా-ఐరోపా పోటీదారులతో లడాయిలో ఉంది. కొన్ని అంశాలలో వాటికి వ్యతిరేకంగా సోషలిస్టు చైనాతో చేతులు కలుపుతోంది. అంతర్గతంగా ఆర్ధికంగా అనుసరిస్తున్న విధానాలు సమాజంలో అశాంతిని రేపుతున్నాయి. ప్రతిపక్షాలను బతకనివ్వటం లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. తోటి బూర్జువా పార్టీల నేతలను తప్పుడు కేసులతో ఇరికించి తనకు ఎదురులేదనే స్ధితిని కల్పించేందుకు పూనుకున్నాడు. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు కొరకరాని కొయ్యలుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. దాంతో వారి మీద కూడా దాడికి పూనుకున్నట్లు కొన్ని పరిణామాలు వెల్లడిస్తున్నాయి. మాస్కో కమ్యూనిస్టు నేత, 1999 నుంచి వరుసగా పార్లమెంట్‌కు ఎన్నికవుతున్న వలెరీ రష్కిన్‌పై ఒక తప్పుడు కేసును నమోదు చేయటం దానిలో భాగంగానే భావిస్తున్నారు.


వచ్చే అధ్యక్ష ఎన్నికలలో ప్రతిపక్ష అభ్యర్ధిగా పుతిన్‌ మీద రష్కిన్‌ తలపడతారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీ అధినేత జుగనోవ్‌ తరువాత ప్రముఖనేతగా ఎదిగిన వలెరీ రష్కిన్‌ మీద పుతిన్‌ సర్కార్‌ తప్పుడు కేసు అంతర్జాతీయదృష్టిని ఆకర్షించింది. సెప్టెంబరు నెలలో జరిగిన ఎన్నికలలో అధికార పార్టీని ఎదిరించటం,యువతను ఆకర్షించటంలో ప్రముఖుడిగా ముందుకు వచ్చిన రష్కిన్‌ వంటి వారి మీద ప్రభుత్వం అణచివేతకు పాల్పడనుందని ఎన్నికలు జరిగినప్పటి నుంచీ ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తనకు బలమైన ప్రత్యర్ధులు లేకుండా చూసుకొనేందుకు పుతిన్‌ పావులు కదుపుతున్నాడు.జింకల జాతికి చెందిన ఒక కణుజు మృతకళేబరాన్ని చూపి రష్కిన్‌ అక్రమంగా వేటాడినట్లు, పోలీసులు కోరినపుడు మద్య పరీక్షకు అంగీకరించలేదని ఒక కథనాన్ని అల్లారు.


సరటోవ్‌ అనే పట్టణ సమీపంలోని గ్రామంలో తన స్నేహితులను కలిసేందుకు వెళ్లి తిరిగి వస్తూ సమీప అడవిలో నడుస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా వెళ్లిందని, అది ఆగిన చోటికి వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడిన స్ధితిలో ఉన్న కణుజు కనిపించిందని, వెనక్కు వెళ్లి ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పి తిరిగి వచ్చి కణుజు మరణించిన అంశాన్ని అధికారులకు తెలిపేందుకు దాన్ని తన కారులో తీసుకు వెళుతుండగా వచ్చిన పోలీసులు, అటవీ సిబ్బంది తనను పట్టుకొని తానే వేటాడినట్లు కేసు నమోదు చేశారని రష్కిన్‌ చెప్పాడు. అడవిలో తుపాకి మోతలు వినిపించగా వెళ్లిన తమకు కణుజు కళేబరంతో రష్కిన్‌ కనిపించాడని, మద్యం సేవించారా లేదా అనేది తెలుసుకొనేందుకు పరీక్షించబోగా తిరస్కరించినట్లు అధికారులు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని రష్కిన్‌ అన్నారు. సెప్టెంబరులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అక్రమాలకు నిరసన తెలుపుటంలో రష్కిన్‌ ప్రముఖ పాత్ర పోషించిన నేపధ్యంలో ఈ కేసు నమోదైంది. సరటోవ్‌ జైలులో సిబ్బంది అక్రమాలపై పార్లమెంటరీ దర్యాప్తు జరపాలనీ కమ్యూనిస్టు ఎంపీలు పట్టుబట్టిన కారణంగా కూడా ఈ కేసు నమోదైనట్లు చెబుతున్నారు. ప్రభుత్వ అనుకూల టీవీల్లో దీని గురించి ప్రముఖంగా చూపారు. రష్యాలో జరుగుతున్న పరిణామాల గురించి వివిధ పత్రికలు విశ్లేషణలు,వ్యాఖ్యానాలు రాస్తున్నాయి.


” ఒకనాడు నెమ్మదిగా ఉన్న కమ్యూనిస్టుపార్టీ ప్రతిపక్ష శక్తిగా ఎదుగుతున్నది ” అంటూ ప్రముఖ పత్రిక ఎకానమిస్టు అక్టోబరు 30వ తేదీన ఒక విశ్లేషణ రాసింది. దానిలో కమ్యూనిస్టు పార్టీ, నాయకత్వం గురించి అనేక తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పటికీ వర్తమాన పరిణామాలు, పరిస్ధితి గురించి చేసిన కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.” కమ్యూనిస్టుల పెరుగుదల పరిణామాన్ని చూసి ప్రభుత్వం, దాని నేత పుతిన్‌ ఆందోళన పడ్డారు. పుతిన్ను వ్యతిరేకించే ప్రతిపక్ష నేత అలెగ్నీ నవాల్నేను తప్పుడు కేసులతో పుతిన్‌ జైలు పాలు చేశాడు. ఆ చర్యను గట్టిగా వ్యతిరేకించిన అనేక మంది కమ్యూనిస్టులపై కూడా కేసులు పెట్టారు. ఈ పరిణామాలతో నిజమైన ప్రతిపక్షం కమ్యూనిస్టులే అని ప్రభుత్వ వ్యతిరేకులు భావించి తాజా ఎన్నికల్లో ఓటు వేయటం పుతిన్‌కు ఆందోళన కలిగిస్తోంది. ౖ” 1996 అధ్యక్ష ఎన్నికల్లో బోరిస్‌ ఎల్సిన్‌ మీద పోటీ చేసిన కమ్యూనిస్టు జుగనోవ్‌ ఓడిపోయాడు. గెలిస్తే కమ్యూనిస్టులు పగతీర్చుకుంటారేమో అని భయపడిన వారు, ఉదారవాదులు, వ్యాపారులు తమ వనరులన్నింటినీ మరణశయ్య మీద ఉన్న ఎల్సిన్‌కోసం వెచ్చించారు. ఎల్సిన్‌ శవానికైనా ఓటు వేస్తాం కానీ బతికి ఉన్న జుగనోవ్‌ను ఎన్నుకొనేది లేదని ఒక టీవీ అధిపతి ఆ నాడు చెప్పాడు. జుగనోవ్‌ ఓడారు…… నేడు అనేక మంది రష్యన్‌ ప్రజాస్వామిక వాదులు క్రెమ్లిన్‌(రష్యా అధికార కేంద్రం)నుంచి ఎల్సిన్‌ వారసుడిని గెంటివేయాలని కోరుకుంటూ ఓటు వేసేందుకు కమ్యూనిస్టులను ఎంచుకున్నారు. ఎంత కఠినంగా ఉండబోతున్నారో వారికి బాగా తెలుసు. రష్యన్‌ ప్రతిపక్ష మీడియా విమర్శకుడు ఎవగెని ఆల్‌బట్స్‌ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ తోడేలు మాకు మరొక అవకాశం లేకుండా చేసిందన్నారు……సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో ఓట్లను సక్రమంగా లెక్కించి ఉంటే దాదాపు యునైటెడ్‌ రష్యాతో సమంగా ఓట్లు పొంది ఉండేవారు. అన్ని రకాల రిగ్గింగులు చేసినప్పటికీ 2016లో వచ్చిన 13శాతం కంటే కమ్యూనిస్టులు 19శాతం ఓట్లు పొందారు…ప్రపంచంలో ఎక్కువ చోట్ల వామపక్షవాదం ముందుకు పోతున్నది, ఈ లోకరీతి రష్యాలో వచ్చేందుకు ఎంతకాలం పట్టిందో కనిపిస్తోంది.ప్రత్యేకించి పుతిన్‌ పాలనలో పాతుకు పోయిన అసమానత దీనికి అవకాశమిచ్చింది….. ఆరు సంవత్సరాలుగా పడిపోతున్న ఆదాయాలు వామపక్ష రాజకీయాలను మరోసారి పరిగణనలోకి తీసుకొనే విధంగా అనేక మంది రష్యన్లను పురికొల్పాయి…..ప్రభుత్వం ఇప్పుడు యువకమ్యూనిస్టులకు స్టాలినిస్టులనే ముద్రవేసి అణచివేసేందుకు పూనుకుంది.ఇదిలా ఉండగా జైళ్లలో జరిగిన చిత్రహింసల గురించి దర్యాప్తు జరపాలనే మానవహక్కుల గురించి కమ్యూనిస్టులు కేంద్రీకరించారు. పుతిన్‌ రష్యా నిజంగా అద్దాల మేడలా కనిపిస్తోంది.” అని పేర్కొన్నది.


అనేక దేశాలలో పాలకుల మాదిరి తనకు రాజకీయ ప్రత్యర్ధులు లేకుండా చేసుకొనేందుకే ఇప్పటి వరకు పుతిన్‌ ప్రయత్నించాడు. కమ్యూనిస్టుల మీద చేసిన తప్పుడు ప్రచారం కారణంగా సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత ముందే చెప్పుకున్నట్లు అనేక మంది ఇతర పార్టీలవైపే చూశారు. అలాంటి ఏ పార్టీని కూడా పుతిన్‌ బతకనివ్వలేదు. మూడు దశాబ్దాల తరువాత పుతిన్‌కు నిఖరమైన ప్రత్యామ్నాయ పార్టీగా ఇప్పుడు కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నందున దాడి ఇప్పుడు వారి మీద కేంద్రీకరించవచ్చు. మన దేశంలో నరేంద్రమోడీ విధానాలను విమర్శించేవారందరికీ దేశద్రోహులు, విదేశీతొత్తులు, ఉగ్రవాదులు అని ముద్రవేస్తున్నట్లుగానే పుతిన్‌ కూడా చేస్తున్నాడు. ఎన్నికల రిగ్గింగు అనేది ప్రారంభం నుంచీ జరుగుతోంది. వాటన్నింటినీ ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో పుతిన్‌కు పోటీగా అన్ని పార్టీలను కమ్యూనిస్టులు ఏకం చేయగలరా అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. ప్రతిపక్ష నేత నవాల్నే ప్రారంభించిన సంస్ధకు ఉగముద్రవేసి నిషేధం విధించాడు.జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలు, సంస్ధలకు విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులనే ముద్రవేస్తున్నారు. ఒక ఏడాది కాలంగా ఈ ధోరణి పెరిగింది. ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు పుతిన్‌ మీద విమర్శతో కూడిన ట్వీట్‌ను ఎవరైనా తిరిగి చేసినా అలాంటి వారిని విదేశీ ఏజంట్లుగా పరిగణిస్తున్నారు.

2012లో ఒక చట్టం చేసి విదేశీ ఏజంటు అనే ముద్రవేసేందుకు పూనుకున్న తరువాత ఇంతవరకు 88 మంది మీడియా, వివిధ సంస్ధలకు చెందిన వారితో సహా 359 మందిని విదేశీ ఏజంట్లు, అవాంఛనీయ శక్తులని ముద్రవేయగా ఈ ఏడాది ఇంతవరకు 101 మందిని చేర్చారంటే దాడి తీవ్రతను వెల్లడిస్తున్నది. వారంతా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. ఈ దాడులన్నింటినీ తట్టుకొని నిలిచిందీ, నిలవగలిగిందీ కమ్యూనిస్టులనే అభిప్రాయాలు బలపడటంతో పాటు ఎవరు అధికార పార్టీని ఓడించగలిగితే వారికి ఓటు వేయాలని జైలుపాలైన నవాల్నే ఇచ్చిన పిలుపుతో అది మరింత బలపడింది. సెప్టెంబరు ఎన్నికల్లో కమ్యూనిస్టులకు 18.9శాతం వచ్చినట్లు ప్రకటించినా రిగ్గింగు జరపకపోతే వాస్తవంగా 30శాతం, అధికార పార్టీకి 49.8శాతం అని చెప్పినా 35శాతానికి మించి వచ్చి ఉండేవి కాదన్నది అనేక మంది పరిశీలకుల అభిప్రాయం. ఈ పరిణామంతో అనేక మంది రష్యన్లకు పుతిన్‌ కంటే కమ్యూనిస్టులు మరింత గౌరవనీయులైనట్లు కొందరు పేర్కొన్నారు, ఇప్పుడు కమ్యూనిస్టులు పుంజుకుంటున్న తీరుతెన్నులు1917లో బోల్షివిక్‌లు జనం మద్దతు పొందిన తీరును గుర్తుకు తెస్తున్నట్లు ఒక వ్యాఖ్యాత వర్ణించారు. దేశంలో స్ధిరత్వాన్ని తాను కోరుకుంటున్నట్లు చెబుతున్న పుతిన్‌ తన విధానాలు, అసహనం ద్వారా నిజానికి అస్ధిరతకు బాటలు వేస్తున్నాడు. చట్టాలకు తన చిత్తం వచ్చినట్లు భాష్యాలు చెబుతూ ఉదారవాదుల పట్ల అనుచితంగా వ్యవహరించిన మాదిరి కమ్యూనిస్టులతో కూడా ప్రవర్తిస్తే వారిని అజ్ఞాతవాసంలోకి నెట్టినట్లు అవుతుంది. సామాజిక అశాంతి బద్దలవుతుంది అది అణచివేతకు దారితీస్తే కమ్యూనిస్టులు ఏమాత్రం విస్మరించరాని శక్తిగా మారతారు అనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇతర దేశాల్లో మాదిరి పెట్టుబడిదారీ విధానాలను సమర్ధించే వారిలో ఒకరి స్ధానంలో మరొకరిని బలపరిచే అవకాశాలు రష్యాలో లేవు. పుతిన్‌కు పోటీగా కమ్యూనిస్టులు తప్ప మరొక పార్టీ ఏదీ నిలదొక్కుకోలేకపోయింది.ఇవన్నీ ప్రపంచ పెట్టుబడిదారీ శక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి.