Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


పద మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్ధానాల ఉప ఎన్నికలలో బిజెపికి అనూహ్య ఎదురు దెబ్బలు తగిలాయి. మరో ఐదు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.బిజెపి అధికారంలో ఉన్న చలి రాష్ట్రమైన హిమచలప్రదేశ్‌లో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్ధానంలో ఓటమి బిజెపికి వేడి పుట్టించింది. తమ ఓటమికి కారణం ద్రవ్యోల్బణం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కారణమని ఆ రాష్ట్ర బిజెపి బిజెపి ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ చెప్పారు. అది ఒక్క తమ రాష్ట్రానికి, దేశానికే కాదు, మొత్తం ప్రపంచ సమస్య అన్నారనుకోండి. ఏదైతేనేం తలకు బొప్పికట్టింది , మరో ఐదు రాష్ట్రాల ఎన్నికల దృశ్యం కళ్ల ముందు ఆందోళన కలిగిస్తోంది. కనుక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే పెట్రోలుపై లీటరుకు ఐదు, డీజిలుపై పది రూపాయల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ఎన్నికలకు సంబంధం లేదని బిజెపి చెప్పుకోవచ్చు, ఎందుకు తగ్గించిందో చెప్పాలి.కేంద్ర ప్రకటన వెంటనే పది బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా నాటకీయంగా వ్యాట్‌లో కొన్ని రూపాయలు తగ్గించాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో మోడీ భక్తులు వహ్వా, ఆహా, ఓహౌలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తగ్గిస్తాయా లేదా అంటూ అడ్డుసవాళ్లు ప్రారంభించారు. చర్చ జరగటం మంచిదే !


ఇప్పటికీ బిజెపి మద్దతుదారులు చేస్తున్న వాదన ప్రకారం కేంద్రం విధిస్తున్న చమురు పన్ను భారంలో రాష్ట్రాలకు 41శాతం వాటాగా తిరిగి వస్తుంది, కేంద్రం కూడా తన వంతు రాష్ట్రాలలో వివిధ పధకాలకు ఖర్చు చేస్తున్నది కనుక చమురుపై ఎక్కువ భారం మోపుతున్నది రాష్ట్రాలే అని చెబుతున్నది తెలిసిందే. వారి వేద గణితం ప్రకారమే 41శాతం అంటే ఐదులో రు.2.05 పెట్రోలు మీద, డీజిలు మీద రు.4.10 రాష్ట్రాలకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. తద్వారా ఆ మేరకు రాష్ట్రాల బడ్జెట్ల కేటాయింపులకు కోత పడుతుంది. కేంద్రం చేస్తున్న ఖర్చు కూడా ఆ మేరకు తగ్గుతుంది. అదే జిఎస్‌టి అయితే తగ్గిన మేరకు రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సి వచ్చేది.కనుక ఈ తగ్గింపే ఘనత అనుకుంటే అది రాష్ట్రాలకూ వాటా ప్రకారం దక్కాలి కదా ! బిజెపి మిత్రపక్షం ఒడిషా బిజెడి సర్కార్‌ కూడా పన్ను తగ్గించింది. లీటరుకు మూడు రూపాయల చొప్పున తగ్గించింది. దీనివలన తమ ఖజానాకు రు.1,400 కోట్లు, కేంద్రం పన్ను తగ్గించిన కారణంగా తమ వాటాలో తగ్గే ఏడువందల కోట్ల రూపాయలతో కలుపుకుంటే 2,100 కోట్ల మేరకు తమ మీద భారం పడుతుందని పేర్కొన్నది. వివిధ రాష్ట్రాల మీద ప్రభావం ఇదే మాదిరి ఉంటుంది.


ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు పన్ను తగ్గిస్తాయా లేదా అన్న సవాలు. మన్మోహన్‌ సింగ్‌ గారి ” చెడు ” రోజులు చివరిలో లేదా నరేంద్రమోడీ గారి ” మంచి రోజుల ” ప్రారంభంలో లీటరు పెట్రోలు, డీజిలు మీద కేంద్ర ప్రభుత్వ పన్ను రూ.9.48, 3.56 చొప్పున ఉంటే దాన్ని పెంచారు. తాజా తగ్గింపునకు ముందు రూ.32.98, 31.83 చొప్పున ఉంది. ఇదే సమయంలో బిజెపి అధికారంలో ఉన్న చోట్లతో సహా ఏ రాష్ట్రం కూడా ఈ రీతిలో ఒక్క శాతం కూడా పన్ను పెంచలేదు. ఒకటీ అరా రాష్ట్రాలు రూపాయో,రెండో ఇంకాస్త ఎక్కువో సెస్‌లు మాత్రమే పెంచాయి. కేంద్రం మాత్రం పన్నుల పెంపుదలతో పాటు అంతకు ముందు ఇస్తున్న రాయితీలను కూడా ఎత్తివేసి ఎంత పెరిగితే అంత మొత్తాన్ని వినియాగదారుల నుంచి వసూలు చేస్తున్నది. అందువలన కేంద్రం వాటన్నింటినీ పునరుద్దరించి రాష్ట్రాలను కూడా తగ్గించమనటం సమంజసం. లేదా చమురు ఉత్పత్తులను కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి. గతంలో అంగీకరించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రాలకు ఒకవేళ ఆదాయం తగ్గితే ఆ మేరకు చెల్లించాలి. ఎందుకంటే నోట్లు అచ్చువేసి లోటును పూడ్చుకొనే అవకాశం కేంద్రానికి ఉంది తప్ప రాష్ట్రాలకు లేదు.


కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు పెట్రోలు, డీజిలు మీద ఒక్కొక్క లీటరుకు తగ్గించిన పన్ను మొత్తాలు ఇలా ఉన్నాయి.ఉత్తర ప్రదేశ్‌, హర్యానా, రు.12-12 చొప్పున, గుజరాత్‌, అసోం, కర్ణాటక, గోవా, మణిపూర్‌, త్రిపుర రు.7-7 చొప్పున, బీహార్‌, ఒడిషా మూడేసి రూపాయలు, ఉత్తరాఖండ్‌ రు.2-2, అరుణాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ తగ్గించాయి. బిజెపి అధికార ప్రతినిధి, ఆర్ధికవేత్త సంజు వర్మ నవంబరు ఒకటవ తేదీన ఒక విశ్లేషణ రాశారు. 2020 ఏప్రిల్‌ నుంచి 2021 అక్టోబరు మొదటి పక్షం వరకు పద్దెనిమిది నెలల్లో ముడిచమురు ధర పీపా 19 డాలర్ల నుంచి 85డాలర్లకు అంటే నమ్మశక్యం కాని విధంగా 347శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పెరిగితే అంత పెంచుతాము, ఎంత తగ్గితే అంత తగ్గిస్తాము అనే విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం ఇదే రీతిలో ధరలను తగ్గించినట్లు ఏ వినియోగదారుడైనా చెప్పగలడా ? అందువలన మన జేబుల నుంచి కొట్టివేసిన మొత్తాలతో పోలిస్తే ఇప్పుడు తగ్గించిన ఐదు, పది రూపాయలు కంటి తుడుపు తప్ప మరొకటి కాదు.


ఈ మేధావి గతం నుంచీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొనసాగించారు. అదేమంటే గత మన్మోహన్‌ సింగ్‌ సర్కార్‌ రు.1.44లక్షల కోట్లకు చమురు బాండ్లను తీసుకున్నదని, దానితో పాటు మరో 70వేల కోట్లు వడ్డీ కూడా తమ మోడీ సర్కార్‌ మీద అదనపు భారం పడిందని సంజు వర్మ మొసలి కన్నీరు కార్చారు. ఆ మొత్తం నాటి ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చిన సబ్సిడీ తప్ప మరొకటి కాదు. జనాలకు సబ్సిడీ ఇచ్చినందుకు ఈ ఏడుపెందుకు ? ఒక వేళ ఈ మొత్తమే మోడీ సర్కారు మీద పెనుభారం మోపిందా ? ఈ సాకుతో జనాల నుంచి ఏటా వసూలు చేసిన రెండు, మూడులక్షల కోట్లు, రద్దు చేసిస సబ్సిడీల మాటేమిటి ? అధికారానికి వచ్చిన తరువాత మోడీ సర్కార్‌ అసలు అప్పులు చేయలేదా ? 2014లో కేంద్ర ప్రభుత్వ అప్పు రు.54,90,763 కోట్లు కాగా 2020జూన్‌ నాటికి రు.101,30,000 కోట్లు కాగా వచ్చే మార్చి నాటికి అది 130లక్షల కోట్లకు చేరనుందని అంచనా, మరి దీని సంగతేమిటి ? కరోనాతో నిమిత్తం లేకుండానే ఆరేండ్లలో రెట్టింపు ఎందుకు చేసినట్లు ?


చమురు పన్నుల భారం గురించి అడిగితే బిజెపి మంత్రులు, నేతలు చెబుతున్నదేమిటి ? కరోనా వాక్సిన్లు ఉచితంగా వేస్తున్నారంటే మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అందుకే చమురు పన్నులు అన్న సంగతులు తెలిసినవే. ఇది నిజమా ? ఆసియా అభివృద్ది బాంకు నుంచి 150 కోట్లు, ఏఐఐబి నుంచి మరో 50 కోట్ల డాలర్లను వాక్సిన్ల పేరుతో మోడీ సర్కార్‌ అప్పు తీసుకున్న సొమ్మును దేనికి ఖర్చు చేసినట్లు మరి ?
బిజెపి ప్రతినిధి సంజువర్మ ఒక లెక్క చెప్పారు. పెట్రోలు ధర లీటరు వంద అనుకోమన్నారు. దానిలో చమురు ధర రు.32.97, కేంద్ర ప్రభుత్వం పన్ను 21.58, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 41.67, డీలరు కమిషన్‌ రు.3.78 దీన్ని చూపి చూశారా కేంద్రం కంటే రాష్ట్రపన్నులే ఎక్కువ అని చెప్పారు. వర్మగారి విశ్లేషణ వెలువడిన నవంబరు ఒకటవ తేదీనే ఢిల్లీలోని హెచ్‌పి సంస్ధ వివరాల ప్రకారం చమురు ధర రు. 47.59, కేంద్ర పన్ను 32.90, ఢిల్లీ ప్రభుత్వ 30శాతం వాట్‌ రు.25.32, డీలరు కమిషన్‌ రు.3.90, అన్నీ కలిపి నీతి రోడ్డులోని బంకులో ధర రు.109.71 ఉంది. మూడవ తేదీ నాటికి అది రు.110.04కు పెరిగింది నాలుగవ తేదీ నుంచి కేంద్రం పెట్రోలు మీద తగ్గించిన ఐదు రూపాయలను పరిగణలోకి తీసుకొని మిగిలిన ధరల్లో మార్పు లేదనుకుంటే 30శాతం వాట్‌ను(రు.5+1.50=6.50, డీజిలు మీద రు.10+3 = 13) తీసివేస్తే రు.103.21 ఉండాలి, కానీ నాలుగవ తేదీ ధర రు. 103.97. ఒకటి-నాలుగవ తేదీ మధ్య చమురు ధర పెరిగింది కనుక దాని మీద వచ్చే 30శాతం కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి 150పైసల బదులు 76పైసలు తగ్గింది. అందువలన ముందు ముందు ధరలు పెరిగితే రాష్ట్రాలు లోటును పూడ్చుకొంటాయి తప్ప ప్రతి లీటరుకు 150 పైసలు కోల్పోతాయి.


మరి బిజెపి ప్రతినిధి ఆర్ధికవేత్త సంజువర్మ కేంద్ర ప్రభుత్వ పన్ను రు.21.58 అని ఏ గణాంకాల ప్రకారం చెప్పారు ? గట్టిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల మొత్తం 41.47, కేంద్ర పన్నులు 21.58శాతం అని చెబుతున్నారు. జనాన్ని తప్పుదారి పట్టించే లెక్క కదా ! రోడ్డు, వ్యవసాసెస్‌ల పేరుతో భారీగా రాష్ట్రాలకు వాటాలేని కేంద్ర వడ్డింపులను దాచిపెట్టి రాష్ట్రాలు విధిస్తున్న స్వల్ప సెస్‌ల గురించి సంజువర్మ గుండెలు బాదుకుంటున్నారు. కేంద్రం విధిస్తున్న పన్నులు నిర్ణీత మొత్తాలు గనుక అంతర్జాతీయంగా ధరలు పెరిగినా తగ్గినా కేంద్రానికి ఒరిగేదేమీ లేదని పెరిగిన కొద్దీ రాష్ట్రాలు ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. నిజమే, పద్దెనిమిది నెలల్లో ముడి చమురు ధర తగ్గినపుడు వర్మగారే చెప్పినట్లు కేంద్రానికి రాబడి పైసా తగ్గలేదు, రాష్ట్రాలకు గణనీయంగా పడిపోయిందా లేదా ? దీన్ని దాచిపెట్టి పెరిగిన అంశం గురించి మాత్రమే చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా ?


దేశంలో ధరల పెరుగుదల గురించి జనం ఆందోళన చెందుతుంటే మోడీ పాలనలో పెరుగుదల రేటు తక్కువ ఉందా, మన్మోహన్‌ సింగ్‌ ఏలుబడిలో ఎక్కువ ఉందా చూడండి అంటూ బిజెపి నేతలు అడ్డుసవాళ్లు విసురుతున్నారు. దాని వలన ప్రయోజనం లేదు. మా ఏలుబడిలో తక్కువగా పెరుగుతున్నాయి, వారి పాలనలో ఎక్కువ అంటే కుదరదు.2014 కంటే ధరలు తగ్గాయా పెరిగాయా అన్నది గీటు రాయి. లేకుంటే అచ్చేదిన్‌కు అర్ధం ఏముంది ? మొత్తం ధరల పెరుగుదలలో చమురు ధరల వాటా ఎక్కువగా ఉంది కనుక పన్ను మొత్తాలను తగ్గించాలని గత కొద్ది నెలలుగా రిజర్వుబాంకు కేంద్రానికి ఎందుకు సూచిస్తున్నది ? అదేమీ ప్రతిపక్ష పాలిత సంస్ధ కాదు కదా ! ఆగస్టు నెలలో ఆహార వస్తువుల ధరల ద్రవ్యోల్బణంతో పోల్చితే సెప్టెంబరులో 3.11శాతం కాగా ఏడాది క్రితం సెప్టెంబరుతో పోల్చితే 0.68శాతమే ఉంది. ఇదే చమురు ధరల ద్రవ్యోల్బణం పెరుగుదల 12.95-13.63శాతాల చొప్పున ఉన్నాయి. అందువలన అనేక చమురు మీద చేస్తున్న జనాలు చేస్తున్న ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. అందుకే రిజర్వుబాంకు పన్నులు తగ్గించి ధరల పెరుగుదలను నివారించాలని కోరింది.


కేంద్ర ప్రభుత్వం భారీగా పన్నులు పెంచినా, సబ్సిడీలు తగ్గించినా జనంలో స్పందన లేని మాట నిజం. వాజపాయి ఏలుబడిలో పూర్తి అధికారం లేక మిత్రపక్షాల మీద ఆధారపడ్డార గనుక చేయాల్సింది చేయలేకపోయాం, ఇప్పుడు నరేంద్రమోడీని ముందుకు తెస్తున్నాం చూడండి అనే బిజెపి ప్రచారాన్ని జనం నమ్మారు, తగ్గిస్తారనే భ్రమలకు లోనుకావటం, నరేంద్రమోడీ నాయకత్వం మీద ఉన్న గుడ్డి విశ్వాసమే దీనికి కారణం. గాడిదలకు సహనం ఎక్కువ అంటారు.నడుము భరించే వరకు ఎంత భారమైనా మోస్తుంది. విరుగుతుంది అనుకుంటే అది కూడా ఆగ్రహిస్తుంది. జనం కూడా అంతే. కరోనాలో తగ్గిన ఆదాయాలు జనం ఆశించినట్లుగా పూర్వపు స్ధాయికి పెరగటం లేదు. మరోవైపు చమురు, ఇతర వస్తువుల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. మోడీ మంత్రదండం పని చేయటం లేదు. గత రెండు సంవత్సరాలలో వివిధ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో జనం మోడీ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లుతోంది. దాని ఫలితమే ఎన్నికలలో ఎదురుదెబ్బలు. అందుకే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అవే పునరావృతం అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అసలుకే ముప్పువస్తుందనే భయం పట్టుకుంది. దాని పర్యవసానమే పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది తగ్గింపు.

భారాలకు వ్యతిరేకంగా జనం వీధుల్లోకి రావాలని గతంలో బిజెపి కూడా జనానికి పిలుపులు ఇచ్చింది. ఇప్పుడు మంత్రులుగా ఉన్న అనేక మంది సిలిండర్లను పట్టుకొని వీధుల్లో, ధర్నాలు, ప్రదర్శనలు చేశారు. ఏ పార్టీ అయినా ఇదే చేస్తుంది. ప్రభుత్వమే జనమనోభావాలను గ్రహించి నివారణకు పూనుకోవాలనే ఎవరైనా కోరుకుంటారు తప్ప కావాలనే ఆందోళనలకు పురికొల్పరు. ఇప్పుడు జనం ఓటుద్వారా నిరసన తెలుపుతున్నట్లు భావిస్తే, దానివల్లనే స్వల్పంగా అయినా భారం తగ్గిందంటే అది ఆహ్వానించదగిన పరిణామమే. వచ్చే ఎన్నికల్లో జనం తమ ఓటు ఆయుధాన్ని మరింతగా భారాలకు వ్యతిరేకంగా వినియోగిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ! ఇదే సమయరలో అనేక మంది ఓటర్లు ఇంకా భ్రమలతో అబద్దాలు, అవాస్తవాలతో తమ ముందుకు వస్తున్న పార్టీలను తమ ఓటుతో ఇంకా ఆదుకుంటున్నారు. అందుకే ఎన్నికలు ముగిసిన తరువాత తిరిగి పన్నులు పెంచితే ? ఏదో ఒకసాకుతో పెంచరనే హామీ ఏముంది ? మన్యంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వాన గిరిజనులు వినతులు విఫలమైన తరువాత ముందుగా విల్లంబులతోనే ప్రతిఘటన ప్రారంభించి తరువాత తుపాకులు పట్టారు. నైజా నవాబు మీద ప్రతిఘటన తొలి రోజుల్లో వడిసెలలతో ప్రారంభించి చివరికి తుపాకి పట్టారు. అందువలన పాలకుల అణచివేత తీవ్రతను బట్టి తమ ఆందోళన, పోరాట రూపాలను జనం నిర్ణయించుకుంటారు, తేల్చుకుంటారు !