ఎం కోటేశ్వరరావు
తెలంగాణా రాష్ట్రసమితి సారధి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏమైంది ? ఆంధ్రప్రదేశ్ పాలక పార్టీ వైసిపికి బిజెపి సెగ పెరిగిందా ? రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాల పర్యవసానాలేమిటి ? తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల దారెటు ? రెండు చోట్లా ముందస్తు ఎన్నికలు వస్తాయా ? అనేక మందిలో ఇప్పటికిప్పుడు సమాధానం దొరకని, తలెత్తుతున్న ప్రశ్నలలో ఇవి కొన్ని మాత్రమే. కెసిఆర్ వరుసగా రెండు రోజులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి మీద, కేంద్ర ప్రభుత్వంతో చావో రేవో తేల్చుకుంటామంటూ బ్యాటింగ్ ప్రారంభించి సిక్సర్లు కొట్టి తరువాత మంత్రులకు అప్పగించారు. కెసిఆర్ సారుకు ఏమైందీ అనుకుంటున్నవారికి చెప్పేదేమంటే, ఏమీ కాలేదు. హుజూరాబాద్‌లో అవమానకర ఓటమి, నాలుగువైపుల నుంచీ రాజకీయ సెగతగలటం ప్రారంభమైంది, పాత బంధులు-కొత్త బంధులు కుదురుగా కూర్చోనివ్వటం లేదు. అవే బంధనాలుగా మారతాయనే భయం కూడా తలెత్తి ఉండవచ్చు. అందువలన ఏదో ఒకటి మాట్లాడకపోతే పార్టీ శ్రేణులు మరింతగా డీలాపడతాయి.
మరి ఆంధ్రప్రదేశ్‌లో జగనన్నకు ఏమైంది. కెసిఆర్ మాదిరి మాటల మాంత్రికుడు కాదు. విలేకర్లతో మాట్లాడే అనుభవం సంగతేమో గానీ ఆసక్తిలేదని స్పష్టమైంది. వైసిపి అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం అమలు జరుపుతున్న నవరత్నాలు ఏమౌతాయో తెలియని స్ధితి. వాటితో ఐదేండ్లూ ప్రచారం, కాలక్షేపం చేయలేమని రెండు సంవత్సరాలకే అర్ధమైంది. ఉన్నవాటినే ఎలా కొనసాగించాలో తెలియని అయోమయంలో పడి కెసిఆర్ మాదిరి కొత్త బంధులను తలకెత్తుకొనే సాహసం చేయటం లేదు. అప్పుల తిప్పలు గుక్కతిప్పుకోనివ్వటం లేదు. జెన్‌కో, ఏపి పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెల్లించాల్సిన కిస్తీలను సకాలంలో చెల్లించకపోవటంతో ఆర్‌ఇసి జెన్‌కోను నిరర్దక ఆస్తిగా ప్రకటించిందంటే పరిస్ధితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో పెట్రోలు, డీజిలు మీద వ్యాట్ తగ్గించాలని బిజెపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తిడి తెస్తున్నాయి. దీంతో ఏకంగా ప్రభుత్వమే పత్రికలకు పూర్తి పేజీ ప్రకటన జారీ చేసి చమురుపై కేంద్రం, రాష్ట్రాల పన్నుల గురించి వివరాలు అందచేసి కేంద్ర బిజెపిని ఎండగట్టేందుకు పూనుకుంది. కెసిఆర్ మాదిరి జగన్‌మోహనరెడ్డి మీడియా ముందుకు రాలేదు గానీ ప్రకటనలు, పార్టీ నేతలు, మంత్రులతో ఆ పని చేయిస్తున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తగిలిన తీవ్ర ఎదురుదెబ్బతో నాకు ఎదురులేదు, నా ఎత్తుగడకు తిరుగులేదు అనుకొనే వారు కెసిఆర్ లేదా మరొకరు ఎవరికైనా మైండ్ బ్లాంక్ కావాల్సిందే. అక్కడ గెలిచేందుకు బహుశా దేశంలో, ప్రపంచంలో కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు ఆ స్ధాయిలో డబ్బు వెదజల్లటం, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండదంటే అతిశయోక్తి కాదు. వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లుగా ఘోరపరాజయంతో టిఆర్‌ఎస్ శ్రేణులు డీలాపడిపోయాయి. తమనేత చాణక్యతను అనుమానించటం ప్రారంభించాయి. వారిని నిలబెట్టుకొనేందుకు కెసిఆర్ నడుంకట్టినట్లుగా కనిపిస్తోంది. అది జరిగేదేనా !
దుబ్బాక ఉప ఎన్నికల్లో అంతకు ముందు అక్కడ పోటీ చేసిన బిజెపినేత రఘునందనరావు మీద సానుభూతి, టిఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక తరగతి సానుకూలత, దానిలో భాగంగా కెసిఆర్ సైతం ఉపేక్షించారన్న ప్రచార నేపధ్యం, చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసి దుబ్బాకను ఉపేక్షించారన్న ప్రచారం అన్నీ కలసి టిఆర్‌ఎస్ ఓటమి-బిజెపి గెలుపుకు తోడ్పడ్డాయి. తరువాత జరిగిన హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార పార్టీ కార్పొరేటర్ల మీద ఉన్న అసంతృప్తికి తోడు వరదల నివారణలో వైఫల్యం, సాయంలో అవకతవకలు అన్నీ కలసి అధికార పార్టీకి తలబొప్పి కట్టించాయి.తరువాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి బొక్కబోర్లాపడింది.అభ్యర్ధిని కూడా కాంగ్రెస్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. బలమైన కాంగ్రెస్ నేత కె.జానారెడ్డిని ఓడించేందుకు టిఆర్‌ఎస్ పడరాని పాట్లు పడి గెలిచింది.తరువాత పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో హైదరాబాదులో బిజెపి ఉన్న సీటును కోల్పోయింది. మరొకస్ధానం వరంగల్‌లో ఊహించని ఎదురుదెబ్బతిన్నది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం టిఆర్‌ఎస్ ఎన్ని పాట్లు పడిందీ చూశాము.హుజూరాబాద్ గురించి ముందే చెప్పుకున్నాం. అక్కడ బిజెపి కంటే కెసిఆర్ అహం మీద ఈటెల దెబ్బకొట్టారు. మొత్తం మీద జరిగిందేమంటే టిఆర్‌ఎస్ సారధి కెసిఆర్ విశ్వసనీయత గ్రాఫ్ పడిపోతోందన్నది స్పష్టమైంది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల తరువాత వరదసాయం మిగిలిన వారికీ అందచేస్తామని ప్రకటించి మాటనిలుపుకోలేదు. ఈ కారణంగానే దళితబంధును హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత రాష్ట్రమంతటా అమలు జరుపుతామని చెప్పినప్పటికీ జనాలు విశ్వసించలేదని తేలిపోయింది. దళితబంధును అమలు చేస్తానని ఉప ఎన్నిక తరువాత కూడా ప్రకటించారు. అయినా అమలు జరుపుతారా ? అప్పు రేపు అని గోడమీద రాస్తారా ? ఏదో ఒకపేరుతో నీరుగారుస్తారా అన్నది పెద్ద ప్రశ్న. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి గురించి జనం మరచిపోగలరా ?
పోగాలము దాపురించినపుడు తాడే పామై కరుస్తుందంటారు. బంధులే టిఆర్‌ఎస్, కెసిఆర్‌కు బంధనాలుగా మారే దృశ్యాలు కనిపిస్తున్నాయి.ప్రపంచమంతటా ఈ ఏడాది పత్తి ధరలు పెరిగాయి, దాన్లో భాగంగా మద్దతు ధరకంటే అదనంగా లభిస్తున్నందున రైతుల్లో సంతృప్తి ఉండవచ్చు. ధాన్యం ధర, మార్కెటింగ్,ఎఫ్‌సిఐ కొనుగోలు తీవ్ర సమస్యగా మారనుంది. అది రైతు బంధు సంతృప్తి స్ధానంలో అసంతృప్తికి దారి తీయవచ్చు. రైతులకు కావాల్సింది తాము పండించిన వరి, ఇతర పంటలకు మద్దతుధర, మార్కెటింగ్ తప్ప మిగతా అంశాలు అంతగా పట్టవు. ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. మన్మోహన్ సింగ్‌కు అమలు జరిపే ధైర్యం లేకపోయింది. నరేంద్రమోడీకి 56అంగుళాల ఛాతీ ఉందని చెబుతున్నారు గనుక ఎవరేమనుకున్నా ముందుకు పోవాలని నిర్ణయించారు. దానిలో భాగమే మూడు సాగు చట్టాలు. మద్దతు ధర అమల్లో ఉంది కనుక కాస్త భరోసా ఉందని వరి పండించటం తప్ప వడ్లను ఉప్పుడు బియ్యంగా మారుస్తారా, పచ్చి బియ్యాన్నే ఎఫ్‌సిఐకి ఇస్తారా అనేదానితో వారికి నిమిత్తం లేదు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆకస్మికంగా వరి వద్దు అంటే కుదురుతుందా ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వద్దు అంటే కేంద్రంలో ఉన్న పార్టీ పండించమంటోంది. తెలంగాణాలో పండించిన ధాన్యం ఉప్పుడు బియ్యానికి మాత్రమే పనికి వస్తుందని పాలకులకు, విధాన నిర్ణేతలకు ముందే తెలిస్తే వేరే రకాల సాగుకు రైతులను క్రమంగా ఎందుకు ప్రోత్సహించలేదు ? శాస్త్రీయంగా అలాంటి నిర్దారణలు ఎవరు చేశారు. అసలు సాగు వద్దే వద్దంటే ఎలా కుదురుతుంది. గతేడాది కరోనా కారణంగా చమురు నిల్వలు పెరిగిపోయి, నిల్వచేసే సౌకర్యాలు లేక అమ్మకందార్లకు కొనుగోలుదారులు ఎదురు డబ్బు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే మాదిరి తెలంగాణా రైతులు వరి వేయటం తక్షణమే నిలిపివేయాలంటే ప్రతామ్నాయం చూపేంతవరకు పరిహారం ఇస్తే నిరభ్యంతరంగా సాగు నిలిపివేస్తారు. వరి పండించాల్సిందే అని బిజెపి నేతలు కూడా చెబుతున్నారు గనుక పంట మొత్తాన్ని కొనుగోలు చేస్తారా లేక పరిహారం ఇస్తారా ? అది కేంద్రం ఇస్తుందా, రాష్ట్రం ఇస్తుందా అన్నది తేల్చాల్సింది రైతులు కాదు.
అసలేం జరుగుతోందో టిఆర్‌ఎస్ లేదా బిజెపి రైతాంగానికి ఎప్పుడైనా వాస్తవాలు చెప్పిన పాపాన పోయాయా ?ఇప్పుడు రెండు పార్టీలు రాజకీయానికి పాల్పడ్డాయి. గతవేసవిలో పండిన ధాన్యం నుంచి 24.75 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం చెప్పిన అంశాన్ని కెసిఆర్ రైతులకు ఎప్పుడైనా చెప్పారా ? అంతకు మించి ఉన్న మిగిలిన వాటిని తీసుకొనేది లేదని కేంద్రం చెప్పి ఉంటే అదైనా చెప్పాలి. మరిన్ని ఉప్పుడు బియ్యం తీసుకోవాలని కెసిఆర్ కేంద్రాన్ని కోరారు, మరో 20లక్షల టన్నులు తీసుకొనేందుకు అంగీకరించినట్లు చెప్పారు తప్ప దానికి తాను అంగీకరించిన షరతు గురించి చెప్పలేదు. ఆ ఇరవైలక్షల టన్నులు తీసుకుంటే భవిష్యతో ఇవ్వబోమనే షరతుకు అంగీకరించిన అంశాన్ని దాచిపెట్టారు. తమ చేత బలవంతంగా రాయించుకున్నారని ఇప్పుడు చెబుతున్నారు. దానిలో నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్దకమే. ఏవైనా కేసుల్లో దళితులు, ఇతర బలహీన తరగతుల వారిని పోలీసులు బెదిరించి బలవంతంగా తెల్లకాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంటే నమ్మవచ్చు, కేంద్రం ఒక ముఖ్యమంత్రిని బలవంతం చేసిందంటే నమ్మగలమా, ఆ దారుణం గురించి జనానికి ఎందుకు చెప్పలేదు ? పంజాబ్‌లో మాదిరి తెలంగాణాలో కూడా ఎఫ్‌సిఐ నేరుగా ఎందుకు కొనుగోలు చేయదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. మేమే సేకరించి ఇస్తామని తొలుత ఎందుకు అంగీకరించినట్లు ? పోనీ ఎప్పుడైనా ఈ అంశాన్ని రైతులు, కేంద్రం దృష్టికి తెచ్చారా ? తమ నుంచి కొనుగోలును తప్పించటానికే కేంద్రం సాగు చట్టాలను తెచ్చిందని పంజాబ్,హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఏడాది కాలంగా రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న అంశం కెసిఆర్‌కు తెలియదంటే నమ్మే అమాయకులెవరూ లేరు. ఆ సాగు చట్టాలకు మద్దతు ఎందుకు ఇచ్చారు, రైతులకు ఒకసారి మద్దతు ఇచ్చి తరువాత ఎందుకు ముఖం చాటేసినట్లు ? మొత్తం వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళనకు ఇప్పుడు పిలుపులు ఇస్తే రైతులు నమ్ముతారా ? బిజెపి కూడా దాగుడుమూతలాడుతోంది, రైతులకు భరోసా కల్పించటం లేదు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చమురు మీద వ్యాట్ తగ్గించాలని బిజెపి, తెలుగుదేశం వత్తిడి చేసిన తరువాత గానీ వైసిపికి చమురు మంట తగల్లేదా ? కేంద్రం పన్నుల పేరుతో పెంచిన సెస్‌ల నుంచి రాష్ట్రాలకు వాటాలు రావని రెండున్నర సంవత్సరాలుగా వారికి తెలియదా ? ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? వ్యాట్ తక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్ పన్నెండు రూపాయలు తగ్గిస్తే వ్యాట్ ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎందుకు తగ్గించదు అంటున్నారు. బిజెపి పాలనలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో పెట్రోలు, డీజిలు మీద 26.8-17.48శాతాల చొప్పున వ్యాట్ వుండగా అదే బిజెపి ఏలుబడిలోని అసోంలో 32.66-23.66శాతం ఉంది. అంత ఎక్కువ వసూలు చేస్తున్న అసోం ఏడు రూపాయలు మాత్రమే ఎందుకు తగ్గించినట్లు ? ఇన్ని సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు, ఎంత పెంచింది, ఇంతకాలం ససేమిరా తగ్గించేది లేదని తిరస్కరించి ఇప్పుడు ఎందుకు, ముష్టి విదిల్చినట్లుగా తగ్గించిందో, ఉత్తర ప్రదేశ్ మాదిరి డీజిలు, పెట్రోలు మీద కేంద్రం కూడా పన్నెండు రూపాయలు కేంద్రం ఎందుకు తగ్గించలేదో బిజెపి నేతలు చెప్పాలి. మోడీ గారు అధికారంలోకి వచ్చినపుడు 58గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 75కు పడిపోవటానికి కారణం మోడీ గారు అనుసరిస్తున్న విధానాలే. అందువలన ముందు దాన్ని కనీసం పూర్వపువిలువకైనా పెంచాలి, లేదా వారి అసమర్ధతకు జనాన్ని బలిచేయకుండా మరింతగా ఏడున్నర సంవత్సరాల స్ధాయికి పన్ను తగ్గించాలి. లేదా చమురును కూడా జిఎస్‌టి పరిధిలోకి తేవాలి, రాష్ట్రాల ఆదాయం తగ్గినంతకాలం ఇప్పుడు జిఎస్‌టి పరిహారం ఇస్తున్న మాదిరే ఎంతకాలం లోటు ఉంటే అంతకాలం చెల్లించాలి. కేంద్రం పెంచిన మాదిరి రాష్ట్రాలు వ్యాట్ విపరీతంగా పెంచలేదు. అందువలన కేంద్రం ముందు దారి చూపి రాష్ట్రాలను అనుసరించాలని కోరవచ్చు తప్ప డిమాండ్ చేసే హక్కు లేదు. కేంద్రం తగ్గిస్తే దానికి అనుగుణంగా రాష్ట్రాలు తగ్గించకుండానే భారం తగ్గుతుంది. కేంద్రం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది రూపాయలు తగ్గిస్తే ఆమేరకు రాష్ట్రాల వ్యాట్ భారం కూడా తగ్గుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు మీద 31శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు. కేంద్రం తగ్గించినదాని ప్రకారం పెట్రోలు మీద లీటరుకు 155పైసలు, డీజిలు మీద 22.25శాతం ఉన్నందున 2.25పైసలు రాష్ట్రవాటాగా తగ్గుతుంది. కేంద్రం తగ్గించిన మేరకు ఆ దామాషాలో రాష్ట్రానికి కూడా వాటా తగ్గుతుంది.
కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధుల గురించి కేంద్రం ఎటూ తేల్చదు, బిజెపికి పట్టదు.ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ సంగతి మాట్లాడరు. చమురు ధరల తగ్గింపు గురించి ఆందోళనకు దిగిన తెలుగుదేశం రైల్వే జోన్, ఇతర అంశాల గురించి ఎందుకు మౌనంగా ఉన్నట్లు ? రెండు తెలుగు రాష్ట్రాల్లోను అధికార పార్టీలైన తెరాస-వైసిపి కేంద్రంలోని బిజెపితో ఘర్షణకు దిగేందుకు సిద్దం కావటం లేదు. తాజా పరిణామాలు అనివార్యంగా బిజెపితో తెరాస-వైసిపి మధ్యం దూరం పెంచనున్నాయని భావిస్తున్నారు. రెండు పార్టీలను మింగివేసేందుకు లేదా తన ఉపగ్రహాలుగా మార్చుకొనేందుకు బిజెపి చేయాల్సిందంతా చేస్తోంది. విధానపరమైన తేడాలు లేవు, తేడా అధికారం దగ్గరే కనుక, బిజెపి బలహీనపడుతున్న కారణంగా రెండు పార్టీలు రానున్న రోజుల్లో ప్రతిఘటించేందుకే పూనుకోవచ్చు.లేదూ బిజెపికి లొంగితే అది ఆత్మహత్యాసదృశ్యం అవుతుంది . సమస్యలు చుట్టుముడుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల సిఎంలూ ఏదో ఒకసాకుతో మధ్యంతర ఎన్నికలకు తెరలేపినా ఆశ్చర్యం లేదు.