Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


” భారత భూభాగాల్లో అరుణాచల్‌ సమీపంలో చైనా అక్రమంగా గ్రామాలను నిర్మిస్తున్నది ” అమెరికా పార్లమెంట్‌కు అక్కడి రక్షణ శాఖ పెంటగన్‌ ఇటీవల వార్షిక నివేదికలో చేసిన వ్యాఖ్యలలో ఒకటి. ఇంకేముంది దున్న ఈనిందని చెప్పగానే గాటన కట్టేయమన్నట్లుగా మీడియా మన జనాలకు ఆ వార్తను అందించింది. ఇంత ఘోరమా అని అనేక మంది ఆగ్రహించారు. చైనాకు అడ్డు అదుపూ లేకుండా పోయింది, ఏదో ఒకటి చేయాలని జనాలు కొందరు ఊగి ఊగిపోయారు. చుట్టుముడుతున్న సమస్యల నుంచి జనాన్ని ఎలా పక్కదారి పట్టించాలా అని నిరంతరం మార్గాలు వెతికే పాలకులకు కాగల పని గంధర్వులు తీర్చారు అన్నట్లుగా చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టి పెంటగన్‌, మీడియా తమ పాత్రలను తాము చక్కగా పోషించాయి. నివేదిక, వార్తలు వెలువడిన కొద్ది రోజుల తరువాత తాపీగా ప్రభుత్వం, మిలిటరీ అధికారి రంగంలోకి దిగారు. ఆ చెప్పేదేదో మరుసటి రోజే చెబితే జనాలకు అనవసర ఆయాసం తప్పేది కదా ! బుర్రలు ఖరాబు చేసుకొని ఉండేవారు కదా కదా !! ఎందుకు ఆలశ్యం చేసినట్లు ?


కావాలనే ఆలశ్యంగా స్పందించారన్నది స్పష్టం. పెంటగన్‌ ప్రచారాన్ని కొనసాగనిస్తే చైనా వారు ఏకంగా గ్రామాలనే నిర్మిస్తుంటే మన ప్రభుత్వం ఏ గుడ్డి గుర్రాలకు పండ్లు తోముతున్నది అని ఆవేశం నుంచి తేరుకున్న జనం ప్రశ్నిస్తారు, వాడెవడో అమెరికా వాడు చెప్పేంతవరకు మన సరిహద్దుల్లో ఏం జరుగుతోందన్న సంగతులే తెలియకుండా లేదా తెలుసుకోకుండా మన ముసలి జేమ్స్‌ బాండ్‌ అజిత్‌ దోవల్‌ ఏం చేస్తున్నట్లు ? దేశ రక్షణ బాధ్యత తనదే అని పదే పదే ప్రకటించుకున్న ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోవద్దా అని జనం అడుగుతారు. రెండోవైపు నుంచి పెంటగన్‌ చెప్పినదాని మీద మీరు మాట్లాడలేదంటే అది నిజమే అని మీరు నమ్మినట్లే అని మేం భావించవచ్చా అని చైనా వారు కూడా అడుగుతారు. అందుకే స్పందించారు. ఏమన్నారు ?


భారత భూభాగంలో చైనా వారు గ్రామాలు నిర్మిస్తున్నారన్నది వాస్తవం కాదు అని మన రక్షణ దళాల ప్రధాన అధికారి (సిడిఎస్‌) బిపిన్‌ రావత్‌ గురువారం నాడు అన్నీ పుకార్లే అని చెప్పారు. వాస్తవాధీన రేఖ అన్న దానికి మన ప్రస్తుత అవగాహనకు విరుద్దంగా ఎలాంటి చొరబాట్లు లేవు, గ్రామాల నిర్మాణం కోసం రేఖను దాటి రాలేదు, ఆ వార్తలు వాస్తవం కాదు, నిర్మించారని చెబుతున్న గ్రామాలు వాస్తవాధీన రేఖకు చైనా వైపే ఉన్నాయి అని రావత్‌ చెప్పారు. మాకు తెలిసినంత వరకు అలాంటి గ్రామ అభివృద్ధి వాస్తవాధీన రేఖకు మన వైపున జరగలేదు. కొత్త గ్రామాన్ని నిర్మించేందుకు చైనా వారు రేఖను దాటి మన ప్రాంతంలోకి వచ్చి నిర్మాణం చేశారన్న వార్తమీద ప్రస్తుత వివాదం తలెత్తింది. బహుశా ప్రత్యేకించి ఇటీవల మనతో తలపడిన తరువాత వాస్తవాధీన రేఖ వెంట వారి సైనికులు, పౌరుల కోసం లేదా భవిష్యత్‌లో మిలిటరీ అవసరాల కోసం గ్రామాలను నిర్మిస్తుండవచ్చు అని కూడా రావత్‌ చెప్పారు. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖ వెంట దళాలను నియమిస్తున్నాయి. చైనీయులు తమవైపు కొత్త పోస్టులను ఏర్పాటు చేసినపుడు అక్కడ కొన్ని శిధిలమైన, పాత గుడిసెలను మనం చూస్తున్నాము. కాబట్టి కొన్ని దెబ్బతిన్నపుడు కొత్త వాటిని నిర్మించవచ్చు, ఆధునిక నిర్మాణాలు జరుపుతుండవచ్చు, వాటిలో కొన్ని గ్రామాలు కూడా ఉండవచ్చు, ఉన్నవాటిని విస్తరించి ఉండవచ్చు, చైనా సైనికులు తమ ప్రధాన ప్రాంతం నుంచి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, మన సైనికులు సంతోషంగా ఉండటాన్ని వారు చూస్తున్నారు, మన పౌరులు ఆప్రాంతాలకు వెళతారు, మన కుటుంబాలు ఆప్రాంతాలను సందర్శిస్తాయి, వీటన్నింటినీ వారు చూస్తారు. అందువలన వారి సైనికుల కుటుంబాలు ఆ ప్రాంతాలకు వచ్చేందుకు కూడా వాటిని నిర్మిస్తుండవచ్చు, మన సైనికులు వాస్తవాధీన రేఖ నుంచి ఏడాదిలో కనీసం రెండు మూడు సార్లు తమ కుటుంబాలను చూసేందుకు స్వస్ధలాలకు వెళతారు, చైనీయులకు అలాంటి అవకాశం లేదు అని రావత్‌ అన్నారు.


వాస్తవాధీన రేఖ అంటే అనేక అవగాహనలు ఉన్నాయి. మన సైనికులకు వాస్తవాధీన రేఖ ఎక్కడ ఉందో తెలుసు ఎందుకు అంటే ఇది రేఖ, ఈ ప్రాంతాన్ని మనం రక్షించాలి అని వారు నిర్విహించాల్సిన విధుల గురించి వారికి చెబుతాము కనుక వారికి తెలుసు. ఒక అవగాహన ఉంది. చైనా వారికి కొన్ని ప్రాంతాల గురించి అవగాహన ఉందని మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల గురించి ఏమనుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే వారికి వాస్తవాధీన రేఖ గురించిన అవగాహనను వారికి చెప్పకపోవచ్చు.వాస్తవాధీన రేఖ వెంట గ్రామాల నిర్మాణం కండబల ప్రదర్శన అన్నదాన్ని కచ్చితంగా కాదంటాను, బలప్రదర్శన అని నేను వర్ణించను, ఈ గ్రామాల ద్వారా వారు తమ సరిహద్దులకు సులభంగా చేరుకొనేట్లు చూసుకుంటున్నారు, మనం కూడా అదే చేయాల్సి ఉంది, మన ప్రభుత్వం కూడా సరిహద్దు ఏరియా అభివృద్ది కార్యక్రమ పధకానికి (బిఏడిపి) నిధులు విడుదల చేసింది. నిజానికి మనం సరిహద్దు ప్రాంతాలకు తిరిగి వెళ్లండి అని పౌరులను మనం ప్రోత్సహిస్తున్నాం ఎందుకంటే వాస్తవాధీన సరిహద్దు రేఖ వెంట అనేక గ్రామాలవారు ఖాళీ చేశారు అని రావత్‌ వెల్లడించారు. ఎందుకు వారు ఖాళీ చేస్తున్నారంటే లోపలి ప్రాంతాలలో వారికి మరింతగా విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రావత్‌ చెప్పారు.


మన విదేశాంగశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పిందేమిటి ? ” దశాబ్దాల క్రితం అక్రమంగా ఆక్రమించుకున్న ప్రాంతాలతో సహా కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో చైనా నిర్మాణకార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించుకోవటాన్ని గానీ లేదా చైనా చెబుతున్న అంశాలను గానీ భారత్‌ అంగీకరించలేదు. దౌత్యపద్దతుల్లో ఎప్పుడూ అలాంటి కార్యకలాపాలకు నిరసన తెలుపుతూనే ఉన్నాము. భవిష్యత్‌లో కూడా అదే కొనసాగిస్తాము.భారత భద్రత, భూభాగాన్ని కాపాడుకొనేందుకు నిరంతరం పరిణామాలను గమనిస్తూనే ఉంటాము, తగిన చర్య తీసుకుంటాము. అమెరికా పార్లమెంట్‌కు ఆ దేశ రక్షణశాఖ సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రత్యేకించి తూర్పు రంగంలోని అంశాలను గమనంలోకి తీసుకున్నాము. చైనాతో ఉన్న సరిహద్దు ఆప్రాంతాన్ని కలుపుతూ రోడ్లు, వంతెనలను నిర్మిస్తున్నాము” అని చెప్పారు.


పెంటగన్‌ నివేదిక, బిపిన్‌ రావత్‌, అరిందమ్‌ బాగ్చీ చేసిన ప్రకటనల్లో తేడా గురించి, ఏది వాస్తవమో ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలంటూ కాంగ్రెస్‌ స్పందించింది. ఈ నివేదిక గురించి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం లేదా పార్టీ ప్రతినిధులుగానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.చైనా అక్రమ ఆక్రమణలను అంగీకరించేది లేదని విదేశాంగశాఖ ప్రతినిధి చెబుతారు, సైనికదళాల సిడిఎస్‌ చైనా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదంటారు, గతంలో అఖిలపక్ష సమావేశంలో మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. దీనిలో ఏది వాస్తవమో జనానికి మోడీ సర్కార్‌ చెబుతుందా అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. నిజానికి రావత్‌-అరిందమ్‌ బాగ్చీ చెప్పిందాన్లో పరస్పర విరుద్దతేమీ లేదు. ఎప్పటి నుంచో చెబుతున్న అంశాలను అరిందమ్‌ చెప్పారు. అక్కడి వాస్తవ పరిస్ధితి గురించి బిపిన్‌ రావత్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్యసరిహద్దు వివాదం బ్రిటీష్‌ వారు సృష్టించింది. వారు గీసిన గీతలకు భిన్నంగా మన దేశానికి చెందినవిగా చూపినవి చైనా ఆధీనంలో, చైనాలో భాగంగా చూపినవి మన ఆధీనంలో ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో ఆక్సాయిచిన్‌, మరికొన్నింటిని మనవి అని మన దేశం చెబుతోంది. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా అంటోంది. రెండు దేశాలూ వాస్తవాధీన రేఖను అనుసరిస్తున్నాయి. ఈ వివాదాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప మరొక పద్దతిలో సాధ్యం కాదు. దీన్ని మరింతగా రాజేయాలని అమెరికా చూస్తోంది.


ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే అజెండాతో ముందుకు పోతున్న అమెరికా ఎక్కడిక్కడ దేశాల మధ్య తంపులు పెట్టేందుకు చేయని తప్పుడు పనులులేవు. తప్పుడు నివేదికలను రూపొందించటం, వాటి మీద మీడియాలో కట్టుకథలు-పిట్టకథలు రాయించటం దాని నిరంతర కార్యక్రమం. వాటిని పట్టుకొని మన మీడియా రెచ్చిపోతోంది.ఏ దేశంతో అయినా సమస్యలు వచ్చినపుడు జనాలకు వాస్తవాలను వివరించేందుకు భిన్న అభిప్రాయాలతో అంశాలను అందించటం తప్పుకాదు. ఇరుగుపొరుగు దేశాలతో నిరంతరం గిల్లికజ్జాలు పెట్టుకొనే ఏ దేశమూ చరిత్రలో బాగుపడిన దాఖల్లాలేవు. ఆ దిశగా రెచ్చగొట్టే మీడియా ఏ విధంగానూ దేశానికి మేలు చేసేది కాదు. అమెరికా తన గోతిని తానే తవ్వుకొని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి ఎంత అవమానకరంగా బయట పడిందీ తెలిసిందే, అది ఆడించినట్లు ఆడే దేశాలన్నీ సర్వనాశనం అయ్యాయి. అందుకు ఇరాన్‌-ఇరాక్‌లే పక్కా నిదర్శనం. అక్కడి చమురు సంపదలపై కన్నేసిన అమెరికా రెండు దేశాలకూ ఆయుధాలు అమ్మి పదేండ్ల పాటు తలపడేట్లు చేసిన చరిత్ర, చివరకు ఇరాక్‌ను ఆక్రమించిన దుర్మార్గం, లొంగని ఇరాన్‌పై ఆంక్షల అమలు తెలిసిందే. అలాంటి ప్రమాదకరమైన అమెరికా తప్పుడు నివేదికలను ఆధారం చేసుకొని తప్పుడు వార్తలను జనాల మెదళ్లకు ఎక్కించటాన్ని మీడియా దేశభక్తిగా భావిస్తోందా ? ఇంతకు మించి సంచలనాలు, రేటింగ్‌లు పెంచుకొనే సత్తా లేదా ? మీడియాను గుడ్డిగా నమ్మి రెచ్చిపోకూడదని జనం గ్రహించాలి.

పరిస్ధితులు బాగోలేవు, నరేంద్రమోడీ గారు చెప్పిన మంచి రోజుల గురించి ఇంకా భ్రమలతో జనం ఎదురు చూస్తున్నారు. లక్షలాది కుటుంబాలు కరోనా కల్లోలం నుంచి కోలుకోలేదు.పూర్వపు స్ధాయికి ఆదాయాలు రాలేదు.ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినపుడు మానసిక బలహీనతకు లోనుకావటాన్ని ఆసరా చేసుకొని పాలకపార్టీలకు చెందిన మరుగుజ్జు దళాలు వాట్సప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటికే మరమ్మతు చేయటానికి కూడా వీల్లేనంతగా ఎందరో బుర్రలను ఖరాబు చేశాయి.ఇలాంటి ప్రచారానికి పాల్పడేందుకు ఇప్పుడు సాంప్రదాయ మీడియా-సామాజిక మాధ్యమం పరస్పర ఆధారితంగా మారుతున్నాయి. వాస్తవాల కంటే సంచలనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది దేశభక్తా, దేశద్రోహమా ? దేశమంటే మట్టికాదోయి-దేశమంటే మనుషులోయి అని మహాకవి గురజాడ చెప్పిందాని ప్రకారం జనాలను తప్పుదారి పట్టించి ఉన్మాదానికి లోను చేయటం ప్రజాద్రోహం- దేశద్రోహం కాదా ?