Tags
1947 freedom was 'bheekh', BJP, Kangana ranaut, Kangana's controversial statement, Narendra Modi, RSS
ఎం కోటేశ్వరరావు
స్వాతంత్య్రం గురించి చేసిన వ్వాఖ్వలను వెనక్కు తీసుకొనేది లేదని , తన ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెబితే తాను పొందిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చివేస్తానని సినీనటి కంగన రనౌత్ ఊగిపోతున్నారు. ఆమెను ఎప్పుడు ఏ అమ్మోరు ఆవహిస్తుందో తెలియదు- దాంతో ఏం మాట్లాడతారో అసలు ఊహించలేము.మరోసారి అదే జరిగింది. గతంలో మతపరమైన హింసాకాండ, పురోగామిశక్తుల హత్యల మీద పాలకుల మౌనానికి నిరసనగా అనేక మంది తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించారు.స్వాతంత్య్రం గురించి సెలవిచ్చిన కంగన మతిమాలిన ప్రకటనను ఇప్పుడు ప్రశ్నించినందుకు ఆమె శివాలెత్తారు. పురోగామిభావజాల రచయితలు, ఉద్యమకారులైన కలుబుర్గి, నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే వంటి వారి హత్యలకు, మతహింసాకాండపై నిరసనగా అనేక మంది ప్రముఖులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించిన ఉదంతాలు తెలిసిందే. 2015లో దాదాపు 40 మంది అలాంటి వారున్నారు. తిరోగామి భావజాలానికి చెందిన వారు వీరిని అవార్డు వాపసీ గాంగ్ అని నిందిస్తూ ఎదురుదాడి చేశారు. కంగన కంటే అనేక మంది అనుభవం, సీనియారిటీ ఉన్న వారు ఉండగా ఆమెకు ఎందుకు అవార్డు వచ్చిందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. తెరమీద ఆమె ఒళ్లు దాచుకోకుండా నటించటానికి ఎలా కష్టపడతారో రాజకీయ తెరమీద అంతకంటే ఎక్కువగా శ్రమిస్తున్న అంశం తెలిసిందే.
కరోనాను ఎదుర్కోవటంలో వైఫల్యానికి మోడీదే బాధ్యత అంటూ రాజీనామా చేయాలని ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున నెటిజన్లు డిమాండ్ చేసినపుడు కంగనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. ” మోడీ గారికి ఎలా నడపాలో(దేశాన్ని) తెలియదు, కంగనకు ఎలా నటించాలో తెలియదు, సచిన్ టెండూల్కర్‌కు బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియదు, లతామంగేష్కర్‌కు ఎలా పాడాలో రాదు గానీ ప్రమాణాల్లేని ఈ మరుగుజ్జులకు మాత్రం అన్నీ తెలుసు. మోడీ గారూ మీరు రాజీనామా చేసి విష్ణు అవతారాలైన ఈ మరుగుజ్జుల్లో ఒకరిని తదుపరి ప్రధానిగా చేయండి ” అంటూ టీట్లతో కంగన శివతాండవం చేశారు.
రైతుల ఆందోళన గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు అంటూ అంతర్జాతీయంగా పేరున్న ప్రఖ్యాత పాప్ గాయని, నటి రీఅనే చేసిన ట్వీట్ కేంద్ర ప్రభుత్వానికి కాక పుట్టించింది.స్వీడన్‌కు చెందిన 18 ఏండ్ల గ్రేటా టన్‌బెర్జ్ ట్వీట్ ప్రచారాన్ని మరో మలుపు తిప్పింది.ఆమె తన ట్వీట్‌తో పాటు రైతు ఉద్యమానికి సంబంధించిన సమాచారంతో ఒక కిట్‌ను కూడా తోడు చేసింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం మండి పడింది. అంతేనా ఢిల్లీ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేశారు. అయినా ఖాతరు చేయకుండా కిట్‌ను సవరించి మరో ట్వీట్ చేస్తూ తాను ఉద్యమానికి ప్రకటించిన మద్దతుకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేసింది. రీఆనె గురించి కంగనా చేసిన ట్వీట్లో ” ఆమె ప్రత్యేకత ఏమిటంటా పాటలు పాడుతూ కెమెరా ముందు తన పిరుదులు కదిలిస్తుంది-ముందున్నవాటిని ప్రదర్శిస్తుంది. అంతకు మించి ఏముంది ? ఇక గ్రేటా అదొక ఎలుక, బడికి పోవాలనుకోదు, చదువంటే ద్వేషం, అంతర్జాతీయ కుట్రలో ఆమె ఒక భాగం అని పేర్కొన్నది. కంగన సినిమాలను చూసిన వారికి పద్మశ్రీ కంగన ఏమి చూపిందో చెప్పనవసరం లేదు. ఒక వేళ చూసినా వర్ణించటానికి ఆ స్ధాయికి దిగజారలేము.గతంలో రైతులను ఉగ్రవాదులంటూ తూలనాడిన కంగనా బూతు నటి అంటూ రీఅనెను తిట్టిపోసింది. వామపక్ష పాత్రకు ఆదర్శం అంది. రీఆనె స్పందనకు అభినందనగా ఒక పాటను అంకితం చేసిన పంజాబీ గాయకుడు, రచయిత దల్జీత్ దోసాంజ్ మీద విరుచుకుపడుతూ ఖలిస్తానీ అని తిట్టిపోసింది. అంతేనా అనేక మంది క్రెకెటర్లను ఉద్దేశించి ” రజకుడి కుక్కలు ” అంటూ నోరు పారవేసుకుంది. దాంతో ట్విటర్ నిర్వాహకులకే సిగ్గువేసి దాన్ని తొలగించారు. మీరు ఎటువైపో (నరేంద్రమోడీకి అనుకూలమో వ్యతిరేకమో ) తేల్చుకోలేకపోతే రజకుడి కుక్క మాదిరి అటు ఇంట్లోనో ఇటు చాకిరేవు దగ్గరో కాకుండా అటూ ఇటూ తిరుగుతుంటారు అన్నది దాని అర్ధం. పద్మశ్రీ కంగన తీరుతెన్నులివి. ఆమెకు తెలియని అంశం ఉండదు మరి.
బాధ్యతారహితంగా ట్వీట్లు చేయటంలో, ఎదుటి వారిని నిందించటంలో పేరు మోసిన కంగనకు నెటిజన్లు ఆమె గడ్డిని ఆమెకే తినిపిస్తున్నారు. ఆమె చేసిన ఒక ట్వీట్‌లో ఇలా సలహాయిచ్చారు.” ఆక్సిజన్ స్ధాయిలు తక్కువగా ఉన్న వారు ఇలా చేసి చూడండి.చెట్లు నాటటం శాశ్వత పరిష్కారం. మీరా పని చేయలేకపోతే కనీసం వాటిని నరకవద్దు. వాడిన దుస్తులను తిరిగి ఉపయోగించండి, వేద ఆహారం తీసుకోండి, సహజమైన జీవితం గడపండి, ఇది తాత్కాలికమైన పరిష్కారం, ఇప్పటికైతే ఇది మీకు తోడ్పడుతుంది. జై శ్రీరామ్ ” దీని మీద బాజార్ చిత్ర దర్శకుడు గౌరవ్ కె చావ్లా అపహాస్యం చేస్తూ ” ఆక్సిజన్ వృధా మనిషి ” అని ఎద్దేవా చేశారు. దాని మీద కంగనా మండిపడుతూ ” మీ వంటి వారు పాలు సంచుల నుంచి వస్తాయనుకుంటారు.హ హ ఎంత బుద్దిహీనత, సిలిండర్లలోని ఆక్సిజన్ కూడా చెట్ల నుంచే తీసుకుంటారు. గాలిలో కాలుష్యం తక్కువ ఉంటే దానిలోని ఎక్కువ భాగం ఆక్సిజన్‌ను తీసుకొనే ఊపిరితిత్తులను కలిగి ఉంటారు, ఏదైతేనేం అమాయకత్వం ఆనందం కలిగించే అంశం, దానిలోనే జీవించండి ” అని పేర్కొన్నారు. నైట్రోజన్ నుంచి ఆక్సిజన్‌ను వేరు చేస్తారు అని పేర్కొన్న అంశాన్ని కంగనా షేర్ చేశారు.ఆక్సిజన్ గురించి కంగన్ ట్వీట్ల మీద నెటిజన్లు ఆమెను ఆటపట్టించారు. మీరు పూర్తిగా పిచ్చివారయ్యారు చికిత్స చేయించుకోండి అని సలహా ఇచ్చిన వారున్నారు. విద్య ఎంత అవసరమో పెద్దలు ఇందుకే చెప్పారంటూ మరొకరు ఎకసెక్కాలాడారు. వారినీ కంగన వదల్లేదు. ప్రకృతి ప్రకోపం గురించి శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఇది శాస్త్రీయంగా రుజువైంది. చెట్లకూ బాధ,భావోద్వేగాలు ఉంటాయి. వాటిని విచక్షణా రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాము, ఈ రోజు గాలిపీల్చుకొనేందుకు ఇబ్బంది పడుతున్నాము, వాటిని బతకనివ్వండి అని ట్వీట్ చేశారు.
రైతు ఉద్యమం సందర్భంగా తాప్సీపన్ను మీద విరుచుకు పడిన కంగన బస్తీమే సవాల్ అంటూ ట్వీట్లతో వీధులకెక్కారు. తాప్పీ తనను అనుకరించిందని, చౌకబారు స్టార్, ఆడ పురుషుడు అంటూ నోరు పారవేసుకుంది. ఆమె పద్మశ్రీ అవార్డు గ్రహీత మరి. ఇక తాజా విషయానికి వస్తే మన దేశానికి నిజమైన, అసలైన స్వాతంత్య్రం నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన 2014లోనే వచ్చిందని, 1947లో వచ్చింది బ్రిటీష్ వారు వేసిన భిక్ష తప్ప నిజమైనది కాదని పద్మశ్రీ కంగన రనౌత్ ప్రకటించారు. భారతీయ చైతన్యం,అంతరాత్మ, నశించిన నాగరికత పునరుజ్జీవం పొంది గర్జింపు, ఉన్నత స్దాయి 2014లోనే వచ్చిందన్నారు. తనకు అవార్డు ఇచ్చినందుకు నరేంద్రమోడీ గారి గురించి ఆ మాత్రం చెప్పకపోతే బాగుంటుందా ? డోనాల్డ్ ట్రంప్ మోడీని దేశపితగా ప్రకటించారు, ఇక కంగన అండ్ కో జాతిపితగా ప్రకటించటమే తరువాయి. కంగన సినిమాల్లో డైరెక్టర్ చెప్పినట్లు ఆడతారు,పాడతారు, మాట్లాడతారు. కానీ ప్రజాజీవితంలో అలాంటి డైరెక్టర్లు ఉండరు. అందుకే చివరికి బిజెపి ప్రతినిధితో సహా వివిధ రాజకీయ పక్షాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాంతో గుక్కతిప్పుకోలేక స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిని అగౌరవపరచినట్లు ఎవరైనా నిరూపిస్తే తన అవార్డును తిరిగి ఇచ్చివేస్తానంటూ వీధులకు ఎక్కారు.1857లో స్వాతంత్య్రం కోసం తొలి పోరు జరిగింది, 1947 ఏ పోరు జరిగింది ?నాకు తెలియదు. ఎవరైనా తెలిపితే నా అవార్డును తిరిగి ఇచ్చేస్తా, క్షమాపణలు కూడా చెబుతా, దయచేసి నాకు సాయం చేయండి అంటూ అతి తెలివి ప్రదర్శించారు. మరి 2014లో ఏ పోరు జరిగి,ఎవరు జరిపితే అసలైన స్వాతంత్య్రం వచ్చిందో కంగన చెబుతారా ?
కాంగ్రెస్ బిచ్చగత్తె అని అన్నది తానొక్కదాన్నే కాదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను ఉటంకించిన ఒక పుస్తకంలోని పేజీని కంగన చూపారు. కాంగ్రెస్ కేవలం వినతులకే పరిమితమైందని, మిలిటెంట్ పోరాటాలకు సిద్దం కావటం లేదంటూ కొంత మంది చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా చెప్పుకున్నారు. కాంగ్రెస్ అడుక్కునే సంస్ధ అని అరవింద ఘోష్, అడుక్కోవటానికి, హక్కుగా కోరటానికి ఉన్న తేడాను కాంగ్రెస్ తెలుసుకోవాలని లాలా లజపతిరాయి, కాంగ్రెస్ బుడగలతో ఆడుకుంటున్నదని బిపిన్ చంద్రపాల్ అన్న మాటలు దానిలో ఉన్నాయి. వారు కాంగ్రెస్‌ను విమర్శించినా బ్రిటీష్ వారికి లొంగినవారు కాదు. కానీ బ్రిటీష్ వారికి లొంగిపోయి, స్వాతంత్య్ర ఉద్యమానికి దూరంగా ఉంటానని పదే పదే లేఖలు రాసి సావర్కర్‌ను తమ ఆదర్శంగా పరిగణించే నరేంద్రమోడీ ప్రధాని అయిన తరువాతే అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లు కంగన చెప్పటం తప్పుడు ప్రచారంలో భాగం, ఆమె భుజం మీద నుంచి సంఘపరివార్ పేల్చిన తుపాకి తూటా తప్ప మరొకటి కాదు. ఆమె పేర్కొన్న పుస్తకాలు, ఇతర అంశాలు సంఘపరివార్ ప్రచారంలో ఉంచినవి తప్ప కంగనకు అంతసీన్ ఉందని భావించలేము. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్‌ల సరసన సావర్కర్‌ను చేర్చి గొప్ప దేశభక్తుడని చెప్పటం దాన్లో భాగమే. తాను 1957నాటి ప్రధమ స్వాతంత్య్ర పోరాటాన్ని ఎంతగానో పరిశోధించానని, ఝాన్నీ లక్ష్మీబాయి సినిమాలో నటించానని అంటూ ఆ పోరాటం ఎందుకు ఆకస్మికంగా నిలిచిపోయింది, ఎందుకు గాంధీ భగత్ సింగ్‌ను మరణించేట్లుగా వదలివేశారు, నేతాజీని ఎందుకు చంపారు, గాంధీ ఎందుకు ఎన్నడూ మద్దతు ఇవ్వలేదు, దేశవిభజనను తెల్లవారెందుకు చేశారు, స్వాతంత్య్రాన్ని ఉత్సవంగా చేసుకోకుండా ఒకరినొకరు ఎందుకు చంపుకున్నారు, వీటి మీద సమాధానం కావాలని కూడా కంగన కోరారు. సంఘపరివార్ స్క్రిప్టును ఒక నటి మాదిరి కంగన వల్లించటం తప్ప ఇది వేరు కాదు.
కంగన ఉవాచ వైరల్ కావటంతో ఆమె మీద దేశద్రోహ, రెచ్చగొట్టే వైఖరి మీద కేసులు నమోదు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఒక ట్వీట్ చేస్తూ కంగనపై చర్య తీసుకోవాలని కోరారు.స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబనుంచి ఒక సమరయోధుడి కుమారుడిగా కంగన ప్రకటనలు అమరజీవులను అవమానించటమే అని స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయటమే అన్నారు.కంగన వ్యాఖ్యలను ఉన్మాదం అననా దేశద్రోహం అనాలా అని బిజెపి ఎంపీ వరుణ్ గాంధీ అడిగారు.శివసేన, కాంగ్రెస్ కూడా ఖండించింది. కొన్ని చోట్ల కంగన మీద కేసులు నమోదు చేశారు. ఇంత రచ్చ జరిగినా కేంద్ర బిజెపి మౌనం దాల్చింది. ఇలాంటి తప్పుడు ప్రచారం తనపని తాను చేసుకుపోతుంది, కొందరి బుర్రలను చెడగొడుతుంది, చరిత్రను వక్రీకరించే వారికి, తిరగరాయదలచుకున్నవారు కోరుకుంటున్నది ఇదే !