Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక స్ధితి గురించి ఆందోళనకరమైన వార్తలు వెలువడుతున్నాయి. మూసిపెడితే పాచి పోతుంది అన్నట్లు పరిస్ధితి ఉంది. అప్పుల తిప్పలు జగన్మోహనరెడ్డి సర్కారును చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే నిబంధనల పరిమితిని మించి అప్పులు తీసుకున్నారు.రోజు గడవాలంటే కొత్త అప్పులు తీసుకోక తప్పటం లేదు. అలా తీసుకోవాలంటే కేంద్రం విధించే షరతులను అమలు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే చేసి ఆ మేరకు జనాల మీద భారాలు పెంచుతున్నారు.వృతం చెడ్డా ఫలం దక్కని స్ధితి రానుంది.


తాజాగా కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండవ త్రైమాసికం వరకు అంటే సెస్టెంబరు వరకు మూలధన( కొత్త ఆస్తుల కల్పన పెట్టుబడి) వ్యయ కేటాయింపులో నిర్ణీతశాతం ఖర్చు చేసిన రాష్ట్రాలకు పరిమితికి మించి 0.5శాతం జిఎస్‌డిపికి సమానమైన మొత్తాన్ని అదనంగా అప్పు తెచ్చుకొనేందుకు కేంద్రం అనుమతిని ప్రకటించింది. ఏడు రాష్ట్రాలు అలాంటి అర్హత సాధించాయి. ఆ విధంగా చత్తీస్‌ఘర్‌కు 895, కేరళకు 2,256, మధ్యప్రదేశ్‌కు 2,590, మేఘాలయ 96, పంజాబ్‌, 2,869, రాజస్తాన్‌ 2,593, తెలంగాణా 5,392 కోట్ల మేరకు కొత్తగా రుణాలు తీసుకోవచ్చు. సెప్టెంబరు 30వరకు 22 రాష్ట్రాలు అందచేసిన సమాచారం మేరకు సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్తమాన సంవత్సరంలో ఏ రాష్ట్రమైనా జిఎస్‌డిపిలో నాలుగుశాతం వరకు రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్రాలు తమ బడ్జెట్లలో మూలధన పెట్టుబడికింద చేసిన కేటాయింపులలో తొలి మూడు మాసాల్లో 15శాతం, ఆరుమాసాల్లో 45, తొమ్మిది మాసాల్లో 70, ఏడాది చివరికి నూరుశాతం ఖర్చు చేశారా లేదా అనే ప్రాతిపదికన సమీక్ష చేస్తారు. అందువలన ఒక మూడు మాసాల్లో ఆ మేరకు చేయకపోయినా తరువాత ఖర్చు చేస్తే అర్హత వస్తుంది. తొలి ఆరునెలల్లో ఆంధ్రప్రదేశ్‌ అలాంటి లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. తదుపరి సమీక్ష డిసెంబరు 31న జరుగుతుంది.


తొలిఆరునెలల్లో రాష్ట్ర ఆదాయ(రెవెన్యూ)లోటు 662.8శాతంగా ఉంది. 2021-22 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రు.5,000.08 కోట్లుగా చూపితే ఏప్రిల్‌-సెప్టెంబరునాటికి రు.33,140.62కోట్లకు చేరింది. కాగ్‌ వివరాల ప్రకారం ఆరునెలల్లో మొత్తం ఆదాయం రు.1,04,804.91 కోట్లు, దీనిలో అప్పుగా తెచ్చిన రు.39,914.18 కోట్లు కలసి ఉన్నాయి.రాబడిలో రు.50,419 కోట్లు సంక్షేమ పధకాలకు, మిగిలిన మొత్తంలో అప్పుల అసలు, వడ్డీలు, వేతనాలు, సబ్సిడీలకు చెల్లించినట్లు చూపారు. ఏడాది మొత్తంలో అప్పులుగా తీసుకుంటామని బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం రు.37,029.79 కోట్లు కాగా ఆరునెలల్లో తీసుకున్నదే రు.39,914 కోట్లు. మరో ఆరునెలల్లో ఎంత అవుతుందో తెలియదు. గతేడాది కంటే ఆదాయం పెరిగినప్పటికీ చేసిన అప్పు ఇదని గమనించాలి. మూలధన పెట్టుబడి ఖర్చు రు.6,415.51 కోట్లు, ఇది గతేడాది తొలి ఆరునెలల కంటే రు.2,912 కోట్లు తక్కువ. ఏడాదిలో ప్రతిపాదించిన రు. 31,198 కోట్లు అంకెల్లో తప్ప అమలుకు నోచుకోదు. గతేడాది నిర్వాకం కూడా ఇదే రు.29,300 కోట్లు ప్రతిపాదించి ఖర్చు చేసింది రు.18,385 కోట్లే.


బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం 2021- 22లో మొత్తం రు.2,29,779 కోట్లు ఖర్చు ఉంటుంది. దీనికి గాను రు. 1,77,247 కోట్లు స్వంత వనరులు, కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆదాయం వస్తుందని, రు.50,525 కోట్లు అప్పులు తీసుకువస్తామని చెప్పారు. ఆదాయలోటు ఐదువేల కోట్లు,ద్రవ్యలోటు 37వేల కోట్లు అని చూపారు. ప్రతి సంవత్సరం చివరిలో వాటిని సవరిస్తారు. ఉదాహరణకు 2020-21లో ఖర్చు రు.2,24,789 కోట్లుగా చూపి చివరకు రు.1,85,468కి సవరించారు. ఇదే ఆదాయాన్ని చూస్తే రు.1,62,558 కోట్లుగా చూపి రు.1,19,126 కోట్లకు తగ్గించగా అప్పు రు.60,258 కోట్లు తెస్తామని రు.57,805 కోట్లు తెచ్చారు.


ఇక కేటాయింపు, ఖర్చు అంశానికి వస్తే దీనిలో అనేక మతలబులున్నాయి.2020-21లో పెట్టుబడి వ్యయం రు.18,797 కోట్లు, ఇది కేటాయింపు కంటే 37శాతం తక్కువ. సాగునీరు, వరద నివారణ పధకాలకు రు.6,786, రవాణాకు 1,962 కోత పెట్టారు. పెట్టుబడి ఖర్చులో ఆస్తులను సమకూర్చే పధకాల నిర్మాణంతో పాటు, గతంలో వాటికోసం తెచ్చిన తీర్చే అప్పులు, వడ్డీలు కూడా ఉంటాయి. 2019-20లో ఇందుకోసం చేసిన వాస్తవ ఖర్చు రు.36, 226 కోట్లు, దీనిలో ఆస్తుల కల్పనకు చేసింది రు.12,242 కోట్లు. అంటే అప్పులకే ఎక్కువ పోయింది. 2020-21లో మొత్తం రు.44,397 కోట్లు కేటాయించి రు.32,478 కోట్లకు కుదించారు. దీనిలో అప్పులకు రు.13,681 కోట్లు, ఆస్తులకు రు.18,797 ఖర్చు చేశారు. వర్తమాన బడ్జెట్‌లో రెండింటికీ కలిపి రు. 47,583 కోట్లుగానూ, ఆస్తుల కల్పనకు రు.31,198 కోట్లుగాచూపారు. దీనిలో ముందే చెప్పుకున్నట్లు తొలి ఆరునెలల్లో ఖర్చు చేసింది రు. 6,415.51 మాత్రమే. రెవెన్యూ ఖర్చును చూస్తే 2019-20లో రు.1,37,475 కోట్లు, మరుసటి ఏడాది దాన్ని రు.1,80,393 కోట్ల నుంచి రు.1,52,990 కోట్లకు కోత పెట్టారు. వర్తమాన సంవత్సరంలో ప్రతిపాదనే రు.1,82,197 కోట్లు. దీన్లో ఎంత కోత పెడతారో తెలియదు. పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉంది కనుకనే ఉద్యోగులు, టీచర్లకు కొత్త వేతనాలు ఖరారు చేసేందుకు ముందుకు రావటం లేదు. ఇక అప్పుల తిప్పల సంగతి చూద్దాం. 2019-20లో అసలు చెల్లింపు రు.18,625, వడ్డీకి రు.17,635 కోట్లు, 2020-21లో ఈ మొత్తాలు రు.11,973 – 22,026గా, 2021-22లో రు.15,503-22,740 కోట్లుగా చూపారు.


కేంద్ర ప్రభుత్వం తన అజండాను అమలు జరిపేందుకు రాష్ట్రాల మీద ఆంక్షలు పెడుతోంది, షరతులు విధిస్తోంది. కార్పొరేట్లకు మార్గాన్ని సుగమం చేస్తోంది. ఉదాహరణకు 2005ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రాష్ట్రాలు ఏవిధంగా నడుచుకోవాలో ముందుగానే లక్ష్యాలను నిర్దేశించింది. పదిహేనవ ఆర్ధిక సంఘం 2021-26 సంవత్సరాలలో ద్రవ్యలోటును సంవత్సరాల వారీగా జిఎస్‌డిపిలో 2021-22కు 4, 2022-23కు 3.5, 2023-26కు మూడుశాతాల చొప్పున పరిమితం చేసుకోవాలి. దీని వలన ఆంధ్రప్రదేశ్‌కు 2020-21లో జిఎస్‌డిపిలో ఉన్న 35శాతం రుణ భారం 2025-26 నాటికి 32.1శాతానికి తగ్గుతుందని 15వ ఆర్ధిక సంఘం పేర్కొన్నది. ఇవన్నీ పరిస్ధితులు సాధారణంగా ఉంటే, కానీ కరోనా కారణంగా ఇచ్చిన మినహాయింపులు, ఇతర అంశాల కారణంగా అది అమలు జరుగుతుందని చెప్పలేము. ఐదు సంవత్సరాల కాలంలో పరిమితులను తొలి నాలుగు సంవత్సరాలలో వినియోగించుకోనట్లైతే ఐదవ ఏడాది అదనపు రుణాలు తీసుకోవచ్చు. ఈ లోగా విద్యుత్‌ రంగంలో కేంద్రం ప్రతిపాదించిన షరతులను అమలు జరిపితే తొలి నాలుగు సంవత్సరాలు ప్రతి ఏటా జిఎస్‌డిపిలో 0.5 శాతం చొప్పున అదనంగా అప్పులు తీసుకోవచ్చు.2021-25 మధ్య విద్యుత్‌ నిర్వహణ నష్టాలు తగ్గించాలి.ఆదాయ తేడాను కుదించాలి. వినియోగదారులకు నేరుగా సబ్సిడీని అందించటం ద్వారా సబ్సిడీ మొత్తాలను తగ్గించాలి. ఆదాయాన్ని సబ్సిడీ రేట్లను తగ్గించాలి. ఇవన్నీ ఈ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు దారి సుగమం చేయటమే.


జిఎస్‌డిపి ప్రతి ఏటా పెరుగుతూ ఉంటుంది కనుక ఆ దామాషాలో రుణ పరిమితి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ జిఎస్‌డిపి విలువ రు.5,26,470 కోట్లుగా ఉంది. మూడుశాతం రుణ పరిమితి ప్రకారం రు.15,794 కోట్లు తీసుకోవచ్చు.2018-19నాటికి అది రు.9,33,402 కోట్లకు పెరిగింది కనుక రుణం 28వేల కోట్లు తీసుకోవచ్చు. అలాగే 2020-21లో రు.10,19,146 కోట్లుగా సవరించినందున రుణం 34వేల కోట్ల వరకు తీసుకోవచ్చు. ఆత్మనిర్భర పధకం కింద రెండు శాతం అదనంగా తీసుకొనేందుకు అనుమతించారు. ఇప్పుడు ఆర్ధిక సంఘం ఆంక్షలకు మించి ద్రవ్యలోటు ఉంది. 2020-21లో ద్రవ్యలోటు జిఎస్‌డిపిలో 4.78శాతంగా ప్రతిపాదిస్తే అది 5.38శాతానికి చేరింది. కేంద్రం కరోనా కారణంగా సడలించిన రుణ పరిమితి ఐదుశాతానికి మించి ఇది ఉంది. ఐదుశాతానికి కూడా కేంద్రం షరతులు విధించింది. నాలుగుశాతం వరకు ఎలాంటి షరతులు లేవు, ఒకశాతానికి నాలుగు ఉన్నాయి. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు ఒకటి, సులభతర వాణిజ్యం, స్ధానిక సంస్దలలో పన్నుల పెంపు, విద్యుత్‌ పంపిణీ సంస్కరణ. మొదటి మూడింటిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నెరవేర్చింది. దీంతో అదనంగా 9,090 కోట్లు అదనంగా అప్పు చేసేందుకు అవకాశం వచ్చింది. విద్యుత్‌ సంస్కరణలో భాగంగా మీటర్లు పెట్టేందుకు నిర్ణయించిన అంశం తెలిసిందే. అది జరిగిన తరువాత వినియోగదారులు ముందుగా బిల్లులు చెల్లించాలి. మిగిలిన షరతుల ప్రకారం సబ్సిడీలో కోత వంటి వాటికి పూనుకుంటే వంటగాస్‌ మాదిరి క్రమంగా తగ్గించి వేసి నామమాత్రంగా సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సంస్కరణల ప్రకారం విద్యుత్‌ సరఫరా ధరలో 20శాతానికి మించి సబ్సిడీ ఇవ్వకూడదు. పెట్రోలు, డీజిలు ధరల మాదిరి ఖర్చు పెరిగినపుడల్లా చార్జీలను పెంచవచ్చు.


రాష్ట్రానికి ఉన్న అన్నిరకాల అప్పుల సంగతి చూస్తే 2019-20 ఆదాయలోటు 2.7, ద్రవ్యలోటు 4.1శాతం ఉన్నపుడు జిఎస్‌డిపిలో రుణాలు 31శాతం ఉన్నాయి. మరుసటి ఏడాది అంచనాలను సవరించిన తరువాత అవి వరుసగా 3.5, 5.4, 35.2శాతంగా చూపారు. వర్తమాన సంవత్సరంలో 0.5, 3.5, 36.5 శాతాలుగా ప్రతిపాదించినప్పటికీ ఎంతకు సవరిస్తారో తెలీదు.ప్రభుత్వ పనితీరును చూస్తే కీలకమైన ఐదు శాఖల్లో మిగతా రాష్ట్రాల సగటుతో పోలిస్తే బడ్జెట్లలో కేటాయింపుల శాతాలు ,ఆంధ్ర ప్రదేశ్‌ తీరుతెన్నులు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనలు 2021-22వి కాగా ఇతర రాష్ట్రాలవి 2020-21 వివరాలు.
శాఖ××××× ఆంధ్రప్రదేశ్‌ ×× మొత్తం రాష్ట్రాల సగటు
విద్య ×××××× 12.8 ××××× 15.8
ఆరోగ్యం ×××× 6.6 ××××× 5.5
వ్యవసాయం××× 6.2 ××××× 6.3
గ్రామీణాభివృద్ది×× 7 ××××× 6.1
రోడ్లు, వంతెనలు× 1.7 ××××× 4.3
కరోనా, మరొకపేరుతో గతేడాది మోపిన పన్నులు ఇప్పుడు కొంత మేరకు జగన్‌ సర్కార్‌కు ఊరటనిస్తున్నాయి. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే పన్నెండువేల కోట్ల మేరకు అదనపు ఆదాయం వచ్చింది. ఇదే సమయంలో ఏడాదికి తీసుకుంటామని చెప్పిన రుణాల మొత్తం కూడా తీసుకున్నారు. రెవెన్యూలోటు ఏడాదికి ఐదువేల కోట్లని చెబితే 31వేల కోట్లు దాటింది. సంక్షేమ పధకాలకు గతేడాది 75వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది 84కోట్లకు పెరిగింది. దశలవారీగా మద్యనిషేధం గురించి చెప్పినా దాన్నొక ఆదాయ వనరుగా చూస్తున్నారు. ప్రొబేషన్‌ టాక్సు పేరుతో రు.4,500 కోట్లు, రోడ్ల అభివృద్ధి పేరుతో చమురు, సహజవాయువుపై 900 కోట్లు పన్ను విధించారు. వాటిని రోడ్ల మరమ్మతుకు వినియోగించినా ఇంత అధ్వానంగా ఉండేవి కాదు. పైన చెప్పుకున్నట్లు చెత్త పన్ను 350 కోట్లు, పట్టణ ఆస్తులపై రెండువేల కోట్లు, విద్యుత్‌పై 1000 కోట్లు వడ్డించారు.భూముల విలువ పెంచి అదనంగా 800 కోట్లు రాబట్టారు.


అసలేమీ ఇవ్వని వారి కంటే సంక్షేమ పధకాల పేరుతో జనాన్ని ఆదుకోవటాన్ని ఎవరైనా సమర్ధిస్తారు. వాటికీ పరిమితులుంటాయి. కానీ అవే జనాలను బొందితో కైలాసానికి చేరుస్తాయని ఎవరైనా చెబితే, నమ్మిస్తే అది వంచన అవుతుంది. జనాలకు కావలసినన్ని చేపలను తొలుత సరఫరా చేసినా వాటిని పట్టటం నేర్పితేనే ఎవరికైనా జీవితాంతం భరోసా ఉంటుంది, వారి బతుకు వారు బతుకుతారు. సంక్షేమ పధకాలూ అంతే !ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించలేరు. ఏదో ఒక పేరుతో వాయిదా వేసే ఎత్తుగడ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను అమలు జరపలేరు. తెలంగాణా అనుభవం చూసిన తరువాత ఉద్యోగులు, ఇతరులను ఏమాత్రం మభ్యపెట్టలేరు. నవరత్నాలే సర్వస్వం కాదనే తత్వం ఇప్పుడే తలకెక్కుతోంది. కేంద్రం ఆదేశించిన మేరకు విధించిన భారాల గురించి చెప్పుకోలేరు, విద్యుత్‌ సంస్కరణలను ఎదిరించలేరు. మొత్తం మీద మూడో ఏడాది నాటికే తలకు మించిన ఆర్ధిక భారాన్ని తలకెత్తుకున్నారు. ప్రస్తుతం నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగాయి. ఇవిగాక ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్దలు, శాఖలకు హామీ ఇచ్చిన అప్పులు మరో లక్ష కోట్లు ఉంటాయి. ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులను తప్పించుకొనేందుకు ఇలా రెండు ఖాతాల్లో చూపుతున్నారు. 2024 నాటికి 6.54 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. అప్పుల దారులన్నీ మూసుకుపోయినపుడు దాన్నుంచి బయట పడాలంటే సంక్షేమ పధకాలకు కోత పెట్టాలి లేదా మరిన్ని భారాలను జనం మీద మోపాలి. అందుకే ఐదేండ్లు గడిచే సరికి నవరత్నాలు, భరోసాలే బంధాలుగా మారి రాజకీయంగా కొంప ముంచినా ఆశ్చర్యలేదు.జనం వైఫల్యాలను గుర్తించక, అసంతృప్తి పెరగముందే ఏదో ఒక సాకుతో ముందస్తు ఎన్నికలకు పోయినా పోవచ్చు !