Tags

, ,


ఎం కోటేశ్వరరావు


చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌, అమెరికా అధినేత జో బైడెన్‌ మధ్య మంగళవారం నాడు ( వాషింగ్టన్‌లో సోమవారం రాత్రి) మూడు గంటల 24నిమిషాల సేపు వీడియో కాన్ఫరెన్సుద్వారా రెండు దఫాలుగా చర్చలు జరిగాయి. వెలువడిన ప్రాధమిక సమాచారం మేరకు అధినేతలిద్దరూ అనేక అంశాల గురించి చర్చించారు. రెండు దేశాల మధ్య 1979లో దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత తొలిసారిగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, వివాదాల నడుమ అసలు భేటీ కావటమే ఒక విశేషం. బైడెన్‌ అధికారానికి వచ్చిన 300వ రోజు ఈ భేటీ జరిగింది. సుహృద్భావ సూచికగా రెండు దేశాల నేతలు సమావేశానికి హాజరైన సమయంలో బైడెన్‌ చైనా ఎర్రజెండాకు చిహ్నంగా ఎర్ర రంగు టై ధరించగా, అమెరికా అధికారపార్టీ రంగైన నీలి రంగు టై ధరించి గ్జీ జింపింగ్‌ పాల్గొన్నారు.


రెండు దేశాల సంబంధాలలో ఒక నిశ్చయాన్ని లేదా విశ్వాసాన్ని ఈ సమావేశం నింపిందని చైనా పరిశీలకులు వ్యాఖ్యానించారు. పరస్పరం సహకరించుకోవాలనే అభిలాష వ్యక్తం కావటం ప్రపంచానికి సానుకూల సూచికగా పరిగణిస్తున్నారు. సహజంగా ఇలాంటి సమావేశాలలో మాట్లాడే అగ్రనేతలెవరూ సానుకూల వచనాలే పలుకుతారు. ఇక్కడా అదే జరిగింది. తరువాత ఎవరెలా ప్రవర్తించేదీ చూడాల్సి ఉంది. రెండు దేశాలూ పరస్పరం గౌరవించుకోవాలి, శాంతితో సహజీవనం చేయాలి, ఉభయ తారకంగా సహకరించుకోవాలని, సానుకూల మార్గంలో ముందుకు వెళ్లేందుకు రెండు దేశాలూ చురుకైన అడుగులు వేయాలని జింపింగ్‌ చెప్పాడు.దాపరికం లేకుండా నిర్మొగమాటం లేకుండా చర్చల కోసం చూస్తున్నానని, రెండు దేశాల మధ్య ప్రస్తుత మార్గాన్ని ఘర్షణవైపు మళ్లించవద్దని, రెండు దేశాల మధ్య ఉన్న పోటీ బాటను పోరువైపు మళ్లించకుండా చూడాల్సిన బాధ్యత ఇరుదేశాల అగ్రనేతల మీద ఉందని, ఇరుపక్షాలూ పరిస్ధితి చేజారకుండా తగిన జాగ్రత్తలు(గార్డ్‌ రెయిల్స్‌ – మెట్లు, గోడల మీద నడిచేటపుడు పడకుండా పట్టుకొనేందుకు ఇనుప రాడ్లు, కర్రలు, తాళ్లవంటివి ఏర్పాటు చేసుకుంటాము. అలాగే ఇరు దేశాల వైఖరులు కుప్పకూలిపోకుండా జాగ్రత్తలు) తీసుకోవాలని జోబైడెన్‌ చెప్పాడు. దానికి ప్రతిగా జింపింగ్‌ కూడా స్పందించాడు.చైనా -అమెరికాలు సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు పెద్ద ఓడల వంటివి.ఒకదానినొకటి ఢకొీట్టుకోకుండా ఉండాలంటే అలలను ఛేదించుకుంటూ ముందుకు పోవాలంటే ఒకే వేగం, దిశ మారకుండా సాగేందుకు చుక్కానుల మీద అదుపు కలిగి ఉండాలి అన్నారు.


చైనా తరఫున కమ్యూనిస్టుపార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డింగ్‌ గ్జూఎక్సియాంగ్‌, ఉప ప్రధాని లి హె, విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా వైపు నుంచి ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌, ఇతరులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు ఫిబ్రవరి, సెప్టెంబరు నెలల్లో ఫోన్‌ ద్వారా అధినేతలు మాట్లాడుకున్నారు. వాటిలో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ భేటీ కావాలని నిర్ణయించారు. ముఖాముఖీ సమావేశం కావాలని బైడెన్‌ కోరినప్పటికీ కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా గ్జీ జింపింగ్‌ విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నందున వీడియో సమావేశం జరిగింది.


ఈ సమావేశానికి ముందు జరిగిన పరిణామాలను బట్టి అమెరికా జో బైడెన్‌ ఒక మెట్టు దిగినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ ఏలుబడిలో విధించిన కొన్ని సుంకాలను ఎత్తివేసేందుకు సముఖంగా ఉన్నట్లు అమెరికా నేతలు సూచన ప్రాయంగా వెల్లడించారు. వాణిజ్య యుద్దాన్ని 2018లో ట్రంప్‌ ప్రారంభించిన తరువాత చైనా కూడా అదే మాదిరి స్పందించింది. అందువలన ముందుగా అమెరికన్లే స్పందించాలనే వైఖరిని చైనా ప్రదర్శిస్తోంది. అహం అడ్డువచ్చిన అమెరికా ఇతర విధాలుగా దక్షిణ చైనా సముద్రం, తైవాన్‌, హాంకాంగ్‌, జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ముస్లింలను అణచివేస్తున్నారని, భారీ సంఖ్యలో చైనా అణ్వాయుధాలు సమకూర్చుకుంటున్నదంటూ చేస్తున్న ప్రచారం, చైనాకు వ్యతిరేకంగా చతుష్టయం(క్వాడ్‌), అకుస్‌ పేరుతో చేస్తున్న సమీకరణల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.


అమెరికా ఒక మెట్టుదిగటానికి అక్కడి పరిస్ధితులు, జోబైడెన్‌పై సాధారణ జనం, వాణిజ్యవేత్తల నుంచి వస్తున్న వత్తిడి, జోబైడెన్‌ పలుకుబడి దిగజారుతున్నట్లు వెలువడుతున్న సర్వేలు, వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు మధ్యంతర ఎన్నికలు బైడెన్‌ యంత్రాంగం మీద వత్తిడిని పెంచుతున్నాయి.ఇరునేతల భేటీకి ఒక రోజు ముందు ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ అమెరికాలోని సిబిఎస్‌ టీవీతో మాట్లాడుతూ చైనా సరకుల మీద విధించిన దిగుమతి పన్నులు స్దానికంగా ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు. పన్నులను రద్దు చేస్తారా అన్న ప్రశ్నకు వాటిని తొలగిస్తే కొంత తేడా ఉంటుందని ఆమె అంగీకరించారు. రెండు దేశాల మధó పన్నులు తగ్గించాలని ఒక ఒప్పందం కుదిరినప్పటికీ అదింకా అమల్లోకి రాలేదు, పన్నుల తగ్గింపు కోరికలను తాము గుర్తించామని అమెరికా వాణిజ్యప్రతినిధి కాథరీన్‌ తాయి చెప్పారు.


ప్రస్తుతం అమెరికాలో 31 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టి ద్రవ్యోల్బణం 6.2శాతంగా నమోదైంది.సరఫరా వ్యవస్ధలు చిన్నాభిన్నమై అనేక దుకాణాలు సరకులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మొత్తం ఆర్ధిక రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతోంది. ఆర్ధిక వ్యవస్ధ ఎప్పుడు కోలుకుంటుందో తెలియటం లేదు. ఈ నేపధ్యంలో సామాన్యులతో పాటు తామూ ప్రభావితులం అవుతున్నామని 24వాణిజ్య సంఘాల ప్రతినిధులు పన్నులను రద్దు చేయాలని కోరారు. అమెరికా-చైనా వాణిజ్య మండలి కూడా అదే కోరింది. సెక్షన్‌ 301పేరుతో విధించిన పన్నుల కారణంగా వందల బిలియన్‌ డాలర్ల మేరకు దిగుమతిదారులు చెల్లించారు, ఆమేరకు వినియోగదారుల మీద భారం పడింది. పన్నులను రద్దు చేస్తే చైనా కంటే అమెరికాకే ఎక్కువ ఉపయోగం కనుకనే బైడెన్‌ మెట్టుదిగుతున్నట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా చైనా కూడా కొన్ని ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ వెంటనే కోలుకొని వృద్ధి రేటుతో ముందుకు పోతున్నది.చైనాలో ధరలు స్ధిరంగా ఉంటేనే అమెరికాలో కొంత మేరకు ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచగలుగుతారని భావిస్తున్నారు. జో బైడెన్‌ విధానాలను సమర్ధిస్తున్నవారు 41శాతం మందే అని ఆదివారం నాడు ఎబిసి సర్వే ప్రకటించింది. ఈగ్రాఫ్‌ క్రమంగా తగ్గుతున్నది. ట్రంప్‌తో పోలిస్తే కాస్తమెరుగ్గా ఉన్నప్పటికీ ఏడాది కూడా గడవక ముందే ఇలా పడిపోవటం అధికార డెమోక్రటిక్‌ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నది. ఆర్ధిక వ్యవస్ధను నిర్వహిస్తున్నతీరును 39శాతం మంది మాత్రమే సమర్ధించారు.క్రిస్మస్‌, ఇతర పండుగల సీజన్‌లో ఆహారపదార్ధాలు, ఇతర వస్తువులకు కొరత ఏర్పడవచ్చని జనం భావిస్తున్నారు.


అమెరికన్లు ఒక్క చైనా మీదనే కాదు చివరికి మిత్రదేశాలుగా ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల మీద కూడా పన్నుల దాడి చేస్తున్నారు. ఒకవైపున బైడెన్‌-జింపింగ్‌ భేటీ జరుగుతుండగా అమెరికా వాణిజ్యమంత్రి గినా రైమోండో, వాణిజ్య ప్రతినిధి కాథరీన్‌ తాయి జపాన్‌, ఇతర ఆసియాల పర్యటనకు వచ్చారు.ఉక్కు, అల్యూమినియంలపై పన్ను తగ్గించాలని కోరుతున్నారు.తనకు దక్కనిది ఇతరులకూ దక్కకూడదన్నట్లుగా అమెరికా తీరు ఉంది. చైనాలో చిప్‌ల తయారీ పరిశ్రమను పెట్టవద్దని ఇంటెల్‌ కంపెనీని బైడెన్‌ అడ్డుకున్నాడు. చైనాకు వాటి సరఫరా నిలిపివేయాలని తైవాన్‌, జపాన్‌, దక్షిణ కొరియా కంపెనీల మీద వత్తిడి తెస్తున్నాడు. ఇది చైనాతో ఆ దేశాల సంబంధాల మీద కూడా ప్రభావం చూపనుంది.చైనా వస్తువులపై పన్నులను ఎత్తివేయటం చైనాకు ఎంత లాభమో అమెరికాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది.చైనాలో ఆర్ధిక రంగం వేగం తగ్గితే పర్యవసానాలు ప్రపంచం మొత్తం మీద పడతాయని అమెరికా ఆర్ధిక మంత్రి జానెట్‌ ఎలెన్‌ చెప్పారు.


అక్టోబరు నెలలో అనేక చైనా విమానాలు తమ తిరుగుబాటు రాష్ట్రమైన తైవాన్‌ వైపు పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. ఒక వైపు తైవాన్‌ ప్రాంతం చైనాలో అంతర్భాగమే అని గుర్తించిన అమెరికా ఇటీవలి కాలంలో దాని స్వాతంత్య్రం గురించి మాట్లాడటమే గాక ఒక వేళ విలీనానికి చైనా బల ప్రయోగం చేస్తే తాము జోక్యం చేసుకుంటామని ప్రకటించి రెచ్చగొట్టింది.తన నౌకలను ఆ ప్రాంతానికి పంపింది. చైనా హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం జరిపిందని ప్రచారం చేయటమే గాక 2030 నాటికి 1000కి పైగా అణ్వాయుధాలు సమకూర్చుకోనుందని తప్పుడు ప్రచారం మొదలెట్టింది. ఇప్పటికిప్పుడు అమెరికాలో ఎన్నికలు జరిగితే మెజారిటీ ఓటర్లు ప్రతిపక్ష రిపబ్లికన్లకు ఓటు వేస్తారంటూ సర్వేలు చెబుతున్నాయి. ఉభయ సభల్లో మెజారిటీని కోల్పోతే రానున్ను మూడు సంవత్సరాల్లో బైడెన్‌ సర్కార్‌ను రిపబ్లికన్లు అటాడుకుంటారు. అదిరింపులు, బెదరింపులు పని చేయకపోతే తమ అవసరాల కోసం అమెరికన్లు దిగి వస్తారని గతంలో అనే సార్లు రుజువైంది. ఇప్పుడు చైనా విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.ముఖ్యంగా స్ధానిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని బైడెన్‌ పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.


ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అమెరికా కాస్త వెనక్కు తగ్గుతోందనేందుకు సూచికగా చెప్పవచ్చు. తైవాన్‌ విలీనానికి బలవంతంగా పూనుకుంటే జోక్యం చేసుకుంటామని ప్రకటించి బైడెన్‌ నోరు జారాడు. అది దశాబ్దాల కాలంగా అమెరికా అనుసరిస్తున్న ఒక చైనా వైఖరికి విరుద్దం. వెంటనే అధ్యక్ష భవనం ఒక ప్రకటన విడుదల చేసి తమ ఒక చైనా విధానంలో ఎలాంటి మార్పు లేదని వివరణ ఇచ్చింది. తైవాన్‌ తనను తాను రక్షించుకొనేందుకు సాయం పేరుతో ఆయుధాలు విక్రయిస్తూ సాయుధం గావిస్తోంది. చైనా టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ హువెయి ఉన్నత అధికారిణి మెంగ్‌ వాన్‌ ఝౌ మీద ఆంక్షలు విధించిన అమెరికా ఆమె మెక్సికో వెళుతుండగా కెనడా విమానాశ్రయంలో అరెస్టు చేయించిన అంశం తెలిసిందే. ఇరాన్‌ మీద తాము విధించిన ఆంక్షలను సదరు కంపెనీ ఉల్లంఘించిందంటూ కేసు పెట్టింది. దానికి ప్రతిగా ఇద్దరు కెనడియన్లను చైనా అదుపులోకి తీసుకుంది. ఈ ఉదంతంలో అమెరికా దిగివచ్చి కేసు ఎత్తివేసేందుకు అంగీకరించి వాంగ్‌ విడుదలకు చొరవ చూపింది.తైవాన్‌ సమస్యలో అమెరికా నిప్పుతో చెలగాటమాడుతోందని, దానితో ఆడుకుంటే ఆ నిప్పుతోనే కాలిపోతుందని గ్జీ జింపింగ్‌ మంగళవారం నాడు మరోసారి హెచ్చరించాడు. కీలక అంశాల మీద ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేయటమే ఇది.