Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


తారీఖులు, దస్తావేదులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. వడ్ల కొనుగోలు గురించి ఇప్పటి వరకు ఏ రోజున కేంద్రంతో కెసిఆర్‌ ఏం మాట్లాడారు, ఏ ఒప్పందం చేసుకున్నారు, ఏది ముందు ఏది వెనుక అన్నది గతం. ఇప్పుడు రైతులకు తక్షణం కావాల్సింది వారి పంట కొనుగోలు, వేసవిలో వరి వేసుకోవాలా లేదా అన్నది వారికి చెప్పాలి. కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ గురువారం నాడు ధర్నాకు దిగారు. రెండు రోజుల్లోపల కేంద్రం తేల్చని పక్షంలో ఆందోళనను ఢిల్లీకి తీసుకుపోతానని ప్రకటించారు. ఇలాంటి ఉదంతం ఇటీవలి కాలంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం హడావుడేనా లేక పరిస్ధితి తీవ్రతకు ప్రతిబింబమా ? కేంద్ర ప్రభుత్వం-తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణా రాష్ట్ర సమితి – బిజెపి కేంద్ర నాయకత్వం మధ్య జనం అనుకుంటున్నట్లుగా ఇంతకాలం తెరవెనుక జరిగిన మంతనాలేమిటన్నది ఇప్పుడు ముఖ్యం కాదు, ఆరుబయట వానకు తడిచి ఎండకు ఎండుతున్న వడ్లను కొంటారా లేదా అన్నదే రైతులకు కావాల్సింది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మూడు వివాదాలు ఆరు రేటింగులు అన్నట్లుగా మీడియాకు రంజుగా ఉండవచ్చు. రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. చేతికొచ్చిన పంటను కొంటారా లేదా రబీ(వేసవి లేదా యాసంగి)లో వరి వేయాలా వద్దా ? అదిగాకపోతే ఏ పంటను సాగు చేయాలి అన్నది వారికి అంతుబట్టటం లేదు. వెంటనే తేల్చాల్సిన తరుణం వచ్చింది.


ప్రభుత్వం, అధికారపార్టీ వరి వేయవద్దని చెబుతోంది, ప్రతిపక్షం, కేంద్రంలో అధికారపార్టీ వరి సాగు చేయండి ఎలా కొనుగోలు చేయరో చూస్తాం అంటూ సవాలు విసిరింది. మాటలకే పరిమితం కాకుండా బిజెపి కొనుగోలు కేంద్రాల పరిశీలన పేరుతో రాజకీయ యాత్రలకు పూనుకుంది. పరిశీలించవచ్చు, తప్పుపట్టనవసరం లేదు, వందల కార్లు,జనంతో అట్టహాసం ఏమిటి ? బిజెపి నేతలు పరిశీలిస్తే టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటి ? అది కూడా పోటాపోటీగా కొనుగోలు కేంద్రాల వద్దకు తన మద్దతుదార్లను దింపింది. బిజెపి నేత మీద రాళ్ల దాడి జరిగింది.ఆగ్రహించిన రైతులే ఆ దాడి చేసినట్లు టిఆర్‌ఎస్‌ చెబుతోంది. సరే రాళ్లంటే పొలాల్లో, రోడ్ల మీద దొరుకుతాయి గనుక ఆగ్రహించి రైతులే విసిరారు అనుకుందాం. మరి కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బిజెపి వారి వెంట రౌడీషీటర్లు ఉన్నారంటూ అధికారపక్షం ఫొటోలు కూడా చూపుతోంది. అధికారం కోసం పాకులాడే రాజకీయం పార్టీల వెంట అందునా బిజెపితో రౌడీలు, గూండాలు ఉండటం ఆశ్చర్యం లేదు. ఎవరినైనా చంపినపుడు నక్సల్స్‌ ఎవరు చంపారంటే జనమే ఖతం చేశారు అని చెప్పినట్లుగా బిజెపి మీద ఆగ్రహిస్తున్న రైతులే ఆ పార్టీ నేతల మీద దాడి చేసినట్లు అధికారపార్టీ చెబుతోంది. ఎవరైనా ముందుగా పధకాన్ని రూపొందించుకోకపోతే కోడి గుడ్లను వెంట తీసుకుపోరు అన్న సామాన్యుల సందేహానికి సమాధానం ఏమిని చెబుతారు. అలాగే బిజెపి నేతల వెంట రౌడీలు, గూండాలు అనుసరించాల్సిన అవసరం ఏమిటి అన్నదానికి కూడా వారు చెప్పాలి.


ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు, పార్టీల నేతలు ముందుకు తెచ్చిన కొన్ని అంశాలను చూద్దాం. పంజాబ్‌ తరహాలోనే మొత్తం వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి. ఈ డిమాండ్‌లో తప్పులేదు. ఏడున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వారు ఇంతకాలం దాని గురించి ఎందుకు చెప్పలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అన్నది రైతులకు, ఇతర జనాలకు తెలియాలి కదా. పంజాబ్‌లో రైతులు పండించిన వడ్లలో ఒక్క గింజను కూడా అక్కడి జనం తినరు, వాటిని విక్రయించటానికే వేస్తారు. తెలంగాణా, మరికొన్ని రాష్ట్రాలు అలా కాదే, వినియోగమూ, అమ్మకమూ రెండు కలిసి ఉంటాయి.అందువలన అన్ని చోట్లా ఒకే పరిస్ధితి లేదు. కేంద్రం తన బాధ్యతను తప్పించుకోజాలదు.


ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయాలని మరోసారి అడగను అని కెసిఆర్‌ రాతపూర్వకంగా కేంద్రానికి రాసి ఇచ్చిన సంగతి రైతులకు చెప్పలేదు. అదనపు కొనుగోలుకు కేంద్రాన్ని ఒప్పించినట్లు ప్రచారం చేసుకున్నారు.ప్రసాదాన్ని దేవుడు తినడు అనే అంశం పూజారికి మాత్రమే తెలుసు. అలాగే రాతపూర్వకంగా కూడా రాసి ఇచ్చినందున ఉప్పుడు బియ్యం కొనరనే అంశం కెసిఆర్‌కు మాత్రమే తెలుసు. అందుకనే కొద్ది నెలల క్రితం సన్నవరి రకాలు వేసుకోవాలని, ఆ రైతులకు అదనంగా ప్రోత్సాహక మొత్తాలను ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం బదులు అంత మేరకు గతం కంటే అదనంగా పచ్చి బియ్యం కొంటుందనే హామీ లేకపోవటంతో కెసిఆర్‌కు తత్వం తలకెక్కి రోడ్డెక్కారు. రైతుల కోసమే గనుక ఆందోళనకు దిగటాన్ని తప్పుపట్టనవసరం లేదు. ఈ సంగతులన్నీ రైతులకు, ఇతర జనాలకు చెప్పకుండా దాచటంలో ఆంతర్యం ఏమిటన్నదే ప్రశ్న.


రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేని బిజెపి కేంద్ర అధికారాన్ని ఉపయోగించుకొని వడ్ల సంగతి తేల్చకుండా రైతుల్లో కెసిఆర్‌ను గబ్బు పట్టించాలన్న దురా,దూరాలోచన ఉంది కనుకనే కొనుగోలు గురించి కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయటం లేదన్నది తేలిపోయింది. రెండు అవకాశాలున్నాయి. ఒకటి మరికొద్ది రోజులు సమస్యను ఇలాగే నానబెట్టి రైతాంగాన్ని కెసిఆర్‌, అధికారపార్టీ మీదకు రెచ్చగొట్టటం, కెసిఆర్‌ విఫలమైనట్లు చెప్పటం, తరువాత రాష్ట్ర బిజెపి పెద్దలు ఢిల్లీ పర్యటనలు జరిపి కేంద్రాన్ని ఒప్పించినట్లు తతంగం జరిపి మావల్లనే వడ్లు కొనుగోలు చేస్తున్నారని చెప్పుకొనేందుకూ అవకాశం ఉంది. కేంద్రం, ఎఫ్‌సిఐ నిమ్మకునీరెత్తినట్లుగా రైతుల ఆందోళనను పట్టించుకోకుండా స్పందించకుండా ఉందంటే ఏమనుకోవాలి ?
కెసిఆర్‌ రోడ్డుమీదకు రావటం వెనుక బహుశా ఇతర కారణాలు కూడా ఉండి ఉండాలి. విద్యుత్‌ సంస్కరణలను అమలు జరపాలని కేంద్రం వత్తిడి తెస్తోంది. దానికి లొంగిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అంగీకరించి ప్రకటన చేసింది. తదుపరి తెలంగాణా వంతు రానుంది. పంపుసెట్లకు మీటర్లు అంటే తక్కువ సంఖ్య ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లోనే రైతులు గుర్రు మంటున్నారు. తెలంగాణాలో అది పెద్ద ఆందోళనకు దారితీస్తుంది. అందుకే ఇప్పుడు కెసిఆర్‌ విద్యుత్‌ సంస్కరణల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దళిత బంధు పేరుతో నిండా మునిగి ఏమి చేయాలో దిక్కుతోచని కెసిఆర్‌ కొంత కాలమైనా దాని గురించి చర్చ జరగకుండా వడ్ల సమస్యను తెచ్చారా ? కేంద్రం కూడా వెంటనే వత్తిడి తేలేదు, ఏం జరుగుతుందో చెప్పలేము.


కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే ఇప్పటికే ఆహార ధాన్యాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేస్తోంది. ఇది సేకరణ బాధ్యతనుంచి తప్పుకొనే ఎత్తుగడలో ఒక ప్రచారం. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత వివిధ సూచికల్లో మన దేశం మెరుగుపడకపోగా దిగజారుతోంది. సులభతర వాణిజ్య సూచికలో మెరుగుదలను ప్రకటించినపుడేమో దాన్లో ఎలాంటి లోపాలు కనిపించవు, కానీ దిగజారిన మిగతావాటి గురించి లెక్కించిన పద్దతి తప్పు, మన స్ధానం మరింత మెరుగుపడిందనే వితండవాదానికి దిగుతోంది. ఇదే బిజెపి ప్రతిపక్షంలో ఉండగా ఆ సూచికలను చూపే గత ప్రభుత్వాలను తూర్పారపట్టిందని మరచిపోరాదు. అప్పుడు లెక్కింపు పద్దతి దానికి గుర్తుకు రాలేదు. ప్రపంచ ఆకలి సూచిక 2021 వివరాలను అక్టోబరులో ప్రకటించారు. చైనాతో సహా పద్దెనిమిది దేశాలు ఒకటో స్దానంలో ఉంటే 116దేశాలకు గాను మనం 101వ స్ధానంలో ఉన్నాం.మోడీ ఏలుబడిలో 2016లో 97గా ఉన్నది ఇప్పుడు 101కి దిగజారింది.మన తరువాత 103వదిగా ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. శ్రీలంక 65, మయన్మార్‌ 71, బంగ్లాదేశ్‌, నేపాల్‌ 76, పాకిస్తాన్‌ 92వ స్ధానాల్లో ఉన్నాయి. మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నప్పటికీ ఇలా జరిగింది. ఈ సూచికకు నాలుగు అంశాలు ప్రాతిపదిక. తగిన్ని కాలరీలు తీసుకోలేని ఆహారలేమి, ఐదేండ్లలోపు పిల్లల పెరుగుదల గిడసబారుతనం, తగినంత ఆహారలేమి, ఐదేండ్లలోపు మరణించేవారి రేటు ప్రాతిపదికగా తీసుకొని లెక్కిస్తారు.


ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే మెజారిటీ జనానికి ఆహారధాన్యాల కొనుగోలు శక్తి పెరగాలి. అది జరగాలంటే అందుకు సరిపడా వేతనాలు లభించే ఉపాధిని వారికి చూపాలి.దేశంలో మొత్తంగా చూసినపుడు ఆ రెండూ లేవు.మరోవైపున జనానికి సబ్సిడీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం కోత పెడుతున్నది. రోజు రోజుకూ ఆహారానికి చేసే ఖర్చును జనం తగ్గించుకొని ఇతర అవసరాలకు వెచ్చిస్తున్నారు. గోదాముల్లో గోధుమ, బియ్యాలను ఎలుకలు, పందికొక్కులకు పెట్టటాలు, ముక్కిపోయిన తరువాత పనికిరాని వాటిని పారపోసేందుకైనా కేంద్రం సిద్దపడుతోంది, లేదా సబ్సిడీలిచ్చి విదేశాలకు ఎగుమతులు చేస్తోంది గానీ మన జనానికి అందించేందుకు ముందుకు రావటం లేదు. కరోనా కారణంగా ఇరవైలక్షల కోట్లతో ఆత్మనిర్భర పాకేజ్‌లంటూ ఆర్భాటం చేసిన పాలకులు తెలంగాణాలో ఉప్పుడు బియ్యాన్ని కొనేందుకు ముందుకు రావటం లేదు. గత వేసవిలో అంగీకరించిన మేరకు ఇంకా ఐదు లక్షల టన్నులు తీసుకోవాల్సి ఉండగా దాని గురించి ఎటూతేల్చటం లేదు. ఖరీఫ్‌లో పండిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చేస్తారో అదీ చెప్పదు. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని ముందే చెప్పిన కేంద్రం పచ్చిబియ్యాన్ని ఎంత పరిమాణంలో కొంటారో ఎందుకు చెప్పటం లేదు. ఎఫ్‌సిఐ ముందుగానే ఏ రాష్ట్రం నుంచి ఎంత కొనుగోలు చేయాలో ప్రణాళికలను రూపొందించుకోదా ? సిబిఐ, ఆదాయపన్ను, ఇడి, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్దలను తనకు లొంగని లేదా తనతో చేరని నేతల మీద ప్రయోగిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెరాసను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఎఫ్‌సిఐని ఆయుధంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ప్రమాదకర పోకడ.

ప్రతిపక్ష పార్టీల పట్ల కెసిఆర్‌ అనుసరిస్తున్న వైఖరి, తూలనాడుతున్న తీరు అభ్యంతరకరమే. ఎన్నికలు వచ్చినపుడు ఎవరి వైఖరిని వారు తీసుకోవచ్చు. వడ్ల కొనుగోలు లేదా బలవంతపు విద్యుత్‌ సంస్కరణల వంటి వాటి మీద పోరాడాల్సి వచ్చినపుడు వాటిని వ్యతిరేకించే పార్టీలన్నీ రోజువారీ విబేధాలను పక్కన పెట్టి పెట్టి రైతాంగం, ఇతర పీడిత జనం కోసం కేంద్రం మీద వత్తిడి తేవాల్సిన తరుణం ఆసన్నమైంది. తెరాసతో కలిసేందుకు ఇబ్బందైతే ఎవరి కార్యాచరణతో వారు ముందుకు రావాలి.కెసిఆర్‌ది కేవలం హడావుడే అయితే విశ్వసనీయత మరింత దిగజారుతుంది. రైతాంగ ఆగ్రహం, ఆవేశాలు కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌ నేతల మీదకు మళ్లుతాయి.రాజకీయంగా తగిన ఫలితం అనుభవిస్తారు.