Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒక ధుర్యోధనుడు, ఒక రావణుడు, ఒక ముస్సోలినీ, ఒక హిట్లర్‌, ఒక జారు చక్రవర్తి, ఒక ఇందిరాగాంధీ, ఒక నరేంద్రమోడీ చరిత్రను మలుపుతిప్పే మహానుభావుల పరంపర ఇది. కొంత మంది నమ్ముతున్నట్లు విధి లిఖితం ఎలా రాసి ఉంటే అలాగే జరుగుతుంది. ఇలాంటి ప్రతినాయకుల జన్మ ప్రతి కాలంలోనూ పునరావృతం అవుతున్నందున ఆ క్రమంలోనే ప్రజా నాయకులు కూడా పుట్టుకువస్తారు. ఇప్పుడు రైతుల రూపంలో అదే జరిగింది. కొందరు త్యాగధనులు ఉద్యమాలకు ఊపిరిలూదుతారు. రైతు ఉద్యమం అనేక పోరాటాలకు ఊతమిచ్చింది. యాభై ఆరుగాదు 112 అంగుళాల గుండెలున్నవారిని కూడా పిండిచేయగలమని, దిగివచ్చేట్లు చేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బ్రిటీష్‌ వారిని పారద్రోలాలనే ఏకైక లక్ష్యం భిన్న రాజకీయ ధోరణులు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఆ తరువాత అత్యవర పరిస్ధితి విధింపు కొంత మేరకు అందుకు దోహదం చేసింది. ఇప్పుడు అంతకంటే మరింత ప్రాముఖ్యత కలిగినదిగా దేశంలో రైతుల ఆందోళన ఒక మహత్తర దృశ్యానికి తెరతీసింది. అందుకు పురికొల్పిన ” మహానుభావుడు” ప్రధాని నరేంద్రమోడీకి యావత్‌ జాతి కృతజ్ఞతలు చెప్పాలి కదా !


చరిత్రలోని ప్రతినాయకులందరికీ వారి తీరుతెన్నులను చూసి ఇది తగదు, అది తగని పని అంటూ వారి మంచి కోరుకొనే వారు చెప్పినా వినిపించుకోలేదన్నది చరిత్ర, సాహిత్యం చెప్పిన సత్యం. విధి లేదా తలరాత అలా రాసి ఉంటుంది మరి. ముస్లింలపై గుజరాత్‌లో జరిగిన మారణకాండ సమయంలో రాజధర్మాన్ని అనుసరించాలని నాటి ప్రధాని అతల్‌బిహారీ వాజ్‌పాయి హితవు చెప్పారు. వాజ్‌పాయిగారు ఏదైతే చెప్పారో సరిగ్గాదాన్నే పాటిస్తున్నా అని అదే వేదిక మీద ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చెప్పారు. పూర్వకాలపు మనిషి గనుక వాజ్‌పాయి మరోదారి లేక అవును ఆయన అదే చేస్తున్నారు అని చెప్పకతప్పలేదు.సీత గీత దాటకపోతే రామాయణమే లేదు. పాండవులకు ఐదూళ్లు ఇచ్చి ఉంటే మహాభారతమే ఉండేది కాదు. సాగు రాష్ట్రాల అంశమైనా వాటితో సంప్రదించకుండా కరోనా తాండవిస్తుంటే ఆర్డినెన్సుల రూపంలో రుద్దటం, తరువాత వాటి మీద పార్లమెంటులో చర్చ లేకుండా ఆమోదం, రాష్ట్రపతి ముద్ర వెనుక ఏదో ఒక మహత్తరశక్తి లేకపోతే మానవమాత్రులను అలా చేయిస్తుందా ? అందుకుగాను ” నిమిత్తమాత్రుడైన ” నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం తప్పుకదా !


కరోనా నివారణకు చప్పట్లు, కంచాలు, గిన్నెలు మోగించాలంటే ఆ పని చేశారు. దివ్వెలు వెలిగించమంటే గౌరవభావంతో వెలిగించారు. ఏ కతలు చెబితే వాటిని నమ్మారు కదా అని బతుకు దీపాలనే ఆర్పుతాం అంటే రైతులు సహిస్తారా ? సాగు చట్టాల గురించి కూడా నరేంద్రమోడీకి హితవు చెప్పిన వారు లేకపోలేదు. జనంతో సంబంధం లేని, కార్పొరేట్లకు సేవలు చేసే జయప్రకాష్‌లు, జనాల మీదకు ఎక్కే ఆర్నాబ్‌లు, గుడ్డిగా సమర్ధించే ప్రాంతీయ పార్టీల నేతలమద్దతు, కార్పొరేట్‌లు కళ్ల ముందు కనిపిస్తుంటే రైతుగోడు వినిపించుకొనే తీరిక ఎక్కడుంటుంది పాపం ! విదురనీతి, హితవచనాలు విని ఉంటే రైతు భారతం ఎలా జరుగుతుంది? మోడీ క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం గురించి పట్టని ఇతర రైతులు, తలకు ఎక్కించుకోని ఇతర జనాలకు కిక్కు దిగేది కాదు, యావత్‌ ప్రపంచానికి తెలిసేది కాదు కదా ! అంతటి కనువిప్పు కలిగించి మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పకపోవటం ” క్షంతవ్యం ” కాదేమో !


సంచలనాలు సృష్టించటం బలవంతులకే కాదు బలహీనులకూ, పిరికిబారిన వారికీ సాధ్యమే. తిరుగులేని రామబాణం కలిగినట్లు చెప్పే రాముడూ పరువు కోసం సీతను కష్టాల పాలు చేసిన బలహీనతకు గురైన సంగతి తెలిసిందే. రామాయణంలో రాముడు, రావణ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో రాముడిని తప్పుపట్టిన రజకుడికీ అంతే ఉంది ! నరేంద్రమోడీలో చాలా మందికి వారు రాజకీయంగా వ్యతిరేకించే లేదా అనుకూలించే వారికి ఇప్పటి వరకు ఒక రూపమే కనిపించింది. ఎన్ని విమర్శలు ఎదురైనా తాను చేయదలచుకున్నదానిని చేస్తారని గుజరాత్‌ మారణకాండ సమయంలో అభిమానుల్లో పేరు తెచ్చుకున్నారు. ఇతరుల్లో భయం పుట్టించారు. తాము కోరుకున్న సంస్కరణలను అమలు జరిపేందుకు జనాన్ని అవసరమైతే అణచివేసే బాహుబలుడిని కార్పొరేట్లకు నరేంద్రమోడీలో చూపింది కూడా అదే. కట్టుకున్న ఇల్లాలిని కూడా విస్మరించి దేశం కోసం సంఘపరివార్‌ పెంచిన బిడ్డగా నరేంద్రమోడీకి రెండు బాధ్యతలున్నాయి. ఒకటి సమాజాన్ని వెనక్కు నడపాలనే తిరోగామి హిందూత్వ కాగా, రెండవది దానికి అధికారం, అందుకోసం అవసరమైన కార్పొరేట్ల ఆసరా. రెండూ సాధించారు గానీ రెండు కత్తులు ఒక ఒరలో ఇమడవు.

హిందూత్వను అమలు జరిపేందుకు స్వమతమౌఢ్యం-పరమత ద్వేషం నింపాలి. మన దేశంలో అది చాలా ప్రమాదకరం. కార్పొరేట్లకు అంగీకారం కాదు, కొంత మేరకు వారు రాజీపడతారు తప్ప వాటిది పైచేయి కానివ్వరు. ఐరోపాలో ఫ్యూడల్‌ ప్రభువులను, ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తున్న చర్చిని వదిలించుకున్న చరిత్ర తెలిసిందే. మన దేశంలో ఉన్న పరిస్ధితులను బట్టి కార్పొరేట్లు గుళ్లూ గోపురాలను కట్టించారు, మత, ఉదారశక్తులకూ మద్దతు ఇచ్చారు, భూస్వాములు, ధనిక రైతులతో రాజీపడ్డారు. భూమి కేంద్రీకరణ వారి లాభాలను అడ్డుకుంటుంది కనుక భూ సంస్కరణలను ముందుకు తెచ్చారు. గ్రామాల్లో ఉన్న భూస్వాములను, వారి కండబలాన్ని వదులుకొనేందుకు కాంగ్రెస్‌ సిద్దంగా లేనందున వాటిని నీరుగార్చింది. ధనిక రైతులను సంతుష్టీకరించే చర్యలను తీసుకుంది.

ఇప్పుడు గ్రామాల్లో కూడా పరిస్ధితులు మారాయి. ఓట్లకొనుగోలులో అక్రమాలను సహించేది లేదని హూజారాబాద్‌లో మహిళలు రోడ్డెక్కే విధంగా పరిణామాలు పురోగమించటాన్ని చూశాము.దళారీలు లేకుండా నేరుగా ఓట్లు కొనుగోలు, అందరికీ ఒకే రేటు ఇవ్వాలని కోరారు. భూస్వాముల పెత్తనం సాగదింక, అంటే కార్పొరేట్ల డబ్బుతోనే ఇక ముందు పార్టీలకు పని. కనుకనే కార్పొరేట్ల కన్ను వ్యవసాయ రంగం మీద పడింది. దీనికి తోడు బహుళజాతి గుత్త సంస్దల వత్తిడి కూడా తోడైంది. అవసరమైతే ధనిక రైతులను వదులు కొనేందుకు మోడీ సర్కార్‌ సిద్దమైంది కనుకనే ఆదరాబాదరా మూడు సాగు చట్టాలు. ఇప్పుడు వాటికి మంగళం పాడుతూ అధికారానికి ఎసరు రాకుండా చూసుకొనేందుకు కొత్త నాటకానికి తెరతీశారు. దీనివలన కార్పొరేట్లలో మోడీ మీద ఉన్న భ్రమలు తొలుగుతాయి. కొత్త బొమ్మను వెతుకుతారు. ఏడాది కాలంగా మోడీ తీరుతెన్నులను చూసిన ఏ రైతూ అంత తేలికగా బిజెపిని బలపరచడు. ఏమైనా సరే దేశాన్ని వెనక్కు నడుపుతారు, హిందూత్వను ఏర్పాటు చేస్తారని హిందూ హృదయ సామ్రాట్‌గా భావిస్తున్న శక్తులలోనూ మోడీ అనుమానాలు రేకెత్తించారు. లేదూ అలాంటిదేమీ లేదు, వ్యూహాత్మకంగానే తమ నేత వెనక్కు తగ్గినట్లు, మరింత గట్టిగా తాను చేయదలచుకున్నది చేస్తారని భక్తులు చెబుతున్నారు. కనుక ఏది జరిగినా తలెత్తే అనూహ్యపరిణామాలకు కచ్చితంగా మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.


తమ నేత ఓట్ల కోసం జనాన్ని సంతుష్టీకరించరు, దేశం కోసం అవసరమైతే కఠిన చర్యలను తీసుకొనేందుకూ వెనుకాడరంటూ ప్రజావ్యతిరేక చర్యలను సమర్ధించేందుకు పూనుకున్న వారున్నారు. మోడీ వెనక్కు తగ్గినా వారు తగ్గేట్లు లేరని సాగు చట్టాల రద్దు ప్రకటన తరువాత సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్న తీరు వెల్లడిస్తున్నది. ఒకసారి పులిని ఎక్కిన తరువాత అంత తేలికగా దిగుతారా ! మోడీ నిర్ణయంతో తమకు నిమిత్తం లేదు, ఆ చట్టాలు సరైనవే అని కొందరు ప్రబుద్దులు కొత్త వాదన మొదలు పెట్టారు. నరంలేని నాలికలు, అద్దె నోళ్లు ఏమైనా మాట్లాడగలవు. ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. రైతులు తమకు వ్యతిరేకమైన మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు తప్ప ఎవరూ క్షమాపణ కోరలేదే ! ఎవరైనా ఎప్పుడు అలాంటి పని చేస్తారు. తప్పుచేసి తప్పించుకొనే దారిలేక అడ్డంగా దొరికినపుడు, లేదా తీవ్రమైన తప్పిదానికి పాల్పడినపుడు చెబుతారు.

” నేను దేశ ప్రజలకు క్షమాపణ చెబుతున్నాను..సాగు చట్టాల గురించి రైతులను ఒప్పించలేకపోయాము. మూడు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. దేశ అవసరాలకు అనుగుణంగా పంటల మార్పిడి, కనీస మద్దతు ధరలను మరింత సమర్దవంతంగా, పారదర్శకంగా చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం” అని మోడీ చెప్పారు. నరేంద్రమోడీ తరువాత ప్రధాని పదవికి సిద్దంగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌ సిఎం యోగి అదిత్య నాధ్‌ స్పందిస్తూ ” బహుశా మావైపు నుంచి లోపం ఉన్న కారణంగా మేము చెప్పదలచుకున్నదాన్ని జనాలకు చెప్పటంలో మేము విఫలమయ్యాము ” అన్నారు.సాగు చట్టాలకు రైతాంగంలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారని కూడా సెలవిచ్చారు. గతంలో చట్టాలు చేసినపుడు వాటిని చారిత్రాత్మకమైనవని వర్ణించిన ఈ పెద్దమనిషి ఇప్పుడు రద్దును కూడా చారిత్రాత్మకంగానే వర్ణించారు. జనానికి మతిమరపు ఎక్కువని భావించేవారే ఇలా సమర్ధించుకోగలరు. మొత్తం మీద సాగు చట్టాలు తేవటం తప్పన్న మాట పెద్దల నోట రాలేదు. అందుకే జనంలో మోడీకి పెద్దగా సానుకూలత రాలేదు. కొంత మందిని కొంతకాలం మోసం చేయ గలరు తప్ప అందరినీ ఎల్లకాలం చేయలేరు. తన పదజాలం వెనుక ఉన్న మర్మాన్ని జనం గ్రహించేట్లు చేసినందుకు నరేంద్రమోడీకి కృతజ్ఞత చెప్పాలి మరి !


సాగు చట్టాలు దేశానికి వెన్నెముకగా ఉన్న రైతాంగాన్ని ప్రభావితం చేసేవి. వాటి దుష్ఫరిణామాలు తక్కువ కాదు. ముందుగా ఉప్పందుకున్న వేళ్లమీద లెక్కించదగిన అధికారపార్టీ పెద్దలు, ఆశ్రితులైన వారు తప్ప మోడీగారి పెద్ద నోట్ల రద్దు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, జనాన్ని నానా యాతనల పాలు చేసింది-ఘోరంగా విఫలమైంది. అలాంటి పిచ్చిపని ప్రకటించిన లక్ష్యం నెరవేరలేదు, దానికి గాను జనాన్ని ఇబ్బంది పెట్టాను, ఆర్ధిక రంగాన్ని చెప్పరాని ఇబ్బందులపాలు చేశాను అని ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి ఉంటే ఇప్పుడు చేసిన ప్రకటనను జనం నమ్మి ఉండేవారు.తమకళ్ల ముందే జరిగిన పెద్ద నోట్ల రద్దు వైఫల్యాన్ని అంగీకరించకపోగా డిజిటల్‌ లావాదేవీలు పెరిగాయి, పన్ను చెల్లింపుదార్లు పెరిగారంటూ కొత్త కతలు చెప్పారు. పొద్దున్నే రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని తరువాత ఉత్తర ప్రదేశ్‌లో ప్రవేశించగానే వేరే శక్తి అవాహనలోకి వెళ్లారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని మహూబా జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ కొంత మంది రైతులను పావులుగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఇది ప్రతిపక్షాన్ని విమర్శించటం కంటే రైతులను తెలివితక్కువ దద్దమ్మలుగా నిందించటం తప్ప వేరు కాదు. ఇది కూడా రైతాంగాన్ని చైతన్యపరిచేదే, మరింత కసి పెంచేదే కనుక అందుకూ మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిందే ?


వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో చట్టాల రద్దుకు అవసరమైన తతంగం పూర్తి చేస్తామని చెప్పారు. ఐనా సంయుక్త కిసాన్‌ మోర్చా నమ్మలేదు. ముందుగా ప్రకటించిన ఆందోళనా కార్యక్రమంతో ముందుకు పోవాలని ప్రకటించింది. నెలాఖరులో మరోసారి సమావేశమై మిగతా అంశాల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విదేశీ-స్వదేశీ కార్పొరేట్ల వత్తిడికి లొంగి ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ ఆదేశాల మేరకు చేసిన చట్టాలను పార్లమెంటు ఎంత ప్రహసన ప్రాయంగా ఆమోదించిందీ ప్రపంచం చూసింది. 2020జూన్‌లో ఆర్డినెన్స్‌ల ద్వారా వాటిని తెచ్చారు. ఎలాంటి చర్చ లేకుండా మూజువాణీ ఓటుద్వారా ఆమోదముద్ర వేశారు. తరువాత వాటిని వెనక్కు తీసుకొనేందుకు ససేమిరా అన్న పాలకులు రైతాంగాన్ని అపహాస్యంపాలు చేశారు. వారు అసలు రైతులే కాదన్నారు, దళారీలన్నారు, ఖలిస్తానీలు, ఉగ్రవాదులు అని ముద్రవేశారు. విదేశీ నిధులతో ఆందోళనలు చేశారని నిందించారు. చర్చలను ప్రహసన ప్రాయంగా మార్చారు. రైతుల మీద భౌతికంగా దాడులు చేశారు, రెచ్చగొట్టేందుకు చూశారు. తరువాత సుప్రీం కోర్టు వాటి అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది, నివేదిక ఇమ్మంది. ఇంతవరకు ఆ నివేదిక వెలుగు చూడలేదు. దాన్ని కూడా మూసిపెట్టారు.

సాగు చట్టాల రద్దు రైతుల విజయం అని వేరే చెప్పనవసరం లేదు. దానికెంత ప్రాధాన్యత ఉందో రద్దు, మోడీ క్షమాపణల ప్రకటన ఆ చట్టాలను నిస్సిగ్గుగా సమర్దించటానికి తమ మేధాశక్తి నంతటినీ రంగరించి రైతుల మీద రుద్దటానికి ప్రయత్నించిన ప్రబుద్దులకు చెప్పుకోవటానికి వీల్లేని చోట నరేంద్రమోడీ కొట్టిన తిరుగులేని దెబ్బగా కూడా చెప్పవచ్చు.సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు, అంతకు ముందు చట్టాలను సమర్ధించిన షేత్కారీ సంఘటన నేత అనిల్‌ గన్వట్‌ గోడు మామూలుగా లేదు. వాటిని రద్దు చేసినంత మాత్రాన ఆందోళనకు తెరపడదు, బిజెపి ఆశించినట్లుగా ఆ పార్టీకి రాజకీయంగా ఉపయోగపడదని చెప్పారు. ఆ నివేదికలో ప్రభుత్వ చర్యను గుడ్డిగా సమర్ధించి ఉండకపోవచ్చు, అది ఎప్పటికైనా వెలుగులోకి వస్తే చట్టాలను వెనక్కు తీసుకోవాలని సుప్రీం కోర్టు సలహా ఇస్తే మోడీ సర్కార్‌ పరువు మరింతగా పోతుంది, అందువలన మరింత నష్టం జరగకుండా విధిలేక ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల కోసం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. మోడీ వెనక్కు తగ్గే అవకాశం లేదని గట్టిగా నమ్మి అతని కంటే ఘనులు అన్నట్లు ఎక్కువగా సమర్ధించిన వారు మోడీ తమను వెన్నుపోటు పొడిచినట్లు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.అందువలన ఇక ముందు మోడీ లేదా మరొకరు ఎవరు ప్రకటించిన లేదా అమలు జరిపే విధానాలనైనా గుడ్డిగా సమర్ధించకూడదని ఇప్పటికే అనే మంది మనసులోనే చెంపలు వేసుకుంటున్నారు. వారిలో అలాంటి మారుమనసు తెచ్చినందుకు నరేంద్రమోడీని అభినందించకుండా ఉండగలమా ?


రైతుల ఆందోళనకు ఏడాది పూర్తి కావస్తుండగా నవంబరు 26వ తేదీ తరువాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు, తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్న బిజెపి వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే మరో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పరాభవం ఎదురుకానుందనే వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో నరేంద్రమోడీ సర్కార్‌ వెనక్కు తగ్గింది. తాను నోరు విప్పినా విప్పకపోయినా, పరోక్షంగా రైతులను పరిహసించినా రాజును మించి రాజభక్తిని ప్రదర్శించి సాగు చట్టాలను సమర్ధించిన వారికి వెన్నుపోటు పొడిచి తన లబ్దిని తాను చూసుకున్నారు. మోడీ మొండి వైఖరి కారణంగా కొందరు రైతుల్లో తమ పోరాటం ఫలిస్తుందా అన్న అనుమానాలు తలెత్తటం అసాధారణం కాదు, అలాంటి వారి సంశయం-ఇటు తన మద్దతుదారుల ధృడవిశ్వాసానికి భిన్నంగా రైతు చట్టాల మీద మోడీ తోకముడిచారు. వ్రతం చెడినా ఫలందక్కదు. సాగు చట్టాలకు దారి సుగమం చేసుకొని కార్మిక చట్టాలను దెబ్బతీసేందుకు, ఆర్ధిక రంగంలో పెను మార్పులకు మోడీ సర్కార్‌ అస్త్రాలను ప్రయోగించాలని కాచుకు కూర్చున్నది.వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని చూస్తున్న వారికి సాగు చట్టాల రద్దు ఎంతో ఊపునిస్తుంది.రైతుల ఆందోళన వెలుగులో దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతారు. అందుకు దోహదం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ఞతలు చెప్పకపోవటం అన్యాయం కదా !