Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఉజ్జయని పీఠాధిపతులకు కోపం వచ్చింది. ఢిల్లీలో రామాయణ ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. వెంటనే రైల్వే అధికారులు వారి డిమాండ్‌కు తలొగ్గారు. రైతులు కూడా మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ముందు కేంద్రాన్ని కోరారు. వినలా, తరువాతే ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. బిజెపి పాలకులు ఏడాది పాటు వారిని నానా ఇబ్బందులకు గురిచేశారు. దేశంలో అనేక మంది పీఠాధిపతులు, లక్షలాది మంది సాధువులున్నారు. కానీ ఉజ్జయని వారికే ఆగ్రహం వచ్చింది. కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది.లక్షలాది మంది రైతులకు లేని బలం, పలుకుబడి కొద్ది మంది పీఠాధిపతులకు ఉందంటే దేశాన్ని నడిపిస్తున్నది మతశక్తులే అన్నది మరోసారి రుజువైంది.


ఇంతకీ వారికి కోపం ఎందుకు వచ్చింది ? రామాయణ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రైల్వే ఒక ప్రత్యేపాకేజ్‌తో పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుపుతున్నది. దానిలో ప్రయాణించే వారికి అవసరమైన భోజన సదుపాయాలను సమకూర్చే సిబ్బందికి సాధువుల మాదిరి కాషాయ రంగు బట్టలు,రుద్రాక్షలతో ఏకరూప దుస్తులను ఇచ్చారు. ఇలా దుస్తులు వేసి సేవలందించటం హిందూమతాన్ని అవమానించటమే అని ఉజ్జయని పీఠాధిపతులకు ఆగ్రహం వచ్చింది. వాటిని విప్పించకపోతే డిసెంబరు 12న ఢిల్లీలో రైలును ఆపివేస్తామని చెప్పారు. రెండురోజుల్లో అధికారులు మార్చివేశారు. సాధువుల మాదిరి ఏకరూప దుస్తులు మతాన్ని, పీఠాధిపతులను అవమానించటమే అని ఉజ్జయని అఖారా పరిషత్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అవదేష్‌ పూరీ చెప్పారు.హిందూమతాన్ని రక్షించుకొనేందుకు రైలు మార్గంపై బైఠాయిస్తామన్నారు.


ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ అధికారపెద్దలకు కాషాయ రంగంటే ప్రీతి కనుక వారి మనసెరిగి రైల్వే అధికారులు సాధువుల మాదిరి సిబ్బందికి దుస్తులను నిర్ణయించారు. కొత్తగా రూపొందిచిన వాటిలో నల్లపాంట్లు, తెల్ల షర్టులతో పాటు కాషాయ రంగు మాస్కులు, చేతులకు అదే రంగు తొడుగులను ఏర్పాటు చేసి సగం హిందూత్వను కాపాడామన్నట్లుగా అధికారులు పెద్దలను సంతుష్టీకరించారు. ఒక సారి ఉన్మాదాన్ని ఎక్కించిన తరువాత అది మెజారిటీ – మైనారిటీ, జాతీయవాదం ఏదైనా సరే ఎక్కించిన వారు కూడా దాన్ని అదుపు చేయలేరు. ఒకసారి వెర్రితలలు వేసిన తరువాత వారు చేసేదేమీ లేదు. అదుపు చేసేందుకు పూనుకుంటే వారు కూడా దానికి బలైనా ఆశ్చర్యం లేదు. వారి చేతిలో ఉండదు.


కేరళలో అధికారానికి అవసరమైన సీట్లను తెచ్చుకుంటామని ప్రగల్భాలు పలికి, మెట్రోమాన్‌ శ్రీధరన్‌ తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని కూడా ప్రకటించుకున్న బిజెపి పొందిన పరాభవం తెలిసిందే. అంతకు ముందున్న ఒక్కసీటును, ఓట్లను కూడా గణనీయంగా పోగొట్టుకుంది. గతంలో శబరిమల ఆందోళనపేరుతో శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. ఎన్నికల్లో లబ్దిపొందాలని చూశారు, రెచ్చగొట్టారు, విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు.చివరికి దొంగడబ్బు పంపిణీలో వాటాలు కుదరక దొరికిపోయి కేసులను ఎదుర్కొంటున్నారు. చేసేందుకు పనేమీ లేక ఇప్పుడు కొత్త వివాదంతో జనాల మనోభావాలను రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అదేమంటే శబరిమల ఆలయానికి హలాల్‌ చేసిన బెల్లాన్ని సరఫరా చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మాంసానికి కోసే కోడి,మేక వంటిది కాదు బెల్లం, దానికి హలాల్‌ ఏమిటి ? బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మతోన్మాదాన్ని రెచ్చగొట్టగల సమర్దులు. శబరిమలకు బెల్లం సరఫరా చేసే వ్యాపారికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్నట్లు కనుగొన్నారట. మన దేశం నుంచి గల్ఫ్‌దేశాలకు ఎగుమతి చేసే వాటిలో మాంసంతో సహా అనేక ఉత్పత్తులు ఉంటాయి. వాటిని దిగుమతి చేసుకొనే దేశాల వ్యాపారులు హలాల్‌ ధృవీకరణ పత్రం ఉందా లేదా అని అడుగుతారు. ఉంటేనే కొనుగోలు చేస్తారు.


అందువలన అలాంటి లావాదేవీలు నిర్వహించేవారు ముస్లింలైనా మరొక మతం వారైనా హలాల్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిందే. దాన్ని కూడా రాజకీయం చేసి పోగొట్టుకున్న మద్దతునైనా తిరిగి తెచ్చుకోవాలని బిజెపి పూనుకున్నట్లు కనిపిస్తోంది. హలాల్‌ చేసేందుకు ముస్లిం మతపెద్దలు ఆహారం మీద ఉమ్మివేస్తారంటూ సామాజికమాధ్యమంలో రెచ్చగొడుతున్నారు.శబరిమల ఆలయంలో తయారు చేసే ప్రసాదానికి హలాల్‌ సర్టిఫికెట్‌ ఉన్న బెల్లాన్ని వాడుతున్నారంటూ విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎస్‌జెఆర్‌ కుమార్‌ హైకోర్టులో ఒక పిటీషన్‌ వేశారు.వివరాల్లోకి వెళితే గతేడాది బెల్లం సరఫరా టెండరు పొందిన మహారాష్ట్ర కంపెనీల యజమానులెవరూ అసలు ముస్లింలు కాదు. ప్రస్తుతం ఏప్రిల్‌ నుంచి సరఫరా చేస్తున్న ఎస్‌పి ఆగ్రోప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ డైరెక్టర్లు సమీర్‌ సురేష్‌ పాటిల్‌, సురేష్‌ సాహెబ్‌రావు పాటిల్‌,సరితా సురేష్‌ పాటిల్‌, మతి ఉండి చేసే ఫిర్యాదులేనా ఇవి. ఆ కంపెనీ గల్ఫ్‌ దేశాలకూ బెల్లం ఎగుమతులు చేస్తోంది. వారికి హలాల్‌ సర్టిఫికెట్‌ అవసరం కనుక తీసుకున్నారు. ప్రతి సంచిమీద దాని నంబరు ముద్రించారు. దాన్ని పట్టుకొని బిజెపి రాద్దాంతం చేస్తోంది. ఈ వివాదం ద్వారా దేవస్ధానానికి నష్టం కలిగించే కుట్రవుందని అయ్యప్పతో సహా అనేక దేవాలయాలను పర్యవేక్షించే తిరువాన్కూర్‌ దేవస్ధానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.


ఇదిలా ఉండగా కేరళ అంతటా పలుదుకాణాల ముందు హలాల్‌ బోర్డులు కొత్తగా వెలిశాయంటూ వాటిని నిషేధించాలని బిజెపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు నవంబరు 25న ప్రదర్శనలు జరుపుతామని ప్రకటించింది. ఇదిసాంఘిక దురాచారమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుధీర్‌ వర్ణించారు.హలాల్‌ ఒక మతాచారమని తాము భావించటం లేదని ఇస్లామిక్‌ పండితులు కూడా సమర్ధిస్తారని తాను అనుకోవటం లేదని, ఉగ్రవాద సంస్ధలు కేరళ సమాజంలో మతపరమైన అజెండాను అమలు జరిపేందుకు పూనుకున్నాయని, మతపరంగా చేస్తే పెద్దలు పూనుకొని సరి చేయాలన్నారు. బిజెపి నేతలు మత అజెండా గురించి మాట్లాడటం దొంగేదొంగ అనటమే. సుధీర్‌కు మద్దతుగా రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ మాట్లాడుతూ హలాల్‌ బోర్డులు అమాయకంగా, అనుకోకుండా పెట్టినవి కాదన్నారు. జనాన్ని చీల్చేందుకు చేస్తున్నారన్నారు. హిందూత్వ బిజెపితో కేరళ కాంగ్రెస్‌(ఎం) అనే క్రైస్తవ పార్టీ నేత పిసి జార్జి కూడా గొంతుకలిపారు.హలాల్‌ ఆహారం మతఛాందసంలో భాగమే అన్నారు. ఆహారం మీద ఉమ్మటం ముస్లింలకు ఒక విధి, మూడుసార్లు ఉమ్ముతారని, శబరిమల ప్రసాదానికి హలాల్‌ బెల్లాన్ని వినియోగించరాదని క్రైస్తవమత టీవీ ఛానల్‌ ఒకదానిలో చెప్పారు.

బెల్లానికి హలాల్‌తో ముడిపెట్టటాన్ని బిజెపి అధికార ప్రతినిధి సందీప్‌ వారియర్‌ ఫేస్‌బుక్‌లో రాస్తూ తప్పుపట్టారు. మతాల వారు ఒకరి మీద ఒకరు ఆర్ధికపరమైన ఆంక్షలతో జీవించలేరని పేర్కొన్నారు. కోజికోడ్‌లోని పారగాన్‌ హౌటల్‌ మీద సామాజిక మాధ్యమంలో చేస్తున్న దాడిని తాను ఖండించానని అయితే దానిని మీడియా పార్టీ వ్యతిరేఖ వైఖరిగా వక్రీకరించిందని, దాంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆదేశం మేరకు పోస్టును వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. నిజానికి సందీప్‌ స్పందన తరువాత బిజెపి ఇరకాటంలో పడి అతని మీద వత్తిడి తెచ్చిందన్నది స్పష్టం. ఇతర మతాల మీద విశ్వాసం ఉన్నవారు కూడా హలాల్‌ హౌటళ్లలో తినేందుకు, పని చేసేందుకు వస్తారని, సేవారంగం దెబ్బతింటే ఎన్నోకుటుంబాలు దారిద్య్రంలోకి కూరుకుపోతాయని, ఇలాంటి అంశాలపై చర్చలో ఉండాల్సింది హేతువు తప్ప ఉద్రేకం కాదన్నారు సందీప్‌.


వివిధ సామాజిక తరగతుల మధ్య లౌకిక వారధిగా ఉన్న ఆహారం మీద సంఘపరివార్‌ దాడిని కేంద్రీకరించిందని సిపిఎం తాత్కాలిక రాష్ట్ర కార్యదర్శి ఏ విజయ రాఘవన్‌ విమర్శించారు. సమాజంలోని మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఈ వివాదాన్ని ముందుకు తెచ్చారని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, కొడియరి బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యతను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రచారం చేసినా మొత్తం మీద కేరళలో ఫలించలేదని బాలకృష్ణన్‌ అన్నారు.హలాల్‌ చర్చ అనవసరమని తెలిసి కూడా ఇక్కడ వివాదాన్ని సృష్టించేందుకు పూనుకున్నారని అన్నారు.


హలాల్‌ ఆహారంపై విష ప్రచారం చేస్తున్న శక్తుల మీద చర్య తీసుకోవాలని రాష్ట్ర రెస్టారెంట్లు, హౌటల్స్‌ సంఘం ముఖ్యమంత్రి విజయన్ను కోరింది. గుజరాత్‌లో సంఘపరివార్‌ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి విభజన తేవటంలో విజయం సాధించిందని, అక్కడ ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు నిర్వహించే వాటిని పాకిస్తాన్‌ హౌటల్స్‌ అని పిలుస్తారని ఎంఏ బేబీ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌లోని శక్తులకు పోటీగా ఇతర మతాలకు చెందిన ఛాందసవాదులు కొత్త డిమాండ్లను ముందుకు తేవచ్చని స్వచ్చమైన శాఖాహారం వంటి బోర్డులకు వ్యతిరేకంగా డిమాండ్లు ముందుకు రావచ్చని అన్నారు.నిజానికి ఇలాంటి బోర్డుల వలన వినియోగదారులు తాము కోరుకుంటున్న ఆహారం, పానీయాలు దొరికేదీ లేనిదీ తెలుసుకుంటారని అన్నారు.ఇలాంటి ఛాందసడిమాండ్లకు ప్రభుత్వం లొంగదని స్పష్టం చేశారు. సంఘపరివార్‌ ముందుకు తెచ్చిన హలాల్‌ డిమాండ్‌ సమాజ-జాతీయ-రాజ్యాంగ వ్యతిరేక వైఖరని, కేరళలో అది కుదరదని బేబీ చెప్పారు.
తెలుగునాట ఇప్పటికీ అనేక ప్రాంతాలలో హౌటళ్లు, మెస్‌లకు బ్రాహ్మణ, ఆర్య-వైశ్య, రెడ్డి, క్షత్రియ, చౌదరి అని కులాలు, విజయవాడ, ఏలూరు, గుంటూరు భోజనం అనీ, హైదరాబాద్‌ బిర్యాని, ఉడిపి, కల్కూర ఇలా అనేక రకాల పేర్లను తగిలించటం తెలిసిందే. రంజాన్‌ మాసంలో అనేక పట్టణాలలో ప్రత్యేక వంటకంగా ముస్లింలు నిర్వహించే హౌటళ్లలో విక్రయించే హలీంను కుల,మతాలతో నిమిత్తం లేకుండా అందరూ లొట్టలు వేసుకుంటూ తినే అంశం తెలిసిందే. ఇక బిర్యాని సంగతి చెప్పనవసరం లేదు.అక్కడ హలాల్‌ క్రతువు నిర్వహిస్తారని తెలిసిందే.