Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


మొరటుగా ఉన్న ఇనుము కొలిమిలో బాగా కాలి ఉన్నపుడే కమ్మరి దాన్ని సాగదీసేందుకు లేదా అనువైన పరికరంగా మార్చేందుకు పూనుకుంటాడు. ఇది చాలా మందికి తెలిసిన అంశం. రైతులు, కార్మికులకు ఇప్పుడు మరింత స్పష్టమైంది. ప్రధాని నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పారు. అందువలన మరోవైపు రైతులు,కార్మికులు మరోపోరాటానికి సిద్దం అవుతున్నారు. మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలను భుజాన వేసుకొని ఆహా ఓహౌ అంటూ భజన చేసిన వాటిని వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించటంతో కంగుతిన్నారు. వారే ఇప్పుడు మరోపల్లవి అందుకున్నారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ తదుపరి సంస్కరణలపై వెనక్కు తగ్గవద్దని నరేంద్రమోడీ మీద వత్తిడి ప్రారంభించారు. నరేంద్రమోడీ ఎవరి పక్షాన ఉండేది రానున్న రోజుల్లో మరింత స్పష్టం కానుంది. ఇక వంది మాగధుల తీరు తెన్నులను చూస్తే ప్రధాని నరేంద్రమోడీ సాగు చట్టాలను వెనక్కు తీసుకొని ప్రతిపక్షాలకు ఒక ఆయుధం లేకుండా చేసి తన చాణక్యాన్ని ప్రదర్శించారట, క్షమాపణలు చెప్పి మనసులను చూరగొన్నారట, పట్టువిడుపులు తెలిసిన వారట. ఉచితంగా చెవుతున్నారు కదా అని బుర్ర తలుపులు మూసి చెవులప్పగించే జనాలున్నపుడు ఏమైనా చెబుతారు. వెంపలి చెట్టుమీద నుంచి ఒక్క గంతుతో ఎగిరి దూకగలిగిన ప్రతిభావంతులని కూడా చెప్పగలరు. జనాల బుర్రలు పని చేయటం లేదని, కొన్ని సరిగా ఉన్నా వాటిని ఉపయోగించరనే ప్రగాఢ విశ్వాసం కలిగిన వాట్సప్‌ విశ్వవిద్యాలయ పండితులు, ఇతరులూ ఇంతకంటే ఏమి చెబుతారు.


రైతులను వీధుల్లోకి రప్పించింది, ఢిల్లీలో ప్రవేశించకుండా రోడ్ల మీద మేకులు కొట్టించి, కాంక్రీటుతో ఆటంకాలు కల్పించింది, వాటినే ఆయుధాలుగా మార్చుకొనేట్లు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చింది నరేంద్రమోడీ గారే కదా ? నిజానికి పట్టువిడుపులుంటే సాగు చట్టాలను ఆర్డినెన్సులుగా తేవటం ఎందుకు, సెలెక్టు కమిటీకి పంపమంటే తిరస్కరించటం ఎందుకు, చర్చలేకుండా ఆమోదం ఎందుకు పొందారు ? నోరా చెంపకు చేటుతేకే అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.రైతులను నిందించాలని తన అనుచరగణాన్ని పురికొల్పినపుడు ఏమైంది వివేకం.తొలుత రైతులు ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాలనే ఏకైక డిమాండ్‌ను తెచ్చినపుడే చాణక్యం ప్రదర్శిస్తే క్షమాపణ చెప్పుకోవాల్సిన దుస్ధితి ఉండేది కాదు, పరువు నిలిచేదికదా ! ఇప్పుడు వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. దీని వెనుకా ఎత్తుగడ ఉంది, మోడీని తక్కువ అంచనా వేయ వద్దని భక్తులు మాట్లాడుతున్నారు. రైతులను తక్కువ అంచనా వేసే కదా ఇంతదాకా వచ్చింది. మరోపిచ్చి పని చేస్తే మరింతగా ఉద్యమిస్తారని ఈ పెద్దలకు తలకు ఎక్కటం లేదు. పండుగాడి దెబ్బ అలా తగిలింది మరి !


అంతం కాదిది ఆరంభం.సంస్కరణల పేరుతో జనాన్ని కార్పొరేట్ల దోపిడీకి అప్పగించే ప్రక్రియను కాంగ్రెస్‌ పాలకులు ప్రారంభిస్తే దాన్ని మరింత వేగంగా నడిపేందుకు నరేంద్రమోడీ పూనుకున్నారు. నీరు మరగటం ప్రారంభమైనపుడే ఆవిరి రూపం మనకు కనిపించదు, వంద డిగ్రీల వేడి తరువాతే తెలుస్తుంది. అది ఇప్పుడు రైతుల ఆందోళన రూపంలో వెల్లడైంది. వారి చారిత్రాత్మక విజయం కొత్త పోరాటాలకు నాంది. ఆ సెగ అప్పుడే ప్రధాని నరేంద్రమోడీకి తగిలినట్లు వార్తలు. రైతుల ఉద్యమాన్ని అపర చాణుక్యులు ఊహించలేదు. భాగస్వాములైన రైతు సంఘాల నేతలను చీల్చేందుకు చేయని పని లేదు. సామ,దాన,భేద,దండోపాయాలన్నింటినీ ఉపయోగించారు. మెెత్తబడిన నేతలు కూడా రైతుల దీక్ష, పట్టుదలను చూసిన తరువాత మోడీకి భజన చేసేందుకు భయపడ్డారు. రైతు ఉద్యమం సాధించిన విజయాల్లో అదొకటి. రానున్న రోజుల్లో సాగే ఐక్య పోరాటాల్లో విభీషణులకు ఒక ముందస్తు హెచ్చరిక. రైతులు కొద్ది నెలలు వేచి చూసి విసుగుపుట్టి వెనక్కు వెళతారని, తరువాత కార్మిక, విద్యుత్‌ తదితర సంస్కరణలను ముందుకు తీసుకుపోవాలని భావించారు.


అనుకున్నదొకటి అయింది ఒకటి. ఐదు రాష్ట్రాల, ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, రైతు ఉద్యమంలో వివిధ సామాజిక తరగతుల మధ్య పెంపొందిన ఐక్యత, అన్నింటికీ మించి వివిధ రంగాలలో మోడీ సర్కార్‌ వైఫల్యాలు, జనంలో తొలుగుతున్న భ్రమలు మహాభారతంలో రారాజును గుర్తుకు తెస్తున్నాయి. భీముడి నుంచి ప్రాణాలు కాపాడుకొనేందుకు ధుర్యోధనుడు చివరకు మడుగులో దాక్కున్నట్లుగా శ్రామిక భీముల నుంచి కాపాడుకొని రాజకీయంగా బతికి బట్టకట్టేందుకు నరేంద్రమోడీ దారులు వెతుకుతున్నారు. దానిలో సాగు చట్టాలు వెనక్కి, క్షమాపణ ఒకటి మాత్రమే. తాజాగా వస్తున్న వార్తలు, అధికారవర్గాల అంతరంగం మేరకు కార్మిక, విద్యుత్‌ సంస్కరణలను కూడా వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు వాటి జోలికి పోవద్దని నిర్ణయించినట్లు చెబుతున్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గాను విదేశీ-స్వదేశీ కంపెనీలు ఏర్పాటు చేసే సంస్దలలో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసేందుకు, యజమానుల చిత్తానికి వారిని అప్పగించేందుకు కేంద్ర కార్మిక చట్టాలను మార్చివేసేందుకు పూనుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఇదిగో ఇప్పుడే అన్నట్లుగా మాట్లాడినప్పటికీ ముందుకు రాలేదు. మరోవైపు వాటిని ప్రతిఘటించేందుకు కార్మిక సంఘాలు కూడా సన్నద్దం అవుతున్నాయి. రైతు ఆందోళనకు కార్మికులు మద్దతు ప్రకటించటంతో రైతులు కూడా తమ డిమాండ్లలో కార్మిక అంశాలను కూడా చేర్చారు. సాగు చట్టాలతో పాటు లేబర్‌ కోడ్‌ల రద్దు కోరారు. ఇప్పటికి చేసింది చాలు మొదటికే మోసం తేవద్దు అని కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి దిశానిర్దేశం చేసే ఆర్‌ఎస్‌ఎస్‌ చెప్పినట్లు చెబుతున్నారు.


సాగు చట్టాలను వెనక్కు తీసుకున్న తీరు కార్మికోద్యమానికి ఎంతో విశ్వాసాన్నిచ్చిందని చెప్పవచ్చు. రైతు-కార్మిక ఐక్యతను ముందుకు తీసుకుపోవాలనే సంకల్పం మరింత గట్టిపడింది.నరేంద్రమోడీ ప్రకటనకు ముందే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో రెండు రోజుల సాధారణ సమ్మె జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సాగు చట్టాలను నిరసిస్తూ గతేడాది నవంబరు 26న ఢిల్లీ చలో పిలుపు ఇచ్చిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకోవటంతో వారు సింఘు,టిక్రి, ఘాజీపూర్‌ వద్ద తిష్టవేసి నిరవధిక ఆందోళన ప్రారంభించిన అంశం తెలిసిందే. కార్మిక సంస్కరణలను రుద్దితే అదే పునరావృతం కావచ్చని భావిస్తున్నారు. సాగు చట్టాల రద్దు రైతులదే కాదు తమకూ విజయమే అని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ వర్ణించారు. రైతులు మోడీ సర్కార్‌ను వెనక్కు కొట్టగా లేనిది కార్మికులకు ఎందుకు కుదరదని హింద్‌ మజ్దూర్‌ సభ నేత నారాయణ సింగ్‌ ప్రశ్నించారు.


ఎక్కడ బడితే అక్కడ, తమకు ఇష్టమైన ధరకు పంటలను అమ్ముకొనే అవకాశాలను రైతులకు కల్పించేందుకే సాగు చట్టాల మార్పు అని చెప్పింది కేంద్రం. అసలు లక్ష్యం కార్పొరేట్లకు రైతాంగాన్ని అప్పగించటం. అదే విధంగా కార్మికులను యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసేందుకు లేబర్‌ కోడ్‌లను రూపొందించారు. ఐఏఎన్‌ఎస్‌-సి ఓటర్‌ సర్వే ప్రకారం ఎన్‌డిఏ-ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు కూడా సాగు చట్టాల రద్దు కార్మిక సంస్కరణలను వ్యతిరేకించేందుకు ప్రేరేపణ కలిగిస్తున్నట్లు 43శాతం మంది, ప్రయివేటీకరణను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని 48శాతం చెప్పారు. ఇరవై ఐదుశాతం మంది కార్మిక చట్టాల గురించి, ప్రయివేటీకరణ గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు వెల్లడించలేదు.భారత్‌లో సంస్కరణలు జరగటం లేదనే సందేశం భారత-విదేశీ పెట్టుబడిదారులకు వెళ్లినట్లేనా అన్న ప్రశ్నకు 36శాతం మంది అవునని, అంతేశాతం కాదని చెప్పగా 29శాతం ఎటూ చెప్పలేదు. దీన్ని బట్టి సంస్కరణల గురించి సాధారణ జనానికి విశ్వాసం లేదని తేలుతోందని సర్వే విశ్లేషణ పేర్కొన్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద సాగు చట్టాల రద్దు ప్రభావం ఉంటుందని 55.1శాతం మంది చెప్పినట్లు ఎఎన్‌ఎస్‌-సిఓటర్‌ సర్వే తెలిపింది. ఎన్‌డిఏ మద్దతుదారుల్లో 53శాతం మంది కూడా ప్రభావం ఉంటుందని చెప్పారు.


కార్మిక చట్టాలు రాజ్యాంగ ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువలన పార్లమెంటు, రాష్ట్రాలు రెండూ చట్టాలను చేయవచ్చు. లేబర్‌ కోడ్‌లను ఆమోదించక ముందు నలభైకి పైగా కేంద్ర, వందకు పైగా రాష్ట్రాల చట్టాలు ఉన్నాయి. రెండవ జాతీయ లేబర్‌ కమిషన్‌ (2002) చేసిన సిఫార్సు ప్రకారం 2019లో 29 కేంద్ర చట్టాలను నాలుగు కోడ్‌లుగా బిల్లులను ప్రతిపాదించింది.వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ-ఆరోగ్యం-పని పరిస్ధితులుగా వర్గీకరించారు. మొదటిదానిని 2019లోనే ఆమోదించారు. మిగిలిన మూడింటిని స్టాండింగ్‌ కమిటీకి నివేదించి కొన్ని సవరణలతో 2020 సెప్టెంబరులో ప్రతిపాదించి, వెంటనే ఆమోదించారు. నాలుగింటినీ ఒకేసారి నోటిఫై చేయవచ్చు. కార్మికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో ఆపని చేయలేదు. వేతన కోడ్‌ను రాష్ట్రాలకు పంపి తరువాత దాని ముసాయిదాను ఖరారు చేయకుండా, అమలు నిలిపివేశారు.


గతంలో ఉన్న అసందిగ్దతలను తొలగిస్తామని చెప్పిన పాలకులు ఆమోదించిన వేతన కోడ్‌, ఇతర వాటి మీద వచ్చిన విమర్శల తీరు చూస్తే అవెలాంటివో అర్ధం చేసుకోవచ్చు. కనీస వేతనాల నిర్ణయానికి ప్రాతిపదికల గురించి, ఎవరు నిర్ణయిస్తారనే స్పష్టత లేదు.ప్రాంతాలు, నైపుణ్యం, పనిలో ఇబ్బందుల స్ధాయి, తదితర అంశాల ప్రాతిపదికన కనీసవేతన నిర్ణయం జరపాలన్నారు. ఈ అంశాలకు కొలబద్దలేమీ ఉండవు కనుక నిర్ణయించే అధికారుల విచక్షణకు వదలివేస్తారు. అది లాబీయింగు,ప్రలోభాల వంటి ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుంది. వేతన తగ్గింపు నిబంధన నిరంకుశమైనది, కార్మికులను సంఘాల్లో చేరకుండా నిరోధించేందుకు ఆయుధంగా మారుతుంది. ఇప్పుడు అత్యధిక కార్మికులు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వారు వేతనాల చెల్లింపులో విఫలమైతే యజమానిని అడిగే హక్కు కార్మికులకు ఎంతో కష్టం అవుతుంది.యజమానులు వేతన చెల్లింపు ఉల్లంఘనకు పాల్పడినపుడు పరిమిత అధికారాలున్న అప్పీలు అధారిటీకి విన్నవించుకోవటం తప్ప కోర్టులకు వెళ్లే హక్కు లేదు. కార్మికులను ఇష్టమొచ్చినపుడు తీసుకోవటం లేనపుడు తొలగించటం సులభం అవుతుంది. అరవై రోజుల సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది, వివాదం విచారణలో ఉన్నపుడు సమ్మె హక్కు ఉండదు.త్రిపక్ష విచారణ పూర్తైన రెండు నెలల తరువాతే సమ్మెకు వెళ్లవచ్చు.మూడు వందల లోపు సిబ్బంది పని చేసే సంస్దలలో కార్మిక హక్కులు నీరుగారతాయి. అనేక సంస్దలను ఫ్యాక్టరీ నిర్వచనం నుంచి తొలగించారు.మహిళలు రాత్రుళ్లు కూడా పని చేసే విధంగా నిబంధనలు మార్చారు. ఇలా మొత్తం మీద చూసినపుడు కార్మికులకు వ్యతిరేకంగానూ, యజమానులకు అనుకూలంగానూ మార్చివేశారు. ఈ సంస్కరణల పట్ల కఠినంగా ఉండాలని వెనక్కు తగ్గవద్దని కార్పొరేట్‌ లాబీ చెబుతున్నది.


” సంస్కరణలను ఆలశ్యం చేస్తే దేశ ఆర్ధిక రంగానికి నిస్సందేహంగా అది ఒక ఎదురుదెబ్బ. వాణిజ్యం, పెట్టుబడులకు భారత మనోహరత్వము తగ్గుతుంది.ఇటీవలి ఉదంతాలు సాగు, కార్మిక సంస్కరణల గురించి ప్రకటించటానికి-అమలు చేసేందుకు ఉన్న తేడాను వెల్లడించాయని” బెంగలూరులోని సొసైటీ జనరల్‌ సంస్ద ఆర్ధికవేత్త కునాల్‌ కుందు చెప్పారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్ల కనుసన్నలలో పనిచేసే పత్రిక. అది రాసిన సంపాదకీయంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.” ఇతర డిమాండ్లను సాధించుకొనేందుకు నిరసన కొనసాగిస్తామని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రకటించింది. దాని డిమాండ్ల కలగూర గంపలో అత్యంత ప్రమాదకరమైనది కనీస మద్దతు ధరలకు చట్టబద్ద హామీ మరియు విద్యుత్‌ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను వెనక్కు తీసుకోవాలన్నది అత్యంత దారుణమైన కోరిక.. .. ఎస్‌కెఎం ఇప్పుడు పూర్తిగా అసహేతుకమైన మార్పులను కోరుతున్నది, అవి భారత్‌ ఆర్ధిక వ్యవస్దను దిగజారేదిగా మారుస్తాయి….. భారత విద్యుత్‌ రంగం విచ్చిన్నమైంది. ఒక సంక్షోభం తరువాత మరొక సంక్షోభంలోకి నెడుతున్నది…. ఉచిత లేదా చౌకగా విద్యుత్‌ను కొనసాగించాలని ఎస్‌కెఎం పట్టుబడుతున్నది…. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం సదుద్ధేశ్యంతోనే చేసింది, ఇప్పుడు వెనక్కు తగ్గింది. అసహేతుకమైన కోరికల విషయమై ప్రభుత్వం ఒక గిరి గీసుకోవాలి. సాగు చట్టాలను ఆమోదించిన పార్లమెంట్‌ సమావేశాల్లోనే మూడు లేబర్‌ కోడ్‌లను కూడా ఆమోదించారు. వాటిని ఇంకా పూర్తిగా అమలు జరపలేదు. ప్రభుత్వం సంస్కరణలపై గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది లేదా దుర్బలమైన ప్రభుత్వంగా మారే అవకాశం ఉంది. సంస్కరణల మీద ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంది, అదే సమయంలో అసహేతుకతను ఎదుర్కోవాల్సి వచ్చినపుడు కఠిన వైఖరిని కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం.” పదాలు కొన్ని అటూ ఇటూ మారినా పెరిగినా తరిగినా మొత్తం మీద స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల వైఖరికి ఈ సంపాదకీయం అద్దం పట్టింది. కనుక తమ జీవితాలను మరింత దుర్భరం చేసుకోవటమా, మెరుగుపరచుకోవటమా, దానికి అనుసరించాల్సిన బాటను తేల్చుకోవాల్సింది ఇక రైతులు, కార్మికులే.